top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 12'Neti Bandhavyalu Episode 12'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 04/01/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది.

ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా  ఉన్నా, బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. వాణి ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో  తండ్రి పాత్ర గురించి తెలుసుకుంటుంది.


గతంలో లావణ్య, ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణించినప్పుడు  ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ. హరికృష్ణను చులకనగా మాట్లాడుతాడు ప్రజాపతి.


శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి.

వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 12 చదవండి. 


హరికృష్ణ కార్లో పాలఫ్యాక్టరీకి బయలుదేరాడు. దార్లో సీతాపతి అతనికి కనిపించాడు. కారుని ఆపి సీతాపతిని రమ్మని చెయ్యి వూపాడు హరికృష్ణ.

బిక్కముఖంతో సీతాపతి... వారు కూర్చొని వున్న వైపుకు వచ్చి నిలబడ్డాడు.

"నమస్కారం మామయ్యా!" అన్నాడు.


"సీతా!... కారు ఎక్కు" చెప్పాడు హరికృష్ణ.


తిరిగివచ్చి డోర్ తెరచుకొని వారి ప్రక్కన కూర్చున్నాడు సీతాపతి.

’మామయ్య నన్ను ఎందుకు కార్ ఎక్కమన్నారో!.... శార్వరి తనతో నేను చెప్పిన మాటలు మామయ్య, అత్తయ్యలకు చెప్పిందా!... వారి ముఖం ఎంతో గంభీరంగా వుంది. మామయ్య చాలా గొప్ప వ్యక్తి. నా తండ్రిలా నీచప్రవృత్తి కలవాడు కాదు. నాకు ఏదో సందేశాన్ని ఇవ్వడానికే రమ్మన్నాడు. ఏం చెప్పబోతాడో ఏమో!’ భయంతో ఒదిగి కూర్చొని అనుకొన్నాడు సీతాపతి.


"నీవు బి.టెక్ చదువుతున్నావు కదూ!"


"అవును మామయ్యా."


"ఎన్నో సంవత్సరం?"


"ఫైనల్ ఇయర్!"


"అంటే వచ్చే మార్చికి బి.టెక్ కంప్లీట్ అవుతుందన్నమాట!"

"అవును"

"బి.టెక్ కాగానే ఎం.టెక్ చదవాలని వుందా లేదా!..."

"చదవాలని వుంది మామయ్యా!..."

తలాడించాడు హరికృష్ణ సాలోచనగా....


"సీతా!...."

"చెప్పండి మామయ్యా!"

"నీకు, శార్వరికి వయస్సులో వ్యత్యాసం ఎంతో నీకు తెలుసా!"

తెలీదన్నట్లు తలూపాడు సీతాపతి.


"మన రెండు కుటుంబాల మధ్యనా గత మూడు సంవత్సరాలుగా ఎలా వుందో నీకు తెలుసుగా!"

"నేను మీ నాన్నలాంటి వాణ్ణి కాను..." 

"ఆ విషయం నాకు తెలుసు మామయ్యా! మీ మంచితనాన్ని గురించి అమ్మ అప్పుడప్పుడూ చెబుతూ వుంటుంది."


"నాది మంచితనమో, చెడ్డతనమో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు నా తండ్రి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఆ మార్గాన నన్ను నడిపించాడు. వారు వున్నంతవరకూ... వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఆ విధానాలు నచ్చినందున పాటిస్తున్నాను. నీకు నీ తండ్రి ఏమి నేర్పలేదా!"


తన తండ్రి తత్వాన్ని గురించి తల్లి ప్రణవి చెప్పగా కొన్ని తెలిశాయి. వాణి వివాహ విషయంలో ప్రజాపతి... తన రాజకీయ ప్రయోజనాల కోసం, వాణి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించడం తనకు తెలుసు. తన తండ్రి తత్వం ఇదే అని తెలిసిన తర్వాత అతని నుండి తాను నేర్చుకోవలసినది ఏదో తోచలేదు సీతాపతికి. మనస్సున తండ్రి మీద ద్వేషం... విద్యార్థి దశలో అతన్ని ఎదిరించి విమర్శించి ఎక్కడికి పోగలడు? ఏం చేయగలడు?..


