top of page

ఎల్లలు లేని స్వార్ధం'Ellalu Leni Swartham' - New Telugu Story Written By Ch. Pratap  

Published In manatelugukathalu.com On 29/01/2024

'ఎల్లలు లేని స్వార్ధం' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్ 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ఆర్ధ రాత్రి ఒంటి గంట అయ్యింది. న్యూయార్క్ నగరం హాయిగా మత్తులో నిదురిస్తోంది. ఎయిర్ కండిషనర్ చల్లదనం లో మెత్తటి ఫోం బెడ్ పై దట్టమైన రగ్గు కప్పుకొని భార్య కౌగిల్లో వెచ్చ గా ఆదమరిచి నిద్రిస్తున్నాడు వేణు. ఇంతలో అతని నిద్రకు భంగం కలిగిస్తూ ప్రక్కనే టేబుల్ పై వున్న సెల్ ఫోన్ మోగింది. సాధారణం గా ఈ సమయం లో అతనికి ఎవరూ ఫోన్ చెయ్యరు. అలాంటిది ఫోన్ వచ్చిందంటే ఏదో అర్జంట్ మెసేజ్ అయి వుంటుంది. ఏమై వుంటుందబ్బా అనుకుంటూ ఇంగ్లీషులో ఒక బూతు తిట్టి ఉదుటున లేచి సెల్ అందుకున్నాడు.


ఆవతలి వైపు నుండి భాస్కర్ “ బావా ! చాలా ఘోరం జరిగిపోయింది. నాన్న మనకు ఇక లేరు” వెక్కుతున్నట్లు స్పష్టం గా వినిపిస్తోంది.


వేణుకు వున్న కాస్త మత్తు కూడా దిగిపోయింది. “ ఏమిటి భాస్కర్ నువ్వంటున్నది ?” ఆతృతగా అడిగాడు.


“నిన్న రాత్రి ఊపిరి సరిగ్గా అందక ఆయాసపడ్తుంటే శ్యామా నర్శింగ్ హోం లో చేర్పించాం. ఆక్సిజన్ పెట్టారు. అయినా పొద్దునకు పరిస్థితి బాగా క్షీణించింది.డాక్టర్లు ఎంత ట్రై చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. పావు గంట క్రితమే ఆయన వెళ్ళిపోయారు” ఏడుస్తున్నాడు భాస్కర్. వేణూకి దుఖం లో నోటి మాట రాలేదు.


“బావా ఇక్కడ నేనొక్కడినే అన్నీ చూసుకోవాలి, నాకు సాయం గా వుండడానికి వెంటనే బయలుదేరి రా!” అభ్యర్ధించాడు భాస్కర్.


“ఒకె!, నువ్వేం వర్రీ అవకు.నేను వెంటనే బయలుదేరుతున్నాను. కాని రాజీకి మాత్రం రావడం కుదరదు. ఇప్పుడు ఎయిత్ మంత్ కదా! ఈ స్టేజిలో ట్రావెలింగ్ చాలా ప్రమాదకరం. ఆమెను ఏదో విధం గా మేనేజ్ చెస్తాను, అక్కడ అందరికీ ధైర్యం చెప్పు”అంటూ ఫోన్ పెట్టేసాడు వేణు.


భార్యకు నిద్రా భంగం కలుగకుండా నెమ్మదిగా లేచి లివింగ్ రూం లోనికి వెళ్ళి లాప్ టాప్ ఆన్ చెసి ట్రావెలింగ్ సైట్లు వెదికాడు. ఆతని అదృష్తం, ఉదయం ఏడుగంతలకు న్యూయార్క్ – ముంబాయి ఫ్లైట్ లో టిక్కెట్ దొరికింది. క్రెడిట్ కార్డ్ స్వాప్ చేసి టికెట్ కంఫర్మ్ చెసి ప్రింట్ కూడా తీసి రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆఫ్ సీజన్ కావడాన్న టికెట్ట్ సులభం గా దొరికింది లేకపోతే ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చేదొ ? ఆ తర్వాత వెళ్ళి రాజీని నిద్ర లెఏపి జరిగిన సంగతి చెప్పాడు. నాన్న పోయారనగానే బావురుమంది రాజి. ఆమెను సముదాయించదం వేణుకి చాలా కష్టం అయ్యింది. కొంతసేపటికి ఆమె నార్మల్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కారణం గా వేణూ ఒక్కడే వెళ్ళడానికి సమ్మతించింది.


