top of page

నాన్న కోసం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.'Nanna Kosam' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

ఉదయం పది కావస్తూంది. ఆ సమయంలో కంపెనీ క్యాంటీను బిజీగా ఉంటుంది. సిబ్బందికి తాత్కాలిక సమావేశ మందిరంగా మారుతుందది.

ఛలోక్తులు, చెణుకులూ, విట్సూ-

అప్పుడప్పుడు అవధికి మించిన ఉత్సాహంతో సెక్సీ జోక్సూ లోతుట్టు ప్రాంతాలకు పారే వర్షాకాలపు వరదల్లే పొర్లుతుంటాయి.

తినడం తాగడం అంతా పూర్తయిన తరవాత వామనరావు- “ఇప్పటికిది చాలు సుమా!“అన్నట్టు భుజాల కుదుపుతో సంకేతం ఇస్తూ క్యాంటీను రణగొణ చప్పుళ్లకు వీడ్కోలు పలుకుతూ వక్కపొడి నములుతూ నడవమ్మట కనిపించిన వారందరికీ హల్లోలు హాయ్ లు చెప్తూ సెక్షన్లోకి ప్రవేశించాడు.

అక్కడ మురళీ ధర్ ఒక్కడే కనిపించాడు; ప్రక్కన పెయిడ్ వోచర్స్ పెట్టుకుని, బిజినెస్ లెటర్స్ కి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ప్రత్యుత్తరాలు టైపు చేస్తున్నాడు.

అంటే-మురళీధర్ రావు మూడ్ దెబ్బతిందన్నమాట. మూడ్ చెదరినప్పుడల్లా అతడు క్యాంటీనుకి రాడు. ఏదీ పుచ్చుకోడు. చివరకి స్టాఫ్ ప్యాంట్రీ వాళ్లు సీటుకి తెచ్చిచ్చిన టీ-కప్పు కూడా ముట్టుకోడు. సెన్నిటివ్ టైవ్. చిన్న చప్పుడుకే చిప్పలోకి తల దాచుకునే తాబేలులా ముకుళించుకు పోతాడు.

తమ వంటి ఈజీ గోయింగ్ లైఫ్ కి పనికిరాడు. కలివిడిగా పబ్ లా సాగే కార్పొరేట్ వాతావరణానికేమిటి,ఇప్పటి గ్లిట్టరింగ్ ఫ్యాషనబుల్ ప్రపంచానికే సరిపోడేమో!

ఎప్పుడెప్పుడు మూడ్ చెదరి పోతుందో, అప్పుడతను పనిలో కసిగా పుట్ట మునిగి పోతాడు. ఆ దృక్పథం వామనరావుకి తెలుసు. అందుకే అతను మురళి విషయంలో సాద్యమైనంత మేర సుతారంగా, లౌకికంగా ఉండటానికి ప్రయిత్నిస్తాడు.

”హల్లో కవివర్యా! శుభోదయం. మాకందరకూ దూరంగా తొలగి పోయి, కక్షగట్టుకుని యమ బిజీగా ఉన్నట్టున్నారు” అంటూ వెనుక పాటున వచ్చి మురళి భుజం పైన చేయివేసాడు.

టైపు చేసే పని ఆపి వామనరావు వేపు తిరిగి మురళి నిరసన తెలియ చేసాడు- “నేను కవిని కాను రచయితనని, కథా రచయితనని పలుసార్లు చెప్పాను. మొండికేసి వినిపించు కోవడం లేదు”.

ఆ మాట విని వామనరావు పక్కున నవ్వే సాడు. ”మరీ వేర్పాటు వెతక్కోయ్! కవిలో రచయిత ఉంటాడని రచయితలో కవిగారుంటాడని నాకు తెలియనిదా! ఎంతమంది కవులు కథలు వ్రాయడంలేదని. ఎంతమంది రచయితలు వచన కవిత్వం వ్రాయడందని.. ఇప్పుడదంతా యెందుకు గాని- ఈరోజు ఉదయమే నీ మూడ్ కొంచెం చెదరినట్లుందే! కారణం తెలుసుకోవచ్చా!”

