top of page

బుల్లెట్ ప్రూఫ్

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






ఈ కథను యూ ట్యూబ్ లో వినండి/వీక్షించండి


'Bullet Proof' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

వసుమతి ధనవంతుల అమ్మాయి కాదు.

పెద్దగా చదువుకోలేదు.

కానీ తనను వేధించేవారిని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉంది.

స్త్రీ శక్తిని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

వసుమతి వెంకటేశ్ ఇద్దరూ చిన్ననాటి నేస్తాలు కారు. ఆమాటకొస్తే స్కూలు మేట్సూ కారు. మరైతే చిరకాల యిరుగు పొరుగునున్న పరిచయస్థులేమో అనుకుంటే- అదీ కాదు. పరిచయాలు అప్పుడప్పుడు పన్నీటి చిలకరింపులా పరిమళిస్తాయన్నట్టు ఒకసారి ఎర్రగడ్డ రైతుబజారులో యధాలాపంగా ఒకరికొకరు ఎదురయారు. అప్పుడేమయిందంటే— ఎలాగయిందంటే- వసుమతి కొనుక్కున్న కాయగూరలతో బరువుగా బిగుతుగా తయారయిన సంచీ నుండి కొన్నవన్నీ ఒరిగి చాలా కాయలు నేల పైన దొర్లుకుంటూ చెల్లా చెదిరయాయి.

అప్పుడు వెంకటేశ్ తన చేతిలోని సంచీని ప్రక్కన పెట్టి వసుమతి వద్దకు పరుగెత్తుకు వచ్చి చెల్లాచెదురైన బెండకాయల్ని క్యారెట్లనూ గుత్తి వంకాయల్నీ ఆదరాబాదరాగా ఏరి ఆమె సంచీలోకి కుక్కి అదే హడావిడి నడకతో అతలకి వెళ్లిపోయాడు;కనీసం తన వేపు తిరిగి కూడా చూడకుండా- ఈ రోజుల్లో- అందునా ఇప్పటి కాలపు రోమియోలు తనవంటి కుర్రవయసు దానితో జతకలిసే అవకాశాన్నిఅంత తేలిగ్గా వదులుకుంటారా! కన్ను గీయడమన్నది లేకపోయె- అదను చూసి పదునుగా మాట్లాడి జీతభత్యం లేని బాడీ గార్డులా వెంటబడరూ! నడచి వెళుతూన్న వెంకటేశాన్ని చూసి వసుమతి నిజంగానే అబ్బురపడిపోయి అక్కడికక్కడు నిల్చుండి పోయింది. ఆ తరువాత మరికొన్ని కాయగూరల బేరసారాలలో పడిపోయి పనిరద్దీలో ఉంటూనే అతడి గురించి నాలుగైదు సార్లు తలపోసింది. మంచీ మన్ననలో అంతటి ఉదాత్తత ఉంటుందా!

నాల్గవ రోజు మళ్లీ అదే మార్కెట్ యార్డులో ఒకరికొకరు ఎదురయారు యాదృచ్చికంగా- వెంకటేశం అటు కాయగూరల ధరల గురించి బేర మాట్లాడుతున్నప్పుడు- వసుమతి కూడా అటు వెళ్లి నవ్వు ముఖంతో అంది- “హాయ్! ఆ రోజు మీకు ధేంక్స్ చెప్పడం మరచిపోయాను- ఇప్పుడు చెప్తున్నాను- థేంక్స్”.

అతడు నివ్వెరపాటుతో చూసి- “థేంక్స్ ఎందుకు మేడమ్?”అని అడి గాడు.

దానికామె మళ్లీ అదే చిర్నవ్వుతో అంది- “మొన్న మొన్న జరిగింది అంత త్వరగా మరచిపోతారా! ఆరోజు నా సంచీ నుండి కాయగూరలు చెల్లా చెదురయి క్రింద పడిపోతే నాకు సహాయం చేసి వెళ్లారే- దాని గురుంచి- “

ఆ మాటకు అతను పక్కున నవ్వే సాడు- “అంత చిన్నదానికి ఇంతటి పెద్ద థేంక్సా! ఎనీ హౌ- యు ఆర్ వెల్ కమ్- నా పేరు వెంకటేశ్వరరావు. మీ పేరు తెలుసు కోవచ్చా?”.

వసుమతి అదే విధంగా స్నేహపూర్వకంగా బదులిచ్చింది- “నాపేరు వసుమతి- మీరేం చేస్తున్నారు?”

“ బి టెక్ చేస్తున్నాను. మరి మీరేక్కడ చదువుతున్నారు?”

“నేను చదువుకోవడం లేదు. మందనా సిస్టర్స్ క్లాత్ షాపులో పని చేస్తున్నాను” .