అప్పటికప్పుడే ఆమెకు తోడుగా వుండడానికి న్యూయార్క్ లో సౌత్ ఎవెన్యూ లొ వుండే తన స్నేహితుడు కిరణ్ భార్య కొన్ని రోజులు వుండే ఏర్పాటు కూడా చేసాడు వేణు. పద్దెనిమిది గంటల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు వేణు. ఆసుపత్రి లో మార్చురీ నుండి అప్పుడే రాఘవరావు గారి పార్ధివ శరీరాన్ని తిసుకు వచ్చి వారి స్వంత ఇంటిలో వుంచారు. ఆయన భార్య యశోద శోకదేవతలా వుంది. భాస్కర్ సంగతి చెప్పనవసరం లేదు. చేష్టలుడిగిన వానిలా కూర్చోని వున్నాడు. భాస్కర్ భార్య గీత కాస్త అటూ ఇటూ తిరుగుతూ కావల్సిన ఏర్పాట్లను చూస్తోంది. వేణు, పరిస్థితిని గమనించి వెంటనే రంగం లోకి దిగాడు. ఆ ఊళ్ళొ వున్న స్నేహితులను సంప్రదించి గంట లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాడు. పంతులు గారి నుండి, ఆంబులెన్స్ వరకు అన్నీ సరిగ్గా సమకూరాయి.


భాస్కర్ ఆర్ధిక పరిస్తితి దృష్ట్యా ఇరవై వేల రూపాయలను చకా చకా ఖర్చు పెట్టేసాడు వేణు. రాఘవ రావు గారి అంత్య క్రియలు అతి ఘనం గా జరిగాయి. రాఘవ రావు గారు పని చెసి రిటైర్ అయిన కాలేజి మొత్తం వచ్చారు. అందరితో కలుపుగోలుగా వుంటూ నోట్లో నాలుకలా మెలిగే రాఘవరావు గారు తన మొత్తం సర్వీస్ లో అజాత శత్రువు అనే బిరుదును సంపాదించారు. ఎవరినైనా నొప్పించే విధం గా ఒక్క మాట కూడా మాట్లాడి వుండరు. అటువంటి మంచి మనిషికి అందరూ అశ్రుతర్పణాలతో వీడ్కోలు పలికారు.


ఆ తర్వాత దశ దిన కార్యక్రమం కుడా ఘనం గా జరిగింది. వేణు స్నేహితుల సాయం తో ఆ కార్యక్రమం ఏ లోటూ రాకుండా జరిపించాడు. ఆ ఇంట్లో అంతా సర్ధుకున్నాక అత్తగారిని తనతో తిసుకువెళ్ళే ప్రపోజల్ పెట్టాడు వేణు.


“బావా, నాన్న లేరు, ఇంక అమ్మ తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు ? వున్న దాంట్లో సర్ధుకొని అమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాము, అమ్మను ఇక్కడే వుండనివ్వు” భాస్కర్ అన్నాడు.


"అది కాదు భాస్కర్, అత్తగారికి చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా అవసరం. ఇక్కడే వుంటే మావయ్య గారి స్మృతులు అనుక్షణం వెంటాడుతూ వుంటాయి. అందుకే అక్కడికి తీసుకు వెళ్తాను. వాతావరణం మార్పు వలన ఆవిడ త్వరగా కోలుకునే అవకాశం వుంది “ అందరినీ కన్విన్స్ చేసాడు వేణు.


