top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

https://youtu.be/3oFcr5OTM1g

'The Trap Episode 1' New Telugu Web Series


Written By Pandranki Subramani


రచన : పాండ్రంకి సుబ్రమణి


పాండ్రంకి సుబ్రమణి గారి కొత్త ధారావాహిక 'ది ట్రాప్' ప్రారంభం


కామ్స్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ భువనేష్, మొదటి ఎయిర్ టెర్మినల్ అబుదబీలో దిగి లాంజ్ లోకి వచ్చి, బ్రీఫ్ కేసుని మాత్రం తనతో తెచ్చుకుని, ఓసారి సరిచూసుకుని అనువైన చోటు చూసుకుని కూర్చున్నాడు.


అబుదబీ విమానాశ్రయం, ఖరీదైన తళుకుల్ని డేషింగ్ డ్యాన్సర్ లా అంగరంగ వైభవంగా సంతరించుకుని, అధునాతంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతంగా, లగ్జూరియస్ గా ఉంటుంది.


శంషాబాదు లో మనోడు తెలుగోడు కట్టిన మెరుగులు దిద్దుకుంటూన్న విమానాశ్రయం దీనికి సరితూగ వచ్చు.. ఏం, కొన్నిటితో పోల్చి చూస్తే హంగుల్లో పొంగుల్లో మించి పోవచ్చు కూడా-- ఎవరు చెప్పొచ్చారు ఈ వేగంతో వెళితే భాగ్యనగరం చాలా విషయాలలో పలు విదేశాలతో సరితూగుతూ, చూపులో ఊపులో మిరుమిట్లు గొలుపుతూ త్వరలో మించిపోవచ్చునేమో—


మెల్లగా లేచి లాంజ్ బయట బిల్లు చెల్లించి క్రీమ్ కాఫీ తీసుకుని వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక భారతీయ కుటుంబం ఎదురొచ్చింది. చేతిలోని బ్రీఫ్ కేసుతో ఉన్నపళంగా నిల్చుండిపోయాడు. కదలకుండా చూస్తూండిపోయాడు. భార్యాభర్తలిద్దరూ దక్షిణ భారతీయులే-- ఒక కొడుకు- ఒక కూతురు.


చెంగు చెంగున గెంతుతూ తల్లితో ఊసులు చెప్తూ ఊపిరి సలపనివ్వడం లేదు. పిల్లలిద్దరికీ చుట్టు ప్రక్కలంతా కొత్త కొత్త అద్భుతాలు కనిపిస్తున్నాయేమో-- అప్పుడతనికి ప్రభావతి సజీవంగా కట్టెదుట నిల్చుని తనతో మాట్లాడుతూ, తన చుట్టూ తిరుగుతూ, ఏవేవో సంగతులు చెప్తున్నట్లనిపించింది. ఒకానొకప్పుడు, పెళ్ళి కొత్తలో కాపురానికి వచ్చిన రోజుల్లో ప్రభావతి యిలాగే ఉల్లాసపూరితంగా ఉవ్విళ్ళూరిస్తూ కబుర్లు చెప్తూ మాటలు కలిపేది. ముచ్చటలు చెప్పేది. దీపాల వేళ దాటింతర్వాత వెన్నెల వెలుగులో భోజనాలు ముగించి శయనాగారాన్ని రతీ మన్మథుల రహస్య మందిరంగా మార్చి ఆనంద డోలికల్లో ముంచి తేల్చేది.


స్వర్గపుటంచుల వరకూ మోహపు విమానంలోకి యెక్కించుకుని తీసుకెళ్ళిపోయేది. వ్యాపార పర్యటనలకు వెళ్ళేటప్పుడు యేర్పడే యెడబాటు తప్ప, ప్రతిరోజూ తమిద్దరికీ మన్మథ మోహన మనోహర రాగమే! శృంగార జలపాతమే! కాని—ఇప్పుడు యింట్లో పరిస్థితి అలా లేదు. అంతటి వారు. ఇంతటి వారూ అన్న వ్యత్యాసం లేకుండా తెలుసుకోవలసిన జీవిత సత్యమన్నది ఒకటి ఉండనే ఉంది కదా-- జీవితం క్షణ క్షణం తిరుగుతూ బోర్లాపడే తాడులేని బొంగరమే కదా! చెప్పుకోవడమే గాని, తాడు లేని బొంగరమెలా ఉంటుంది!


