top of page
Writer's pictureRohini Vanjari

అమృతత్వం

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రథమ బహుమతి రూ : 10 ,000 /- గెలుచుకుంది.ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.


'Amrutatvam' New Telugu Story

Written By Vanjari Rohini

రచన : వంజారి రోహిణి



గట్టిగా హారన్ మ్రోగడంతో ఉలిక్కిపడి ఆలోచనలనుంచి బయటకి వచ్చిన మాధుర్య, ఎదురుగా వస్తున్న కారును గుద్దుకోబోయి, తృటిలో స్కూటీని పక్కకు మళ్లించింది. ఎంత ప్రమాదం తప్పింది? అప్పుడు చూసుకుంది...తాను పరధ్యానంలో పడి గమనించపోవడంతో ఎప్పుడో కాలేజీ దాటి చాలా దూరం వచ్చేసింది. ఎక్కడలేని నీరసం వచ్చేసింది ఆమెకు.


" ఈ పెళ్లిచూపులు తన చావుకు వచ్చాయి" అనుకుంటూ స్కూటీని వెనుకకు మళ్ళించింది.

కాలేజీలోకి వచ్చేసరికి గంట పదకొండు అయింది. ఇక ఆ రోజు క్లాసులు సరిగా తీసుకోలేక పోయింది. పని అంతా అన్యమనస్కంగానే చేసింది మాధుర్య. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసి రెండు స్పూన్లు బెండకాయ కూర అన్నం తినగానే మళ్ళా పరధ్యానంలోకి వెళ్ళిపోయింది . తాను అందరిలాగే పెళ్ళికెదిగిన ఓ ఆడపిల్ల. తనకు కూడా పెళ్ళి గురించి, తన వైవాహిక జీవితం గురించి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు..పెళ్ళి చూపులు అంటే ప్రతిసారి గుండె నిండుగా పెట్టుకున్న ఆశలు. తాను వాళ్ళకి నచ్చలేదు అని వెళ్ళిపొవడంతో తన ఆశలు కూడా కొండెక్కి వెళ్లిపోయేవి.


"తినకుండా ఆ పరధ్యానం ఏంటి మాధుర్యా" అఖిల భుజం తట్టి అడగడంతో ఈ లోకంలోకి వచ్చి, సాయంత్రం తన పెళ్ళిచూపుల గురించి చెప్పింది మాధుర్య . అఖిల తన కొలీగ్ లెక్చరర్ . "మాధుర్యా... అదన్నమాట నీ పరధ్యానానికి కారణం.. ఇప్పటికే టైం మూడు అయింది. నువ్వు ఇంటికి వెళ్ళు . ఈ సంబంధం కుదిరిపోవాలి నీకు. ఆల్ ది బెస్ట్ " అంది అఖిల మనస్ఫూర్తిగా నవ్వుతూ... ఇక ఒక్క క్షణం కూడా కాలేజీ లో ఉండాలనిపించలేదు మాధుర్యకు.


ఎదురెళ్ళి తీసుకువచ్చే మర్యాదలు, ఫలహారాలు అన్నీ పూర్తి అయినాయి. మాటల్లో అబ్బాయి పేరు వసంత్ అని తెలిసింది మాధుర్యకు. ఆత్రుత పట్టలేక తలుపు సందులో నుంచి చూసింది సుజాతమ్మ వారిస్తున్నా వినకుండా. పేరులాగే వసంత రాగమంత ఆహ్లాదంగా, హుందాగా అనిపించాడు వసంత్ మాధుర్యకు. "ఇక అమ్మాయిని తీసుకురండి" ఆ మాట పిల్లనగ్రోవి నుంచి వెలువడిన మురళీనాదంలా అనిపించింది మాధుర్యకు. ఆ రోజు మాధుర్య బాబాయ్ ముకుందం, ఆయన భార్య శకుంతల వాళ్ళకి సాయంగా వచ్చారు.


అప్పటికి ఎన్నోసార్లు పెళ్ళిచూపుల తంతు జరిగినా అదే మొదటిసారి అన్నట్లు, పిన్ని శకుంతల వెంట నెమ్మదిగా వచ్చి, సోఫాలో తండ్రి పక్కన ఒద్దికగా కూర్చుంది మాధుర్య. పట్టుచీర, భారీగా నగలతో ప్రదర్శన బొమ్మలా కాక తన అభిరుచికి అనుగుణంగా పాల రోజా రంగు చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఉన్న షిఫాన్ చీర, మెడలో చిన్న గొలుసు, చేతులకు రెండు బంగారు గాజులు. అంతే తన అలంకరణ. నడుమును దాటే ఒత్తైన పొడవాటి జడ ఆమెకు ఓ ఆకర్షణ. జడలో నిండుగా మల్లెలు. అంతవరకూ గల గలా సాగిపోతున్న వారి మాటల ప్రవాహం, పెళ్ళి చూపుల ప్రహసనం కాస్తా, మాధుర్య రాకతో ఒక్కసారిగా గంభీర్యాన్ని సంతరించుకుంది. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చేముందు ఉన్న నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.


" ఏం చదువుకున్నావు అమ్మా" ఏదో ఒక ప్రశ్న అడగాలని అడిగినట్టు అన్నాడు వసంత్ నాన్న విద్యాసాగర్ రావు. " ఎం.ఏ. పూర్తి చేశాను. డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను" వినయంగా చెప్పింది మాధుర్య.

మరో పది నిముషాల కాలం పది గంటల్లా సాగింది.


" బాబూ వసంత్ ! నువ్వు అమ్మాయిని ఏమైనా అడగదల్చుకుంటే అడుగు బాబు " అంది సుజాతమ్మ. ' ఏం లేదు 'అన్నట్టు తల అడ్డంగా ఊపాడు వసంత్. తర్వాత ఏం సంభాషణ జరుగుతుందో తెలిసిపోయింది మాధుర్యకు. అప్పటికే చాలాసార్లు అనుభవమై ఉండడంతో, అనుభవ సత్యంగా అదే జరిగింది. "అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళండి సుజాత గారు " వసంత్ వాళ్ళ అమ్మ నోటి నుంచి ఆ మాట రాగానే మాధుర్య లోపలకు వచ్చేసింది. మరో ఐదు నిముషాల తర్వాత " మేము వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాం " వసంత్ వాళ్ళ నాన్న అన్నారు.


