top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6


'Neti Bandhavyalu Episode 6' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 05/12/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

హరికృష్ణ, లావణ్యాల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.

అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు, ఇంటినుండి వెళ్లిపోవడానికి తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి, దీప్తితో చెబుతుంది.

హరికృష్ణ దగ్గరకి శివరామకృష్ణ కుటుంబంతో వస్తాడు.



ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6 చదవండి.


మిత్రులు... బంధువులు హరికృష్ణ, శివరామకృష్ణలు. శివరామకృష్ణగారి తల్లి హరికృష్ణగారి మేనత్త. పేరు శాంభవి. ఆమె బ్రతికి వున్నరోజుల్లో ఊరిజనం ఆమెను ’దేవతమ్మ’ అని పిలిచేవారు. కారణం... ఆమె తను... భర్త మహేశ్వర్... వారు తమ కుటుంబం మాత్రం బాగుండాలనే రకం కాదు. నా వూరు... నా వూరి జనం అంతా బాగుండాలని ఆశించేవారు. శాంభవి పేదలకు దానధర్మాలు చేసేది. ఎవరు ఏది అడిగినా లేదని ఆమె ఎన్నడూ తన జీవిత కాలంలో అనలేదు. అందుకే ఆ పేరు పెట్టారు ఆ వూరి జనం. ఆమె మేనమామ ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం, శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ బావమరుదులు.


ఆ మూడు కుటుంబాల ముందు తరం సభ్యులు... ఆ వూరిలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు. సంపన్నులు.


శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్. ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం. బంధుత్వాలకు అతీతంగా మంచి స్నేహితులు.


ఆ రోజుల్లో గూడూరు ప్రాంతంలో మైకా వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ప్రజాపతి తండ్రి కైలాసపతి ఆ వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. అతన్ని చూచి శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ వున్న భూమిలో మైకా పడుతుందని తానూ కైలాసపతి వలే (అన్నగారు) లక్షలు సంపాదించాలనే ఆశతో కొంత భూమిని అమ్మి, వుంచుకొన్న భూమిలో అబ్రకం పడుతుందని సొరంగాలు త్రవ్వించాడు. అబ్రకం పడింది కానీ... క్వాలిటీ లేనిదైంది. విదేశీయులు... తరం తక్కువగా వున్న అబ్రకాన్ని కొనలేదు. దళారులు నూరు రూపాయలు విలువగల సరుకును పది పదిహేనుకు కొనేవారు.


మహేశ్వర్‍కు పంతం పెరిగి శివరామకృష్ణ (తనయుడు) అర్థాంగి శాంభవి చెప్పిన మాటలను వినక... మూర్ఖంగా అప్పులు చేసి మంచి అబ్రకాన్ని తన భూమిలో నుంచి తీయాలని గోతులు (ఎంతో లోతుగా) త్రవ్వించాడు. ఫలితం శూన్యం. మనశ్శాంతి నశించింది. మందుకు అలవాటు పడ్డాడు. వ్యాపారం పూర్తి నష్టానికి గురైంది. మనిషి అనారోగ్యం పాలైనాడు. భర్త ఆ రీతిగా తయారైనందుకు ఎంతో మంచిపేరున్న శాంభవి కూడా మనోవేదనతో మంచం పట్టింది. భర్త అంటే గౌరవం, ప్రేమ. ఎదిరించలేదు, విమర్శించలేదు. హృదయంలో భర్త విషయం ఎంతో ఆవేదన.


ఆ సమయంలో ఆ కుటుంబ గౌరవాన్ని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన ఓ కుటుంబం మద్రాస్ నుంచి ఎం.ఎ పాసై వచ్చిన శివరామకృష్ణకు పిల్లనిస్తామంటూ గూడూరుకు వచ్చారు. కుటుంబ పరిస్థితి సరిగాలేదని తెలిసీ వారు తమ బిడ్డను యిచ్చేదానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం కాలేజీలో శివరామకృష్ణ... ఊర్మిళ కలిసి చదువుకొన్నారు. ప్రేమించుకొన్నారు, వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు.


