top of page

ఒక అగమ్య జీవన రాగంలో--

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link


'Oka Agamya Jeevana Ragamlo' New Telugu Story Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి
కల్పన భుజాన వ్రేలాడుతూన్నషోల్డర్ బ్యాగుని ఉన్నపళంగా విసురుగా కుడిచేతిలోకి అందుకుని, గట్టిగా బిగించుకుని, రైల్వే లైన్ వీధిలోకి వడివడిగా నడిచింది. రాను రాను పరిస్థితి నలువైపులా అతలా కుతలమై పోతూన్న సమయం. ఎవడు- ఎవడేమిటి యెవతె యెక్కణ్ణించి యెలా దూసుకు వచ్చి చేతికి దొరికింది యెలా యెత్తుకు పోతారో చెప్పలేని అథోగతి.


తన మెళకువకి అతీతంగా అటువంటిదేమైనా జరిగితే యెక్కడకు వెళ్ళి యెవరితో చెప్పుకోగలదు? కోవిడ్ అరికట్టే కార్యరంగంలో అందరూ- ముఖ్యంగా నగర రక్షక భటులు కుత్తుకంట మునిగి తేలుతూన్న లాక్ డౌన్ గడ్డు సమయం. ఇటువంటి పిర్యాదుల వేపు కన్నెత్తి కూడా చూసే నాథుడుండడు. సమయ సందర్భమెరిగి నడచుకోవడం ఉత్తమం కదా! అందుకే- తను మోడల్ అన్నది ప్రక్కన పెట్టి మోతాదుకి మించని రీతిన మామూలుగా ముస్తాబయి, సాదాసీదా పింక్ రంగు చుడిదార్ వేసుకుని బయల్దేరింది.


కాని కల్పన తనకు తెలియకుండానే ఒక వాస్తవాన్ని మరచినట్లుంది. ఎటువంటి సందర్భంలోనూ రెండు అంశాలు ఆడదానిని గిరిగీసిన వలయంలా మరచిపోనివ్వవు. యవ్వన వయసు- వయసులోని సొగసు. అవి రెండూ దాగనివి. దాచుకోలేనివి.


ఆ రీతిన నడుస్తూనే చుట్టు ప్రక్కల వాళ్ళందరూ తనను ఓర చూపులతో కొలతలు తీయడం ఆమె గమనించింది. తనిక చేయడానికేమీ లేదనుకుంటూ ఆమె యెట్టకేలకు అవలోకగా నడచుకుంటూ వెళ్ళి కావలసిన ఫ్లాట్ నెంబరు గుర్తించ గలిగింది. 2జి- నలబై ఆరు. అది బ్యాచులర్ సింగి ల్ రూము.


తన స్నేహితురాలు వేదనాయకి అన్న బాలనారాయణ ప్రస్తుతం ఉంటూన్న రూము. తన చిన్ననాటి స్నేహితురాలైన వేదనాయకే తనను కకావికలమైపోతూన్న యిప్పటి గడ్డుపరిస్థితిలో వాళ్ళన్నయ్య వద్దకు వెళ్ళి మార్గదర్శకం తీసుకోమంది. ఏదో ఒక విధంగా వత్తాసుగా ఉంటాడని, పట్టాలు దాటించడానికి సహాయ పడతాడని భరోసా యిచ్చింది.


ఆమె డోర్ బెల్ నొక్కుతూ అసంకల్పితంగా వీధిలోకి చూపు సారించింది. కొన్ని జతల కళ్ళు చారడేసంత చేసుకుని ఆమెనే ఒలిచి చూస్తున్నాయి. అనుమానంతో సగం- అసూయతో మరి సగం-- వాళ్ళ కళ్ళు మండి పోతున్నాయని ఆమె గ్రహించింది. బాలనారాయణ బ్రహ్మచారి. పొడవుగా యెరుపుగా ఉన్న యవ్వనవతి అతణ్ణి వెతుక్కుంటూ రావడం వాళ్ళకు కంటగింపే కదా! మగరాయళ్ళ మనోదౌర్బల్యాల గురించి తనకు తెలియనిదా!


బనియన్ తో తలుపు తెరచుకుని బయటకు వచ్చిన బాలనారాయణ కాసేపు కళ్ళు మిటకరించి చూస్తూ ఉండిపోయాడు.


“అదేవిటి.. అంతలావు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నావు? నేను- కల్పనను- వేదనాయకి స్కూల్ మేట్ ని బాలా! మీ యింటికి యెన్నిసార్లు వచ్చి వెళ్ళానని--” చేతిలోకి తీసుకున్న ముఖ కవచాన్ని భద్రంగా ముడుస్తూ అంది.


“సారీ! నిన్ను చూసి చాలా రోజులయి పోతేను-- నేను స్పోర్ట్స్ మైదానంలో ఫుట్ బాల్ ప్రాక్టీసు చేస్తున్నప్పుడు వేదా ఫోను చేసి చెప్పింది. ఏదో మూడ్ లో మరచిపోయి నట్టున్నాను. డోంట్ థింక్ అదర్ వైస్. ఐనా మోడలింగ్ ని ప్రామిసింగ్ కెరీర్ గా మలచుకుని ముంబాయ్- చంఢీగడ్- ఢిల్లీ వంటి ప్రాంతాలకు చెక్కేసావని వేద రెండు మూడు సార్లు చెప్పిందిలే, గర్వంగా ఫీలవుతూ-- రా—లోపలకురా!”