ఆ తాడు మానవ మాత్రుల చేతిలో ఉండకపోవచ్చు. మానవ మాత్రుల చూపులో పడకపోవచ్చు. మరి—చక్రం తిప్పే ఆ తాడు పైనున్నవాడి చేతిలో యెప్పుడూ యెక్కడో ఒక చోట భద్రంగా ఉండే తీరుతుందిగా! ప్రభావతికి మొదటి కాన్పు ఆడపిల్ల- సుభాషిణి. మొదటి కాన్పు అనడం సరైన పదప్రయోగం కాదేమో! ఎందుకంటే ప్రభావతికి రెండవ కాన్పు యెప్పుడూ కలగలేదు. ఇకపైన కలగనే కలగలేదేమో—సుభాషిణి పుట్టినప్పుడే ప్రభావతి యమ వేదనతో బిడ్డనిచ్చింది. అప్పటికప్పుడు కాకుండా మరునాడు డాక్టర్లు పిలిచి హెచ్చరించారు- ‘దాంపత్య జీవితానికి ఢోకా ఉండదు గాని; మరొక బిడ్డను కనడం కష్టమవుతుందని.


మేటర్ కనకపోవడం కాదు—ఇకపైన కనకపోవడమే జీవితానికీ ప్రాణానికీ శ్రేయస్కరమని మరీ సూటిగా కాకుండా జాడగా చెప్పారు. కాని—సమస్య అంతటితో ఆగిపోలేదు. నిజానికి అంతటితో ఆగిపోతే ఏ బాదరా బందీ ఉండకపోను. మరి—పైనున్నవాడి లెక్కలు యెప్పుడా ఊహకు అతీతంగా మరొక విధంగానేగా ఉంటాయి! బ్రతుకు మ్యాధ్స్ ఫార్ములాకి అందని రీతిలోనేగా ఉంటాయి! ఎల్లప్పుడూ బ్రతుకు ఊరు వర్షాలలో వరదల్లో మునిగిపోతే చాలనుకుని వెనుతిరగడు కాలుడు.


పిడుగులతో మంటలు రేపి భస్మం చేస్తే గాని కాలుడి ఆవేశం చల్లారదు. ఏడేండ్ల ప్రాయంలో సుభాషిణి ఫ్యాటల్ యాక్సిడెంటులా పేరు తెలియని జ్వరాన పడి పైవాడి పిలుపందుకుని యింటిని శ్మశాన చీకటితో నింపి వెళ్ళి పోయింది. తన దు:ఖాన్ని అనుభవిస్తూ ప్రభావతి దు:ఖాన్ని పంచుకోలేక తను కన్నీరు కారుస్తున్నప్పుడు తన మిత్రుడైన డాక్టర్ యిలా అన్నాడు. చాలా సాఫీగా అన్నాడు- “మనం మరణాన్ని కాలపరిమితితో బేరీజు వేసుకుంటాం గాని, నిజానికి నాకెలా అనిపిస్తుందో తెలుసా! ఇన్ని రకాల జ్వరాల మధ్య ఇన్ని ఘోరమైన వింత వింతైన వ్యాధుల మధ్య మనిషింకా బ్రతికుండటమే ఆశ్చర్యంగా ఉంది—”అని.


ఇక పైన చేసేదేముంది? మిగిలింది ప్రభావతికి తను—తనకు ప్రభావతేగా-- నిజానికి తనకు తెలియ కుండానే తను ఒక అపచారం చేస్తున్నాడేమో—రెండవ కాన్పు కలగడం కష్టమని ప్రభావతికి తనింత వరకూ చెప్పలేదు. తను కావాలని అలా దాచి పెట్టడం లేదు. ఒక ఆశ—మిణుకు మిణుకుమనే ఒకే ఒక ఆశ;రేపు పరిస్థితులు కలిసొస్తే వైద్య శాస్త్రంలో అనుకూలమైన మార్పులొస్తే తమకు రెండవ బిడ్డ కలుగుతుందేమో—మొన్న మొన్న వైద్య శాస్త్ర సహాయంతో డబ్బై యేండ్ల ఒక భారతీయ స్త్రీ అంతటి లేటు వయసులో బిడ్డకు తల్లి కాలేదూ! అరుదైన సైన్స్ సాధనే—కాదనలేడు. కాని అద్భుతమే కదా! మాతృత్వతానికి లభించిన పుణ్య ప్రాప్తమే కదా-- పూర్వ జన్మ సుకృతం గాని ఉంటే అటువంటిదే తమ విషయంలోనూ జరగవచ్చేమో--


