top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5


'Neti Bandhavyalu Episode 5' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 25/11/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యాల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.


అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు ఇంటినుండి వెళ్లిపోవడానికి తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి దీప్తితో చెబుతుంది.

ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5 చదవండి.


"హలో!...." మ్రోగిన సెల్‍ఫోన్ చేతికి తీసుకొని అడిగాడు హరికృష్ణ.

"హలో... హరీ!.... నేనురా!.... శివ..."

"ఒరేయ్!... శివా!... నీవా!.... గొంతు మారిందేం!...."

"అవునురా... వయస్సు అవుతూ వుందిగా!...."

"వస్తానని జాబు వ్రాశావు... ఎప్పుడు వస్తావ్?"

"అరగంటలో మన వూరి స్టేషన్‍లో దిగుతా!.... నేను ఒక్కడినే రావడం లేదు. మీ చెల్లెలు, విష్ణు.... నాతో వస్తానని బయలుదేరారు."

"అలాగా!... చాలా సంతోషం రా!.... నేను స్టేషన్‍కి వస్తాను."

"సరే కట్ చేస్తున్నా!..."

"అలాగే!..."

వంటింట్లో నుంచి వచ్చిన లావణ్య.

"ఎవరండీ ఫోన్ చేసింది!" అడిగింది.

"మీ అన్నయ్య శివ... ఊర్మిళా, విష్ణు మరో అరగంటలో వస్తున్నారట..."

"అలాగా!..."

"అవును లావణ్యా! నేను స్టేషన్‍కు వెళ్ళి వారిని పిలుచుకొస్తాను... వాడు ఈ వూరికి వచ్చిఎనిమిదేళ్ళయిందిగా!..."

"అవును... నాకూ పని పూర్తయింది. నేనూ వస్తానండి స్టేషన్‍కు..."

"అలాగే!.... ఆఁ... పిల్లలేరి?..."

"శివాలయానికి వెళ్ళారు. యీ పాటికి తిరిగి వస్తూ వుంటారు."

వీధి తలుపు తెరిచిన శబ్దం విని అటువైపు చూచింది లావణ్య.

ఈశ్వర్, శార్వరీలు నవ్వుకొంటూ లోనికి వచ్చారు.

"ఈశ్వర్!.... మీ శివ మామయ్య, అత్తయ్యలు వస్తున్నారు" చెప్పింది లావణ్య.

"ఎప్పుడమ్మా?..."

"మరో అరగంటలో!..." చెప్పాడు హరికృష్ణ.

"నేను నాన్న స్టేషన్‍కు వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసికొని వస్తాం. మీరు ఇంట్లో వుండండి."

"అలాగే అమ్మా!...." అంది శార్వరి.

"నాన్నా!.... నేను వెళ్ళిరానా!" అడిగాడు ఈశ్వర్.

"వద్దు నాన్నా!.... నేను వెళితేనే మీ మామయ్య ఆనందిస్తాడు. ఎనిమిదేళ్ళ తర్వాత వస్తున్నారు" అనునయంగా చెప్పాడు హరికృష్ణ.

"వస్తున్నారు అంటే!" అడిగాడు ఈశ్వర్.

"మీ అత్తయ్య ఊర్మిళ, విష్ణు కూడా వస్తున్నారట. ఈశ్వర్!... అందువల్ల మేమిద్దరం స్టేషన్‍కు వెళ్ళి వారితో వస్తాం" చెప్పింది లావణ్య.

"అలాగే అమ్మా! వెళ్ళిరండి..."

"ఏమండి... ఇక మనం బయలుదేరుదామా!..."

"ఆ పద..."

భార్యాభర్తలు కార్లో కూర్చున్నారు. వరండా వరకూ వచ్చి ఈశ్వర్, శార్వరీలు టాటా చెప్పారు. హరికృష్ణ కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలో ప్రవేశిందింది.

"ఏమండీ!..."

"చెప్పు లావణ్యా!..."

"పాపం విష్ణు... వాడికి చూపు రాదు కదూ!..."