అప్పుడామె చిన్నగ నిట్టూర్చి అంది- “అబ్బ! ఇప్పటికైనా గుర్తుపట్టావే--” అంటూ కాళ్ళకు కట్టుకున్న వైర్ బెల్ట్ చెప్పుల్ని విప్పడానికి వంగింది.


“ఇటీజ్ ఓకే! అలాగే లోపలకు రా! నా బ్యాచులర్ పోర్షన్ మైలపడిపోదులే’ ఆమెకు దారి యిస్తూ ప్రక్కకు తొలగుతూ అన్నాడతను.


ఆమె నవ్వుతూ తలాడిస్తూనే కాళ్ళ బెల్ట్ చెప్పుల్ని తీసి ప్రక్కన పెట్టి లోపలకు నడిచింది. జిగేల్మనే ఫ్లాష్ లైట్ల రంగుల వెలుగులకి- డిజే మ్యూజికల్ నోట్సుకి- సోషలైట్స్ ముసి ముసి నవ్వులకు, ముఖ్యంగా మహానగరాల డేషింగ్ వాతావరణానికి అలవాటు పడ్డ మోడల్ యిలా ఊహించడానికి వీలులేనంతగా తెలుగు ఆచారాన్ని అంత పకడ్బందీగా పాటించ బూనడం అతడికి విస్మయంగానే తోచింది.

తనకున్న అవగాహన మేర ప్రతి వయ్యారపు అడుక్కీ హాహాలు ఓహోలు అట్టహాసంగా అందుకునే మోడల్స్ కి - ఫేజ్- త్రీ గర్ల్స్ కి అవలోకగా కనుబొమల కదలికలతో, దేహభాష సంకేతాలతో ఉక్కిరి బిక్కిరయేలా ప్రకటించడం ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ లో ఒక అంతర్భాగం. అక్కడి పరిసరాలకు తగు రీతిన అతుక్కుపోయే వాంఛనీయ ఆర్భాటం.

కల్పన లోపలకు వచ్చి కూర్చున్న తరువాత అడిగాడతను- “నీతో బాటు మాధురి కూడా రావచ్చని చెప్పిందే వేదనాయకి.. ఆమె కనిపించదేం?”


కల్పన బదులివ్వకుండా తాగడానికి నీళ్ళివ్వమంది.

“నీళ్ళకేం కర్మ? అన్నీ దొరుకుతాయి. చెప్పు. టీ యా లేక కాఫీయా--’

ఆమె నవ్వింది. “లోపల కిచిన్ ఉంది కదూ! ఏదైనా తీసుకురా-- ”

“కిచినేమిటి- చిన్నపాటి ఫ్రిజ్ కూడా ఉంది” అంటూ లోపలకు వెళ్ళి మంచినీళ్ళ గ్లాసుతో బాటు టీ బిస్కట్లతో వచ్చాడు.


ఇద్దరూ యెదురెదురుగా కూర్చుని బిస్కట్లు తింటూ టీ తాగుతున్నప్పుడు బాలనారాయణ మళ్ళీ మాధురి గురించి అడిగాడు. కల్పన యెటో చూస్తూ ఆ ప్రస్తావనకు తావివ్వకుండా యథాలాపంగా అడిగింది- “రెంటెంత యిస్తున్నావు బాలా! ”అని.

రెండువేలని బదులిచ్చా డు.

ఆ మాట విన్నంతనే ఆమె “వావ్!” అంటూ లేచి నిల్చుంది- ”రెండు వేలేనా! ” అంటూ--

అప్పుడతను నవ్వుతూ అన్నాడు- “మరీ ఆశ్చర్యపోకు— ఇది నా క్లోజ్ ఫ్రెండుది. ఆస్టేలియాలో హయ్యర్ పోస్టుకి వెళుతూ నాకిచ్చి వెళ్ళాడు. అసలు నన్ను రెంట్ జమకట్టకన్నాడు- ఒక షరతుపైన. నేనే వాడి క్లోజ్ నెస్ ని మరీ ఉపయోగించు కోకూడదని నెలసరి బాడుగ మొత్తం వాడి అకౌంటులో జమచేస్తున్నాను”


“షరతంటే?” అంటూ ఆమె ప్రశ్నార్థంగా చూసింది.

“మరేం లేదు. నేను గాని యింటివాడినయితే మరొక రూము చూసుకోమన్నాడు. బ్రోకర్ ద్వారా ఇల్లు అమ్మేసు కుంటానన్నాడు”


రెండు చేతుల్నీ జోడించేలా కలుపుకుంటూ అందామె. “రియల్లీ ఎ వెరీ రీజనబుల్ హ్యూమన్. నేనుంటూన్న యిల్లు దాదాపు యింతే ఉంటుంది. ఆఫ్ కోర్స్- మా మేనత్త కూడా ఉంటుంది. బాడుగెంతో తెలుసా! పన్నెండు వేలు. కరోనా లాక్ డౌన్ వ్యవహారాల గురించి ప్రస్తావిస్తే ‘హమ్ కో జాన్తా నై’ అంటాడు యింటి యజమాని. ముక్కు పిండి లాక్కుంటాడు.