శివరామకృష్ణను ఊర్మిళ.... తన తల్లితండ్రులకు పరిచయం చేసిన రోజున.

"అవును అబ్బాయ్!.... పేరు... వూరు... కులం... గోత్రం అంతా బాగానే వుంది. ఆస్తిపాస్తులు ఏమాత్రమో చెప్పు!" అడిగాడు ఊర్మిళ తాత వెంకటరమణ.


అబ్రకం వ్యామోహంతో తన తండ్రి చేసిన నిర్వాకాన్ని... కలిగిన నష్టాన్ని గురించి వివరంగా చెప్పాడు శివరామకృష్ణ.


"తిండికి గుడ్డకు కొరతలేదండీ!.... ఎం.ఎ, బి.ఇడి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నామీద నాకు నమ్మకం వుంది. నా చూపు నాకంటే పేదవారి వైపే వుంటుంది కాని... మాకంటే గొప్పవారిపైన వుండదు. అది మంచిది కాదని మా తాతయ్యగారు చెబుతుండేవారు. మీ అమ్మాయికి ఏ కొరతా లేకుండా చూచుకోగలను. ఇద్దరం వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మీరు మంచి మనస్సుతో మా వివాహాన్ని జరిపించండి. నాకు మీరు ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వవద్దు" ఎంతో వినయంగా ఆత్మవిశ్వాసంతో శివరామకృష్ణ చెప్పాడు. అతని మాటల తీరు వెంకట రమణకు నచ్చింది.

ఊర్మిళ తండ్రి నాలుగేళ్ళ క్రితం... ఓ లారీ యాక్సిడెంట్‍లో చనిపోయాడు. వెంకటరమణ... తనకు ముఖ్యులైన వారిని ఇరువురిని గూడూరుకు పంపించి శివరామకృష్ణ కుటుంబ వివరాలను సేకరించాడు. ఆ వ్యక్తులు మద్రాస్‍కు తిరిగి వెళ్ళి...


"అన్నా!.... ఆ కుటుంబం బ్రతికి చెడ్డవారే కానీ... చెడి బ్రతికిన వారు కాదన్నా. అబ్బాయ్... అమ్మా నాన్నలకు ఎంతో గొప్ప పేరుంది. వ్యాపారంలో నష్టపోయారు. అంతే ఎవరినీ మోసం చేయలేదు. అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీ గల మంచి కుటుంబం అన్నా!" చెప్పారు వారు.


వారి విశ్వాసనీయమైన మాటలు విని... వెంకటరమణగారు భార్య బాలమ్మా సమేతంగా గూడూరుకు వచ్చి మహేశ్వర్, శాంభవీలను కలసి తాము వచ్చిన విషయాన్ని వివరించారు.


తల్లి శాంభవికి శివరామకృష్ణ అంతకుముందే తన నిర్ణయాన్ని ఊర్మిళను గురించి చెప్పి వున్నందున ఆ దంపతులు శివరామకృష్ణ వివాహాన్ని ఊర్మిళతో జరిపించే దానికి అంగీకరించారు. రెండు నెలల తర్వాత శివరామకృష్ణ... ఊర్మిళల వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన మూడునెలల తర్వాత హరికృష్ణకు, లావణ్యకు కైలాసపతి వివాహాన్ని జరిపించారు.

వారి వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ప్రజాపతికి, ప్రణవికి వివాహం జరిగింది.

కైలాసపతి... శివరామకృష్ణకు, ఊర్మిళకు తనకు వున్న పలుకుబడితో హైస్కూల్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పించాడు.


కోడలు ఇంటికి వచ్చినా... మహేశ్వర్ తన త్రాగుడు అలవాటును మానలేదు. భర్త వైఖరిలో మార్పులేనందుకు శాంభవి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చేది. మనోవ్యధతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కోడలి ఆదరాభిమానాలు, కొడుకు ప్రేమానాలురాగాలు, భర్త విషయంలో ఆమె హృదయం నిండా నిండిపోయిన ఆవేదనను తొలగించలేకపోయింది.

ఒకరోజు రాత్రి... శయనించిన శాంభవి... శాశ్వతంగా నిద్రపోయింది.


ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఊర్మిళ అత్త శాంభవి గదికి వెళ్ళింది. సాధారణంగా శాంభవి అందరికన్నా ముందులేచి... స్నానం చేసి... ఆరున్నర లోపల దీపారాధన వెలిగించి దైవానికి పాల నివేదన చేసి... ఆ పాలతో కాఫీ తయారుచేసి అందరికీ అందించేది ఆ మహాతల్లి.

కదలకుండా వెల్లికిలా పడుకొని కళ్ళు మూసుకొని వున్న శాంభవిని చూచి ఊర్మిళ ఆశ్చర్యపోయింది. తల వైపుకు నడిచి చేతిని ఆమె నొసటిపై వుంచింది. చల్లని స్పర్శకు ఆశ్చర్యపోయింది. "అత్తయ్యా!...." పిలిచింది ఒకటికి రెండుసార్లు.


శాంభవి నుండి జవాబు లేదు.

వేళ్ళను నాసికారంధ్రాల ముందు వుంచింది. ఊర్మిళకు విషయం అర్థం అయింది.


"ఏమండీ!..." బిగ్గరగా అరిచింది.

పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరుగెత్తాడు.

అతన్ని చూచిన ఊర్మిళ....


"ఏమండి... ఏమండీ... అత్తయ్య... అత్తయ్య..." భోరున ఏడ్చింది.


శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూచాడు.


"అమ్మా!..." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు.


ఆ గదిలో... శాంభవి శాశ్వత నిద్రలో వుంది.

శివరామకృష్ణ, ఊర్మిళలు భోరున ఏడుస్తున్నారు.


గతరాత్రి తాగిన మైకంవదలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళల ఏడుపులు... అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.

వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూచాడు శివరామకృష్ణ.


"నాన్నా! అమ్మ చనిపోయింది నాన్నా!..." భోరున ఏడ్చాడు.


మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.


"శాంభవీ! నన్ను మన్నించు...నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చచ్చిపోయావు" ఆమె చేతిపై తన తలను ఆనించి భోరున ఏడవసాగాడు.


పనిమనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు... తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది.


కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూచారు. ఎంతో ప్రేమాభిమానాలతో వరసలతో ప్రీతిగా పలకరించే... శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు.


ఆ వార్త వూరంతా నిముషాల్లో పాకిపోయింది. ఆ వాడ... వూరిజనం అంతా అరగంటలో ఆ ఇంటిముందుకు చేరారు.


కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి... శాంభవిని దానిపైకి చేర్చారు. హరికృష్ణ వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, వూరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రులతో ఐదు గంటల ప్రాంతంలో శాంభవి... నలుగురు వాహకులతో... పసుపు కుంకుమలు... పూలతో జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా స్మశానం వైపు వూరేగింపుగా బయలుదేరింది.


’దేవత... ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది’ అది అందరి నోటిమాట.


అందరి వదనాల్లో కన్నీరు... కారణం ఆ మహాతల్లి అందరినీ అభిమానించింది. ప్రేమించింది. సాయం చేసింది.

ఆరున్నర ప్రాంతంలో ఆమె యాతనా తనువు అగ్నికి ఆహుతైపోయింది.

ఈ లోకపు బాధలన్నింటి నుంచి విముక్తి పొందింది.


కొందరు మంచి మనుషులు బ్రతికి వున్నా... గతించినా... వారి చర్యల వలన ఇతరుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా వుంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి వున్నా సాటివారి మనసుల్లో చచ్చి వారి చిట్టాలోనే వుండిపోతారు. అదే మంచి.... చెడుకు వున్న వ్యత్యాసం.


ఈ మానవ జన్మ అపూర్వమైనది. మరుజన్మ వున్నదో లేదో!... సృష్టిలోని అన్ని ఎలా అశాశ్వతాలో మానవుల జీవిత గతీ అంతే... అందుకే అన్నారు పెద్దలు ’పుట్టుట గిట్టుట కొరకే’ అని శాంభవి మరణం ఆ ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణం అయింది. అయినవారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన మూడు మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


42 views0 comments

コメント


bottom of page