"రాదూ అని మనం నిర్ధారణగా ఎలా చెప్పగలం. ఆ దైవం తలచుకుంటే... కానిది... లేనిది... అనేవి వుంటాయా లావణ్యా!..."

"మీకు దైవం మీద చాలా నమ్మకం కదండీ!..."

"నీకు లేదా!...."

"రామ రామ ఎంతమాట!... లేదని ఎలా అనగలనండీ!..."

"అయితే... విష్ణుకు కళ్ళు రావాలి స్వామీ... వాడు మమ్మల్నందరినీ నీవు సృష్టించిన ఈ ప్రపంచంలోని అన్ని అందాలను చూచి ఆనందించాలని కోరుకో. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆ సర్వేశ్వరుని అదే కోరుకుంటాను."

"మీ నమ్మకమే.... వాడికి శ్రీరామరక్ష కావాలి."

"నీవూ నాలా కోరితే... అ దేవుడు విష్ణును తప్పక కరుణిస్తాడు." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.

"తప్పక నిత్యం కోరుకుంటానండి. వారు వైజాగ్ వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు. అప్పటికి వాడి వయస్సు మూడేళ్ళు. అంటే విష్ణు వయస్సు ఇప్పుడు ఇరవై మూడు. శార్వ కన్నా మూడేళ్ళు పెద్దవాడు."

"అవును లెక్కల్లో నీవు జీనియస్ లావణ్యా!" నవ్వాడు హరికృష్ణ.

"మీరేగా నేర్పారు" చిరునవ్వుతో భర్త ముఖంలోకి చూచింది లావణ్య.

వారి కారు స్టేషన్ ఆవరణంలో ప్రవేశించింది. పార్కింగ్ స్థలంలో కారును ఆపి... రెండు ప్లాట్‍ఫాం టిక్కెట్లను కొన్నాడు హరికృష్ణ. ఇరువురూ స్టేషన్‍లో ప్రవేశించారు.

జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఐదుగంటలు ఆలస్యంగా వచ్చింది. అనౌన్స్ మెంటు విని హరికృష్ణ, లావణ్యలు ఆ ప్లాట్‍ఫాంను చేరారు. రైలు వచ్చి ఆగింది.

శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు కంపార్టుమెంటు నుండి దిగారు. ఆ ముగ్గురిని చూడగానే హరికృష్ణ లావణ్యలు నవ్వుతూ వారిని సమీపించారు. శివరామకృష్ణ చిరునవ్వుతో హరికృష్ణను కౌగలించుకొన్నాడు. లావణ్య ఊర్మిళ చేతులు పట్టుకొని... "వదినా!.... బాగున్నావా!..." ప్రీతిగా అడిగింది.

"సంవత్సరం రోజులుగా నిన్ను చూడాలనుకొన్న నా ప్రయత్నం... ఈనాటికి ఫలించిందిరా!..." నవ్వుతూ చెప్పాడు శివరామకృష్ణ.

చేతికర్ర సాయంతో విష్ణు హరికృష్ణను సమీపించాడు. ఆరు అడుగుల ఎత్తు... తెల్లని దేహచ్ఛాయ, గుండ్రటి ముఖం, ఒత్తైన జుట్టు అన్నీ ఎంతో గొప్పగా వున్నా దృష్టిలేని కారణంగా విష్ణు ఎవరినీ దేనినీ చూడలేని పరిస్థితి.

"మామయ్యా!.... అత్తయ్యా!.... బాగున్నారా!..." నవ్వుతూ అడిగాడు విష్ణు.

విష్ణు భుజంపై చెయ్యివేసి "మేమంతా బాగున్నాము. నీవూ వీళ్లతో రావడం నాకు ఎంతో సంతోషంరా!..." నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ.

"సరే... ఇక పదండి... వదినా!... అన్నయ్యా!.... ఇంటికి వెళ్ళి అన్ని విషయాలూ భోంచేస్తూ మాట్లాడుకొందాం" అంది లావణ్య.