అలాగా- అన్నట్టు తలుపుతూ అడిగాడు“ అది నగరంలో పెద్ద క్లాత్ షాపు కదూ! ”అని.

ఉఁ- అందామె.

ఆ తరవాత ఇద్దరూ కలసి మాట్లాడుకుంటూనే మార్కెట్ యార్డులో ఉన్న బంకులో టీ తాగారు. ఎక్కడైతేనేం- ఎప్పుడైతేనేమి- కప్పు టీ ఇద్దరి చెలిమికి బంధం వేయదూ! టీ లోని ఫ్లేవర్ అటువంటిది మరి. ఆ విధంగా ఆరంభమైంది వాళ్ల పరిచయం. ఆ తరవాత అది క్రమ క్రమంగా పరస్పరాకర్షణగా మారింది. ఇద్దరూ మానసికంగా ఒకరికొకరు దగ్గరయిన తరవాత తెరపిగా తెలుసుకుందామె వెంకటేశ్ కుటుంబం గురించి-

తెలుసుకుని పెను నిట్టూర్పు విడిచింది- తనలో మొలకెత్తే ఆశల్లో ఒక్కటి కూడా ఇప్పటికిప్పుడు చిగురుంచదేమో- ఒక్క మధురోహ కూడా సరైన రీతిన పరిపూర్ణత సంతరించుకోదేమో! స్కూలు రోజుల్నించీ తనను అందరూ సొగసుగత్తె అనేవారు. ఆ మాటకు వస్తే తనకు మాత్రం తెలవదా- తనలో కమలంలా విచ్చుకున్న యవ్వన శోభ యెలా అలరారుతుందో! మరైతే, ఈ అందం తనకే మాత్రమూ ఆసరా ఇచ్చేటట్టు లేదు. తన అంచనా ప్రకారం తనకంతగా చదవబ్బ లేదు. మంచి సంబంధాలు కుదరలేదు. తీరా ఇప్పడు చూస్తే- వెంకటేశానికి ఒకరిద్దరు కాదు—మొత్తం ముగ్గురు తోబుట్టువులు- పెళ్ళీడుకొస్తూన్న ఇద్దరు చెల్ళెళ్లు మరొకు వేపు అంగవైకల్యం గల తమ్ముడూను—మొత్తానికి అతనికున్నది అరబ్బు యెడారి గుడార మంతటి కొంపన్న మాట! అందులోకి తను తీరిగ్గా చురుగ్గా తోసుకుని దూరాలన్నమాట! ఐతే- ఇప్పుడాలోచించి ప్రయోజనం లేదని ఆమెకు తెలుస్తూనే ఉంది. ఇచ్చిన మనసుని వెనక్కి లాక్కోవడమంటే యిచ్చిన చిల్లర అప్పును తిరిగి తీసుకోవడమంత తేలికా! అదీను తనవంటి సున్నితమైన బేలమనసు గల స్త్రీ విషయంలో- మొత్తానికి వసుమతి చాలా దూరం వచ్చేసింది తిరిగి చూడలేనంతగా, మరొకమారు ఆలోచించలేనంతగా-

ఒకరోజు ఇంటి వసారాలో కూర్చుని మ్యాథమేటిక్స్ మోడర్న్ ధియారీని అధ్యయనం చేస్తున్నాడు వెంకటెశ్. అప్పుడు మూడో ఇండ్ల వరసలో ఉంటూన్న కుర్రాడొకడు వచ్చి- “ఒరేయ్ అన్నయ్యా?నీకోసం ఎవరో ప్రెండు అక్కడ వేయిట్ చేస్తున్నట్టున్నారు. త్వరగా వెళ్లిరా! ”అన్నాడు.

ఎవరా ఫ్రెండ్ అని అడిగేలోపల వాడు తుర్రుమన్నాడు .

’ఫ్రెండయితే సరా సరి ఇంటికి కదూ రావాలి ! ’- అనుకుంటూ త్వరత్వరగా షర్టు వేసుకుని చెప్పులు తొడుక్కని వీధి కొనకు చేరాడు. అక్కడ వసుమతి అతడి కోసం ఎదురు చూస్తూ నిల్చుంది! ”అదేంవిటి ఇలా ఒంటరిగా ఇక్కడ నిల్చున్నావు?ఇది వీధి రోమియోల అడ్డా- ఫోను చేస్తే నేను వచ్చి కలు సుకోనూ- ” .

ఆమె నవ్వుల చిలకరింపుతో బదులిచ్చింది- “అలాగే అనుకున్నాను వెంకటేశా! కాని దారిలో చూసుకుంటే తెలి సింది సెల్ లో చార్జింగ్ ఐపోయిందని. అదంతా ఇప్పుడెందుకులే గాని—నేనిప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్నాను. నీతో కలసి ఉడిపి హోటల్ లో మసాలో దోశె తినాలనిపించింది. అందుకే రెక్కలు కట్టుకుని వాలాను. ఇక మాటలెందుకు గాని- బయల్దేరు”.