“కొంచెం కాదు. చాలానే చెదరింది. చెప్తే వినేంత ఓపిక నీకుంటుందా— ఉండదు. చెప్పేదంతా బుధ్దిమంతుడిలా విని బైట దండోరా వేస్తావు. నన్ను వెంగళప్పను చేస్తావు. నీ గురించి నాకు తెలియదూ!“

ఆ మాట విన్నంతనే వామనరావు కళ్లు చికిలించాడు. “అవేం మాటలోయ్ ప్రత్యర్థితో మాట్లాడుతున్నట్టు-- నేనెప్పుడైనా అలా చేసినట్టు నిరూపించగలవా! నేను చెడ్డవాడికి చెడ్డవాణ్ణి మంచివాడికి మంచి వాణ్ణి. గుర్తుంచుకో— ఐనా నీవంటి సున్నిత మనస్కుణ్ణి అయోమయం పాలు చేస్తానా!”

“ఐతే ఇలా ముందుకి వచ్చి నాకెదురుగా కుదురుగా కూర్చో” వామనరావు అతడు చెప్పినట్టే ఎదుట వచ్చి కూర్చున్నాడు.

రవంత విలంబిత కాలం తరవాత మురళి స్వగతంలా బదులిచ్చాడు. “నేను కథల పోటీకి పంపిన వ్రాతప్రతి తిరిగొచ్చేసింది”

ఆ మాట విని వామనరావు కళ్లు మిటకరించి చూసాడు. స్పందించడానికి సమయం తీసుకున్నాడు. సమయం తీసుకుని బదులి చ్చాడు- “చూడు మిత్రమా! నిన్ను నిరుత్సాహపరచాలన్న దురుద్దేశ్యంతో నేనిది చెప్పడం లేదు. ప్రతి కథలపోటీలోనూ బహుమతి పొందే తీరాలన్న పట్టుదల పనికిరాదు. ఎందుకంటే పోటీలో పాల్గున్నవారందరికీ బహుమతి ప్రదానం చేయలేరు కదా!“

“అదే నేనూ చెప్పబోతున్నాను. మూడు సార్లు తిరగరాసిన కథను వాళ్ళు సారణ ప్రచురణకు కూడా తీసుకోలేదు”

“మళ్లీ అదే చెప్పబోతున్నానోయ్. కోపగించుకోకు. ప్రూఫ్ రీడర్లు, డేటా యెంట్రీ ఆపరేటర్లు- ఉపసంపాదకులు అక్కడ కూర్చున్నది యెందుకంట? కుప్పలు కుప్పలుగా వస్తూన్న వ్రాత ప్రతుల్ని తిరస్కరించడానికేగా! వచ్చిన వాటినెల్లా యధాతథగా స్వీకరిస్తే ఇక వాళ్లకక్కడ పనేముంటుంది? వాళ్లకిచ్చే జీతభత్యాలకు విలువేముంటుంది?”.

మురళి బదులివ్వకుండా ఊరకుండిపాయాడు.

అప్పుడు వామనరావు మళ్లీ అందుకున్నాడు “నేనిప్పుడు నీకొక సలహా ఇస్తాను. పాటించడానికి ప్రయత్నించు. నీకు వ్రాసే తపన మిక్కుటంగా ఉంది కాబట్టి ఫేస్ బుక్ లో వ్రాస్తూండు. అందులో ఆంగ్లంలో వ్రాయవచ్చు. తెలుగులోనూ వ్రాయవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు వ్రాయవచ్చు. అందరూ కాకపోయినా కొంతమందయినా చదువుతారు. ఇప్పటికి నీ తపన ఇలా కొంతలో కొంత తీరుతుంది. రచనా శైలికి పదును పెట్టినట్టూ ఉంటుంది”

“ఈ మధ్య నేను చేస్తున్నదేమిటంట? అదే చేస్తున్నాను. వ్రాస్తున్నదానిని వాళ్లు రిజెక్ట్ చేయరు కదా— ఇంకా యేమైనా వ్రాయమని ప్రోత్సహిస్తారు. ఎనీహౌ థేంక్స్”

ఎందుకూ అన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు వామనరావు. “ఇంతసేపూ ఓపిగ్గా నా గోడు విన్నందుకు--“ అంటూ ఫైలు తీసుకుని ఫైలింగ్ ఫోల్డర్ లో పెట్టి రావడానికి లేచిన మురళికి మెసెంజర్ ఎదురు వచ్చి “మిమ్మల్ని జనరల్ మేనేజర్ పిలుస్తున్నారు” అని నిటారుగా నిల్చున్నాడు.