మరి కాసేపటికి భువనేష్ సెక్యూరిటీ కాల్ అందుకుని చెకింగ్ లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని అమెరికా వేపు సాగబోయే ప్లేనులోకి యెక్కి కూర్చున్నాడు;కళకళగా కనుల పండువుగా ఎదురొచ్చిన ఆ తెలుగు కుటుంబం మళ్ళీ కనిపిస్తుందేమోనని ప్రక్క ప్రక్కలకు చూపులు సారిస్తూ-- బహుశ: వాళ్ళు తనలా నవ్రేకర్ వేపు వెళ్ళడం లేదేమో-- మనిషి మనస్త త్వం ఎంత విడ్డూరమైనది— తనకి నచ్చిన వాళ్ళందరూ తనతో బాటు తనతో కలసి వస్తారనుకుంటారు. చివరి వరకూ కలసి వస్తారనుకుంటారు. కాని—అదొక అసాధ్య మైన కార్యమని తెలుసుకోరు.


ఎయిర్ హోస్టెస్ అందించిన ఆరెంజ్ రసం అందుకుని తాగి మరుక్షణం మాగన్నుగా నిద్రలోకి జారిపోయాడు భువనేష్. కలలో ప్రభావతి తన కోసం తనను పలకరించడం కోసం విమానాన్ని వెంటాడుతూ మేఘాలలోకి తేలుతూ మబ్బుల్ని చెదరగొడ్తూ వస్తూంది. ఇలలో కలలో నేమి, మూడవ లోకంలోనూ తనకు దగ్గరగా ప్రేమగా ఉండేది తనలో సగం ప్రభావతేగా!


అతడు నెవ్రేకర్ లో దిగి కార్గో వింగ్ నుండి తనకు చెందిన సూటు కేసులు అందిపుచ్చుకుని బయటకు వచ్చేటప్పటికి యూయెస్ కంపెనీ బ్రాంచ్ సీనియర్ ఎక్సిగ్యూటివ్ రాము నవ్వుతూ ప్రత్యుత్థానం చేసి ప్రయాణం గురించి కుశల ప్రశ్నలు వేసి మాటలు కలుపుతూనే వీల్ ట్రాలీలోకి సూటు కేసులు పెట్టి పార్క్ చేసి ఉంచిన కారు వేపు నడిచాడు. భువనేష్ కి అతడి గురించి చాలా రోజులుగా తెలుసు. జాలీ గోయింగ్ టైప్. జీవితాన్ని అనుక్షణం అన్ని విధాల చివరి బొట్టు వరకూ అనుభవించాలన్న ఆరాటం గలవాడు. పరిచయాన్ని ముందున్న ప్రపంచాన్ని అణుశక్తి అంతటి ఉత్సాహంతో నింపగలడు. తన ఉనికితో పరిసరాలను ఉర్రూతలూగించ గలడు.


మరిప్పుడు భువనేష్ ఆలోచనల నుండి బయటపడి తనను తను ప్రశ్నించుకున్నాడు- “మందకొడితనంతో నిశ్శబ్ద తరంగాల మధ్య కొట్టుకు పోతూన్న తన గురించి ఇప్పుడు రాము యేమనుకుంటున్నాడో! ప్రయాణ బడలిక అనుకుంటాడో లేక జెట్ ల్యాగ్ అనుకుంటాడో—ఏది యేమైతేనేమి తన వ్యక్తిగత జీవిత ప్రభావాలను ఎదుటి వారికి చేరకుండా చూసుకోవాలి. అలా కాకుండా, ఇప్పుడు గాని చేరితే తను రాము సహకారంతో క్లించ్ చేయబోయే వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా శోభిల్లక పోవచ్చు. అనుకున్నదొకటి-- జరిగింది మరొకటి అన్న చందాన బెడిసికొట్టవచ్చు కూడా-- అలా జరక్కుండా పరాధీనతకు చోటివ్వకుండా చూసుకోవాలి.


