top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 14'Neti Bandhavyalu Episode 14'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 14/01/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:

హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 

ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా, బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. 

శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి. 

వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృధువుగా చెబుతాడు హరికృష్ణ. 

సీతాపతి లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు.

స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు. 


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 14 చదవండి. 


ఆ సాయంత్రం.. సీతాపతి వైజాగ్ వెళ్ళిపోయాడు. ప్రజాపతి చెన్నైలో తన ప్రియురాలు- విడో నర్స్ నాగమణి గృహంలో, ఆమె యిచ్చే ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ, ఆనందంగా వున్నాడు. పదిరోజులకు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా ప్రజాపతి నర్స్ నాగమణి గృహాన్ని పావనం చేస్తున్నాడు. ముఫ్పై అయిదేళ్ళ ప్రాయంలో వున్న నాగమణి మంచి చూపరి. చక్కటి శరీర సౌష్టవం, ముఖంలో మంచి ఆకర్షణ వున్న నాగమణి.. కనుబొమల మధ్య చిన్న స్టిక్కర్ బొట్టు పెట్టుకొని చూపరులకు సుమంగళిగానే గోచరిస్తుంది. వారిరువురి పరిచయం ఐదేళ్ళ క్రిందట చెన్నైవైపు వెళ్ళే హౌరా ఎక్స్ ప్రెస్‍లో కలిగింది. ఆ పరిచయం.. ప్రణయంగా మారిపోయింది. ప్రజాపతి.. చెన్నైలో తన మిత్రుడు పరంజ్యోతిని కలిశాడు. అతని కుమారుడు డాక్టర్ దివాకర్‍ను కూడా చూచి ప్రీతిగా పలకరించి మాట్లాడాడు.


రెండు వారాల తర్వాత ఓ మంచిరోజును ఎన్నుకొని.. గూడూరుకు పిల్లను చూచేదానికి వస్తామని పరంజ్యోతి ప్రజాపతికి చెప్పాడు. వారు ఆనందంగా మిత్రుని కౌగలించుకొన్నారు. మరుదినం మధ్యాహ్నం భోజన సమయానికి ప్రజాపతి గూడూరు చేరాడు. భార్య ప్రణవిని పిలిచి.. పరంజ్యోతి చెప్పిన మాటలను ఆనందంగా చెప్పాడు.


పరంజ్యోతి గురించి తెలిసి వున్న ప్రణవి ప్రజాపతి చెప్పిన మాటలను మౌనంగా విన్నది. అతనితో వాదన వలన ప్రయోజనం వుండదని ఆమెకు బాగా తెలుసు. కనుక.. ఎత్తుకుపై ఎత్తు వేసి పరంజ్యోతి.. భార్య.. కొడుకు వచ్చేనాటికి ఏదో సాకును కల్పించి వారు రాకుండా చేయాలని నిర్ణయించుకొంది.


"ప్రణవీ!.. అమ్మాయి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు?" అడిగాడూ ప్రజాపతి.


"ఎల్లుండి!.." ముక్తసరిగా చెప్పింది ప్రణవి.


"దీప్తి ఎక్కడ?.."


"తన గదిలో వుంది."


"ఓసారి ఇలా రమ్మను."


ప్రణవి దీప్తి గదిలో ప్రవేశించి..

"దీపూ!.. మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు" చెప్పింది.


ల్యాప్‍టాప్‍లో ఢిల్లీలోని తన స్నేహితురాలికి మెసేజ్ పంపి దీప్తి ప్రజాపతిని సమీపించింది. 

ఆమెను చూచి..

"రా దీపూ కూర్చో!" అన్నాడు ప్రజాపతి.


ప్రజాపతి ఎదురుగా హాల్లో వున్న సోఫాలో కూర్చుంది దీప్తి. 

"ఎల్లుండేనా నీ ఢిల్లీ ప్రయాణం!"


"అవును.."


"తిరిగి వచ్చేది ఎప్పుడు?"


"ఒక వారం రోజుల తర్వాత.." నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది దీప్తి.


"వారం రోజుల్లో తప్పకుండా తిరిగి రావాలి. ఆ పిల్ల వుండిపొమ్మన్నదని అక్కడ వుండిపోకూడదు."


