top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 1


'Neti Bandhavyalu Episode 1' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 03/11/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మిత్రుడు, బంధువు... శివరామకృష్ణ వ్రాసిన వుత్తరాన్ని చదువుతున్నాడు హరికృష్ణ.


"2016 ఆగష్టు పదిహేను నాటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరాలు..... ఏడు పదులైనాయి. పాత తరానికి ప్రొద్దు తిరిగింది. క్రొత్త తరం మూడు పువ్వులు.... ఆరు కాయలుగా నవనాగరీకతతో నడిపొద్దు సూర్యునిలా భాసిల్లుతూ వుంది. జగమంతా కంప్యూటర్ యుగం అయిపోయింది.

పోస్టుకార్డ్సు.... ఇన్‍లాండ్ లెటర్స్... తంతి సమాచారాలు మరుగున పడ్డాయి. అందరి చేతిలో సెల్..... ఐ ఫోన్... విద్యావంతుల టేబుల్స్ పై ల్యాప్టాప్స్..... పెన్‍తో కాగితంపై వ్రాసే విధానం తరిగిపోయింది. మనుషుల మనస్సులో ’ఎలాగైనా’ డబ్బు సంపాదించి దర్జాగా కారు, బంగళాతో.... హాయిగా బ్రతకాలనే తీవ్ర ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు మూలం, స్వార్థం.... ఆ స్వార్థం పెరిగేదానికి కారణం.... మనిషిలో మనుగడకున్న ప్రాధాన్యత.... విచక్షణ... విజ్ఞత.... యుక్తాయుక్త విమర్శనారహిత లక్ష్యసాధనాసంకల్పం. తాను పైకెదిగేదానికి ఎదుటివారి భుజాలను నిచ్చెనలా వాడుకోవడం.... పై అంతస్థుకు చేరగానే నిచ్చెనను కాలితో తన్నడం.... కొందరు వారి అభివృద్ధికి పాటించే సూత్రం.


తాత తండ్రుల చరిత్ర.... సంస్కృతి.... సాంప్రదాయం... హైందవతకు సంబంధించిన నీతి... నిజాయితీ... ప్రేమ... సౌభాంత్రం... సహనం.... ఈ కొత్త పధానికి క్రమంగా దూరం అయిపోతున్నాయి. యీ విధానంలో విచారకరమైన మరో విషయం.... కొందరు తల్లితండ్రులు.... తమ సంతతి ఎన్నుకొన్న ఆ జీవిత విధానాన్ని సమర్థించడం. అది తప్పు అని పిన్నలకు చెప్పి.... వారి లక్ష్యాన్ని... మనస్తత్వాన్ని మార్చలేకపోవడం.... పిన్నలు అహంకారంతో చేసే నేరాలను తమ పలుకుబడి.... చేతిలో వున్న ధనంతో... వారు చేసిన నేరానికి శిక్ష అనుభవించి పరివర్తన పొందేదానికి ఆస్కారం లేకుండా చేయడం, బిడ్డలను సక్రమమైన మార్గంలో నడిపించి వారి భవిష్యత్తును సాటివారికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దలేకపోవడం.


ధన, పదవీ బలాలతో... అన్నింటినీ సాధించగలం అనే పెద్దల మనస్తత్వం.... పిన్నలకు తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించిన కారణంగా... సాటి మనుషుల మీద పెద్దల మీద.... యువతకు గౌరవం.... అభిమానం.... ఆదరణ అనే మంచి భావాలు సమసిపోతూ వున్నాయి.


వారికి భిన్నంగా వర్తించేవారు.... వారి దృష్టిలో ఎలా బ్రతకాలో... అనే విషయం తెలియని అప్రయోజకులు. ఏ కొందరో తప్ప.... చాలామంది పై విధానంతోనే మనుగడ సాగిస్తున్నారు. యువత హృదయాల్లో వున్న వారి స్వార్థం కారణంగా.... తమ తల్లిదండ్రులు కూడా వారికి కానివారి జాబితాలో చేర్చబడుతున్నారు. పెద్దల ఆ స్థితికి కారణం.... కొడుకులు ఏరికోరి అర్థాంగిగా స్వీకరించిన నవనాగరీకతా సౌందర్యరాశులు... చదువరులు. ఓ నా నేస్తమా!.... ప్రియ బంధువా!.... హరీ!... నీ వుత్తరాన్ని చదివాను. మనస్సుకు ఎంతో బాధ కలిగింది. నీవు అనుకొన్నట్లున్నావు నేను పొద్దు తిరిగిన జీవితాన్ని పరమానందంగా యీ విశాఖ మహానగరంలో అనుభవిస్తున్నానని... మన ఇరువురి శేషజీవిత పయనం ఒకే రీతిగా సాగుతూ వుంది. నిన్ను చూడాలని... నా ప్రస్తుత సమస్యలను... మన చిన్ననాటి జ్ఞాపకాలను నీతో ముచ్చటించాలనేది నా ఎదలోని కోరిక.... వస్తున్నా నీ వద్దకు... త్వరలో....’

