top of page
Original.png

విరిసిన మొగ్గ

Updated: May 20

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ


'Virisina Mogga' New Telugu Story

Written By Ch. Pratap

'విరిసిన మొగ్గ' తెలుగు కథ

రచన : Ch. ప్రతాప్


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



విరిసిన మొగ్గ


మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది. వర్కింగ్ లంచ్ పూర్తి చేసి ఐటీ టవర్స్‌లో తొమ్మిదో అంతస్తులోని క్యాబిన్‌లో క్లయింట్ మీటింగుకు మాధవ్ లాగిన్ అవబోతుండగా మొబైల్ రింగయ్యింది. చూస్తే గ్లోబల్ కార్పొరేట్ స్కూలు నుండి కాల్. ఈ టైములో స్కూలు నుండి ఫోన్ ఏమిటా అనుకుంటూ చికాకుగా ఫోన్ ఎత్తి "హలో" అన్నాడు. 


"మాధవ్ గారు.. మీ అబ్బాయి చేతి నరం కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడే ఆస్పత్రికి తరలించాము. మీరు అర్జంటుగా యశోద హాస్పిటల్‌కు రండి". 


అవతలి వైపు కరస్పాండెంట్ మాటలు విన్న వెంటనే మాధవ్ తలపై పిడుగు పడ్డట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లనిపించి శరీరం వణకగా కుర్చీ ఆసరాగా చేసుకొని నిల్చున్నాడు. రెండు నిమిషాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి, రెండు గ్లాసుల మంచినీళ్లు తాగగా కొంచెం కుదుట పడ్డాడు. వెంటనే శ్రీమతికి ఫోన్ చేశాడు మాధవ్. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. క్లయింట్‌తో మీటింగులో ఉన్నప్పుడు ఫోన్‌లను ఎయిరోప్లేన్ మోడ్‌లో పెట్టాలన్నది సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక రివాజు. 


వెంటనే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఆఘమేఘాల మీద ఆసుపత్రికి బయలుదేరాడు. ఆఫీసుకు ఆసుపత్రికి దాదాపుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని దాటుకుంటూ అక్కడికి చేరేసరికి రెండు గంటలు పట్టింది. రిసెప్షన్‌లో కనుక్కుంటే బాబు ఐసీయులో ఉన్నాడని తెలిసింది. అయిదో అంతస్తులో ఉన్న ఐసీయుకు చేరుకున్నాడు. బయట గ్లోబల్ స్కూల్ స్టాఫ్ ఒకతను ఉన్నాడు. బయట నుండే అద్దాల తలుపు నుండి ఒక మూల పడుకొని ఉన్న బాబును చూపించాడు. 


ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ హడావిడిగా మాట్లాడుకుంటూ బాబుకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతోందో మాధవ్‌కు అర్థం కావడం లేదు. లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. తల పట్టుకొని బెంచిపైన కూర్చున్న మాధవ్‌కు, స్టాఫ్ కుర్రాడు జరిగినదంతా క్లుప్తంగా చెప్పాడు. గత కొన్ని రోజులుగా ఆశీష్ చాలా డల్ గా ఉంటూ క్లాసులో పరధ్యానంగా ఉంటున్నాడు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఇంకా ఒక నెలలో ప్రారంభం కావాల్సి ఉండడంతో రోజుకు పదిహేను గంటల పాటు క్లాస్ రూములు, రివిజన్ క్లాసులు, సాయంత్రాలు స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. 


ఆదివారాలు కూడా హాస్టల్ పిల్లలను ఇంటికి పంపడం, పేరెంట్స్ పిల్లలను కలవడం చేయడం లేదు. ఆశీష్ చాలా తెలివైన వాడు కావడం వలన సిటీ ర్యాంకుతో పాటు స్టేట్ ర్యాంకు కోసం కూడా కాలేజీ యాజమాన్యం ఆశీష్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. బహుశా చదువు ఒత్తిడి వలన ఆశీష్ ముభావంగా ఉంటున్నాడని వార్డెన్, కోర్స్ కరస్పాండెంట్ అనుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా భోజనం కూడా చేయకపోతే ఒంట్లో బాగోలేదని అనుకొని ఈ రోజు పొద్దున అతనిని హాస్టల్ రూములోనే ఉండి చదువుకోమని చెప్పారు. 


