top of page

సరైన నిర్ణయం'Saraina Nirnayam' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 17/02/2024

'సరైన నిర్ణయం' తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ధనుర్మాసమే కాకుండా సంక్రాంతి నెల కూడా పెట్టడం తో జయలక్ష్మి ఉదయం ఐదు గంటల నుంచీ వాకిట్లో చక్కటి చుక్కల ముగ్గులు పరిచేసింది. ఆ ముగ్గు మీద వాళ్ళ పని మనిషి శారద వాళ్ళింటి దగ్గరనుంచి తెచ్చిఇచ్చిన బర్రె పేడతో ఐదు గొబ్బిళ్ళు చేసి, వాటికి పసుపు కుంకుమ పెట్టీ పైన ఒక గుమ్మడి పువ్వు కూడా పెట్టింది. శారద చీకటిలోనే వచ్చి పేడపొడి ఉన్న ప్యాకెట్ కలిపి వాళ్ళ ‘విల్లా’ వాకిట్లో పేడ నీళ్ళు చల్లింది. సంక్రాంతి పండుగ అయ్యేంతవరకు వాళ్ళ వాకిలి పెద్ద పెద్ద ముగ్గులతో నింపేస్తుంది జయలక్ష్మి.

 

 బాచుపల్లి లోని ఆంటీలియా లోని ప్రతీ విల్లా వెడల్పాటి రోడ్లతో, మామిడి, ఉసిరి, జామ, సపోట మొదలైన చెట్లతో మంచి గాలి వెలుతురుతో ఉన్నాయి. పిల్లలంతా చెట్ల నీడన సాయంత్రం బాగా ఆడుకుంటూ ఉంటారు. 


 ఆ రోజు ఉదయం ఆరుగంటలకు లేచిన ఆద్య, ఆరవ్ లు ఆ గొబ్బెమ్మల దగ్గర నిలబడి “నాన్నమ్మా ఎంత బాగున్నాయో!” అంటూ వింతగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళమ్మ నాగదేవి పేడ ముట్టుకోవడమంటే ‘చిరాకు ‘ అంటుంది. అందువల్ల ఈ పిల్లలెప్పుడూ వాళ్ళింట్లో గొబ్బెమ్మలు చెయ్యడం చూడలేదు.


 “అవేం పూలు నాన్నమ్మా?” అంది ఆద్య.


 ”అవీ గుమ్మడి పూలు. అంటే మనం కూర చేసునే పంప్కిన్. మహిత వాళ్ళ వాకిట్లో ఈ గుమ్మడి చెట్టు ఉంది. వాళ్ళ నడిగి తెచ్చాను” అని చెప్తూ వాళ్ళను లోపలికి తీసుకొచ్చి పాలు కలిపి ఇచ్చింది తాగమని.


 “నాన్నా, మీరు వాకింగ్ కు వెళ్లాలనుకుంటే ‘ప్లే ఏరియా’ లోపలే వుంది. హాయిగా వెళ్ళి రండి” అన్నాడు తరుణ్ వాళ్ళ నాన్న జగన్నాథంతో. 


 “నాన్నా, మేము కూడా ప్లే ఏరియా వెళ్తాం” అంటూ పిల్లలిద్దరూ తరుణ్ తో అన్నారు.


 “ఇప్పుడు కొంచెం చలిగా వుంటుంది. కావాలంటే టిఫెన్ తిని తొమ్మిది గంటల పైన వెళ్ళండి” అంటూ వచ్చింది వాళ్ళమ్మ నాగదేవి. 


 “సరే” అంటూ పిల్లలు లోపలికెళ్ళారు. 


