top of page

తప్పు చేశాను


'Thappu Chesanu' New Telugu Story Written By A. Annapurna

'తప్పు చేశాను' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


తప్పుదారిలో పడ్డ యువకులు ఆత్మహత్య జోలికి పోకుండా జీవితంలో సెటిల్ అయినట్లు చూపారు రచయిత్రి ఏ అన్నపూర్ణగారు.

యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే కథ ఇది.



''మా డాడీ, ‘ఈసారి పరీక్షలు ఎలాగైనా పాసవ్వాలి.. లేకపోతె సౌథ్ ఆఫ్రికాలో ఉన్న మీ మామ దగ్గిరకు పంపిస్తాను’ అని వార్ణింగ్ ఇచ్చాడు. బుక్కు తెరిస్తే ఒక్క అక్షరం బుర్రకి ఎక్కడంలేదు.. ఏదైనా ఉపాయం చెప్పు నాగరాజూ!" అన్నాడు మధుకర్, క్లాస్ మేట్ నాగరాజుతో.


''పంపితే వెళ్ళు.. ఇంచక్కగా ఎంటర్టైన్మెంట్! అక్కడ బ్లాక్ బేబీలు ఎలా వుంటారో చూడచ్చు..!" అన్నాడు మరో క్లాస్ మేట్ ఉపేంద్ర.


''అమ్మోవ్.. అంత ఛాన్స్ లేదు. మామ కూతురే వుంది చింపాంజీ. దానికి నేనంటే లవ్వు. నన్ను అమాంతం కొరుక్కు తినేస్తుంది. దానిపేరు జాంబవతి. ''అన్నాడు మధు.


''అదేంటి? జాంబవతి పేరు ఈ కాలం ఎవరు పెట్టుకుంటారు?” ఆశ్చర్యంగా అన్నాడు.. కాలేజీ ప్రిన్సుపాల్ కొడుకు వికాస్.


''మీకు అర్ధం కాలేదు. మా మామ సౌత్ ఆఫ్రికా లేడీ.. మిలీనియర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ప్రెటీ డాటర్ అసలు పేరు జుంబారే! జాంబవతి.. దానికి నేను పెట్టిన పేరులే.. ''. అన్నాడు మధు.


''సో మనకు మూడేళ్ళుగా ఒక్క సబ్జక్ట్లో పాస్ మార్కులు రాలేదు. ఇక ఫైనల్లో ఏమి వొరగబెడతాం. ? కనుక నాకు ఈజీగా పాస్ అయ్యే అయిడియా వచ్చింది. దాన్ని అమలు చేస్తాను. కానీ సాలా కరుచవుద్ది.." అన్నాడు నాగరాజు బీర్ సేవిస్తూ.


''అదేంటో చెప్పు రాజు. మనీ కేముంది.. సెకండ్లో తెస్తాం..” అన్నారు మధు, ఉపేంద్ర.


వికాస్ మాటాడలేదు.


''మీ డాడ్ బిజినెస్ మాన్ కనుక సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ పెట్టడానికి నువ్వు ఇంజినీరింగ్ పాస్ అవ్వాలని

కండిషన్ పెట్టేడు.. మాకు అలాంటి కండిషన్లు లేవుకాని.. పెళ్ళికి కట్నాలు రావని చదివిస్తున్నారు. '' అన్నారు ఉపేంద్ర, వికాస్.


''అదేమరి. ఏదోలా పాస్ అవ్వాలి కనుక తలో పాతిక లక్షలు ఇస్తే కొశ్చన్ పేపర్లు తెస్తాను.. అదీ సంగతి. ''అన్నాడు నాగ్.


''ఎలా తెస్తావ్ ? ఆశ్చర్యంగా అడిగాడు ఉపేంద్ర.


''అదంతా సీక్రెట్. చెప్పకూడదు. నేను చెప్పినట్టు చేస్తే పాస్ గేరంటీ. ''


''ఆ పని ఏదో ముందే చేస్తే బాగుండేది కదా.. మమ్మి డాడీల సాధింపు తప్పేది. ''


''ఆ ఎందుకు రిస్క్? మూడేళ్లు ఫెయిల్ అయినా కాలేజీకి రానిచ్చారుకదా. ఇక ఫైనల్ ఇయర్ తప్పదు మరి. ''


''మరి పట్టుబడితే?” సందేహించాడు వికాస్.


