'Atavika Nyayam' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy
Published In manatelugukathalu.com On 02/01/2024
'ఆటవిక న్యాయం' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ రోజు యస్సై రవి ప్రకాష్ స్టేషన్‌కి రాగానే ఇద్దరు వ్యక్తులు వచ్చి "సార్! మేము హర్షవర్ధన్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాము. మా కాంట్రాక్టర్ గారి అబ్బాయి రమేష్‌ని నిన్న రాత్రి ఎవరో చంపేసారు. వాళ్ళెవరో మీరు కనుక్కోవాలి" అంటూ అతనికి ఒక దరఖాస్తు ఇచ్చారు. రవి ఆ ఫిర్యాదు పూర్తిగా చదివి దాన్ని టేబుల్ మీద పెట్టాడు. ఆ తరువాత వాళ్ళిద్దర్నీ ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
"మీ కాంట్రాక్టర్ ఎవరు? ఇక్కడ ఏ పని చేస్తున్నాడు?"
"సార్; మా కాంట్రాక్టర్ పేరు హర్షవర్ధన్ రావు గారు..... అతను ఇక్కడికి దగ్గర్లోని పద్మావతీ నది మీద కడుతున్న ఆనకట్ట పనులు చేస్తున్నారు; అతని కొడుకు రమేష్ అదే కంపెనీలో డైరెక్టర్. ఆ ఆనకట్ట పనులు చూస్తూ ఉంటాడు. మేమిద్దరం ఆ కంపెనీలో సూపర్‌వైజర్లం. అతను నిన్న ఉదయం ఆనకట్ట ప్రాంతానికి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో మేము అతని కోసం వెతుకున్నప్పుడు ఈ ఉదయం సింగన్న కొండ పక్కన ఉన్న చెట్లదగ్గర అతని శవం కనిపించింది. వెంటనే మీకు ఫిర్యాదు చెయ్యడానికి ఇక్కడికి వచ్చాము" అని చెప్పాడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.
"అతని కెవరైనా శత్రువులున్నారా? ఆ రమేష్ ఎక్కడ ఉంటాడు?"
"సార్; మాకు తెలిసి అతనికి శత్రువులెవరూ లేరు. ఆ రమేష్ గారు విశాఖపట్నంలో ఉంటూ వారానికి రెండురోజులు ఆనకట్ట పనులు చూడటానికి వస్తుంటారు" అని చెప్పాడా వ్యక్తి.
"అతనెప్పుడు ఇక్కడికి వచ్చాడు?"
"సర్! నాలుగు రోజులు క్రితం వచ్చాడు. మళ్ళీ రేపు తిరిగి వెళ్ళేవాడు; ఈలోగా ఇది జరిగింది;" అని చెప్పాడతను.
సరే! మీరు వెళ్లి హత్య జరిగిన ప్రదేశంలో వుండండి; మేము అరగంటలో వస్తాము" అని రవి ప్రకాష్ చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ తరువాత కానిస్టేబుల్ అప్పారావుని తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రదేశానికి మోటార్ సైకిల్ మీద బయలు దేరాడు రవిప్రకాష్ ; ఆ పోలీస్ స్టేషన్‌కి ఆ ఆనకట్ట ప్రాంతం ఐదు కిలోమీటర్లు ఉంటుంది..... రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రదేశానికి చేరేసరికి అరంటకు పైగా పట్టింది. ఆనకట్ట కడుతున్న ప్రాంతం కొండల మధ్యన ఉంది. దూరంగా నది మీద కడుతున్న ఆనకట్ట కనిపిస్తోంది.
వాళ్ళ మోటర్ సైకిల్ని చూసి ఇందాక స్టేషనుకి వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఎదురొచ్చి హత్య జరిగిన ప్రాంతానికి వాళ్ళిద్దర్నీ తీసకెళ్ళారు.