 నెల క్రితమే తరుణ్ అమ్మా, నాన్నలు స్వంతవూరు A.కోడూరు నుండి నంద్యాలకు వచ్చారు. ఒక ఐదు సంవత్సరాల క్రితం జగన్నాథం కొని ఉంచిన విల్లా సాయిబాబా నగర్ లో వుంది. కలకత్తా నుంచి కొడుకు, కోడలు వచ్చి అందులోనే వున్నారు. ‘పెద్దవాళ్ళు మీరిద్దరూ ఒంటరిగా పల్లెటూర్లో ఉండటమెందుకూ…అందరం ఒక చోట ఉందాము’ అని తరుణ్ సంవత్సరం నుంచీ అడుగుతూ ఉన్నా స్వంత ఊరి మీది మమకారంతో అక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ మధ్యే కోడూరు లో ఉన్న పెద్ద ఇల్లు ముప్ఫై లక్షలకు అమ్మేశారు. తరుణ్ ఎప్పటినుండో అంటున్నాడు, ఐదు బెడ్రూమ్ లు ఉన్న అపార్ట్మెంట్ కొనాలని. మన పిల్లల కంటే ఎక్కువేముందని ఆ డబ్బును తరుణ్ పేర బ్యాంక్ లో వేశాడు జగన్నాథం. వెంటనే తరుణ్ ఆ డబ్బును ఒకపెద్ద అపార్ట్మెంట్ కు అడ్వాన్స్ గా ఇచ్చాడు.


 ఆరోజు మధ్యాహ్నం భోజనాల తరువాత “అమ్మా, సొఱ్ఱకాయ హల్వా చేస్తావా? బాగుంటుంది” అన్నాడు తరుణ్.

 

 “చేస్తాలే, తరుణ్” అనీ జయలక్ష్మి ఫ్రిడ్జ్ లోనుంచి సొఱ్ఱకాయ తీసి బైట పెట్టింది.


 సాయంత్రం పిల్లలను తీసుకొని తరుణ్, నాగదేవి ప్లేఏరియా కు వాకింగ్ లాగా వెళ్ళారు. పక్కింటి సారిక “మీ అత్తగారిని కూడా వాకింగ్ కు తీసుకెళ్ళకూడదూ?” అంది నాగదేవితో.

 ఆ మాటలకు “మాఅత్తకు అలా బైటికి వెళ్ళడం ఇష్టముండదు” అంది నవ్వూతూ నాగదేవి, మనసులో ‘ఈమెకెందుకు?’ అని సారిక మీద విసుక్కుంటూ. అక్కడే వరండాలో ఉదయం ఆరేసిన బట్టలను తీస్తున్న జయలక్ష్మి ‘అవునన్నట్లు’గా చిరునవ్వు నవ్వింది.


 జిల్లా పరిషత్ లో సూపరింటెండెంట్ గా పనిచేసి రిటైర్ అయిన జగన్నాధానికి నెలకు యాభై వేల పెన్షన్ వస్తుంది. కర్నూల్ లో రిటైర్ అయిన తరువాత నంద్యాలకు ఐదు కిలోమీటర్స్ దూరం లో ఉన్న స్వంత ఊరికి వచ్చి, పాత స్నేహితులను కలుసుకుంటూ, కౌలుకిచ్చిన పొలాలను చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు. తరుణ్ వాళ్ళు అప్పుడు కలకత్తాలో ఉన్నారు. తరుణ్ అక్కకు పెళ్ళయ్యి … వాళ్ళు కర్నూల్ లో ఉన్నారు. ఈ మధ్యే తరుణ్ దగ్గరకు అమ్మా,నాన్న వచ్చారు.


 వచ్చిన ఒక వారం రోజుల తరువాత కూరగాయలు, పండ్లు అమెజాన్ లో తరుణ్ తెప్పించడం చూసి “తరుణ్ …నేను, మీ అమ్మ మీ దగ్గర ఉంటున్నాము కనుక ప్రతినెలా ఇద్దరికీ కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తాను. ఈ రోజుల్లో ఇద్దరి ఖర్చు భరించడం చిన్నవిషయం కాదు” అన్నాడు జగన్నాథం. 


 “అదేంటి నాన్నా. వద్దు. అది నాకెంత చిన్నతనం?” అన్నాడు తరుణ్.