మురళి చిన్నగ నవ్వి “నన్నయి ఉండదోయ్! మా టీమ్ లీడర్ నో సూపర్ వైజర్నో పిలుచుంటారు. అలా వెళ్ళి చూసి రా— క్యాంటీనులో ఉన్నట్టున్నారు”

“లేదు సార్. మిమ్మల్నే పిలిచారు. మిస్టర్ మురళీధర్ రావుని పేరుపెట్టి పిలుచుకు రమ్మన్నారు”

సరే- వస్తానంటూ మెసేంజర్ ని పంపించేసి వామనరావు వేపు తిరిగి అన్నాడు మురళి- “ఆయన ఆఫీసు టైమ్ పదకొండు కదా! ఇంత త్వరగానా వచ్చుంటారు” అంటూ బైటకు కదిలాడు.

వామనరావుకి కూడా అగమ్యగోచరంగానే తోచింది. మురళితో జనరల్ మేనేజర్ కి యేం పని? పని విషయంలో గాని, ఔట్ పుట్ విషయంలో గాని ఆయన డిప్యుటీ మేనేజర్ల్ తోనో సూపర్ వైజర్ల్ తోనో కదా రివ్యూ చేయాల్సింది! మురళి యెదురు చూడని చిక్కుల్లో పడ్డాడేమో! సిబ్బందిని తగ్గించాలనుకునే టప్పుడల్లా మేనేజిమెంటు వాళ్లు ఇలాగే భవ్యం గా పిలిచి చేతికి పింక్ కార్డు ఇస్తారు. వెకెన్సీ ఉన్పప్పుడు మళ్లీ పిలుస్తామని ఊరట కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ తన సీటు వేపు నడిచాడు వామనరావు.

మురళి ఆత్మార్పణతో పని చేసే వ్యక్తి. అతడికా ఇటువంటి పరిస్థితి. మురళీధర్ జి యెమ్ చేంబర్ లోకి ప్రవేశించేటప్పటికి ఆయన తన ప్రక్కన కూర్చున్న యెవరో స్త్రీతో మాట్లాడుతున్నా డు.

“మే ఐ కమిన్ సార్!” తన ఉనికి తెలియచేసాడు.

“యస్ యస్!” అంటూ సీటు ఆఫర్ చేసాడు. కాని మురళి కూర్చోలేదు. “ఇట్స్ ఓకే సార్! నేనేమి చేయగలనో చెప్పండి సార్”

“చెప్తాను. నా కంటే నా శ్రీమతి సుధారాణి బాగా చెప్తుంది. ముందు కూర్చో” మురళికి అయోమయంగా తోచింది. కంపెనీ వ్యవహారాలలో ఈయన సతీమణి పానకంలో పుడకలా వచ్చి చెప్పడం యేమిటి-- ఇక తప్పదన్నట్టు జి యెమ్ కుడి ప్రక్కన కూర్చు న్నాడు.

అప్పుడు జి యమ్ అందుకున్నాడు- “నేను ముందు ప్రారంభిస్తాను. తరవాత నీవు అందుకో సుధా!” అంటూ మురళి వేపు తిరిగాడు.

“మీరు ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉంటారని విన్నాను. ఔనా!”

తలూపాడు మురళి- మరింత అయోమయానికి లోనవుతూ--

“ముఖ్యంగా మీరు లైక్ ల కంటే డిస్ లైక్ లు యెక్కువగా వేస్తుంటారని కూడా సుధ చెప్తుంటుంది. మీకంతటి ఆవేశం యెందుకో మరి!” అంటూ భార్య వేపు తిరిగి- “నౌ ఇటీజ్ యువర్ టార్న్“ అని తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నిస్తూ సీను నుండి తప్పుకున్నాడు జి యమ్.

