top of page
Writer's pictureParnandi Gopala Krishna

మా సంక్రాంతి సంబరాలు



'Ma Sankranthi Sambaralu' - New Telugu Story Written By P. Gopalakrishna

Published In manatelugukathalu.com On 13/02/2024

'మా సంక్రాంతి సంబరాలు' తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ  

కథా పఠనం: A. సురేఖ



సంక్రాంతి వచ్చిందంటే చాలు, నెలరోజుల ముందునుండి మాకు ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. ఆడపిల్లలు ఆవుల మంద వెనకాల వెళ్ళి పేడ సేకరించి తెచ్చేవారు. మేమంతా బడి అయిపోయాక (నేను బడి మొహం కూడా చూసేది తక్కువ అని గతంలో చెప్పాను) ఆ పేడను పిడకలకోసం సిద్ధం చేసి, గోడలకి పిడకలు కొట్టడానికి సిద్ధం చేసేవారం. 


 ఇక్కడ ఇంకోమాట చెప్పాలి. ఎవరి ఇంటి గోడలకి పిడకలు కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అందువలన పిడకలు కొట్టుకోవడానికి గోడలు వెతుక్కోవాల్సి వచ్చేది. మేము మాత్రం మా ఇంటిదగ్గర ఉన్న చెట్లకు పిడకల్ని అతికించేసి, భోగీ పండక్కి రెడీ ఐపోయేవాళ్ళం. 


 తరువాత ముఖ్యమైన సంగతి బట్టలు. మా చిన్నతనంలో ఇంట్లో మగవాళ్లందరికీ ఒకరంగు, ఆడవాళ్ళకి ఒకరంగు బట్టలు కుట్టించేవారు. అప్పుడు అదే ఫాషన్ అనుకుంటా. ఇప్పటిలా రెడీమేడ్ షాప్స్ లాంటివి ఏమీ ఉండేవి కాదు. ఇప్పటిలా పిల్లల ఇష్టాయిష్టాలతో ఫ్యాషన్స్ తో పెద్దవాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. వాళ్ళకి నచ్చిన బట్టలు(గుడ్డలు) కొనేసి నెలరోజుల ముందే తీసుకొచ్చేవారు మా నాన్నగారు. ఆ బట్టలు టైలర్ దగ్గరికి తీసుకెళ్లి కుట్టించుకోవడం ఇంకో ముఖ్యమైన పని. 


 మా ఊళ్ళో ఒకేఒక్క టైలర్ కోటేశ్వరరావు అని ఒకాయన ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లో పెద్ద పేరుమోసిన టైలర్. మా ఊరుకు ఇరుగుపొరుగున చిన్నచిన్న ఊళ్ళు పదిపదిహేనుకు పైగా ఉండేవి. అన్ని ఊళ్లకు అతనే టైలర్. అందుకే ముందుగానే బట్టలు ఇచ్చేవాళ్ళం మేము. ఎప్పుడు తిరిగి ఇస్తావు అని అడిగేవాళ్ళం మేము. ఫలానా బుధవారం రండి, ఇస్తాను అని అతను చెప్పడమే తరువాయి. ఇంటికి వచ్చి గోడమీద పెన్సిల్ తో రాసుకునేవాళ్ళం. 


 ఒక్కోరోజు ఒక్కో గీత చెరుపుకుంటూ, ఆఖరి గీత చెరిపేసిన రోజు గాల్లో తేలుకుంటూ, టైలర్ దగ్గరికి వెళ్ళి చూస్తామా, అతను షాప్ తియ్యడు. వాళ్ళింటికి వెళ్ళి కోటేశ్వరరావు ఉన్నాడా అని అడిగితే, పెద్దవాళ్ళని గౌరవించాలని వాళ్ళావిడ క్లాస్ తీసుకునేది. మాకేమో కళ్ళముందు కొత్తబట్టలు కనిపించేవి. విచిత్రం ఏమిటంటే, మేము వాళ్ళింటి దగ్గర నిల్చొనే సమయంలోనే కోటేశ్వరరావు ఏ దారిన వెళ్లిపోయేవాడో, తెలిసేదికాదు. 


