top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 9'Chejara Nee Kee Jivitham - Episode 9' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 19/02/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

                      

జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీత మేడం కి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు.. 

మ్యూజిక్  క్లాసెస్ లో చేరుతుంది ఇందిర.


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 9 చదవండి.


ఇందిర జీవితంలోకి క్రొత్త వుత్సాహం వచ్చేసింది. ఉదయమే ఇల్లూవాకిలి శుభ్రం చేయడం, పూజ చేయడం, టిఫిన్, భోజనం తయారు చేయడం, మధుకు టిఫిన్ పెట్టి, స్కూలుకి వెళ్ళడమంటె పరుగు పందెమే. ఇష్టమయితే యెంతపనైన మనిషి ఆడుతూ పాడుతూ చేసేస్తాడు. ఇందిర లాంటి పనిమంతులకిది క్రీడా వినోదమే. 


సోమవారం వుదయం స్కూలుకి వెళ్ళడానికి తయారై, మధు ని " వెళ్ళి రానా" అని మృదువుగా అడిగింది. మధు ఆమె తో కరచాలనం చేస్తూ, " నీకు నా శుభాకాంక్షలు. వెళ్ళిరా" అని నవ్వులు చిందిస్తూ చెప్పాడు. ఇందిర చటుక్కున వంగి అతని పాదాలను తాకింది. ఊహించని ఆమె చర్యకు వులిక్కిపడి, " ఇదేమిటి, " అంటూ ఆమెను లేవదీసాడు. కన్నీటితో చెమర్చిన కనులతో, ఇందిర “ఇదంతా నీ వల్లనే కదా! " అంది. మధు వుప్పొంగిపోయాడు. స్నేహపూర్వకంగా అమెను కౌగలించుకొని, అమెకు అభినందనలు తెలిపాడు. ఇందిర సంతోషంగా స్కూటీ పై వెళ్ళిపోయింది. త్రోవలో గీత, రవిల ఆశీస్సులు తీసుకుని వుద్యోగంలో చేరింది. 


కలుపుగోలు స్వభావంగల ఇందిర, స్కూలులో లో పనిచేసేవారితో తేలికగా కలిసిపోయింది. ప్రిన్సిపాల్ వుదయమే స్టాఫ్ మీటింగ్ పెట్టింది. ఇందిర, మిగతా టీచర్సుతో కలిసి హాజరైంది. మొదట, ప్రిన్సిపల్ అందరికీ ఇందిరను పరిచయం చేసి అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించింది. మూడు అంశాలపై చర్చ జరిగింది. 


 పది రోజుల్లో ఒకేనాడు వచ్చే వుగాది పండుగ, అంబేద్కర్ జయంతి, యేర్పాట్ల గురించి మొదట చర్చ జరిగింది. పిల్లలకు ఆటపాటలలో పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలని నిర్ణయించారు. స్కూలుపిల్లల తల్లి తండ్రులనే గాక, చుట్టుప్రక్కల గ్రామాలలోని పిల్లల తల్లి తండ్రులను ఆహ్వానించాలని తీర్మానం చేసారు. తర్వాత వేసవి శిబిరాలపై  చర్చ జరిగింది. వేసవి శిబిరాలలో సంగీతం, చిత్రలేఖనం, ఆట పాటలతో పాటు ఇంగ్లీష్, తెలుగు భాషల నైపుణ్యం ప్రధానంగా వుండాలని ప్రతిపాదించారు. ఇందుకోసం పేరెంట్స్ మీట్ నిర్వహించి బోధనాంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఆఖరి ఆంశం, టీచర్స్ కి వేసవి సెలవలు. ప్రతిఒక్కరూ వారు కోరిన విధంగా మూడు వారాల సెలవు రొటేషన్ పద్ధతిలో తీసుకోవచ్చని అంగీకారానికి వచ్చారు. అంబేద్కర్ జయంతి, నిర్వహణకి వేసిన కమిటీలో ఇందిరకు చోటు కల్పించారు. 


చివరగా ఈ వుత్సవానికి ఎవరిని ప్రధాన అతిధిగా పిలవాలన్న చర్చ వచ్చింది. వేసవి శిబిరాల నిర్వహణకు  ధన సహాయం చేయగలవ్యక్తిని పిలిస్తే బాగుంటుందని ఇందిర ప్రతిపాదించింది. ఆలోచన బాగుంది, అలా యిచ్చే వ్యక్తి యెవరని ప్రిన్సిపాల్ అడిగింది. అందరూ మౌనంగా ఆలోచిస్తుండడం చూసిన ఇందిర, "విష్ణు జ్యూయెలరీస్ అధినేతను పిలుద్దాం. " అంది ఇందిర. " ఆయన నీకు తెలుసా?" అని ప్రిన్సిపాల్ ఆసక్తిగా అడిగింది. 


