top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'The Trap Episode 3' New Telugu Web Series


Written By Pandranki Subramani


రచన : పాండ్రంకి సుబ్రమణిపాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' మూడవ భాగం


గత ఎపిసోడ్ లో

త్వరగా వివాహం చేసుకొమ్మని రాముకి సలహా ఇస్తాడు భువనేష్.

అంగీకరిస్తాడు రాము. కానీ ఎప్పుడో మాత్రం చెప్పలేనని అంటాడు.

భార్య పక్కన ఉన్నా ఆఫీసు విషయాలు ఆలోచిస్తుంటాడు భువనేష్.


ఇక ది ట్రాప్. . మూడవ భాగం చదవండి…ఉదయమే కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళిన భువనేష్ సాయంత్రం వరకూ పని రద్దీలోనే ఉండిపోయాడు.


“భోజనం పంపించాను. తీసుకున్నారా!” అని అడగడానికి కూడా ప్రభావతికి ఆస్కారం లేకుండా పోయింది.


మధ్యాహ్నం ఖాళీ చేయని కేరియర్ యింటికి తీసుకొచ్చిన కారు డ్రైవరుకి అదే కేరియర్ నిచ్చి పంపించేసింది.


దీపాలు పెట్టే వేళ దాటింతర్వాత ఇల్లు చేరిన భువనేష్ కి అప్పుడు కూడా అదే పోకడ. మలి స్నానం చేసి రాత్రి భోజనం చేసిన భర్త, అదే రీతిన పెందలకడే మేను వాల్చడం గమనించిన ప్రభావతి, అతణ్ణి కదపకుండానే గుసగుసలు పోయినట్లు అడిగింది- “మళ్ళీ ఏమయిందండీ! అంతలావు టైమింగ్ పాటించ కుండా పని చేస్తే ఆరోగ్యం యేమవుంది? ఎండార్ఫిన్ వంటి సంతోషదాయకమైన హార్మోనులు శరీరంలో పుట్టుకు రావద్దూ! కనీసం కట్టుకున్న పెళ్ళాంతో రెండు మాటలు కలపొద్దూ? “


“ఉష్! రిచార్జ్ చేసుకోనివ్వు. రేపు లీవు వేసాను-ఎందుకో చెప్పుకో—“


“ఇందులో చెప్పుకోవడానికి యేముందండీ! అలసి సొలసి డీలా పడిపోయారు. ఫీవరిష్ గా ఫీలయుంటారు. అందుకే రేపు—“


“ కాదు. కానే కాదు. నిన్ను మొదటిసారి చూసిన రోజు. నిన్ను యిష్టపడ్డ రోజు. మావాళ్ళూ మీ వాళ్ళూ తాంబూలాలు పుచ్చుకున్నరోజు.”


ఆ మాట విన్నంతనే ప్రభావతి ఆనందంతో అరచినంత పని చేసింది.


“అరెరే—అదన్న మాట—రేపటి కోసం మూడ్ చెదరిపోకుండా కూడగట్టుకుంటున్నారు—ఆ మాట ముందే చెప్పవచ్చుగా—“


“ఇదొక్కటే కారణం కాదు. నిజంగానే మెంటల్ స్ట్రెయిన్ తో బాగానే అలసిపోయాను. అదంతా రేపు నీతో ఔటింగుకి వచ్చి చెప్తాగా!


ఇప్పుడు నన్నొకసారి మనసార గుండెలకు హత్తుకుని అడుగుల చప్పుడు కూడా వినిపించనీయకుండా వెళ్ళిపో”

ఆమె అలాగే నవ్వుతూ భువనేష్ ని గుండెలకు హత్తుకుని నుదుట మృదువుగా ముద్దుపెట్టుకుని వెళ్ళిపోయింది.

-------------------------------------------------------------------

వేదమూర్తి ఇంట్లోకి వస్తూనే అడిగాడు, ఎవర్నీ ఉద్దేశించ కుండానే- “ఏడీ పరమేశ్వర్? ”అని అడుగుతూనే లోగిలి లోకి వెళ్ళి వచ్చాడు.


అప్పుడు తల్లి మంగళా దేవమ్మ బదులిచ్చింది-“ఇప్పుడు వాడెందుకురా! ”అంది ప్రశ్నరూపంలో.