ఇట్లు

నీ.... శివ


వుత్తరాన్ని చదివిన హరికృష్ణ నిట్టుర్చాడు.

భార్య లావణ్య వరండాలోకి వచ్చింది. హరికృష్ణ చేతిలో వున్న వుత్తరాన్ని చూచింది. ఆమె చూపులోని భావాన్ని గ్రహించిన హరికృష్ణ... "మీ అన్నయ్య శివరామకృష్ణ వ్రాశాడు లావణ్య!..." అన్నాడు.


"అలాగా!.... అంతా క్షేమమే కదా!...."


"వుత్తరాన్ని చదువు.... నీకే తెలుస్తుంది... వాడు ఊర్మిళ అక్కడ ఆనందంగా లేనట్లు వున్నారు... మనలాగే!...." మెల్లగా చెప్పి వుత్తరాన్ని లావణ్యకు చూపించాడు.


లావణ్య వుత్తరాన్ని అందుకొంది. రెండు నిమిషాల్లో చదివింది... భర్త ముఖంలోకి చూచింది.

"విషయం అర్థం అయిందిగా!..." విరక్తితో కూడిన చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.


"అయింది!..." శూన్యంలోకి చూస్తూ చెప్పింది...


కొన్ని క్షణాల తర్వాత....

"అన్నయ్యకు అక్కడ ప్రశాంతంగా లేకుండా వున్నట్లు వుంది!..." అంది మెల్లగా లావణ్య.


"ఎలా వుండగలడు?.... కొడుకులు ఒకరికి ఇద్దరుండీ కూడా... చంద్ర అమెరికాలో... రాఘవ ఆస్ట్రేలియాలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారే కాని... వాణ్ణి నా చెల్లెలు ఊర్మిళను పట్టించుకోరాయె!.... ఇక ఆడపిల్లలు వైశాలి... శారద. పెద్దామె ముంబాయిలో.... చిన్నామె చెన్నైలో. వాళ్ళ సంసారాలు వారివి... వారూ వీరిని పట్టించుకోలేరు!.... చిన్నవాడు విష్టు జన్మతః అంధుడు... పేరుకు ఐదుగురు బిడ్డలు వున్నారని పేరేగాని... యీ వయస్సులో వారి స్థితిగతులు పట్టించుకునేవారు... లేరే అని వాడి బాధ" వివరంగా చెప్పాడు హరికృష్ణ.


"మనదీ అలాంటి బ్రతుకేగా!... పెద్దవాడు దివాకర్ అమెరికాలో... మధ్యలోని వాణి తన ఇష్టానుసారంగా ఢిల్లీలో... ఇకపోతే చిన్నవాడు ఈశ్వర్... శార్వరి... ఉద్యోగం... చదువురీత్యా హైదరాబాద్‍లో.... మన బ్రతుకులూ అన్నవాళ్ళలాగా ఒంటరి బ్రతుకులేగా!.... ఒక్కోసారి నాకు చాలా బాధగా అనిపిస్తుందండీ... వాళ్ళను కనిపెంచి పెద్దచేసి... మనకున్నదంతా వూడ్చి వారికి పెట్టి చదివించింది ఇందుకేనా!.... ఈశ్వర్‍కు తప్ప... శార్వరికి కూడా... మనలను వదలి పై చదువులకు అమెరికాకు వెళ్ళాలనే ఆశ... ఏం కాలమో!.... ఏం పిల్లలో.... తన మన అనే భావన... ప్రేమాభిమానాలు యీ కాలం పిల్లల్లో క్రమంగా... నశించాయనే చెప్పాలి..." అంటూ వీధి వాకిటి వైపు చూచిన లావణ్య....


"అదిగో మీ బావగారు!.... మంతనాల మాధవయ్యగారు వేంచేస్తున్నారు. ఊరకరారు మహానుభావులు. తస్మాత్ జాగ్రత్త...:" లోనికి వెళ్ళిపోయింది లావణ్య.