" నాకు తెలియదు. మొన్న నగలు కొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ సేల్స్ మన్ గొప్పగా పొగిడితే విన్నాను. మనం ప్రయత్నించి చూడవచ్చు". అందరూ ఇందిర మాట బలపరిచారు. ఇందిర, వైస్ ప్రిన్సిపల్ వెళ్ళి విష్ణు జ్యూయలరీస్ అధినేత సురేంద్ర జైన్ అతని భార్య అనితను ఆహ్వానించడం, పిల్లలు లేని ఆ దంపతులు వీరి ఆహ్వానాన్ని మెచ్చి, అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. సభకు యేర్పాట్లు  సాగాయి. పిల్లలకు తర్ఫీదునిచ్చే పనిలో, ఇందిర పాలు పంచుకుంది. 


సభ దిగ్విజయంగా ముగిసింది. సమయానికి ముందుగానే వచ్చి సురేంద్ర, అనిత పిల్లలతో ముచ్చటించారు. స్కూలంతా కలయ తిరిగారు. ప్రిన్సిపాల్, ఇందిర దగ్గరుండి వారికి స్కూలు ఆవిర్భావం, యెదుగుతున్న తీరు, వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. సభకు పిల్లల తల్లి తండ్రులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో సభ వుత్సాహంగా ప్రారంభమయ్యింది. అతిధులను పరిచయం చేసే పని ఇందిర అద్భుతంగా నిర్వర్తించింది. రూరల్ విద్యార్ధులకు చక్కని శిక్షణ, తక్కువ ఫీజుకే అందించే లక్ష్యంగా ఈ పాఠశాల పనిచేస్తోందని చెప్పి, పిల్లల నైపుణ్యాలు పెంచడానికి చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా వేసవి శిబిరాల  గురించి పిన్సిపాలుగారు వివరించారు. పిల్లలకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో, పండుగ గురించి అంబేద్కర్ గొప్పతనం గురించి సురేంద్ర, వుపన్యసించారు. అనిత పోటీలలో విజేతలైన పిల్లలకు బహుమతులిచ్చి, వేసవి శిబిరాల నిర్వహణకు సహకరిస్తామని చెప్పి రెండు లక్షల రూపాయలు చెక్కు ప్రిన్సిపాల్ కి అందించారు. సభలో చప్పట్లు మార్మోగాయి. ప్రినిపాల్ వారి వుదారతను పొగడుతూ, అందరికి ధన్యవాదాలు తెలుపడంతో సభ ముగిసింది. పిల్లల ప్రోగ్రాములు జనరంజకంగా వుండడంతో అందరూ టీచర్లని మెచ్చుకున్నారు. సభ విజయవంతం కావడం, చక్కని విరాళం లభించడంతో ప్రిన్సిపల్, టీచర్ల ఆనందానికి అవధిలేకుండా పోయింది. ఇందిరకు అందరి దగ్గరనుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రిన్సిపాల్, రవికి ఫోన్ చేసి, మీకోసం నేనొక అమ్మాయికి, ఆరోజు సహాయం చేస్తున్నానుకొన్నాను. కానీ ఈరోజు తెలిసింది, మా బడికే సహాయం చేసానని. మీకు ధన్య వాదాలని చెప్పింది. 

                          @@@@

ఇందిరకు అర్ధమైంది చేజారిందనుకొన్న జీవితానికి దేవుడు నూతన జవసత్వాలు ప్రసాదిస్తున్నాడని. ఆమె కృతజ్ణతాభావంతో భగవంతుని ముందు మ్రోకరిల్లింది. 'ఇందూ!" అన్న రవి పిలుపు విని, ఆమే దేవుని గదినుంచి బయటికి వచ్చింది. రవి ఆమెకు ఒక చిన్న పుష్ప గుచ్చాన్నందించి" నా పేరు నిలబెడతానన్నావు.. ఈ రోజు నా గర్వానికి అంతులేదు" అని అంటూ ఇందిర నుదుట ముద్దు పెట్టాడు. గీత ఇందిరకు దిష్టి తీసింది. 


