top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 18



'Neti Bandhavyalu Episode 18'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 04/02/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 18' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 

ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. 

వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 

సీతాపతి, లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు.


వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది.

తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి.అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య.

దీప్తి, ఈశ్వర్ లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడుతాడు ప్రజాపతి. 

తాను అక్కడికి వచ్చేవరకు దీప్తిని చూసుకోమని తల్లికి చెబుతాడు ఈశ్వర్.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 18 చదవండి..


ఆ సాయంత్రం.. నాలుగు గంటల ప్రాంతం.. ప్రజాపతి ఫ్యాక్టరీ నుండి ఇంటివైపుకు, హరికృష్ణ ఇంటి నుంచి పాలఫ్యాక్టరీ వైపుకు కార్లో వెళుతున్నారు. రెండు కార్లు సమీపించాయి. ఆలమంద రోడ్డు ఆక్రమించి ముందుకు నడుస్తూ వుంది. డ్రైవర్లు కార్లను ఆపారు.


హరికృష్ణ ప్రజాపతిని.. ప్రజాపతి హరికృష్ణను చూచుకొన్నారు. ప్రజాపతి ముఖం చిట్లించి కారు దిగి పశువుల కాపరులను ఉద్దేశించి..

"రేయ్!.. ప్రక్కకు తోలండ్రా!" అన్నాడు.


హరికృష్ణ కారు దిగాడు.

’వాడి ఇంటికి పోయి మాట్లాడే దానికంటే.. ఎదురుపడ్డాడు కాబట్టి ఇప్పుడే పలకరించి మాట్లాడటం మంచిది. మాటలు తేడాగా వెలువడినా!.. మా ఇద్దరి మధ్యనే వుంటాయి. అది వాడికి గౌరవం. నాకూ గౌరవం’ అనుకొన్నాడు. ప్రజాపతిని సమీపించాడు. అతను తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

"ప్రజా!" ప్రీతిగా పలకరించాడు హరికృష్ణ.


ఏం అన్నట్లు తలెగరేసి హరికృష్ణ వైపుకు చూచాడు ప్రజాపతి.

"మన శివరామకృష్ణ.. మన వూరికి వస్తున్నాడు."


"ఆ విషయం.. నాకెందుకు?"

"వాడికి సంబంధించిన ఇల్లు ప్రస్తుతం నీ స్వాధీనంలో నీ గోడౌన్‍గా వుంది కాబట్టి. అందులోని సామాగ్రిని నీవు వేరే చోటుకు మార్చి ఆ ఇల్లు ఖాళీ చేయాలి ప్రజా!"


"వాడు ఎందుకు వస్తున్నాడు?"

"మనతో కలిసి తన శేష జీవితాన్ని తాను పుట్టిన ఊరిలో గడపడానికి వస్తున్నాడు"


"విషయాన్ని నాకు తెలియజేయలేదే!"

"హుఁ.. వాడిమీద నీకు వున్న అభిమానం అడ్డుపడింది."


"నన్ను హేళన చేస్తున్నావా"

"లేదు. ఉన్న యదార్థ విషయాన్ని చెప్పాను."


ప్రజాపతి కొన్ని క్షణాలు శూన్యంలోకి చూస్తూ మౌనంగా వుండిపోయాడు.

"నీ మౌనం.. సమ్మతానికి నిదర్శనం అనుకొంటున్నా!.. రెండుమూడు రోజుల్లో ఆ ఇంటిలోని సామాగ్రిని వేరేచోటుకి మార్పించు."

"నాకు పదిరోజులు సమయం కావాలి"


"ఏమిటీ పదిరోజులా!"

"అవును.. వున్నట్లుండి ఖాళీ చేయమంటే.. ఎలా వీలవుతుంది."


"మూడురోజుల వ్యవధిలో ఖాళీచేయమన్నానుగా."

"కుదరదు. నాకు పదిరోజులు కావాలి. అసలు.. నేను నీమాట ప్రకారం ఎందుకు ఖాళీ చేయాలి. వాడు వచ్చి నన్ను అడగనీ అప్పుడు ఖాళీ చేస్తాను."


"నీకు నా మాటల మీద విశ్వాసంలేదా"

"లేదు"


"ప్రజా! నీవు గతాన్ని పూర్తిగా మరిచిపోయావు.. మారిపోయావు అది నీకు మంచిది కాదు."