మాధవయ్యగారు హరికృష్ణగారి మేనత్త కుమారుడు. వారు... మ్యారేజ్ బ్రోకర్... పురోహితుడు... మంచి మాటకారి.... ఏ వాలున తిరగలిని త్రిప్పినా పిండి తనవైపే పడాలనే లక్ష్యవాది. అవసరానికి అబద్ధాలు చెప్పడం అంటే వారికి మంచినీళ్ళను త్రాగడంతో సమానం....

"ఏరా!... హరీ.... బాగున్నారా అంతా!..."


"ఆఁ.....ఆఁ.... రా బావా.... రా... కూర్చో!..."


మాధవయ్యగారు హరికృష్ణ ముందరి కుర్చీలో కూర్చున్నాడు.

"ఏమిటి బావా!.... విశేషాలు!...." చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.


"అదృష్టం నీ వాకిటిని వెతుక్కుంటూ వస్తూ వుందిరా!..." వికారంగా నవ్వాడు మాధవయ్య.


"నీ మాట నాకు అర్థం కాలేదు బావా!..."


"వివరంగా చెబుతాను విను...."


దీక్షగా హరికృష్ణ మాధవయ్య ముఖంలోకి చూడసాగాడు ఏం చెబుతాడో అని.

"మన ప్రజాపతి!...."


"ఏమయింది వాడికి!..." వ్యంగ్యంగా అడిగాడు హరికృష్ణ


"వాడికేం కాలేదురా!... వాడు మహారాజుయె!..." నవ్వాడు మాధవయ్య.


"నన్ను నీతో మాట్లాడమని పంపాడు..."


"ఏ విషయంలో!..."


"తన కొడుకు సీతాపతి... వివాహ విషయంలో!...."


"వాడి కొడుకు వివాహాన్ని గురించి నీవు నాతో ఏం మాట్లాడాలి!..." ముఖం చిట్లించి మాధవయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.


"నేను చెప్పబోయే విషయాన్ని అలా వుంచు. ముందు నీవు గతాన్ని మరచిపోవాలి..."

"బావా!... మాధవయ్యా!... డొంక తిరుగుడు వద్దు. గతాన్ని నేను అంత సులభంగా మరువలేను. ఆ ప్రసక్తి ఇప్పుడు అనవసరం. నీవు చెప్పదలచుకొన్నదేమిటో చెప్పు."


హరికృష్ణలోని ఆవేశాన్ని చూచి మాధవయ్య జంకాడు.

"ఒరే హరీ!... నేనెవరు?.... నీ శ్రేయోభిలాషినే కదా!..."


"అయితే..."


"నేను ఏమి చెప్పినా నీ మంచికే చెబుతాను..."


"ఏమిటా మంచి!..."


"మాటకు మాట ఎలాంటి గ్యాప్ లేకుండా నాపై విసిరితే... నేను నీ గురించి ఏమనుకోవాలిరా!...."


"ఏమైనా అనుకో. అది నీ ఇష్టం... నాకు అభ్యంతరం లేదు..." వ్యంగ్యంగా నవ్వాడు హరికృష్ణ.


"లావణ్యను పిలువు!..."


"మన మధ్యన ఇప్పుడు లావణ్య ఎందుకు?..."


"బిడ్డల బాగోగుల విషయంలో నీకెంత బాధ్యత వుందో... ఆమెకూ అంతే బాధ్యత వుంది కదరా!..."


"నీవు మాట్లాడదలచుకొన్నది ఏ బిడ్డ విషయంలో... ఈశ్వరా!.... లేక శార్వరియా!..."


"శార్వరి విషయాన్ని గురించేరా!..."


"నా బిడ్డకు ఇప్పుడప్పుడే పెండ్లి చేయము మాధవయ్య అన్నయ్యా!..." సింహద్వారం ప్రక్కన నిలబడి లావణ్య చెప్పిన మాటలను విని... మాధవయ్య ఉలిక్కిపడి ఆశ్చర్యంతో ఆమె వైపు చూచాడు.