 కానీ జగన్నాథం వినలేదు. తరుణ్ అకౌంట్ లో ప్రతి నెలా డబ్బులు వెయ్యడం మానలేదు. ఇక తరుణ్ కూడా వద్దనలేదు.


 ఒకరోజు రాత్రి అందరికీ జొన్నరొట్టెలు, వంకాయ నించుడుకాయ చేసింది జయలక్ష్మి. “జొన్నరొట్టెలు తిని చాలా రోజులయ్యిందమ్మా” అన్నాడు తరుణ్. 


“అదేంటీ!?” అంటూ వింతగా చూసింది జయలక్ష్మి. 


“రొట్టె చేస్తే స్టౌ మీద బాగా పిండి పడిపోతుంది. అదంతా క్లీన్ చెయ్యడానికి పావుగంట టైం పడుతుంది. అందుకని తక్కువగా చేస్తాను” అంది నాగదేవి కోపం మొహంలో కనపడనివ్వకుండా. 


“అది నిజమే. కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడ్తుందిలే” అంది జయలక్ష్మి నాగదేవికి సపోర్టింగ్ గా. 


“అవున్లే” అన్నాడు తరుణ్ కూడా నాగదేవి బాధ పడకుండా.


 ఆరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న తరువాత కొడుకు, కోడలు చాలాసేపు వాదించుకుంటూ ఉండటం హల్ లో ఉన్న జయలక్ష్మికి, జగన్నాధానికి వినిపిస్తూనే ఉంది. జగన్నాథం ప్రశ్నార్థకంగా జయలక్ష్మి వైపు చూశాడు. జయలక్ష్మి నాకు అర్థమైందన్నట్లుగా చిన్నగా తల ఊపింది. కొద్దిసేపటికి తరుణ్ కోపంగా బైటికొచ్చి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు. నాగదేవి చాలాసేపు తరువాత వంటింట్లోకి వచ్చింది. బాగా ఏడ్చినట్లుగా తెలుస్తోంది. 


 జయలక్ష్మి అప్పటికి మౌనంగా ఉండి, కొద్దిసేపు తరువాత “సాయంత్రం షాపింగ్ కు వెళ్దాం. నీకు కావలసినవి కనుక్కో. రాత్రికి వంట కూడా పూర్తి చేసుకొని వెళ్దాం” అంది మజ్జిగపులుసు కోసం బూడిద గుమ్మడి కాయ తరుగుతూ.


 నాగదేవి “వద్దులేత్తా. ఇంకోసారి చూద్దాము. డబ్బుల్లేవని అన్నాడు కదా? ఇప్పటికి నాలుగేళ్ళ నుంచీ ఇలాగే చెప్తున్నాడు. ఐదు లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది కదాని అడిగాను” పెరుగు తీసి కొంచెం మజ్జిగ చేస్తూ అంది నెమ్మదిగా.

 “ఫర్వాలేదులే. డబ్బు మామ ఇస్తానన్నారు. రేపు వారం జమున కూతురు జానీ వోణీల ఫంక్షన్ కదా. బంగారపు వస్తువేదైనా తీసివ్వాలని రెండు రోజుల క్రితం ఒక ఎఫ్. డి. ని క్యాష్ చేసి ఐదులక్షల డబ్బు రెడీగా ఉంచారు. అందువల్ల ప్రస్తుతం రేపటి నీ బర్త్ డేకు నువ్వనుకున్నట్లు రాళ్ళగాజులు తీసుకుందువు గానీ” అంది జయలక్ష్మి ఆ మజ్జిగలో పసుపు వేసి.


“అయ్యో. అలా వద్దులేత్తా. ఫంక్షన్ కు ఇవ్వకుండా ఎందుకు?” అంది నాగదేవి కంగారుగా.


 “ఇవ్వకుండా ఏముందందులో. వేరే డిపాజిట్ ఉంది. ఇంకో ఐదు లక్షలు రెడీ చేస్తారు“ అంది జయలక్ష్మి ఉదయం నానబెట్టిన శెనగపప్పు, ధనియాలు, ఆవాలు, అల్లం, పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ పడ్తూ.