"నా మంచిచెడ్డల గురించి నాకు బాగా తెలుసు. వాటిని గురించిన నీ ఉపదేశం.. నాకు అనవసరం."


"ఇది ఉపదేశం కాదు.. నాకు తోచిన మంచిమాట!"

"నీ మాటలను వినేదానికి నేను నీ ఫ్యాక్టరీ వర్కర్‍ను కాదు."


"నీవు ఫ్యాక్టరీ వర్కర్‍వి కావు. నా బావమరిదివి. నాకు అయినవాడివి.."

"ఆ బంధం మన మధ్యన తెగిపోయింది."

"కాదు.. అహంకారంతో నీవే తెంచేశావు."

ప్రజాపతి తీక్షణంగా హరికృష్ణ ముఖంలోకి చూచాడు.


"అవును.. నేనే తెంచేశాను. నీవంటే నాకు గిట్టని కారణంగా. ఇంకా ఎప్పుడూ నాతో మాట్లాడకు. నేను నీకు శత్రువును. నీవు నాకు శత్రువు" వేగంగా వెనుదిరిగి కార్లో కూర్చున్నాడు ప్రజాపతి. "పోనీరా!" అన్నాడు. ఆలమందలు ప్రక్కకు తొలిగాయి. ప్రజాపతి కారు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది.


సాయంత్రం ఏడుగంటలకు ఇంటికి తిరిగి వచ్చిన హరికృష్ణ.. ప్రజాపతికి తనకు జరిగిన సంభాషణను గురించి లావణ్య, ఈశ్వర్‍లతో చెప్పాడు.

అంతా విన్న లావణ్య నిట్టుర్చి..

"ఇది నేను వూహించినదే!.." అంది.

చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూచాడు హరికృష్ణ. క్షణం తర్వాత “నా ప్రయత్న ఫలితం తెలిసిపోయింది ఈశ్వర్!.. నీ ప్రయత్నా ఫలితం ఎలా వుంటుందో చూడాలి."

"ఆ ఫలితం కూడా ఇలా వుండబోతుందండీ!.. నాన్నా!.. నీవు వాడిని కలవవద్దు" తీక్షణంగా చెప్పింది లావణ్య.


"అమ్మా!.."

"అవును ఈశ్వర్ వద్దు"


"లావణ్యా!"

"ఏమిటండీ!"

"వాడి ప్రయత్నాన్ని వాణ్ణి చేయనీ!"

"నా కొడుకు వాడిముందు అవమానపడటం.. నాకు ఇష్టం లేదండీ!"


"ఈశ్వర్ మాటలకు వాడి మనస్సు మారుతుందేమో!.. మరో చివరి అవకాశాన్ని నా బావమరిదికి ఇవ్వు లావణ్యా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు హరికృష్ణ.


ప్రశ్నార్థకంగా హరికృష్ణ ముఖంలోకి చూచించి లావణ్య.

"అవునమ్మా!.. నాన్న చెప్పింది సరికదా! నా ప్రయత్నాన్ని నన్ను చేయనీ!"


సుదీర్ఘంగా నిట్టూర్చి.. "సరే చెయ్యి!.. వాడి ఏ మాటకూ నీవు తలదించకూడదు. నిర్భయంగా నీ నిర్ణయాన్ని వాడికి తెలియజెయ్యి. ’సరే అన్నాడా!’ వాడిని పట్టి పీడిస్తున్న పీడ విరగడైనట్లు అవుతుంది. ’కాదన్నాడా!’ ఆ పీడే వాణ్ణి సర్వనాశనం చేయబోతుందని అర్థం. నీవు.. ఇంట్లోకి వెళ్ళి దీప్తి చేతిని పట్టుకొని నీతో కార్లో మన ఇంటికి తీసుకొనిరా! ఆ పై వాడేం చేస్తాడో చూద్దాం. ఏమండీ!.. మీరేమంటారు?"


"అనేదానికి ఇప్పుడు క్రొత్తగా ఏముంది లావణ్యా.. దీపూ పుట్టగానే అందరం అనుకొన్నాము కదా!.. ఆమె మన ఇంటి కోడలని. ఈశ్వర్ భార్య అని. అది ఆ రోజు జరుగబోతూ వుంది" నవ్వాడు హరికృష్ణ.