 మళ్ళీ మధ్యాహ్నం టైలర్ షాప్ కి వెళ్ళి అక్కడే కూర్చొనే వాళ్ళం. అలా ఎప్పటికో మా బట్టలు బయటికి తీసేవాడు. వాటిని కట్ చేసి, కుట్టడం మొదలెట్టాకా తిరిగి ఇంటికి వచ్చి, మళ్ళీ కాసేపట్లో వెళ్లేసరికి మాయమయ్యేవాడు. ఇలా కొన్నిసార్లు జరిగాక ఆఖరి అస్త్రం ప్రయోగించేవాళ్ళం. "మా నాన్నగారిని తీసుకొస్తామని"చెప్పేవాళ్ళం. ఎలాగో బట్టలు కుట్టడం పూర్తిచేసి చేతిలో పెట్టేవాడు. 


 ఇంక మా మొహాల్లో ఆనందం బహుశా మీకు కళ్ళముందు సాక్షాత్కరించి ఉంటుంది. ఒకమోస్తరుగా గాలిలోనే తేలుకుంటూ, మొహాల్లో విజయగర్వం తొణికిసలాడుతూ ఉంటే, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటికి తీసుకొచ్చేవారం. ఇవాళ మంచి రోజు కాదు. ఎల్లుండి వేసుకొని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అనేది అమ్మ, మొత్తం గాలి తీసేసేది. అంత "కష్టపడి" కుట్టించుకున్న బట్టల్ని అలా పక్కన పెట్టి, సరిపోయాయో లేదో చూసుకోకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో మీరైనా చెప్పండి. 


 ఎలాగో అమ్మ కొంగు పట్టుకొని కాళ్ళకి అడ్డంపడుతూ బతిమాలుతూ, (కొన్నిసార్లు నసపెడుతూ) మొత్తంమీద ఆ బట్టలు సరిపోయాయి లేదో చూసుకోవడానికి నానా యాతనా పడేవాళ్ళం. తీరా వేసుకొని చూస్తే ఏముంటుంది. ఒక్కోసారి బటన్స్ కుట్టడం మరిచిపోయేవాడు. ఇంకోసారి మరిచిపోయి వేరేవాళ్ళ కొలతలతో కుట్టేసేవాడేమో. ఒకసారి నాకు బట్టలు భలేగా కుట్టాడు. షర్ట్ టైట్ ఫిట్ కుట్టాడు. ఇప్పుడు కొందరు అబ్బాయిలు వేసుకుంటున్నారు కదా అలా అన్నమాట. ఇంక నిక్కర్ అనడానికి అది చూసిన వాళ్ళకి మనసు అంగీకరించదు అంటే నమ్మండి. ఒకవైపు నార్మల్ గా కుట్టి, రెండోవైపు డబ్బాలాగా లూజ్ గా కుట్టేసి ఇచ్చాడు. 


 ఆ బట్టలు వేసుకున్న నన్ను చూసి, అమ్మైతే పగలబడి నవ్వింది. నవ్వడమే కాదు ఇరుగుపొరుగు వాళ్ళకి చూపించి మరీ నవ్వింది. నాకేమో ఉన్న పరువుపోయింది. అవి విప్పి పారేసి, మళ్ళీ టైలర్ దగ్గరకెళ్ళి, అతని మీద చాల పెద్ద దెబ్బలాటే పెట్టుకున్నాను. ఏవేవో మాట్లాడేసాను. అతను నా మాటలకు చాలా నొచ్చుకున్నట్లు మొహం మాడ్చుకుని, నా బట్టలు సరిగా కుట్టి ఇస్తానని తీసుకున్నాడు. అంతే తిరిగి పండక్కి బట్టలు ఇవ్వనే లేదు. ఆ ఏడాది పండగ అలా జరిగిపోయింది. 


 మా ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో భోగీ మంట వేసే ఆనవాయితీ ఉండేది కాదు ఆ రోజుల్లో. ఒకసారి భోగి మంట వేస్తే కొన్ని కుక్కలు ఒక పిల్లిని తరుముతూ వచ్చాయిట. ఆ పిల్లి భోగి మంటలు లో పడిపోయి కాలిపోయి చచ్చిపోయిందిట. ఇంకోసారి ప్రమాద వశాత్తూ, వీధిలో అగ్నిప్రమాదం కూడా జరిగిందిట. ఇదంతా మా నాన్నగారి చిన్నతనంలో జరిగిందని చాల సార్లు చెప్పారు. అందుకే మా వీధిలో భోగిమంటల్లేవు. 


