top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 8'Chejara Nee Kee Jivitham - Episode 8' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 14/02/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీత మేడం కి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు.. 


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 8 చదవండి. 


గీత వివరించిన వ్యూహం రవికి అంత సమంజసంగా అనిపించలేదు. మధు, ఇందిరల ప్రేమని ప్రోత్సహించడం వ్యూహంలో ఒక భాగమైతే, విడాకులిప్పించడం రెండో భాగం. మధు పట్ల రవికి పుత్ర వాత్సల్యముంది. అందువల్లే, ఇందిరతో పెళ్ళి మధుకు క్రొత్త సమస్యలు తెచ్చి పెడతాయని అతను ఆందోళన చెందాడు. కానీ అటువంటివేం వుండవని గీత నమ్మబలకడంతో ఆ వ్యూహానికి ఆమోదం తెలిపాడు. ఆపైన వ్యూహానికనుగుణంగా చేయవలిసినది వివరించాడు రవి. 


"ఇందిర దూరమవుతుందన్న భావం కలిగిస్తే మధు, ఇందిరకు దగ్గరవుతాడు. ఇది మనం తేలికగా చెయ్యవచ్చు. విడాకులు న్యాయ సమస్య కాబట్టి కొంత టైం పడుతుంది. మొదట, శేఖర్, ప్రభల పేళ్ళి, వారి కాపురం గురించిన సాక్ష్యాలు సంపాదించాలి. ఈ పని డిటెక్టివ్ ఏజెన్సీకి అప్పగిద్దాం. ఆ తర్వాత, లాయర్ని సంప్రదిద్దాం. " 


భర్త అంగీకారం గీతకు ఆనందం కలిగించింది. 

 @ @@

మర్నాడు రవి వచ్చి, ఇందిరను దగ్గరలో వున్న కాన్వెంట్ స్కూలుకి తీసుకెళ్ళాడు. స్కూల్ ప్రిన్సిపాల్ రవిని సాదరంగా ఆహ్వానించింది. రవి ఇందిరను పరిచయం చేసి, ఆఫీసులో గాని, టీచింగులో గాని వుద్యోగం యిప్పించమని అడిగాడు. ప్రిన్సిపాల్ ఇందిరతో మాట్లాడి రవి తో అంది. 


"నీకు నో చెప్పలేను. సోమవారం జాయిన్ చెయ్యి. స్కూటీ వుంటె మంచిది. మా స్కూల్ ప్రచారానికి తను మా టీచర్స్ తో కలిసి దగ్గర గ్రామాలకు వెళ్ళాల్సివుంటుంది. ఆఫీసు పనులు, టీచింగ్ రెండూ చేయాల్సి వంటుంది" 


రవి ఇందిర వైపు చూసాడు. ఆమె సంతోషంగా ప్రిన్సిపాలుకి చెప్పింది " నాకిష్టమే! స్కూల్ కోసం కష్టపడతాను, మా మామయ్య పేరు నిలబెడతాను" 


ప్రిన్సిపాల్ చిరునవ్వుతో" రవి! నీకు ఓకేనా?" అని అడిగింది. 


రవి లేచి "ధన్యవాదాలు మేడం" అని బయటికి వచ్చేసాడు. 


ఇందిర ఆనందానికి అంతు లేదు. ఈ రోజు తన జీవితం రాజపధంలో పయనిస్తోంది. అత్త, మామల ప్రేమ, మధు సహవాసం, వుద్యోగం, సంగీతం, తోటపని, .. శూన్యమైన తన జీవితం నేడు మధుకలశంలా వెలిగిపోతోంది. 


ఇలా అలోచిస్తూ మౌనంగా కారులో కూర్చున్న ఇందిరతో రవి అన్నాడు" నీకు స్కూటీ కావాలి. మా చిన్నమ్మాయి స్వప్నఅమెరికా వెళ్ళేముందు కొన్నది.. అది తీసుకో" 


" అలాగే! స్వప్నని అడిగి తీసుకుంటాను" అంది ఇందిర. 