ఈశ్వర్ సెల్ మ్రోగింది. చూచాడు అది దీప్తి కాల్.

"అమ్మా దీపూ!"

"ఇలా యివ్వు.."

సెల్‍ను లావణ్యకు అందించాడు ఈశ్వర్.


"దీపూ!"

"అత్తయ్యా!"

"ఎందుకురా! అంత కలవరంగా వున్నావ్?"

"వాళ్ళు రేపు ఉదయం పదిగంటలకు నన్ను చూచేదానికి వస్తున్నారట."


"మరో పావుగంటలో నా కొడుకు ఈశ్వర్.. అదే నీ బావ వాళ్ళు మామగారిని కలవడానికి ఆ ఇంటికి వస్తున్నాడు. నిర్భయంగా ఉండు. అక్కడికి వచ్చి వాడు మీ నాన్నతో మాట్లాడిన తర్వాత వాడు నీతో ఏం చెబితే అది చెయ్యి సరేనా!"

"అంటే?"

"ఈశ్వర్ నీతో చెబుతాడన్నానుగా"

"బావ ఇక్కడికి వస్తే.. గొడవ జరుగుతుందేమో అత్తయ్యా!" విచారంగా చెప్పింది దీప్తి.


"దీపూ!..నేను మామయ్య. నేను, నా కొడుకు ఒక నిర్ణయానికి వచ్చాము. మేము అన్నింటికీ సిద్ధమే. ఈ నా మాటను మీ అమ్మతో చెప్పు. ఆమె నీకు తగిన సూచన ఇస్తుంది. అక్కడికి ఈశ్వర్ రాగానే ఏం జరిగినా భయపడకు. వాడు చెప్పినట్లు చెయ్యి సరేనా!.. అవునూ.. మీ నాన్న ఇంట్లో వున్నాడా!" అడిగింది లావణ్య.


"వున్నారు అత్తయ్యా!"

"నేను చెప్పిన విషయాన్ని మీ అమ్మతో చెప్పు!" లావణ్య సెల్ కట్ చేసింది.


దీప్తి పరుగున వంటగదివైపు వెళ్ళి తనకు లావణ్య చెప్పిన విషయాన్ని చెప్పింది. జిడ్డుకారే ముఖంతో దీనంగా తల్లి ముఖంలోకి చూచింది. 

అంతా విన్న ప్రణవి నవ్వింది.


"అమ్మా!.. నేను ఎంతో దిగులుపడుతుంటే నీకు నవ్వు ఎలా వస్తుందమ్మా" బేలగా అడిగింది దీప్తి.

"నీవు చెప్పిన మా వదిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి దీపు. నేను కోరుకున్నదే జరుగబోతుంది"

"ఏమిటమ్మా అది!" అమాయకంగా అడిగింది దీప్తి.

"అదా!.. కొద్దినిముషాల్లో నీకు వివరంగా తెలుస్తుంది. వెళ్ళి స్నానంచేసి మంచిబట్టలు కట్టుకో. నా అల్లుడు నా ఇంటికి వస్తున్నాడు" ఆనందంగా నవ్వుతూ చెప్పింది ప్రణవి.


నిట్టూర్చి దీప్తి రెస్ట్ రూంలోకి ప్రవేశించింది.

మాధవయ్య, ప్రజాపతి ఆఫీస్ రూంలో ప్రవేశించాడు.

"ప్రజా!.."

"రా మాధవా.. కూర్చో!"


"ఆఁ.. ఆఁ.. వచ్చాను కదా! కూర్చుంటున్నా" కుర్చీలో కూర్చుని.

"ప్రజా!.. చిన్న సందేహం?"

"ఏమిటది?"


"వాకిట్లో ఎప్పుడూ లేనిది నలుగురు గధాద్ధరులను నిలబెట్టావు కారణం ఏమిటి?" ఆశ్చర్యంతో అడిగాడు మాధవయ్య. 


ప్రజాపతికి ’గధాద్ధరులు’ అనే పదం మాధవయ్య నోటినుంచి వచ్చిన తీరుకు నవ్వొచ్చింది. నవ్వాడు.


"జవాబు చెప్పకుండా ఏమిటా ఆ నవ్వు!" ఆశ్చర్యంతో అడిగాడు మాధవయ్య.