ఇందిర రవితో" ఆ రోజు మీరు నాకు పట్టుబట్టి వజ్రపు ముక్కుపుడక కొనడం వల్లకదా యిదంతా జరిగింది. ఆ క్రెడిట్ మీదే" అంది. 


" అయితే నీకు మా ఇంకో కానుక బంగారు చెవి దుద్దులు. పద పద. అందాల రాకుమారిలా తయారై రా! ఈలోగా మేం టీ తయారు చేసుకుని త్రాగుతాం" అన్నాడు.


" నేనొప్పుకోను. ముక్కు పుడక చాలు. మళ్ళీ దుద్దులా? టీ నేనే పెట్టి ఇస్తాను. మీరంతా కూర్చోండి. " అంది ఇందిర మారాముగ. 


" మామాయ్య మాటకు విలువలేదా!.. "


 రవి మాటలకు అడ్డువచ్చి, " అలా నేనెప్పటికీ అనను. కాని మీ ప్రేమకు ఒక హద్దుండాలి, ఇంకా మీరు మన తార, స్వప్నలకు పెళ్ళి చేయాలి. డబ్బులు నీళ్ళలా ఖర్చు చేస్తే వొప్పుకోను" అంది. 

ఇందిర మాటలకు గీత నవ్వుతూ "మంచి పొదుపరి కోడలే దొరికింది. అమ్మాయి, నీకా బెంగ అక్కర లేదు. వాళ్ళ పెళ్ళికోసం అన్నీ యెప్పుడో సిద్ధం చేసాం. మా బంగారు కోడలికే యేమీ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం. కాదు, కూడదంటే  నిన్ను కట్టేసి తీసుకు వెడతాం" అంది 

 అడ్డుచేప్పేందుకు అవకాశం లేకపోవడంతో ఇందిర మధు వైపు చూసింది. మధు నవ్వుతూ, "తప్పదు. " అన్నాడు. 


 " మీ ఋణం యెలా తీర్చుకోవాలో" అంది ఇందిర రవిని చూస్తూ.

 

" మా వృద్ధాప్యంలో నీ దగ్గరే వుంటాం. కాస్త ప్రేమగా చూసుకుంటావు కదా!" అన్నాడు రవి.

 

 ఇందిర తన చేతులతో రవిని చుట్టేసి" నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను" అంది. 

“ఇంక.. యేమీ ఆలోచించకుండా బయలుదేరు. మా ముచ్చటలకు అడ్డు రాకు" రవి గారాముగా ఆమె తల నిమురుతూ చెప్పాడు.


నలుగురూ దుద్దులు కొన్నాక, భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. రవి, గీత వెళ్ళిపోయాక, విశ్రాంతిగా టీవీ చూస్తున్న మధు ప్రక్కనే కూర్చుంది ఇందిర. కాసేపు మౌనంగా టీవీ చూసాక ఇందిర 'నిద్రొస్తోంది" అని లేచింది. 


“నిన్ను చూస్తూంటే హాపీగా వుంది. ఎంబీయే చేయకపోయినా, ఒక మేనేజరుకుండాల్సిన లక్షణాలు నీకున్నాయి" అన్నాడు మధు. 


 " కొన్నాళ్ళు వుద్యోగం చేసాకదా! అక్కడే శిక్షణ బాగా యిచ్చారు. అదేమోగాని నా మాటకి మన్నన, నా పనికి ప్రశంస తేలికగా వస్తున్నాయి. ఈ అదృష్టం యెంత కాలం వుంటుందో? అంది ఇందిర కాస్త బెంగగా. 


“అలా బెంగ పడకు. ఇది నీ మంచి కాలం. ఎంజాయ్ చెయ్యి. గుడ్ నైట్" అన్నాడు మధు. 


 "అంతేలే. గుడ్ నైట్" అని ఇందిర వెళ్ళిపోయింది. మధు మనసులో నీలి నీడలు. తను చూడని తండ్రి ప్రేమ, రవి దగ్గర ఇందిర పొందటం అతనికి ఎంత ఆనందం కలిగిస్తోందో అంత అసూయని రేకెత్తిస్తోంది. కనులు మూసుకుని, ఇలా ఆలోచించడం సరి కాదనుకుంటూ అతడు నిద్రలోకి జారుకున్నాడు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

49 views0 comments

Comments


bottom of page