"పెండ్లికి వెళుతున్నాను. పెండ్లి ముగిసిన రెండోరోజు బయలుదేరి వచ్చేస్తాను. అక్కడ నాకేం పని?"


"దీపూ!.. నేను నీ తండ్రిని. నేను నీ విషయంలో ఏది చేసినా అది నీ మంచికే. నా కూతురు మహారాణిలా బ్రతకాలి."


"నాకు అలాంటి ఆశ లేదు నాన్నా!.. మామూలు మనిషిగా బ్రతికి పదిమంది చేత.. మంచి పిల్లననిపించుకోవాలి. అంతే"


"అలాగా!.. సరే.. ఇక నీవు వెళ్ళవచ్చు!"


దీప్తి ఒకసారి తండ్రి ముఖంలోకి పరీక్షగా చూచి.. తన గదిలోకి వెళ్ళిపోయింది.

అంతవరకూ వారి సంభాషణను వింటూ నిలబడి వున్న ప్రణవి మౌనంగా వెనుతిరిగింది. ఆమెను చూచిన ప్రజాపతి..

"ప్రణవీ!.. నేను నీకు చెప్పిన విషయాన్ని దీపుకు చెప్పు!" అన్నాడు.


"అలాగే.." క్లుప్తంగా జవాబు చెప్పి ప్రణవి దీప్తి గదిలోనికి వెళ్ళిపోయింది.


దీప్తి ప్రక్కన మంచంపై కుర్చుంది. దివాకర్ విషయంలో ప్రజాపతి తనకు చెప్పిన విషయాన్ని విపులంగా వివరించింది. చివరగా "దీపూ!.. నీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలుసు. ఈశ్వర్ నీకు అన్ని విధాలా తగినవాడు. అతనితోనే నీ వివాహం జరగాలి. నేను.. పరిస్థితులననుసరించి ఏం చెప్పినా విని.. నా నిర్ణయానుసారంగా నీవు నడుచుకోవాలి. ధైర్యంగా మీ నాన్నను ఎదిరించాలి. అర్థం అయిందా!.."


దీప్తి కొన్నిక్షణాలు తల్లి ముఖంలోకి పరీక్షగా చూచింది.

"ఏమిటే!.. అలా చూస్తున్నావ్!" అడిగింది ప్రణవి.


"అమ్మా!.. బావ!.." ఆగిపోయింది దీప్తి.


"నిన్ను ఏమన్నా అన్నాడా!.."


"లేదు.."


"మరేంటి?"


"నిన్న నాతో ప్రీతిగా మాట్లాడాడమ్మా!"


"అంటే!"


"నేను వచ్చినప్పటి నుంచీ నిన్న మాట్లాడినట్లుగా అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.


"దాని అర్థం!" అడిగింది ప్రణవి.


"ఆ మాటల్లో నామీద తనకున్న అభిమానం వ్యక్తమయిందమ్మా!.." మెల్లగా చెప్పింది దీప్తి.


"మీ అత్తామామలు ఏమన్నారు?.."


"వారిరువురికీ నేనంటే ఎంతో ప్రేమ.."


"అయితే.. ఇంకా సందేహం ఎందుకు? ఈశ్వర్ నీకు కాబోయే భర్త" నవ్వింది ప్రణవి.


"మరి నాన్నా!.." సందేహంతో తల్లి ముఖంలోకి చూచింది దీప్తి.


"మీ నాన్న అహంకారి, స్వార్థపరుడు. వారిని గురించి నీవు ఆలోచించి నీ బుర్రను పాడుచేసికోకు. వారందరితో కలిసి ఢిల్లీకి వెళుతున్నావు కదా!.. సమయం చూచి నీ నిర్ణయాన్ని ఈశ్వర్‍కు చెప్పు.. సరేనా!"


"అలాగేనమ్మా!"


"నేను మా వదిన లావణ్యతో మాట్లాడుతాను. ఆమెకు నేనంటే ఎంతో అభిమానం. నా కోర్కెను కాదనదు."


"మరి మామయ్య!."


"ఆయన ధర్మరాజు. మీ అత్తయ్య మాటను ఏనాడూ కాదనడు!" నవ్వింది ప్రణవి.