ఒక వారం రోజులు గడిచింది. ఆ వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్ద యుద్ధం జరిగింది. అప్పుడప్పుడు సుజాతమ్మ మాత్రం " అబ్బాయి బంగారంలా ఉన్నాడు. వీళ్ళకి మన మాధుర్య నచ్చితే చాలు" అంటూ తనకు గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరికి రకరకాల మొక్కులు మొక్కేసింది. ఏ క్షణంలో ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సివస్తుందో అని అందరు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడసాగారు. మాధుర్య మనసు వసంత్ తో తన మమతల పందిరి అల్లుకోసాగింది తన ప్రమేయం లేకుండానే. ఇంతకు ముందర పెళ్ళి చూపులకు వచ్చిన ఎవరూ పెద్దగా తన మనసుని కదిలించలేదు. ఎందుకో వసంత్ తన మనసుకు చాల దగ్గరగా వచ్చాడు. చాల సంస్కారవంతుడిగా అనిపించాడు. అయినా తను అతనికి నచ్చుతానో లేదో అని సందేహంతో అసలు నిద్రపట్టేది కాదు మాధుర్యకి.


అందరి ఉత్కంఠతకి తెర దించుతూ ఓ రోజు సాయంత్రం వసంత్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్. రాజారావు ముఖంలో మారే కళలను బట్టి వాళ్ళు ఏం చెప్పారో పూర్తిగా అంచనా వేయలేక పోయారు మాధుర్య, సుజాతమ్మలు. సాంతం మాట్లాడి నిస్తేజంగా సోఫాలో కూర్చుండిపోయాడు రాజారావు. షరా మాములే అన్నట్టు ' అమ్మాయి నల్లగా ఉంది' అని చెప్పలేక 'అంతా బాగుంది అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరి జాతకాలూ కలవడం లేదుట అండి. మీరు వేరే ప్రయత్నం చేసుకోండి ' అంటూ నీళ్ళు నములుతూ చెప్పాడమ్మా వసంత్ వాళ్ళ నాన్న". విచార వదనంతో చెప్పాడు రాజారావు.


ఎప్పుడు లేనిది ఆ రోజు సుజాతమ్మ ఓర్పు నశించి " నేను భయపడుతూనే ఉన్నాను. ఇట్లాంటిదేదో వినాల్సి వస్తుందని. అనుకున్నంతా అయింది. దీని ముఖాన పెళ్ళి రాత రాసిపెట్టి లేదు. మన ముఖాన సంతోషపడే రాత కూడా లేదు. దరిద్రం చుట్టుకుంది ఇంటికి దీని రూపంలో. " కూతురు బాధ పడుతుందనే విచక్షణ లేకుండా అరుస్తూ కన్నీటిని చీరకొంగుతో తుడుచుకొంది సుజాతమ్మ.


"మతి ఉండే మాట్లాడుతున్నావా సుజాతా నువ్వు? కన్నబిడ్డని పట్టుకుని అంత మాటలంటున్నావు. అది ఏం తప్పు చేసిందని. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇక ఈ విషయం మరిచిపోదాం" అంటూ కూతురి వైపు కాస్త జాలిగా చూసాడు రాజారావు. ఆ చూపులకు తట్టుకోలేకపోయింది మాధుర్య. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తనని పల్లెత్తి మాట అనని అమ్మ ఆ రోజు అలా అనేసరికి తట్టుకోలేక పోయింది. ఎన్నిసార్లు పెళ్లిచూపులు జరిగినా, ఎంత మంది తనను నిరాకరించినా అప్పుడు తనకి పెద్దగా బాధనిపించలేదు. కానీ వసంత్ మీద తనకి తెలియకుండానే ఎన్నో ఆశలు పెట్టుకుంది మాధుర్య. వాళ్ళు తనని వద్దనడం ఓ పక్క, ఎప్పుడు లేనిది తల్లి ఛీత్కారం, తండ్రి జాలి చూపులు తట్టుకోలేక పోయింది. కాలేజీ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది. తాను కట్టుకున్న ఆశల గూడు పెను తుఫాన్ కి చెదిరి పోయినట్టు, దావానలంలో మాడి మసైనట్టు విలవిలలాడింది. నాలుగు రోజుల్లోనే తాను నిస్తేజ శిలలా మారిపోయింది.


ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మాధుర్య క్లాసు అటు పూర్తై ఇటు స్టాఫ్ రూమ్ కి వచ్చిందో లేదో సెల్ మ్రోగింది. సెల్ స్క్రీన్ మీద చూసి 'అమ్మ దగ్గరనుంచి ' అనుకుంటూ నిరాసక్తంగా సెల్ ఆన్ చేసింది మాధుర్య. ఫోన్ ఆన్ చెయ్యగానే " మధూ, మీ రమణ పెద్దనాన్న చనిపోయారని ఇప్పుడే ఊరినుంచి ఫోన్ వచ్చింది. నేను, నాన్న ఊరికి వెళుతున్నాం. ఇంటి తాళాలు మన పక్కింటి వాళ్ళకి ఇచ్చివెళ్తున్నాం. రాత్రికి మేము అక్కడే ఉంటాం. తిరిగి ఎప్పుడు వచ్చేది మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు" అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుజాతమ్మ మాధుర్య జవాబు కోసం చూడకుండా.


