top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 7


'Manushulu' Marali Episode 7' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 05/12/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.


సుప్రజ ఆడపడుచు సరళ, భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్, తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ మొండితనం గురించి చెబుతాడు అతని బావ.. తన అక్క సరళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్.


నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.


సుప్రజ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు. వెళ్ళినప్పటినుండి డబ్బులు చాలడం లేదని మాధవి భర్త శేఖర్ ని సహాయం అడుగుతూ ఉంటాడు.


కొద్ది రోజులకే మాధవి విలువ తెలిసివచ్చింది ఆమె అత్తగారు ప్రసూనాంబకి.

జరుగుతున్న విషయాల గురించి కొడుకు రమేష్ తో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రసాదరావు.


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 7 చదవండి..


ఇవి రహస్యంగా విన్న మాటలు కావురా. నీ మాటలు నాకూ మీ అమ్మకూ కూడా వినపడ్డాయి. కొనుక్కోండి, ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ శైలూ కి ఒక ఏభై వేల రూపాయలు సర్దుబాటు చేయమంటే లేవన్నావు చూడు, ఆ మాటకి బాధ వేసింది. అదేమీ ఉరికే అడగలేదు నిన్ను. నీకు వెంటనే పంపిస్తానని మరీ మరీ నీకు చెప్పమంది. నీవు సంవత్సరం క్రితం ఫ్లాట్ కొనుక్కుంటున్నానని దానితో చెప్పినపుడు అది నీవు అడక్కుండానే రెండు లక్షలు పంపిందన్న విషయాన్ని మరిచిపోయావా?”


“నేను శైలూ కి ఆ డబ్బు తరువాత ఇచ్చేయలేదా? నాకేమైనా బహుమతిగా ఇచ్చిందా ఏమిటి?”


“ఓరి ఇడియట్, ఆడపిల్ల నుండి నీవు ఆశించావేమోగానీ అది ఎప్పుడూ నీ నుండి ఏమీ ఆశించలేదు. పైపెచ్చు అది దుబాయ్ నుండి వస్తూ నీకూ నీ భార్యకూ ఎన్నో విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు బాగా అర్ధమైందిరా నీ కుత్సితపు బుధ్ది. నీ లాంటి కొడుకుని కన్నందుకు నేనూ మీ అమ్మా సిగ్గుపడాలి.


నీవు మా మీద ప్రేమతో నీ దగ్గరకు పిలిపించుకుంటున్నావని అనుకున్నామే కానీ మీ అమ్మ ఒక ఆయాగా, నేనొక నౌకర్ గా పనికి వస్తామవ్న దురాశతో తీసుకెడుతున్నావని అనుకోలేదు. నిజంగా కన్న తల్లితండ్రులమన్న ప్రేమ ఉంటే నీవు ఆదరణగా మమ్మలని చూసి ఉంటే నీ ఇంట్లో మేము చాకిరీ చేస్తున్నామనే భావన వచ్చి ఉండేది కాదు. శేఖర్ పిల్లలనూ పెంచాం. కానీ మీ అన్నయ్య గానీ వదిన గానీ ఏనాడూ మమ్మలని నిర్లక్యం చేయలేదు. ఎంతో గౌరవంగా చూసుకున్నారు”.


ఈలోగా ప్రీతి వచ్చింది. “ఏమిటండీ ఎప్పుడూ మీ పెద్దబ్బాయిని కోడలినీ పదే పదే పొగుడ్తారు. అన్ని సంవత్సరాలు అక్కడ వాళ్లకు, వాళ్ల పిల్లలకూ చాకిరీ చేస్తూ పడుండలేదా? ఇక్కడకు వచ్చి మీ చిన్నకొడుకు కుటుంబానికి చేయడం అదేదో కాని పనిగా మాట్లాడుతున్నారు. అయినా మీకు వాళ్లంటేనే ఇష్టం లెండి. కడుపులో లోని ప్రేమ కావలించుకుంటే వస్తుందా?”


“అమ్మాయ్ జాగ్రత్తగా మాట్లాడు. ఆరు నెలల నుండి వెట్టి చాకిరీ చేస్తున్నాం నేనూ మీ మామగారూనూ. ఏ నాడైనా అత్తయ్యా నేను వంట చేస్తాను రెస్ట్ తీసుకోండని అన్నావా? నాకు నూట మూడు డిగ్రీలు జ్వరం వచ్చినపుడు కూడా ఆఫీస్ కు వెళ్లిపోయావు. మీ మామగారే నాకు అన్నం వండి పెట్టారు. మా ఖర్చులకు డబ్బులిస్తూ కూడా మేమే మాటలు పడవలసి వస్తోంది. ఇంకా మాట్లాడి శాశ్వతంగా బంధాలను పోగొట్టుకోలేం. మేము వెళ్లిపోతున్నాం ఇక్కడ నుండి. ఏమండీ మీ బట్టలూ అవీ సర్దుకోండి. కేబ్ బుక్ చేయండి పెద్దాడి దగ్గరకు వెళ్లిపోదాం” కళ్లమ్మట కారుతున్న కన్నీటిని పమిటి చెంగుతో తుడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయిందావిడ.