“ఎందుకా—కొట్టుకి సామాను దిగుతుందీ-వాటిని దించి కొట్టులో సర్దడానికి మాతో చేతులు కలపరా అని అడిగాను, దానికి వాడేమి అన్నాడో తెలుసా అమ్మా-- చాలా ముఖ్యమైన పోర్షన్ చదవాలీ అని తుర్రుమని ఇటు దూసుకు వచ్చేసాడు. తీరా యిక్కడకు వచ్చి చూస్తే వాడూ లేడు-వాడి పుస్తకాలూ లేవు. ఈ మధ్య బొంకడం కూడా నేర్చుకుంటున్నాడన్నమాట! ”


“ఔన్రా—చాలా ముఖ్యమైన పోర్షన్ చదవాలనే చెప్పాడురా వేదమూర్తీ! ”


“చిన్న మనవడిపైన ఈగ వాలనివ్వవు కదా—మరి వాడేడమ్మా? ”


“ ముఖ్యమై పోర్షన్ మిగిలిపోయిందని లైబ్రరీకి వెళ్ళిపోయినట్టున్నాడు. అవేవో పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులడిగితే— చదివింది చాలని చేతులు విరిచేసావటగా! అందువల్ల వాడి దారి వాడు చూసుకుంటున్నాడు. వాడి పెద్దన్నయ్య భువనేష్ సలహాలు తీసుకుంటున్నాడు. ఎలాగైనా పైకి మెట్లు యెక్కాలని పాట్లు పడుతున్నాడు”


“అంటే—చదువుకుంటున్నోడు యింట్లో పనులు చేసి పెట్టకూడదని ఎక్కడైనా వ్రాసుందా! వాడిలాగే కామేశం, పవన్ కూడా చదువులంటూ తిరుగుతూ వెళ్ళిపోతే కిరాణా కొట్టు గతేమవుతుంది? మనింటి సంగతేమవు తుందమ్మా!”


మంగళా దేవమ్మ చిన్నగ నవ్వింది. “సరస్వతీ దేవి కటాక్షం అందరికీ లభించదురా అబ్బీ! ఐనా మిమ్మల్ని చదువుకోవద్దని నేను గాని, మీ నాన్నగాని ఆపామా! హైస్కూలు మరీ దూరంగా ఉందని మిడిల్ స్కూలుతో నువ్వు చదువాపేయ లేదూ? అదే కారణంతో నీ యిద్దరు కొడుకులు కూడా నీతో బాటు కొట్టు వ్యాపారంలోకి దూరిపోలేదూ—పరమేశ్వర్ ఒక్కడూ పట్టుదలతో అంతదూరమూ నడుస్తూ హైస్కూలు చదువు పూర్తిచేసి ఇప్పుడు కాలేజీ చదువు స్థాయికి అందుకోలేదూ! అందుకే అంటున్నాను సరస్వతీ దేవి కటాక్షం అందరికీ లభించదూ అని. . ”


“అప్పుడు కామాక్షి వచ్చింది- “అదేమిటండీ అత్తయ్యతో అలా వాదోపవా దాలకు దిగుతున్నారూ ! మీరు మాట్లాడే తీరు చూస్తే వినేవారు నవ్వి పోరూ-పరమేశ్వర్ అదేదో ప్రక్కింటి అబ్బాయనుకుని--మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడంటే మీకూ మాకూ గర్వకారణమే కదా! ఇంటి ఖర్చులు యెక్కువవుతూన్నమాట వాస్తవమే-మెడికల్ బిల్స్ కూడా పెరిగిపోతున్నాయన్నది వాస్తవమే-అలాగని మీరు ప్రతి చిన్నదానికీ విసుక్కుంటూ ఉంటే యేంబాగుంటుందో చెప్పండి”


“ఇక నువ్వూరుకోవోయ్! నాన్నగారు వచ్చేటట్లున్నారు. మిగతావి తీరిగ్గా మాట్లాడుకుందాం. అమ్మకు ఫలహా రం యిచ్చి మాత్ర బిళ్ళలు మింగుంచు. నువ్వు కూడా అల్పాహారం తిని డాక్టరమ్మ మొన్నిచ్చిన మాత్రలు తీసుకో“అని లోపలకు వెళ్ళబోయాడు.