అతను పిరికివాడు. ధైర్గ్యం తక్కువ.


''అది నాకే అవమానం. మాడాడీ పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోయావా?” అన్నాడు నాగ్.


''సారీ సారీ! చాలా ఎక్కువ.. మా డాడీ దగ్గిర అంత ఉండదు'' అన్నాడు వికాస్.


''వాడికి సగం తగ్గించు రాజూ. మన గ్రూప్ వాడే కదా.. కొంత సాయం చేద్దాం..!” అన్నాడు మధు జాలిపడుతూ.


''తగ్గించడానికి ఆ పేపర్ ఇచ్చేవాడు మా మామ కాదు. సరే పదిహేను.. తీసుకురా. వచ్చేవారం అర్ధ రాత్రి సెకండ్ షో వదిలి పెట్టె టైంకి డబ్బు తెచ్చి నాచేతికి ఇవ్వండి. మాఇంటికి రావద్దు.


వికాస్.. నీ గర్ల్ ఫ్రెండ్ వుందికదా రజిని.. వాళ్ళ ఇంటి దగ్గిర కల్సుకుందాం. '' అన్నాడు నాగ్.


''రజిని హాస్పటల్లో నర్స్.. ఇంట్లో ఎవరూ వుండరు. నెక్స్ట్ వీక్ నుంచి నైట్ షిఫ్ట్ కనుక రూమ్ కీస్ అడిగి తీసుకో.. ''. అన్నాడు మధు.


''ఈ విషయం రజనికి చెప్పవద్దు. ఎందుకైనా మంచిది.. '' అన్నాడు ఉపేంద్ర.


'వాళ్లే ప్లాన్ వేసి వాళ్ళే డిసైడ్ చేసేసారు. కీస్ ఎందుకని రజని అడుగుతే ఏమి చెప్పాలి? అసలు డబ్బు ఎక్కడనుంచి వస్తుంది?..’ ఆలోచిస్తున్నాడు వికాస్.


''ఓకేనా?” అన్నాడు నాగ్.


''అదే ఆలోచిస్తున్నాను. మా డాడీని అడిగితె ఇవ్వడు. ''


''మీ మమ్మి నగలు తీసుకురా.. రజని ని కూడా కొంత మనీ అడుగు''. ఉపాయం చెప్పేడు మధు.

అంతవరకూ మమ్మి ఏ నగలు వేసుకుంది.. ఆవిడ దగ్గిర ఉంటాయా అనే ఆలోచన లేని వికాస్ ‘అవును.. మమ్మి తప్పకుండా ఇస్తుంది. కానీ ఇలా అసలు విషయం చెప్పకూడదు కదా. ఎలా ?’ అనుకున్నాడు.


''మీరు ఆలోచించుకుని నాకు మెస్సేజ్ పెట్టండి..” అంటూ నాగరాజు వెళ్ళిపోయాడు.


ఇక ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.


''ఒరే మధు.. అసలు సలహా అడిగిందేమో నువ్వు. మరి డబ్బు ఎలా తెస్తావ్..” అన్నాడు ఉపేంద్ర.


''మీరు మాత్రం? వాడు అడగ్గానే అదేన్తా.. నిముషములో తెస్తాం అన్నదేమో మీరేగా! మీరేం చేస్తారో చెప్పండి ?” అన్నాడు మధు.


''అన్న మాట నిజమే.. సులువుగా అనేసాం. తీరా ఆలోచిస్తే అంత డబ్బు ఎవరు మాత్రం ఇస్తారు?” అన్నాడు ఉపేంద్ర.


''నా బైకు అమ్మేస్తాను..” అన్నాడు మధు.


''మా నాన్నమ్మకు నేనంటే పిచ్చిప్రేమ. ఆవిడను అడుగుతా..” అన్నాడు ఉపేంద్ర.


