top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 17



'Neti Bandhavyalu Episode 17'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 30/01/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 


ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. 


వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 



సీతాపతి, లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు.



వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది.


తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి.


అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య.

దీప్తి, ఈశ్వర్ లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడుతాడు ప్రజాపతి.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 17 చదవండి..


"బావా! వాళ్ళు రేపు వస్తున్నారు. నేనేం చేయాలి!" ఆందోళనగా ఫోన్ చేసింది దీప్తి.


"వస్తున్నారా!" ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.


"అవును" నొక్కి చెప్పింది.


"అంటే నేను చెప్పింది వాడికి అర్థంకాలేదన్న మాట."


"మీరెప్పుడు వస్తున్నారు బావా!"


"ఎల్లుండి"


"ఈ రాత్రికి బయలుదేరలేవా!"


"రాలేను దీపూ! ఓ అర్జంటు కేసు వుంది. కేస్ నోట్ ప్రిపేర్ చేయాలి. ఎల్లుండే విచారణ."


"వాడి ముందు కూర్చోవడం నాకు ఇష్టం లేదు" ఆవేశంగా చెప్పింది దీప్తి.


"అయితే నేను చెప్పినట్లు చేయగలవా!"


"ఏం చేయాలో చెప్పండి!"


"హైదరాబాదుకు వచ్చేయి!"


"ఎప్పుడు?"


"ఈ రాత్రికే చార్మినార్‍ ఎక్స్ ప్రెస్లో బయలుదేరు. నేను ఉదయాన్నే నిన్ను సికింద్రాబాద్ స్టేషన్‍లో కలిసికొంటాను."


"నాన్న ఇంట్లోనే వున్నారు. అసాధ్యం" దీనంగా చెప్పింది.


"ఫోన్ కట్ చేస్తున్నాను. పది నిముషాల్లో నేను నీకు ఫోన్ చేస్తాను" అని సెల్ కట్ చేశాడు.


తల్లి లావణ్యకు ఫోన్ చేశాడు. విషయాన్ని చెప్పాడు. చివరగా....

"అమ్మా!... దీప్తికి అతని కంటబడటం ఇష్టం లేదు. నీవే ఏదైనా చేయాలమ్మా."


"దీపూ నాకు అంతా చెప్పింది. నేను చూచుకొంటాను. నీవు త్వరగా నీ పనిని ముగించుకొని రా!" అనునయంగా చెప్పింది లావణ్య.


"సరే అమ్మా!.... దీపూ జాగ్రత్త!"


"అది నా కోడలురా!.... దానికి అవమానం జరిగితే అది నాకూ జరిగినట్లే.... జరగనియ్యను. నీవు నిర్భయంగా వుండు."


"మంచిదమ్మా!" ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.


దీప్తికి ఫోన్ చేశాడు.


"బావా! వస్తున్నావా!" ఆత్రంగా అడిగింది దీప్తి.


"లేదు... అమ్మతో మాట్లాడాను. నీ అవమానం తనకూ అవమానమట. అంతా తనే చూచుకొంటుందట."


"అబ్బా!... చాలా టెన్షన్‍గా వుంది బావా!" సెల్‍లో వేరే కాల్ వస్తున్న సవ్వడి. "బావా! వేరే కాల్ వస్తుంది. బహూశా అత్తయ్యదేమో కట్ చేస్తున్నాను" సెల్ కట్ చేసి వచ్చిన కాల్ నెంబరును చూచింది దీప్తి. అది లావణ్య కాల్. సెల్ మ్రోగింది.

"అత్తయ్యా!" ఆత్రంగా అంది దీప్తి.


"అవును నేనే... సెల్ మీ అమ్మకు ఇవ్వు."


"అలాగే..." ప్రక్కనే వున్న ప్రణవికి సెల్ అందించింది దీప్తి.

"చెప్పండి వదినా!" అడిగింది ప్రణవి.


లావణ్య తాను చెప్పదలచుకొంది పదిసెకండ్లలో చెప్పేసింది. చివరగా "వదినా! ఏం చేయాలో అర్థం అయింది కదూ!"


"అర్థం అయింది వదినా!"

"సరే!... జాగ్రత్త" సెల్ కట్ చేసింది లావణ్య.