అతనితో మా అత్తయ్య ప్రతిసారీ ప్లీడ్ చేస్తూనే ఉంటుంది బాడుగ కాస్తంత తగ్గించమని. ఖాతరు చేస్తే కదా! నేనే కాదు- నా సహ మోడల్స్ కూడా చాలా మంది ఈ బాడుగలివ్వలేక విల విల్లాడిపోతున్నారంటే నమ్ము. కొందరు ఊరు విడిచి వెళ్ళిపోయారు కూడా-- ఇదంతా వినే వేదనాయకి నిన్ను ఓసారి చూసి రమ్మని చెప్పింది”.


అతడప్పుడు కాసేపాగి విషయాన్ని పొడగించనీయకుండా మళ్ళీ మాధురి గురించి అడిగాడు. ఈసారి కల్పన కు తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. ”చెప్పడానికి బాధేస్తుంది బాలా! ఐనా యేదో ఒకనాడు వేదనాయకకి చెప్పే తీరాలిగా! మాధురికి బాయ్ ఫ్రెండంటే పంచ ప్రాణాలు. కాని వాడికంతా వంకర చూపులు. వంకర బుధ్ధులు. ఇద్దరూ కలసి ఒకే పోర్షన్ లో ఉండేవారు. వాడి అచ్చిబుచ్చి మాటల్లో పడి వాడి కోసం నలువైపులా అప్పులు చేసింది. దొరికినంత దండుకుని, వాడు చెప్పిన మాట ప్రకారం వ్యాపారం ఆరంభించ లేదు సరికదా-- దానిని డిచ్ చేసి వెళ్ళిపోయాడు.


ఈ కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థి తుల వల్ల ఉద్యోగమూ పోయి చుట్టూతా తీసిన అప్పులూ యివ్వలేక-- స్త్రీట్ వాకర్ గా(కాల్ గర్ల్ ) మారిపోయి చివరకు ముఖం చెల్లక ముంబాయి వెళ్ళి పోయింది”


అతడు దిగ్భ్రాంతికి లోనవుతూ స్వగతంలా చెప్పసాగాడు. “ఇది గాని వింటే వేదనాయకి అప్సెట్ ఔతుంది. చాలామంది మోడల్స్ జీవితాలు జిగేల్ అని పించే సంపాదనతో పుష్కలంగా నిండు చేపల చెరువులా ఒకప్పు డు కళకళలాడుతూ ఉండేవి కదా! ఐనా మాధురి జీవితం అలా అయిపోయిందంటే నమ్మలేక పోతున్నాను.


ఇక నీవిషయానికి వస్తే పబ్లిసిటీ రంగం అంత ఘోరంగా సొమ్మసిల్లి పోయిందా! అందులో నువ్వు సొగసుగా ఉంటావు కదూ! ”


ఆమె నిస్సారంగా బదులిచ్చింది. “పైన పటారం లోన లొటారం. అంతా సానపు రాయిపైన నడకే—ఎప్పుడెక్కడ జారిపడతామో మాకే తెలియదు. మోడల్స్ కీ, ఫేజ్ త్రీ గార్ల్స్ కీ అన్నీ ఉంటాయి- ఒక్కటి తప్ప--’


అదేమిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు నారాయణ. “నిలకడ! ”అలా బదులిచ్చి కొన్నిక్షణాల వరకూ మౌనంగా ఉండిపోయింది కల్పన.

“అదేంవిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ”


“మరేం లేదు. ఈ కోవిడ్- 19 సృష్టించిన సంక్షోభం వల్ల కొన్ని వాస్తవాలు నీటిపైకి తేలే నలతల్లా ఒక్కొక్కటీ బయటి కొస్తున్నాయి. స్కూలు రోజుల్లో తరచూ వింటుండే దానిని, భార్య అందం భర్తకు శత్రువని. అది పూర్తి నిజం కాదు. ఆడదాని అందం అడదానికే శత్రువు. నేను గాని యింత యెరుపుగా అందంగా ఉండి ఉండకపోతే నేను మోడలింగ్ వృత్తి వేపు మొగ్గే దానిని కాదు కదా! నేను కూడా మీ చెల్లి వేదనాయకిలా ఓ యింటి యిల్లాలనయి పిల్లలకు తల్లినయి కుదురైన జీవితాన్ని గడిపేదానిని కదా! ”


“నోనో! ఇప్పటికిప్పుడు యింతలా నిస్పృహ చెందకు. డీలా పడిపోకు. నువ్వూ నీ సహమోడల్సే కాదు. స్పోర్ట్స్ రంగానికి చెందిన మేమూ అదే పడవలో పయనిస్తున్న ప్రయాణీకులం. నాతో కలసి ఆడిన కొందరు ఆటగాళ్ళు నాతో కోచింగ్ వ్యాపకం యెంచుకు న్న కోచ్ లూ ఈ కరోనా కాటు వల్ల యెంతగా కష్టాల పాలయారంటే వాళ్ళలో కొందరు యింటింటికీ వెళ్ళి కాయగూరలమ్ముతు న్నారు. మరి కొందరు యింటింటికీ వెళ్ళి పాత బట్టలు కొని యింట్లో వాళ్ళ వాళ్ళ తల్లులచే, భార్యలచే కొత్త కుట్లతో మెరుగులు దిద్ది రోడ్డు ఓరన కూర్చుని అమ్ముకుంటున్నారు.