"విష్ణు చేతిని పట్టుకొని... విష్ణు జాగ్రత్తగా నడు" అంది.

ఐదుగురూ స్టేషన్ బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నారు. పదిహేను నిముషాల్లో హరికృష్ణ కారును పోర్టికోలో ఆపాడు. అందరూ దిగారు.

వారి రాకకోసం... ఎదురు చూస్తున్న ఈశ్వర్, శార్వరీలు వారిని సమీపించారు. ఒకరినొకరు అభిమానపూర్వక పలకరింపులతో నవ్వుకొన్నారు.

ఈశ్వర్, విష్ణును సమీపించి అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని... "విష్ణూ!"

"ఎవరూ?..."

"నేనురా... ఈశ్వర్‍ని..."

"ఓ... బావా... మీరా!... గొంతు విని చాలాకాలం అయిందిగా! వెంటనే గుర్తుపట్టలేకపోయాను బావా!... సారీ!..."

"రా లోనికి వెళదాం..."

అందరూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ రెస్టు రూము వైపు వెళ్లాడు.

"బావా! ఊర్మిళా!... ముందు స్నానం చేయండి. ఎప్పుడు ఏం తిన్నారో ఏమో!.... భోజనం చేస్తూ మాట్లాడుకొందాం" అన్నాడు హరికృష్ణ.

"అలాగేరా!...." చెప్పాడు శివరామకృష్ణ.

"వదినా!.... నీకోడలు..." తన కూతురు శార్వరిని చూపి నవ్వుతూ చెప్పింది లావణ్య.

"నమస్తే అత్తయ్యా!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.

"ఇలారా!..." పిలిచింది ఊర్మిళ.

శార్వరి ఆమెను సమీపించింది.

"శారూ!... ఎంతగా ఎదిగిపోయావే.. ఏం చదువుతున్నావ్!"

"బి.ఎస్సీ ఫైనల్ ఇయర్"

"ఎక్కడ?"

"హైదరాబాద్‍లో"

"ఈశ్వర్ ఉద్యోగమూ అక్కడేగా!"

"అవును అత్తయ్యా!...."

రెస్టురూమ్‍కు వెళ్ళి హీటర్ ఆన్ చేసి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.

"మామయ్యా!.... మీరు స్నానానికి రండి..."

"వెళ్ళరా... స్నానం చేసిరా!..." అన్నాడు హరికృష్ణ.

"అలాగేరా!..."

ఈశ్వర్ వెంట శివరామకృష్ణ రెస్టు రూమ్ వైపుకు నడిచాడు.

సోపు... టవల్ శివరామకృష్ణకు అందించి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.

"అత్తయ్యా!.... మీరూ రండి. నీళ్ళు కాగాయి. స్నానం చేద్దురుగాని!...." చెప్పింది శార్వరి.

ఊర్మిళ... శార్వరి వెనకాల ఆమె గదిలోనికి వెళ్ళింది.

ఈశ్వర్... విష్ణు ప్రక్కన కూర్చున్నాడు.

"విష్ణూ! మామయ్యగారు రావడంతోనే... నీవూ స్నానం చేస్తావుగా!"

"అవును బావా!..." కొన్ని క్షణాల తర్వాత అడిగాడు విష్ణు.

"బావా!"

"ఏమిటి విష్ణు"

"మీరు ప్రాక్టీస్ ప్రారంభించారుగా!..."

"ఆ... రెండేళ్ళయింది. శార్వరి హైదరాబాదులో చదువుతుందిగా అందువల్ల అక్కడ ఓ సీనియర్ లాయర్‍గారి వద్ద ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరో మూడునెలల్లో శార్వరి బి.ఎస్సీ పూర్తి అవుతుంది అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభిస్తాను."

"శార్వరి బి.ఎస్సీ తర్వాత ఏం చేయాలనుకొంటూవుంది."

"ఎం.బి.బి.యస్ చేయాలని తన వుద్దేశ్యం..."