ప్రజాపతి ఆ గదిని సమీపించి గొంతు సవరించాడు.

దీప్తి.. ప్రణవి ఉలిక్కిపడి ద్వారం వైపు చూచారు. ప్రణవి మంచం దిగి ప్రజాపతిని సమీపించింది.

"ఏమండీ!.. ఏమన్నా కావాలా!.." అడిగింది ప్రణవి.


"అమ్మాయితో విషయం చెప్పావా!"


"చెప్పానండీ!"


"ఏమండి?"


"సిగ్గుతో మౌనంగా తల దించుకుంది"


"అంటే మౌనం అంగీకార సూచనేగా!"


అవునన్నట్లు ప్రణవి తలాడించింది.

ఐదు నిముషాల క్రిందట ప్రజాపతికి నాగమణి ఫోన్ చేసింది. తన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరానని చెప్పింది. ఆ కారణంగా ప్రజాపతి చెన్నైకి బయలుదేరాడు.

"అర్జంటు పనిమీద చెన్నై బయలుదేరుతున్నాను. వచ్చేదానికి రెండురోజులు పట్టవచ్చు జాగ్రత్త" చెప్పాడు ప్రజాపతి.


"మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి" అంది ప్రణవి.


ప్రజాపతి వేగంగా పోర్టికో వైపుకు నడిచాడు.

***

శివరామకృష్ణ వ్యాపారంలో భాగస్థుడు దండాయుధపాణి. నందిని పందిగా, పందిని నందిగా మార్చగల సమర్థుడు. ఎంతటివారినైనా తన నక్క వినయంతో, చమత్కారమైన మాటలతో.. ఆకట్టుకోగల ప్రజ్ఞాశాలి. అతనిలోని ఆ లక్షణాలు నచ్చినందున శివరామకృష్ణ అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకొన్నాడు ఐదు సంవత్సరాల క్రిందట.


నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఐదవ సంవత్సర ఆరంభం నుంచి ఆ దశ మారిపోయింది.


దానికి కారణం.. దండయుధపాణి చాకచక్యం.. అతనిలో దినదినాభివృద్ధిగా పెరిగిన స్వార్థం.

స్వార్థం.. ప్రతి ఒక్కరికి పైకి రావాలని వుంటుంది. శివరామకృష్ణ కొడుకులు చంద్రం, రాఘవ, వైశాలి, శారదల వివాహాలు జరిగాయి. కొడుకులిద్దరూ తల్లి, తండ్రి ప్రమేయం లేకుండా వారితో చదివిన గొప్ప ఇంటి అమ్మాయిలను వివాహం చేసుకొని అర్థాంగుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో స్థిరపడిపోయారు. కూతుళ్ళ వివాహం శివరామకృష్ణ ఇష్టానుసారంగానే జరిగాయి. వారూ తమ భర్తలతో ఒకరు బొంబాయిలో, మరొకరు చైన్నైలో వుంటున్నారు. కొడుకులు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి శివరామకృష్ణ ఇంట్లో చుట్టాలుగా నాలుగురోజులు ఉండి, సువిశాల భారతదేశంలోని ముఖ్యపట్టణాలైన కాశ్మీర్, ఊటి, కోడైకెనాల్, ననెటాల్ మొదలగు సుందర ప్రదేశాల్లో ఆనందంగా తన అర్థాంగులతో గడిపి విదేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు.

హరికృష్ణకు తాను ఇచ్చిన మాట ప్రకారం.. వాణిని తన కొడుకు చంద్రశేఖర్‍కు ఇల్లాలిగా చేయలేకపోయాడు. కారణం చంద్రశేఖర్ తన క్లాస్‍మేట్ దివ్య అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న కారణంగా వరించి అక్కడే వివాహం చేసుకొన్నాడు.


 ఇక, .. రెండవవాడు రాఘవ.. ఆస్ట్రేలియాలో వుంటూ తన తోటి ఆఫీస్‍లో పనిచేసే ఇండియన్ క్రిస్టియన్ యువతి రోసిని ప్రేమించి వారి పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాలోని చర్చిలో వివాహం చేసుకొన్నాడు.


ఆవిధంగా ఎదిగి ప్రయోజకులైన కుమారులు ఇరువురూ.. తమ వివాహాలను తల్లీతండ్రి ప్రమేయం లేకుండా చేసుకొన్నారు.