 నాగదేవి “అవునా! సరే. తనకొక మాట చెప్పి వెళదాం” అంది సంతోషంగా గుమ్మడికాయ ఉడికిస్తూ.


 “అలాగేలే” అంటూ జయలక్ష్మి మిక్సి పట్టిన మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి స్టౌ మీద పెట్టింది. 


 “నేను మీ మామతో తరుణ్ కు ఫోన్ చేయిస్తాను. సాయంత్రం త్వరగా రమ్మని. రెండు పొంగులు వచ్చిన తరువాత గుమ్మడికాయ ముక్కలు కలిపి తిరగమోత వేసి, మజ్జిగ పులుసు దించేసేయ్యి” అంది జయలక్ష్మి హల్ లోనికి వెళుతూ. 

 అనుకున్నట్లుగానే సాయంత్రం బజార్ కు వెళ్ళి బంగారు రాళ్ళ గాజులు తెచ్చారు. నాగ దేవి బర్త్ డే హ్యాపీగా గడిచింది. తరువాతి వారం జమున కూతురి ఫంక్షన్ కు అందరూ కర్నూల్ వెళ్ళి, మనుమరాలికి ఐదు లక్షల డబ్బిచ్చి ఇష్టమైన వస్తువు కొనుక్కోమని చెప్పారు. 


 “ఇంతడబ్బు ఎందుకు నాన్నా? మీరు పెద్దవారైపోయ్యారు. డబ్బు మీకెంతో అవసరం. మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఎవరినీ అడగలేరు కదా?” అంది జమున.


 ఆ మాటలకు నాగదేవి ‘తను గాజులు కొనుక్కున్నందుకు ఆడపడుచు ఈ రకంగా అంటోందా?’ అనుకుంది.


 జగన్నాథం మాత్రం “అదేంటి జమునా. అవసరం వస్తే తరుణ్ చూసుకోడా?” అన్నాడు జగన్నాథం నవ్వుతూ. జమున ఇంకేమీ మాట్లాడలేదు.


 ఒక సండేరోజు తరుణ్ వాళ్ళనాన్నను వాళ్ళ విల్లాల మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన లైబ్రరీకి తీసుకెళ్ళాడు. మంచి మంచి బుక్స్ ఉన్నాయక్కడ. వారి కార్డుతో ఒక బుక్ తీసిచ్చాడు. ఇష్టమైనప్పుడు వచ్చి చదువుకోవచ్చని చెప్పాడు.


 పదిహేను రోజుల తరువాత వచ్చిన తరుణ్ పుట్టిన రోజుకు ఎనిమిది లక్షలు విలువ చేసే ‘బ్రెజ్జా’ రెడ్ కార్ బహుమతిగా కొనిచ్చాడు జగన్నాధం. తరుణ్ బాగా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. జగన్నాథం తృప్తిగా చూశాడు.

 తరువాతి నెలలో జగన్నాథం పుట్టినరోజుకు అమ్మా, నాన్నలను శ్రీశైలం తీసుకెళ్ళి చూపించి వచ్చాడు. పిల్లలందరితో ప్రయాణానికి జయలక్ష్మి చాలా సంతోషించింది. ప్రయాణపు ఖర్చు తరుణ్ ను పెట్టనివ్వలేదు జగన్నాథం. ‘ఎదిగే పిల్లతో నీకు ఖర్చులుంటాయి, నేనే డబ్బిస్తా’నన్నాడు.


 పిల్లలతో కలిసి వుండటం పెద్దవాళ్ళిద్దరికీ చాలా తృప్తిగా వుంది. ‘కలసి ఉంటే కలదు సుఖము’ అనుకుంటూ ఉన్నారు. జయలక్ష్మి తన కొడుక్కు ఇష్టమైనవి, పిల్లలకు కావలసినవి పెద్ద ప్రాసెస్ లో ఉన్న వంటలు తనకు చేతనైనంతవరకూ చేస్తోంది. జగన్నాథం పిల్లలను వాకింగ్ కు తీసుకెళ్తున్నాడు. ఏవైనా కథలు చెప్తున్నాడు. 


