top of page

తప్పటడుగులు - పార్ట్ 2



'Thappatadugulu Part 2/2' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 28/01/2024

'తప్పటడుగులు - పార్ట్ 2/2' పెద్దకథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:

రజిని, సుగుణ మంచి స్నేహితులు. రజిని పట్నానికి వెళ్లి ఇంజనీరింగ్ చదువుతుంది.మంచి ఉద్యోగంలో చేరుతుంది.

సుగుణ ప్రయివేట్ గా డిగ్రీ పూర్తి చేస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.


అయితే రజిని ఊహాలోకంలో విహరిస్తూ పెళ్లి చేసుకోదు. భార్యతో విడిపోయిన వరప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. క్రమంగా అతను రజినికి దూరం అవుతాడు.



ఇక తప్పటడుగులు పార్ట్ 2 చదవండి.


వరప్రసాద్ వారాల తరబడి అలా రజిని వైపు శీతకన్ను వేయడానికి కారణం వాకబు చేస్తే అసలు విషయం తెలియవచ్చింది! గగ్గోలు పెట్టి నిలదీసి అడిగితే.. అతని సమాధానం -.. ' అవును.. నన్ను కాదనుకున్న నా భార్య సమాధానపడి రాజీకొచ్చింది!.. ఇంట్లోవాళ్ళు కూడా.. పెళ్ళి చేసుకున్న భార్యను, కన్నబిడ్డను కాదనటం.. సబబు కాదనే తేల్చారు!.. పైగా చట్టం కూడా దాన్నే సమర్ధిస్తుంది కదా?.. అందుకే అలా..’ అని తేల్చాడు. 

 

అయితే.. ' నాతో సంప్రదించవలసిన పని లేదా? ' అని అడిగింది రజిని. 


అందుకు వరప్రసాద్ ఏమాత్రం తడుముకోకుండా.. ' ఏముందీ!.. ఇప్పటికీ మన సంబంధం సహజీవనమేగా!. అలాగే కొనసాగిద్దాం!.. ఎలాగూ నా భార్యలా.. నీవు నాపై ఆధారపడిన దానవు కావు గదా!.. నువ్వు సర్వ స్వతంత్రురాలవు!.. పైగా ఇప్పటికీ.. మన మధ్య ఎలాంటి పిల్లల బాదరబందీలు లేవు.. ఎంత కాలమైనా మనమిలా గడపొచ్చు '.. అంటూ.. తన వైఖరి తేటతెల్లం చేసాడు. 


దాంతో రజినికి దిమ్మ తిరిగి.. నెమ్మది నెమ్మదిగా తన పరిస్ధితి అర్ధమయ్యింది. తమ మధ్య సంబంధంలో తన పాత్ర తామరాకులాంటి దనీ.. తనకు.. తమ సంబంధం తాలూకు బాంధవ్య బంధాలేవీ.. తనకు అంటలేదని తేల్చి.. నిక్కచ్చిగా కర్కశంగా చెప్పేసాడు.. వరప్రసాద్. 


అంతటితో రజినికి ఉవ్వెత్తున దుఃఖం ముంచుకొచ్చింది. అప్పట్లో.. అనాలోచితంగా.. అయినవాళ్ళను కాదని.. తొందరలో తీసుకున్న నిర్ణయానికి.. స్వయంకృతాపరాధ భావంతో కుమలడం తప్ప.. రజినికి మరో దిక్కు తోచలేదు. 


అంతటితో.. వరప్రసాద్ తో సంబంధానికి.. విజ్ఞతతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంది రజిని. ఒంటరి జీవితం తిరిగి కొనసాగించింది..తల్లిదండ్రుల తోడుగా. 


రోజులు గడుస్తున్నాయి.. నిస్సారంగా ఉంది జీవితం రజినికి. తోడుగా ఉన్న తల్లిదండ్రులు వయసు మీరి పోతున్నారు!.. పాత జీవితాన్ని సమీక్షించుకుంటే.. ఒకప్పుడు.. తనకు ఆధారమై నిలిచిన.. తన తల్లిదండ్రులు.. ఇప్పుడు తన సంరక్షణలో.. రోజులు వెళ్ళదీస్తున్నారు!.. తను కూడా నెమ్మదిగా మధ్య వయసుకు చేరువవుతోంది... మరికొంత కాలానికి తన ఉద్యోగ వ్యాపకం,.. విరమణ వయసు గడువు కూడా ముగుస్తుంది!.. 