"వాళ్ళు మన ఫ్యాక్టరీలో పనిచేసేవారు. నాకు నమ్మిన బంట్లు. నేను ఇంట్లో లేని సమయంలో ఈ ఇంటి ఆడవారి రక్షకులుగా ఏర్పాటు చేశాను."


"అంటే.. మన వూర్లో.. ఈ ఇంటి ఆడవారి మీద ఎవరికిరా పగ!"

"వేరెవరో కాదు ఆ కుటుంబ సభ్యులు!"


"అంటే!.. హరికృష్ణ.. లావణ్య.. ఈశ్వర్ అనేనా నీ భావన!"

"అవును"

"ఒరేయ్!.. వాళ్ళు నీవు ఊహించినంత దుర్మార్గులు కారురా"

"నీకు అందరూ మంచివారే కానీ నాకు వారు చెడ్డవారు"


మాధవయ్య నిట్టూర్చి మౌనంగా వుండిపోయాడు. కొన్నిక్షణాల తర్వాత..

"సరే!.. నన్ను అర్జంటుగా రమ్మనదానికి కారణం?"

"నీవు రేపు.. మన అమ్మాయి నిశ్చితార్థాన్ని జరిపించాలి."

"ఎవరితో?" ఆశ్చర్యంతో అడిగాడు మాధవయ్య.


"అంటే.. పెళ్ళిచూపులు.. దీప్తి నిశ్చితార్థం రేపన్నమాట. అర్థం అయిందా!"

"కాలేదు"

"కాలేదా"

"అవును.. అబ్బాయి ఎవరో చెప్పకుండా ఎలా అర్థం చేసుకోగలనురా!"


"ఓహో!.. అబ్బాయి ఎవరో చెప్పలేదు కదూ!.. విను.. నా ఆప్తమిత్రుడు.. పరంజ్యోతి కొడుకు.. డాక్టర్ దివాకర్!" సగర్వంగా నవ్వాడు ప్రజాపతి.


మాధవయ్య కనుగుడ్లు పెద్దవైనాయి. ఆశ్చర్యంతో నోటిని కదపలేక తెరిచే వుంచాడు.

వాకిట వున్న రక్షక భటుల్లో ఒకతను ప్రజాపతి గదిని సమీపించి..

"అయ్యా!.."


"ఏమిట్రా"

"ఈశ్వర్ బాబుగారు వచ్చారయ్యా!"


"ఏ ఈశ్వర్?"

"మీ మేనల్లుడు ఈశ్వర్ గారు"


"వాడిని నేను రమ్మనలేదే! ఎందుకొచ్చాడు?" కసిరినట్లు అడిగాడు ప్రజాపతి.

అతని మాటలకు మాధవయ్య ఉలిక్కిపడ్డాడు. ప్రజాపతి ముఖాన్ని.. ద్వారం వద్ద నిలబడి వున్న ఆరడుగుల స్థూలకాయుణ్ణి విచిత్రంగా చూచాడు.


"అయ్యా!.. వచ్చింది ఎవరు?" అడిగాడు మాధవయ్య.

"అయ్యగారి మేనల్లుడు ఈశ్వర్ బాబుగారు!"


"ఒరేయ్!.. ప్రజా!.. ఈశ్వర్ నీ ఇంటికి వచ్చాడటరా!.. సాదరంగా లోనికి ఆహ్వానించు" చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.

"మాధవా!" గర్జించాడు ప్రజాపతి.

మాధవయ్య బెదిరిపోయాడు. బిక్కమొహంతో తలదించుకున్నాడు.


"రేయ్!.. వాడికి చెప్పు.. వాడితో నాకు ఎలాంటి అవసరంలేదని వెళ్ళిపొమ్మని చెప్పు"


"మీతో ఏదో మాట్లాడాలని వారు చెప్పారయ్యా!" భయంతో మెల్లగా చెప్పాడు ఆ యోధుడు.

"ఒరేయ్!.. నేను చెప్పింది నీకు అర్థం అయిందా!.. కాలేదా!.. వాడిని వెళ్ళమని చెప్పు. వెళ్ళకపోతే మెడపట్టి వీధి గేటు బయటికి త్రోసి గేటును మూయండి వెళ్ళు" శాసించాడు ప్రజాపతి.