హరికృష్ణ ప్రశ్నకు మౌనమే సీతాపతి వంతు అయింది. కారు పాలఫ్యాక్టరీ పోర్టికోలో ఆగింది.

హరికృష్ణ దిగాడు. దిగిన సీతాపతి వారి ముఖంలోకి చూచాడు. "రా!..." అన్నాడు హరికృష్ణ.

ముందు హరికృష్ణ, వెనకాల సీతాపతి. హరికృష్ణ ఆఫీస్ గదిలో ప్రవేశించారు. హరికృష్ణ తన స్థానంలో కూర్చున్నాడు. వారి రాకను గమనించిన అకౌంట్స్ మానేజర్ సుందరయ్య తలుపుతట్టి లోనికి వచ్చి విష్ చేశాడు.


"సుందరయ్యగారూ!... మిమ్మల్ని పదినిముషాల తర్వాత లోపలికి పిలుస్తాను" అన్నాడు హరికృష్ణ.

"సరే సార్!...." సుందరయ్య వెళ్ళిపోయాడు.


"సీతా!... చదువుమీద ధ్యాస వుంచు. చదువుకొనవలసిన వయస్సు నీది. నేడు వస్తున్న సినిమాలు.. వచ్చిన ఐఫోన్స్... వాట్సప్, గూగుల్ వీటన్నింటినీ చూచి మనం కూడా అందులో కనబడే వారిలాగానే తయారుకావాలనుకోవడం మంచి నిర్ణయమే!... కానీ... నీవు చూచించి మంచిదా!... చెడ్డదా అని ఆలోచించి... మంచిని నేర్చుకోవాలి. పాటించాలి. ఒకసారి చూచిన చెడ్డను మరోసారి చూడకూడదు. నీమీద మీ అమ్మానాన్నలకు ఏవేవో ఆశలు వుండవచ్చు. 


అలాగే నాకు నా బిడ్డల విషయంలో కొన్ని ఆశలు వున్నాయి. కాబట్టి నీవు... శార్వరికి ఫోన్ చేయడం కాని, ల్యాప్‍టాప్‍లో వాట్సప్‍లో చాటింగ్ చేయడం గాని, ఇక మీదట ఎన్నడూ చేయకు. నేను చెప్పింది నీ మంచికేనని అర్థం చేసుకో. శార్వరి అమెరికాకు వెళ్ళాలని, తాను గొప్ప డాక్టర్ కావాలని ఆశపడుతూ వుంది. ఆ పిల్ల మనస్సును ప్రేమపేర కలుషితం చేయకు. నీ చర్యలను గురించి ఆమె నా భార్యకు చెబుతుంటే విన్నాను. 


ఎటువంటి పరిస్థితులోనూ నేను నా బిడ్డను మీ ఇంటికి కోడలిగా చేయలేను. ఇది నా నిర్ణయం. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. బుద్ధిగా చదువుకో. మంచి పేరు సంపాదించుకో. నా బిడ్డను మరిచిపో! నీ మేలుకోరి ఈ విషయాలన్నీ నీకు చెప్పాను" ఎంతో సౌమ్యంగా హరికృష్ణ సాగించిన సంభాషణ ఆపాడు.


సీతాపతి ముఖం... శరీరానికి చెమట పట్టింది.

"ముఖం నిండా చెమట... తుడుచుకో" తన కుర్చీ వెనుక వున్న టవల్‍ను అందించాడు హరికృష్ణ సీతాపతికి.

టవల్ అందుకొన్నాడు సీతాపతి. ముఖం తుడుచుకొన్నాడు. జగ్‍లో వున్న నీటిని గ్లాసులో పోసి అందించాడు.

"తాగు" అన్నాడు హరికృష్ణ.


గ్లాసులోని నీళ్ళను గటగటా త్రాగాడు సీతాపతి.