రేపటి నా పరిస్థితి యెలా ఉండబోతున్నదో నాకు సహితం తెలియదు. నేను చేస్తూన్న ప్రయత్నాలు యిప్పటికిప్పుడు ఫలించక పోతే నేను కూడా యేదో ఒక ఉపాధి వెతుక్కోవాలి కదా! ఇప్పుడు నా సంగ తెందుకు గాని, నీ విషయానికి వస్తాను. అక్కడక్కడ యెగ్జిబిషన్లు- షాపు ఓపెనింగులూ రన్ వే షోలూ జరుగుతూనే ఉన్నాయి కదా-- వాటి కోసం ప్రయత్నాలు చేయడం లేదా?”


“ఈ షో బిజినెస్ లో, యెంటర్ టైన్మెంట్ రంగాలలో ఆతిథ్య రంగాలలో కాస్తంత హుందాతనం నిలుపుకోవడం కోసం ప్రాకులాడే మోడల్స్ కి పెద్ద చిక్కుంది. అదేమంటే, వాళ్ళ వాళ్ళ యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అన్నిటికీ సై అనాలి. కనీసం యిష్ట పడ్తున్నట్టు భావన చూపిస్తుండాలి. నువ్వన్నట్టు ఫ్యాషన్ సొసైటీ పూర్తిగా స్తంభించిపోలేదు. అక్కడక్కడ ఈవెంట్సు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.


ఉదాహణకు మునుపులా ర్యాంప్ వాక్ లూ- ఫొటో షూట్ లూ అంతగా లేకపోయినా యిప్పటికీ డిజిటల్ మోడలింగ్ కి అవకాశాలు ఉంటూనే ఉన్నాయి. కాని, టీవీలో ఓ పెద్దమనిషి మాటిమాటికీ అంటుంటాడు కదా- డబ్బులు ఊరికే రావని.

అదే రీతిన అవకాశాలు ఊరకే వెతుక్కుంటు రావు. ఇందులో యిక్కడ కదన రంగంవంటి హాట్ పోటీలు యెక్కువ. ఇదే అదనుగా కొందరు ఆర్గనైజర్లు రెచ్చిపోయి డిమాండ్లు యెక్కువ పెడ్తున్నారు. కొందరు మోడల్స్ ఆ డిమాండ్లను తట్టుకో గలుగుతున్నారు. మరి కొందరు తట్టుకోలేక పోతున్నారు.

అంచేత నామట్టుకు నేను అటు వేపు ప్రయత్నాలు తగ్గించి పుస్తక పఠనంలో పడ్డాను”.

బాలనారాయణ విలంబిత కాలానికి తావివ్వకుండా అడిగాడు- యే డిమాండ్లని.

“నేను ముందే చెప్పాను కదా- హుందాతనం కోసం ప్రాకులాడే మోడల్స్ యిప్పటి బరి తెగించే పోటీలకు తట్టుకోలేరని. అభిమానాలు చంపుకోలేరని. అంచేత—నాకెలాగూ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది కదా! అంతో కొంతో ఆంగ్లంతో బాటు మాటలు రువ్వే చలాకీతనం కూడా ఉంది కదా! రెండు మూడు చోట్ల రిసెప్షన్ పోస్టు కి అప్లయ్ చేసాను.


కరోనాను తలచుకుని మరీ బెంబేలు పడిపోకుండా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బిల్ కలెక్షన్ క్లర్కు పోస్టుకి కూడా అప్లయ్ చేసాను. అక్కణ్ణించి రిస్పాన్స్ త్వరలో రావచ్చు”

బాలనారాయణ కనులెప్పలల్లార్చి చూసాడు. ఆమె చేయి పట్టుకుని లేపి యెదురుగా కూర్చుండబెట్టాడు- “హాస్పిటల్ లో పోస్టింగా! ఇప్పుడు కరోనా క్రిమికి స్థావరాలు వార్ జోన్సూ హాస్పిటల్సే కదా! చాలా రిస్క్ తీసుకుంటున్నావు కల్పనా!”


ఆ మాటకామె పక్కున నవ్వింది. ఆ నవ్వులో దు:ఖపు ధిక్కారం దాగి ఉందని అతడికి తెలుస్తూ ఉంది. “ఇప్పటి గడ్డు పరిస్థితుల్ని అదనుగా తీసుకుంటూన్న కొందరు ఈవెంట్ నిర్వాహకులతో పోల్చి చూస్తే ఈ రిస్కు యేమంత పెద్దది కాదేమో! ”


ఆమాటకతడు కళ్ళు పెద్దవి చేసుకుని కొన్నిక్షణాల వరకూ మౌనంగా ఉండిపోయాడు. ఎట్టకేలకు తలెత్తి చూసాడు- “సరే- ఇప్పుడు విషయానికి తిన్నగా వస్తున్నాను. అంతా కలుపుకుని బాడుగతో సహా నెలకు యెంతవుతుంది? ”


పదిహేను వేలవుతుందని చెప్పిందామె.