ఆ వ్యక్తి వెళ్ళి ఈశ్వర్‍ను సమీపించి ప్రజాపతి చెప్పిన మాటలను చెప్పాడు.

ఈశ్వర్ చిరునవ్వుతో "అన్నా! వారు నా మామగారు.. నామీద వారికి చిరుకోపం.. కనబడి మాట్లాడితే చల్లబడతారు. నేను లోనికి వెళుతున్నాను సరేనా!" అన్నాడు.


ఈశ్వర్ మంచితనాన్ని ఎరిగిన ఆ నలుగురూ ప్రక్కకు తప్పుకొన్నారు.

ఈశ్వర్ చిరునవ్వుతో వరండా దాటి హాల్లో ప్రవేశించాడు.

సర్వాంగ సుందరంగా చక్కని అలంకరణతో తల్లి ప్రక్కన దీప్తి ఈశ్వర్‍కి కనిపించింది.

"అత్తయ్యా" ప్రణవికి చేతులు జోడించి నమస్కరించాడు. ప్రక్కనే ఓరకంట తననే చూస్తున్న దీప్తిని కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. నాలుగు కళ్ళూ కలిశాయి. సందేశాలు చేరాయి.

ప్రజాపతి ఆఫీస్ గది ద్వారాన్ని దాటి ఆ గదిలో ప్రవేశించాడు. లోనికి వచ్చి ఈశ్వర్‍ను చూచి మాధవయ్య నవ్వుతూ..

"ఒరేయ్ ప్రజా!.. లోనికి వచ్చాడు చూడు. నీ అల్లుడు ఈశ్వర్!" ఆనందంగా చెప్పాడు.


ఈశ్వర్‍ అందం అలంటిది. మగవారికే మైమరపించేది.

"మామయ్యా!.. నమస్కారం!" వినయంతో చేతులు జోడించాడు ఈశ్వర్.


ప్రణవి, దీప్తి హాల్లో సోఫాలో కూర్చొని ప్రజాపతి ఆఫీస్ గదిలో ఈశ్వర్ ప్రవేశించిన కారణంగా ఏం జరుగబోతుందో అని ఎంతో ఆసక్తితో ఆ గది ద్వారం వైపే చూపులు నిలిపారు. 

తేరుకున్న ప్రజాపతి.. "ఎందుకొచ్చావురా?" గద్దించి అడిగాడు.


"ఒరే ప్రజా!.. నీవు వాడికి మేనమామవు. వాడు నీకు మేనమామ కొంతకాలం గ్రహవీక్షణం సరిగా లేక భేదభావాలతో వున్నారు. ఇప్పుడు గ్రహాలు మంచి స్థానాల్లో వున్నాయి. దానికి నిదర్శనం ఈశ్వర్ తనకు తాను నీ వద్దకు వచ్చి.. సగౌరవంగా నీకు నమస్కరించడం. వాణ్ణి కూర్చోమని చెప్పు."


"మాధవయ్య మామయ్యా!.. ఈ ఇల్లు మా మామయ్యగారిది అంటే నా ఇంటిలో సమానం. వారు మా మామయ్యగారు. వారు నన్ను కూర్చోమని చెప్పవలసిన అవసరం లేదు. వారితో మాట్లాడాలని నేనే వచ్చాను. వారు చెప్పినా.. చెప్పకపోయినా ఈ ఇంట కూర్చునే హక్కు నాకుంది. అందుకే కూర్చుంటున్నా" నవ్వుతూ చెప్పి ప్రజాపతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.


అతని చర్యకు ప్రజాపతి ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో ఈశ్వర్ పట్ల కోపం.. ఆవేశం.. కసి.. తీవ్రంగా ఈశ్వర్ ముఖంలోకి చూచాడు.


"వాడు నీవేం చెబుతావో అనే సస్పెన్స్ లో తల్లడిల్లిపోతున్నాడు ఈశ్వర్!.. నీవు చెప్పదలచుకొన్నదేదో వెంటనే చెప్పు!" అన్నాడు మాధవయ్య.