హత్య జరిగిన ప్రాంతం కొండ వాలులో ఉంది. హతుడు రమేష్ శవం రోడ్డు పక్కన మర్రిచెట్టు కింద పెద్ద బండరాయి మీద వుంది; హతుడు ముఖం మీద రక్తం! బట్టలు నిండా రక్తపుమరకలు. శవం రాతిమీద బోర్లా పడి ఉంది. అతని జేబులో పిస్టల్ వుంది;ఎవరో తోసివేస్తే ముఖం రాయికి కొట్టు కొని పెద్ద గాయం అయి ఉంటుందని రవి ఊహించాడు. రమేష్ శవానికి కానిస్టేబుల్ అప్పారావు అన్ని కోణాల్లో ఫోటోలు తీసాడు.
"అప్పారావు! శవాన్ని హాస్పిటల్‌కి పోస్ట్ మార్టమ్ కోసం పంపాలి. ఆ రిపోర్ట్ ఈ కేసు విచారణకు చాలా ముఖ్యం" అని చెప్పేడు రవి.
ఆ తరువాత ఆనకట్ట దగ్గరున్న కాంట్రాక్టర్ ఆఫీసుకి వెళ్ళాడు రవి. వెంటనే మేనేజరు బయటకు వచ్చి అతన్ని తన ఆఫీసులోకి తీసికెళ్ళాడు.
"మీకెవ్వరి మీదైనా అనుమానం ఉందా?" అని అతన్ని అడిగాడు.
"లేదు సార్; ఈ నెలలో ఇప్పటికి రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. అతనికెవ్వరితోను గొడవల్లేవు..... నిన్న సైటుకి వెళ్ళి రాత్రి 8 గంటల దాకా పనులన్నీ చూసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఇది జరిగింది" అన్నాడతను కళ్ళు తుడుచుకుంటూ.
"రమేష్ తండ్రి గారు ఎక్కడున్నారు? అతనికీ విషయం తెలిసిందా?"
"సార్; తెల్లవారి మాకు ఈ విషయం తెలియగానే అతనికిఫోను చేసి చెప్పాము;. అతను బయలుదేరాడు. ఇంకో గంటలో వచ్చేస్తాడు;" అని చెప్పాడు మేనేజర్.
"సరే! అతని బాడీని పోస్ట్‌మార్టంకి పంపిస్తున్నాను, ఆ తరువాత మీకు బాడీని అప్పచెబుతాము" అని చెప్పాడు రవి.
ఆ తరువాత ఆఫీసులో ఒకతన్ని తీసుకొని ఆనకట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న కూలీలను నిన్నసైటు లో ఏమైనా గొడవలు జరిగాయా అని అడిగాడు.
వాళ్ళంతా రమేష్ సైటుకి వచ్చి సాయంత్రం దాకా వుండి ఆ తరువాత వెళ్ళిపోయాడనీ, ఏ విధమైన గొడవలు జరగలేదనీ చెప్పడంతో తిరిగి స్టేషన్‌కి వచ్చేసాడు ఎస్సై రవిప్రకాష్;
ఆ మర్నాడు పోస్ట్‌మార్టెమ్ రిపోర్ట్ వచ్చింది. తలమీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల రక్తం బాగా పోయి అతను చనిపోయాడని అందులో వ్రాయ బడింది. అది చూసిన తరువాత ఎస్సై రవికి ఎన్నో సందేహాలు కలిగాయి.
ఒకవేళ ప్రమాదం జరిగి అతను జీపులోంచి పడ్డప్పుడు రాయి మీద పడి తలకి బాగా దెబ్బ తగలడం వల్ల చనిపోయాడనుకుంటే మరి దూరంగా పడి వున్న చిన్న రాయికి రక్తం ఎందుకు అంటుకొని వుంది అన్న సందేహం వచ్చింది రవికి; అలాగే అతనికి శత్రువులు ఎవ్వరూ లేకపోతే పిస్టల్ ఎందుకు అతను తీసికెళ్ళాడు? ఒకవేళ ఎవరైనా కక్షకట్టి చంపారనుకుంటే హత్యా స్థలంలో ఏ విధమైన ఆధారాలు దొరకలేదు.