"ఆ ప్రజాపతికి చెప్పండి!.... తాను మాకు చేసిన ద్రోహాన్ని వాడు... వాడు మరిచాడేమో... మేము మరువలేదు.... మేము మరువలేదు... సంబంధాలను కలుపుకోవాలనే గొప్ప మనస్సు వాడికి వుండవచ్చు... కానీ మాకు అంతటి గొప్ప మనస్సు లేదు... ఇక మీరు... మా పిల్లలకు సంబంధాలు చూచే ప్రయత్నం చేయకండి. ఇంతకు ముందు మీరు చేసింది చాలు..." ఆవేశంగా చెప్పి లావణ్య లోనికి వెళ్ళిపోయింది.


హరికృష్ణ పెదవులపై చిరునవ్వు... నేను చెప్పదలచుకొన్న మాటలను నిర్మొహమాటంగా చెప్పి... ’ఇక నీవు బయలుదేరు’ అనే సంకేతాన్ని మాధవయ్యకి ఇచ్చి వెళ్ళిపోయింది లావణ్య అని అనుకొన్నాడు హరికృష్ణ.


మాధవయ్య... తల దించుకొని కొన్ని క్షణాలు మౌనంగా వుండి... మెల్లగా తల ఎత్తాడు.

’లావణ్య!... ఎవరి చెల్లెలు!... ఆ ప్రజాపతి చెల్లెలేగా!.... రక్తమహిమ ఎక్కడికి పోతుంది. అయినవాడినని కూడా లెక్కచేయకుండా.. ఇదిలించి వెళ్ళిపోయింది. ఇక ఈ హరికృష్ణ మాత్రం... నా మాటలు వింటాడా... అంగీకరిస్తాడా!... ఇది అయ్యే పనికాదు. మన మర్యాదను మనం కాపాడుకోవాలి...’ అనుకొన్నాడు మాధవయ్య.


"ఆఁ... హరీ!... సరేరా!..." అని నిట్టూర్చి "ఇకనే బయలుదేరుతా!..."


"మంచిది బావా!..."


కుర్చీ నుంచి లేచాడు మాధవయ్య... "వెళుతున్నానురా!..."


"ఆఁ.... ఆఁ...." తల ఆడించాడు హరికృష్ణ.


తనలో తాను ఏదో మాట్లాడుకొంటూ మాధవయ్య వీధి గేటు వైపుకు నడిచాడు.


లావణ్య.... ప్రజాపతి చెల్లెలు... ఆమె ఆ ఇంటి కోడలై ఇరవై ఎనిమిది సంవత్సరాలు. గడిచిన పదేళ్ళ క్రిందట మొదట మామగారు నరసింహం... సంవత్సరం లోపలే అత్తగారు మహాలక్ష్మి గతించారు. ఎంతో అన్యోన్యంగా వుండే దంపతులు... వారిలో ఏ ఒక్కరు గతించినా... మరొకరు ఎక్కువ కాలం జీవించలేరు. ఆస్తి వుండవచ్చు. మంచి సంతతి వుండవచ్చు... ’నా’ అని చెప్పుకొనే అధికారం స్త్రీకి (భార్యకు) తన పురుషుడి పైన... పురుషుడికి తన ఇల్లాలిపైన వారి జీవితాంతం వుంటుంది. ఒక వ్యక్తి నేలరాలితే.... ఎవరికీ చెప్పుకోలేని వేదనతో... ఆ మరోవ్యక్తి కూడా త్వరలో నేలరాలడం తథ్యం. అదే జరిగింది... లావణ్య అత్తమామల విషయంలో.....


* * * *

ఆ రోజు ఆదివారం.... గతరాత్రి పదకొండు గంటలకు హరికృష్ణ చిన్నకొడుకు ఈశ్వర్... లాయర్‍గా పనిచేస్తున్నాడు. చివరి సంతతి శార్వరి. బి.ఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు సెలవలైనందున వారిరువురూ సొంత వూరికి హైదరాబాద్ నుంచి వచ్చారు.


కాలకృత్యాలు ముగించుకొని అన్నాచెల్లెళ్ళు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న తల్లిదండ్రులను సమీపించారు.


"అమ్మా శార్వరీ... ఈశ్వర్ కూర్చోండి!..." అన్నాడు హరికృష్ణ.


"అమ్మా కాఫీ!..." అడిగింది శార్వరి.


లావణ్య క్షణంసేపు భర్త ముఖంలోకి చూచింది. ఆ చూపును గమనించిన ఈశ్వర్....


"అమ్మా!... నీవు కూర్చో... నేను వెళ్ళి నాకు, శకటానికి కాఫీ తెస్తాను..."