ప్రణవి దీప్తి చేతిని తన చేతిలోనికి తీసుకొంది. తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ఏదో చెప్పింది. ఆ గదినుంచి బయటికి వచ్చింది.


ఫ్యాక్టరీ నుంచి ప్రజాపతి తిరిగి వచ్చాడు.

కారుదిగి... వరండాలో ప్రవేశించి....

"ప్రణవీ! నా మిత్రుడు అతని భార్యా, కొడుకు డాక్టర్ దివాకర్ బాబు రేపు పదిగంటలకు మన ఇంటికి వస్తున్నారు. తొమ్మిది గంటలకల్లా అమ్మాయిని బాగా అలంకరించి సిద్దంగా వుంచు" చెప్పాడు ప్రజాపతి.


ప్రణవి మౌనంగా తలదించుకొంది.

"ఏం మాట్లాడవు?"


"కుదరదండి" మెల్లగా చెప్పింది ప్రణవి.


"ఏమిటీ?" ఆవేశంతో అన్నాడు ప్రజాపతి.

"అవును... అమ్మాయి ఇంటికి దూరం!" విచారంగా నటనతో చెప్పింది ప్రణవి.


"నీవు చెప్పేది నిజమేనా!" ఆవేశంగా అడిగాడు ప్రజాపతి.


"ఏమిటండీ మీరు అలా అడుగుతున్నారు? కావాలంటే మీరే మీ అమ్మాయిని అడగండి" ఎంతో అమాయకంగా చెప్పింది ప్రణవి.


"ఛీ...ఛీ... నేనేమిటే అమ్మాయిని అడిగేది!" ముఖం చిట్లించి చెప్పాడు ప్రజాపతి.


"వారికి పైవారంలో మరో మంచిరోజు చూచుకొని రమ్మని వెంటనే చెప్పండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది ప్రణవి.


తనగదిలో కూర్చొని తల్లితండ్రికి మధ్యన జరిగే సంభాషణను వింటూ ఆనందంగా నవ్వుకొంటూ వుంది దీప్తి.


ప్రజాపతి సెల్ మ్రోగింది.

"హలో!... ఆ... నీవా పరం, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను"


"ఏ విషయాన్ని గురించిరా!" పరంజ్యోతి కంఠం తీవ్రంగా ఉంది.


ఆ విషయాన్ని గమనించిన ప్రజాపతి... వేగంగా తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు.

"పరం! ముందు నేను చెప్పే మాట విను. ఇంట్లో నెలసరి వచ్చే ఆడవాళ్ళ ఇబ్బందులు. అదీ అమ్మాయికి. రేపటి మీ ప్రోగ్రాం మార్చుకోవాలి" అనునయంగా చెప్పాడు ప్రజాపతి.


"ఇదేనా నీవు చెప్పదలచుకొన్నది?"


"అవును పరం!" వందనంగా జవాబు చెప్పాడు ప్రజాపతి.


"సరే! నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు!"

"అడుగు!"


"నీ అల్లుడు ఈశ్వర్‍ని దీప్తి ప్రేమిస్తుందా!"

"ఏమిటా మాట.. నో...నో... నా కూతురు నిప్పు!"


"నీ కూతురు నిప్పో... ఉప్పో... నేను చెప్పిన మాటను ఆ ఈశ్వర్‍గాడు నా కొడుకుతో చెప్పాడు. వాడు అబద్ధం ఎందుకు చెబుతాడ్రా."


"కడుపు మంటతో చెప్పి వుండవచ్చు. నా కూతురికి నీ కొడుక్కు జరుగబోయే వివాహాన్ని ఆపేటందుకు అలా చెప్పి వుండవచ్చు. ఆ ఇంటిమీద కాకి మా ఇంటిమీద వాలదురా!... అలాంటిది నా కూతురు వాణ్ణి ప్రేమించడమా!... అబద్ధం... ఈ ఈశ్వర్ గాడు చెప్పింది పచ్చి అబద్ధం. నా మాటను నమ్ము పరం!..." ముందు ఆవేశంగా చెప్పి చివరికి అనునయంగా ముగించాడు ప్రజాపతి.