ఆ మాట విన్నంతనే అతడికి దిగ్గుమనిపించింది. షర్టు జేబులో కి చూస్కున్నాడు. ఐదు రూపాయల నోటు మాత్రమే ఒకటి నిక్కి నిక్కి చూస్తూంది. “అది కాదు వసూ- మిస్టర్ యాదగిరి బాబున్నాడే—లెక్కల్లో మహా గడసరి. కాసుల్ని చూసి చూసి లెక్కించి ఇస్తాడు. పెద్ద కొడుకునన్న ధ్యాసే లేదాయనకు. ప్యాకెట్టు మనీ ఊసెత్తితే చాలు ఉలిక్కిపడతాడు. కొంచెం ఆగు- ఇంట్లో ఎక్కడైనా దొరకుతుందేమోనని చూస్తాను- అమ్మ దగ్గర తప్పకుండా ఉంటుందిలే- ” అంటూ వెనక్కి తిరగబోయాడు. అప్పుడు వసుమతి అతడి చేయి పట్టుకుని ఆపింది. “ఒక మసాలా దోశె కోసం మీ అమ్మను పోపు డబ్బాలన్నీ వెతికేటట్టు చేస్తావా?నాకు మాత్రం తెలవదా నీకింకా చదువు పూర్తవలేదని—ఉద్యోగంలో ఇంకా కుదరలేదని. ఇక దీనికి జవాబివ్వండి- నా ఖర్చుతో తీసు కుంటే నామోషీగా ఉంటుందా! ” అతడు నోరు మెదపకుండా తేరిపార చూస్తూండిపోయాడు.

దానికామె స్పందించింది- “నాకు తెలుసు నువ్వు ఇబ్బందిగా ఫీలవుతున్నావని- కాని ఇది ముందు తెలుసుకోండి- రేపు నన్నూ నా కడపున పుట్టబోయే పిల్ల ల్నీ మీరే సాకాలి. అందరి బరువూ మీరొక్కరే మోయాలి. దానితో పోల్చితే ఇదేమీ కానేకాదు. ఇక మరొకటి- రేపు మనం ఒక్కట య్యామంటే నా సంపాదనంతా నీ చేతిలోకే వస్తుంది అప్పడు మాత్రం కాదంటావా! ”.

అతడిక మాట్లాడకుండా ముందుకి కదిలాడు. అప్పుడామె నడుస్తూనే అడిగింది- “ఇంతకూ నేనెందుకు పనిగట్టుకుని ఇంత దూరం వచ్చి మీకు మసాలా దోశె ఇప్పిస్తున్నానో అడిగారా?”

తల అడ్డంగా ఆడించాడు వెంకటెశం. “ఇప్పుడు వినండి దొరబాబుగారూ! నాకు మొదటి జీతం వచ్చిన ప్పుడు మా అమ్మానాన్నలకు కొత్త బట్టలు తెచ్చాను. ఇప్పుడు నాకు మొదటి బోనస్ వచ్చింది. మీకు అల్పాహార విందు ఇప్పిస్తున్నాను. అర్థమైందా?”.

అతడు నవ్వుతూనే”కంగ్రాట్స్“ అన్నాడు.

వసుమతి నవ్వి అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతడికప్పుడు వెండి మబ్బులోకి దూసుకు వెళ్ళినట్లని పించింది.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

మందనా షాపు హాలంతా కస్టమర్లతో కిటకిటలాడుతూంది. వసుమతి చెదరని చిర్నవ్వుతో ఖరీదైన ఇద్దరు లేడీ కస్టమర్లకు రెండు డిజైనర్ సల్వార్ కమీజులు- మరొక రెండు కట్ ఔట్ గౌన్లు- ఇంకా రెండు వెంకటగిరి చీరలు మడతలు విప్పి చూపిస్తూంది- వాటి ధర వివరాలతో బాటు. వాటి క్వాలిటీ గురించి కూడా మధ్య మధ్యన చెప్తూంది నమ్మకం కలిగించేలా- అప్పుడు పిలుపొచ్చింది లోపలనుండి తనను రమ్మంటూ- ఆమెకు తెలియకుండానే ఆమె ముఖం ముకుళించుకుంది. ఆరోజు భూమారావు తనను గదిలోకి పిలవడం అది మూడోసారేమో! భూమారావు మరెవ్వరో కాదు- బాస్ బామ్మర్ది-

“ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి“అన్నట్టు బాస్ కంటే హద్దు మీరి అజమాయిషి చూపించే వ్యక్తి. అతడు తననే కాదు - తనవంటి టీనేజ్ సేల్స్ గార్ల్స్లనూ- ఫ్రంటాఫీసు లేడీ సిబ్బందినీ అతడలాగే అవసరం ఉన్నా లేకపోయినా పొద్దెరగని కొత్త బిచ్చగాడిలా గదికి పిలుస్తుంటాడు. పిలిచి లేని పోని క్వరీలు లేవదీస్తూ చికాకు తెప్పిస్తుంటాడు;అమ్మాయిల ఒంపుసొంపుల్ని నలుదిసలా పరీక్షిస్తూ- ఆ విషయంలో అతడికదొక విధమైన యావ. కొందరు స్త్రీలు అతగాడి జబర్దస్తీని తట్టుకోలేక చిరుత ముందు నిస్సహాయంగా తల వంచే అడవి గొర్రెల్లా లొంగిపోయారు కూడాను. అటువంటివన్నీ ఈకాలపు సామాజిక ఆర్థిక రంగం లో ప్రొఫెషనల్ హజార్డ్స్ అనుకుంటారు గాని- అది తామరాకుల వంటి మనస్తత్వం గల స్త్రీల జీవితాలపైన ఎంతటి సంక్షోభిత ప్రభావం చూపిస్తుందో కొందరు ఊహించలేరు. ఆమె ఆలోచించడం మాని, ప్రక్క బ్లాక్ లోని సుందరిని పిలిచి తన ముందున్న కస్టమర్లను గమనించమని పురమాయించి ఆఫీసు చేంబర్ వేపు నడిచింది. “గుడ్ మోర్నింగ్ సార్! ”

“గుడ్ మోర్నింగే గాని—నీ ముఖానే ఇంకా శుభోదయం కనిపించడం లేదు వసుమతీ! ” భూమారావు మాటలు అర్థం కాక నివ్వెరపాటుతో చూసిందామె. “నేను చెప్పేది ఇంకా అర్థం కాలేదా! నువ్వింకా సేల్స్ గార్ల్ కి ఉండాల్సిన సుభిక్షమైన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనిపించడం లేదంటున్నాను వసుమతీ! ”

“నాకు నిజంగానే కన్ఫ్యూ జింగ్ గా ఉంది సార్. ఏ సుభిక్షమైన లక్షణాలు నాలో కొరవడ్డాయో చెప్తే నేను నేర్చుకుంటాను సార్”

“అదీ- ఇప్పుడు లైన్ లోకి వస్తున్నావు. ఎన్ని సార్లు చెప్పాను—ఎంతటి రద్దీ సమయంలో కూడా ఎన్నో మైళ్ల దూరం నుండి మనల్ని వెతుక్కుంటూ వస్తూన్న కస్టమర్లతో చెదరని నవ్వు ముఖంతో మాట్లాడాలని- ముఖాన్న అలా చిరాకు ఉంచుకుంటే మన షాపు ఇమేజ్ ఎంతగా దెబ్బతింటుందో తెలుసా! ” వసుమతి ఖంగుతింది. తను చికాకుతో ముఖం పెట్టుకుని మాట్లాడిందా! “నేనెక్కడ సార్ ముఖం మాడ్చుకుని—“ అని ఇంకేదో ఆనబోయి చప్పున ఆగిపోయిందామె. గొర్రెపిల్ల వల్ల కాకపోతే- గొర్రెపిల్ల తల్లి వల్ల వాగు నీళ్ళు పాడయిపోయాయన్న నెపంతో నిందించిన తోడేలు తతంగమే ఇదంతా- తను ఎంతగా చెప్పినా ఎంతగా గొంతెత్తి చించుకున్నా అదంతా వృధా ప్రయాసగానే మిగిలిపోతుంది. అప్పుడు పోకడ మారుస్తూ వల్లమాలిన సానుభూతి చూపిస్తూ- “అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని—బిజినెస్ కూడా రద్దీగా ఉన్నట్లుంది. ఒకసారి ఇలా వచ్చి నా పేనా మూత ఇక్కడెక్కడో పడిపోయినట్లుంది. తీసిస్తావూ- “ఆమె మాట్లాడుకుండా అతడు కూర్చున్న సీటు వేపు కదలింది. అతడలా ఒక రోజుకి ఎన్ని సార్లు పేనామూతల్ని పడేసుకుంటాడో—వాటిని వెతికి ఇవ్వడానికి ఎంతమంది సేల్స్ గార్ల్సుని పిలుస్తుంటాడో- పాపం! ఆమె వంగి అక్కడే పడి ఉన్న మూతను అందుకోవడానికి వంగింది. అప్పుడతని చూపు పడరాని చోట పడింది. అది గమనించిన వసుమతికి ఒడలంతా జెర్రులు ప్రాకినట్లనిపించింది. ఐనా పంటి బిగువున అసహనాన్ని అణచుకుంటూ- తనది తుమ్మి తే ఊడిపోయే ప్రైవేటు ఉద్యోగమని తలచుకుంటూ అడిగింది- “ఇంకేమైనా చూడాలా- సారీ- చెప్పాలా సార్! ”