అప్పుడు భర్త నవ్వుని తనలో కలుపుకుంటూ సుధారాణి అందుకుంది. “మీ అభిప్రాయాన్ని మీరు చెప్పుకోవడానికి మీకు సర్వ హక్కులు ఉన్నాయి. అలాగని యెదుటివారిని ఉక్కిరి బిక్కిరి చేసే అధికారం మీకు లేదు”.

మురళీధర్ తెల్లబోయి చూసాడు.

“నేను ఇంటర్నెట్ భాగస్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నానా!”

“నిజానికి మీరు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడం లేదు. కించపరుస్తున్నారు. అదీను ఘోరంగా—“

మరింత తెల్లబోతూ అడిగాడు మురళీధర్- “చెప్తే కదా తెలుస్తుంది. అయినా నేను మిమ్మల్ని యెప్పుడు కించపరిచాను?”

“నన్ను మాత్రమే కాదు. చాలా మందినే! అలాగని చెప్పిన తరవాత కూడా మీరెప్పుడూ విచారం వ్యక్తం చేయలేదు. శోచనీయం”.

ఈసారి మురళి మోముపైన దరహాసం తారాడింది. ”మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. విషయాన్నిమీరు చెప్తేకదా స్పందించేది”

“చెప్తాను, సూటిగానే చెప్తాను. తల్లిని మెచ్చుకుని తల్లి ప్రాముఖ్యాన్ని ఔన్నత్యాన్ని ఇనుమడించేలా వ్రాస్తే మీకు పోయిందేమిటంట? నేను మాత్రమేనా అమ్మను పొగుడుతూ వ్రాసాను. మహా కవులు వ్రాసారు తల్లి గురించి. ఇందులో మీకు పోయిందేమిటంట?”

అప్పుడు జి యమ్ గారు చప్పున కలుగ చేసుకున్నారు. “ఔను ఈ విషయంలో నేనూ ఎఫేక్ట్ ఆయాను. నేనిప్పటికీ ఇల్లు విడిచి వచ్చేటప్పుడు మా అమ్మ కాళ్లకు మొక్కే బయలుదేరుతాను. ఇది తెలుగు వారి సంప్రదాయం. డు యూ ఫైండిట్ ఆడ్?”

మురళీధర్ వెంటనే స్పందించలేదు. కాసేపాగాడు. భార్యా భర్తలిద్దరూ తన ట్విట్స్ కారణాన అసహనానికి లోనయారని తేల్చుకున్నాడు. అసలు ఈమెగారు తనకు వ్యతిరేకంగా ట్విట్స్ చేస్తున్నారని తెలిస్తే కదా! ఎంతోమంది చిట్టి పొట్టి పేర్లతో అకౌంట్సు తెరుస్తుంటారు. ఆ తరవాత క్లోజ్ చేసి తప్పుకుంటుంటారు. “నేనిక చెప్పవచ్చా! చెప్పడానికి నాకొక అవకాశం ఇస్తారా!”

ఔనూ అనకుండా కాదూ అనకుండా ఇద్దరూ అతణ్ణి తేరపార చూడసాగారు. అతడదేమీ గమనించనట్టు చెప్పసాగాడు. “మీరు తల్లి స్థానాన్ని గుర్తించి తల్లిని పొగడ్తలతో ముంచుడం గురించీ నాకేవిధమైన ఆక్షేపణా లేదు. నాకున్న ఆక్షేపణల్లా ఒక్కటే—మీరు—ముఖ్యంగా మీ స్త్రీలు తల్లిని మాత్రమే ఆకాశానికి యెత్తేస్తున్నారు- అక్కడకి ప్రక్కన తండ్రి అనే మహానుభావుడు ఒకడున్నాడన్నది మరిచిపోయి. దాదాపు అందరూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ఇంకా గొప్పలకు పోతూ మీరందరూ సర్వమూ, తల్లే సర్వస్వం అంటున్నారు. ఆకాశం నిండా తల్లి రూపం- నేలంతా తల్లి రూపం. కుటుంబానికంతటికీ తల్లే ఆధారం.