అప్పుడప్పుడూ పిల్లలను తీసుకొని ‘మాల్’ కు వెళ్ళి ఆటలు ఆడించి, వాళ్ళడిగిన బొమ్మలు, ఫుడ్ కొనుక్కొని వస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చయినా ఆలోచించడం లేదు, జగన్నాథం.

 ఒకరోజు తరుణ్ “అమ్మా, కారం దోశ ఉల్లిగడ్డ కారంవేసి, పప్పులపొడి చల్లి చేస్తావా?” అన్నప్పుడు “పిండి తయారు చేసి, రెండురోజుల తరువాత చేస్తాలే తరుణ్” అంది జయలక్ష్మి. 


“సరేలేమ్మా” అన్నాడు తరుణ్, ఆమె చేసిన ‘బిసి బాలిహుళి’ తింటూ. 


ఇలాంటి వంటలు నాగదేవి తక్కువ చేస్తుంది.

 కానీ ఇక్కడికొచ్చిన కొత్తలో ….అంటే నాలుగైదు నెలల క్రితం ఉన్న హుషారు జయలక్ష్మికి ఈ మధ్య ఉండటం లేదు. ఆరోగ్యం కొంచెం సహకరించడం లేదు. ఆ మాట ఎవరితో చెప్పలేక మొహమాట పడుతున్నది. జగన్నాథం గమనించి ఒకరోజు గుడికి వెళ్తున్నామనిచెప్పి హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. టెస్ట్ లు రిజల్ట్స్ కోసం మళ్ళీ ఇంకోరోజు కూడా అలాగే వెళ్ళారు. 


 ఆ విషయం తెల్లవారి ఇంట్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఉదయం జమున వీడియో కాల్ చేసి ”అమ్మా, రేపు మా పెళ్ళిరోజు. మేమిద్దరమూ భద్రాచలరాముని సందర్శించుకోవడానికి వెళ్తున్నాము. పిల్లలను మా అత్తగారు చూసుకుంటానన్నారు” అంది. 


 “మంచి పనేలే. ఆ కళ్యాణ రాముడు చల్లగా చూస్తాడు” అన్నాడు జగన్నాథం. 


 “అవునూ… ఇంకోఇరవై రోజుల్లో తరుణ్ వాళ్ళ పెళ్ళిరోజు వస్తోందిగా. ఏరా తరుణ్ …మీరెక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేశారా?” అంది జమున.


 “లేదక్కా. పోయినసారి శ్రీలంక చూసి వద్దామనుకున్నాము. అక్కడికైతే ఎవరికీ పాస్ పోర్ట్ కూడా అవసరం లేదు” అన్నాడు తరుణ్.


 “అత్తయ్యా… మేము శ్రీలంకలో బుద్ధుని విగ్రహాలు చూసి వస్తాము” అన్నారు పిల్లలు.


 “ఓహో…అలాగే” అంది జమున.


 వీడియో కాల్ తరువాత జగన్నాథం వాళ్ళ శ్రీలంక టూర్ గురించిన వివరాలు అడిగి వాళ్ళ నలుగురినీ వెళ్ళి రమ్మని అందుకు కావలసిన డబ్బు ఒక నాలుగు లక్షలు తరుణ్ కు ట్రాన్స్ఫర్ చేశాడు.


 ఆ ప్రకారంగా ఈ ఆరునెలలల్లో ఐదు సంవత్సరాల క్రితం కొన్న విల్లా కొడుక్కివ్వడమే కాకుండా, కోడూరు లో ఉన్న ఇల్లు అమ్మి ఆ డబ్బిచ్చారు. ఇంకా కోడలికి బంగారు రాళ్ళగాజులు కొనడానికి ఐదులక్షల రూపాయలు ఇచ్చారు. తరుణ్ కు కార్ బహుమతిగా ఇచ్చాడు. శ్రీలంక టూర్ కు డబ్బిచ్చారు. శ్రీశైలం ఖర్చుల లాంటివి లెక్కపెట్ట లేనన్ని చేశారు. మన పిల్లలే కదా, వాళ్ళ తృప్తి కోసమే కదా అనుకున్నారు.