"అలాగైతే ఈ సాయంత్రం ఫోన్ చేద్దాం. నేను అయిదింటికి వస్తాను. మా గురువుగారి దగ్గరకు తీసుకువెడతాను. ఆయన ఆశీర్వాదాలు నీకు మంచి చేస్తాయి" 


"అలాగే మామయ్యా" వినయంగా బదులిచ్చింది. ఇందిరను ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయాడు రవి. 

 @ @@

ఆధ్యాత్మిక గురువు స్వామి రామానందకు నమస్కరించారు గీత, రవి. 


"మీ రాక ఆంతర్యం అర్ధమయింది. మీ సంకల్పం మంచిది, నిస్వార్ధమయినది. తప్పక నెరవేరుతుంది. ఆ జంటను లోనికి రమ్మనండి " అన్నారు స్వామి. 


భక్తితో పులకించిన రవి, బయటికి వెళ్ళి మధు ఇందిరలను స్వామి దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేసాడు. స్వామిని చూసి ఇందిర మోకాళ్ళమీద కూర్చుని శిరస్సు నేల మోపి భక్తితో నమస్కరించింది. మధుకి స్వాములపైన నమ్మకం లేదు కానీ గీత చెప్పడంతో కాదనలేక వచ్చాడు. సందిగ్ధ మనసుతో చేతులు జోడించి నమస్కరించాడు. 


స్వామి నవ్వుతూ "నాయనా మధూ! నీ జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ అమ్మాయే. బాగా చూసుకో" అన్నారు. 


ఆ తరువాత ఆయన కనులు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు ఇక వెళ్ళండని సైగల ద్వారా తెలియ చేసారు. 


అందరూ మౌనంగా బయలుదేరారు. మధు, ఇందిరలను ఇంటి దగ్గర దింపేటప్పుడు గీత" మధు, నీ గురించి, ఇందిర గురించి మేము చెప్పకుండానే ఆయన మిమ్మల్ని లోనికి పిలిచారు. ఆయన మాటలు మహిమాన్వితమైనవి" అని చెప్పింది. ఇందిరకు అంతా అయోమయంగా వుంది. స్వామి మాటలు నిజమయితే, తనకి మధు జీవిత సహచరుడవుతాడు. అదే తన కోరిక, గీతా అత్తయ్య అభిలాష. నిజమవుతుందా! 


ఇందిర అలోచనలనుండి బయటపడి చూసేసరికి మధు ఇంటిలోనికి వెళ్ళీపోయాడు. స్వామి మాటలు మధు విశ్వసించలేదు. స్వాములు, జ్యోతిష్కులు అందరూ మనకేది కావాలో అదే చెప్తారని అతని నమ్మకం. 


అదే మాట మధు భోజనం చేసేటప్పుడు ఇందిరకు చెప్పాడు. అతనిలో అసహనాన్ని పసిగట్టిన ఇందిర, యెందుకైనా మంచిదని, "అలాగే అనిపిస్తోంది" అని చర్చకు తావులేకుండాచేసింది. ఇందిర మాటలు మధుకి నచ్చలేదు. 


"నీదీ అదే అభిప్రాయమయితే, రవి గారికి చెప్పి, అక్కడకు వెళ్ళకుండా వుండే వాళ్ళం" అన్నాడు. 


ఇందిరకి అర్ధమైంది ఈకోపం రవిమీద అని. ఇంక ఈ టైంలో వుద్యోగం గురించి చెపితే పరిణామాలు బాగుండవని మౌనంగా భోజనం ముగించింది. 

 @ @@

మధు నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. కాలకృత్యాలు తీర్చుకుని మేడ దిగిన మధుకు ఇందిర వున్న జాడ కనబడలేదు. భోజనాల బల్లమీద ఫ్లాస్క్, హాట్ బాక్స్, తో పాటు ఒక చీటీ వుంది. అందులో వున్న సందేశం: 


"ఈ రోజు భోజనం అత్తయ్య ఇంట్లో. మామయ్య వచ్చి రమ్మంటే వెడుతున్నాను"


మధుకి ఆ సందేశం నచ్చలేదు. స్వేచ్చ కోల్పోతున్నానన్న భావం కలిగింది. టిఫిన్ చేసి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ గీత ఫోన్ చేయడంతో తప్పనిసరై భోజనానికి వచ్చాడు. మేడ మీద రవి ఇందిర సంగీత కార్యక్రమంలో వున్నారు. గీత విశ్రాంతిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. స్టడీ రూములో కూర్చుని లాప్ టాప్ తెరచి పని చేసుకోడం మొదలు పెట్టాడు. కానీ అతని మనసు మేడ మీదే జరిగేదానిపై వుంది. 