"పాపం... మీ అమ్మ!... అమాయకురాలు. ఎంతో దైవభక్తి కలది. ఆమె మనస్సుకు కష్టం కలిగించేలా నడుచుకోకు."


తలాడించాడు సీతాపతి.

"కాఫీ... టీ త్రాగుతావా!..."

వద్దన్నట్లు తలాడించాడు సీతాపతి.


"సరే వెళ్ళి కార్లో కూర్చో. డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర్లో దించుతాడు."

సీతాపతి మౌనంగా గదినుండి బయటికి నడిచాడు.

హరికృష్ణ డ్రైవర్‍ను పిలిచి సీతాపతిని డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు.

సీతాపతి కార్లో కూర్చున్నాడు. డ్రైవర్ రాములు కారును సమీపించి కూర్చొని...

"సీతయ్యబాబు!... బయలుదేరుదామా!..." అడిగాడు.


"ఆఁ...." హరికృష్ణ చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తున్న సీతాపతి యాంత్రికంగా పలికాడు.

అతనికళ్ళ ముందు ఒకవైపు తన తండ్రి ప్రజాపతి, మరోవైపు హరికృష్ణ నిలిచారు.


’నా తండ్రి... తన స్వార్థం కోసం... ఎవరినైనా వంచిస్తాడు. ఆయనలో వున్న స్వార్థానికి స్వపర భేదం లేదు. తన పంతం నెరవేరి తన వాంఛ తీరాలి. ఆవేశంతో ఏదైనా చేస్తాడు.’

’మామయ్య!... శాంత స్వరూపి. స్వార్థపు చింతనకు వారికి చాలాదూరం. ఎంతో బంధుప్రీతి. అందరూ అరమరికలు లేకుండా హాయిగా కలిసి ఒకటిగా వుండాలనే తత్వం. పరమార్థమే వారి స్వార్థం.


రెండు మూడు సంవత్సరాలుగా నాన్న మనస్తత్వంలో ఎంతో మార్పు. బంధుప్రీతి నశించింది. ధనదాహం ఎక్కువైంది. దయ ధర్మాన్ని మరిచాడు. ఇతరులను ఎవ్వరినీ లెక్కచేయడు. అందరూ తన మాటను గౌరవించి వారికి తలవంచాల్సిందే. వారి క్రింద పనిచేసేవారు బ్రతుకు తెరువుకోసం వారి దాసోహం పలుకుతారు. కాదంటే వారికి మనుగడ వుండదు.


కానీ... నేను అక్క... అమ్మ... వారి పెద్దరికాన్ని గౌరవించి, వారి మాటలను వింటూ తలలు దించుకొంటున్నామంటే, దానికి కారణం వారిమీద అభిమానం గౌరవం కాదు, వారు పెద్దవారైనందున వారిని ఎదిరించడం న్యాయం కాదనేదే కారణం. మామయ్య, నాన్నగారు తూర్పు పడమరలుగా వున్నారు. ఆ రెండు దిశలు కలవవు. కలవని దిశల్లో వున్న నేను, శార్వరి కలసి ఒకటై జీవితాన్ని సాగించడం అసాధ్యం. నేను మగవాణ్ణి దేనికైనా తెగించగలను. కానీ శార్వరి ఆడపిల్ల. తనకు తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం... ప్రేమ. ఆ ప్రేమ ముందు నాకు తనపై వున్న ప్రేమ ఓడిపోవలసిందే!... గెలవదు... 


బెదిరించి, బలత్కారించి శార్వరి ప్రేమను పొందాలనుకోవడం అవివేకం. అలాంటి ప్రయత్నాలు చేస్తే అవి నాలోని స్వార్థానికి నిదర్శనాలవుతాయి. ఆ లక్షణాలను ఎవ్వరూ మెచ్చరు. మనిషైనవాడు తన చర్యలను పదిమంది మెచ్చేరీతిగా ప్రవర్తించాలి. అది మానవత్వం అవుతుంది. స్వార్థ అమానుషత్వానికి నిదర్శం. నేను మంచి మనిషిగా బ్రతకాలి. మంచిపేరును సంపాదించుకోవాలి. 