 వాళ్ళు టూర్ నుంచి వచ్చిన తరువాత జయలక్ష్మి ఆరోగ్యం బాగాలేక పోవడం గురించి జగన్నాథం చెప్పాడు వాళ్ళతో, బెడ్ రూం లో జయలక్ష్మి నిద్రపోతుండగా.


 “ సాయంత్రం ఆసుపత్రికి తీసుకెళ్దాం మామా “ అంది నాగదేవి.


 “ మేము వారం క్రితమే వెళ్ళి వచ్చాము. టూర్ లో ఉన్నారని మీకు చెప్పలేదు. ఒక కిడ్నీ చెడిపోయింది. డయాలసిస్ చేసినా లాభం లేదు. మార్చాలన్నారు. అందుకని మేము కర్నూల్ కు లేదా హైదరాబాద్ కు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము. అక్కడే రెండు మూడు నెలలు ఉండి, హాస్పిటల్ లో చూపించుకోవాలి” అన్నాడు జగన్నాథం. 


“అంత దూరం ఎందుకు మామా. నంద్యాలలో కూడా ఆపరేషన్ బాగానే చేస్తున్నారు. ఆ మధ్య మా చిన్నాన్న కూతురికి ఇలాగే కిడ్నీ మార్చారు. ఆధార్ కార్డ్ ఉంటేచాలు” అంది నాగదేవి కంగారు పడుతూ. ‘అమ్మో వేరేవూర్లో వీళ్ళు కాపురం పెడితే ఎంతడబ్బు ఖర్చు?’ అని మనసులో గుండెలు బాదుకుంది.


నాగదేవి వైపు సాలోచనగా చూస్తూ “ఎందుకులేమ్మా. అక్కడ మా తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. మేము ఇల్లు తీసుకొని ఉన్నా వాళ్ళు సహాయంగా ఉంటారు” అన్నాడు జగన్నాథం. అతనికి ఆఫీస్ నుంచి డబ్బిస్తారు. కానీ ముందుగా ఇవ్వరు. ఆపరేషన్ అయిన తరువాత బిల్లుపను బట్టి ఇస్తారు. ఇప్పుడు ముందుగా కొంత డబ్బు జాగ్రత్త చేసుకొని ముందు కొద్దిరోజులు డయాలసిస్ చేసుకుంటూ, కిడ్నీ మార్చేవిషయం ఆలోచించాలి.


 అందుకే జగన్నాథం తరుణ్ తో ఇలా అన్నాడు

 “ తరుణ్… నా దగ్గర ఎక్కువగా డబ్బులేదు. ముందుగా ఒక పది లక్షలు నువ్వు ఇవ్వగలవా?” అన్నాడు. 


 “నా దగ్గర అంత డబ్బు…” తరుణ్ నసుగుతూ మాట పూర్తి చెయ్యలేదు.

 “పోనీ అపార్ట్మెంట్ కు డబ్బు కట్టావు కదా. అది వెనక్కు తీసుకోవడమో లేక ఎవరికైనా అమ్మడమో చేయొచ్చుగా” అన్నాడాయన.


 వెంటనే నాగదేవి స్వరం పెంచుతూ “ అందుకే ఇక్కడ చూపిస్తామని అన్నది” అంది విసురుగా.


 తరుణ్ మాట్లాడకుండా కూర్చున్నాడు. 

జగన్నాథం నమ్మలేనట్లుగా చూశాడు ఇద్దరివైపు. 


 “పోనీ ఈ విల్లా అమ్మేద్దాం తరుణ్” అన్నాడు జగన్నాథం. 


నాగదేవి విసురుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.

  తరుణ్ “అమ్మితే మేమెక్కడ ఉండాలి?” అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు వాళ్ళ నాన్న వైపు.