మధ్యాహ్నం మళ్ళీ కానిస్టేబుల్‌ని తీసుకొని హత్యాప్రదేశానికి వెళ్ళి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆ ప్రాంతాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించేడు కానీ ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. ఆ తరువాత ఆనకట్ట ప్రాంతంలోని చాలామంది కూలీలను, మేస్త్రీలను హత్య గురించి ప్రశ్నించాడు కానీ వాళ్ళెవరూ సరియైన సమాధానాలు ఇవ్వలేదు..
ఇక చేసేదేంలేక తిరిగి వస్తున్నప్పుడు దార్లో ఒక వ్యక్తి అతన్ని గట్టిగా పిలిచి ఆగమని సైగ చేసాడు. రవి ఆశ్చర్యపోతూ బైకుని రోడ్డు పక్కన ఆపాడు.
కొద్దిసేపటికి అతను దగ్గరికి వచ్చి "నమస్కారం బాబూ! నా పేరు లచ్చన్న. ఈ ఆనకట్ట దగ్గర మేస్త్రీని. మాది రావికోన గిరిజన గ్రామం. ఈ పక్కనే ఉంది. మా కాంట్రాక్టరు బాబు రమేష్ గోరిని పులి కొట్టేసుంటాది. అందుకే సచ్చిపోనాడు. మొన్న మా ఊరి మారీచు గోడి కూతురు సెంద్రిని " కూడా పులి సంపేసింది; ఈ అడవిలో పదిరోజుల్నుంచీ మూడు పులులు తిరుగుతునాయి" అని చెప్పాడు.
అతని మాటలకు రవి ఆశ్చర్యపోయి "మీ ఊళ్ళో పిల్లని పులి చంపేసిందా? మరి మాకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదు. మీ ఊరు ఎక్కడుంది?" అని అడిగాడు.
"బాబూ! ఆ కొండ పక్క సూడండి, ఆ ఇల్లు కనిపిత్తున్నాయే; అదే మా ఊరు" అని చెప్పి వెళ్ళిపోయాడు లచ్చన్న.
ఆమర్నాడు రవి వంటరిగా బైకు మీద రావికోన ఊరికి వెళ్ళాడు. అది కొండల్లో ఉన్న గిరిజన గ్రామం. పోలీసు దుస్తులో వస్తున్న రవిని చూసి ఆ గ్రామంలోని వారంతా భయంతో గుసగుసలాడుకోసాగారు.
అది గిరిజన తండా కావడం వల్ల ఇళ్ళన్నీ అక్కడక్కడ విసిరేసినట్లున్నాయి. చెట్ల కింద చాలామంది మంచాలు వేసి పడుకొని కనిపిస్తున్నారు. కొందరు పిల్లలు బిళ్లా, కర్రా ఆడుతూ కనిపించారు.
రవి ఊరికి మధ్యలో ఉన్న చింతచెట్టు కింద బండినాపాడు. ఇంతలో అతని దగ్గరికి నల్లగా పొట్టిగా వున్నఒక వ్యక్తి వచ్చాడు.
"బాబూ! నా పేరు గంతన్నదొర. ఈ వూరి సర్పంచుని " అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంతలో మరో ముగ్గురు వచ్చి ఒక కుర్చీని చెట్టు కింద వేసారు. రవి దాన్లో కూర్చొని, "గంతన్నా! మొన్న మీ ఊళ్ళో ఎవరో అమ్మాయిని పులి సంపేసిందిట; నిజమేనా?" అని అడిగాడు.
ఆ మాట వినగానే అతని ముఖంలో రంగులు మారడాన్ని రవి గమనించాడు. కొద్దిసేపు మౌనం వహించి అతను "అవును బాబు; మా తమ్ముడు మారీచు గోడి కూతరు సెంద్రిని సంపేసినాది;" అని చెప్పాడు.