''సరే పోదాం.. పదకొండు అయి పోయినది. మా మమ్మి మెస్సేజీలు పెట్టింది. ఇంటికి రమ్మని.. '' అంటూ బయలుదేరేడు మధు.


వికాస్ ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. పదిహేను లక్షలు ఎలా సంపాదించాలి అని.


మెల్లిగా అంతా నిద్రపోయాక లేచి ఎప్పుడూ చేయని పని.. మమ్మి బీరువా తెరిచి చూసాడు.


దాని నిండా బంగారు నగలు - వెండిసామాను జిగేల్ మని మెరిసాయి.


కొద్దిగా నగలు, కొద్దిగా వెండిసామాను తీసి బ్యాగ్లో పెట్టుకుని తన రూంలోకి తెచ్చాడు.


ఆమర్నాడే వాళ్ళ మమ్మి వికాస్ నాన్నమ్మకి ఆరోగ్యం బాగా లేదని తెలిసి వాళ్ళ వూరు వెళ్ళింది.


అదృష్టం బాగుంది.. మమ్మి వచ్చేసరికి పరీక్షలు అయిపోతాయి. హమ్మయ్య! ఏ గొడవారాదు.. అని వికాస్

ఊపిరి పీల్చుకున్నాడు.


మధు బైకు అమ్మి, ఉపేంద్ర నాన్నమ్మని అడిగి మొత్తం మీద అందరూ డబ్బు తీసుకుని నాగ్ చెప్పినట్టు రెడీగా వున్నారు.


వికాస్ రజని ని అడిగాడు. ''రజని నీ రూమ్ కీస్ వొక వారం రోజులు ఇవ్వవా?” అని.


''ఎందుకు?” అంది ఆశ్చర్యంగా రజని.


పరీక్షలు దగ్గిర పడ్డాయి. ఈ వారం నలుగురమూ బాగా చదవాలని నిర్నయిన్చుకున్నాం.. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ప్లీజ్!”

''నీకు ఎన్నిసార్లో చెప్పాను. వాళ్ళు సరి ఐనవాళ్లు కాదు. అందులో ఆ నాగరాజు మరీ డేంజర్. నేను ఇవ్వను. ''

చెప్పింది రజని.


అలా అంటుందని అనుకోలేదు వికాస్.


మరోలా చెప్పేడు.


''పోనీ మేము ముగ్గురం ఉంటాం. ఈ సారి పాస్ కాకపోతే మన డేటింగ్ బ్రేకప్ అని నువ్వే కండిషన్ పెట్టేవు. ఈ మాత్రం హెల్ప్ చేయవా ప్లీజ్.. నాగరాజుకు ఏదో చెబుతాలే!” అన్నాడు ఆమె కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ.


''సరే! ఏదైనా తేడా వచ్చిందో నీ మొహం చూడను. నీ భవిష్యత్తు అంతా ఈ ఏడాది పరీక్షలమీద ఆధారపడి వుంది.. అదీ కాక నీ చెల్లి నాఫ్రెండ్. మీ మమ్మి, మా మమ్మి తెలిసినవాళ్ళు కనుక వొప్పుకుంటున్నా ''అని జాలిపడింది.


వికాస్ ఎగిరి గంతేసి వాళ్ళ ముగ్గురికి చెప్పేసాడు.. ప్లాన్ సక్సస్స్ అని.


అంతా సక్రమంగా జరిగిపొయిన్ది. డబ్బు నాగ్ చేతికి వెళ్ళింది. పేపర్లు ముగ్గురికి ఇచ్చాడు.


ముగ్గురూ హేపీగా వాటిని కంఠతా పట్టేసి నిశ్చింతగా వున్నారు. ఇక అమెరికా వెళ్ళిపోదామని ఉపేంద్ర, డాడీని మెప్పించవచ్చని మధు, రజనితో పెళ్లి, తర్వాత లండన్లో జాబ్.. అని వికాస్ ఒకటే మురిసిపోయారు.


ఆరాత్రి విమానం ఎక్కేసి విదేశాలకు చెక్కేసినట్టు కలలు కనేసారు.