. కామాక్షి భర్తను ఆపింది- “కొంచెం ఆగండి. మళ్ళీ చెప్పడం మరచి పోయేను—మీ ఫ్రెండు ఒకాయన ఫోను చేసాడు. ఒకప్పటి స్కూలు మేటట. కబడ్డీ ఆటలో మీకు టీమ్ పార్టనరట. రెండు మూడ సార్లు ఫోను చేసాడు. ”


“ఫ్రెండంటే-ఊరూ పేరూ లేదేంటి? నాకు స్కూలు మేట్స్ ముగ్గరు నలుగురున్నారు. వాళ్ళలో యెవరు వారు? ”


“కంగారు పెట్టెయకండి చెప్తాను—మిస్టర్ దివాకర్- అదేదో ఫార్మా కంపెనీకి పార్టనర్ అట. మరొకతనేమో— మిస్టర్ విశ్వం- సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగమట. ఎప్పుడింట్లో ఉంటాడని అడిగితే నా మటుకు నేను చెప్పలేనన్నాను. రాబోతున్నది పండగ సీజన్ కావున చాలా వరకు కిరాణాకొట్టు పనిరద్దీలో ఉంటాడని చెప్పాను. ఈ మధ్య కొందరికోసం కొత్తగా హోమ్ డెలివరీ కూడా ఆరంభించారు కాబట్టి మరీ టైట్ గా ఉన్నారని చెప్పాను!”


ఆ మాట విన్నంతనే వేదమూర్తి ఎక్కడి వాడక్కడే నిల్చుండి పోయాడు. “విశ్వం గురించి ఓకే— గవర్నమెంటులో మంచి ఉద్యోగంలో ఉన్నాడని విన్నాను. కాని—దివాకర్ నా గురించి వాకటు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. వాడెప్పుడో నాకు యెడంగా దూరతీరాలకు తరలిపోయిన వ్యాపారస్థుడుగా యెదిగి పోయాడు. నాతో వాడికేమి పని? తేల్చుకోలేక పోతున్నాను”

అప్పుడు మంగళ దేవమ్మ కలుగ చేసుకుంది- “అవేం మాటల్రా వేదా! ఎంత యెదిగితే మాత్రం యెవరికైనా చిన్ననాటి దోస్తులు గుర్తుకి రారా యేమిటి? కుచేలుడు శ్రీకృష్ణుడికి గుర్తుకి రాలేదూ!”


“అబ్బే--నేనేమీ వాడి గురించి చెడుగా చెప్పడం లేదమ్మా! చిన్నప్పుడే వాడు హైటెక్ లైఫ్ స్టయిల్ చూపించ డానికి పూనుకునేవాడు. అటువంటిది—ఇప్పుడు నిజంగానే హైటెక్ జీవిత విధానంలో కలసిపోయాడు. ఇప్పుడు నేనెందుకు గుర్తుకి వస్తున్నానా అని—”.


మంగళమ్మ నవ్వింది. “ఇంతదానికి నువ్వెందుకంతగా ఆలోచిస్తున్నావురా! ఏదో పనుండి ఇటు వేపు వచ్చుంటాడు. లేదా టోకు వ్యాపారస్థులతో మంతనాలు జరపడం కోసం వచ్చుంటాడు. ఇప్పుడు పనిలో పనిగా నిన్ను చూసిపోవాలనుకుంటున్నాడేమో--అంతే సంగతులు. ఇక నువ్వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కొని టిఫిన్ తిను. ”


అతడు తలూపుతూ ఎటో చూపులు నిలిపి లోపలకు వెళ్ళిపోయాడు.

మరునాడు ఉదయం వేదమూర్తి ఇద్దరు కొడుకుల్తో కలసి అల్పాహారం తిని కిరాణా కొట్టుకి బయల్దేరుతున్నప్పుడు, దివాకర్ మంది మార్బలంతో రెండు కార్లలో యింటి ముందు దిగాడు. ఇంటిల్లపాదీ హడావిడి పడిపోతూ గుమ్మం వద్దకు పరుగున వచ్చారు. భార్య కామాక్షి తప్ప మరెవ్వరూ పట్టించుకున్నట్లు లేదు.


తండ్రి వినాయకం ఆ సందడిని గుర్తించినా అదేమీ పట్టించుకోకుండా పూజా గదిలో జపతపాలు చేస్తూ, ’మంగళం భగవాన్ విష్ణు:-మంగళం గరుడ ధ్వజం:-మంగళం పుండరీకాక్షో మంగళాయతనం హరి:’అని విష్ణు స్తుతి పఠిస్తూ కూర్చున్నాడు.