“అర్థమైంది. నువ్విప్పుడేమి చేస్తావంటే-- పార్ట్ రెంటల్ సెటల్మెంట్ చేసి పోర్షన్ ఖాళీ చేసి మీ మేనత్తతో యిక్కడకు వచ్చేస్తావు. కొంచెం యిరుకుగా ఉన్నట్లనిపించినా కొన్నాళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించు. ఆ లోపల యిక్కడకు దగ్గరగానే నాకు తెలిసిన ఫ్రెండ్సు సహాయంతో మీకు తగిన పోర్షన్ వెతుకుదాం. నీకు కావలసింది సింగిల్ రూమ్ పోర్షన్ కాబట్టి తప్పకుండా న్యాయమైన రెంటుకి దొరుకుతుంది. ఈజిట్ ఓకే! ”

కల్పన బదులివ్వ కుండా మౌనంగా ఉండిపోయింది. “నావల్ల కూడా రిస్కుంటుందని జంకుతున్నావా!”


ఈమాటకామె గట్టిగా నవ్వింది. “ఛే—ఏం మాటలవి బాలా! నువ్వు నా స్నేహితురాలి అన్నయ్యవు. నాకా పాటి తెలియదూ? మావల్ల నీకు యిబ్బంది కలుగుతుందేమోననే—“

అటువంటిదేమీ లేదంటూనే ఆమెను అటు చూడమన్నాడు. కల్పన అటు తలెత్తి గోడవేపు చూసింది. “ఔను. నాకు తెలుసు- అతను మార్షల్ ఆర్ట్స్ వీరుడు- బ్రుస్ లీ-- ”


అతను అసహనంగా చూసాడు- “నేనడుగుతున్నది అతనెవరని కాదు. అతడి ఫొటో క్రింద యేమి వ్రాసుందని--”


ఈసారామె కళ్ళు విప్పార్చి చూసింది. “నీలోని భయాన్ని జయించడమే నీవిజయానికి తొలిమెట్టు”


కల్పన నోరు మెదపకుండా బ్రుస్లీ ఫొటో వేపు చూస్తూండి పోయింది. ఆమె మొన్ననే పత్రికలో చదివింది- కరోనా వైరస్ కంటే కరోనా తాక బోతుందన్న భయం చేత సంభవిస్తూన్న దుష్పరిణామాలు యెక్కువని. అప్పుడు బాలనారాయణ గొంతు విని తల తిప్పి చూసింది.


“ఇక ఆఖరి అంశంగా నేను చెప్పవలసింది చెప్తాను. నేను ఆశావాదిగానే కాదు- లక్ష్యవాదిగానూ ఉండాలని యిష్టపడతాను. అన్నట్టు—ఈ మధ్య పుస్తకాలు చదవనారంభించావన్నావు. ఏ పుస్తకాలు చదివావు? ”


ఆమె చిన్నగ నవ్వి- “చాలా పుస్తకాలే చదివాను. కాని వాటిలో ఒకే ఒక పుస్తకాన్ని రెండుసార్లు చదివాను. మరొకసారి చదవాలనుకుంటున్నాను“ అందామె.


అప్పుడక్కణ్ణించి లేవబోతూ చటుక్కున ఆగి తిరిగి చూసాడతడు- అదేమిటన్నట్టు.


“రమణ మహర్షివారి ఆత్మ సాక్షాత్కారం”


అది విని అతడు తలూపుతూ లోపలకు సాగిపోయాడు- “కొంచెం ఆగు. ఫ్రెషప్పయి వచ్చి సాగనంపుతాను’ అంటూ--

లోలోపల అనుకున్నాడు- అందుకే కాబోలు కల్పన చెప్తూన్న మాటలు, వ్యక్తం చేసే భావప్రకటనలు వేరుగా ఉన్నాయి! మోడల్స్ చెప్పుకునే మాటల్లా లేవు’ అని.

ఆలస్యం అమృతం విషమవుతుందన్న సూత్రాన్ని పాటిస్తూ కల్పన అదే రోజు మేనత్తను తోడ్కొని సామాను ప్యాక్ చేసుకుని బాలనారాయణ పోర్షన్ కి చేరింది. వాళ్ళరాక విషయమై కబురందుకున్న బిల్డింగ్ సొసైటీ వాళ్ళు వాటర్ చార్జీకి ముప్పై అదనంగా జోడించారు. ఆ పూటంతా సామాను సర్దడంలో మునిగిపోతారు కాబట్టి బాలనారాయణే ముగ్గురికీ హోమ్ డెలివరీ ద్వారా భోజ నాలు యేర్పాటు చేసాడు.