"ఓహో తనకు డాక్టర్ కావాలనే ఆశ అన్నమాట."

"అవును విష్ణు"

"బావా!... మీ అన్నయ్య నా పెదబావగారు... యు.ఎస్‍లో వున్నారుగా!... అక్కడికి పోవచ్చుగా!..."

"అమ్మానాన్నలకు ఇష్టం లేదు. వారికి ఇష్టంకాని పనిని నేనూ, శారూ... చేయము విష్ణు."

"అవును మామయ్యా, అత్తయ్యా చాలా మంచివారు. వారిని మీరు ఏ విషయంలో ఎప్పుడూ నొప్పించకండి..."

"విష్ణు! ఎంత గొప్పగా మాట్లాడుతున్నావురా!..."

"అంతా మీరు నా చిన్నప్పుడు నాకు ఇచ్చిన శిక్షణ. మరిచిపోలేదు, పాటించాను. నా గురువులు మీరే!..." నవ్వాడు విష్ణు.

శార్వరి హాల్లోకి వచ్చింది.

"అరుగో మామయ్యగారు వచ్చారు. అన్నా!.... విష్ణును త్వరగా స్నానం చేసి రమ్మను" అంది శార్వరి.

"ఏం నీవే వాడికి చెప్పవచ్చుగా!" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.

శార్వరి అన్నను సమీపించి తలను వంచి అతని చెవి దగ్గర వుంచి... "నీ కన్నా ఎత్తుగా ఎదిగాడు. అతనికి నేను ఏమని చెప్పాలి!..." అంది.

"చిన్నప్పుడు ఏమని పిలిచేదానివి!..."

"విష్ణు అని..."

"ఇప్పుడూ అలాగే పిలువు..." నవ్వాడు ఈశ్వర్.

"బావా! నా గురించి శార్వరి నీతో ఏదో చెబుతూ వుంది కదూ!..." అడిగాడు విష్ణు.

"అవునురా!..."

"ఏమడిగింది?"

శార్వరి తన చేతితో ఈశ్వర్ నోరు మూసింది.

కొన్ని క్షణాలు గడిచాయి.

"ఏం బావా!... ఏం మాట్లాడవు?" అడిగాడు విష్ణు.

"అమ్మ అన్నీ భోజనానికి సిద్ధం చేసింది. మీరు వెళ్ళి స్నానం చేస్తే అందరం కలిసి భోంచేయవచ్చు" అంది శార్వరి.

"అలాగా!.." అన్నాడు విష్ణు. క్షణం తర్వాత "శార్వరీ! బావ ఇక్కడ లేడా!...."

"ఆఁ ఇక్కడే వున్నారా!... పద స్నానం చేద్దువుగాని" శార్వరి చేతిని తన చేతితో ప్రక్కకు నెట్టి చెప్పాడు ఈశ్వర్.

విష్ణు లేచి నిలబడ్డాడు.

"శారూ!.... విష్ణును రెస్టురూమ్ దాకా తీసుకొని వెళ్ళు.. టవల్, సోప్ ఇచ్చిరా!" చెప్పాడు ఈశ్వర్.

విష్ణు నేలకు పూనిన కర్ర చివరను తన చేతిలోనికి తీసుకొంది. "జాగ్రత్తగా రండి" అంది శార్వరి.

విష్ణు ఆమెను అనుసరించాడు. ఇరువురూ ఈశ్వర్ రెస్టు రూమ్‍ను సమీపించారు.

చేతిలోని కర్రను వదలి శార్వరి రెస్టురూం తలుపును తెరిచింది. బకెట్‍లో వేడినీళ్ళు నింపింది. స్టీల్‍రాడ్ పై టవల్‍ను వుంచింది.

వాకిట నిలబడివున్న విష్ణును చూచింది. కళ్ళు లేవు... కానీ ఆ బాధ అతని ముఖంలో కనిపించలేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడి వున్నాడు.

"శార్వరీ!... ఇక నీవు వెళ్ళు... నేను చూచుకొంటాను."