'అయ్యో... రమణ పెద్దనాన్న చనిపోయారా. మూడు నెలల క్రితం ఊరు వెళ్ళినప్పుడు చాలా హుషారుగా తనను తీసుకుని వెళ్లి వాళ్ళ పొలాలు, తోటలు అన్నీ చూపించారు. పాపం ఏమైందో ' అనుకుంది. మొదలే మనసు బాగాలేదు, ఇప్పుడు ఈ వార్త. ఇక పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది మాధుర్య. తలనొప్పి కూడా మొదలైంది. అఖిల కి చెప్పి, ఇంటికి వెళ్లాలని ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయలుదేరింది మాధుర్య. పక్కింట్లో తాళాలు అడిగి తీసుకుని ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కునే ఓపిక కూడా లేక మంచం మీద వాలిపోయింది. ఆ రోజెందుకో ఎవరూ పిలవకుండానే వచ్చి వరద ఊరిని ముంచెత్తినట్టు తనకి తెలియకుండానే కన్నీళ్ళు వరదలై తలగడని తడిపివేసాయి. ఎంత సేపు అలా అచేతనంగా ఉండిపోయిందో తెలియలేదు ఆమెకి.


బాగా పొద్దు వాలిపోయి చీకట్లు కమ్ముకోసాగాయి. అచేతనావస్తో, మగత నిద్రో తెలియని మాధుర్య, ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. గదంతా చీకటితో నిండిపోయి ఉంది, తన మనసులోలాగే. మెల్లగా లేచి లైటు వేసి వాష్ రూమ్ కి వెళ్లి ముఖం కడుక్కు వచ్చింది. చెదిరి పోయిన ఆలోచనలన్నీ మళ్ళీ ఒక్కొక్కటి చేరి చెద పురుగుల్లా మనసుని తొలిచేస్తున్నాయి. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది మాధుర్య. ఛామన ఛాయ కంటే కాస్త నలుపు. ఇదేనా, ఈ ఒంటి రంగేనా నా మొత్తం జీవితానికి నల్లటి రంగు పులిమింది. ఈ చీకటి రంగేనా నా ఆశల పందిరిని అంధకారంలో నింపింది. ఇక ఈ జీవితం ఇంతేనా? ఎవరికీ తాను నచ్చక, ఇలా జీవితాంతం కన్యగానే మిగిలి పోవలసిందేనా? అమ్మా, నాన్నలకు తాను గుదిబండ కావాల్సిందేనా? తన వల్ల బాధ తప్ప అమ్మ, నాన్నలకు ఉపయోగం ఏమి ఉంది? తాను ఇక ఎందుకు బతకాలి? ఆలోచనలు అదుపుతప్పుతూ తనను అదఃపాతాళానికి నెట్టివేస్తున్నాయి. మనసునిండా అలుముకున్న నిరాశ అగ్నికీలల్లా కమ్ముకుంటోంది. బలహీన క్షణాలు ఒక్కొక్కటే వేయి ఏనుగులంత బలం పుంజుకుని మాధుర్య మనసును చుట్టుముడుతున్నాయి. ఆఖరి బలహీన క్షణం ఆమెను బలంగా తనలోకి లాక్కుంది.


గిరుక్కున వెనుతిరిగి వేగంగా మంచం వెనుక ఉన్న కబోర్డు తెరిచింది. పెళ్ళి చూపుల రోజు తను కట్టుకున్న షిఫాన్ చీర, పైనే కనపడింది. చీరను మడత విప్పి స్టూల్ ని గది మధ్యకు జరిపింది. చీరను ముడి వేసి ఫ్యానుకి తగిలించింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. స్టూల్ మీదకు ఎక్కి ఆఖరిసారిగా చుట్టూ చూసింది. ఎటు చూసినా లైట్ కాంతిలో కూడా చిక్కటి చీకటి తన నల్లటి దేహాన్ని గేలి చేస్తున్నట్టు, తనని చూసి నవ్వుతున్నట్టు విలవిలలాడిపోయింది మాధుర్య. ఇక క్షణం కూడా ఆలోచించకుండా చీర ముడిని మెడకు తగిలించుకుంది. కళ్ళు మూసుకుని కాలితో స్టూల్ ను తన్నబోయే క్షణం లో .....


"మాధుర్యా! ఏందీ నువ్వు చేస్తున్న పని ". పెద్దగా అరుపు విని ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది. ఎదురుగా తన మేనత్త వసుమతి. కనురెప్పపాటులో వసుమతి తన చేతిలోని బ్యాగ్ ని పక్కకు విసిరి మాధుర్యను పట్టుకుని మెడలోని చీరను తీసి స్టూల్ మీద నుంచి కిందకు దించింది. " అత్తయ్యా! నన్నెందుకు కాపాడావు. నేను బతికి ఎవరికీ ఏ లాభం లేదు. నన్ను చనిపోనీ" వసుమతి ఒడిలో పడుకుని బోరున విలపించింది మాధుర్య. దుఃఖంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా తలకెక్కదు అని మాధుర్యను బాధ తీరేవరకు అలాగే తన ఒడిలో ఉంచుకుని తల నిమురుతూ ఉండిపోయింది వసుమతి. కన్నీటి రూపంలో కాస్త దుఃఖపు భారాన్ని కరిగించుకున్న మాధుర్య కాస్త తేట పడి కళ్ళు తుడుచుకుని " అత్తా.. మరి నువ్వు ఊరికి వెళ్లలేదా? రమణ పెద్ద నాన్న చనిపోయారు కదా. అమ్మ, నాన్న అక్కడికి వెళ్లారు". అంది మాధుర్య.


"నా సంగతి సరే. నీ సంగతి ఏంటి మధూ.. ? చనిపోవాలని ఎందుకు అనుకున్నావు. ఏం సాధిద్దాం అని. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయివుంటే ఏమైయేదో తల్చుకుంటేనే ఒణుకు పుడుతోంది. ఊరికి వెళ్లకుండా నేను ఇక్కడకి రావడమే మంచిదైంది" అంది.