"మరి మేము ఎప్పుడు రావాలి?"

"నాలుగు రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు రండి. ముందురోజు నాకు ఫోన్ చెయ్యి."


"అలాగే ప్రజా!..." పరంజ్యోతి సెల్ కట్ చేశాడు.


ప్రజాపతి మనస్సులో అనుమానం... ’దీప్తి ఆ ఈశ్వర్ గాడిని ప్రేమిస్తూందా!... ఈశ్వర్ గాడు దీప్తిని ప్రేమిస్తున్నాడా! పరంజ్యోతి చెప్పిన మాటలు నిజమా!... అబద్ధమా! ఏది ఏమైనా దీప్తి వివాహం దివాకర్‍తో జరగి తీరాలి. ఎవరైనా అడ్డు తగిలితే వాణ్ణి నరికేస్తాను. దీప్తి వివాహం దివాకర్‍తోనే జరిపిస్తాను’ అనుకొన్నాడు ప్రజాపతి.


ఆ నిర్ణయాన్ని తీసుకొన్నాడు కాని... అతని మనస్సులో ఓ మూల దీప్తి మీద అనుమానం! దీప్తిని గురించి ఆలోచిస్తూ కుర్చీలో సాలోచనగా కూర్చున్నాడు ప్రజాపతి.

"ప్రణవీ!" బిగ్గరగా పిలిచాడు.


ఆ పోలికేకను విన్న ప్రణవి ప్రజాపతి ఆఫీస్ గదిని సమీపించింది. ద్వారం ముందు నిలబడి...

"ఏమండీ!... ఏం కావాలి!" మెల్లగా అడిగింది.


"లోనికిరా!"

ప్రణవి గదిలోకి ప్రవేశించింది. క్షణంసేపు అతని ముఖంలోకి చూచి తలదించుకొంది.

"కూర్చో!"


అతనికి ఎదురుగా టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. 

’ఎందుకో ఇంత మర్యాద! ఏం శాసించబోతున్నారో!’ అనుకొంది ప్రణవి.

"నేను చెప్పేది జాగ్రత్తగా విను!"


అలాగే అన్నట్లు తలను ఆడించింది ప్రణవి.

"నాలుగురోజుల తర్వాత... పరంజ్యోతి, వాడి భార్య, కొడుకు డాక్టర్ దివాకర్ మన అమ్మాయిని చూచేదానికి వస్తున్నారు. ఈ రోజు నుంచి నీవుగాని, అమ్మాయిగాని నా పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు."


"కనీసం... గుడికి" మెల్లగా తలదించుకొని అడిగింది ప్రణవి.


"వెళ్ళకూడదు" శాసించినట్లు హెచ్చుస్థాయిలో చెప్పాడు ప్రజాపతి.


"అలాగేనండీ!..." మెల్లగా చెప్పింది ప్రణవి.


"ఇక నీవు వెళ్ళవచ్చు!..."

ప్రణవి కుర్చీ నుంచి లేచి... వేగంగా బయటికి నడిచింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో తనకు నమ్మకస్తులైన నలుగురిని ఇంటి కాపలాకు వుంచాలని నిర్ణయించుకొన్నాడు. గది నుండి బయటికి నడిచి కార్లో నూనె ఫ్యాక్టరీకి బయలుదేరాడు ప్రజాపతి.

ఆ రోజు ఉదయం ఈశ్వర్ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాడు. స్నానం, టిఫిన్ అయిన తర్వాత హాల్లో కూర్చుని హిందూ న్యూస్ పేపర్‍ను చూస్తున్న ఈశ్వర్‍ను హరికృష్ణ లావణ్య సమీపించారు. ఎదుటి సోఫాలో కూర్చున్నారు. వారిని చూచిన ఈశ్వర్ నవ్వుతూ "నాన్నా!... అమెరికా నుండి ఇ అండ్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ బ్రౌన్ చెన్నైకి వచ్చారట. వారంరోజులు వుంటారట. పేపర్లో చదివాను. వారికి మన విష్ణును చూపించాలని నా అభిప్రాయం. మీరేమంటారు నాన్నా!..."


"నీ నిర్ణయం మంచిదే ఈశ్వర్" అన్నాడు హరికృష్ణ.