"నాన్నా చూడు... వీడు నన్ను శకటం... శకటం... అని వెటకారంగా పిలుస్తాడు."


"నాన్నా మీరే చెప్పండి!.... శార్వరీ!.... అని పిలిచే దానికంటే శకటం... అని పిలవడం తేలిక కదూ!..." నవ్వుతూ అడిగాడు ఈశ్వర్.


"నాన్నా!... ఈశ్వర్... ఆ పేరు మా నానమ్మ పేరు... నాకు ఎంతో ఇష్టమైన పేరు... అలా హేళనగా పిలవకురా!..."


"సరే నాన్నా!. మీ ముందు పిలవను!..." నవ్వుకుంటూ వంటింటి వైపుకు నడిచాడు ఈశ్వర్.


"అంటే!...." గద్దించినట్లు అడిగింది లావణ్య చిరుకోపంతో కూతురివైపు తిరిగి....


"ఆడపిల్లవు నీవు... కాఫీ తెచ్చి వాడికి యివ్వవలసిన దానవు. మహారాణిలా తండ్రిప్రక్కన కూర్చున్నావు. వాడేమో నీకు కాఫీ తెచ్చేదానికి వెళ్ళాడు... వాడు ఎంత మంచివాడో నీకు అర్థం కాలా!..." కొడుకు పక్షాన తల్లి లావణ్య వాదన.


"నాన్నా!.... నేను చాలాకాలంగా గమనిస్తూనే వున్నాను..."


"ఏమిటమ్మాఅది!..."


"ఈ అమ్మ!.... నా అమ్మకు.... నీమీద కంటే... వాడిమీదనే ప్రేమ... అభిమానం జాస్తి!... అవును కదా జననీ!..." వ్యంగ్యంగా అడిగింది శార్వరి.


"అలాంటిదేమీ లేదులే అమ్మా!...." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.


"అవునే!... వాడంటే నాకు ఇష్టమేనే!... వాడు నీలా పెంకిఘటం కాదు. సౌమ్యుడు..."


"నాన్నా!. విన్నావా!... నా మాతృమూర్తి మనస్సులోని మాట!...." తల ఆడిస్తూ తల్లి ముఖంలోకి చురచుర చూస్తూ చెప్పింది శార్వరి.


"ఆ పోలిక ఎవరిదంటావ్!..." చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.


"నాదే!..." ధీమాగా చెప్పింది లావణ్య.


"చిన్న మహారాణిగారూ!... ఇదిగో కాఫీ!... సేవించండి..." నవ్వుతూ కాఫీ కప్పును ఈశ్వర్ శార్వరికి అందించాడు.


"థ్యాంక్యూ రా!... సోదరా!..." నవ్వుతూ చెప్పింది శార్వరి.


"అమ్మా!... విన్నావా సోదరి మాట... నామీద ఎంత అభిమానమో!..." ఓరకంట చెల్లెలి ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.


"కాఫీ తెచ్చి ఇచ్చావుగా!..." నవ్వింది లావణ్య.


హరికృష్ణ... లావణ్య కూతురు కొడుకును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు.


కాఫీ త్రాగుతూ ఈశ్వర్ వీధి వాకిటివైపు చూచాడు. వాకిట ఆగిన కారు నుండి ప్రజాపతి కూతురు దీప్తి గేటు తెరుచుకొని గృహ ప్రాంగణంలోకి ప్రవేశించింది.


దీప్తిని చూచిన ఈశ్వర్...

"అమ్మా!... నీ మేనకోడలు దీప్తి వస్తుంది!..."


"ఏమిటీ!..." లేచి అడిగి ఆశ్చర్యంతో సింహద్వారం వైపు చూచింది.


జీన్స్ ప్యాంట్.... టీషర్టు.... విరబోసుకొన్న పొడుగాటి శిరోజాలు... హైహీల్స్... పెదవులకు దొండపండు రంగు లిప్స్ టిక్.... మోడ్రన్ లక్షణాలు... నూటికి నూరుపాళ్ళతో దీప్తి వరండాలోకి ప్రవేశించింది.


ఈశ్వర్ తల్లి ఖాళీ చేసిన కుర్చీలో కుర్చున్నాడు. లావణ్య సింహద్వారాన్ని సమీపించింది. ఆమెను చూచిన దీప్తి "హాయ్!... అత్తయ్యా!... ఎలా వున్నావ్?..." చిరునవ్వుతో అడిగింది.


