top of page

మబ్బుల్లో సూర్య చంద్రులు

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Mabbullo Suryachandrulu' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 25/01/2024

'మబ్బుల్లో సూర్య చంద్రులు' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మొగులమ్మ రాగి తీగలు, పనికిరాని సొట్టల ఇత్తడి సామాను, ఖాళీ పేస్ట్ ట్యూబ్లు తూకానికి తీసుకుని పల్లీలు, పుట్నాలు బదులుగా ఇచ్చేది. 


ఒక్కొక్కసారి “చనా…బటాని… పల్లీ...” అని అరుస్తుంటే, అమ్మకానికి ఏమీ లేకపోయినా నా కళ్లను గమనించి నాకు చిన్న గురుగు నిండా పల్లీ-బటాని నా అరచేతిలో పెట్టిన చిరుతిండి రుచిగా అనిపించింది. 


పల్లీ-బటాని అమ్మే క్రమంలో, ఇంటికి వచ్చిన మొగులమ్మను ఇల్లు ఎలా గడుస్తుందోనని అమ్మ అడిగింది. 


“నా మొగుడ్ని పాము కాటేస్తే.. సచ్చిపాయే, నా సెంద్రుడు సర్కారి ఇస్స్కూల్. మీ అసోంటోల్లు బువ్వ, శీరే-రైక, అంగీలు యిస్తరు. పొద్దుగూకే టయానికి కల్లు కంపోన్ పాక ఆకిలి వూకి, నీల్ల సాంపికి పైసలిస్తరు.” 


జాలి పడి అమ్మ రాత్రుళ్లు మిగిలిన భోజనం, పాత బట్టలు, సగం అరిగిన పెన్సిల్ ముక్కలు, రాసుకునే కాపీ పుస్తకాలు యిచ్చేది. 


పెరటి తోటలో రాలిన ఆకుల చెత్త, ఇంట్లో ఫాన్స్, నీళ్ల ట్యాంక్ శుభ్రపరిచే పనులు చంద్రు చేత చేయించుకుని డబ్బు సాయం చేసేవారు నాన్నగారు. 


ఇంచుమించు మొగులమ్మ కొడుకు చంద్రుడు కూడా నా వయసే అట. 


స్కూల్ ఫైనల్ పాస్ పూర్తి కాగానే నాన్న నాకూ, చంద్రుకు అట్లాస్ సైకిల్ కొనిచ్చారు. వాడి ఆనందానికి అవద్దుల్లేవు. వెస్పా/లామ్రేటా స్కూటర్ ఆశించిన నాకు నిరుత్సాహం కలిగింది. 


బ్రేక్ లేకుండా నా చదువు సాగింది. 


సైకిల్ పైన వీథులు-వాడలు తిరిగి పాత సామాన్లు, న్యూస్ పేపర్లు, పాకింగ్ అట్టలు, చిక్కుల వెంట్రుకలు కొని, పలుకుబడి గల విక్రేతలకు అమ్మే దందా చేసేవాడు చంద్రు. 


దశాబ్దాలు ముందుకు నడిచాయి. 


నా ఏకైక సంతతి కృత్తిక పెళ్లి విదేశాల్లోనే శ్రవణ్ తో ఘనంగా జరిపించాను. 


పేరు-ప్రఖ్యాతులతో స్వదేశానికి నేను, నా శ్రీమతి క్రాంతి వచ్చేశాము. 


నా చదువుా, అనుభవానికి అనువుగా ‘సూరజ్ షేర్ మార్కెట్’ మొదలు పెట్టాను. నా హోదా పొగడ్తలు నాకు చాలా గర్వంగా వుండేది. 


మనుమడు ‘ధ్రువ్ ని చూడలని వుంది; ఇండియా రమ్మంటే’... రావాలంటే ఖర్చట! 


అవీ-ఇవీ సాకులు చెప్పి శ్రవణ్ నా మనసును క్లేశ పర్చే వాడు. 


పుట్టింటి సొమ్ము రాబట్టే క్రమంలో కృత్తిక కూడా ప్రశాంత వాతావరణాన్ని భంగ పర్చేది. 