వాకిట్లో పోస్ట్ మెన్....

"సార్ పోస్టు!..." పిలుపు.


ఈశ్వర్ వేగంగా వెళ్ళి అతను అందించిన కవర్‍ను చేతికి తీసుకొన్నాడు. వ్రాసింది శివరామకృష్ణ.


"నాన్నా!... మామయ్య వ్రాశారు" ఉత్తరాన్ని హరికృష్ణకు అందించబోయాడు.


"కూర్చో!... విప్పి నీవే చదువు" అన్నాడు హరికృష్ణ.


ఈశ్వర్ కవర్ చించి ఉత్తరాన్ని బయటికి తీశాడు.

"ఉత్తరం చాలా పెద్దదిగా ఉంది. విషయం ఏమై ఉంటుందండీ!" సందేహంతో అడిగింది లావణ్య.


"వాడు చదువుతాడుగా విను..." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.


ప్రియాతి ప్రియమైన హరికి...

పెదనాన్నగారి మాటను కాదని వూరిని, అయినవారినీ వదిలాను. చెన్నైకి వెళ్ళిపోయాను. మనిషికి ధన సంపాదనే ముఖ్యం అని భావించాను. వ్యాపారాభివృద్ధి కోసం వైజాగ్ చేరాను. రేయింబవళ్ళు కష్టపడ్డాను. డబ్బును సంపాదించాను. పిల్లలను వారి ఇష్టానుసారంగా బాగా చదివించాను. సముద్రాలను దాటించి వారి ఇష్టానుసారంగా విదేశాలకు పంపాను. రెక్కలొచ్చిన పక్షులు గూటిని విడిచి ఆకాశానికి ఎగిరిన రీతిగా వారు దేశాన్ని, నన్ను, నా భార్యని వదలి సుదూర తీరాలకు వెళ్ళిపోయారు. వారి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకొన్నారు. 


వారి దృష్టిలో మేము తల్లిదండ్రులుగా కాకుండా చుట్టాలుగా మారిపోయాము. ఎప్పుడో... నిశిరాత్రిలో ఫోన్‍లో నాలుగు మాటలు... అంతే. మమ్మల్ని గురించి పట్టించుకోవలసిన బాధ్యతను వారు మరిచిపోయారు. మగపిల్లలే కాదు... ఆడపిల్లలూ అలాగే మారిపోయారు.


చచ్చేంతవరకూ... వారిని ఏ విషయంలోనూ చేయి చాచి అడగకూడదని స్నేహితునితో కలిసి వ్యాపారాన్ని పెంచాను. ఎంతో శ్రమించాను. లక్ష్యాన్ని సాధించాను. ఇదంతా చేసింది విష్ణు కోసం. వాడి శేష జీవితం ఆనందంగా సాగాలనే లక్ష్యంతో... కానీ... దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లు నేను ఎంతగానో నమ్మిన నా పాట్నర్, హితుడు దండాయుధపాణి నన్ను మోసం చేశాడు. 


తను వారిని కంపెనీలో ప్రవేశపెట్టి తన బలాన్ని పెంచుకొన్నాడు. లెక్కను తారుమారుచేశాడు. కాంట్రాక్ట్ వ్యాపారం నష్టాల పాలైందని మొసలి కన్నీరు కార్చాడు. చుట్టూ వున్న అతని వారు వంత పాడారు. పువ్వులను అమ్మిన చోట కట్టెలను అమ్ముకొనే స్థితికి తీసుకొని వచ్చాడు. ఆఫీస్‍లో వారంతా ఒక్కటి. నేను ఏకాకినైపోయాను. శత్రుశేషం.... ఋణశేషం వుండకూడదు గదా! ఆస్తినంతా ఎంతో ప్రీతిగా మూడు కోట్లతో నిర్మించిన ఇంటితో సహా... అమ్మి అప్పులను తీర్చాను. 