"మరి మాకెందుకు చెప్పలేదు..... చెప్పకుండా శవాన్ని దహనం చెయ్యడం తప్పు కాదా?..... అయినా ఆ అమ్మాయిని పులే చంపిందని మీకెలా తెలుసు" అని అడిగాడు.
"బాబూ! మొన్న మా ఊరోళ్ళు దాన్ని సంపేసిన దగ్గర పులిని చూసినారు బాబూ..... అందుకే అదే సంపేసి ఉంటుందని అనుకుంతన్నాము; పులి సంపేసింది కాబట్టి కాబట్టి తమకి సెప్పనేదు" అని చెప్పాడు గంతన్న.
"సరే! నాకు ఆ అమ్మాయిని ఆ పులి ఎక్కడ చంపిందో చూపిస్తారా?" అని అడిగాడు సర్పంచుని.
ఆ తరువాత సర్పంచ్ గంతన్న దొరతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దారి చూపిస్తుంటే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు రవి. వాళ్ళ ఊరికి దూరంగా ఉన్న గుట్ట దగ్గర పారుతున్న గెడ్డ దగ్గరికి తీసికెళ్ళి దీని ఒడ్డున ఉన్న పెద్దరాయిని చూపించి" బాబూ; ఈ బండరాయి దగ్గరే సంపేసినాది" అని చెప్పారు.
రవి వెంటనే ఆ ప్రాంతం అంతా చూసాడు. ఎక్కడా రక్తపు మరకలు కనిపించలేదు. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పాడు.
"బాబూ! అది పంజాతో గట్టిగా కొట్టింది. కానీ అలికిడవగానే పారిపోనాది; అందుకే రకతం కనిపించనేదు..... ఆ భయంతోనే అది సనిపోనాది" అని చెప్పాడు సర్పంచ్ గంతన్న.
"గంతన్న దొరా! ఊళ్ళో ఎవరైన ప్రమాదంలోనో, జంతువులవల్లో, గొడవల వల్లో చనిపోతే మీరు పోలీసులకు చెప్పాలి..... లేకపోతే అది చట్టరీత్యా నేరం అవుతుంది; చట్టప్రకారం నువ్వు మాకు తెలియపరచలేదు కాబట్టి నీ మీద కేసు పెట్టాలి..... ఇంకెప్పుడూ అలా చెయ్యొద్దు" అని చెప్పాడు రవి.
"బాబూ! మా గూడేపోళ్ళు పులిసంపేసిందని సెప్పడంతో మీకు సెప్పనేదు. ఈ పాలికి ఒగ్గేయండి. ఇంకెప్పుడూ మీకు సెప్పకుండా ఉండను" అని భయంగా చెప్పాడు గంతన్న.
ఆ తరువాత ఎస్సై రవి రెండు రోజుల పాటు చుట్టుపక్కల గిరిజన గ్రామాలలో పర్యటించి ఆధారాల కోసం ప్రయత్నించాడు కానీ ఏ ఆధారాలు దొరకలేదు.
హతుడు రమేష్ ఫోన్ కాల్ లిస్టులను తెప్పించి చూసాడు కానీ వాటిలో కూడా ఏవిధమైన `క్లూ` లు దొరకలేదు.
ఇంతలో రమేష్ తండ్రి హర్షవర్ధన్ రావు జిల్లా ఎస్పీ, హోం మినిస్టర్ ద్వారా నిందుతులను త్వరగా పట్టుకోవాలనీ, లేకపోతే తాను ఆనకట్ట పనులు ఆపివేస్తానని బెదిరించాడు. దాంతో రవి మీద ఎస్పీగారి వత్తిడి ఎక్కువైంది. ఈ హత్య గురించి అన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా, వార్తా ఛానళ్ళు రోజూ ప్రచురించి ప్రసారం చెయ్యడం మొదలు పెట్టడంతో ఎస్సై రవి కి ఏమిచేయాలో అర్ధం కాలేదు; అతనికి తోడుగా జిల్లా నుంచి ఒక క్లూస్ టీమ్ వచ్చి వారం రోజుల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించినా రమేష్ హత్యకు ఏవిధమైన ఆధారాలు దొరకలేదు.