ఒక గంట తరువాత, ఇందిర వచ్చి, "రా మధూ! భోజనం చేద్దాం!" అంది. ఆమె పిలుపుకి తల యెత్తిన మధు, ఆమె ముఖంలో సంతోషాన్ని చూసి, ఆనందపడ్డాడు. నాకు ఇబ్బందిగా వున్నా తనకి బాగుంది అదే పదివేలనుకుంటూ భోజనానికి వెళ్ళాడు. 


 భోజనం చేసేటప్పుడు రవి, మధు నుద్దేశించి చెప్పాడు. "ఇందిరకు దగ్గరలోవున్న కాన్వెంట్ లో జాబ్ వచ్చింది. సోమవారం జాయినవ్వాలి. తనకి తిరగడానికి సులభంగా వుంటుందని స్వప్న తన స్కూటీయిచ్చింది"


ఇందిర తను నేరుగా చెప్పకుండా రవితో చెప్పిస్తోందనిపించి మధు మనసు చివుక్కుమంది. పైకి నవ్వుతూ" అలాగే సర్!" అన్నాడు.


" ఇందిర సాయంత్రం స్కూటీపై వస్తుంది. నీకేదైన పనుంటే చూసుకో. తనతో నేను యింటిదాక వచ్చి వెడతాను" అని రవి, మధు కి భరోసా యిచ్చాడు. 


ఈ ప్రతిపాదన మధుకి నచ్చలేదు. తను దగ్గరుండి ఇందిరను ఇంటికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. నీ అవసరం లేదు పో అని అన్నట్లుగా భావించి అవమానంగా ఫీలయ్యాడు. 


అందరి భోజనాలయ్యాక ఇందిరకు చెప్పి, మధు వెళ్ళిపోయాడు. మధు ముఖంలో నిరుత్సాహం గమనించి ఇందిర కలత పడింది. అతనితో బయటికి వచ్చి బై చెప్పి. అతను కనుమరుగయ్యేదాక వుండి లోనికి వచ్చింది. సాయంత్రం ఇందిర ఇంటికి వచ్చేటప్పటికి మధు ఇంట్లో లేడు. రాత్రి ఆలస్యంగా వచ్చి ఆకలి లేదని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. ఇందిరకు యేం చెయ్యాలో తెలియ లేదు. ఒంటరిగా భోజనం చేసి నిదురపోయింది. 


మరునాడు వుదయం రవి ఫోన్ రావడంతో మధు జాగింగు నుంచి రాకముందే ఇందిర వెళ్ళిపోయింది. మధుకి భోజనం బల్లమీద చీటీ దర్శన మిచ్చింది. సంగీతం కోసం ప్రొఫెసర్ సరస్వతి దగ్గరకు మామయ్యతో వెడుతున్నానని వ్రాసివుంది. నిర్వేదంతో టిఫిన్ చేసి తన పనిలో నిమగ్నమయ్యాడు మధు. పదిగంటలకు ఇందిర వచ్చి నేరుగా మధు దగ్గరకు వెళ్ళింది. 


"మధూ! సరస్వతి గారు సంగీతం నేర్పడానికి ఒప్పుకున్నారు. శని ఆదివారాలలో సంగీతం క్లాసెస్. సోమవారం నుంచి స్కూల్ జాబ్ తొమ్మిదినుంచి నాలుగు దాకా. మధ్యాహ్నం వంటచేయడానికి టైం వుండదు. ఉదయమే వంట చేసి పెట్టేస్తాను"అని వుత్సాహంగా చెప్పింది. 


"సరే" అన్నాడు మధు. అభినందిస్తాడని ఆశించిన ఇందిర నిరుత్సాహ పడింది. ఎందుకిలా వున్నాడు? నేనేం చెయ్యాలి? అని మధన పడింది. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

50 views0 comments

Comments


bottom of page