ఆ తరవాత తను కల్పన కోసం చేయబోయే యేర్పాట్ల గురించి ఊళ్ళో ఉన్న చెల్లి వేదనాయకికి ఫోను ద్వారా తెలియచేసాడు. మాధురి భోగట్టా తనకింకా అందలేదని చెప్తూ--


అది విన్న వేదనాయకి సంతోషంతో అంది- “ధేంక్స్ రా అన్నయ్యా! అది ఒంటరిగా ఫీలవుతూ చాలా మెంటల్ టెన్ష్ లో ఉందిరా! వాళ్ళ మేనత్త అనసూయమ్మగారికి కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే—ఆమెకు మొన్నెప్పుడో పక్షవాతం కూడా అటాక్ చేసినట్లుంది. మెడికల్ ఖర్చు బాగానే ఐనట్లుంది. ఆమే దానిని పెంచి పెద్ద చేసింది. నిదానంగానే మంచి పోర్షన్ చూసి వాళ్ళను పంపించు. తొందరేమీ లేదులే! రేపోమాపో మాధురి కనిపిస్తే నాకు చెప్పు. ఇంకా నయం అనసూయమ్మగారికీ కల్పనకీ కరోనా క్రిమి తాకలేదు--’


కల్పన, మేనత్త అనసూయగారితో సహా బాల నారాయణ పోర్షన్ లో దిగి మూడురోజులయింది. ఉదయమే అప్రాన్ తొడుక్కుని కిచెన్ లో పాత్రలు గిన్నెలూ శుభ్రం చేసుకుంటూన్న కల్పనకు హాలులో బాలనారాయణ, అనసూయమ్మల గొంతు వినిపించి ‘ఏం జరుగుతుందక్కడ--’అనుకుంటూ బయటికి వచ్చింది.

అక్కడ పెద్ద కుప్పలా ప్రోగయి ఉన్న కాయగూరల్ని చూసి విస్తుపోతూ అడిగింది- “ఏవిటిది బాలా! ఒకేసారి యిన్ని కాయగూరలెందుకు? కావలసినప్పుడల్లా నేను వెళ్ళి తెచ్చుకోనూ!”


అతడు నవ్వుతూ తల అడ్డంగా ఆడిస్తూ ఆన్నాడు- “తెచ్చుకోలేవు, ఎలా తెచ్చుకుంటావు? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు? ఎడా పెడా అంగళ్ళన్నీ మూసుంటేను. అక్కడే కాదు- ఇక్కడ కూడా లాక్ డౌన్ అమలులో ఉంది. ఇందులో ఉన్నవన్నీ కాయగూరలు కావు. బిస్కట్లూ పాల సంచులు పండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ యెర్ర గడ్డ రైతు బజారు నుండి తెస్తున్నాను.

మందుల దుకాణం మాత్రం తెరిచే ఉంది. అనుసూయమ్మగారికి కావలసిన మందులు యేప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. వాళ్ళ కు చెప్పి వచ్చాను లేదనకుండా యివ్వమని. ఏవైనా స్టాకులో లేకపోతే లేదనకుండా ప్రక్క మెడికల్ షాపు నుండి తెచ్చివ్వమన్నాను. నేను మళ్ళీ వచ్చేంత వరకూ వీటితో సర్దుకుపో”

ఈసారి కల్పన మరింతగా విస్తుపోయింది. ”మమ్మల్ని విడిచి యెక్కడకి వెళ్తున్నావు బాలా?”


అతడు అదే నవ్వుతో దగ్గరకు వచ్చాడు. “ఎక్కడికో వెళ్ళడం లేదు. ఉపాధి వెతుక్కుంటూ వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను ఫుట్ బాల్ ప్లేయర్నే కాదు- జూనియర్లకు కోచ్ ని కూడానని. నాగ్ పూర్ అవతల ఉన్న సబర్బన్ టౌనులో టోర్నమెంట్ ఉంది. సెంట్రల్ ఫార్వార్డుగా అందులో నా ఆటతనాన్ని చూపించి ఆకట్టుకో గలిగితే నేను గోవాలోని రమణ్ లాల్ క్లాత్ మిల్ వాళ్ళ ఫుట్ బాల్ క్లబ్ ప్లేయర్ గా ఫిట్ ఐపోతాను.

దానితో బాటు రెగ్యులర్ జాబ్ లో కుదురుకుంటాను. మరొక రెండు గంటల్లో బయలు దేరుతాను. ప్లేయర్స్ స్పెషల్ వ్యాన్ వస్తుంది. ఆ లోపల మనం శివాలయం వెళ్ళి రావాలి”

‘ఎందుకూ’ అని కళ్ళెత్తి చూసింది.

అప్పుడు అనసూయమ్మ కలుగ చేసుకుంది- “అదేం ప్రశ్నే! గుడి దర్శనానికి కారణం కావాలేంటి? ”


అప్పుడు నారాయణ కలుగ చేసుకున్నాడు- “ఔనండీ! కారణం ఉంది. గుడి ట్రస్టీ వాళ్ళబ్బాయి నాకు తెలుసు. నన్ను రమ్మని పిలిచాడు. పురోహితుల్ని పిలిపించి రుద్రాభిషేకం జరిపిస్తున్నారు. ధన్వంతరి జపం కూడా చేయిపిస్తున్నారు”.