" అత్తా.. మొన్న వచ్చిన పెళ్ళి సంబంధం కూడా తప్పిపోయింది. దానికి కారణం నా ఒంటి రంగు. అప్పటివరకు బాగా మాట్లాడుతున్న వాళ్ళల్లా నేను లోపలి గదిలో నుండి వారి ఎదుటకి వచ్చే సరికి, నా ఒంటి రంగు చూడగానే వాళ్ళ ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఇక ఈ జన్మకు నేను ఎవరికీ నచ్చను. ఇటు అమ్మ వాళ్ళకి గుండెల మీద కుంపటి అవడం నాకు ఇష్టం లేదత్తా. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. బతికుండి ఏమీ సాధించలేకపోయాను. నేను చనిపోయి అమ్మ వాళ్ళ భారం తగ్గించాలని" మళ్ళీ కన్నీటి సంద్రమైంది మాధుర్య.


“పిచ్చిదానా! నువ్వు చనిపోయి వాళ్ళ భారం తగ్గిద్దాం అనుకున్నావా? నువ్వు వాళ్ళకు లేక లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవు. నువ్వు లేకుండా వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు అనుకున్నావు? కన్న బిడ్డని పోగొట్టుకున్న వాళ్ళు బ్రతికున్నంతవరకు ప్రతిక్షణం నిన్ను తల్చుకుని నరకం అనుభవిస్తారు. ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు పని చేయనని ముందు నాకు మాట ఇవ్వు " అంది వసుమతి మాధుర్య వంక చేయి చాపుతూ.


ఒక్క క్షణం ఆలోచించి వసుమతి చేతిలో చేయి వేసింది మాధుర్య. కాస్త తేలిక పడ్డ మనసుతో " మధూ! మన మాటల్లో చాలా పొద్దు పోయింది. నేను అమ్మ వాళ్ళతో కల్సి ఊరికి పోదామనే ఇక్కడకి బయలుదేరాను. మీ మామయ్య క్యాంపు వెళ్ళాడు. శ్రీకర్ కి జ్వరం రావడంతో వాడి దగ్గర ఉండి నేను బయలుదేరేసరికి చాల ఆలస్యం అయింది. నేను ఫోన్ చేయకుండా ఇక్కడకు రావడం మంచిదైంది. లేకుంటే అమ్మ వాళ్ళు లేరని నేను నేరుగా ఊరికి పోయేదాన్ని. పొద్దున్న నేను వెళ్లేసరికి అక్కడి కార్యక్రమం అయిపోతుంది. ఇక నేను అక్కడ చేసేది ఏం లేదు. ఇప్పుడు జరిగిన విషయాలు ఏవీ నేను అమ్మా వాళ్లకి చెప్పను. నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో. రేపు మాట్లాడుకుందాం " అంది వసుమతి. ఆలాగే అంటూ తలఊపింది మాధుర్య బుద్దిగా. ఇద్దరూ కాస్త మజ్జిగ తాగి పడుకున్నారు.

ఇంట్లోకి వస్తూనే " అయ్యో.. వసు..! నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడకు. నువ్వు వస్తావని చాలాసేపు చూసాం. నీ ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది. ఇక నేను, మీ ఆన్నయ్య ఊరికి వెళ్ళాం" అంది సుజాతమ్మ.


" అవును వదినా. శ్రీకర్ కి ఒంట్లో బాగాలేదు. ఆయన క్యాంపులో ఉన్నారు. నేను ఇక్కడకి వచ్చే సరికి చాల పొద్దుపోయింది. సరే ఇక పొద్దున్న నేను ఊరికి వచ్చినా లాభం లేదు. అందుకని మాధుర్యతో ఉండిపోయాను. పాపం రమణ అన్నయ్యకి ఏమైంది? " అంది కళ్ళు ఒత్తుకుంటూ...వసుమతి.


" మొన్న పొద్దుటి వరకు బాగానే ఉన్నారట. సాయంత్రం టీ తాగి పడక కుర్చీలో పడుకుని పేపర్ చదువుతున్నవాడల్లా అలాగే తల వాల్చేశారట. హాస్పిటల్ కు తీసుకువెళ్ళే లోపలే ప్రాణం పోయిందట. హార్ట్ ఎటాక్ అని చెప్పారట డాక్టర్. బాధ్యతలన్నీ తీరి ప్రశాంతంగా ఉండాలనుకున్న సమయంలో మీ వదినకు ఈ కష్టం వచ్చింది." బాధగా చెప్పింది సుజాతమ్మ.

"అన్నయ్యా ! నాతో పాటు మాధుర్య ని హైదరాబాద్ తీసుకుపోతాను. ఓ పది రోజులు నా దగ్గర ఉంచుకుని పంపుతాను. ఆయన కూడా క్యాంపులో ఉన్నారు. నెల రోజులు రారు . నాకు కాస్త తోడుగా మాధుర్య ఉంటుంది ". అంది వసుమతి.


కూతురి వంక చూసాడు రాజారావు. " అత్తయ్యతో వెళతాను నాన్నా" అంది మాధుర్య.

"మరి కాలేజీ? " అనుమానం, అమాయకత్వం కలబోసినట్టు అడిగింది సుజాతమ్మ. ఆ రోజు కూతురి మనసు బాధపడేలా మాటలు అన్నానని సుజాతమ్మ లోలోపల క్రుంగి పోయింది. కూతురు సరిగా మాట్లాడడం లేదని దిగులు పడింది.


" సిక్ లీవ్ అని నెల రోజులు సెలవు పెడతానులే అమ్మా" అని మాధుర్య అనడంతో " మంచిది రా వసు..కాలేజీ పనిలో చాలా ఆలసిపోతోంది. దానికీ గాలి మార్పు ఉన్నట్టు ఉంటుంది " అంది సుజాతమ్మ,మాధుర్య తనతో మాట్లాడిన ఆనందంలో పెళ్ళి సంబంధం తప్పిపోయిన విషయం వసుమతితో చెప్పకుండా.