మధ్యాహ్నం లంచ్ కి కూడా ఆశీష్ వెళ్లకపోతే అతనితో మాట్లాడి రమ్మని ఒక విద్యార్థిని హాస్టల్‌కు పంపించారు. హాస్టల్ గది తలుపు లోపల నుండి వేసి ఉంది. మంచంపై మణికట్టు వద్ద గాయంతో ఆశీష్ అచేతనంగా పడి ఉన్నాడు. పక్కనే రక్తం మడుగు కట్టి ఉంది. కిటికీలోనుండి ఇదంతా చూసిన ఆ విద్యార్థి హాహాకారాలు చేస్తూ వార్డెన్ కు కబురు అందించాడు. 


వెంటనే యాజమాన్యం 108కు ఫోన్ చేసింది. ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్ ఒక గంట తర్వాత వస్తే అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో ఐసీయు అటెండెంట్ వచ్చి ఒక కాగితాల గుత్తిపై సంతకాలు తీసుకున్నాడు. పరిస్థితి చాలా విషమంగా ఉందని, వచ్చే డెబ్బై రెండు గంటల వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, అంతవరకు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండమని ఒక రొటీన్ సినిమా డైలాగ్ కొట్టి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో నవనాడులు కృంగిపోయినట్లనిపించి బెంచీపై కూలబడి ముఖం చేతుల్లో దాచుకొని మాధవ్ రోదించసాగాడు. 


మాధవ్‌కు, గౌతమికి పెళ్ళయిన ఆరేళ్ళకు పుట్టిన అపురూప రత్నం ఆశీష్. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. కలిపి నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు. కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎనిమిదో తరగతి నుండే ఆ మహానగరంలో నంబర్ వన్ స్కూలులో చేర్పించారు. అక్కడ అంతా రెసిడెన్షియల్ విద్యా విధానం. ఎనిమిదో తరగతిలో లోపలికి వెళ్తే ఐఐటి సీటుతో బయటకు వస్తారన్న పేరు ఉంది. స్వతహాగా ఆశీష్ కు క్రికెట్, గిటార్ వాయించడం, పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. సంగీత ప్రపంచంలో వృత్తిని మలచుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. 


కానీ రెసిడెన్షియల్ స్కూలులో చేర్చాక అతని ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు తప్ప ఇంకొక వ్యాపకం ఉండదు. కాస్త తెలివితేటలు ఉన్న వారిపై స్కూలు యాజమాన్యం పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మామూలుగా పన్నెండు గంటలు, పరీక్షా సమయంలో పదహారు గంటల పాటు చదువే చదువు. అక్కడ చదువే సర్వస్వం. చదువు తప్ప ఇంకొక మాట మాట్లాడడం మహాపాపం. సాయంత్రం ఏడయ్యాక గౌతమి ఏడుస్తూ ఆసుపత్రికి వచ్చింది. 


కొడుకును దూరం నుండే చూసి దుఃఖం అలలుగా ఎగిసి పడుతుండగా ఆపకుండా ఏడుస్తూనే ఉంది. పరిస్థితి శృతి మించుతోందని గ్రహించిన మాధవ్ తల్లిదండ్రులకు, అత్తమామలకు కబురు అందించి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. ఒకపక్క ఆశీష్ ఐసీయులో మృత్యువుతో పోరాడుతుండగా మరొక పక్క స్కూలు యాజమాన్యం ఆశీష్ ను స్కూలు నుండి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపించింది. ఆశీష్ కు మానసిక సమతుల్యం తక్కువ అని, విపరీతమైన స్వభావం కలవాడని తమ డాక్టరు నిర్ధారించినట్లు ఒక సర్టిఫికేట్ కూడా జత చేసి, అటువంటి విద్యార్థి వలన సాటి విద్యార్థులపై దుష్ప్రభావం పడుతుంది కాబట్టి స్కూలు నుండి తొలగిస్తున్నట్లు నోటీసు సారాంశం. 


ఆశీష్ తరచుగా అశ్లీల దృశ్యాలు మొబైల్‌లో చూసేవాడని, అదే స్కూలులో చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించి, ఆమె బ్రేకప్ చెప్పిందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడతానని తమతో చెప్పేవాడన్న వాంగ్మూలాన్ని ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో రాయించి నోటీసుతో జత చేశారు. లక్షలు చదివించుకొని కేసు తమ పైకి రాకుండా ఆ సంస్థ జాగ్రత్తపడింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ తీరే అంత. ప్రతీ దానికి ఒక రేటు. అవసరార్థం మనుషులను కూడా వస్తువులుగా చూస్తాయి. అవసరం తీరాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారు. 