ఆపైన.. అప్పటికి ఎవరూ తోడు మిగలని ఒంటరి విశ్రాంత జీవితం ఊహకు,.. ఆలోచనలకూ.. దిగులు పుట్టి మనసు కకావికల మవుతోంది రజినికి... విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడవటానికి.. తనలాంటి ఒంటరి.. తీసుకోవలసిన జాగర్తలు, చివరిదాకా.. సాఫీగా సాగి పోయేందుకు.. ఏమి చెయ్యాలనే ఆలోచనలు తరచూ మనసులో మెదలటం మొదలై.. నిత్యం తీరని వేదనగా మారింది రజినికి. నిస్తేజంగా సాగుతున్న ఆమె జీవనంలో ఉద్యోగపు పని గంటలే.. ఊరటగా, ఉపశమనం.. జరుగుబాటు దినచర్యగా మారింది. 


మధ్య వయసు జీవితమంతా యాంత్రికంగా అలా అలా చూస్తుండగానే కాలక్షేపంగా గడిచిపోయింది రజినికి. కాల గమనంతో పాటు.. మరి కొంత కాలానికి.. తల్లీ, తండ్రీ కూడా చనిపోవడంతో.. ఏ తోడూ లేని ఒంటరిదయింది. ఉద్యోగ కాలపరిమితి గడువు కూడా మరెంతో కాలం మిగిలి లేదు!.. ఆ పైన.. జీవితం అగమ్య గోచరం.. తరువాత పరిస్థితిపై.. ఏమాత్రం పాలుబోక.. ఆలోచనలు.. ముందుకు సాగటం లేదు రజినికి. 


యాంత్రికంగా అలా.. రోజులు గడుస్తున్న సమయంలో.. అనుకోకుండా ఒకరోజు.. సిటీ మాల్ లో షాపింగ్ చేస్తుండగా.. తలవనితలంపుగా చిన్ననాటి స్నేహితురాళ్ళిద్దరూ.. ఎదురెదురు పడ్డారు ఒక బట్టల దుకాణంలో!.. మొదటగా గుర్తించిన రజిని..


'హలో! హలో!.. సుగుణా!.. నువ్వెలా..ఇక్కడా! ' అంటూ.. ఆశ్చర్యపోతూ కావలించుకున్నంత పనిచేసింది. 


'పాతికేళ్ళ ప్రవాసయోగం తర్వాత.. గత ఏడాదిగా మేం ఇక్కడే ఉంటున్నాం! ' 


'ఉంటున్నాం!.. అంటే.. నీ కుటుంబ వివరాలు చెప్పవే? ' అంటూ.. ఎడ్రసు లేకుండా దూరంగా పోయి.. తిరిగి ఇన్నాళ్ళకు కనిపించిన.. స్నేహితురాలిని నిలదీసింది రజిని. 


'మేము అంటే.. మా వారు,.. మా చివరి పిల్లలు.. కరుణ, మమత, నేనూ!.. మా మొదటి అమ్మాయి శాంతకు పెళ్ళి అయిపోయి.. భార్యాభర్తలిద్దరూ ఈ సిటీలోనే సాఫ్టువేరు ఉద్యోగాలు చేసుకుంటూ వేరు కాపురం ఉంటున్నారు '.. అంటూ మరో ప్రశ్నకు తావు లేకుండా వివరణ ఇచ్చి.. 

' ఇప్పుడు నువ్వు చెప్పు నీ వివరాలు. '..అంటూ రజినీ ముఖంలోకి ఆతృతగా చూసింది సుగుణ. 


'చెప్పడానికేముంది.. నా ఒంటరి జీవితం గురించి.. అయినా..చిన్ననాటి స్నేహితురాలివి..నీకుకాక ఇంకెవ్వరికి మనసు విప్పి చెప్పుకుంటాను!?.. నేనుండేది ఇక్కడకు దగ్గరే'.. అంటూ ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్లి.. స్నేహితురాలికి తన వ్యధా భరిత గాధను, గోడును.. విప్పి చెప్పుకొంది రజిని. 


స్నేహితురాలి కధంతా విన్న సుగుణ..ఇన్నాళ్ళుగా.. ఒంటరి జీవితం గడుపుతోందని తెలిసి నిశ్చేష్టురాలయి రజినిని ఎలా సాంత్వన పర్చి.. ఊరట కలిగించాలో తెలియక తికమక పడింది. తనకు తోడుగా ఇక తానున్నా నని ఓదార్పు పలికింది. స్నేహితురాలి మాటలతో.. ఆత్మీయ తోడు దొరికిందనే భరోసా కలిగింది రజినికి. మిగిలిన జీవితానికి నిబ్బరమైన ఆసరా.. సుగుణ రూపంలో ప్రత్యక్షమైనందుకు పొంగిపోయింది. ఇన్నాళ్ళుగా.. అందుబాటులో లేకుండా.. దూరమైన స్నేహ బంధాన్ని.. అపురూపంగా భావించి.. పొదివి పట్టుకుని.. ఆప్యాయంగా కాపాడుకోసాగింది రజిని. 


సుగుణ కుటుంబంతో..స్నేహం, అనుబంధం.. ముఖ్యంగా.. తన జీవితంలో తనకు లభించని పిల్లల సాహచర్యం.. వారి పిల్లలు..కరుణ, మమతలను చేరదీసి.. వారి లాలన పాలన చూస్తూ..ఆనందం సంతృప్తి పొందడం అలవాటుగా మారింది రజనికి. 


ఈ క్రమంలో సుగుణ ఆఖరి పిల్ల.. ఏడేళ్ల మమత తనకు బాగా చనువుగా చేరువై.. అనుబంధం గా మార్చుకోవాలనే ఆశ తనలో చిగురించి.. బలపడ సాగింది.. రజిని మనసులో! ఆ అనుబంధం, కూరిమి సుగుణ దంపతులకు చూచాయగా.. అవగతమౌతూనే ఉంది...సానుభూతితో అర్ధం చేసుకుంటూనే ఉన్నారు!


ఒక రోజు రజిని తన మనసులోని మాట ప్రస్తావన.. సుగుణ ముందుకు తీసుకురానే వచ్చింది!


' చూడు సుగుణా!.. నాకు ఈ జీవితానికి మిగిలిన ఆత్మీయురాలవు నీవే!.. నాకు నా బతుకు మీద పెద్దగా ఆశలు ఏమీ లేవు.. నా ఒంటరి జీవితానికి నేను కోరుకునేది ఒక్కటే!.. నా పెంపకంలో నా చేతుల మీదుగా ఏ ఒక్కరి జీవితాన్నయినా తీర్చిదిద్దాలన్నది.. ఎప్పటినుంచో నా మనసులో నాటుకున్న ఏకైక కోరిక.. నాకుగా నేను స్వయంగా కూడబెట్టిన ఆస్తితో ఎవరో ఒకరికైనా భవిష్యత్తుకు బాటలు వేయాలని నాకు.. చిరకాలంగా మిగిలిన కోరిక!.. 


నాకు తెలిసి.. నాకు వారసులెవరూ లేరు..నా ఒక్కగానొక్క ఆశ నెరవేర్చ గల ఆశాకిరణంగా నా ముందు నీవున్నావు!.. నీ చిన్న కూతురు నాకు మాలిమి అని నీకు తెలుసు..తనకు నన్ను.. ఇంకో అమ్మను చేయగలవా?.. మీ ఆయనతో సంప్రదించి.. చిరంజీవి మమతను.. నాకు దత్తతగా ఈయగలవా.. సుగుణా! ' అని.. ఆర్తిగా, దీనంగా ప్రాధేయపూర్వకంగా వేడుకొంది. 


స్నేహితురాలి మనోస్థితి నెరిగిన సుగుణ.. ఆమె అభ్యర్ధనను సానుభూతితో అర్ధంచేసుకుని.. భర్తతో సంప్రదించి.. కూతుర్ని దత్తతిచ్చి.. రజినికి తన మనోభీష్టాన్ని, జీవితాశయాన్ని నెరవేర్చుకునే సదవకాశాన్నిచ్చి..తమ స్నేహం ధృఢమైందిగా ఋజువుచేస్తూ చరితార్ధంగా ఆదర్శంగా నిలిచింది. 


కొత్తగా ఏర్పడిన అనుబంధంతో.. తమ స్నేహం చివరి వరకూ పటిష్టంగా నిలిచేలా..స్నేహబంధం విలువలను చిరస్మరణీయం చేసుకున్నారా.. స్నేహితురాళ్ళు!


========================================================================

సమాప్తం

========================================================================

గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు! 


52 views1 comment

1 Comment


Gvvs Murty

2 hours ago

చక్కని ముగింపు ఇవ్వడం జరిగింది. రచయితకు అబినందనలు.

Like
bottom of page