అప్పుడతను వెకిలిగా నవ్వుతూ అన్నాడు- “ఇక చెప్పడానికింకేముంది? అంతా నువ్వే చెప్పేసావుగా! ” ఆమె మాట్లాడకుండా వెనుదిరిగింది. కన్నీటి పర్యంతమవుతూ- ఆపైన తన సేల్స్ బ్లాకుకి వెళ్ల లేదు. తిన్నగా రియర్ రూముకి వెళ్లి టీ తెచ్చుకుని కూర్చుని ఆలోచనల్లో పడిపోయింది. తను పెద్ద మనిషయిన దగ్గర్నుంచీ ఎన్నెన్ని రంగుల కలలు కంది- తనకు మంచి జతగాడితో పెళ్ళయి పోతుందని- రెండు చంకలా ఇద్దరు పుత్తడి బొమ్మల్లాంటి బిడ్డల్ని ఎత్తుకుంటూ కొప్పునిండా కనకాంబరాలు తురుముకుంటూ అమ్మలా పెద్దమ్మలా తాళం చెవుల గుత్తిని చీర చెంగున దోపుకుంటూ ఇరుగు పొరుగు పేరంటాలకు వెళ్లి వస్తుంటుందని- అన్నీ కల్లలుగానే మిగిలిపోతున్నాయేమో- . వెంకటేశం చదువెప్పుడు ముగుస్తుందని—ఇంకెప్పుడతనికి ఉద్యోగం దొరుకుతుం దని—తామెప్పుడు పెళ్లి పీటల పైన జతగా కూర్చుంటారని! ఆ కీచక భూమారావు ఈ రోజు తన టాప్ వేపు తొంగి చూసాడు గాని- ఒక రోజు ఏకంగా ఏదో నెపంతో హాఠాత్తుగా ఎదురు వచ్చి కని పించీ కనిపించన విధంగా తాకుతూ పోయాడు కూడాను- అదేదో యాక్సిడెంటుగా జరిగినట్టు—ఇదంతా ఎవరితో చెప్పుకునేది? చెప్పుకుంటే మాత్రం ఏమవుతుందని—అల్లనల్లన ఉద్యోగం ఊడుతుంది. ఇంటి వెచ్చాలకు గండి పడ్తుంది.

ఆమె అలా ఆలోచిస్తూ చల్లబడిపోయిన టీని అలానే ఉంచి తన సేల్స్ బ్లాకుకి వెడలిపోయింది. చీకటి రేఖ వెనుక వెలుగు కిరణమన్నట్టు ఆరోజు సాయంత్రం ఏడుగంటలకు తన డ్యూటీ అవర్స్ ముగించి బైటకు వచ్చే టప్పటికి వెంకటేశం ఎదురు వచ్చాడు. ఆనందోద్వేగంతో ఉక్కిరి బిక్కిరవుతూ జన సందడున్న సమయమన్న సంగతి కూడా మరచి అతడి రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుంది. స్త్రీలోని సహజ ఆశ్రిత గుణం అలానే అప్పుడప్పుడు బయట పడుతుం దేమో!

“ఏంవిటీరోజు చాలా ఫీల్ తో ఉన్నట్టున్నావు?“అంటే- అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసిందామె. “ఎందుకో ఎమోషనల్ గా కనిపిస్తున్నావు. కోపం కలిగుండాలి లేదా మిక్కిలి సంతోషం కలిగుండాలి”

“అబ్బే- మరేమీ లేదు వెంకట్. నిన్ను చూసిన వెంటనే ఏదో చెప్పుకోలేనంత ఆనందం. ఆడదానిని కదా- దేనినీ అంత త్వరగా ఆపుకోలేను- ఔను గాని- ఇప్పుడు మనమిద్దరమూ రేణుకమ్మ గుడికి వెళ్దాం. ఓ కే! ”

“వైనాట్?కాని నేనెందుకు నీకోసం వచ్చానో ఇంతవరకూ అడగనే లేదు”

“ఇదేమి ప్రశ్న వెంకట్?గార్ల్ ఫ్రెండుని చూడ్డానికి కారణం ఉండాలా ఏమిటి! ”

“ఇప్పుడు కారణం ఉంది. చెప్పేదా?”.

ఉఁ- అందామె;అతడి చేతిని విడవకుండానే మెల్లగ నడుస్తూ

చెప్పమన్నట్టు తలూపింది.