తమ కుమారులు ఆ రీతిగా మారిపోతారని శివరామకృష్ణ - ఊర్మిళ వూహించలేదు. ఆ కారణంగా మగపిల్లల మీద ఆ దంపతులకు ఎలాంటి ఆశలూ మిగలలేదు.


ముఖ్యంగా చివరివాడు విష్ణు. జన్మతః అంధుడు. అతని గురించి పెద్దవారైన చంద్రశేఖర్, రాఘవలు పట్టించుకోకుండా విదేశాల్లో వున్నందున.. విష్ణును ఆ దేశాల్లో వుండే మంచి డాక్టర్లకు చూపించలేదని ఆ దంపతుల మనస్సున వున్న పెద్ద కొరత.


ఆర్థాంగుల మాటల ప్రకారం నడుచుకొనే ఆ అన్నదమ్ములు ఇండియాకు వచ్చినప్పుడు.. విష్ణు విషయాన్ని శివరామకృష్ణ ఊర్మిళలు ప్రస్తావిస్తే.. వినిపించుకొనే వారు కారు. వారి ఆ చర్య ఆ దంపతులకు ఎంతో బాధను కలిగిందేది. ఎదిగి స్వతంత్రులైన కొడుకులను గురించి తలచుకొని విచారపడేవారు.


కూతుళ్ళు అల్లుళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఓ వారంరోజులు వుండి వెళ్ళిపోయేవారు.

వయస్సు మీరిన తమని, గ్రుడ్డివాడైన విష్ణును ఎవరూ పట్టించుకోకుండా తయారైనందున ఏకాంతంలో తమ సంతతి గొప్ప గుణాలను తలచుకొని కన్నీరు కార్చేవారు.


శివరామకృష్ణ కుటుంబ పరిస్థితిని బాగా గ్రహించిన దండాయుధపాణి.. తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని సంవత్సరంలోపల కంపెనీ లాస్‍లో మునిగిపోయేలా చేసి క్రింది వారినందరినీ తన గుప్పెట్లో పెట్టుకొన్నాడు. నష్టపు తాలూకు ఋణాల పట్టిని శివరామకృష్ణ ముందు వుంచాడు.

కంపెనీ ఛైర్మన్ స్థానంలో వున్న శివరామకృష్ణ.. తనకు తానుగా పదవీ విరమణ చేసి కంపెనీ నుంచి బయటికి పోయేలా చేశాడు.


శివరామకృష్ణ కంపెనీలో తన భాగాన్ని దండాయుధపాణికి ఋణాలను తీర్చేదానికి అప్పగించి వట్టి చేతులతో కంపెనీ నుంచి బయటికి వచ్చాడు.


ఇరువురు వ్యక్తుల మధ్యన అది గొప్పదని చెప్పుకోతగినది మంచి స్నేహం.. శివరామకృష్ణ ఎంతగానో నమ్మిన దండాయుధపాణి అతన్ని మోసం చేశాడు. సంతతి వల్ల శాంతిలేని శివరామకృష్ణ కంపెనీ ఛైర్మన్‍గా తన బాధ్యతలను పర్యవేక్షణను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. అతనిలోని ఆ బలహీనతను దండాయుధపాణి.. తన సామర్థ్యాలతో సద్వినియోగం చేసుకొన్నాడు. శివరామకృష్ణను అనామకుడిగా మార్చేశాడు.

ఈ సన్నివేశం జరిగిన పదిరోజుల్లో మరో ఇరువురు మార్వాడీలు శివరామకృష్ణను కలుసుకొని.. మాకు కంపెనీ కోటిరూపాయలు బాకీ పత్రాల మీద మీరే సంతకం చేసి వున్నారు. ఎప్పుడు చెల్లుస్తారని నిలదీసి అడిగారు. వారి మాటలకు శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు. తనకంటూ వున్నది ఓ భవంతి. దాదాపు కోటిన్నర ఖరీదు చేసేది. వారితో ఎలాంటి వాదనను కొనసాగించకుండా.. శివరామకృష్ణ వారంరోజుల్లో చెల్లిస్తానని క్లుప్తంగా జవాబు చెప్పాడు.


మీరు చెల్లించకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఇంటిని వేలం వేయించి మా సొమ్మును మేము రాబట్టుకొంటామని బెదిరించి వెళ్ళిపోయారు. ’ఒకప్పుడు.. నన్ను కలిసికొనేటందుకు గంటల తరబడి నా వాకిట నిలబడినవారు.. నేడు నన్ను శాసించే స్థితికి ఎదిగారు. ఆ కారణంగానే తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంటిని అమ్మి వారి సొమ్మును వారికి ఇవ్వాలి. ఈ విశాఖపట్నం వదిలి నా వూరికి నా హరికృష్ణ వద్దకు వెళ్ళాలి. హరి నా బంధువు, ప్రాణస్నేహితుడు. మంచి మనసున్నవాడు. నా ఊర్మిళల శేష జీవితం ప్రశాంతంగా ఆ వూర్లో సాగే దానికి వాడు.. నా హరి..తన చేతిని నాకు అందిస్తాడు’ అనుకొన్నాడు శివరామకృష్ణ.

ఆరోజు కార్తీకమాసం తొలి సోమవారం. లావణ్య, ప్రణవి, శార్వరి, దీప్తి ఉపవాసం. నలుగురూ సాయంత్రం ఆరుగంటలకు శివాలయానికి వెళ్ళారు. ప్రమిదలతో జ్యోతులను వెలిగించారు. జగన్మాతాపితలను దర్శించారు. తమ తమ కోర్కెలను విన్నవించుకొన్నారు.


లావణ్య ’మాతా పితా.. రేపటి మా ఢిల్లీ ప్రయాణం ఆనందంగా సాగాలి. నా ఈశ్వర్‍కు దీప్తి భార్య కావాలి. శార్వరికి సీతాపతి కావాలి. దీప్తి ప్రారంభించాలనుకొన్న హాస్పిటల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభం కావాలి. చెడు స్నేహాలవల్ల నా అన్నయ్య ప్రజాపతి తత్వంలో వచ్చిన మార్పు.. వాడికి మాకు వున్న అభిప్రాయభేదాలు సమసిపోయి మా నాన్న అమ్మల హాయంలో మాదిరిగా మారెండు కుటుంబాలు ఏకం కావాలి. తమేవ కరుణా కటాక్షాన్ని మాపై చూపండి. నా కోర్కెలు తీరేలా చేయండి’ ఎంతో భక్తితో వేడుకొంది.


శార్వరి.. ’నా బావ సీతాపతి అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మారెండు కుటుంబాల పెద్దలు విరోధులుగా వున్నారు. నా నిర్ణయం ద్వారా ఆ పగ పెరగకూడదు. నా అభిప్రాయాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేను. అక్క వాణిలా సాహసించలేను. మీరే నాయందు దయచూపి నా కోర్కె తీరేలా చేయాలి. త్వరలో రానున్న పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించి అమ్మా నాన్నలకు ఆనందం కలిగించాలి. వారి ఆనందమే నా ఆనందం’ కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో జగన్మాతాపితలను ధ్యానించింది.

ప్రణవి.. ’తండ్రీ సర్వేశ్వరా!.. మాతా మహేశ్వరీ.. మావారిలోని రాక్షసతత్త్వాన్ని మార్చండి. మంచి మనిషిగా అందరి అభిమానాన్ని పొందేలా చేయండి. నా కూతురు ఈశ్వర్‍కు ఇల్లాలుగా, శార్వరి నా ఇంటి కోడలుగా అయ్యేలా చేయండి. నా బిడ్డల వివాహాలు వారు కోరుకున్న వారితో జరిపించే మనస్తత్వాన్ని మా వారికి ప్రసాదించండి. మావారి అవివేకంతో విడిపోయిన మా రెండు కుటుంబాలు మా పిల్లల హాయంలో కలిసేలా చూడండి. మీ తలపులకు ఈ సృష్టిలో అతీతం అన్నది ఏదీ లేదు. నా విన్నపాన్ని చిత్తగించండి. నా కోర్కెలను నెరవేర్చండి’ దీనాతిదీనంగా కన్నీటితో వేడుకొంది ప్రణవి.