"మామయ్యా!.. మాధవయ్య మామయ్య చెప్పినట్లుగా అది విధి నిర్ణయమే. గ్రహస్థితో, కొంతకాలంగా మన రెండు కుటుంబాల సభ్యుల భేదాభిప్రాయాలతో.. సఖ్యత లేని వారమైనాము. మేము గతాన్ని మరచిపోయాం. మీరు ఆ చేదు గతాన్ని మరిచిపొండి. మీ తరానికి ప్రొద్దు తిరిగింది. మా తరానికి ఇది సూర్యోదయం. తాతయ్య, అమ్మమ్మల హయంలో మన రెండు కుటుంబాలు ఎలా వున్నాయో.. అలాగే మా తరంలో వుండాలని నాకు దీప్తికి ఆశ. ఆ కారణంగా మేమిరువురం మీ సమ్మతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాము. ఈ మా నిర్ణయాన్ని మీరు అంగీకరించి మా ఇరువురికీ వివాహాన్ని జరిపించండి. పూర్వంగా అందరం కలిసిపోయి ఆనందంగా బ్రతుకుదాం" ఎంతో వినయంగా చెప్పాడు ఈశ్వర్.


"రేయ్ ఈశ్వర్!.. ఏం కూశావురా!.." గద్దించాడు ప్రజాపతి.

"ఒరేయ్!.. ప్రజా!.. వాడు పక్షి కాదురా కూయడానికి.. మనిషి. నీ మేనల్లుడు. ఎంతో వినయంగా తన మంచి అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని నీకు చెప్పాడు. వాడి మంచితనాన్ని అర్థం చేసుకో. ఆవేశపడకు" అన్నాడు మాధవయ్య.


"ఒరేయ్ మాధవా!.. నీవు నోరుముయ్యరా. నీ బోడి సలహాలు నాకు అనవసరం!" ఈశ్వర్ వైపుకు తిరిగి "ఒరేయ్! ఈశ్వర్! మర్యాదగా బయటికి నడు. ఈ జన్మలో మీ కుటుంబంతో నేను.. నావారు ఎలాంటి పొత్తును పెట్టుకోము. మీరు నాకు విరోధులు.. నేను మీకు విరోధిని. ఈ వరసలు మారవు. మారబోవు. లే.. వెళ్ళిపో.." ఆవేశంతో గర్జించాడు ప్రజాపతి.


ఈశ్వర్.. చిరునవ్వుతో ప్రజాపతి ముఖంలోకి చూచాడు. ఆవేశంతో అతని చేతులు, పెదవులు వణుకుతున్నాయి. క్రోధంగా ముఖం నిండా చెమట.

"మామయ్యా!.. మీకు నేను పదినిమిషాల టైమ్ ఇస్తున్నాను. సావధానంగా ఆలోచించి.. మంచి నిర్ణయానికి రండి.." చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.


"నాకు నీవు టైమ్ ఇస్తావా"

"అవును మామయ్యా!.. మీరు పెద్దవారు కదా!.. మీలా నేను ఆవేశపడకూడదు."

"ఏ విషయ్ంలో రా!.."

"మిమ్మల్ని ఎదిరించే విషయంలో!"


"నీవు నన్ను ఎదిరిస్తావా!"

"తొమ్మిది నిముషాలు మిగిలి వున్నాయి మామయ్యా!.."


"ఒరే ప్రజా!.. నీవు నన్ను గురించి ఏమనుకొన్నా.. నేను నీ మేలు కోరేవాణ్ణి. ఈశ్వర్ చెప్పిన మాటల్లో నీతి, న్యాయం, ధర్మం వున్నాయిరా. దీప్తి, ఈశ్వర్‍ల వివాహానికి అంగీకరించరా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు మాధవయ్య.


"రేయ్ ఎక్కడ చచ్చార్రా! లోనికి రండి" పిచ్చివాడిలా ఆవేశంతో అరిచాడు ప్రజాపతి.

నలుగురూ పరుగున ఆ గదిలో ప్రవేశించారు.


"ఒరేయ్!.. వాణ్ణి లాక్కుపోయి రోడ్లో త్రోసి గేటు మూయండిరా!" శాసించాడు ప్రజాపతి.

"ప్రజా!.. తప్పు నిర్ణయం తీసుకొన్నావు. అది నీకు మంచిది కాదు.." బ్రతిమాలుతూ చెప్పాడు మాధవయ్య.


"రేయ్!.. ముందు ఈ ముసలి పీనుగును ఎత్తుకొనిపోయి వీధిలో పడేయండ్రా!"