రాత్రి ఎనిమిది గంటల సమయంలో కేబ్ నుండి దిగుతున్న తల్లి ని తండ్రి ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు శేఖర్. ఎదురుగా వెడ్తూ, బేగ్ లను అందుకుంటూ “ఏమిటి నాన్నా వస్తామని చెపితే నేనే తమ్ముడింటికి వచ్చి తీసుకు వచ్చే వాడిని కదా? ఏమిటీ అమ్మ అంత నీరసంగా కనపడుతోంది?”


ఈ లోగా మాధవి వచ్చింది. “రండత్తయ్యా మామయ్యా ఎలా ఉన్నా”రంటూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. శేఖర్ కు గానీ మాధవికి గానీ జరిగిన విషయాలేమీ చెప్పలేదు. కానీ ఇంత హఠాత్తుగా చెప్పా పెట్టకుండా రావడంతో అక్కడ ఏదో జరిగిందని గ్రహించలేని అమాయకులు కారిద్దరూ.


మరునాడు పొద్దుటే మాధవి లేచి వంటింట్లోకి వచ్చేసరికి అప్పటికే అత్తగారు స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి వంట మొదలు పెట్టేసారు.


మాధవిని చూస్తూనే “లేచావా మాధవీ, కాఫీ కలపనా” అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్న అత్తగారివైపు సంభ్రమాశ్చార్యాలతో చూసింది.


“ఏం మాధవీ! ఆశ్చర్యంగా ఉందామ్మా? నీకు పెళ్లై ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు నుండి నన్ను మీ మామగారిని ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నావు. అయినా నిన్ను సూటీపోటీ మాటలతో బాధించాను. మాకు సకల సేవలూ చేసావు. దూరపు కొండలు నునుపనుకుని భ్రమ పడ్డాం. అవి నునుపైన కొండలు కావని, ముళ్ల కంపలని కొద్దికాలం లోనే అర్ధం అయింది”.


“ఏమిటి అత్తయ్యగారూ, ఏమైంది ఇప్పుడు? అయినా ప్రొద్దుటే లేచి మీరు వంట చేయడం ఏమిటి? వెళ్లి హాయిగా సోఫాలో కూర్చోండి. మామయ్యగారికి మీకూ కాఫీ నేనే పట్టుకొస్తాను”.


ఈలోగా ప్రసాదరావు గారు అక్కడకు వచ్చారు. “లేదమ్మా మాధవీ. ఇకనుండి ప్రొద్దుటే మీ అత్తయ్యే లేచి వంట అవీ చేస్తుంది. నీవు నీ పిల్లలను రెడీ చేసి స్కూల్ కు పంపు. తరువాత ఆఫీస్ కు వెళ్లు. మీ అత్తయ్యను ఆ మాత్రం చేయనీయి. ఏమీ కందిపోదులే పాపం. అయినా మమ్మలని వీసమెత్తు గౌరవించక హీనంగా చూసిన వాళ్లకే చేసి పెట్టింది. అటువంటప్పుడు ఈ ఇంటికి దేవత లాంటి దానివి. నీకు సహాయపడడంలో న్యాయం ఉంది తల్లీ”.


“అయ్యో మామయ్యగారూ అంత పెద్ద మాటలు వద్దు. నేను దేవతనేంటి? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అత్తయ్యగారిలో అమ్మనే చూసుకుంటున్నాను”.


మాధవి మాటలకు ప్రసూనాంబ మనస్సు సిగ్గుతో చితికిపోయింది. మాధవి మనస్సులో తనకు తల్లి స్థానం ఇచ్చి అభిమానిస్తోంది. కానీ ఇన్నాళ్లూ తానేమి చేసింది? తల్లి లేని పిల్లని తెలిసినా తను ఒక తల్లిలా ఆ అమ్మాయిని కడుపులో పెట్టుకుని చూసుకోకుండా అత్తరికం చేస్తూ ఆ అమ్మాయిని ఎన్నో పరుషమైన మాటలతో బాధ పెట్టింది. ఫ్రీతి తనను ఎన్ని మాటలంది? ప్రీతి కి మాధవికి ఎంతటి వ్యత్యాసం? ఎదురుగా ఉన్న రత్నం విలువ తెలుసుకోలేక పోయింది.