“నేను సబ్మిట్ చేసిన ప్రైమరీ ప్రోజెక్టు రిపోర్టుకి ఎక్సెలెంట్ ప్రశంసా పత్రం వచ్చింది! ”.

ఆమాట విన్నంతనే ఆమె సంతోషంతో అర చినంత పనిచేసింది- “కంగ్రాట్స్! మై- హార్టీ కంగ్రాట్స్! ”

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ గుడి ఆవరణలోకి ప్రవేశించారు.

ఇద్దరూ దైవ దర్శనం చేసుకుని గుడి ప్రాంగణాన కాసేపు కూర్చున్న తరవాత వెలుపలకు వచ్చారు. అలా ఇద్దరూ చేతులు పెనవేసుకుని సాగిన తరవాత- “ఎందుకూ అని అడక్కుండా ఓసారి నాతో ఇలా వస్తావా వెంక టేశ్! ” అంటూ జెంట్స్ క్లాత్ షాపు వేపు నడించింది వసుమతి.

అప్పుడామెను ఆపాడతను- “కారణం చెప్తేనే వస్తాను“అంటూ-

అప్పుడామె ఆగి అడిగింది- “అంటే- నన్ను నమ్మి కారణం చెప్పకపోతే తమరు రారన్నమాట! సరే- చెప్తాను మహాశయా! నీకు మ్యాచ్ అయే మంచి షర్ట్ కొనివ్వాలనుకుంటున్నాను. మరిప్పుడు వస్తారా?” .

అతడు తల గట్టిగా విదిలించాడు వద్దంటూ-

“అంటే- నావద్ద గిఫ్టు తీసుకుంటే నామోషీగా ఉంటుందన్నమాట! అంతేకదూ! ”

“కాదు- కానే కాదు. దీనికీ ఒక కారణం ఉంది. మిస్టర్ యాదగిరి బాబుగారున్నారే—చాలా లెక్కల మనిషి. ఆయనకు అప్పులు చేయడమంటే ససేమిరా పడదు. మా తమ్ముడి వైద్యం విషయంలోనూ- మా చెల్లెళ్ళిదరి చదువుల విషయంలోనూ ఏవో ఖర్చు లు ఎక్కువే ఐనట్టున్నాయి ఈ మధ్య- కాబట్టి రాబోయే దశరాలకు ఎవరికీ కొత్త బట్టలు కొనిచ్చేది లేదని ఖరాకండీగా తేల్చేసా రాయన. ఇప్పుడు గాని నేనొక్కణ్ణే కొత్త షర్టు వేసుకుంటే బాగుంటుందా చెప్పు?” నిశ్శబ్దంగా ఉండిపోయిందామె.

తన ప్రియురా లు నొచ్చుకుందని గ్రహించాడతను. “ఇంత చిన్నదానికి నొచ్చుకుంటే ఎలా వసూ?ఐనా- నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు గాని- నాకు నిజంగా నువ్వే పెద్ద అమూల్యమైన బహుమతివి. ఇప్పుడదంతా ఎందుకుగాని- నాకు యమ ఆకలిగా ఉంది. రెండు మసాలా దోశెల్నిఏకబిగిన తినేసేటంత ఆకలిగా ఉంది. ఉడుపి హోటెల్ కి వెళ్దామా! ” ఆ మాటతో ఆమె ముఖార విందాన నవ్వు పుష్పించింది.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ఇప్పుడు వసుమతి పరిస్థితి పులిపైన పుట్రలా తయారయింది. ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం జోరుగా వెతుకుతున్నారు. దానిని కాదనలేని సందిగ్ధావస్థ. ఏ కారణం చెప్పి పెండ్లిప్పుడు వద్దని అడ్డగించాలో తెలియడం లేదు. వెంకటేశ్వర రావుకేం- మగ మహారాజు. ఎంత కాలమైనా దివ్య ధీమాగా కాలం వెళ్ళదీయగలడు. మరి తను- కనీసం చదువు సాగిస్తూ డిగ్రీ చేతికింకా అంద లేదన్న నెపంతో మరొక రెండేళ్లు లాగదీయవచ్చు. కాని తన పరిస్థితి అలా కాదుగా! పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి ఒక యేడాది దాటిందంటే ఒక గుదిబండ పైన పడ్డట్టు- తనపైనే కాదు- యింట్లోఅందరిపైనాను. ఇక క్లాత్ షాపులోని ఉద్యోగం విషయానికి వస్తే- మునుపులా చురుగ్గా ఫ్రెష్ ఫీల్ తో పనిచేయ లేక పోతూంది. మరి అదంతా తన విషయంలోనేమో—తతిమ్మా వారందరూ మామూలు గానే సర్దుకు పోతున్నారు. ఈ కాలంలో పుట్టిన తను నిజంగానే ఈ కాలపు పోకడలతో సర్దుకుపోలేక పోతుందేమో! పరిస్థితులతో సర్దుకు పోలేక పోవడం ఒకరకమైన అవలక్షణమే కదా! అపరిపక్వతేనేమో-