"ఎలా?..."

"మనోనేత్రంతో....!" నవ్వాడు విష్ణు.

శార్వరి గదినుండి బయటికి వచ్చింది. కర్ర సాయంతో విష్ణు తడుతూ రెస్టురూంలోకి ప్రవేశించాడు.

"థ్యాంక్యూ శార్వరి!"

"నో...నో... నేనేం చేశానని!"

"గొప్పవారు ఇతరులకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు!"

"నేను మీరంటున్నంత గొప్పదాన్ని కాను. మీరు మా బంధువులు... మా ఇంటికి వచ్చారు. అన్నయ్య చెప్పాడు. వాడు చెప్పినట్లు చేశాను. అది నా ధర్మం. అంతే! మీరు నాకు ధన్యవాదాలు చెప్పవలసినంత విశేషమైన పనిని నేను ఏమీ చేయలేదు."

"ఓకే... ఓకే!.." నవ్వుతూ తలుపు మూసుకొన్నాడు విష్ణు.

తలుపు దగ్గరకు జరిగి... "బకెట్‍కు పైన గోడకున్న రాడ్‍పై టవల్ దానికింద... సోప్ కిట్‍లో సబ్బు వున్నాయి" చెప్పింది శార్వరి.

"చూచాను... అదే తాకి చూచాను" అన్నాడు విష్ణు.

శార్వరి తన అన్నయ్య దగ్గరకు వచ్చింది.

"పాపం అన్నయ్యా!..."

"ఏందిరా పాపం!..."

"విష్ణు విషయంలో!...."

ఈశ్వర్ నిట్టూర్చి... "వాడి విషయంలోనా!... అవును..."

"అతనికి చూపు వచ్చే ఆస్కారమే లేదా అన్నయ్యా!"

"మనకెలా తెలుస్తుందిరా!... వాణ్ణి మంచి డాక్టర్‍కు చూపించి సంప్రదించాలి"

"మనం ఆ పని చేయలేమా!.... ఆఁ... దీప్తి వదిన డాక్టరేగా!.... ఈ విషయంలో మనం ఆమె సలహా తీసుకొందామా!...."

"దాన్ని నేను అడగను!..."

"మరి నేను అడగనా!..."

"అది నీ ఇష్టం..."

"ఒరేయ్! అన్నయ్యా!... దీప్తి వదినంటే నీకెందుకు అంత చిరాకు!..."

"అబ్బా!...." అటూ ఇటూ తలాడించి.. "శారూ! నీతో నేను ఆ విషయాన్ని గురించి చర్చించదలచుకోలేదు. ఇక డాక్టర్ విషయమా నాకు వదిలై. నేను నీకు రేపు చెబుతాను. హూ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ అనే విషయం!"

"ఎవరిని కనుక్కొంటావ్?"

"నాకు ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మంచి పరిచయం వుంది శారూ!... వారిని అడిగి కనుక్కొంటాను."

"అలాగా!"

"అవును"

విష్ణు స్నానం చేసి వచ్చాడు. ఈశ్వర్‍తో కలిసి అతని గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకున్నాడు.

అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. శార్వరి, లావణ్యలు భోజనాన్ని వడ్డించారు. సరదా కబుర్లతో హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు, ఈశ్వర్‍లు భోజనం చేశారు. హరికృష్ణ, శివరామకృష్ణాలు... హరికృష్ణ గదికి, ఈశ్వర్, విష్ణు ఈశ్వర్ గదికి వెళ్ళిపోయారు. ఊర్మిళ లావణ్యకు, శార్వరికి వడ్డించింది. అందరి భోజనాలు ముగిశాయి. ఆడవారు ముగ్గురూ శార్వరి గదికి వెళ్ళిపోయారు. ప్రయాణ బడలికతో శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు మంచాలపై వ్రాలి నిద్రపోయారు. ఆ ఇంటివారూ నిద్రకు ఉపక్రమించారు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


62 views0 comments

Comments


bottom of page