నిన్నటి వరకు తన కొడుకు ఒక సూపర్ స్టార్. కాలేజీ, సిటీ మరియు స్టేట్ ర్యాంకర్. వాడి తప్పిదం వలన తమ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వెంటనే వాడిని కలుపు మొక్కను తీసివేసినట్లు తీసేశారు. ఇప్పుడు ఏకంగా వాడి ప్రవర్తన, వ్యక్తిత్వం పైనే బురద జల్లారు. ఇటువంటి భ్రష్టు పట్టిన వ్యవస్థలో తాను ప్రవేశించడమే తాను చేసిన పెద్ద తప్పిదం అని మాధవ్ అప్పుడు గ్రహించాడు. 


మొదటి నుండి తనకు కార్పొరేట్ వ్యవస్థ అంటే ఎంతో ఇష్టం. లేక లేక కలిగిన ఆశీష్ ను ఆ పద్ధతిలోనే పెంచాడు. ప్రతీది బెస్ట్ మాత్రమే ఇవ్వాలి. వాడు పుట్టిన వెంటనే వాడు జీవితంలో ఏం చేయాలో, ఏం సాధించాలో ఆ లక్ష్యాలను తానే నిర్దేశించేశాడు. భార్య లేక కొడుకు అభిప్రాయం తనకు అనవసరం. వాడు కథల పుస్తకాలు చదువుకోవడం, కార్టూన్ నెట్‌వర్క్ చూడడం, క్రికెట్ ఆడుకోవడం, గిటార్ ప్రాక్టీస్ చేయడం, సంగీతం సాధన చేయడం అంతా సమయ వృధా, జీవితంలో ఎందుకూ పనికిరాని పనులు. చిన్నప్పుడు తండ్రి అన్నట్లు "అవి కూటికొస్తాయా? గుడ్డకొస్తాయా?" అన్నది తన అభిప్రాయం కూడా. 


అయితే మధ్యతరగతి నుండి వచ్చిన గౌతమిది అంతా మాధవ్ మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. కుర్రాడిని స్వేచ్ఛగా వదిలేయాలని, వాడి ఆలోచనలకు అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ నివ్వాలన్నది ఆమె అభిప్రాయం. తాను కూడా ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నా, ఆ కల్చర్ ను తన కొడుకుపై రుద్దడం ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఈ విషయంలో ఆమెకు, మాధవ్‌కు తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. కలతలు చిలికి చిలికి గాలివానగా మారాయి. చివరకు ఒకరినొకరు చూసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. 


అయినా మాధవ్ తన మంకుపట్టు వదల్లేదు. చివరకు అతనిదే పైచేయి అయ్యింది. వాడు ఐఐటి సీటు సాధించాలని, అమెరికాలో ఎంఎస్ చేయాలని, లక్షల్లో ప్యాకేజీ సాధించాలని, ఎన్ఆర్ఐ సంబంధం చేసుకోవాలని, అమెరికాలో అత్యంత సంపన్నుడుగా ఎదగాలని, ఇలా ఎన్నెన్నో కలలు, ఆశయాలు, లక్ష్యాలు వాడిపై రుద్దాడు. ఎనిమిదవ తరగతి నుండే వాడిని ఆ మహానగరంలో అత్యంత ఖరీదైన కాలేజీల్లో చేర్పించాడు. అక్కడంతా ఒత్తిడే. 


క్షణాలను కూడా రూపాయిల్లో కొలుస్తారు. దానికి తట్టుకోలేక, తన బాధలు వినేవారు లేక, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు ప్రయత్నించాడన్నది ఇప్పుడు మాధవ్ కార్పొరేట్ బుర్రకు అర్థమయ్యింది. పది రోజులపాటు ఆశీష్ మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. డాక్టర్లు సైతం ఈ కేసును ఒక ఛాలెంజ్‌గా తీసుకొని తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆ పది రోజులు దంపతులిద్దరికీ పది యుగాలుగా గడిచాయి. గౌతమి అయితే తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. తిరుపతి, శిరిడీ, కాశీ, అయోధ్య, భద్రాచలం, యాదాద్రి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం ఇలా తనకు తెలిసిన పుణ్యక్షేత్రాలన్నింటికీ ముడుపులు కట్టింది. 