మర్నాడు దర్జాగా పరీక్షలు రాయడానికి వెళ్ళేరు.

లెక్చరర్ అందరికి లాప్ టాప్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు.. నాకేం కళ్ళు మూసుకుని ఆన్సర్ చేసేస్తా.. అనుకుని స్క్రీన్ మీద చూసారు.


గుండె ఆగినంత పనైంది. ఒక్కటీ నాగ్ ఇచ్చిన కొశ్చన్ పేపర్ లో లేదు.


నాలుగుసార్లు లెన్స్ పెట్టుకుని వెదికారు. ఊహు.. ఒక్క లెటర్ కూడా అందులో లేదు.


నాగరాజు మోసం చేసాడని అర్ధం ఐపోయిన్ది. ఏడ్చుకుంటూ బయటికి వచ్చారు.


‘ఎంత ద్రోహం చేసాడు నమ్మి గొంతు కోశాడు. డబ్బు పోయినది. పరీక్షా పోయినది. కాస్త బుద్ధిగా వొళ్ళు దగ్గిర పెట్టుకుని చదివితే నిక్షేపంగా పాస్ అయ్యేవాళ్ళం. మనకి మనమే బలాదూర్ తిరిగి భవిష్యత్తును పాడు చేసుకున్నాం.

ఇప్పుడు డబ్బు గురించి పరీక్ష పోయినందుకు మమ్మి డాడీ చీవాట్లు పెట్టి పనిష్ చేస్తారు.


తప్పించుకోలేం. అదలా ఉంచి అవమానం. తప్పు దిద్దుకోగలమా?’ అని విచారించారు.


వికాస్ కి రజనితో కటీఫ్ అయిపోవడం.. ఆమె విపరీతంగా అసహ్యించుకోడం.. ఖాయం అని అర్ధమైపోయినది.


ఎమ్చేద్దాం.. అని ఆలోచించారు.

''మనవాళ్లకి నిజం చెప్పేసి తప్పు వొప్పుకుందాం.. '' అన్నాడు మధు.


''అంతకంటే ఎమ్ చేస్తాం.. ఇకనుంచి వాళ్ళు చెప్పినట్టు వినడమే మంచిది. '' అన్నాడు ఉపీంద్ర.


''మీకేం పర్వాలేదు. మా మమ్మి నగలు తీసినట్టు తెలిస్తే మా డాడీ ఇంటినుంచి గెంటేస్తాడు. నేను చేసింది ఘోరమైన తప్పు. నాకే షేముగా వుంది. పాపం మా మమ్మి నన్ను ఎంతగా నమ్మింది! రజని నన్ను వదిలిపెట్టేస్తుంది.. నేను సూసైడ్ చేసుకుంటా'' అని ఒకటే ఏడుపు మొదలెట్టేడు.. వికాస్.


''నిజమే ముగ్గురూ తప్పు చేసాం. దాన్ని సరి చేసుకుని పట్టుదలగా మరో విజయం సాధించాలి. చచ్చిపోడం సులువే.. మన పేరెంట్స్ జీవిత కాలం ఏడిచేలా చేయకూడదు. '' అన్నాడు మధు.


''నీకేం! నీ మామ వున్నాడు. నిన్ను ప్రేమించే జాంబవతి వుంది. బిజినెస్ చేసే మీ డాడీకి ఈ డబ్బు పెద్ద లెక్కలోకి రాదు. కానీ మాడాడీ ఎంతో కష్ట పడి సంపాదించారు. చిన్నప్పుడు తమ్ముళ్లను చదివించి, చెల్లెళ్ళ పెళ్లి చేశారు. తాత నాన్నమ్మలను దగ్గిర ఉంచుకున్నారు. నిజాయితీగా వున్నారు. ఈ నెలలో రిటైర్ అయిపోతారు. ఆయన మొహం చూడలేను. '' అన్నాడు వికాస్.


''మన అందరిని నమ్మించి మోసం చేసిన నాగరాజుది అంతకన్నా పెద్దతప్పు. వాడికి బుద్ధి చెబుదాం.. ''అన్నాడు ఉపేంద్ర ఆవేశంగా.