నాకు శార్వరిపై వున్నప్రేమ నిజమైన ప్రేమ అయితే నేను ఆమె అభిప్రాయాన్ని ఆమోదించాలి, గౌరవించాలి. అప్పుడే నా ప్రేమ వ్యామోహం కాకుండా నిజమైన ప్రేమ అవుతుంది. మామయ్య చెప్పిన ప్రతి అక్షరం సత్యం. వారు నామేలు కోరి ఆ విధంగా చెప్పారు. వారి మాటలను పాటించాలి. ధ్యాసను చదువుపై లగ్నం చేయాలి. మంచి ఫలితాన్ని సాధించాలి’ అనుకొన్నాడు సీతాపతి.

రాములు వీధి మలుపులో కారు ఆపాడు.


"సీతయ్యబాబూ!.... మన ఇంటి దగ్గరకు వచ్చేశాము!"

ఆ పిలుపు విని తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు సీతాపతి. డోర్ తెరుచుకొని కారు దిగాడు.

"థాంక్యూ రాములన్న!"

"మంచిది బాబు!" చిరునవ్వుతో చెప్పాడు రాములు.

సీతాపతి తన ఇంటివైపుకు నడిచాడు. రాములు కారును ఫ్యాక్టరీ వైపుకు త్రిప్పాడు.

పరంజ్యోతి... ప్రజాపతి స్నేహితుడు. పాతిక సంవత్సరాల క్రిందట తన సోదరి లావణ్యను పరంజ్యోతికి ఇచ్చి వివాహం జరిపించాలనే నిర్ణయంతో వున్న ప్రజాపతి... తండ్రి కైలాసపతి నిర్ణయం వేరుగా వున్నందున.... వారిని ఎదిరించలేక తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక మౌనంగా వుండిపోవలసి వచ్చింది.


ప్రస్తుతంలో... పరంజ్యోతి కుమారుడు దివాక్ర్‍కు తన కూతురు దీప్తిని ఇచ్చి వివాహం చేయాలనేది అతని సంకల్పం. దివాకర్ చెన్నైలో చదివి, అమెరికా వెళ్ళి, నాలుగేళ్ళు అక్కడ పనిచేసి, ఎం.ఎస్ పూర్తిచేసి, చెన్నైకి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాడు.


పరంజ్యోతి హోటల్ వ్యాపారి. ప్రజాపతికి ఒకే కూతురని, ఎంతో ఆస్తి వుందని, దివాకర్‍కు దీప్తితో వివాహం జరిపిస్తే ప్రజాపతి ఆస్తిలో సగభాగం తన కొడుక్కి సంక్రమిస్తుందనే ఆశతో ప్రజాపతికి ఫోన్ చేశాడు.

"హలో!..."

"ఎవరూ!..." ప్రజాపతి మాటలు.


"నేనురా!... పరంజ్యోతిని... ఎలా వున్నావురా!" నవ్వుతూ అడిగాడు.

"ఓ!... పరం నీవా!... బాగున్నానురా!... నీవెలా వున్నావ్!..." అడిగాడు ప్రజాపతి.

"ఆఁ... బాగున్నానురా!... నిన్ను ఒకమాట అడగాలని ఫోన్ చేశాను" అన్నాడు పరంజ్యోతి.

"చెప్పరా!... విషయం ఏమిటో!...."


"మరేం లేదురా!... నేను మీ ఇంటికి అల్లుడికి కాలేకపోయాను. నా కొడుకు దివాకర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి వివాహం చేయాలని నిర్ణయించుకొన్నాను. నీవు నీ కూతురు దీప్తిని నా కోడలుగా చేయగలవా!..." అడిగాడు పరంజ్యోతి. 

ప్రజాపతి ముఖంలో పున్నమి వెన్నెల విరిసింది. తన నిర్ణయాన్ని... తన హితుని నోట విన్నందుకు... పరమానందంతో.