అప్పుడదే సమయాన ఏవో పుస్తకాలు చేత బట్టుకుని బైటకు వచ్చిన పరమేశ్వర్ అన్నదమ్ములిధ్దర్నీ తోసుకుంటూ అదేదో వింతైన దృశ్యంలా అందరి వేపూ యెగాదిగా చూస్తూ వడివడిగా వీధిలోకి వెళ్ళిపోయాడు. కారు దిగిన దివాకర్ చిన్ననాటి నేస్తం భుజాల చుట్టూ ఆప్యాయంగా చేతులు వేసి అడిగాడు “అలా వెళ్ళేది మీ అబ్బాయేనా? ”


వేదమూర్తి తెచ్చిపెట్టుకున్న నవ్వుముఖంతో బదులిచ్చాడు- “ఉఁ మావాడే—రెండవవాడు పరమేశ్వర్. . ఎప్పుడూ పుస్తకాల మూటలు చేతబట్టుకుని లైబ్రరీలు లెక్చరర్ల చుట్టూ ఆగమేఘాలపైన తిరుగుతుంటాడు. అడ్డు తగిలి అడిగితేనేమో ముఖ్యమైన పోర్షన్ పూర్తి చేయాలని తిరిగి చూడకుండా తప్పుకుంటాడు. వాడి సంగతి తరవాత మాట్లాడు కుందాం గాని—మొదట యింట్లోకి పద. నువ్వొచ్చిన మంది మార్గలం చూసి వీధి జనం గుమికూడుతు న్నట్టున్నారు”అంటూ తోడ్కొని పోవడానికి నడిపిస్తున్నప్పుడు-


“డాడీ ఆగండి! నేనూ వస్తున్నాను” అని నాజూకుతనంతో మెరిసిపోయే ఒక అమ్మాయి అక్కడకు చేరి వేదమూర్తికీ కామాక్షికీ చేతులు జోడించి నమస్కరించి మిగతా వారినందర్నీ “హాయ్! ” అంటూ ఫార్మల్ గా పలకరించి వాళ్ళకెదురుగా నిల్చుంది.


అంతలో కమల కదలి వెళ్ళి-“ఆగండి ఆగండి! ”అంటూ పరుగున వచ్చి వెండి పళ్ళెంలో హారతి తీసింది.


దివాకర్ నవ్వుతూ పలకరింపుగా అన్నాడు-“ఏంవమ్మా! స్లోమోషన్ పిక్చర్ లా మౌనంగా హారతి తీయడమేనా లేక హారతి తీసే తెలుగు పాట యేదైనా పాడి వినిపిస్తావా! ”.


దానికి కమల ఠపీమని స్పందించింది- “ఎందుకుండదు మామయ్యా! మరి పళ్ళెంలో భారీగానే వేయాలి. వేస్తారా!”

“ఎందుకు వేయనూ—ముందు హారతి పాట పాడి మమ్మల్ని అలరించు—”


“ అలాగే” అంటూ కమల- క్లుప్తంగా విష్వక్సేన స్తుతి పాడి వినిపించింది. దివాకర్ మెచ్చుకోలుగా పర్సునుండి రూపాయి నోట్లు తీసి పళ్ళెంలో పెట్టాడు. అందరూ తప్పట్లు కొట్టారు. అలా అందరూ తప్పట్లు కొడ్తుండగా అక్కడకు మంగళమ్మ భర్తతో బాటు వచ్చింది. ఈసారి కూడా దివాకర్ కూతురు వినోదిని మరచిపోకుండా ముందుకు వెళ్ళి ఇద్దరి కాళ్ళకూ నమస్కరించింది. దంపతులిద్దరూ వినోదినిని ఆశీర్వదించి దివాకర్ ని విస్మయాత్మకంగా చూడసాగారు.


ఒకే ఊళ్ళో పుట్టారు. ఒకే స్కూలులో-ఏకోపాద్యాయ స్కూలులో చదివారు. కాని—పెరిగి పెద్దయిన తరవాత ఇద్దరి దార్లూ యెంత లాఘవంగా వేరు పడ్డాయి--ఇప్పుడు ఇద్దరి మధ్యా యెంతటి వ్యత్యాసం! దివాకర్ యేమో గగనం వరకూ యెదిగిపోయాడు. వేదమూర్తేమో యింటి చుట్టూ, కిరాణా కొట్టు ప్రహరీ గోడ చుట్ట తిరుగుతూ, కొడుకులిద్దరికీ వ్యాపార మెళకువలు నేర్పుతూ, బరువు మూటలు మోస్తూ, చిల్లర వ్యాపారం చేస్తూ కాలం వెళ్ళదీస్తు న్నాడు. అన్నాళ్ళ యెడబాటు తరవాత, అన్నేళ్ళ తరవాత దివాకర్ చిన్ననాటి నేస్తాన్నివెతుక్కుంటూ రావడం ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యమే---


ఇంకా వుంది..

---------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


37 views0 comments

Comments


bottom of page