 మా వీధికి వెనకాల ఉన్న పెద్ద వీధిలోకి వెళ్ళి భోగి మంటల్లో పిడకలు వేసి కొంచెం సేపు గడిపి వచ్చేసేవాళ్ళం. ఇంక రోజంతా దోస్తులతో ఆటలే ఆటలు. ఇంట్లో పెద్దవాళ్ళేమో, వంటల్లోనో, లేక పంట లెక్కలు చూసుకోవడంలోనో ఉంటే మేమేమో ఆటల్లో మునిగిపోయేవాళ్ళం. ఆడపిల్లలంతా ఒక చోట ఆడుకుంటే మేమంతా రైల్వే స్టేషన్ దగ్గరలో ఆడుకునేవాళ్ళం. 


 ఇప్పటిలాగా సెలవుల్లో కూడా వర్క్ చెయ్యాల్సినంత హోంవర్క్ లు ఇచ్చేవారు కాదు(ట) ఆ రోజుల్లో. దసరా సెలవులకు ముందొకసారి, పండగ సెలవులకు ముందొకసారి పరీక్షలు అవ్వడం వలన సెలవుల్లో ఎలాంటి వర్క్ ఇచ్చేవారు కానేకాదు. అందుకే పండగ వచ్చిందంటే ఆటవిడుపు. పండగలు వస్తే మా ప్రసాదంగాడు, భాస్కరం గాడూ వాళ్ళ తాతగారింటికి వెళ్ళేవాళ్ళు. మాకేమో అలా వెళ్లే ఛాన్స్ ఉండేది కాదులెండి. కారణం పండక్కి పనివాళ్ళకి, పాలేరులకి, ఇంకా చాలామందికి ధాన్యం కొలిచి ఇవ్వాలి. వాళ్ళకి కూడా పండగ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి బట్టలూ అవీ పెట్టాలి అని ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు. 


 భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ మూడు రోజులు రకరకాల పిండివంటలు వండి మా వీధిలో అందరి ఇళ్ళకి (వాళ్లంతా మా బంధువులే) ఇచ్చి రమ్మని అమ్మ పంపించేది. ముందు మా ప్రసాదం గాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మకి ఇచ్చి కొత్తబట్టలు కదా ఆవిడ కాళ్ళకి దండం పెడితే ఒక అర్ధరూపాయి బిళ్ళ జేబులో వేసేవారు. తరువాత ఇంటికి వచ్చి ఇంకొకరి ఇంటికి. అలా అందరి ఇళ్ళూ పూర్తయ్యేసరికి మన జేబులో ఒక ఐదో పదో రూపాయలు పోగయ్యేవి. అవన్నీ భద్రంగా దాచుకుని, మళ్ళీ భోజనం చేసి, ఆటల్లో మునిగిపోవడమే. 


 ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది. ఎందుకో పండక్కి మా ప్రసాదం గాడు ఊరెళ్లలేదు. వాడూ నేనూ కలిసి ఇంకో ఇద్దరితో రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్ళి ఆటలాడుతూ ఉండిపోయాము. టైం ఎంతయిందో అసలు తెలియనే లేదు. మేమేమైపోయామో అని ఊళ్ళో ఒక్కటే వెతుకులాట అట. ఊరు వాడా గాలించినా మేము కనపడలేదు. దాంతో, ఊళ్ళో పుకార్లు మొదలైంది. ఇద్దరు పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని పోయారని. అంతే ఇంకేముంది. అందరూ పిల్లా పెద్ద తలోవైపు పరుగులు తీసారట. మేమేమో తీరిగ్గా నాలుగున్నరకి ఇంటికి చేరాము. 


 పండగ ఏ స్థాయిలో మాకు జరిపి ఉంటారో మీకు నచ్చినట్లు ఊహించుకోండి. నేను చెప్తే బావుండదు. 

***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna 

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


53 views0 comments

Comments


bottom of page