ఎందుకో ఇప్పుడు మాధవిలో తన కూతురు శైలజే కనిపిస్తోంది. మాధవికి దగ్గరగా వెళ్లి మాధవిని హృదయానికి హత్తుకుంటూ ఇకనుండి నేను నీకు అమ్మనే మాధవీ. జరిగిన సంగతులన్నీ ఒక పీడకలగా మరచిపోవూ?


ఇంతలో శేఖర్ అక్కడకు వచ్చాడు. “తమ్ముడింట్లో ఏం జరిగిందని అడిగి మిమ్మల్ని బాధపెట్టను నాన్నా. వాడి సంగతి నాకు ఎప్పుడో తెలుసు. ఎంత స్వార్ధపరుడయిపోయాడు. మీరిద్దరూ నా దగ్గరే ఉంటారు ఎప్పటికీ. ఈ వయస్సులో ప్రశాంతంగా ఉండండి. కోరి కష్టాలను తెచ్చుకోవద్దని చెపుతున్నాను. మధూ కాఫీ ఇస్తావా? పొద్దుటే ఈ మీటింగ్ లు ఏమిటి? ఆఫీస్ కు టైమ్ అవడం లేదూ?”


“ఇదిగోరా కాఫీ అబ్బాయ్, అమ్మాయి మాధవీ ఇదిగో కాఫీ. తాగు. నేను ఇక్కడ వంట పని చూసుకుంటాను. నీవు పిల్లలని తయారు చే”యంటూ ఆవిడ కుక్కర్ తీసి ఉడికిన పప్పులో పోపు వేసే ప్రయత్నంలో పడింది.


అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. జీవితం మార్చుకోవాలంటే ముందుగా మార్చుకోవలసింది ఆలోచనలే.

##


సుప్రజ అత్తగారు వరలక్ష్మిగారు బాత్ రూమ్ లో కాలు జారి పడ్డారు. కుడిపాదానికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ కనీసం ఆరు వారాలైనా పూర్తి విశ్రాంతి కావాలని, బాత్ రూమ్ కి తప్పించితే అసలు నడవ కూడదని, కూడా ఎవరైనా ఉండాలని చెప్పాడు. సుప్రజ ఒక వారం రోజులు శెలవు పెట్టి అత్తగారిని కనిపెట్టుకుని చూసింది.


మార్చి నెల, ఆఫీస్ లో ప్రొడక్షన్ టైమ్. శెలవు దొరకడం కష్టంగా ఉంది. సరళ ఇంట్లో పరిస్థితిని గమనిస్తూనే ఉంది. అమ్మను నేను చూసుకుంటాలే సుప్రజా నీవు ఆఫీస్ కు వెళ్లి రా లాంటి మాటలు అనడం లేదు. అత్తగారికి చెప్పి మీకు ఏమి కావలసి వచ్చినా సరళ వదినగారిని అడగండి, మీరు మాత్రం మంచం మీద నుండి లేవకండి అంటూ పదిసార్లు జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్లింది.


వరలక్ష్మి గారు కూడా గమనిస్తున్నారు. సరళ అలా భర్తనూ ఇంటిని వదిలి రావడం ఆవిడ హర్షించలేకపోతోంది. సరళ అత్తగారు అలా ఇంట్లో నుండి వెళ్లిపోయారని తెలిసినప్పటి నుండి ఆవిడ మనస్సులో ఏదో తెలియని బాధ. ఎన్నో సార్లు కూతురిని వెనకేసుకు వస్తూ ఉండేది. అహంభావి అయిన సరళ తన అత్తగారి మీద చాడీలు చెపుతున్నప్పుడు కూడా తప్పు సరళా పెద్దావిడ మీ అత్తగారిని అలా అనకూడదు అని అనేది కాదు. సరళ తప్పులేదని అంతా సరళ అత్తగారిదే నని కూతురి మీద బోల్డంత సానుభూతి ఉండేది.


కాని సరళ ప్రవర్తన, అల్లుడి మంచితనం ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది ఆవిడకు. తోటి వయస్సు స్త్రీ, ఎవరూ దిక్కులేనట్లు కొడుకు కోడలు అన్యోన్యంగా సంసారం చేసుకోవాలి, నేను వాళ్ల సుఖానికి సంతోషానికి అడ్డు రాకూడదని ఇల్లు విడిచి వెళ్లిపోవడం ఆవిడకు భరింపరాని బాధగా ఉంది. పైగా పెళ్లి అయి పిల్లలున్న కూతురు ఇలా పుట్టింట్లో నెలల తరబడి ఉండిపోవడం ఆవిడకు అసహనంగా ఉంది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







49 views0 comments
bottom of page