"ఒరే!... పరం... నీవు అడగడం... నేను కాదనడమా!... చూడు నా కూతురు దీప్తి నీ కోడలేరా!. నేను చెన్నైకి వచ్చి మిమ్మల్ని మావూరికి వచ్చి... మా అమ్మాయిని చూచుకొనేదానికి పిలుస్తానురా!" ఆనందంగా చెప్పాడు ప్రజాపతి.


"ఒరే ప్రజా!... నన్ను పిలిచేదానికి నీవు చెన్నై రావాలా! నాకు నీమాట చాలు. నీవు రావాల్సిన అవసరం లేదు. నీవు నాకు ఎవరు? నా ప్రియమిత్రుడివి... మంచిరోజు చూచుకొని నేను మీ చెల్లెలు, దివాకర్ గూడూరు వస్తామురా! ఎప్పుడు వచ్చేదీ త్వరలో ఫోన్ చేస్తాను. సరేనా!" అన్నాడు పరంజ్యోతి. 


"ఒరే! పరం!చాలా చాలా సంతోషంరా!" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు ప్రజాపతి.

ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చిన సీతాపతి... తండ్రి గదిలో ప్రవేశించబోయి ఆగి... వారు ఫోన్‍లో చేసిన సంభాషణనంతా విన్నాడు. వంటగదిని సమీపించి లోనికి చూచాడు.


తల్లి ప్రణవి సలహాలతో దీప్తి వంట చేస్తుంది. ప్రజాపతి దీప్తి విషయంలో తీసుకొన్న నిర్ణయం సీతపతికి నచ్చలేదు. తన అక్క వివాహం ఈశ్వర్‍తో జరగాలని, తన తండ్రి చేసిన తప్పు కారణం శతృత్వంతో విడిపోయిన వారి రెండు కుటుంబాలు తిరిగి కలవాలని, అందరూ పూర్వంలా ఆనందంగా వుండాలని సీతాపతి అభిలాష. తన తండ్రి తత్వం మారదని అతనికి తెలుసు. కానీ తన సంకల్పం నెరవేరాలని, దానికి తగిన అవకాశాలను, తన తండ్రి తత్వంలో మార్పును కలిగించాలని తన ఇష్టదైవం షిర్డీసాయి బాబాను తలచుకొని మనస్సున తన కోర్కె నెరవేరాలని కోరుకొన్నాడు.


ద్వారం వద్ద నిలబడి కళ్ళు మూసుకుని వున్న సీతాపతిని ప్రణవి చూచింది.

"సీతా!... ఏరా అలా నిలబడిపోయావ్!" అతన్ని సమీపించి తట్టి అడిగింది ప్రణవి.


"అమ్మా!.... నీకు రెండు విషయాలు చెప్పాలి."


"చెప్పు నాన్నా!"


"మొదటిది... నాన్నగారు అక్క వివాహాన్ని తన స్నేహితుడు పరంజ్యోతిగారి కొడుకు డాక్టర్ దివాక్ర్‍తో జరిపించే దానికి పరంజ్యోతితో మాట్లాడారు. అక్క వివాహం అతనితో జరుగకూడదు. ఆమె వివాహం ఈశ్వర్ బావతోనే జరగాలి. అక్కకు బావంటే ఎంతో ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు. నీకూ ఇష్టమేగా!..."


స్టవ్ అరుగు వైపు ముఖం మళ్ళించి వున్న దీప్తి వెనక్కి తిరిగి చూచింది.

"ఏందిరా సీతా నీవు అన్నది!..." ఆశ్చర్యంతో అడిగింది.


"నేను అమ్మకు చెప్పింది నిజం."

ప్రణవి ఆశ్చర్యంతో కొడుకు కూతురు ముఖాల్లోకి చూచింది. 


"సీతా!.... గబగబా నీవు అన్న మాటల్లో నాకు ఒక్క ముక్కా అర్థం కాలేదురా!.... కాస్త నిదనంగా వివరంగా చెప్పరా!..."