గూడూరు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట ఎలా నా భార్యతో చెన్నైకి వెళ్ళానో... అలాగే... నీ సన్నిధికి మన వూరికి నీ చెల్లెలు ఊర్మిళ, విష్ణులతో తిరిగి వస్తున్నాను. నీవు నా తప్పులను మన్నించి నాకు ఆశ్రయాన్ని కల్పిస్తావనే ఆశతో... వారంరోజుల్లో వస్తున్నాను. నా ఇంటికి బాగు చేయించు... నేను నా శేష జీవితాన్ని ఆ ఇంట్లోనే, నా వూర్లోనే గడపదలచుకొన్నాను. నీవు తప్పక నాకు సాయం చేయగలవనే ఆశతో!!!


ఇట్లు

నీ... శివరామకృష్ణ


ఈశ్వర్ ఏకధాటిగా ఉత్తరాన్ని చదివి ముగించాడు. ఆ ముగ్గురి మనస్సులు, ముఖాలు ఒకే రీతిగా విచారంగా మారిపోయాయి.


ఈశ్వర్ సెల్ మ్రోగించి ఆన్ చేశాడు. అది దీప్తి కాల్.

"హలో!..."


"బావా!"

"అవును"

"ఎప్పుడు వచ్చారు?"

"ఉదయాన్నే!"


"ప్రజాపతి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు?"

"ఏంటీ!"

"అదే... మీ మామగారు... నన్ను!..."


"ఈశ్వర్!... దీప్తి కదూ... ఇలా యివ్వు"

ఈశ్వర్ ఫోన్‍ను లావణ్యకు అందించాడు.


"ఏందే దీపూ!... ఏమిటి విషయం?"


"మీ అన్నయ్య నన్ను ఇంట్లో నిర్భందించాడు. నేను బయటికి వెళ్లకూడదట!" దీనంగా చెప్పింది దీప్తి.


"ఎప్పుడు చెప్పాడు?"

"నాతో చెప్పలా అమ్మతో చెప్పాడు అత్తయ్యా!"


"ఫోన్ అమ్మకివ్వు"

దీప్తి ఫోన్‍ని తల్లికి అందించింది.


"వదినా!..." అంది లావణ్య.


"ఆఁ.... నేనే!... దీపు చెప్పింది నిజమేనా!"

"అవును వదిన..."


"వాళ్ళు ఎప్పుడు వస్తున్నారట?"

"నాలుగురోజుల్లో!"


"నీకు భయంగా వుందా?"

"నాకేం భయం వదినా!... నీవు నాకు మాట ఇచ్చావుగా!" 

నవ్వింది ప్రణవి.


"ఫోన్ దీపుకు ఇవ్వు వదినా"

ప్రణవి సెల్‍ను దీప్తికి అందించింది.

"అత్తయ్యా!.... నేను..."

"దీపు!... నా కొడుకు ఈశ్వర్ వచ్చాడు. అన్నీ వాడు చూచుకొంటాడు. నీవు నిర్భయంగా వుండు సరేనా!..."


"అలాగే అత్తయ్యా!..." దీనంగా చెప్పింది దీప్తి.

"పెట్టేస్తున్నా!..." సెల్‍ను కట్ చేసింది లావణ్య.


"విన్నారుగా!"

"అంతా విన్నాను."


"మనం ఏం చెయ్యాలి"

"నేను వాడిని ఒకసారి కలవాలనుకొంటున్నాను."


"మీరా!"

"అవును"

"ఎందుకు? మరోసారి అవమానపడేదానికా!"

"కాదు..."


"మరెందుకు?"

"శివరామకృష్ణ వస్తున్నాడుగా!.. ప్రస్తుతం తన స్వాధీనంలో వున్న వాడి ఇంటికి ఖాళీ చేయమని చెప్పడానికి."


"వాడు చేయనంటే మీరేం చేస్తారు"

"అలా మాట్లాడ్డం తప్పు అని చెబుతాను."

"వాడు మీ మాటను వినకపోతే!"

"లావణ్య!...." కాస్త హెచ్చు స్థాయిలో పలికి ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూచాడు హరికృష్ణ.


"అదికాదండీ!... వాడు!..."

"రౌడి!.... మానవత్వం లేనివాడు!... పరమమూర్ఖుడు!... ఈ వేషాలన్నీ నీ అన్నయ్య ఒక్కడికే సొంతం కాదు. అవసరం వస్తే నీ ఈ హరికృష్ణ కూడా అలాంటి వేషాలు వెయ్యగలడు. పూర్వపరాలను బాగా ఆలోచించి... వాడి ప్రతిగురి తప్పిందే!... కానీ నా గురి తప్పదు."