కళ్ళు పెద్దవి చేసుకుని కారులో కూర్చున్న మరి కొద్ది సేపటకి ముఖానికి సోకుతూన్న మంచుగాలికి మత్తుగా ఒరుగుతూ భువనేష్ నిద్రలోకి జారిపోయాడు. కారు తోలుతూ మిత్రుడితో మాటలు కలపాలని ప్రక్కకు తిరిగి చూసిన రాము మౌనపు పరదా కప్పుకోక తప్పలేదు.


కాసేపటికి కారు న్యూజెర్సీ డౌన్ టౌన్ దిగువన ఆగింది. భువనేష్ కోసం డ్రీమ్ ల్యాండు హోటెల్ లో కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ వింగ్, రూము బుక్ చేసినట్లుంది. లగ్జరీ లుక్ తో కనిపించే లగ్జరీ హోటెల్ అది. వాళ్ళిద్దరూ కారు లో నుంచి దిగి లాంజ్ వేపు వెళ్తున్నప్పుడు మంచు తుంపర పడసాగింది. అది రాముకి అలవాటు పడ్డ వాతావరణమే కాబట్టి అతడు అలవోకగా భువనేష్ చేతినుండి బ్రీఫ్ కేసు అందుకుని డిక్కీలోనున్న రెండు సూటుకేసుల్నీ అందుకుని బుక్ చేసిన రూములో పెట్టమని అక్కడి రిసెప్షన్ స్టాఫ్ కి ఆదేశాలు జారీ చేసి, నవ్వుతూ రిసెప్షన్ లేడీని అడిగాడు రాము- “నాకోసం ఒక లేడీ గెస్ట్ వచ్చి ఉండాలి. పేరు- మిస్ సోనియా—”


దానికి ఆ లేడీ రిసెప్షనిస్ట్ వెంటనే బదులిచ్చింది- “యస్ సార్—అదిగో అక్కడ కూర్చుంది”.

అప్పుడామె గొంతు విని గావాలి యెర్రగా పొడువుగా ఉన్న వైట్ అమ్మాయి- ‘హాయ్’ - అంటూ నవ్వుతూ వచ్చి రాము చుట్టూ చేతులు వేసింది. అతడు మరచిపోకుండా సోనియాకు అఫీషియల్ డిజిగ్నేషన్ తో సహా భువనేష్ ని పరిచయం చేసి, తనతో రమ్మనమని సైగ చేస్తూ లిఫ్ట్ వేపు నడిచాడు. భువనేష్ ఆమెను రెప్పవాల్చకుండా చూస్తూనే లిఫ్ట్ లోకి ప్రవేశించాడు. ఈ మధ్య అంతటి పొడవూ ట్రిమ్ నెస్సూ గల వెల్ షేప్డ్ స్త్రీని చూడలేదేమో!


ఇక్కడి అమెరికన్ అమ్మాయిలు షేపూ రూపూ గల ఫిగర్స్ కోసం అధిక శ్రమ తీసుకుంటారని అతడికి తెలుసు. ఒకటి కాదు- రెండు కాదు— ఇండియా నుండి దిగుమతి అయే ఆయుర్వేదం కాస్మోటిక్స్ కొనుగోలు కోసం కూడా ఖర్చు చేయడానికి వెనుకాడరు. వంపులు తిరిగే శారీరాకృతి ఇక్కడి అధునాతన స్త్రీలకు అన్ని విధాలా అస్సెట్ వంటిది. నిజానికి ఇక్కడి ఉద్యోగ నిర్వహణలో అదొక అనివార్య అంశం కూడాను-

ముగ్గురూ ఒకరినొకరితో పరిచయాలు పెంచుకుంటూ ఫ్రెషప్ అయి క్రింది ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంటులో డిన్నర్ పూర్తి చేసారు. చేతులు వాషింగ్ రూములో కడుక్కుంటూ భువనేష్ అనుకున్నాడు; ఇద్దరూ మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. తన ఉనికి వాళ్ళ కామోదీప్తికి అడ్డంకిగా మారుతుందేమో-- మంచి రూము. చక్కటి మెత్తటి ఇటాలియన్ పాన్పు. రూమ్ సెంటెడ్ స్ప్రే-- దీనికి తోడు ఇంకా కురుస్తూనే ఉన్న మంచు బిందువుల చల్లదనం.