రాజీ కూడా ఫోన్ చేసి అన్నయతో, అమ్మతో మాట్లాడి వారిని ఒప్పించింది. వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వారం తర్వాత యశొదను తీసుకొని అమెరికాకు తిరిగి బయలుదేరాడు వేణు. రాజీ అమ్మను చూసి ఎంతో పోంగిపోయింది. అపార్ట్ మెంట్ లో అటాచ్డ్ బాత్రూం వున్న గది, ఫోను, టి వి, డి విడి ప్లేయర్ వగైరా సమకూర్చారు.


“ నాకెందుకు తల్లీ ఈ హడావిడీ అం తా ?” అడిగింది యశోద.


“అదేమిటండీ అలా అంటారు ? ఇక్కడ వున్నంత కాలం ఫ్రీ గా వుండండి. పైగా మీకు ఏ లోటు రానివ్వనని భాస్కర్ వాళ్ళకి మాటిచ్చాను కూడా “ వినయం గా అన్నాడు వేణు.


రాజీకి ఎంతో సంతోషం గా అనిపించింది. అమెరికా వచ్చిన నాలుగేళ్ళలో అమ్మను ఎంతో మిస్ అయ్యింది. ఇక కొన్నాళ్ళ పాటు అమ్మ దగ్గర హాయిగా వుండవచ్చు అనుకొని ఆనందించింది. ఆమ్మను తన స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వేణు లాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం గా భావించింది.


ఇంతలో కిరణ్ నుండి ఫోన్ వచ్చింది. వేణు ఎత్తాడు.


“ ఏమిట్రా నువ్వు చేసిన ఈ వెధవ పని. ఆ ముసలిదానిని నీ దగ్గరకు తెచ్చుకున్నావు. అక్కడ మీ బావ దగ్గర వదిలేస్తే పోయేదిగా ?” అన్నాడు కిరణ్ చికాకుగా. 


“ఒరేయ్ కిరణ్. నన్నెంత తక్కువగా అంచనా వేసావురా ? నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకున్నావా ? ప్రతీ పనిలో లాభ నష్టాలు బేరీజు వేస్తే గాని ఏ పని చెయ్యను నేను. ఇప్పుడు రాజీకి ఎనిమిదో నెల. ఆరోగ్యం అంతంత మాత్రం గా వుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. డెలివరీ అయిన తర్వాత తల్లినీ, పిల్లనీ కొంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాలి. నా వల్ల ఇదంతా జరిగే పనేనా ? ఇక్కడేమో రోజుకు ఇరవై డాలర్లు ఇస్తామన్నా కూడా నమ్మకమైన పని మనుషులు దొరకరు. అందుకే ఆవిడను వెంటబెట్టుకు వచ్చాను.


ఈ ఆడాళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్. కాస్త ప్రేమ నటిస్తే ఠక్కున వలలో పడిపోతారు. ఒక రెండు సంవత్సరాలపాటు వేళ కింత అన్నం పడేస్తే చాలు ఇంట్లో పనంతా చేస్తూ కుక్కలా పడుంటుంది ఆ ముసలిది. ఇక నాకేం చీకూ చింతా లేదు. నౌ ఐకెన్ కాన్సంట్రేట్ ఆన్ మై కెరీర్” విజయగర్వంతో నవ్వుతూ చెప్పాడు వేణు.


“వేణూ ! యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి ఇంటెలిజెంట్ ఫెలో నాకు ఫ్రెండ్ కావడం నాకెంతో అదృష్టం. నీ నుండి నేను నేర్చుకోవల్సింది చాలా వుంది” మెచ్చుకొలుగా అంటూ డిస్కనెక్ట్ చేసాడు కిరణ్. బెడ్రూంలో ఎక్శ్టెన్షన్ నుండి ఇదంతా విన్న రాజీకి కళ్ళు తిరిగినంత పనయింది. భర్త కుత్సిత తత్వాన్ని, మనీ మైండెడ్ నెస్ అర్ధం అయ్యాక నవ నాడులు కృంగి బెడ్ పై కుప్పకూలిపోయింది. జరిగే తంతు తెలియక పాపం యశోదమ్మ తన గదిలో లవకుశ సినిమా టి వి లో చూస్తూ ఆనందిస్తోంది. 

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.

46 views0 comments

Commentaires


bottom of page