top of page

తప్పటడుగులు - పార్ట్ 1

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Thappatadugulu Part 1/2' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

Published In manatelugukathalu.com On 26/01/2024

'తప్పటడుగులు - పార్ట్1/2' పెద్దకథ ప్రారంభం

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్రజిని, సుగుణ వారిద్దరూ ఒకే ఊరు ఒకే వయస్సు వాళ్ళు కావటంతో.. చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు! కలిసిమెలిసి స్నేహంగా మెలిగే వారు! కలిసే హైస్కూలు వరకు చదువుకున్నారు! ఆ తర్వాత కుటుంబ స్థోమత లేక… కాలేజీ పైచదువులకు పట్నం వెళ్ళలేక పోయింది సుగుణ. కానీ…రజిని మాత్రం.. ఒక్కత్తే కూతురు కావటంతో.. పై చదువులు పట్నంలో మేనమామ గారింటి వద్ద ఉండి కొనసాగించింది. 


అయినా సెలవుల్లో సొంత ఊరు వస్తూపోతూ ఉండటంతో సుగుణతో చిన్ననాటి స్నేహం అలాగే కొనసాగింది! సుగుణ కూడా ఊళ్ళో ఉండే… స్నేహితురాలి ప్రోద్బలంతో.. ప్రైవేటుగా డిగ్రీ అయిందనిపించింది! రజిని మాత్రం.. ఇంజనీరింగ్ పట్టభద్రురాలయి,... బెంగుళూరులో.. మంచి కంపెనీలో ఉద్యోగంలో కూడా చేరింది!


ఊరిలో ఉన్న స్నేహితురాలు సుగుణకు పెళ్ళి నిశ్చయమైందని తెలిసి… ఊరొచ్చి కుతూహలంగా వివరాలు అడిగి తెలుసుకుంది రజిని. కానీ…వివరాలు తెలుసుకొని నిరుత్సాహంగా…

 ' ఏం చూసి ఒప్పుకున్నావే?.. మంచి రూపమా.. ఉద్యోగమా?.. లేక మంచి జీతమా?!...' అంటూ చిరుకోపం ప్రదర్శించి… వివరణ కోసం స్నేహితురాలి వైపు చూసింది. 


వాస్తవానికి మంచి సంపాదనతో స్వతంత్రంగా జీవిస్తూ బిజీ జీవితం గడుపుతున్న రజినికి పెళ్ళిపై.. ప్రస్తుత ఆలోచనలు కోరికలను చూస్తే… భాగస్వామి ఎంపిక విషయంలో… చాలా పెద్ద ఆశలతోనే ఉందనీ… ఏమాత్రం సమాధాన పడే యోచనలో ఉన్నట్లుగా తోచదు!! ఈనాడు రజినీయేకాదు.. కాస్త చదువుకున్న చాలా మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు కుదరాలంటే,.. కొన్ని విషయాలు సరిపెట్టుకోక తప్పదు.. అనే రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నట్లు కనిపించదు.


కానీ… సుగుణ విజ్ఞతతో ఇచ్చిన సమాధానం -

' చూడు, రజినీ!.. పెళ్ళిచూపులనాడు అతను నాతో మాట్లాడుతూ నాలోని మంచి చెడూ అన్నిటికీ ఇష్టపడే నన్ను అంగీకరిస్తున్నాడనీ… అలాగే నేనూ సిధ్ధపడితే.. జన్మంతా కలిసి జీవిద్దాం! ' అంటూ.. నా అంగీకారం కోరాడు!

మరో విషయం… ఇప్పుడు నా ఇరవై ఏళ్ల వయసులో నా మోముపై మొటిమలతో ఇష్టపడినవాడు… రేపు అరవైలో నా ముఖంలో ఏర్పడే ముడతలతో కూడా.. నన్ను ప్రేమంచకపోడు!... అన్న ధీమా, నమ్మకం.. నాకు కలిగాయి!!

ఇంక.. నాలో తర్జనభర్జనలకు తావు లేదు,.. పూర్తి నమ్మికతో అంగీకరించాను.' అంది సుగుణ నిశ్చయస్వరంతో!


కానీ… రజినీ ఎందుకో.. సమాధానపడలేక పోయింది! ఏమో… తానైతే…అనుకొంటూ.. ఆలోచనలో పడింది!!


రోజులు గడుస్తున్నాయ్! రజినీకి కూడా సాంప్రదాయ సంబంధాలు చూస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు! కానీ.. వచ్చిన ప్రతీ వరుడిలో ఏదో వెలితి... తన కలల ఆశలకు తగినట్టుగా ఉన్నట్టు సమాధాన పడలేక తిరస్కరిస్తూనే ఉంది! 


 'ఏ ఈడు కా ముచ్చట! ' అన్నట్టుగా.. రోజులు గడిచే కొద్దీ.. వచ్చే సంబంధాలు కూడా.. సన్నగిల్లాయి! ఈ విషయమై తల్లిదండ్రులు కూడా డీలా పడ్డారు!!


ఏళ్లు గడిచాయి! రజినీకి పాతికేళ్ళు పైబడ్డాయి!! తను ఇప్పుడు ఉద్యోగంలో బిజీ బిజీ! ఎప్పుడో గానీ.. ఒంటరిగా ఉన్నప్పుడు తప్ప.. పెళ్లి మీదకు ధ్యాసే పోదు!


అలాంటి స్ధితిలో అనుకోకుండా.. సొంతూర్లో పురిటికి పుట్టింటికి వచ్చిన సుగుణతో కలవడం కుదిరింది! చాలా కాలం తర్వాత.. కలిసిన స్నేహితురాళ్ళు.. కులాసా ముచ్చట్లలో పడ్డారు! గడుస్తున్న జీవితాల్ని ఒకరికొకరు పరామర్శించుకున్నారు! 


తన సంసార జీవితం చాలా ఆనందంగా… ఏ కొరతా దిగులూ లేకుండా.. సాఫీగా సాగిపోతోందని సంతోషం వ్యక్తపరిచింది సుగుణ! రజిని ఉద్యోగ విశేషాలు తెలుసుకుని మెచ్చుకుంది! ఆపైన.. తను ఒంటరి జీవితం గడపుతోందని తెలుసుకొని… చాలా నొచ్చుకుంది!! 


'అయితే… రజినీ!… ఇన్నాళ్ళ నీ.. సిటీ ఉద్యోగ పర్వంలో.. నీకు నచ్చిన.. నువ్వు మెచ్చిన.. మగ మహరాజే తారస పడలేదా?! ' అంటూ పరిహస మాడి… ఒక సలహ బీజం నాటింది.. స్నేహితురాలి మనసులో!


స్నేహితురాలిని కలిసి ఆమె లోని ఉత్సాహం, మాటల తీరు చూసిన రజినిలో.. తన ఒంటరి జీవితం ఎంత పేలవంగా ఉందో గమనించటం,.. భాగస్వామి పొందు విషయమై ఆలోచించటం… అనాసక్తంగానైనా మొదలైంది! అందుకు తను పనిచేస్తున్న కంపెనీ ఏర్పాటు చేసిన.. ఇంటర్ సిటీ మేనేజ్మెంట్ సెమినార్ తలవనితలంపుగా... కొంత తోడ్పడింది! 


 ఆ సెమినార్ కు ఆహ్వానం, అతిధి మర్యాదలు, నిర్వహణ బాధ్యతలు రజినికి అప్పగించబడ్డాయి!


ఆ సెమినార్ లోనే.. మొట్ట మొదటి సారిగా ఆసక్తికరంగా పరిచయమయ్యాడు… పూనా నుంచి వచ్చిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరప్రసాద్! సెమినార్ లో పాల్గొన్న వారి సభ్యుల బయోడేటా నమోదు లో వరప్రసాద్.. మేరేజ్ స్టేటస్ లో… 'ఒంటరి ' అని ఉదహరించటం స్క్రూటినీలో రజినీని ఆకర్షించింది! 


వారం రోజుల సెమినార్ లో వరస పరిచయాలు,.. అతిధిగా అతని తో పెరిగిన స్నేహం, శ్రద్ధ.. ఒకరిపై ఒకరికి చనువును పెంచింది! సెమినార్ నిర్వహణలో… రజినీ సమర్ధతను ప్రశంసించాడు వరప్రసాద్! 


చివరి రోజు ప్రత్యేక విందు సమావేశంలో... చాలా సొంత విషయాల ప్రస్తావనకు రావటంతో… వివరాలు పరస్పరం తెలియ జేసుకున్నారు! తను ఒంటరి అంటే.. వివరంగా,.. తనిప్పుడు ఏడాదిగా భార్యతో విభేధాలతో విడిగా ఉంటున్నానని… భార్యతో మనస్పర్ధల కారణంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశాడు! 


'మీరేమిటి?.. ఇంత కాలం ఇంకా ఇలా ఒంటరిగా ఉన్నారు?'.. అన్నదానికి.. ఉద్యోగ క్రమంలో దృష్టి ధ్యాస ఆ వైపు సాగ లేదని.. అప్పటికి ఏదో తోచిన సమాధానం చెప్పింది రజిని! 


అంతటితో విడిపోతూ సుహృద్భావ సూచకంగా ఫోను నెంబర్లు తీసుకుని మంచి సధ్భావనతో.. స్నేహం కొనసాగించారు! 


క్రమంగా.. వారిరువురి పరిచయం చనువుగా,.. చనువు స్నేహంగా,.. స్నేహం కాస్తా ఆకర్షణగా మారి,.. సహజీవన ప్రస్తావనకు దారితీయడానికి.. ఎంతో కాలం పట్టలేదు! వయసు మీరుతున్న తనకు,.. తగిన మొదటి పెళ్ళి వరుడు లభించటం కల్ల అని ఏనాడో గ్రహించింది రజిని! పెళ్ళి ప్రస్తావన వచ్చినప్పుడు.. విడాకులు వచ్చేవరకు.. అప్పటికి ఇంకా … సహజీవనమొక్కటే వీలు అని.. నచ్చచెప్పి… నమ్మబలికాడు వరప్రసాద్. అలా ఉన్న పరిస్థితిలో.. ఆ నిర్ణయాని కొచ్చారు వారిద్దరూ. 

 

రజిని సహజీవన నిర్ణయానికి తల్లిదండ్రులు బాధపడినా… బాధ్యతగా తమ చేతుల మీదుగా నెరవేర్చలేక పోయిన వారికి…వారించే స్థాయి లేక… స్వతంత్రంగా జీవిస్తున్న కూతురు నిర్ణయానికి … తలవంచక తప్పలేదు. అలా.. వారి సంసారం గుట్టుగా సహజీవనం పేరున మొదలయ్యింది… ఏ ఆర్భాటం హడావుడి లేకుండా!


వేరు చోట్ల ఉద్యోగాలు కావటంతో వారి సహజీవనం… కొంతకాలం అక్కడా కొంతకాలం ఇక్కడా అవుతూ… ఇటు జీవనంలోనూ, అటు ఉద్యోగ నిర్వహణలోనూ.. సమస్యలెదురౌతూ.. చికాకులతోనే గడిచింది! దానికి తోడు ఇరు వైపు కుటుంబాల నుంచీ కూడా పూర్తి సహకారం కొరవడింది!! కాలక్రమేణా మొదట్లో ఇద్దరిమధ్య విరిసిన చిరునవ్వులు, పరిహసాలు, విందులు వినోదాల స్థానే… పోనుపోను… చిరాకులు చికాకులు, విసుగు, అసహనం తిరస్కారభావాలు.. ప్రస్ఫుటమవుతూ వచ్చాయి! పైగా.. వేరువేరు చోట్ల నివసించటం.. వారి మధ్య సామరస్యం మరింత దెబ్బ తీసింది! ఒకరి కోసం మరొకరి ఎదురుచూపులు,.. ఒకరిపై ఒకరు ఆధారి పడి బతకడం కరువయింది!!


మొదట్లో ఉన్న ఆకర్షణ బలం రానురాను సన్నగిల్లుతూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే.. వారి సమాగమాలు వీలైతే.. అన్నట్టుగా మారింది. కొన్నాళ్ళకు ఫోనులో సంజాయిషీలతో సమాధానపరుచుకునే స్థాయికి చేరుకుంది! తీరా.. తీరిగ్గా రజిని సమీక్షించుకునే సరికి.. సమయం మించి పోయింది! 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!


51 views4 comments

4 comentários@gvvsmurty1709

• 10 hours ago

నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. చక్కటి రచన.

Curtir

savitha kopparthi

11 hours ago

Good story writing

Curtir

Nice scripting suguna rajani

Story seems to be natural to this generation trend

Waiting for next parts

Good luck Babayya

Smt. Savita USA

Curtir

సహాజత్యం, లోక తీరు నీ కథలో కనపడుతుంటే ఇంకా ఏమి కామెంట్ చేయను? బాగుంది నీ రచన స్టయిలు..

all the best


Smt. S.Venkayamma,

Senior Rtd. Executive ECIL

Curtir
bottom of page