అప్పుడతనికి యెప్పుడో యెక్కడో విన్న సీనీ గీతం మనసున మెదిలింది- “ఒక ఉదయం పోతే- ఆ ఉధయంతో బాటు ఒక ముచ్చటైన మధ్యాహ్నమూ పోతుంది. పిమ్మట మధ్యాహ్నం కూడా పోతే, మరులు గొలుపు సాయంత్రమూ పోతుంది. మతి మరుపున సాయంత్రమూ పోతే నలువైపులా కోర్కెల చుక్కల్ని రాల్చే రాత్రి కూడా పోతుంది. అటూ యిటూ కాకుండా రాత్రి కూడా దక్కకుండా పోతే—జీవన సౌందర్యమే పోతుంది—“


పానకంలో పుడకలా వచ్చిన తన వల్ల వీళ్ళిద్దరికీ అటువంటి దారుణ పరిస్థితి యెందుకు దాపురించాలి-- అలా అనుకుంటూ తిరిగి చూసి”రైన్ కోర్ట్ వేసు కుని నేనలా పార్క్ వరకూ నడచి వస్తాను- మీరు వైన్ పుచ్చుకుంటూ రూములో మాట్లాడుతుండండి” అని అనడానకి నోరు తెరవ బోయాడు. కాని-- రాము ఆ మాట పూర్తి చేయనివ్వకుండానే హోటేల్ ముందాగిన యెల్లో క్యాబులోకి సోనియాని యెక్కించి పంపించేసాడు. అది చూసి భువనేష్ ముఖం తేలేసాడు- ఏమి చెప్పాలో యేమి చెప్పకూడదో తేల్చుకోలేక.


ఇద్దరూ రూములోకి వెళ్ళి ఫార్మల్ దుస్తులు వేసుకున్న తరవాత యెదురెదురుగా కూర్చున్న తరవాత రాము అన్నాడు- ”హుఁ ఇప్పుడు చెప్పు భువనేష్--”


అతడు నవ్వి ‘యేమి చెప్పేది’ అన్నట్టు కళ్ళెత్తి చూసాడు. .


“ఏదో ఒకటి-- నువ్వను కున్నది. చాలా సార్లు నా కళ్ళలోకి షార్పుగా చూస్తూనే ఉన్నావుగా సోనియాను నాచెంతన చూసిన దగ్గర్నుంచీ—”


భువనేష్ స్పందించ లేదు. రవంత సేపు కన్నార్పకుండా చూసి అన్నాడు- “నేననుకున్నది టూ పర్సనల్ గా ఉంటుందేమో! ఇక్కడి సోషియల్ వాతావరణానికి బాగా అలవాటు పడ్డ నీకు కూడా నచ్చదేమో—”


రాము తల అడ్డంగా ఆడించాడు- “కావలసిన వాళ్ళు ముఖ్యంగా నాతో బాగా పరియం ఉన్న శ్రేయోభిలాషులు యేది చెప్పినా స్వీకరించగల సహనం నాకుంది. నౌ- ప్రొసీడ్”


“అలాగంటే పాయింటుకి వస్తాను. ఆర్నెళ్ళకు ముందు వచ్చినప్పుడు నేను నీతో ఒక లాటిన్ అమెరికన్ అమ్మాయిని చూసాను. అప్పుడు మెచ్చుకోలుగా మనసున అనుకున్నాను- నీది మంచి టేస్టని. ఆ తరవాత ఇక్కడకు బిజినెస్ టూరుపైన వచ్చినప్పుడు ఒక ఫిలిప్పినో అమ్మాయిని నీతో చూసాను. ప్రతిసారీ ప్రతి స్త్రీతోనూ ఉన్నప్పుడల్లా అదే పనిగా నీది మంచి టేస్టని అభినందించలేను కదా! ”


రాము చిన్నగ నవ్వుతూ బదులిచ్చాడు- “అర్థమైంది, టిపికల్ సౌత్ యిండియన్ లా మాట్లాడుతున్నావు. చెప్పి ముగించు మరి—”


భువనేష్ తల పంకిస్తూ కొనసాగించాడు- “ఈ ప్రపంచంలో యేదైనా సరే యెక్కడిదైనా సరే- తేరగా దొరుకుతుంది కదానని అల్లుకుపోకూడదు. ముఖ్యంగా బంధాలూ బాధ్యతలూ లేని స్త్రీ సంపర్కం విషయంలో-- ఎంత కాదను కున్నా ఎంత లేదనుకున్నా ఇవన్నీ భావోద్వేగ పూరిత సంబంధాలు. వీటి పర్యవసానాలు నీడలా వెన్నంటి వస్తూనే ఉంటాయి; ఇప్పుడని కాదు, ఎప్పుడూనూ--