నలుగురూ.. ఈశ్వర్, మధవయ్యల ముఖాల్లోకి దీనంగా చూచారు.

"అన్నయ్యలారా!.. మీకు ఆ శ్రమ అవసరం లేదు. మూడు నిముషాల సమయం మిగిలివుంది. అయిపోగానే మేమే వెళ్ళిపోతాం" చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.


హాల్లో కూర్చొని ప్రజాపతి, ఈశ్వర్, మాధవయ్యల సంభాషణ వింటున్న ప్రణవి.. దీప్తిలు భయంతో దిగాలు పడిపోయారు. 

"మామయ్యా!.. చివరి రెండు నిమిషాలు.." చెప్పాడు ఈశ్వర్.

ఆ క్షణంలో అతని పెదాలపైన చిరునవ్వు మాయమైంది.


ప్రజాపతి ఆవేశంగా కుర్చీ నుంచి లేచి.. ఆ నలుగురినీ సమీపించి వారి చెంపలు వాయకొట్టాడు.

"నేను చెప్పిన పని చేయకుండా కొయ్యబొమ్మల్లా నిలబడతార్రా. మీకు కూలి ఇచ్చేది నేనా.. వాడా!" ఆవేశంతో ఊగిపోయాడు ప్రజాపతి.


"మామయ్యా! చివరి నిముషం. అమాయకులైన వారికి ఎందుకు కొట్టావు మామయ్యా!.. తప్పు కదూ!" అన్నాడు.

"ప్రజా! నీ చావు నువ్వు చావు. నీవు బాగుపడబోవు నే వెళుతున్నా!.." మాధవయ్య వేదనతో గదినుంచి బయటికి వచ్చాడు.


"మాధవయ్య మామయ్యా! కొన్నిక్షణాలు ఆగండి.."

మాధవయ్య ఆగి.. ఈశ్వర్ ముఖంలోకి చూచాడు.


"మామయ్యా!.. అయిపోయాయి పదినిముషాలు. ఇప్పుడు చూడండి" వేగంగా హాల్లోకి వచ్చాడు. దీప్తిని సమీపించాడు.


దీప్తి, ప్రణవి కన్నీటితో దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూచారు.

ఈశ్వర్ దీప్తి చేతిని తన చేతిలోని తీసుకొన్నాడు. "అత్తయ్యా! దీప్తి నాది. నా జీవితాంతం.. నా ప్రాణ సమానంగా చూచుకొంటాను" అని ఈశ్వర్ వేగంగా దీప్తితో కలిసి వీధిగేటు వైపుకు నడిచాడు. దీప్తి అతని ప్రక్కన లేడి పిల్లలా పరుగెత్తింది. ఇరువురూ కార్లో కూర్చున్నారు. కారు వెళ్ళిపోయింది. హాల్లోకి వచ్చిన ప్రజాపతి.. వెళుతున్న దీప్తి, ఈశ్వర్‍లను శిలాప్రతిమలా నిలబడి చూడసాగాడు.


ప్రణవి.. మాధవయ్యల కళ్ళల్లో కన్నీరు. అవి కన్నీరు కాదు. ఆనందభాష్పాలు.

ప్రజాపతి ఆవేశంతో పళ్ళు కొరుకుతూ నిలబడిపోయాడు. ఆవేశంతో కొన్ని క్షణాలు వూగిపోయాడు. నిట్టూర్చి వేగంగా మేడపైని తన గదికి వెళ్ళి తలుపు మూసుకొన్నాడు.

ఆ క్షణంలో.. అతనికి ఎంతో దుఃఖం వచ్చింది. కళ్ళ నుండి కన్నీరు ధారగా చెక్కిళ్ళపైకి జారాయి. అవమానంతో అతని హృదయంలో ఆవేదన, బాధ. 


కనీ పెంచి పెద్దచేసి తన ఇష్టానుసారంగా చదివించి నా ప్రాణ సమానంగా చూచుకొన్న నా కూతురు దీప్తి నన్ను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా ఆ ఈశ్వర్ గాడితో వెళ్ళిపోయింది. దీనికంతటికి కారణం వాడు.. ఆ నీచుడు.. ఈశ్వర్!.. వాణ్ణి బ్రతకనివ్వకూడదు. చంపెయ్యాలి!.. చంపెయ్యాలి!.. చివరి మాటలు ఆవేశంతో వున్న ప్రజాపతి నోటినుంచి పెద్దగా వెలువడ్డాయి.