కల్పన అయోమయంగా చూస్తూ మళ్ళీ అడిగింది- ”ఇప్పుడవన్నీ యెందుకంట?”

నారాయణ నిశ్చల స్వరంతో బదులిచ్చాడు. ”కరోనా క్రిమిని పారద్రోలడానికి- కరోనా సాంక్రమిక ప్రభావాన్ని తగ్గించడాని--”

ఆమె అబ్బురంగా చూస్తూ అంది- “ఇది మరీ ఛాదస్తంగా లేదూ- మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నట్టు!’

అనసూయమ్మ ఈసారి మందలింపుగా అంది- “నోర్మూసుకుంటావా కల్పనా! తెలియని విషయాల గురించి ఆరిందానిలా మాట్లాడకు. శివుడికి మరొక పేరుంది- గుర్తుంచుకో— ‘వైద్యనాథుడు’. కాయగూరలు నేను సర్ది పెడ్తాను గాని నువ్వు బయల్దేరు”

మరి మీరూ-- అన్నట్టు ఆమెగారి వేపు చూపు సారించి చూసాడు నారాయణ.

“వీలు పడదు నాయనా! ఇప్పటి పరిస్థతుల్లో మా వయసు వాళ్ళు గుడికి వచ్చి క్యూలో నిల్చోకూడదు. నిల్చోనివ్వరు. అంతెందుకు- మొన్నొక రోజు బ్లూస్టార్ సూపర్ మార్కెట్టుకి వెళితే కల్పనను లోపలకు రానిచ్చి నన్ను షాపు బయట కూర్చోబెట్టారు. నమ్మలేక పోతున్నావు కదూ!’


అతడు కళ్ళు మిటకరించి- “అంతా కరోనా ప్రభావం!” అనుకుంటూ దుస్తులు మార్చుకోవడానికి లోపలకు వెళ్ళా డు.

నాగ్ పూర్ వేపు వెళ్ళిన ఐదు రోజుల తరవాత బాలనారాయణ చిరు చీకట్లు చెదరక ముందే భాగ్యనగరం చేరాడు. వంట గదిలో తపేళాలు కడుగుతూన్న కల్పన డోర్ బెల్ చప్పుడు విన్నంతనే వచ్చి తలుపుతీసింది. తలుపు తీస్తూ అంది- “నువ్వే అయుంటావని ఊహించాను”.


అతడు అదోలా ముఖం పెట్టి చూసాడు. “ఊహించిన మాట సరే—పీపింగ్ హోల్ నుంచి చూసి కదా తెరవాలి! అందరికీ ఉపాధి కొరవడుతూన్న రోజులు- యెప్పుడేమి జరుగుతుందో యెవరు చెప్పొచ్చారు.. ” అని ఎయిర్ బ్యాగ్ క్రింద పెట్టి కుర్చీలో చిన్నపాటి నిట్టూర్పు విడుస్తూ కూర్చున్నాడు బాలనారాయణ.


“ఓకే ఓకే! పాయింట్ వెల్ టేకెన్. ఉండండి- ఫ్రె ష్ గా టీ చేసుంచాను” అంటూ లోపలకు వెళ్ళి బిస్కట్లతో టీ తీసుకు వచ్చి యిచ్చింది. థేంక్సంటూ అతడు బిస్కట్లు తింటూ టీ తాగసాగాడు.


అప్పుడామె వెసులుబాటు చూసి అడిగింది- “వెళ్ళిన కార్యం పండే కదూ! ”

అతడు వెంటనే బదులివ్వలేదు. పెదవులపైకి తెచ్చి పెట్టుకున్న నవ్వుతో టీ తాగడం పూర్తి చేసి అన్నాడు- “సగం కాయ—సగం పండు” అని.

‘అంటే..’ అన్నట్టు చూసిందామె.


ఆ లోపల అనసూయమ్మ కూడా అక్కడకు చేరింది- “వచ్చీ రావడంతోనే అలా తొందర పెట్టేస్తే యెలానే! కొంచెం ఆగి సేద తీర్చుకోనియ్యి”అంది. కల్పన ఊరుకోలేదు. ఆసక్తి ఆపుకోలేదు.


”సగమంటే! ”


“అంటే—సగం మైనస్—సగం ప్లస్ అన్నమాట” కల్పన అర్థం కానట్టు తల అడ్డంగా ఆడిస్తూ అత్తయ్య వేపు చూసింది. “నాకూ అర్థం కాలేదబ్బాయి! ”అందామె.

‘సారీ-’ అంటూ ఖాళీ టీకప్పుని స్టూలుపైన ఉంచుతూ చెప్పాడతను- “మైనస్ అంటే—హోరా హోరీ గా జరగాల్సిన టోర్నమెంట్ ఫైనల్స్ రద్దు చేసారు. కరోనా విజృంభణ వల్ల యిచ్చిన అనుమతిని మ్యున్సిపల్ కార్పొరేషన్ వాఫస్ తీసుకుంది. దాని వల్ల నా ఆటతనం చూపించే అవకాశం లేకుండా పోయింది. రమణ్ లాల్ క్లాత్ మిల్స్ వాళ్ళు యెవరినీ యెంపిక చేయకుండానే గోవా వెళ్ళిపోయారు. దానితో ఉద్యోగ ప్రసక్తే లేకుండా పోయింది”


అప్పుడు కల్పన ఆతృతతో అడిగింది “మరింకేదో ప్లస్ ఉందన్నావుగా బాలా! అదేమిటి?”.


తలూపాడతడు- “చెప్తాను. చెప్పక తప్పుతుందా! నగదు రూపంలో సిధ్ధంగా ఉంచుకున్న ప్రైజ్ మనీని మాకందరకూ సమానంగా పంచిపెట్టేసారు పెద్ద మనసు చేసి-- ”


“ఔను. ఇది ఒక విధంగా చిన్నపాటి ఉపశమనమే! ఇక యిప్పుడేమి చేయదలచుకున్నావు బాలా? ”


“ఇంకేముంది? నలుగురుతో నారాయణే! ”

అంటే- అన్నట్టు మేనత్తా మేనకోడళ్ళిద్దరూ ప్రశ్నార్థంగా చూసారు.


“కచ్చితంగా కాళ్ళు ముడుచుకుని కూర్చోలేను కదా! ఏదో ఒకటి చేయాలి కదా! నా ఫ్రెండ్సు ముగ్గరు హోమ్ డెలివరీ మెస్ నడుపుతున్నారు. నాకిప్పుడు లభ్యమైన రెండు లక్షాలూ వాళ్ళకిచ్చి జూనియర్ పార్టనర్ గా చేర్చుకోమంటాను.


నాకు కిచెన్ వర్కు రాదు కాబట్టి నేనివ్వబోయే ఈ రెండు లక్షలూ చాలకపోవచ్చు. రిస్కున్న విషయమైనా బ్యాంకు నుండి హోమ్ లోనో మరింకేదో తీసి వాళ్ళకివ్వా లి. దానికి సమయం పడ్తుంది. దీనితో బాటు, ఆన్ లైన్ లో యిన్ వైట్ చేసి నామినల్ ఫీజు పైన యిండ్లకు వెళ్ళి ఫిట్ నెస్ క్లాసు లు నడపాలనుకుంటున్నాను”.


అప్పుడు కల్పన కలుగ చేసుకుంది- “దీని సంగతి తరవాత చూద్దాం. నిన్ను ఫుల్ పార్టనర్ గా హోమ్ డెలివరీ వెంచర్ లో చేర్చుకోవడానికి ఇంకెంత కావాలి?”


“కనీసం మరొక మూడు నాలుగు లక్షలివ్వాలేమో—“


ఆమె వెంటనే బదులిచ్చింది. “ఆ మూడు లక్షలూ నేనిస్తాను. నా బ్యాంక్ అకౌంటులో ఉంది. అంతే కాదు- నాకు వంట కూడా బాగా తెలుసు. నీ తరపున యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలను”.


బాలనారాయణ ఆమె ముఖంలోకి తేరిపార చూస్తూ మౌనం వహించాడు.


“అదేమిటి అలా ఉండిపోయావు? నేను మూడు లక్షలూ యివ్వ లేననుకుంటున్నావా! కావాలంటే ఇంకా కొంత యివ్వగలను మా అత్తయ్య నగలు కుదువ పెట్టి--”


“మేటర్ అది కాదు కల్పనా! నీనుండి డబ్బులు తీసుకున్నానని తెలిస్తే వేదనాయకి బాధ పడ్తుంది. నేను దిగజారిపోయానని అప్సెట్ ఔతుంది”.


దానికామె తటాలున స్పందించింది. “ఇందులో దానికేమి పోతుంది బాలా? దానితో నాకున్న స్నేహం వేరు. నీతో నాకున్న అనుబంధం వేరు. నీ కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి నేనేదైనా చేస్తాను. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు. మరొక మాట. చివరి మాట. ఇకపైన నేను మీతో ఉన్నన్నాళ్ళూ మీరెప్పుడూ యెక్కడా ఒంటరిగా ఫీలవ కూడదు. మీరున్న చోట నేనుంటాను. నేనున్న చోటే మీరుంటారు. ఇది చాలా- ఇంకా చెప్పాలా! ”ఉద్వేగ తరంగాలను ఆపుకోకుండా ఆవేశ పూరితంగా గోదావరి వరద ప్రవాహంలాగ మాట్లాడుతూన్న మేనగోడలి వేపు అనసూయమ్మ ఆశ్చర్యంగా చూస్తూ తలను కిటికీ గుండా బైటకు సారించింది. కొత్త పొద్దు పొడుస్తూంది!


ప్రణయరాగంలో జ్వలించి తపించే యిద్దరి మనోయవ్వన హృదయాల మధ్య సాక్షిగా, మౌన సాక్షిగా నిల్చుంది అనసూ యమ్మ. చల్లని మల్లెలు పరిమళిస్తూన్న ప్రశాంత సమయమది. వసంతకాల పారిజాతాల్లా రెండు నిండు మనసులు పరవశమై పుష్పించే పసందైన మనోరాగమది. మాటకందని అనంత మౌనమది. . .


* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


39 views0 comments

Comentários


bottom of page