మాధుర్య, వసుమతితో హైదరాబాద్ వచ్చి రెండు రోజులు అయింది. శ్రీకర్ కి జ్వరం తగ్గి స్కూల్ కి వెళ్ళసాగాడు. ఆ రోజు నుంచి వరుసగా ఓ నాలుగు రోజులు వసుమతి ..మాధుర్యను తాను వెళ్లే ఆనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలకు తీసుకెళ్లింది. అక్కడ వారు ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారో అన్నీ చూపించింది. తల్లి తండ్రి ఎవరో కూడా తెలియని అనాధ పిల్లలు, కన్న బిడ్డలు వదిలేసిన వృద్దులకు తాను, తన స్నేహితురాళ్ళు ఇచ్చే చేయూత, వాళ్ళ కోసం చేసే సేవాకార్యక్రమాలను ప్రత్యక్షంగా మాధుర్యకు చూపించింది. ఆ తర్వాత ఓ రోజు కార్మిక నగర్ లాంటి మురికి వాడలకు తీసుకెళ్ళి, దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలలో వారి రేకుల షెడ్డు లాంటి ఇళ్లలో వారి దయనీయమైన బ్రతుకులను చూపించింది. అక్కడి పిల్లలకు తాను చదువు నేర్పడానికి రోజూ వెళతానని చెప్పింది వసుమతి.


వసుమతి అత్తయ్యకు మంచి మనసు ఉంది అని తెలుసు కానీ ఇప్పుడు అవసరమైన వారికి ఆమె చేసే సేవలు చూసి అబ్బురపడింది మాధుర్య. వసుమతితో కలసి ఓ పది రోజులు సాయంత్రాలు కార్మిక నగర్ వెళ్లి అక్కడి పిల్లలకు తాను కూడా చదువు చెప్పింది.


వృద్దాశ్రమాలలో సేవలలో కూడా పాలుపంచుకుంది. ఈ పది రోజుల్లో వసుమతి అత్తయ్య సాహచర్యంలో, సాంత్వన వచనాలతో చాల మార్పు వచ్చింది మాధుర్యలో. జీవితంలో ఆనందం అంటే తన సుఖమే కాదు. ఇతరుల బాధలను పంచుకోవడంలో, అవసరం అయిన వారికి సాయం అందించడంలోనే నిజమైన తృప్తి, ఆనందం ఉంది అనిపించింది ఆమెకి .

మరో వారం రోజులు ఏడు క్షణాల్లా గడిచి పోయాయి. ఆ రోజు కార్మిక నగర్ లో పిల్లలకు పాఠాలు చెప్పి ఇంటికి వచ్చారు మాధుర్య, వసుమతి. ఇద్దరికి 'టీ' చేసి రెండు కప్పుల్లో తెచ్చింది వసుమతి.


"అత్తయ్యా! నేను వచ్చి దాదాపు ఇరవై రోజులౌతోంది. అమ్మా, నాన్న కూడా ' ఎప్పుడొస్తావ్ ' అంటూ ఫోన్లు చేస్తున్నారు " అంది మాధుర్య.

"అప్పుడే వెళ్ళిపోతావా? మధు..నీకు నాతో కలసి ఆశ్రమాలకు, కార్మిక నగర్ కు తిరగడానికి ఇబ్బందిగా ఉందా చెప్పు. " అంది వసుమతి బింకంగా చూస్తూ .


"అయ్యో...అదేంలేదు అత్తయ్యా! ఇంత వరకు నేను బావిలో కప్పలాగా ఉన్నాను. ఆడపిల్లకు ఆనందం పెళ్ళి, సంసారం, పిల్లలు వీటిలోనే ఉంది అనుకున్నాను అత్తా ! ఇక్కడకు వచ్చాకే నాకు అసలైన జీవితం అంటే ఏమిటో తెలిసింది. నువ్వు చేసే ఈ సేవా కార్యక్రమాలలో నేను కూడా భాగం పాలుపంచుకోవాలని ఉంది అత్తయ్యా ! " అంది మాధుర్య ఆర్తిగా వసుమతి వైపు చూస్తూ.


“ అయితే ఇంకేం మధూ. నువ్వు ఇక్కడి కాలేజీకి బదిలీ చేయించుకో. నా దగ్గరే ఉందువు కానీ. మాకు శ్రీకర్ ఎంతో నువ్వూ అంతే. మీ అమ్మా,నాన్నలని నేను ఒప్పిస్తాను. ఓకేనా" అంది వసుమతి.


"అత్తయ్యా! అంతకంటే నాకు ఇంకేం కావాలి" అంది మాధుర్య ముఖంలో ఆనందం తాండవిస్తుండగా.


"మధూ... ఇంకో మాట. ఎవరో మనలను నచ్చలేదని మనం జీవితాంతం బాధపడుతూ కూర్చోకూడదు. ఈ లోకం ఎట్లాంటిదంటే ఓ వ్యక్తి పొడుగ్గా ఉంటే జెండా బొంగు అంటారు. పొట్టిగా ఉంటే పొట్టి అంటారు. తెల్లగా ఉంటే అబ్బా..పాలిపోయిన రంగు అంటారు. నల్లగా ఉంటే కర్రి అంటారు. అలాగే జీవితంలో ఓడిపోయారనుకో ' నే ముందే చెప్పాను. వీళ్ళు క్రింద పడతారని . నేల విడిచి సాము చేస్తే పడరా ' అంటారు . అదే మనిషి విజయం సాధిస్తే అదే నోటితో ‘నాకు తెలుసు వీళ్ళు సాధిస్తారని, కష్ట పడ్డారు మరి ‘ అంటారు. అంటే మనం ఎట్లా ఉన్నా లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే 'లోకులు పలు కాకులు ' అనే సామెత వచ్చింది.