ముఖ్యంగా ఆశీష్ పరిస్థితి దంపతులిద్దరి ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఏనాడు పేపరు ముఖం చూడని మాధవ్ వార్తాపత్రికలలో విద్యార్థులపై కొన్ని విద్యాసంస్థలు తీసుకువస్తున్న ఒత్తిడి, అవి జైళ్లను మరపించేలా ఉండటం, సున్నిత మనస్కులు వాటికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడం వంటి వార్తా కథనాలను చదివాక తన ఆలోచనా ధోరణిలో పూర్తిగా మార్పు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో ముక్కు పచ్చలారని పదహారేళ్ళ సాత్విక్ ఆత్మహత్య గురించి చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. 


అభం శుభం తెలీని ఆశీష్ రూపమే కదలాడుతుంటే దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు. ఒక ప్రముఖ విద్యావేత్త విద్యార్థులలో పెరుగుతున్న చదువుల ఒత్తిడి వారిని ఏ విధంగా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందో ఒక వ్యాసంలో అద్భుతంగా విశ్లేషించారు. "ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల ఒత్తిడిలో ఇంటర్ విద్యార్థులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా నమోదవుతున్నా… వాటిని నివారించడంలో కళాశాలల యాజమాన్యాలు, ఇంటర్ బోర్డు, విద్యాశాఖ విఫలమవుతూనే ఉన్నాయి. 


సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగి కొన్ని రోజులు గడిచిన తర్వాత కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు నష్టపరిహారం ఇచ్చి కేసులు లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కళాశాల సిబ్బందిపై కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. 


చదువుల ఒత్తిడి భరించలేక ఏళ్ల తరబడి ఇంత మంది తనువు చాలిస్తున్నా, వాళ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆరా తీయడం లేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలను గుర్తించి, విశ్లేషించి, ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా సంఘటన జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. పదవ తరగతి పూర్తయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటర్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. 


ఇంత మొత్తంలో ఫీజులు చెల్లించాం కాబట్టి కచ్చితంగా ర్యాంకు రావాల్సిందే అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ర్యాంకు రాదనుకున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల సామర్థ్యం, వారి ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతంగా ఐఐటి, జెఈఈ, నీట్ వంటి కోచింగ్‌లలో చేర్పిస్తున్నారు. కళాశాలలు ఎలాగైనా ర్యాంకు తెప్పించాలని విద్యార్థుల మానసిక స్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చదివించడంతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. 


ఈ వ్యవస్థ తక్షణం మారాలంటే ముందుగా తల్లిదండ్రులలో మార్పు రావాలి. తమకు ఇష్టమైన, తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొనే స్వేచ్చ విద్యార్థులకు ఇవ్వాలి. తమకు సహజంగా ఉన్న ప్రతిభ, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అందులో సులభంగా రాణించగలుగుతారు." ఆ దంపతుల ప్రార్థనలు ఫలించి ఆశీష్ విజయవంతంగా ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. 


ఆస్పత్రి నుండి డిస్చార్జి అయ్యి వచ్చాక గౌతమి తన ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టేసింది. గత మూడేళ్ల నుండి కొడుకుతో మిస్ అయిన క్షణాలను, మధురానుభూతులను తలుచుకుంటూ కొడుకును కంటికి రెప్పలా చూసుకోసాగింది. ఆ నగరంలో ఒక కాలేజీలో ఆశీష్ ను చేర్పించారు. తొమ్మిది నుండి అయిదు వరకే కాలేజీ. ఆదివారాలు, పండుగ రోజులు సెలవులు. సాయంత్రాలు హాయిగా క్రికెట్ ఆడుకోవడంతో పాటు తనకెంతో ఇష్టమైన గిటార్ వాయించడం, సంగీత సాధన చేసుకోసాగాడు. 


అతనిలో క్రమక్రమంగా పూర్వపు సృజనాత్మకత, తెలివితేటలు బయటకు రాసాగాయి. ఉపసంహారం:  అనారోగ్యం కారణంగా ఒక సంవత్సరం వెనుకబడినా ఆశీష్ తల్లిదండ్రుల కల సాకారం చేయగలిగాడు. జెఈఈలో యాభై లోపు ర్యాంక్ సాధించి ఐఐటి ముంబయిలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాడు. *************************************


Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page