''వాడు పోలీస్ ఆఫీసర్ కొడుకు. వాడు ఈ పాటికి పారిపోయి ఉంటాడు. మనమే తెలుసుకోలేదు. రజని చెప్పింది కూడా. నేను వినలేదు. వాడిని ఏమి చేయగలం?. '' అన్నాడు వికాస్.


''కొంచెం ఓపికపట్టు వికాస్, ఆవేశము ఆవేదన అనర్ధం. తొందరపడకు. రజని నిజంగా నిన్ను ప్రేమిస్తే అర్ధం చేసుకుంటుంది. ఏదైనా ఉపాయం చెబుతుంది. నిజం చెప్పి సలహా అడుగు. '' అన్నాడు మధు.


''రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయ్యారు అని, మన గురించి తెలియడానికి రెండు నెలలు పడుతుంది కనుక ఈ లోగా మనం ఏదో ఒక ఫీల్డ్లో స్థిరపడితే మన పేరెంట్స్ క్షమిస్తారు. '' అన్నాడు ఉపేంద్ర.


''IIT మొదటి రాంక్ వచ్చినవాడికి జాబ్స్ లేవు. మనం ఏమి చేయగలం?” అన్నాడు వికాస్.


''మధూ ఈ వికాస్ గాడితో మాటాడితే మనలను సూసైడ్ చేసుకునేలా చేస్తాడు..! ఇంతకీ నాగ్ కు ఎలా బుద్ధి చెప్పాలి?” అన్నాడు ఉపేంద్ర.


''ముందు మన డాడీలతో చెబుదాం. వాళ్ళే వాడి సంగతి చూసుకుంటారు. పద ఇంటికి పోదాం '' అని వాళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.


వికాస్ కి తండ్రితో చెప్పే ధైర్యం లేక రజని దగ్గిరకు వెళ్ళేడు.

కానీ రజని ఇంకా ఇంటికి రాలేదు. ఫోనుచేస్తే లిఫ్ట్ చేయలేదు. హాస్పటల్ లో బిజీగా ఉన్నట్టుంది.


''ఏరా వికాస్ ఎక్కడున్నావ్? అర్ధరాత్రిదాకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతావ్, ఇంటికిరా!” అని ఫోనుచేసి తిట్టేడు.


అదృష్టం డాడీ కి మా కాలేజీలో లెక్చరర్ ఎవరూ తెలియదు. తెలుసుంటే నాప్రతాపం బయటపడేది.


తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాడు.


''ఈ సారైనా పరీక్షలు పాస్ అవుతారా మీ చతుష్టయం?” అని అడిగాడు వికాస్ డాడీ.


''పాసవుతాం డాడీ..” అని అబద్ధం చెప్పేడు.


''చూస్తాగా ఎంతవరకూ నిలబెట్టుకుంటావో..” అని వెళ్లి పడుకున్నాడు ఆయన.


''ఎందుకురా ఇలా చీవాట్లు తింటావు. ?” అని మమ్మి కళ్లనీళ్లు పెట్టుకుంది.


''ఇకనుంచి డాడీ నన్ను ఏమి అనరు. చూస్తావుగా!” అని తన రూములోకి వెళ్ళిపోయాడు.


తెల్లవారకుండా రజని రూమ్ కి వెళ్లి కలిసి, ఆమెవొళ్ళో తల పెట్టుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పేడు.


రజిని అమాంతం లేపి జుట్టు పట్టుకుని రెండు చెంపలు వాయించింది.


''నేను చెప్పానా.. ఆ నాగరాజు మంచివాడు కాదని. వినలేదు. ఏడిస్తే నష్టం తీరదు. వెళ్ళిపో నాకు కనిపించకు. ''

అని కోపంగా తిట్టింది.


వికాస్ కి ఏమి చేయాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళలేదు. అటూ ఇటూ తిరిగి అక్కడే పళ్ళు కోసుకుని చాకు కనిపిస్తే దానితో మణికట్టుమీద గాయం చేసుకుని బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు.