దీప్తి..’తండ్రి విశ్వనాథా!.. మాతా అన్నపూర్ణమ్మా.. నేను సంకల్పించి హాస్పిటల్ ఈ నా గ్రామంలో వెలిసేలా చూడండి. పేదలకు వైద్యం చేయాలనే నా సంకల్పాన్ని నెరవేర్చండి. మా బావ ఈశ్వర్‍తో నా వివాహం.. మా నాన్నగారి సమ్మతితో జరిగేలా చూడండి. మా అత్తయ్య కుటుంబంపై మా నాన్న మనస్సులో వుండే ద్వేషాన్ని చంపి.. ఆ స్థానంలో అభిమానాన్ని నింపండి. నాన్న శేష జీవితంలో మంచి మనిషిగా మారి బ్రతికేలా చూడండి. ఈ నా కోర్కెలు సరైనవైతే.. మీరు తప్పక నెరవేరుస్తారని మీ మీద నాకు నమ్మకం’ భక్తి శ్రద్ధలతో జగన్మాతా పితలను ధ్యానించింది.


తీర్థప్రసాదాలను తీసుకొని ముందు లావణ్య, శార్వరీలు వెనకాల ప్రణవి, దీప్తి ఆలయం నుండి బయటికి వచ్చారు. ముందున్న మండపంలో కూర్చొని ఐదు నిముషాలు ధ్యానంతో కళ్ళు మూసుకున్నాడు.


ముందుగా కళ్ళు తెరిచిన ప్రణవి లావణ్యను సమీపించి కూర్చుంది. ఆమె ప్రక్కన దీప్తి. లావణ్య కళ్ళుతెరిచి తన ఎదురుగా కూర్చొని వున్న ప్రణవిని చూచింది. శార్వరీ దీప్తి ప్రక్కన జరిగి కూర్చుంది.


"వదినా!.. బాగున్నావా!"

"వున్నాను.. కానీ మనస్సు బాగాలేదు. దానికి కారణం ఏమిటో నీకు తెలుసు."

అవునన్నట్లు సాలోచనగా లావణ్య తలాడించింది. 


"లావణ్యా!.. నాకు ఒక కోరిక వుంది. దాన్ని నీవే తీర్చగలవు"

"ఆ కోరిక.. దీప్తి.. ఈశ్వర్‍ల వివాహమేగా!" చిరునవ్వుతో అడిగింది లావణ్య.


"అవును వదినా!" దీనంగా చెప్పింది ప్రణవి.

లావణ్య, శార్వరీ దీప్తి ముఖాల్లోకి చూచి "ఇరువురూ వెళ్ళి నవగ్రహాలను ప్రదక్షిణలు చేసిరండి" చెప్పింది లావణ్య.


ఆ ఇరువురూ వెంటనే లేచి నిలబడ్డారు.

"రా శారూ!" అంది దీప్తి.

"పద వదినా!"

ఇరువురూ నవగ్రహ మండపం వైపు నడిచారు.

"వదినా! నీ కోర్కె విషయంలో నాకు మీ అన్నయ్యకు పరిపుర్ణ సమ్మతం. కానీ!.."


"ఈశ్వర్‍కు ఇష్టం లేదా వదినా!.."

"వాడు మా మాటను మీరడు!"

"మరి నీ సందేహం ఏమిటి?"

"నా సందేహం మా అన్నయ్య విషయంలో! ఆయన దీప్తి, ఈశ్వర్ వివాహానికి అంగీకరిస్తాడంటావా!"


"అంగీకరించడు. దీప్తిని తన స్నేహితుడు పరంజ్యోతి కొడుకు డాక్టర్ దివాకర్‍కు ఇచ్చి వివాహం చేయాలనేది వారి నిర్ణయం. త్వరలో వారు దీప్తిని చూచి అన్ని విషయాలూ మాట్లాడుకొనే దానికి వస్తారట. ఈ విషయాన్ని మీ అన్నయ్యే నాకు చెప్పాడు. వాళ్ళు నా ఇంటికి రాకూడదు. దీప్తిని చూడకూడదు" తన నిశ్చితాభిప్రాయాన్ని గంభీరంగా చెప్పింది ప్రణవి. 


"అన్నయ్య నిర్ణయం అలావుంటే నీవు ఎలా ఆపగలవు వదినా!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.