ఆమె వేషాన్ని చూచి... షాక్ తిన్న లావణ్య... ఆమె మాటలు వినగానే... వాస్తవానికి వచ్చి మరోసారి దీప్తిని క్రింది నుంచి పైదాకా పరీక్షగా చూచింది.


డ్రైవర్ కాశీ... బత్తాయిల బుట్టను తెచ్చి అరుగుమీద వుంచి.. వినయంగా లావణ్యకు నమస్కరించాడు.


"అత్తయ్యా!.... నన్ను గుర్తుపట్టలేదా! నేను మీ అన్నయ్య ప్రజాపతిగారి కుమార్తెను. దీప్తిని... ఐదేళ్ళ తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఈ దీప్తి... డాక్టర్ దీప్తి!" కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది చిరునవ్వుతో.


దీప్తి మాటలను విన్న శార్వరి తల్లిని సమీపించింది.


"నాన్నా!.... విన్నావా దీప్తి మాటలు!..." ఆమె మాటలు నచ్చని ఈశ్వర్ కూర్చునే తండ్రి వంక చూచి చెప్పాడు.


హరికృష్ణ చిరునవ్వు నవ్వాడు "అంతా తండ్రి పోలిక!..." అన్నాడు.


"హాయ్!... శారు!... ఎంతగా ఎదిగిపోయావే!" ఆశ్చర్యంతో నవ్వింది దీప్తి శార్వరిని చూస్తూ.

"లోపలికి రా దీప్తి!..." సాదరంగా ఆహ్వానించింది శార్వరి.


"అత్తయ్యా!.... నన్ను చూచి షాక్ తిన్నట్లున్నావు!..." నవ్వింది దీప్తి.


"షాక్ తిన్నట్లు కాదే!... షాక్ తగిలినట్లు!...." వ్యంగ్యంగా అంది లావణ్య.


క్షణం తర్వాత "రా!..." అని చెప్పి భర్త కూర్చుని వున్న సోఫాను సమీపించి... ఎదుటి సోఫాలో కుర్చుంది. శార్వరి... దీప్తిలు హరికృష్ణ సోఫాను... లావణ్య... ఈశ్వర్ కూర్చొని వున్న సోఫాను సమీపించారు.


హరికృష్ణకు ఇరువైపులా శార్వరి... దీప్తి కూర్చున్నారు.

"ఏమ్మా దీప్తి!... ఎప్పుడొచ్చావు!" ప్రీతిగా అడిగాడు హరికృష్ణ.


హరికృష్ణ నిండుకుండ... అతను ఎప్పుడూ త్వరపడడు... ఎంతో జీవితాన్ని చూచి... కష్ణసుఖాలను అనుభవించి, సహనం, శాంతిని ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని జీర్ణించుకొన్న గొప్ప వ్యక్తి.


"హాయ్!.... అంకుల్... బాగున్నారా!.... నేను నిన్ననే వచ్చాను. హాయ్! ఈశ్వర్!... హవ్ ఆర్ యు!...." నవ్వుతూ పలకరించింది ఈశ్వర్‍ను తదేకంగా చూస్తూ దీప్తి.


"మిమ్ముల్నందర్నీ చూడాలనిపించింది వచ్చాను.... ఆ... మామయ్యా! మీకు ఆరెంజ్ అంటే ఇష్టం అని నాన్న ఆ పండ్లను పంపారు" పరుగున వెళ్ళి వరండాలో వున్న పండ్ల బుట్టను తెచ్చి హరికృష్ణ ముందు ఉంచింది.


"చాలా ఫ్రెష్‍గా ఉన్నాయి తినండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.


"ఐదేళ్ళు అమెరికాలో వున్నా, నీ మాటల ధోరణిలో ఏ మార్పు లేదు దీప్తి!...." అంది శార్వరి.

"అక్కడికి మన అవసరం కోసం వెళ్ళాం. అంత మాత్రాన మనం అమెరికన్స్ గా మారిపోతామా!.... నా దేశం ఎంతో పవిత్ర భారతదేశం... నేను ఆంధ్రుల ఆడపడుచును. మాట తీరు మారవచ్చు... కానీ మనం ఎవరమన్నది ఎన్నటికీ మరువరాదు... కదా మామయ్యా!..." అంది దీప్తి.


"అవునమ్మా!.... నీవు చెప్పింది నిజం..."


"అత్తయ్యా!.... ఈశ్వర్!... ఎం అలా మూగవాళ్ళలా కూర్చొని వున్నారు... నాతో సరదాగా మాట్లాడండి!..." ఆ ఇరువురినీ చూస్తూ చెప్పింది దీప్తి.