చంద్రం గుడిసె ఇల్లుగా మారింది. చిన్నప్పుడు వాడి ముఖం కూడా చూసేవాడిని కాదు, కానీ ఎన్నికల సమయంలో ఓటు వేసే క్యూలో వున్న నన్ను గుర్తు పట్టి పలకరించి భార్య తారాబాయిని పరిచయం చేశాడు. 


లోహాలు కరిగించి ముడి సరకు తయారీల ‘భరో మెటలర్జీ’ చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడుట. 


కొడుకు భరణి, కూతురు రోహిణి కల్సి (ఇరువురి పేర్లు వచ్చేటట్లు వర్క్ షాప్ పేరు పెట్టుకున్నాడు) ‘భరో మెటలర్జీ’ లావా-దేవీలు చూసుకుంటున్నారట. 


నన్ను గౌరవంగా ఆహ్వానించి దసరా ఆయుధ పూజ నా చేత జరిపించి, నన్ను ‘బాస్’ అని సంబోధిస్తూ దండాలు పెట్టాడు.


ఫ్రెండ్స్ లిస్ట్ లో చేరిపోయాడు. 

 

రోహిణి పెళ్లి డాక్టర్ అశ్విన్ తో జరిపించాడు. వెనుక బడిన తరగతి జాబితాలో మెడిసిన్ సీటు వచ్చిందేమో, నిజంగా డాక్టర్ కు వుండాల్సిన గెటప్ లేదు చంద్రు అల్లుడుకి. 


సామాన్యంగా పుట్టి సంపదతో పెరిగి, పేరొందిన పబ్లిక్ స్కూల్లో చదివి, విదేశాల బిజినెస్లో మాస్టర్స్ చేసిన... ‘నాకు’..., కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మాత్రమే వున్న ‘వాడికి’ తేడా ఏం వుంది?


 అదే సంపాదన!.. 


హృదయంలో రేగిన మంటలు కళ్ళ వరకూ వ్యాపించాయి.


ప్రభుత్వాలు మారినప్పుడల్లా షేర్ మార్కెట్ రెపరెపలాడుతుంది… 


నాన్న కట్టించిన బంగళా తప్ప నాదంటూ ఏమీ మిగులలేదు. గాలిలోనే తిరిగే నాకు భూమి పల్లం తెల్సింది. 


****


భరణిని మెటలర్జీ డిప్లొమా, రోహిణిని బికాం ఆనర్స్ చదివించాను. 


పెళ్లి అయిన మొదలు ‘క్లినిక్’ కట్టించి అలక్కట్నం కావాలని అల్లుడి డిమాండ్... కాదు వేధింపు.


ఎమ్.ఎస్.ఎమ్.ఈ., సంస్థ వారు నా కృషి ఫలానికి నన్ను సన్మానిచ్చి నిండు సభలో అవార్డు బహుకరించారు. నా ఆనందం అంచులు దాటేసింది.


నా పిల్లలు నా కంటే ఎక్కువ ప్రజ్ఞావంతులని, వ్యాపార సమర్థులని రూఢీ అయిన తర్వాత నా కష్టార్జితం వాళ్లిద్దరి పేరిట చేశాను. ఎట్లా ఐనా నా తరువాత వాళ్ళే హక్కుదారులు కదా!


కొడుకు, కూతురు, అల్లుడు కలిసి నన్ను నేలమట్టం చేశారు. మోసానికి ‘మన’… ‘తమ’ తేడా లేదు.


ఓటమి ఎదుర్కొన్న నేను ట్యాంక్ బండ్ గట్టున సూర్యాన్ని కలిశాను.


***


“చంద్రు, నేను అలిసి పోయాను. నష్టపోయిన మనం ఎలా జీవితం సాగించాలి?”


జవాబు దొరక్క, మాటలు రాక, కన్నీరు నెమ్మదిగా జారుతున్నాయి.

 

“బిజినెస్ నాకు చాత కాదా?” జాలువారు కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు చంద్రు. 


“ఈ దుస్థితి నుండి బయటకు రావాలి...” 


సూర్య చంద్రులు పరిపరి విధాల ఆలోచనల్లో మునిగి పోయారు. కొన్ని రోజుల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. 


“మనమున్న పరిస్తితుల్లో ఏ ఆర్థిక సంస్థలు అప్పు ఇవ్వరు, ఏ బిజినెస్ ప్రారంభించినా ముందస్తుగా ఫణం కావాలి. డిమాండ్-సప్లయ్ స్టడీ చేయాలి. 