వసుమతి ఎట్టకేలకు పరి పరి విధాల ఆలోచించిన పిదవ ఒక నిర్ణయానికి వచ్చింది. బలమైన నిర్ణయానికి వచ్చింది. ఆరోజు శుక్రవారం. తల్లీ కూతుళ్లు నోచిన నోముకి అది ఆఖరు రోజు. తలంటు స్నానం చేసి తల్లీ కూతురు ఇద్దరూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అప్పుడు ఖంగున డోర్ బెల్ మోగింది. చెక్కు చెదరని మనసుతో తులసికోట చుట్టూ ప్రదక్షి ణలు ముగించి ఆ తరవాత నడచి వచ్చి తలుపు తీసింది వసుమతి. ఆ వచ్చిన వ్యక్తిని చూసి అదరిపోయినట్టు రెండడుగులు వెనక్కి వేసింది. వేస్తూనే అడిగింది- “మా ఇల్లెలా కనుక్కున్నావు వెంకట్! ”

“మనసుంటే మార్గం ఉంటుంది. అది సరేగాని—ఏంవిటి అకస్మాత్తుగా ఇలా చేసావు?ఫోను పూర్తిగా ఆఫ్ చేసుంచావు. మూడు రో జులుగా మీ షాపు చుట్టూ జోలె పట్టుకున్న బైరాగిలా తిరుగుతున్నాను. అక్కడ కూడా కనిపించలేదు. వాటీజ్ ది మేటర్?”

”విషయం ఉంది. ప్రోబ్లమ్ ఉంది. చెప్తాను ముందు వచ్చి కూర్చో! ”

“నేను కూర్చోనంటే కూర్చోను. ముందు విషయం చెప్పు“

“గట్టిగా మాట్లాడకు వెంకటేశ్. అమ్మ వస్తూంది. ఏమైనా అనుకుంటుంది. ప్లీజ్! వచ్చి కూర్చో! ”అప్పుడతను బదులివ్వకుండా వచ్చి కూర్చున్నాడు. ఆ లోపల భాగ్యమ్మ వచ్చి- “ఎవరే ఈ అబ్బాయి?”అని అడిగింది- వెంకటేశ్ నమస్కారాన్ని స్వీకరిస్తూనే.

“ఒక రోజు చెప్పాను కదమ్మా- వేంకటేశ్వరరావని. అతను ఇతనే—“

“ఔను కదూ! చెప్పినట్టు గుర్తు. ఉండు నాయనా—ముందు మంచినీళ్లు తీసుకో- తరవాత టీ తీసుకుందువు గాని- ”అని లోప లకు వెళ్లింది. భాగ్యమ్మ కనబరచిన పెద్దరికం హుందూతనం అతడికి నచ్చాయి. ఆమె అటు వెళ్లడం చూసి ఇటు తిరిగాడు.

“ఏంవిటీ రాధ్ధాంతం?కనిపించకుండా మాయమవడం జోక్ అనుకుంటున్నావా?దేనినైనా గిల్లు, గుండెను మాత్రం గిల్లకు. నీకోసం ఎదురు చూస్తుంటానని తెలియదా?”

“ఆవేశ పడకు. కారణం ఉంది. నేను ఉద్యోగం మానేసాను. మామూలుగా కాదు. గొడవ పడి మానేసాను. ఒక మగ మృగానికి బుధ్ది చెప్పి మరీ జాబ్ ఎగ్గొట్టాను”అంటూ షాపులో జరుగుతూన్న తతంగాన్ని వివరించి చెప్పింది.

అంతా విన్న వెంకటేశ్ అడిగాడు- “మరి ఆ భూమారావు మాయల ఫకీరులా ఉన్నాడు. వాడు ఊరుకోడుగా- వాడు నిన్ను తప్పనిసరిగా వెన్నంటుతాడు. హరాస్ చేస్తాడు. అప్పుడేం చేస్తావు?”

“నాకు నువ్వున్నావుగా- అందుకే తెగించాను” అని నవ్వింది వసుమతి.

“నేనున్నానుకో—కాని చేసేవన్నీ మనకు చెప్పి చేయ డుగా! అందులో ధన మదాంధుడు వాడు”.

మళ్ళీ నవ్విందామె. “నేను నీలాగ గ్రాడ్వేట్ ని కాకపోవచ్చు గాని- నాకు తెలిసినంత వరకు అన్నీ పకడ్బందీగానే చేసాను. ఎలాగంటావా- కంపెనీ మెయిన్ బాస్ అయిన భూమారావు బావగారికి కూడా రైటింగ్ లో ఇవ్వడమే కాదు, దాని నకలుని భూమారావు భార్యామణికి కూడా స్వయంగా ఇచ్చి వచ్చాను. అంతటితో ఊరుకోకుండా మరొక టి కూడా చేసాను”

అదేమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడు వెంకటేశ్. “క్లియర్ వార్నింగ్ ఇచ్చాను—షాపులోని అవతవక పరిస్థితుల్ని చక్కబెట్టకపోతే ఇక చూసేది లేదని- తిన్నగా విమన్ రైట్స్ కమీషన్ కి పిర్యాదు చేస్తానని- పేపర్లలో తాటికాయంత అక్షరాలతో- “

“మంచి పని చేసావు. ఏదైనా మార్పు కనిపించిందా?”

“మార్పు కనిపించినా లేక పోయినా నేను మాత్రం మళ్లీ ఆ మందనా సిస్టర్స్ షాపుకి వెళ్లేది లేదు. కాని ఎదురు చూసిన మంచి కొంతవరకు జరిగింది. భూమారావు భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అంతే కాదు—భూమారావుని సూపర్ వైజరీ పొజి షన్ నుండి తీసివేసి ఊరికి పంపించేసాడు మా బాస్. ఇక వాడికి రెక్కులు విరిచేసినట్టే కదా! ”

“సరే- నిన్ను నీవు కాపాడుకోవడమే కాక- నలుగురికి మంచి చేసావు కాని దీనికి బదులియ్యి- ఇప్పుడు ఏమి చేయదలిచావు?”

“ఇంకేమి చేస్తాను- తిన్నగా మిస్టర్ యాదగిరి బాబుగారింటికి వచ్చేస్తున్నాను. మిగతాది ఏమి చేయాలో అక్కడకు వచ్చిన తరవాత చూసుకుంటాను”

“నువ్వు ఔనన్నా కాదన్నా మా ఇంటికే వస్తున్నావు. ఐతే చిన్నపాటి షరతు- అక్కడకు వచ్చి ఊరకే కూర్చోకుండా ఏదైనా షార్ట్ టార్మ్ టెక్నికల్ కోర్చులో చేరుతావు. ముఖ్యంగా కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో—ఇక విషయానికి వస్తాను. అదృష్టం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు తోడుగా ఉంటాడంటారు కదా- అదే విధంగా—మా తమ్ముడికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో హ్యాండి క్యాప్ క్వాటాలో డఫ్టరీ ఉద్యోగం దొరికింది. వాడితోబాటు నాకూ ఉద్యోగం దొరికింది”

“నీకు ఉద్యోగం దొరికిందా! అదెలా?డిగ్రీకూడా చేతికి రాలేదుగా- ”కూర్చున్నదల్లా లేచి నిల్చుంది వసుమతి నమ్మలేనట్టు.

”మరీ ఎగ్జాయిట్ కాకు. కాలేజీ ప్రాంగణపు ఎంపిక జరిగింది. ఆ ఎంపికలో నేను సెలెక్టయాను. డిగ్రీ మాటంటావా- అదెలాగూ మూడు నెల్ల లోపున వస్తుంది. ఇక చాలా! ”

వసుమతి మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయింది. అప్పుడు వేంకటేశం ఆమె చేతిని అందుకుంటూ అన్నాడు- “నేనొకటి అడుగుతాను. సూటిగా చెప్తావా! “

ఉఁ అందామె.

”మీది ఉన్న వాళ్ళ కుటుంబం కాదు. ఆదుకోవడానికి చెప్పుకోతగ్గ ప్రొఫేషనల్ క్వాలిఫికేషన్ లేదు. మరింతటి తెగువ నీకెలా వచ్చింది?”.

ఆమె చురుకైన చూపుతో అంది- “పైకి చాలామందికి కనిపించని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టుంది“

“బుల్లెట్ట ప్రూఫ్ జాకెట్టా! అదెక్కడది?“

“నాలోనున్న స్త్రీశక్తి పైన నాకున్న అపారమైన నమ్మకం. అదొక అనంత దివ్య శక్తి. దాని ముందు యెటువంటి దుష్ట శక్తీ నిలవ లేదు. ఆ దివ్య శక్తిని ఒకానొకప్పుడు శ్రీ కృష్ణుణ్ణి ఆదుకునేందకు అస్త్ర శస్త్రాలు అందుకున్న సత్యభామలో మనం చూసాం. ఇకపైన కూడా మనం పెక్కు రంగాలలో చూడబోతున్నాం. ఇంకేమైనా అడగాలా మగధీరా! “.

లేదని తల అడ్డంగా ఆడిస్తూ ఆమెను తన రెండుచేతుల్లోకీ తీసుకున్నాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


58 views0 comments

Comments


bottom of page