అహంకారం.. స్వాతిశయం.. స్వార్థం.. మనిషిలోని మానవత్వాన్ని, వివేకాన్ని చంపేస్తాయి. మూర్ఖత్వం మంచిని సమాధి చేస్తుంది. ప్రస్తుత ప్రజాపతి ఆస్థితిలో వున్నాడు.


పగ.. ద్వేషం.. ప్రతికారాలు.. పర్యవసానం.. నష్టాన్ని, వేదనను కలిగించేవి కాని.. మంచిని పెంచలేవు.

క్రింద.. మాధవయ్య ప్రణవితో చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతో ఆనందంగా దీప్తి, ఈశ్వర్‍ల గురించి ఆలోచిస్తున్న ప్రణవి కళ్ళముందు ప్రజాపతి ప్రత్యక్షమైనాడు.


ఆమె మనస్సున ప్రజాపతి తన గదిలో ఏం చేస్తున్నాడనే అనే ఆందోళన.. చెడ్డవాడో!.. మంచివాడో!.. అతను ఆమె భర్త. ఆ పదానికి ఒక స్త్రీ మనస్సులో వుండవలసిన గౌరవం.. అభిమానం ప్రజాపతి పట్ల ప్రణవి హృదయంలో ఇంకా మిగిలివున్నాయి. ఆ కారణంగా మెల్లగా మెట్లు ఎక్కి అతని గదిని సమీపించి తలుపును త్రోసింది. లోన గడియ బిగించిన కారణంగా అది తెరువబడలేదు. నిట్టుర్చి మౌనంగా క్రిందికి వచ్చింది ప్రణవి.


ఈశ్వర్, దీప్తి హరికృష్ణ ఇంటికి చేరారు. ఇరువురూ కారు దిగి వరండాను సమీపించారు.

అక్కడే వున్నందున హరికృష్ణ.. లావణ్యలు చిరునవ్వుతో ఎంతో ప్రీతిగా వారిని చూచారు ఆ దంపతులు.

"ఆగండిరా!.." అంది లావణ్య.


దీప్తి, ఈశ్వర్‍లు ఒకరి ప్రక్కన ఒకరు నిలబడ్డారు. సిద్ధంగా ఉంచిన ఎర్రనీళ్ళ పళ్ళాన్ని చేతికి తీసుకొంది లావణ్య. ఆ ఇరువురినీ సమీపించి దిష్టి తీసింది. పళ్ళాన్ని ప్రక్కనే నిలబడి వున్న పనిమనిషి మంగకు అందించింది.

"రండి లోపలకి" అంది లావణ్య.

ఈశ్వర్, దీప్తి.. వరండాలోకి ప్రవేశించారు.


"నాకు తెలుసు. నా కొడుకు నా కోడలితో కలిసి వస్తాడని!" చిరునవ్వుతో సగర్వంగా అంది భర్త ముఖంలోకి చూస్తూ లావణ్య.

"నాకూ తెలుసు" నవ్వాడు హరికృష్ణ.


పనిమనిషి మంగ ఎర్రనీళ్లను పారబోసి దీప్తిని సమీపించి 

"కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రండి చిన్నమ్మగోరూ!" నవ్వుతూ చెప్పి మంగ ఇంట్లోకి వెళ్ళిపోయింది.


నలుగురూ వరండాలో కూర్చున్నారు.

"నాన్నా!.. ఏమన్నాడు మీ మామయ్య?" అడిగింది లావణ్య.

అక్కడ జరిగిన సంభాషణ తల్లితండ్రికి వివరించాడు ఈశ్వర్.

"మూర్ఖుని మనస్సును రంజింప చేయలేము కదా అండీ!.." భర్త ముఖంలోకి చూస్తూ అంది లావణ్య.


"అవును.. లావణ్యా!.. సరే.. జరుగవలసింది జరిగింది.. పదండి లోపలికి!" అన్నాడు హరికృష్ణ.

నలుగురూ ఇంట్లోకి నడిచారు. దీప్తి కళ్ళల్లో శతకోటి వెలుగులు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

57 views0 comments
bottom of page