"అమ్మా నేను అచ్చతెలుగులోనే చెప్పాను. మళ్ళా చెబుతున్నాను జాగ్రత్తగా విను. తమ పతిదేవుడు అక్క వివాహాన్ని తన స్నేహితుడు పరంజ్యోతి కొడుకు దివాకర్‍తో జరిపించాలని నిర్ణయించుకొన్నారు. వారిని పిల్లను చూచుకొనేదానికి కూడా రమ్మన్నారు. ఇప్పుడు అర్థమయిందా!" కాస్త చిరాకుగానే చెప్పాడు సీతాపతి.


"ఏందిరా నీవన్నది!" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి అడిగింది ప్రణవి.

"నేను చెప్పింది యదార్థం అమ్మా!..."

దీప్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో కోపం. వేగంగా తండ్రిగారు వున్న గదివైపుకు రెండు అడుగులు వేసింది. ప్రణవి ఆమె చేతిని పట్టుకొని ఆపింది.


"దీపూ!... మీ నాన్న పరమ మూర్ఖుడు. ఇప్పుడు నీవు పోయి ఆ విషయాన్ని గురించి మాట్లాడితే నీ ఢిల్లీ ప్రయాణం సాగదు. ఈనాడు కాకపోయిన ఒకనాడు ఆ విషయాన్ని వారుగా మనతో చెప్పాలిగా!... వారు మాట ఇస్తే... నీ వివాహం ఆ దివాకర్‍తో అయిపోతుందా!.... మధ్య నేనున్నానుగా!.... ఆవేశపడకు. వారికైవారు ఆ విషయాన్ని మనతో చెప్పనీ. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వారి పగటి కలలు కల్లల్లే అవుతాయి. నా మాట నమ్ము"


దీప్తి ఆగిపోయి తల్లి ముఖంలోకి దీనంగా చూచింది.

"నా జీవితానికి సంబంధించిన నా వివాహ విషయంలో నా అభిప్రాయం వారికి అక్కరలేదా అమ్మా!.."

"ఎందుకే తల్లీ!... బాధపడతావ్. నీ ఈ తల్లికి నీ మనస్సులో ఏముందో తెలుసు. నీ కోర్కె తప్పక నెరవేరుతుంది" నవ్వుతూ చెప్పింది ప్రణవి.


"అక్కా!... అమ్మ చెప్పిన మాట జరిగి తీరుతుంది. నీకు అండగా ఈ నీ తమ్ముడు వున్నాడు. అమ్మ వుండగా నీవు బాధపడకక్కా. ఈశ్వర్ బావే నాకు కాబోయే బావ!!!... జరుగబోయేది అదే!!!" నవ్వాడు సీతాపతి.


తల్లి సోదరుడు ముఖాల్లోకి చూచి ఆనందంగా నవ్వి, సిగ్గుతో తలదించుకొంది దీప్తి.

"అక్కా!... బావ గుర్తుకు వచ్చాడా!" కొంటెగా కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ అడిగాడు సీతాపతి.

అందంగా నవ్వి కుకీంగ్ ప్లాట్‍ఫామ్ వైపుకు నడిచింది దీప్తి.


"రెండో విషయం ఏమిటి నాన్నా!" ఆప్యాయంగా అడిగింది ప్రణవి.

"అది నా స్వవిషయం... భవిష్యత్తుకు సంబంధించింది అమ్మా!..."

"అదేంటో నాకు తెలుసురా!... కష్టపడి చదివి ప్రయోజకుడిగా మారు. నీ ఆశయమూ తప్పక నెరవేరుతుంది" అంది ప్రణవి.


బానట్లో వంకాయ ముక్కలు వేసి వెనుతిరిగిన దీప్తి...

"సోదరా! ఏమిటి నీ ఆశయం... అమెరికా వెళ్లాలని ఉందా!..."

"వాడిని నేను అమెరికా పంపనే... బి.టెక్, ఎం.టెక్ మన దేశంలోనే పూర్తిచేస్తాడు."


"అమ్మా!... నీవు చెప్పిన మాటలకు, వాడికి నీవు ఇచ్చిన దీవెనకు సంబంధం లేనట్లుందే ఏమిటి విషయం! నాకు చెప్పకుండా దాస్తావా!... అది నీకు న్యాయమా తల్లీ!"