రజనికి అనుమానం వచ్చి తలుపులు బాదితే గట్టిగా లేని బోల్టు ఊడివచ్చింది.


ఓమూల చేతికి రక్తం కారుతూ కూర్చున్నాడు వికాస్.


''నా రూంలో ఇలాఅఘాయిత్యం చేసుకుని పరువు తీస్తావా..?” అని చీవాట్లు పెట్టి.. బయటకు తీసుకు వచ్చి, గాయానికి కట్టుకట్టింది.


''నన్ను ఏమిచేయమంటావో చెప్పు. ? ఇకనుంచి నీమాట వింటాను. సారీ!” అన్నాడు.


ఎన్నాళ్ళుగానో పరిచయం. అమాయకుడు. చెడ్డవాడుకాదు.. అని జాలిపడి క్షమించేసిన రజని అతన్ని దగ్గిరకు తీసుకుంది.


అతడి ఫోను తీసుకుని ఇంటికి మెస్సేజ్ పెట్టింది.


‘నేను ఫ్రెండ్ కి సాయంగా నాలుగు రోజులు వాళ్ళ వూరు వెడుతున్న. కంగారు పడవద్దు!’ అని.

అతన్ని తాను పనిచేసే హాస్పటల్కి తీసుకెళ్లి తెలిసిన డాక్టర్ దగ్గిర టెంపరరీగా జాబ్ చూపించింది.


మధు వాళ్ళ డాడీకి నిజం చెప్పి, సౌత్ ఆఫ్రికా మామ దగ్గిరకు వెళ్ళిపోయాడు.. బుద్ధిగా ఆయనమాట విని.


ఉపేంద్ర కూడా వాళ్ళ డాడీ హాస్పటల్లో ఫిజియో థెరఫీ ట్రయినింగ్లో చేరాడు.


ఇలా తప్పు తెలుసుకుని మంచిగా మారేరు ముగ్గురు!

రజని వికాస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అప్పుడు అసలు విషయం రజినిచేత చెప్పించాడు.


వాళ్ళు మొదట తిట్టినా, కొడుకు సూసైడ్ చేసుకోకుండా కాపాడినందుకు వుద్యోగం వేయించినందుకు రజనీని

ఆదరించారు. వైభవంగా పెళ్లి చేశారు.


తర్వాత రిజల్ట్స్ వచ్చినా ఫలితాలు తెలుసును కనుక అటు చూడనే లేదు ఎవరూ.!


''నువ్వు కనుక నన్ను పట్టించుకోకపోతే నిజంగా చచ్చిపోయేవాడిని..” అన్నాడు వికాస్.


''నేను నిన్ను అర్ధం చేసుకున్నాను. మీ ఇంటి కోడలు కావాలని నిర్నయిన్చుకున్నాను. అందుకే కాపాడుకున్నాను.'' అంది రజని.


''నేను ఎప్పుడు తప్పులు చేసినా ఇలాగే కాపాడుకుంటాను అని మాట ఇవ్వు..” అన్నాడు వికాస్.


''అంటే నీకు ఇంకా బుద్ధి రాలేదా? తప్పులు చేస్తూనే వుంటావా?” సీరియస్గా అంది రజని.


''ఆబ్బె వూరికే.. ముందు జాగ్రత్త.!” అన్నాడు వికాస్.


''ఏమో.. నీలాంటివాడిని నమ్మలేం. ముందు జాగ్రత్తగా నేనుకూడా మా మామగారిని ఆస్తి నాపేరు రాయండి అని అడుగుతాను. '' అంది గడుసుగా రజిని.


''నీ దగ్గిర మా డాడీ దగ్గిరా కామెడీ పనికిరాదు. మీ ఇద్దరూ ఒకటి. మమ్మి నేను ఒకటి. ఓకే డియర్ సరెండర్ అయిపోతున్నా.. ''అంటూ నిశ్చింతగా ఆమె గుండెలో చేరి వెచ్చగా నిద్రపోయాడు వికాస్.

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ




నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)









37 views0 comments
bottom of page