  “మరి హాస్పిటల్ ఖర్చులకు కావాలిగా?” అంటూ ఆయన కూడా లేచి కోపంగా లోపలికి వెళ్ళాడు.


 ఎంత ఆలోచించినా జగాన్నాధానికి డబ్బు వచ్చే మార్గం కనిపించడం లేదు. విల్లా కూడా తరుణ్ పేరుమీదే వుంది. తమకు ఇల్లు లేదు. ప్లాట్ లేదు. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు కూడా కొద్దిగానే వుంది. కోడలి విసుర్లు, కొడుకు మౌనం ఆయనను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? అనుకుంటూ ఉండగా అప్పుడెప్పుడో చదివిన వార్త గుర్తొచ్చింది. ‘ ఏ తల్లి తండ్రులయినా అలా కూడా చేస్తారా?’ అని ఆరోజు అనుకున్నాను. ఈ రోజు అది నాదగ్గరికే వచ్చింది. అనుకుంటూ దిగులుపడ్డాడు.


 సాయంత్రం కొడుకు, కోడలు పార్క్ కు వెళ్ళినప్పుడు జమునకు వీడియో కాల్ చేసి జయలక్ష్మి ఆరోగ్యం, డబ్బు గురించి తరుణ్, నాగదేవిల ప్రవర్తన చెప్పారు. 


 ఇదంతా జగన్నాథం, జయలక్ష్మి చెప్తుంటే జమున సాలోచనగా చూసింది వారివైపు.


 “అమ్మ ఆరోగ్యం గురించి నాతో కూడా మీరు చెప్పలేదు” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. 


 “నాన్నా, నేను మా ఇంటి మీద లోన్ తీసుకొని డబ్బు సమకూరుస్తాను “ అంది.


 “వద్దమ్మా. మొదట నా బంగారు అమ్మేస్తాము. తరువాత అవసరమైతే చూద్దాం” అంది జయలక్ష్మి.


 తరువాత తన నిర్ణయం చెప్పాడు జగన్నాథం.


  “తల్లి తండ్రులు వారి పిల్లలకు మొదట ఆస్తిని వ్రాసి ఇచ్చినా, తల్లితండ్రులను అనారోగ్య పరిస్థితులల్లో కొడుకులు చూడకుంటే తిరిగి కోర్టు ద్వారా వారి ఆస్తిని వారు వెనక్కి తిరిగి తీసుకోవచ్చు అనే తీర్పును ఒకప్పుడు నేను చదివాను. ఇప్పుడు నేను కూడా అదే చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఈ విల్లా, ఊర్లో ఇల్లమ్మిన డబ్బు అన్నీ నా కొడుకు నుంచి నాకు వెనక్కు తిరిగి ఇప్పించమని రేపు కోర్టు లో కేస్ వెయ్యడానికి వెళ్తున్నాను”


 “నాన్నా!?” జమున ఆశ్చర్యంగా,బాధగా అంది.


 “ ఏం చేసేదమ్మా. తప్పడం లేదు. అవసరానికి డబ్బు కావాలి. ఇంతకంటే మార్గం కనిపించడం లేదు. అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి. తరుణ్ కు ఉద్యోగం వుందిగా. ఇబ్బంది లేదులే. నీకూ ఒక మాట చెప్పి చేద్దామని చెప్పాను. నువ్వేమీ అనుకోకు” అంటూ కూతురికి చెప్పి ఫోన్ పెట్టేశాడు.

 జయలక్ష్మి కళ్ళనీళ్ళ తో చూసింది.


 “నువ్వేం బాధ పడకు. మన లాంటి వారికి దేవుడు ఇలా సహాయం చేయడానికే ఇలాంటి మార్గాలు చూపిస్తున్నాడు” అంటూ సోఫా లో వెనక్కు వాలి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అతని కనుకొలుకులల్లో నుంచి ఒక కన్నీటి చుక్క జారింది.

***

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 సమాప్తం

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

 నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.55 views0 comments

Comments


bottom of page