"వాడి చదువు పూర్తి కానీవే... అప్పుడు చెబుతాను" నవ్వింది ప్రణవి.

"అమ్మా!... నేను రేపు వైజాగ్ బయలుదేరుతాను. పరీక్షలు దగ్గరకొచ్చాయి. బాగా చదవాలి. గోల్డ్ మెడల్ సాధించాలి...:"


"అలాగే నాన్నా!..."

సీతాపతి స్నేహితుడు ప్రణవ్ వరండాలో ప్రవేశించాడు.

"సీతాపతి!..." పిలిచాడు.

అతని పిలుపు విని సీతాపతి వరండా వైపుకు నడిచాడు. ఆ ఇరువురికి మాధవయ్య ఎదురైనాడు.

"సీతా!... నాన్నగారున్నారా!"


"ఆఁ.... దండిగా వున్నారు" నవ్వాడు సీతాపతి.


సీతాపతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూచిన... మాధవయ్య ప్రజాపతి ఆఫీస్ గదివైపుకు నడిచాడు. మిత్రులిరువురూ వీధిలో ప్రవేశించారు.


మాధవయ్యను చూచిన ప్రజాపతి... నవ్వుతూ... "రారా!.. మాధవా రా!... కూర్చో!" అన్నాడు.

"ఏరా ప్రజా!... ఆగమేఘాల మీద రమ్మన్నావ్!... ఏమిటి విషయం!...." చేతిలోని సెల్‍ను చూపుతూ... "ఇది ఎంత ఉపయోగమో ఒక్కోసారి అంత బాధాతరంగా వుందిరా. రాత్రి పదిగంటలప్పుడు ఊడిపోయింది... జారిపోయింది అని ఫోన్ కాల్స్... దీన్ని తీసికొన్నప్పటి నుంచీ సరిగా నిద్రకు నోచుకోలేదనుకో!..." సెల్‍ను చూస్తూ విరక్తిగా చెప్పాడు మాధవయ్య.


"ఒక ముఖ్యమైన విషయం. అందుకే వెంటనే రమ్మన్నాను" చిరునవ్వుతో చెప్పాడు ప్రజాపతి.

"ఏమిట్రా ఆ అతిముఖ్యమైన విషయం?..."

"మన దీపూ వివాహం."

"వరుడు ఎవరు?"

"ఊహించు."

"మన ఈశ్వరేనా!"

"ఛీ.. నీ నోట్లో ఎండ్రిన్ పోయాలిరా!"


"ఎండ్రిన్ అతి ప్రమాదకరమైనదిరా... చచ్చిపోతాను."

"మరోసారి వాడిపేరు ఎత్తావో... నిజంగా నీ గొంతులో ఎండ్రిన్ పోసి చంపుతాను" కసిగా చెప్పాడు ప్రజాపతి.


"సోదరా!... తప్పు... తప్పు..." చెంపలేసుకొంటూ "క్షమించు" అన్నాడు మాధవయ్య.

"వరుడు ఎవరో నీవు చెప్పలేవా!"

"చెప్పలేనురా!... నీవే చెప్పు... నేను వింటాను" దీనంగా అన్నాడు మాధవయ్య.

"నా మిత్రుడు పరంజ్యోతి కుమారుడు డాక్టర్ దివాకర్. వాడికై వాడు నాకు ఫోన్ చేసి నా కూతురిని అడిగాడు రా!.. దీపు చాలా అదృష్టవంతురాలు కదూ!..."


మాధవయ్య విచారంగా ప్రజాపతి ముఖంలోకి చూచాడు.

"ఏరా అలా చూస్తున్నావ్!..." సందేహంతో మాధవయ్య ముఖంలోకి చూచాడు ప్రజాపతి.


"నీ తండ్రి నీ చెల్లెలికి వ్రాసి ఇచ్చిన ఆస్తిని తిరిగి నీవు స్వాధీనం చేసుకోవాలని, ఇంకా చదువు పూర్తికాని సీతాపతికి నీ మేనకోడలు శార్వరిని చేసుకోవాలని నన్ను ఆ ఇంటికి రాయబారం పంపావు. నీ చెల్లెలు లావణ్య నన్ను బాగా సత్కరించి వెళ్ళిపొమ్మంది. ఆ సంఘటన నాకు నీకు అవమానకరమే...! ఈ జన్మలో నేను మరచిపోలేను. ఇప్పుడు దీప్తి వివాహ విషయంలో నీ స్వనిర్ణయంతో... ఆమె వివాహం ఆ దివాకర్‍తో చేయాలనుకోవడం అంత ఉచితం కాదని నా అభిప్రాయం. కారణం మన దీప్తి కూడా డాక్టర్. బాగా చదువుకొని మంచి లోకజ్ఞానం కల అమ్మాయి. ఆమె వివాహం ఆమె ఇష్టానుసారం చేయడం నీకు గౌరవప్రదం. కాదని నీ నిర్ణయంతో చేయాలనుకొంటే... నాడు నేను లావణ్య ఎదుట ఎలా అవమానం పాలయ్యానో... రేపు నీవు దీప్తి ఎదుట అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని నా ఆత్మ ఘోషిస్తూ ఉంది.


పెండ్లి అనేది నూరేళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసికొంటే వారి వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆనందంగా ఉంటుంది. మనం పెద్దవాళ్లం కదా అని వాళ్ళ ఇష్టా అయిష్టాలను తెలిసికోకుండా మన ఇష్టానుసారంగా బలవంతపు వివాహాన్ని జరిపిస్తే... వింటున్నాము.... చూస్తున్నాముగా... మూడు మాసాల లోపలే విడిపోయి విడాకులు కోరిన జంటలు నేటి సమాజంలో ఎన్నో!!! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొంటే ప్రయోజనం ఉండదని నీకూ తెలుసు. కనుక... దీప్తి వివాహం విషయంలో ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని... ఆమె కోరిన వ్యక్తితో ఆమె వివాహాన్ని జరిపిస్తే నీకు గౌరవం, ఆమెకు ఆనందం లభిస్తాయ్.


నీకంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి. అందరూ బాగుండాలని కోరుకునేవాణ్ణి. సదా మీ మేలు కోరేవాణ్ణి. ఆవేశంతో నిర్ణయం తీసుకోకు. నీ అర్థాంగిని... నీ కూతురును సంప్రదించు. వారి అభిప్రాయాలను తెలుసుకో. అప్పుడు  ఓ నిర్ణయానికి రా. వాకిట్లో పెద్దమనుషులు కూర్చొని వున్నారు. ఓ జంటకు వివాహ ముహూర్తాన్ని నిర్ణయించి లగ్నపత్రిక వ్రాసి ఇవ్వాలి. నేను బయలుదేరుతున్నా!" కుర్చీ నుంచి లేచి మాధవయ్య గదినుంచి బయటికి నడిచాడు.

మాధవయ్య మాటలు ప్రజాపతి గాలి మేడలను కూల్చి వేశాయి. అతనికి మీద మనస్సున ఎంతో ఆగ్రహం కలిగింది. మనస్సులో సందేహం!....


దీప్తి.... దివాకర్‍ను వివాహం చేసుకొనేటందుకు తనమాట ప్రకారం ఒప్పుకొంటుందా!... కాదని అంటుందా!...


అర్థాంగి... ప్రణవి తన మాటలను సమర్థిస్తుందా... లేక కూతురు మాటలకు తలాడిస్తుందా!...

తనయుడు సీతాపతి... తన నిర్ణయాన్ని మెచ్చుకొంటాడా!... వ్యతిరేకిస్తాడా!....


తన నిర్ణయాన్ని విన్న హరికృష్ణ... లావణ్య... ఈశ్వర్ ఎలాంటి భావాలకు లోనౌతారు?..అన్నీ ప్రశ్నలే!.... జవాబుల కోసం ఆలోచన.. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకొన్నాడు ప్రజాపతి.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

51 views0 comments

Comments


bottom of page