"మా ఇంట్లోనూ మూడు ఆరెంజ్ చెట్లు వున్నాయి. ఆ చెట్లకు ప్రస్తుతంలో కాయలు ఉన్నాయి. త్వరలో అవి పండ్లుగా మారుతాయి. పాపం... మీ నాన్న ఆ విషయాన్ని మరిచినట్లున్నాడు!...." వ్యంగ్యంగా నవ్వింది లావణ్య.


"లావణ్యా!" ’తప్పు’ అన్నట్లు భార్య ముఖంలోకి చూచి తలాడించాడు హరికృష్ణ.


"ప్రస్తుతం అవి కాయలేగా!.... ఇవి పండ్లు తినేదానికి బాగుంటాయి కదా మామయ్యా!..." లావణ్యను ఓరకంట చూస్తూ చెప్పింది దీప్తి.


"అవునమ్మా!..."


"ఈశ్వర్!.... ఏదైనా మాట్లాడు!..." అంది దీప్తి, ఈశ్వర్‍ను చూస్తూ...


"ఏం విషయాన్ని గురించి మాట్లాడమంటావ్?..."


"నీ విషయాన్ని గురించి... నా విషయాన్ని గురించి... మన అందరి విషయాలను గురించి!..." ప్రీతిగా అతని కళ్ళల్లో చూస్తూ చెప్పింది దీప్తి.


"నా విషయం... నేను ఎం.బి.బి.యల్ ముగించి ప్రస్తుతంలో హైదరాబాద్‍లో... హైకోర్టు సీనియర్ లాయర్ బలరామశర్మ గారి వద్ద పని చేస్తున్నాను. నీ విషయం... అమెరికాలో ఎం.బి.బియస్ పూర్తి చేశావు. స్వదేశానికి తిరిగి వచ్చావు.... ఇక... మనందరికీ సంబంధించిన విషయం... ప్రస్తుతంలో... మీ యింటివారు మా ఇంటికి రావడం కాని... ఈ ఇంటివారు మీ ఇంటికి పోవడం కాని లేదు... దానికి కారణం మీ నాన్న!... వివరాలు కావాలంటే... వెళ్ళి మీ నాన్ననే అడుగు...." లేచి వ్యంగ్యపు చిరునవ్వు నవ్వి... వేగంగా ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు.


అతని మాటలకు దీప్తి ఆశ్చర్యపోయింది. అంతవరకూ ఆమె ముఖంలో వున్న ఆనందం స్థానంలో విచారం చోటు చేసుకొంది. తలదించుకొంది. కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయింది. లావణ్య లేచి వంటింటి వైపుకు నడిచింది.

నిట్టూర్చి దీప్తి లేచి నిలబడింది.


"మీ మధ్యన ఏం గొడవలు జరిగాయో... నాకు తెలీదు మామయ్యా!... మీ యింటికి వెళతానని నాన్నకు ఉదయాన చెప్పాను. ’వెళ్ళిరా’ అన్నారు. ఎలాంటి అభ్యంతరాన్ని చెప్పలేదు. చాలారోజులు అయింది కదా, మిమ్మల్నందర్నీ చూచి సరదాగా మాట్లాడాలని వచ్చాను. కానీ అత్తయ్య మాటలు... ఈశ్వర్ మాటలు నా ధోరణికి వేరుగా వున్నాయి. ఇక నేను ఇంటికి వెళతాను మామయ్యా!... ఈశ్వర్ అన్నట్లు... మన రెండు కుటుంబాల మధ్యన రాకపోకలు లేకుండా చేసిన ఆ కారణం ఏమిటో నాన్నను అడిగి తెలుసుకొంటాను. తప్పు ఎవరిదో, ఒప్పు ఎవరిదో నా స్వనిర్ణయంతో తేల్చుకొంటాను. వస్తాను మామయ్యా!...." సోఫా నుంచి లేచింది దీప్తి.


శార్వరి దీప్తిని సమీపించింది.

"అన్నయ్య మాటలకు బాధపడుతున్నావా!...."


"బాధ కాదే.... అయోమయంగా వుంది. నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి..."


"అమ్మా దీప్తి!..."


" ఏం మామయ్యా!..."


"వాడిని కాని, అమ్మను కానీ... నీవు ఏమీ అడగవద్దు"


ఆశ్చర్యంతో చూచింది హరికృష్ణ ముఖంలోకి దీప్తి....