అదే సమయంలో నీ తరపున సహేతుకత ఉందని ఒప్పుకుంటాను. ఒడిలో చిలుకలా వాలిన స్త్రీని మడి కట్టుకుని ఏ మగాడూ చూస్తూ కూర్చోలేడు. ఐనా నీకు యిబ్బంది కలిగించకూడదనుకుంటూనే మొదటికే వస్తున్నా ను-- పర్యవసానాలు వెంటాడే తీరుతాయి. హోరులో జోరులో ఉన్న-- వయసు నీది- అంచేత నాలుగు కాళ్ళ రొబోలా కొండలు గుట్టల్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరులు మరలును వయసుతోడనే అన్నట్టు. ఒక రోజు వాతావరణం చల్ల బడ్డ తరవాత తీరిగ్గా తిరిగి చూసుకోవడానికి ప్రయత్నిస్తే నీకంటూ ఏదీ మిగలకపోవచ్చు. ఏదో ఒక ఓల్డ్ యేజ్ ప్రాంగణాన చేరవలసి రావచ్చు. చెప్పడం పూర్తయింది. ఇక నీ తరపున విప్పడం నీ వంతు—”


రాము వెంటనే స్పందించలేదు. సన్నగా నవ్వుతూ భువనేష్ ముఖంలోకి చూసాడు. “నువ్వు చెప్పినవన్నీ నాకు స్నేహపూరితంగానే కాదు. ఆత్మీయంగానూ ఉన్నవి—ఒకటి తప్ప-- వెంటనే అడ్డురాకు. నేనే చెప్తాను. నేను పెళ్ళి వద్దంటున్నానని, భార్యా బిడ్డల అవసరం లేకుండా కాలమంతా స్వర్గపుటంచుల్ని తాకుతూ ఉండాలనుకుంటున్నానని. నీకు తెలిసి ముగ్గురమ్మాయిలతో చెట్టాపట్టలేసుకుని తిరిగానని ఆ తరవాత అవసరం తీరాక వాడుకుని వదిలేసాననుకుంటున్నావు. పూర్తి పొరపాటు. ఇక్కడి పరిసరాల గురించి మైండ్ సెట్సు గురించి పూర్తి అవగాహన లేకుండా నువ్వు ఊహించేసుకోవు! ”


అంటే—అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడు భువనేష్.


“పెళ్ళి చేసుకోనని నేననలేదు. వాళ్ళే వద్దన్నారు.

ఎందుకు వద్దన్నారో అదీ చెప్తాను.


ఒకతె—జీవితంలో చూడాల్సింది, చూసి అనుభవించాల్సింది బోలెడుంది. ఇంతలోనే అంతటి బాదరా బందీ అవసరమా అని అడిగింది.


మరొకతేమో—ఇంతటి దిగువ జీవన ప్రమాణంతో కుటుంబ భారాన్ని భరించలే నంది.


ఇంకొకతేమో—పెళ్ళి ప్రొఫెషనల్ కెరియర్ ని దెబ్బతీస్తుందని. తన వెనుక వయసు మళ్ళిన పేరంట్స్ ఉన్నారని నా పెళ్ళి ప్రపోజల్ ని భారీ హగ్ తో తీసిపారేసింది. నాకు కావలసింది యెప్పుడెక్కడ కావాలో అక్కడకు వచ్చి తీరుస్తానని ప్రామిస్ చేసింది.


వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. వాళ్ళలాగే నాకు కూడా అవి తీరుతూనే ఉన్నాయి. కాని-- నాలోని జీన్స్ భారతదేశానికి చెందినవి. అంచేత అవి నాకు అనవరతం చెప్తూనే ఉన్నాయి త్వరగా ఓ యింటివాడవమని, అందువల్లనే ఈ విషయంలో నేను వెనుకబడిపోతున్నాను. ఇక్కడ నీకొక విపరీతమైన అంశం చెప్పాలి.


ఇక్కడకు వచ్చి ఉద్యోగ సద్యోగాల లో స్థిరపడ్డ ఇండియన్ స్త్రీలలో కూడా అటువంటి విచార ధారే తాండవం చేస్తుంది. వీళ్ళలో కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాదనను. కాని—ఇక్కడి వాళ్ళలాగే పీరియడ్ వైజ్ డైవోర్సులు తీసుకోవడానికి వెనుకంజ వేయడం లేదు. టేస్టీ లైఫ్ కోసం అర్రులు చాచడం మానడం లేదు.