దీంతో ఆ కేసులో చిక్కుముడులు విడలేదు. దాన్ని అనుమానిత హత్యగా రిజిస్టర్ చేసి దర్యాప్తుని కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. పదిరోజుల తరువాత ఎస్పీగారు రవి పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఈ కేసు పురోగతిని సమీక్షించాడు. అందులో ఆ కేసుని పరిశోధించిన క్లూస్ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.....
ఆ సమీక్షలో ఎస్సై రవి "సార్! ఈ కేసుని అన్ని వైపుల నుంచి పరిశోధించాము. వందల మంది సాక్షులను ప్రశ్నించాము. హత్యా స్థలంలో ఏ విధమైన సాక్ష్యాలు దొరకలేదు. బహుశ హతుడు మద్యం తాగి జీపు నడపటం వల్ల అది అదుపు తప్పి బండరాయికి గుద్దు కొని ప్రమాదానికి గురై ఉంటుంది. ఆ ప్రమాదంలో అతను పెద్ద బండరాయి మీద పడటం వల్ల తలకి దెబ్బ తగిలి చనిపోయి ఉంటాడనిపిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు లో కూడా అతను మద్యం సేవించి ఉన్నాడనీ, తలకి బాగా దెబ్బ తగలడం వల్ల గుండెకు రక్త సరఫరా ఆగి చనిపోయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అయింది కాబట్టి హతుడు ప్రమాదంలో చనిపోయి ఉంటాడు; ఆ విధంగా ఈ కేసుని ముగించేస్తే మంచిది;" అని చెప్పాడు.
ఎస్పీ గారు కూడా అతని వాదనలతో ఏకీభవించి ఆ విధంగా కేసుని క్లోజ్ చెయ్యమని చెప్పడంతో ఆ సమావేశం ముగిసింది.
******* ********* **********
ఇది జరిగిన రెండు నెలల తరువాత ఒక రోజు ఎస్సై రవి డ్యూటీ ముగించుకొని వచ్చి తన క్వార్టర్ లోని బయట లాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతన్ని కలవడానికి ఓ వ్యక్తి వచ్చాడు.
అతను వస్తునే రవికి నమస్కారం పెడుతూ "దండాలు బాబూ! నా పేరు గిరిధర్ సాహూ; పదవతరగతి దాకా చదువుకొన్నాను. మాది ఆనకట్ట దగ్గర రావికోన తండా " అని చెప్పాడు;
అతని మాటలు రవికి ఆశ్చర్యం కలిగించాయి. అతన్ని ఇదివరకెక్కడో చూసినట్లు అనిపిస్తోంది. చూడటానికి అతను పాతికేళ్ళ యువకుడిలా కనిపిస్తున్నాడు. నల్లగా, పొట్టిజుట్టు, నుదుట నల్లనిబొట్టు, చేతిమీద పచ్చబొట్టుతో చూడగానే గిరిజనుడిలా కనిపిస్తున్నాడు. మెడలో నల్ల తాడుతో లాకెట్టు, చేతికి రక్ష, నల్లటి పేంటు, ఎర్రటిచొక్కా వేసుకొని చదువుకున్నవాడిలా కనిపిస్తున్నాడు.
"చెప్పు? ఏపని మీద వచ్చావు" అని అడిగాడు రవి.
"సార్; రెండు నెలల కితం కాంట్రాక్టు బాబు రమేష్ సనిపోయాడు కదా; ఆ యిసయం మాట్లాడలని వచ్చేను" అని చెప్పాడు.