నీ ప్లాన్ ఏంటి?” సూర్యం అన్నాడు.


“ఆకలికి అన్నమే కావాలనుకోరు. ఎట్లయినా కడుపు మంట చల్లబడితే చాలు జనాలకు. వాల్ల సౌలత్ బట్టి... బండి మీద దొరికే నాష్టాతో దినం యెల్లదీస్తారు.” చంద్రు జవాబు ఇచ్చాడు.


“వ్యాఖ్యానం వదిలి విషయం చెప్పు బాస్..” ‘బాస్’ పదాన్ని నొక్కి పెట్టి సూర్యం అడిగాడు.


“స్నాక్స్.... ఎక్కువ అపార్ట్మెంట్ బిల్డింగ్ లు, స్కూల్లు, కాలేజ్లు వున్న జాగలల్ల రోస్ట్ పల్లీ-బటాని, చిప్స్, ఫ్రైఅప్స్, రింగ్ ఆనియన్స్, కార్న్ పాప్, చేగోడీ, మురుకులు లాంటివి అమ్మితే మనకు ఎప్పుడూ గిరాకీ వుంటది.”


సూర్యం మెదడుకు పదును మొదలై పరుగు సంతరించుకుంది. 


క్షుద్బాధ వర్సెస్ బిజీ సిటీ లైఫ్!!


“మార్కెట్ గురించి మనకు అవగాహన అవసరం. మన ప్రత్యక్ష ప్రమేయం పట్ల రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. మనిద్దరం సమిష్టిగా శ్రమించాలి. 


కస్టమర్ నమ్మకమే మనకు ఆశీర్వాదం….”


“నాకు పేపర్ వర్క్ కొంచెం రాదు. భరో మెటలర్జీ సమయంలో మా పిల్లలే ఫారాలు, కావల్సిన పేపర్ వర్క్....” చంద్రుడి మాటలను మధ్యలోనే ఆపేశాడు. 


“ఆ పని నాకు వదిలేయి. డబ్బులు కూడా నా వంతే...” అన్నాడు సూర్యుడు.


“వద్దు, నేను నా హిస్సాగా పైకం ఇస్తా, ఇద్దరం కల్సి ఖుషీగా బరువు మోయాలి.”

 

“ఓకే... కానీ బిజినెస్ చాలా జాగ్రత్తగా నడిపించాలి. యువతకు మనం ఏ మాత్రం తీసిపోము అని నిరూపించాలి...” సూర్యం ఉద్వేగంతో అన్నాడు. 


“ఆ వురుకులాటలే వద్దు. మన ఖర్చులు పోంగ, మన జిందగీలు ఆరాంగా నడిచి... ఎవ్వరి ముందు బిచ్చం ఎత్తక.... వీలైతే ఒకరిద్దరికి మేహార్బన్ చేసే రాస్తాల పోవాలె…” చంద్రం జవాబిచ్చాడు.


“ఔను…” ఇద్దరి మనసుల్లో ప్రశాంతత అంకురించింది. 


సూర్యం నాన్నగారిచ్చిన సిటీ సెంటర్లోని బంగళాను; చంద్రం తాను కట్టుకున్న ఇంటిని అమ్మేశారు. 


ఆ పరిధుల్లోనే చిన్న అపార్ట్మెంట్ చెరొకటి కొనుకున్నారు. 


‘నక్షత్ర స్నాక్స్’… ‘ఇదీ’....టార్గెట్ అని నిర్ణయ పెట్టుకోలేదు. 


పిల్లల క్లాస్ ఇంటర్వెల్ టైమ్లో; పరుగులు పెట్టే ఉద్యోగుల విరామం కోసం; యెడ తెరిపిలేని ప్రేమికుల కాలయాపన; కరకర భోజన రుచులు కోరే కుటుంబాలకు; కూలీల ఆకలి వూరట; ఏమీ తోచని యజమానులకు టైమ్ పాస్…. అందరికి కావాలి స్నాక్స్! ....పల్లీ-బటానీ!!


మబ్బులు ఆకాశాన్ని ఎంత కమ్మేసినా…..సూర్యచంద్రుల కాంతి సమసిపోదు 

*******

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి



68 views2 comments
bottom of page