"వదినా!.. ఆపాలి.. దానికి నాకు నీ సహాయం కావాలి!"

"అంటే?"

"రేపు వారు రాబోతున్నారనగా ముందురోజు రాత్రి దీప్తిని నేను నీ ఇంటికి కోడలిగా పంపుతాను. దీప్తి నీ ఇంట్లో కాలుపెట్టిన క్షణం నుంచి.. అది ఈశ్వర్ భార్య. నీ కోడలుగా నీ యింట్లోనే వుంటుంది. వారిరువురికీ వివాహం జరిపించే బాధ్యత నీవు మా అన్నయ్య తీసుకోవాలి" దీనంగా చెప్పింది ప్రణవి.


"వదినా!.. నీవు!.." ఆగిపోయింది లావణ్య.


"కొత్త సమస్యను సృష్టించి.. మీరు మోయలేని భారాన్ని మీ తలపై పెడుతున్నాననేగా నీవు అనాలనుకొన్నది. ఈ కారణంగా మీ అన్నయ్య రెచ్చిపోతాడని పగ శతృత్వాలు పెరుగుతాయనేగా నీ సందేహం!"


"అవును వదినా!"


"దీప్తి మేజర్ వదినా!.. చిన్నపిల్ల కాదు. తనకు నచ్చినవాడిని వివాహం చేసుకొనే హక్కు, అర్హతా ఇప్పుడు దీప్తికి వున్నాయి. మీ అన్నయ్య నన్ను నోటికి వచ్చినట్లు తిట్టబోతాడు. నేను ఆయన మాటలను లెక్కపెట్టబోను. నాకు కావలసిందల్లా మన దీప్తి ఆనందంగా వుండడమే!.. ఒక తల్లిగా నా బిడ్డ విషయంలో నాకు అలాంటి కోరిక వుండటం న్యాయమా.. అన్యాయమా లావణ్యా!" దీనంగా అడిగింది ప్రణవి.


లావణ్య కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మౌనంగా వుండిపోయింది.

"వదినా!.." లావణ్య భుజంపై తట్టింది ప్రణవి.

లావణ్య కళ్ళు తెరిచి నవ్వింది.


"వదినా!.. దీప్తి నా యింటి కోడలే అవుతుంది. అన్నయ్యలో నాలో ప్రవహించే రక్తం ఒకటేగా!.. పగను, విరోధాన్ని పెంచుకోవాలనే పట్టుదల వాడికి వుంటే.. నాకు ప్రేమ బంధుత్వాన్ని పెంచుకోవాలనే పట్టుదల వుంది. దీప్తిని గురించి నీవు దిగులుపడకు. అది నా యింటి నా కోడలు" అంది లావణ్య.


"ఎంతోకాలం తర్వాత కలసుకొని మనం అరమరికలు లేకుండా మాట్లాడుకున్నాము వదినా! నా నిర్ణయాన్ని నీవు అంగీకరించావు. నాకు చాలా సంతోషంగా వుంది" ప్రీతిగా ప్రణవి లావణ్య చేతులు పట్టుకొంది.


ఆలయంలో ప్రవేశించిన మాధవయ్యను చూచింది లావణ్య. "లే వదినా! ఇక మనం వెళ్దాం. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా గోరంతలను కొండంతలు చేసి చెప్పే మాధవయ్య నారదుడు ఆలయంలోకి వచ్చాడు" అంది లావణ్య.


ఇరువురూ లేచారు. దీప్తి శార్వరీ వారిని సమీపించారు. నలుగురూ గుడి నుండి బయటికి నడిచారు.

ప్రజాపతి ఊర్లో లేని కారణంగా నిర్భయంగా ప్రణవి దీప్తితో రైల్వేస్టేషన్లో కలుసుకున్నారు. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, శార్వరీలు దీప్తి ప్రణవీలను స్టేషన్‍లో కలుసుకొన్నారు. హౌరా ఎక్స్ ప్రెస్‍లో వారు చెన్నైకి బయలుదేరారు. కంపార్టుమెంటులో ఎక్కిన వారందరికీ వీడ్కోలు చెప్పి ఆనందంగా ప్రణవి ఇంటికి వెళ్ళిపోయింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


51 views0 comments

Comments


bottom of page