"అంటే!...."


"నీవు చిన్నపిల్లవు.... ఐదేళ్ళ తర్వాత నిన్ననేగా నీవు వచ్చింది. ప్రయోజకురాలివై నీవు తిరిగి వచ్చినందుకు వాడు ఇప్పుడు ఎంతో ఆనందంగా వుంటాడమ్మా!... అ విషయాన్ని గురించి అడిగి... వాడికి ప్రస్తుతంలో వున్న ఆనందాన్ని వాడి నుంచి దూరం చేయకమ్మా!... ఇకపై ఇక్కడే వుంటావుగా!... నిలకడ మీద నిజాలు... నీకు తెలుస్తాయి. నా మాటను పాటించు..." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.


హరికృష్ణ తత్త్వం... దీప్తికి బాగా తెలుసు. తన చిన్న వయస్సులో సెకండరీ చదువును చదివే రోజుల్లో దీప్తి... స్కూలు హరికృష్ణ ఇంటి ప్రక్కనే అయినందున ఎక్కువ సమయం వారి ఇంట్లోనే వుండేది. హరికృష్ణకు దీప్తి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. దీప్తికి హరికృష్ణ దగ్గర ఎంతో చనువు.

"సరే మామయ్యా!... నేను మీ మాటను పాటిస్తాను" ఆ గతాన్ని తలచుకొని... కొన్ని నిముషాల తర్వాత దీప్తి మెల్లగా చెప్పింది.


లావణ్య హాల్లోకి వచ్చింది. ఆమె చేతిలో మూతతో కూడిన ఓ స్టీల్ డబ్బా వుంది.

దీప్తి లావణ్యను చూచి... "వెళ్ళొస్తానత్తయ్యా!" అంది.


"ఆగు..." దీప్తిని సమీపించింది లావణ్య.


"ఎం తినకుండా, త్రాగకుండా వెళ్ళిపోతానంటున్నావ్!... అలా చేయమని మీ నాన్న చెప్పాడా!..."


"లేదత్తయ్యా!..."


"లావణ్యా!... దీప్తి... చిన్నపిల్ల” ఇక ఆపు అని చేతిని పైకెత్తి సౌంజ్ఞ చేశాడు హరికృష్ణ.


"నాతోరా!..."


"వెళ్ళమ్మా దీప్తీ!....." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.


ముందు లావణ్య నడువగా వెనకాలే దీప్తి... శార్వరి నడిచి... డైనింగ్ రూంలో ప్రవేశించారు.

"కుర్చీలో కూర్చో!..." అంది లావణ్య.


దీప్తి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది.

శార్వరి తల్లిని సమీపించి... "అమ్మా! అన్నయ్య అన్న మాటలకు దీప్తి భయపడిపోయిందమ్మా!..." ఆందోళనగా మెల్లగా చెప్పింది.


"ఆఁ.... దానికి భయమా!... అది ఎవరి కూతురు.... వీరమనేని ప్రజాపతి కూతురు... నీలాంటి నాలాంటి వాళ్ళకి వందమందికి భయాన్ని కలిగిస్తుంది తన చూపుతోనే... దానికంటే ఐదేళ్ళు చిన్నదానివి. దాని సంగతి నీకేం తెలుసు!... ఆ గారెల ప్లేట్లు చేతికి తీసుకో... ఒకటి దానికి... ఒకటి నీకు... తినండి."

కుకింక్ ప్లాట్‍ఫామ్ మీద వున్న ప్లేట్లు చేతికి తీసుకొని శార్వరి డైనింగ్ టేబుల్‍ను సమీపించి.... ఒకదాన్ని దీప్తి ముందు వుంచి ఆమె ప్రక్కనే కూర్చొంది శార్వరి. దీప్తి ముఖంలోకి చూచి... "తిను" అంది.


దీప్తి వడను తుంచి నోట్లో పెట్టుకొంది.


పాలు కాస్తూ... లావణ్య...

"దీప్తి!... నీకు మినప వడలంటే ఎంతో ఇష్టం కదా!... పెట్టిన నాలుగింటినీ తినాలి!..." అంది.


"అలాగే అత్తయ్యా!..." అంది దీప్తి.


"గారె బాగుందా!..." అడిగింది శార్వరి.


"చాలా బాగున్నాయి..."


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


151 views0 comments

Kommentare


bottom of page