`రమేష్ హత్య అనగానే` రవి ఒక్కసారిగా ఎలర్టై చెవులు రిక్కించి అతనేం చెబుతాడోనని అతని వైపు చూడసాగాడు.
"సార్! రెండు నెలల కితం రమేష్ బాబు ఆనకట్ట పనుల్ని సూడటానికి వొచ్చాడు. అక్కడ నా సెల్లి ` సెంద్రి' కూడా కూలి పని చేస్తుండేది. అది 8వ తరగతి దాకా సదువుకుంది..... కానీ చాలా అందంగా ఉండేది. అప్పుడు రమేష్ బాబు సూపు నా సెల్లి సెంద్రి మీద పడ్డాది. దానిమీద కన్నేసాడు. అది ఓరోజు సాయంత్రం పని నుండి వొచ్చి కర్రలకోసం పాండవుల గుట్ట దగ్గరికి ఎల్లినపుడు ఆ దొంగనాయాలు రమేష్ గోడు దాన్ని పాడుసేసి సంపేసినాడు. కానీ మా ఊరోల్లంతా దాన్ని పులి సంపేసిందని అనుకున్నారు; ఎందుకంటే వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఓపెద్ద పులిని మా ఊరోల్లు సూసేరు. అందుకే ఆ పులే నా సెల్లిని సంపేసిందని అనుకున్నారు;" మాట్లడుతూ కొద్దిసేపు మౌనంగా వుండి మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు.
"ఆమర్నాడు నేను మా సెల్లెలు సనిపోయిన చోటుకి ఎల్లాను. అక్కడ పక్కనే ఉన్న తుప్పల్లో ఈ లాకెట్ దొరికింది. ఇది ఎప్పుడూ ఆ రమేష్ గాడి మెడలో ఉండగా నేను ఎన్నోసార్లు సూసాను..... ఆ పక్కనే ఈ బంగారం రంగు వాచి; దీనిమీద ఆడిపేరు `రమేష్` అని వ్రాసి ఉంది. సూడండి" అంటూ ఆ లాకెట్‌నీ, వాచీని జేబులోంచి తీసి రవికిచ్చాడు.
రవి వాటి రెండింటిని ఆశ్చర్యంతో చూసాడు. ఆ వాచ్ బంగారం పూతతో ఉంది. చెయిన్ కిందన గోల్డ్ ప్లేట్ మీద రమేష్ అని వ్రాసి ఉంది. ఇక లాకెట్ బంగారు చెయిన్ కింద ఉంది. ఆ లాకెట్ లోపల రమేష్ ఫోటో ఉంది.....
"బాబూ! ఈ రెండూ దొరకడంతో ఆ రమేష్ గోడే నాసెల్లిని పాడు సేసి సంపేసినాడని నాకు తెలిసిపోనాది. కానీ ఆ యిసయం మా ఊర్లో ఎవురికీ సెప్పనేదు. మీ టేసన్లో కూడా ఫిర్యాదు సెయ్యనేదు. సేస్తే ఆడు డబ్బు ఖర్సెట్టి తప్పించుకుంటాడు. అందుకే ఆడిని నేనే సంపాలనుకున్నాను".
"ఆమర్నాడు రాత్రి ఎనిమిది గంటలపుడు ఆడు జీపులో వత్తుంటే ఆ కొండ మలుపు దగ్గర కాపు కాసి రోడ్డు కడ్డంగా నిలబడ్డాను. నేను తాగేననుకొని ఆడు జీపు దిగాడు. నేను ఎంటనే ఆడి తలమీద కర్రతో గట్టిగా కొట్టి ఆ తరువాత ఆ పక్కన ఉన్న బండరాయి మీదకు తీసుకెళ్ళి ఆడి తలను దానికి రెండుసార్లు గట్టిగా కొట్టడంతో తల పగిలి సనిపోనాడు. ఆడిని బోర్ల పడుకోపెట్టి నాకు జీపు డ్రైవింగ్ వచ్చుకాబట్టి దాన్ని తీసుకొని ఆ కొండ కిందకు తోసేసాను. అది రాయిని గుద్దుకొని పడిపోయినట్టు కిందకు జారిపోయింది. అక్కడ నా ఆనవాళ్ళు ఏటీ లేకుండా చేసుకొని ఇంటికెల్లి పోయాను. నేను అనుకున్నట్టే మీ పోలీసులకు ఏ ఆధారాలు దొరకలేదు. ఆ కేసుని మూసేసినట్లు నాకు ఈమధ్యనే తెలిసినాది" అని చెప్పాడు సాహూ.