ఈ రోజు నువ్వు నల్లగా ఉన్నావు అని గేలి చేసిన వాళ్ళే, రేపు నువ్వు విజయం సాధిస్తే గొప్పగా పొగుడుతారు. చాల మంది నలుపు రంగు అశుభం, అపశకునం అని అనుకుంటారు. అది వట్టి అపోహ మాత్రమే. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం, ఆత్మ విశ్వాసం చాల గొప్పవి. ఒక మనిషిలో చూడాల్సినవి ఈ రెండు లక్షణాలే. మిగతావన్నీ ఆశాశ్వతాలే. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందు నీ కెరీర్ లో, జీవితంలో విజయం సాధించు. నిన్ను నిన్నుగా ఇష్టపడిన వాళ్ళు నీకు తారసపడితే పెళ్ళి చూసుకో. అప్పుడు కూడా నువ్వు నీ లక్ష్యాన్ని మరవకు. ఏంటి వింటున్నావా మధూ... " మాధుర్య ముఖంలోకి తేరిపారా చూస్తూ అడిగింది వసుమతి.


అప్పటిదాకా ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళి మంత్రముగ్ధురాలిలా వసుమతి మాటలను వింటున్న మాధుర్య ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. వసుమతి చేతులను పట్టుకుని " అత్తయ్యా! ఆ రోజు నిజంగా సమయానికి నువ్వు మా ఇంటికి రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉండేదాన్ని కాదేమో. ఆ రోజు ఆ పెళ్ళి సంబంధం తప్పి పోయిందని ఎంత నిరాశ, మూర్ఖత్వంతో నేను ఆత్మహత్య చేసుకోబోయానో తల్చుకుంటే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నీవిచ్చిన ధైర్యం, భరోసాతో నా మనసు వజ్రం కన్నా దృఢంగా, దూది పింజ కన్నా తేలిక అయిపోయింది అత్తయ్యా . ఇక జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలననే నమ్మకం నా మీద నాకు కలిగింది. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అత్తయ్యా " అంటూ మాధుర్య వసుమతిని హత్తుకుంది.


కాలం 'కీ' ఇచ్చి వదిలిన గుర్రం బొమ్మలా, చకచకా ముందుకు కదలసాగింది. మాధుర్య అమ్మ, నాన్నలను ఒప్పించి హైదరాబాద్ లోని ప్రభుత్వ కాలేజీకి లెక్చరరుగా బదిలీ చేయించుకుంది. ఓ పక్క కాలేజీలో తన విధులు నిర్వహిస్తూనే మరోపక్క తన సేవా కార్యక్రమాలను విస్తృత పరచుకుంది. వసుమతితో కలసి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి సాంబ్రాణి కడ్డీలు, కాండిల్స్, వాసెలిన్, పేపర్ ప్లేట్స్ తయారీ వంటి పనులలో, ఆశ్రమంలో శక్తి ఉండి పని చేయగలిగిన వాళ్లకు శిక్షణ ఇప్పించింది. ఇంకొందరు అనాధ మహిళలకు కూడా టైలరింగ్, అప్పడాల తయారీ, కేకులు తయారీ వంటివి నేర్పి వాళ్ళకి ఉపాధి కల్పించింది. ఇప్పుడు మాధుర్య కు చేతి నిండా పని. తన గురించి తాను ఆలోచించే సమయం కూడా లేదు. అంతగా సేవాకార్యక్రమాలలో మునిగిపోయింది. ఆ సంవత్సరపు ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు, ఉత్తమ సేవలందించే వారికి ఇచ్చే మదర్ థెరిసా అవార్డు ...రెండూ ఒకదాని వెంట ఒకటి పోటీ పడి మాధుర్యను వరించాయి. కూతురు సాధించిన విజయాలకు సుజాతమ్మ , రాజా రావులు పొంగిపోయారు.


కాలం 'నేను ఎవరి మాట వినను. ఎవరి కోసం ఆగను' అంటూ వెనుకడుగు వేయకుండా సూటిగా ముందుకు వెళుతోంది. ఆ రోజు కాలేజీ వదలగానే స్కూటీలో ఇంటికి బయలుదేరింది మాధుర్య. యూసుఫ్ గూడ చౌరస్తా దగ్గర రోడ్డు మీద గుంపులుగా జనాలు నిలబడి ఉన్నారు. జనాల మధ్యలో ఏం జరిగిందో మాధుర్యకు సరిగా కనపడలేదు. స్కూటీని కాస్త రోడ్డు ప్రక్కగా పార్క్ చేసి, ఆ గుంపు మధ్యకు వెళ్ళింది. స్కూటర్లో వెళ్లే అతన్ని కారు గుద్దేసిందట. కారులో ఉన్న వాళ్ళు ఆగకుండా వెళ్లిపోయారట. తీవ్ర గాయాలతో అతను బోర్లా పడి ఉన్నాడు. 'అయ్యో పాపం' అంటున్నారే కానీ ఒక్కరూ అతన్ని లేపడానికి ప్రయత్నించలేదు. 'పోలీస్ కేసు అయితే మనకెందుకు లేనిపోని గొడవ' అని చూసి వెళ్లిపోతున్నారు.


ఎవరో 108 కి ఫోన్ చేసినట్టు ఉన్నారు. గణ గణ మంటూ సైరన్ మ్రోగించుకుంటూ అంబులెన్సు వచ్చింది. హాస్పిటల్ సిబ్బంది ఇద్దరు, స్ట్రెచర్ మీద అతన్ని పడుకోబెట్టి అతనితో ఇంకెవరైనా ఉన్నారేమో అని అక్కడివాళ్లను అడుగుతున్నారు . అప్పుడు చూసింది అతని ముఖం. తను వసంత్. యేడాది క్రితం జరిగిన పెళ్ళి చూపులపుడు ఒక్కసారి చూడగానే అతని రూపురేఖలను తన మనసులో ముద్రించుకున్నందువల్ల వెంటనే అతన్నిగుర్తు పట్టింది. వసంత్ తమ బంధువు అని, హాస్పిటల్ కి వస్తానని మాధుర్య కూడా అంబులెన్సు ఎక్కింది.

హాస్పిటల్ లో బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్నాడు వసంత్. ఆక్సిడెంట్ లో అతని కుడి చేయి విరిగింది. చేతికి కట్టు, మరో చేతికి బాటిల్ నుంచి ఒక్కోచుక్కసెలైన్ వాటర్ అతని శరీరంలో కలుస్తోంది.


మాధుర్య వసుమతికి ఫోన్ చేసి వసంత్ విషయం చెప్పి రాత్రికి ఇంటికి రానని చెప్పింది. స్పృహలోకి వచ్చిన వసంత్ కి కళ్ళు తెరవగానే మాధుర్య కనిపించింది. విస్మయంతో చూసాడు మాధుర్య వైపు. జరిగినదంతా తన ద్వారానే తెలుసుకుని కృతజ్ఞత, పశ్చాత్తాపంతో కూడిన దృక్కులు సారించాడు ఆమె వైపు. మాధుర్య మాత్రం చెరగని చిరునవ్వుతో అంతకు ముందు తమ మధ్య ఏమీ జరగనట్టే అతనితో మాట్లాడింది. వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ అడిగి తీసుకుని, వసంత్ కి ప్రమాదం జరిగిన విషయం చెప్పి, అతను ఇప్పుడు హాస్పిటల్ లో క్షేమంగా ఉన్నాడనీ, వాళ్ళని కంగారు పడి అంత రాత్రి వేళ రావద్దనీ , వసంత్ కి తోడుగా తను ఉంటానని హాస్పిటల్ అడ్రస్ చెప్పింది.


అప్పటికే సమయం రాత్రి పదకొండు అయింది. వసంత్, మాధుర్య వంక చూసి ఏదో మాట్లాడపోయాడు. కానీ అంతలోనే నర్సు వచ్చి నొప్పులకు, నిద్రకి ఇంజక్షన్ ఇవ్వడంతో మగతగా కళ్ళు మూసుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే వసంత్ అమ్మ, నాన్న హాస్పిటల్ కి వచ్చి రిసెప్షన్ లో కనుక్కుని వసంత్ ఉన్న రూంకి వచ్చారు. మాధుర్య కుర్చీలో కూర్చుని ఉంది. వసంత్ అమ్మ పెద్దగా ఏడుస్తూ " అయ్యో...నా బిడ్డకేమైంది దేవుడా. నెల రోజులలో పెళ్ళి పెట్టుకుని వీడికీ ప్రమాదం జరగడం ఏమిటి మన గ్రహచారం కాకపోతే " అంటూ పెద్దగా శోకాలు ప్రారంభించింది. వసంత్ వాళ్ళ నాన్న ఆమెను వారిస్తూ " ఊరుకో జానకి, భగవంతుడి దయ వల్ల వాడికేం కాలేదులే. ఇదుగో ఈ అమ్మాయి మాధుర్య నీకు గుర్తుందా. తను వసంత్ ని సమయానికి హాస్పిటల్ లో చేర్పించింది " అంటూ మాధుర్య వంక చూసి చేతులు జోడించాడు.


"అయ్యో, మీరు పెద్ద వారు అంకుల్. నాకు దణ్ణం పెట్టకూడదు. ప్రమాదం జరిగి రోడ్డు మీద దిక్కులేనివాడిలా పడి ఉన్న వసంత్ ని అలా వదిలేసి నా మానాన నేను ఎలా వెళ్ళగలను..? ఎవరు ఆపదలో ఉన్నామనం సాయం చేస్తాం కదా. నేను చేసిన గొప్ప ఏముంది " అంది. వసంత్ వాళ్ల అమ్మ కూడా మాధుర్య చేతులు పట్టుకుని " తల్లీ! నువ్వు జరిగినదేదీ మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి " అంటూ మాధుర్య తల నిమిరింది ఆప్యాయంగా.

రెండు నెలల తర్వాత ఓ రోజు సాయంత్రం మాధుర్య పెరటిలో అల్లుకుని ఉన్న మల్లె తీగ నుంచి అప్పుడే కాస్త కాస్త విచ్చుకుంటూ పరిమళాలను వెదజెల్లే మల్లె మొగ్గలను కోస్తోంది. తలంటుకుని జుట్టు ఆరబెట్టుకుంటుందేమో, పొడవైన ఆ కురులతో తను వన కన్యలా ఉంది. అప్పుడే కాంపౌండ్ గేటు తెరచుకుని ఇంటిలోకి వచ్చాడు వసంత్. గేటు చప్పుడుతో వెనక్కి తిరిగిన మాధుర్యకి వసంత్ లోపలకు వస్తూ కనిపించాడు. అతని కుడి చేయి విరగడంతో ఇంకా కట్టు అలాగే ఉంది. చేయి కదలకుండా బ్యాండ్ వేసి మెడకు తగిలించుకున్నాడు.అతన్ని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది మాధుర్య. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. పరస్పర యోగ క్షేమాలు మాట్లాడుకుంటుండగా వసుమతి వచ్చింది అక్కడికి. వసంత్ ని పరిచయం చేసింది మాధుర్య.


"మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను 'టీ' తెస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళింది వసుమతి.

"వసంత్ గారూ, మొన్న హాస్పిటల్ లో మీ అమ్మ గారు ' నెల రోజులలో పెళ్ళి పెట్టుకుని ఇలా జరిగింది ' అన్నారు కదా. మరి మీ పెళ్ళి..? " అంటూ ప్రశ్నార్ధకంగా అతనివంక చూసింది మాధుర్య.


"ఇంకెక్కడి పెళ్ళి మాధుర్యా.. నాకు యాక్సిడెంట్ జరిగింది అని తెలిసిన వెంటనే వాళ్ళు జాతకం బాగాలేదు అంటూ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు " అంటూ ఏదో తెలియని అపరాధ భావనతో మాధుర్యని చూసాడు వసంత్. ఒక్క నిముషం ఇద్దరి మధ్య నిశబ్దం ఆవరించింది. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.


హఠాత్తుగా వసంత్ మోకాళ్ళ మీద కూర్చుని " మాధుర్యా! నన్ను పెళ్ళి చేసుకుంటావా? ఏ మనిషికైనా కావాల్సింది శారీరక సౌందర్యం కాదు. మనసు అందమైనదైతే ఆ మనిషితో జీవితం పంచుకోవడం పూల పల్లకి లో స్వర్గ ప్రయాణం లాంటిదని నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పక్కర్లేదు . నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు " అన్నాడు. నిర్లిప్తంగా చూస్తుండి పోయింది మాధుర్య. హఠాత్తుగా వసంత్ తన జేబులో భద్రంగా దాచుకున్న రోజా పువ్వును తీసి " మాధుర్యా!.. నా కుడి చేతికి కట్టు ఉంది. ఎడం చేత్తో ఇస్తున్నాననుకోకు" అంటూ తనకు అందిస్తూ " ఐ లవ్ యు మధూ " అన్నాడు.


"మాధుర్యా! నువ్వు కన్న కల నీ ముందు సాకారం అయినపుడు ఇంకా ఎందుకు సంశయిస్తావు. సంతోషంగా ఒప్పుకో. మీకంతా మంచే జరుగుతుంది " అంది వసుమతి వాళ్ళకు టీ అందిస్తూ. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మాధుర్య సమాధానం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు వసంత్.


గొంతు సవరించుకుని "మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నందుకు సారీ వసంత్ గారూ. ఒకప్పుడైతే మీరు చెప్పినదానికి యెగిరి గంతేసేదాన్ని. అప్పుడు జీవితం పట్ల నాకు సరైన అవగహన లేదు. ‘పెళ్ళితోనే ఒక ఆడదాని జీవితానికి సంపూర్ణత్వం లభిస్తుంది. అదే ఆడదాని అంతిమ లక్ష్యం’ అనుకున్నాను. కానీ ఈ రోజు ‘నా జీవిత లక్ష్యం పెళ్ళి కాదు. దానికంటే జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేవి ఎన్నోఉన్నాయి’ అని తెలుసుకున్నాను. జీవితంలో కనీస అవసరాలకు కూడా నోచుకోని అనాధ బిడ్డలు, పిల్లలు వదిలేసి రెక్కలు తెగిన పక్షుల్లా అనాధ ఆశ్రమాల్లో చావు కోసం ఎదురు చూస్తున్న వృద్దులు, మానసిక, శారీరక దివ్యాంగులు ...ఇలా ఎందరో అభాగ్యులు చేయూత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.


అలాంటి వారికి సేవ చేయడంలోనే నా జీవిత పరమార్ధం దాగి ఉందని తెలుసుకున్నాను. అదే ఇప్పుడు నా ఏకైక లక్ష్యం. అదే నా జీవితానికి అమరత్వం, అమృతత్వాన్ని ఇస్తుంది. ఇక వేరే ఎటువంటి ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు. నన్ను మన్నించండి" అంటూ చేతులు జోడించి గుండె నిండిన ఆత్మవిశ్వాసంతో ఇంటి లోపలకు నడిచింది ఆమె. మాధుర్య మనసు కరిగి తన ప్రేమను అంగీకరించే రోజు కోసం వసంత్ తో పాటు మనం కూడా ఎదురు చూద్దామా...

రచయిత్రి పరిచయం :

పేరు: వంజారి రోహిణి

నివాసం : హైదరాబాద్

విద్యార్హతలు: బి.ఎస్.సి., బి.ఎడ్.

కాలేజీ రోజుల్లో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న "పద్మావతి మహిళా గ్రంథాలయం" లో కథలు చదవడం, రాయడం పట్ల నాలో ఆసక్తిని కలిగించింది. గొప్ప రచయితల కథలను చదవడం, వారి కథలలో శైలి, శిల్పం పరిశీలనా నాలో కథారచన చేయాలని ప్రేరేపించాయి. కథలు మనిషి జీవితాన్ని ప్రతిబింబించాలనుకుంటాను. నేను వ్రాసిన కథలు నవ్య, సాక్షి, నవతెలంగాణ, దర్వాజా, విశాలాక్షి వంటి ప్రముఖ పత్రికల్లో, కొన్ని వెబ్ మాగజైన్స్ లో ప్రచురితం అయినాయి. ఇప్పటికి 35 కథలు, 40 కవితలు, కొన్ని సమీక్షలు ప్రచురితం అయినాయి. కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి.

2,509 views74 comments

74 Comments


lkamakoti
lkamakoti
Jan 12, 2021

mmp.

దేహానికి వున్న రంగు కాదు ముఖ్యం. ఒక లక్ష్యం, ఆత్మస్థైర్యం జీవితాన్నే మారుస్తాయి అన్న విషయాన్ని మాధుర్య ద్వారా చెప్పించి ఎందరికో మార్గదర్స్యం అయ్యారు. మంచి కథ. అభినందనలు .....లక్ష్మీ రాఘవ

Like

TOOOOO GOOD best wishes amma

Like

vpulikanti
Jan 09, 2021

Excellent story teller. Ability to weave the content and concept is amazing. Flow of language is apt. The story has been loaded with good theme and message . Definitely writer has good future .May god bless her.


Like

venunigama
Jan 08, 2021

ప్రేమ, మొహం, బంధం.... వీటన్నింటి కంటే సేవ మాత్రమే అజారామరం అని అమృతత్వం కథ ఘంటాపధంగా చెప్పగలిగింది.... BRAVO TO YOU, DEAR ROHINIJI...


Like

thirupathivasala20
Jan 05, 2021

వంజారి రోహిణి గారు,

మీ కథ అమృతత్వం చదివాను.చాలా బాగుంది.ఇతివృత్తం పాతదైనా కథనం కొత్తగా ఉంది.పాఠకులను ఆసాంతం చదివించేలా సరళమైన పదాలనే కాకుండా అలవొకగా అద్భుత

పద ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా ముగింపు నచ్చింది.చాలా రోజుల తర్వాత ఒక మంచి కథను చదివిన సంతృప్తిని కలిగించిన రచయిత్రి వంజారి రోహిణీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.


@ వాసాల తిరుపతి

కరీంనగర్

Like
bottom of page