"అంటే మీరు..."

"సామదాన భేదాదులను పాటిస్తూ వర్తిస్తాను. ఎదుటి వ్యక్తి ధోరణిని బట్టి"


"ఎప్పుడు కలవాలనుకొంటున్నారు?"

"రేపు ఉదయం"


"నేను మీతో రానా"

"వద్దు లావణ్యా!"

"నాన్నా!..."

"ఏమిటి నాన్నా!..."

"నేను మీతో వస్తాను!"


క్షణంసేపు ఈశ్వర్ ముఖంలోకి చూచి కళ్ళు మూసుకొన్నాడు హరికృష్ణ. కొన్నిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.

"ఈశ్వర్!..."

"చెప్పండి నాన్నా!..."


"శివరామకృష్ణ ఇంటి విషయం... నాకు సంబంధించింది. దీప్తిని ఈ ఇంటికోడలుగా తీసుకొని రావలసింది, ఆమెచేత మా మామ అత్తయ్యల పేరున హాస్పిటల్ ఓపెన్ చేయించవలసింది నీకు సంబంధించింది. నీ తండ్రిగా నా సహకారం ఎప్పుడూ నీకు సంబంధించిన అన్ని విషయాల్లో వుంటుంది. రేపు ఉదయం ప్రజాపతిని కలిసి నాకు సంబంధించిన విషయాన్ని గురించి నేను మాట్లాడుతాను. 

నీకు సంబంధించిన దీప్తితో నీ వివాహ విషయాన్ని గురించి నీవు మాట్లాడు!..." సౌమ్యంగా చెప్పాడు హరికృష్ణ.


"అంటే... మీ ఇరువురికే నా సాయం అక్కరలేదా!" రోషంతో అడిగింది లావణ్య.

"లావణ్య!.... నా ప్రతిపలుకూ నీదే కదా!" నవ్వాడు హరికృష్ణ.

"అమ్మా!... నీవు మా ఆస్థానానికి ముఖ్యమంత్రివి కద అమ్మా!... మేము ముందుకు నడవబోయేది నీ సూచనల ప్రకారమే కదా అమ్మా!" గలగలా నవ్వాడు ఈశ్వర్.


హరికృష్ణ కూడా నవ్వాడు. కానీ...

లావణ్య నవ్వలేదు. ఆమె వదనం గంభీరంగా ఉంది.

"లావణ్యా! దేన్ని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు?"

అవునన్నట్లు తలాడించింది లావణ్య.


"విషయం ఏమిటో చెప్పమ్మా!" అనునయంగా అడిగాడు ఈశ్వర్.

"మీరు ఎదుర్కోబోయే రెండు సమస్యలూ చిక్కు సమస్యలే. ప్రజాపతిలో మానవత్వం లేని కారణంగా!" సాలోచనగా అంది లావణ్య.


"లావణ్యా! మనం తీసుకొన్న నిర్ణయాలను నేను ఘన నిర్ణయాలుగా భావించడం లేదు. అంతా ఆ దైవ నిర్ణయం అనే నా ఉద్దేశ్యం. రెండు నిర్ణయాలూ మంచివే. మంచికి ఆ సర్వేశ్వరుని కరుణా కటాక్షం ఉంటుందని నా నమ్మకం" అనునయంగా చెప్పాడు హరికృష్ణ.


"మీరు అన్నమాటలు యదార్థాలు నాన్నా!.... మనం దేనికి భయపడనవసరం లేదమ్మా. మీకు తెలియందేముంది. నేను... నాన్నా ఎలాంటి వారమో నీకు తెలుసుకదా అమ్మా!..."

"అవును.. మీ ప్రయత్నం మీరు చేయండి. దైవ నిర్ణయం ఎలా వుందో చూస్తాం. దేవుడు ధర్మపక్షపాతి కదా! విజయం మనదే అవుతుంది" చిరునవ్వుతో చెప్పింది లావణ్య.


తండ్రీ కొడుకులు ఆనందంగా నవ్వారు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

46 views0 comments
bottom of page