మరి తండ్రిని యేంచేద్దాం? అందుకే బాధపడుతూ ఇలా అనేవాణ్ణి- ‘ఇద్దరమూ చెరొక తాడు చుట్టా పట్టుకుని మీ నాన్నని కట్టేసి బే ఆఫ్ బెంగాల్ లో ముంచేద్దామా!‘ అని. ఇక నా విషయానికి వస్తాను. నా వ్యక్తిగత జీవితానికి వస్తాను. మా తల్లి మానమర్యాదలకు ఆమె మనుగడకు మా నాన్నే భరోసా-- నేనుగాని మా చెల్లిగాని మా తల్లికి యే మాత్రమూ భరోసా కాదు. అసలు అష్ట కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేసింది మా నాన్నే! అదెలా నేను మరచి పోగలను? సర్వమూ నాకు మా అమ్మమాత్రమే అని యెలా అనగలను? గొప్ప లు పోవడానికి, లైక్ లు పొందడానికి అలా చేస్తూ పోవడం బాగుంటుంది. కాని అది వాస్తవం కానేరదు కదా! నాకు స్కూలులో, కాలేజీలో సీటు తెప్పించడానికి మా నాన్న యెంత కష్టపడి ఉంటాడు! మా చెల్లి పెళ్లి సంబంధం కోసం యెన్ని పాట్లు పడి ఉంటాడు. ఎన్ని ఊళ్ళు తిరిగుంటాడు. . లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్— మా అమ్మ అనారోగ్యానికి లోనయితే మా నాన్న వైద్య ఖర్చుల కోసం కంటికి కనిపించిందల్లా రేపటి కోసం ఆలోచించకుండా అమ్మేసాడు. చివరకు ఉన్న ఇంటితో సహా— కడకు మా గతేమయిందో తెలుసా? రోడ్డున పడ్డాం. నెలా నెలా ఇంటి బాడుగ ఇవ్వలేక, తీసుకున్న అప్పులు తిరిగివ్వలేక యెన్ని పాట్లు పడ్డామని— ఇదంతా ఎవరు చేసారని— ఎందుకోసం నాన్న చేసారని— అగ్ని సాక్షిగా కట్టుకున్న తన భార్యను బ్రతికించుకోవడం కోసమని— అటువంటి తండ్రిని పూర్తిగా ప్రక్కన పెట్టి తల్లి భజన మాత్రమే చేస్తూ తిరగడం అనౌచితం కాదా మేడమ్! ఆ మనోభావంతోనే నేనలా ఉక్రోశంతో కమెంట్స్ పోస్టు చేసేవాణ్ణి. ఇంకా చెప్పాలంటే— సుధ అంటే నాకు తెలియనే తెలియదు. అది మీరని ఇప్పుడే తెలిసింది. ఎనీహౌ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. మీది మా తల్లి వయసు. అందుకే నమస్కరించి చెప్తున్నాను— అటువంటి కమెంట్స్, మరొకసారి పోస్టు చేయను. ఐ ప్రామిస్. ఇక ఆఖరి మాట మేడమ్. వాళ్ల వాళ్ల కన్నతండ్రుల్ని వాళ్ళు గుర్తుంచుకుని గొరవించుకోవాలి గాని మధ్యన నేనెవరిని యెదుటివారిని అప్ సెట్ అవడానికి? మరొకసారి కోరుతున్నాను— నన్ను క్షమించండి” అంటూ మురళీధర్ సీటు నుండి లేచి బైటకు నడిచాడు.

భార్యాభర్తలిద్దరూ వెళ్లిపోతూన్న మురళీధర్ వేపు కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నారు. ఆకాశం గొప్పదా లేక భూమి గొప్పదా! రెండూ గొప్పవే! రెంటికీ సమాన గౌరవమే కదా ఇవ్వాలి.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

.

రచయిత పరిచయం :

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి

169 views0 comments

Comments


bottom of page