ఈ విషయంలో నువ్వు లక్కీ ఫెలోవి. బైదిబై- నీకొక మాటిస్తున్నాను. ఏదో ఒకలా వీలు చూసుకుని ఏదో ఒక పుణ్య ముహూర్తాన తెలుగు రాష్ట్రాల కు వచ్చి పెండ్లి పీటలపైన కూర్చుంటాను, . ఈ వయసులోని హోరూ జోరూ యెక్కువ కాలం ఇలాగే సాగదని నాకు మాత్రం తెలవదా! నౌ- మరొక ప్రామిస్—నేనెన్నడూ స్త్రీల మృదు మనోభావాలను- శారీరక అసహాయత ను ఎక్స్ ప్లోయిట్ చేయను. ఇప్పుడు నాతో చెలిమి చేస్తూన్న ఫారిన్ అమ్మాయిలు నా ద్వారా వాళ్ళ అవసరాలను వాళ్ళు తీర్చుకుంటున్నారు. అదే రీతిన నా అవసరాలను వాళ్ళుగా వచ్చి తీరుస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే- ఇరు పక్షాలదీ గివ్ అండ్ టేక్ పాలసీ అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇప్పుడిలా తగలడ్డానే గాని, నేను కూడా నీలాగే పెద్ద తెలుగు కుటుంబంలోనేగా పుట్టి పెరిగాను. అప్పటి విలువలు అంత త్వరగా మాసిపోవుగా! ”


అంతటితో భువనేష్ మాటలు పెంచలేదు. అలాగేలే అన్నట్టు తలూపుతూ అతడు పడకపైన వాలబోయాడు. అప్పుడు ఖంగున ముబైల్ మ్రోగింది. స్క్రీను తెరచి చూసాడు. ఇండియా నుండి వచ్చిన కాల్- ప్రభావతి నుండి వచ్చిన కాల్-- రూమ్ యెగ్జిట్ వరకూ వచ్చి పలకరించాడు భువనేష్.

“హల్లో మేడమ్! అక్కడి వాతావరణం యెలాగుంది? మరీ చల్లగా ఉందా! కట్టుకున్నోడు గుర్తుకి వస్తున్నాడా యేమిటి! ఇప్పటికిప్పుడు రెక్కలున్న విహంగంలా ఆకాశంలోకి యెగిరి నా వద్దకు వచ్చేయాలనిపిస్తుందా?”


అటునుంచి బదులు రాలేదు. మౌనం శబ్దమై రాగమై అతణ్ణి తాకింది. “అదేవిటి మేడమ్ అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు?సుస్తీ చేసిందా! “


ప్రభావతి నవ్వు తెరల్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ అంది-

“లేదు. నిశ్శబ్దంగా ఉండిపోలేదు. తల అడ్డంగా తిప్పుతూనే ఉన్నాను. వీడియో వేయలేదు కాబట్టి మీకు కనిపించలేదు”

ఇంకా ఉంది...ది ట్రాప్ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

ది ట్రాప్ నవలకు ముందు మాట

ఉగ్రనేత్రం

వివేకం

దీపాల పండగ

ఒక అగమ్య జీవన రాగంలో--

మద్యం కోసమొక కదనం

నిన్ను నువ్వే అడుగు

స్నేహానికి సరికొత్త ఒప్పందం

నవ్వుల్ నవ్వుల్! నవ్వుల్లో పువ్వుల్ పువ్వుల్ !

ఎత్తుగడ

విహంగమై తరంగమై ఆకాశ గోపురాల వేపు

బుల్లెట్ ప్రూఫ్

జంతు ప్రేమికుడు జగ్గన్న

నాన్న కోసం

చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు...

ఆకాశం వర్షించదు అందరి కోసం!

మోహం ముప్పై రోజులు

గోల్డెన్ బాల్

సముద్రం తరంగాల మధ్యన ఓ లలన

ఒక రాత్రి పూట ట్యాంక్ బండ్ ప్రక్కన---

సుడిగుండం

ఎదలోతున అలజడి రేపే ఆలాపనలు (నవల)

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.66 views0 comments
bottom of page