అతని మాటలు విన్న రవికి మస్తిష్కం మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఒక సామాన్య గిరిజన యువకుడు ఈ పని చేసాడంటే అతను నమ్మలేకపోతున్నాడు.
"సాహూ! నువ్వు చేసింది తప్పు కాదా? ఏదైనా తప్పు చేస్తే శిక్షించడానికి మా పోలీసులున్నారు. మాకు చెప్పాలి కానీ నువ్వే చంపేస్తే ఎలా? ఇది చాలా తప్పు. ఈ పని చేసినందుకు నీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా..... ఉరిశిక్ష..... ఎందుకీ తప్పు చేసావు"? అని అడిగాడు రవి..
"బాబూ! మేము పేద గిరిజనులం. నాకు చట్టాలు, నాయాలు తెలియవు. ఒక వేళ మీరు సెప్పినట్లు మీకు సెబితే ఏటి సేస్తారు. ఆణ్ణి అరెట్టు సేసి ఒదిలేత్తారు. ఆడు పెద్దలాయర్లను ఎట్టుకొని డబ్బుతో వాళ్ళని అందర్ని కొనేసి కేసు నుంచి తప్పించుకుంటాడు. దాని వల్ల సనిపోయిన నా సెల్లి కేటి నాభం సెప్పండి"..
"ఆడు డబ్బు మదంతో పొగరెక్కి కామంతో నా సెల్లిని పాడు సేసాడు. ఆడు బతికుంటే నా సెల్లి ఆత్మ శాంతించదు; సచ్చి ఎక్కడుందో గాని నా సెల్లి సెంద్రి ఆత్మ శాంతించాలంటే ఆడు ఈ భూమ్మీద ఉండకూడదు. దానిలానే ఆడు సావాల; అది మీకు ఫిర్యాదు చేస్తే జరగదు. అందుకే నేను సంపేసినాను. ఇప్పుడు నన్నేటి సేసుకుంతారో సేసుకోండి; చట్టం, నేయం, ధరమం మీ సదువుకునోళ్లు మాట్లాడేవి. కానీ మేము గిరిజనులం. అడవుల్లోను, కొండల్లోను పుట్టినోళ్ళం. మాకు తెలిసేది ఒకటే; అటవీ నాయం. కన్నుకి కన్ను, పన్ను కి పన్ను; పేనానికి పేనం; అంతే ఒకళ్ళని సంపినోడికి ఈ భూమ్మీద బతికే అధికారం నేదు బాబూ; అందుకే ఆడి ఉసురు తీసేసాను;" అని దండం పెట్టి సాహూ వెళ్ళిపోతుంటే అతని వైపు ఆశ్చర్యంతో చూడసాగేడు రవి; వాడు వెళ్ళిపోయినా వాడు చెప్పిన "అటవీ నాయం; కన్నుకి కన్ను, పేనానికి పేనం" అన్న మాటలు అతని చెవిలో మారుమ్రోగసాగాయి.
వారం తరువాత ఆధారాలు దొరకని కారణంగా ఆ కేసుని క్లోజ్ చేస్తున్నట్లు ఫైల్లో రాసి ఆ కేసుని మూసివేసాడు ఎస్సై రవి ప్రకాష్..
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments