top of page

మోహం ముప్పై రోజులు


'Moham Muppai Rojulu' New Telugu Storyమంగళ పూర్ణ శుక్రవారం. హరిత కూతుర్ని వెంటబెట్టుకుని బల్కం పేట అమ్మవారి గుడికి వెళ్లింది. అమ్మవారికి జరిపిన పాలాభిషేకాన్ని కనులార చూసి తరించి, పూజారిచ్చిన కుంకుమ బొట్టు నుదుట ధరించి కూతురి కీ పెట్టి, గుడివాకిట అందించిన పులిహోర ప్రసాదం తీసుకుని అటు వేపు పోతూన్న ఆటోరిక్షాలోకి యెక్కి తిన్నగా ఇల్లు చేరుకుంది. ఆమె తాపత్రయ మంతా మరెందుకో కాదు, భర్త ఆఫీసుకి బయల్దేరే ముందు ఇల్లు చేరుకోవాలనే--


ఇల్లు చేరేటప్పటికి ప్రహ్లాద్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు. హరిత వేగంగా వెళ్లి కూతురు ముందు బడి పుస్తకాలు పెట్టి, చేయవలసిన హోమ్ వర్క్ గురించి సూచనలిచ్చి, భర్తముందుకు వచ్చి కూర్చుంది. చిన్నగ నవ్వుతూ, నుదుట బొట్టు పెట్టి, చేతికి కాసింత ప్రసాదం కూడా ఇచ్చి, ”ఊ చెప్పండి“ అంది.


ఆమెప్పుడూ సంభాషణ ఉపక్రముంచే ముందు జీవన సహచరుణ్ణి అలాగే పలకరిస్తుంది. ప్రహ్లాద్ భార్యను చూసి ఆశ్చర్యంగా ముఖం పెట్టి చూసాడు. భర్త ముఖ భావం గమనించి చెదరని నవ్వు ముఖంతో అంది-“అంతా మీవల్లే! నేను రాకముందే ఆఫీసు కి వెళ్లి పోతారేమోనని-“


‘ఐతే యేమిటంట’-అన్నట్టు చూసాడు పేపరు మడత పెడ్తూ--


“రెండు రోజులుగా బంగార్రాజు బాగా అప్ సెట్ ఐనట్టున్నాడండి”


మళ్ళీ అతడు అదేవిధంగా కనుబొమల కదలికతో సంకేతం ఇచ్చాడు-సంగతేమిటన్నట్టు.


“తెలియనట్టు అడుగుతారేమిటి?మిమ్మల్ని నమ్ముకుని వాడిక్కడకు వచ్చి రెండు నెలలు దాటుతూంది. వాడికెక్కడైనా ఓపెనింగ్ దొరికేటట్టు చూసారా!”.


అప్పుడతడు కాసేపాగి స్పందించాడు-“చూడు హరితా! మీ తమ్ముడికి ఓపెనింగ్ ఎక్కడైనా ఇప్పించవచ్చు. కాని మా కంపెనీలో ఇప్పించాలనే—“


హరిత కళ్ళు మెరిసాయి. “ఇంకేం? బాస్ మీకు బాగా తెలిసినవారేగా! తృటిలో పెకలించగలిగే దానికి గండ్ర గొడ్డలెందుకూ? చెప్పడం యెందుకు గాని- రాత్రి వాడు సరిగ్గా భోజనం కూడా చేయలేదు”


ప్రహ్లాద్ బదులివ్వకుండా కాసేపు ఊరకుండిపోయాడు. ఊళ్ళో బంగార్రాజు ఇష్టపడ్డ అమ్మాయి. వాళ్ళేమో, దగ్గరి బంధుత్వంగలవాళ్ళే! కాని అబ్బాయి కి భరోసా గల ఉద్యోగం దొరకనంత వరకూ కూతుర్ని అప్పగించ లేమని షరతు పెట్టారు. ఇదీ ఇప్పుడు అక్కా తమ్ముళ్లిద్దరూ ఎదుర్కుంటున్న తిరకాసు.


“బాగా విను హరితా! మా బాసు నాకు తెలిసిన వాడు మాత్రమే కాదు..నాకు ఫ్రెండ్ కూడాను. కాని అది వేరే విషయం. బాస్ బాసే! ప్రతిదానికీ వితౌట్ యెంట్రీ లోపలకు జొరబడలేను. ఉన్న పరువు పోగొట్టుకోలేను. అప్పట్లో వ్యాస్ నాకు కాలేజీ మేట్ కావచ్చు, కాని ఇప్పుడు నాకు ఉద్యో గం ఇచ్చి, నా మనుగడకు దారి చూపించిన కుటుంబ పోషకుడు. ఇక అసలు విషయానికి వస్తాను. వ్యాస్ మంది, మార్బలంతో రెండు మూడు నెలలుగా బిజినెస్ టూరుపైన ఉన్నాడు. చాలా బిజీ టూరు. అతనిప్పుడు యెక్కడున్నాడు, యేం చేస్తున్నాడన్నది నాకు తెలియదు. అతడి కార్యకలాపాల గురించి తెలుసుకునే అధికారమూ నాకు లేదు. మా కంపెనీకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నియమాలున్నాయి. వాటి ప్రకారమే జరుగుతాయి. అతడు టూరు పైన వెళ్ళేముందు ఇంటర్న్ షిప్ ఇప్పించమని బంగార్రాజు తరపున దరఖాస్తు అందించాను. పనుల హడావిడి లో పడి మరచిపోయాడేమో! అసలతను ఇక్కడున్నాడా లేక ఫారిన్ లో ఉన్నాడా అన్నది కూడా నాకు తెలియదు. ”


ఈసారి రవంత విలంబిత కాలం తరవాత హరిత అంది-“ఒక పని చేస్తే?“.

ఏమిటన్నట్టు కళ్ళెత్తి చూసాడు ప్రహ్లాద్.


“అతడి భార్య అనూరాధ కూడా మీకు తెలుసు కదా! ఆమె కూడా ఒకప్పుడు మీ కాలేజీ మేటే కదా! బంగార్రాజు విషయం ఆమె చెవిన వేస్తే-- ఎందు కంటే- చాలామందే ఇంటర్న్ షిప్ కోసం దరఖాసు చేసుంటారు కదా! ఉన్నవన్నీ వాళ్ళకు ఇచ్చేస్తే మరి మీ బామ్మర్ది గతేమి కాను?”


ప్రహ్లాద్ భార్య వేపు మెచ్చుకోలుగా చూసి-“మంచి ఐడియా- ఈ రోజే వాళ్లింటికి వెళ్తాను“ అంటూ లేవడానికి కదిలే లోపల, భవానమ్మ కొడుకుని వెతుక్కుంటూ వచ్చింది-“ఒరే అబ్బాయీ! నిన్ను వెతుక్కుంటూ మీ ఫ్రెండు వచ్చాడురా!”


“ఫ్రెండా! వాడెవడమ్మా ఇంత పెందలకడే--“


ఆమె స్వరం పెంచింది-“ఇంకెవడు? మీ కంపెనీ బాసే!”


ఆ మాట విని భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ హాలులోకి వేగంగా వచ్చారు. నిజమే! ఇంటికి యేతెంచింది వ్యాసే! ప్రహ్లాద్ యెదురు వెళ్లాడు. హరిత చేతులు జోడించింది.


”రండి! రండి! కబురంపితే నేనే వచ్చేవాణ్ణి కదండీ !”

ఆ ఎదుర్కోలు పలుకులకు వ్యాస్ ముఖం చిట్లించాడు.“ఏవిట్రా నీవెర్రి మొర్రి ధోరణి? రండీ పొండీ-వినడానికి యెబ్బెట్టుగా లేదూ!”


ప్రహ్లాద్ నోరు మెదపకుండా ఉండిపోయాడు.


అప్పుడు హరిత కలుగచేసుకుంది.“ఏమీ అనుకోకండి అన్నయ్యగారూ! మీరు ఒకానొకప్పుడు బాక్సింగ్ రింగ్ లో పోట్లాడుకున్నదీ-కబడ్డీ ఆటలో ఒకరినొకరు తోసుకున్నదీ మీ ఫ్రెండు చెప్పాడు. కాదనను కాని మీరిప్పుడు మావారి బాస్. అదే అలవాటుతో మీరు ముఖ్యమైన సమావేశాలలో ఉన్నప్పు డు నోరుజారి మిమ్మల్ని ఏకవచన ప్రయోగం చేస్తే--అపోహలు యేర్పడ వచ్చుకదండీ! అందుకే నేను మీ ఫ్రెండుని ఆదిలోనే హెచ్చరించాను, స్థానమెరిగి మెసలుకోమని. అనువుగాని చోట అధికుల మనకూడదని-తనను తను కంట్రోల్ చేసుకొమ్మని—“

“నీ అపోహ నీదే గాని హరితా-వాడు నా కాలేజీ మేట్ అన్నది అంత త్వరగా మరచిపోతానా! అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని వచ్చానురా ప్రహ్లాద్. అలా నీ స్టడీ రూములోకి వెళదామా?”


“మన పర్సనల్ వ్యవహారం తరవాత చూసుకుందాం గాని మొదట మా బావమరిది పర్సనల్ వ్యవహారం గమనించవోయ్”

“అవేం మాటల్రా! నేను వెళుతూ స్పెషల్ స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి మా పర్సనల్ వింగ్ కి ఇచ్చి వెళ్ళాను. అందులో ఇవ్వాల్సిన స్టైఫండ్ గురించి కూడా ప్రస్తావించాను. మీ బామ్మర్ది నా నోట్ ఆర్టర్ తీసుకోలేదా! ”


అంతవరకూ గది బయట నిక్కి నిల్చుని వింటూన్న బంగార్రాజు ఒక్కఉదుటున హాలుకి దూసుకువచ్చాడు. “అలాగా సార్! సారీ సార్! నేనిన్నాళ్ళూ హెచ్చారమ్ సెక్షన్ చుట్టూ తిరుగుతున్నాను.వెళ్ళి తెచ్చుకోనా సార్?”


వ్యాస్ తలుపాడు. అంతే-బంగార్రాజు రెక్కలు కట్టుకుని యెగిరిపోయాడు.

స్టడీరూమ్ లోకి వెళ్లి కూర్చున్న వెంటనే ప్రహ్లాద్ అడిగాడు-“చాలా రోజుల్నించి నిన్ను చూస్తున్నాను కదా-ఇంత పేలవంగా తీసిపోయిన ముఖంతో నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఫ్రెష్ గా యెవర్ గ్రీన్ సినీహీరోలా ఉంటావు. ఏమైంది? డీల్స్ కలసిరాలేదా? నష్టం వచ్చిందా?”


“నష్టం కంపెనీకి కాదు. నష్టం నాకు వచ్చింది. నా జీవితానికి వచ్చింది”

“మరొకసారి చెప్తున్నాను. నువ్వింత డీలాగా కనిపించడం నేనెప్పుడూ చూడలేదు. భూకంపం వచ్చినా చెదరకుండా నిబ్బరంగా నిల్చోగల వాడివి. నువ్వీరోజు-“ అంటూ ముందున్న కాఫీ కప్పుని మిత్రుడికి అందించాడు ప్రహ్లాద్.


కాఫీకప్పుని అందుకుంటూ సంభాషణను కొనసాగించాడు వ్యాస్. “నా జీవిత నేపధ్యం గురించి తెలిసిన వాడివి కాబట్టి నీకు ఫ్రాంక్ గా చెప్తాను. మా తాతగారు గరుడపురాణం గురించి చెప్తున్నప్పుడు ఒకమాట తప్పనిసరిగా వివరించేవారు. విహిత కర్మగురించి, అవిహిత కర్మ గురించి. చిత్రగుప్తుడు ప్రత్యక్షంగా చేసే పాపాలనే కాదు. మనసులో ఆలోచనలో చేసిన పాపపు చింతనలను కూడా పరిగణనలోకి తీసుకుంటాడట”.


“ఆగు! ఇక్కడ ఒక నిమిషం ఆగు. నువ్వటువంటివాడివి కావు. నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే మేమే అటువంటి చిల్లర పనులు చేస్తుండేవాళ్లం. అప్పట్లోనే నీ పునాది బలంగా ఉండేదని మాలో మేం అనుకునే వాళ్ళం. మరీరోజు నువ్వు పాపాల గురించి మా ట్లాడుతుంటే-“


వ్యాస్ తల అడ్డంగా ఆడించి ఊరకున్నాడు.

“దెన్ వాట్?” ప్రహ్లాద్ సూటిగా చూస్తూ అడిగాడు.


“లేదురా!బోనులో చిక్కు కున్నాను. హనీ ట్రాప్-”

ప్రహ్లాద్ నోటమాట లేకుండా సూటిగా చూస్తూండిపోయాడు.


“మరీ షాక్ అవకు మిత్రమా! బిజినెస్ ప్రపంచంలోని లోతుపాతులు నీకు పూర్తిగా తెలీదు. కాబట్టి నువ్వు బిత్తరపోతున్నావు. వ్వాపార రంగమన్నది పరిధి లేని ఊబి. జారకుండా తడబడకుండా దాని చుట్టూనే తిరుగుతుండాలి. అలాగని దానిని విడిచి పెట్టనూ లేను. ఎందుకంటే అది నన్ను విడిచిపెట్టదు. గొలుసుకట్టు వంటి సంబంధాలు. ఇప్పుడు నేనొక వాస్తవ ఉదంతం చెప్తాను. విను. నానుండి అట్రాక్టివ్ డీల్ పొందడానికి ఇద్దరు బిజినెస్ పులులు-ఒకడు యూరోపియన్-మకొకతను మన ఇండియన్- వాళ్ళ భార్యామణుల్ని నాతో ఒరుసుకుంటూ తిరగమని పంపించారు . నేను తప్పించుకుంటూ అద్దరి చేరిపోయాను. అలా అడపాదడపా నాకెదురవుతూనే ఉండేవి. ఈసారి మాత్రం తప్పుకోలేక పోయాను. మునిగిపోయాను. ఆడదాని మోహంలో మునిగిపోయాను”. చెప్పడం ఆపాడు వ్యాస్. ప్రహ్లాద్ కదల కుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు.


ముంగాళ్ళపైన తల పెట్టుకుని కళ్లు మిటకరిస్తూ కూర్చున్న తెల్లపిల్లిలా చూస్తూ. ”అదెలా జరిగిందంటే--అనుకోకుండా జరిగింది. శాన్ ఫ్రాన్సికో వెళ్ళి ,అక్కణ్ణించి వాషింగ్టన్ వెళ్ళి, అక్కణ్ణించి మాస్కోవెళ్ళి, వ్యాపార లావాదేవీలు ముగించుకుని, తిన్నగా ఇండియా వచ్చాను. ఇక్కడ అలహాబాదులో చర్చలు సాగించి, ఒప్పందాలపైన సంతకాలు, చేసి సూరత్ లో దిగిపోయాను. ఇక్కడే చిక్కుకుపోయాను. ఒకరోజూ, రెండ్రో జులూ కాదు. ఏకంగా ముప్పై రోజులు”


ప్రహ్లాద్ ఆశ్చ ర్యంగా-“అన్నిరోజులా!” అని మిత్రుడి ముఖంలోకి చూసాడు.

“ఉఁ ఇక్కడే! వజ్రాల వ్యాపారులతో చర్చోపచర్చలు చేస్తూ బేరసారాలు చేస్తూ డీల్ ముగించేటప్పటికి-హుర్రే-అని అరచినంత ఆనందం కలిగింది. ఆ ఆనందం తోనే నేను బ్రెజిల్ పబ్ లోకి వెళ్లి తేలిక పడ్డ మనసుతో టిన్డ్ బీర్ ముందేసుకుని కూర్చున్నాను.


అప్పుడామె మరొక చోట కూర్చుని ఉన్న నన్నుచూచి పలకరింపుగా నవ్వింది.అప్పుడు నాకు కూడా అనిపించింది- ఈమెను నేనెక్కడో చూసిన ట్టున్నానే—అని. అంచేత నేను కూడా చిన్నగా నవ్వి బీర్ తాగడంలో ఉండిపోయాను.అప్పుడు అనుకోకుండా మరొక సారి అటు చూసాను.కన్ను కుట్టినట్లనిపించింది. ఆమె వేసుకు న్న ఏ-షేపు గాగ్రా నుండి ఆమె నున్నటి మోకాలు నిగనిగలాడుతూ కనిపించింది. అంతే-మరుక్షణం నాకు తెలియకుండానే నేను ఆమె ముందు మంత్రముగ్ధుడిలా వెళ్లి కూర్చున్నాను. ఆమెది అంత అందమైన శరీరమన్న మాట.


అప్పుడు నేను మాటలు కలిపాను- ‘మిమ్మల్నెక్కడో చూసినట్టున్నాను‘అని.


ఆమె వెంటనే ఒప్పుకుంది, తను నన్ను కలుసుకున్నట్టు. మన కంపెనీ బ్రాండ్ క్రింద వచ్చే వ్యాపార ప్రకటనల్లో తను ఫోజులిచ్చేలా ఒకరోజెప్పుడో నన్ను అడిగిందట. ఈ మధ్య తను మిసెస్ బ్యూటీ కంటెస్టు లో విజేతగా గెలిచానని కూడా చెప్పింది. తనకు భర్త ఉన్నాడని చెప్తూ లేచి నా దగ్గరకు వచ్చింది. నేను కూడా లేచి నిల్చున్నాను. నేనే మాత్రమూ యెదురు చూడని విధంగా నాకు హగ్ ఇచ్చింది- డీప్ ప్యాషనేట్ హగ్ ఇచ్చింది. దానితో నరాలు జివ్వుమని సోలి పడిపోయాను. పూర్తిగా పడిపోయాను.


రుచికరమైన చైనీస్ చికెన్ ముక్కను మొదటిసారి రుచి చూసినట్టు. ఇంకేముంది-మెలోడియస్ ఆర్కెస్ట్రా సంగీత లయకు ఇద్దరమూ మంద గమనంతో ఒకరినొకరం ఒరుసుకుంటూ-మాటి మాటికీ హత్తుకుంటూ డ్యాన్స్ ఆడి తిన్న గా ఆమె లాంజ్ కి వెళ్లిపోయాం. అంతవరకూ నాకు ఆమె పేరు అడగాలనే తోచలేదు-‘ మైకంలో ఉన్నాను మన్నించాలి ‘అని యేదో సినిమాలో హీరో పాడినట్టు. అక్కడ తెలుసుకున్నాను ఆమె పేరు అనీషా అని.


అనీషా అంతటితో ఆగలేదు.మీనీ స్కర్టులో పొంగే యవ్వనాన్ని గలగలా పారే సెలయేరులా చూపిస్తూ, బెల్లీ డ్యాన్స్ ఒంపు సొంపులతో మత్తుగా ఆడి, మరింత జోరుగా కైపెక్కించింది. చాలా రోజులుగా ఆడదాని స్పర్శ లేకుండా ఊరూరా మడి కట్టుకున్నట్టు తిరుగుతున్నానేమో-ఆమె అందమైన శరీరం ముందు ఫిదా ఐపోయాను. ఎంతగా ఆనందడోలికల్లో మునిగిపోయానంటే మరునాడు అనీషాను తీసుకు వెళ్లి స్పెషల్ రేటుపైన వజ్రాల హారం-బంగారు పట్టె గిఫ్టుగా కొనిచ్చాను. కాని మేటర్ ఆది కాదు.అనీషాకి కావలసింది నేను అభిమానంతో కొనిచ్చే నగలు కావని తరవాత తెలుసుకున్నాను. ఆవిడతో నేను గడిపిన ప్యాషనేట్ క్షణాలను ఆమె తన రంకు మొగుడి సహకారంతో వీడియో చేయించింది.


ఎవడో అన్నట్టు ఎక్కడివాడో అన్నట్టు వాడిచేత నాకు ఫోను చేయించి, డబ్బు గుంజనారంభించింది. కొందరాడాళ్లు అంత కర్కశంగా అంత రాక్షసంగా ఉండగలరని నేనప్పుడే తెలుసుకున్నాను. నా మర్యాదను-వ్యాపార ప్రపంచంలో నాకున్న పరపతిని దక్కించుకోవడానికి నాపేరు పత్రికల్లో యెక్కకుండా ఉండటానికి నాముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి దానిని సుపారీ ఇచ్చిగాని లేక నేనుగా గాని అంతమొందించడం. రెండవది-పైనల్ డీల్ కి దిగడం.


నేను రెండవదానినే యెన్నుకున్నాను. ఒరిజనల్ వీడియోని యథా తథంగా అప్పచెప్పడానికి కోటి రూపాయలకు బేరం ముగించాను. కాని మళ్ళీ మోసపోయాను. వాడు నాకు నిజంగా ఒరిజినల్ వీడియోని ఇవ్వలేదు. ఇంకా డబ్బు కావాలని మెసేజ్ పంపించాడు. అప్పుడు ఆ మాయలాడి అనీషా కలుగచేసుకుని, ఇకపైన తన రంకు మొగుడి వల్ల హెరాస్మెంటుకి లోనవకుండా చూస్తానని-ఆఖరు విడతగా యాభైలక్షలు ఆఫర్ చేయమని సలహా ఇచ్చింది.


వేడి పాలు తాగి మూతి కాల్చుకున్న పిల్లిలా నేనీసారి నమ్మలేదు. తిన్నగా ఇక్కడకు వచ్చేసాను. ఇప్పుడు నా గుండెను పిండుతూన్న బాధ ఒక్కటే—అతి సున్నిత హృదయురాలైన అనూరాధ నా సిగ్గు మాలిన వ్యవహారం విని తల్లడిల్లుపోతుందనే--నేను వాళ్ళతో మరొక డీల్ గురించి ససేమిరా మాట్లాడనన్నప్పుడు ఇదే అస్త్రాన్ని నాపైన ఉపయోగించారు. అప్పట్నించి నాకు గుండెపోటు వస్తున్నట్టు ఒకటే దడ దడ”.


అప్పుడు ప్రహ్లాద్ అడ్డువచ్చాడు.“ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. ఇక నన్ను చెప్పనియ్. మొదట, బంగారు గ్రుడ్లు పెట్టే బాతుని యెవరూ, అందునా ప్రొఫెషనల్ క్రిమినల్స్ విడిచిపెట్టుకోరు కదా! ఇక నీ విషయానికి వద్దాం. వాళ్ళ పీడ వదిలించుకోవడానికి మొత్తం యెంత ఇచ్చుకున్నావు?”


"రెండు కోట్లు-నేను ఇష్టపూర్వకంగా యిచ్చిన నగల గిఫ్టుని మినహాయించి”

“ఓకే ఓకే! దానిగురించే దిగులు పడుతూ కూర్చుంటే లాభం లేదు. ముందుకు వెళ్ళే ముందు, అనీషా గురించి ఒక మాట. ప్రతి స్త్రీ లోనూ యేదో ఒక కోణంలో యేదో ఒక రంగులో ఎక్స్ పోసివ్ అట్రాక్షన్ ఉంటుంది. దానిని గమనించనంతవరకూ యే బాదరా బందీ ఉండదు. అది చూసిన తరవాతనే మగాడి కష్టాలు ఆరంభమవుతాయి. ఇటువంటి కష్టాలే ఆనాడు విశ్వామిత్రుడికి కూడా యెదురయి ఉంటాయి. అంచేత మథనపడ్తూ నిన్ను నీవు చులకన చేసుకోకు. మనమెవరమూ సిధ్ధులం కాము . అసాధ్యులమూ కాము. ఇకపైన నువ్వెప్పుడు యెక్కడికి వెళ్లినా నువ్వు అనూరాధతోనే వెళ్తావు. ఆమెకు వీలుకానప్పుడు నువ్వు నీ టూరు ప్రోగ్రాముని తదనుగుణంగా రివైజ్ చేసుకుంటావు. ఓకే!”

వ్యాస్ అంగీకార సూచకంగా తలూపాడు.“


"తదుపరి అంశం. ఆ ఇద్దరి దుష్టశక్తుల బెదిరింపులకూ లొంగకుండా రిఫ్యూజ్ చేసి మంచి పని చేసావు. ఇప్పుడు మనముందున్న అంశాలు రెండు. వాళ్ల బ్లాక్ మెయిల్ చర్యకు ఫుల్ స్టాప్ పెట్టడం. వాళ్లిద్దరూ నీనుండి గుంజుకున్న రెండు కోట్లలోనూ కొంతలో కొంత తిరిగి రాబట్టుకోవడం. కాబట్టి, మరీ జాప్యానికి తావివ్వకుండా ఇప్పటికిప్పుడు మనం ఒక పని చేయాలి. పోలీస్ స్పెషన్ బ్రాంచికి వెళ్లి పూర్తి వివరా లు ఇవ్వాలి”.


ఆ మాట విన్నంతనే ఉలిక్కిపడ్డట్టయాడు వ్యాస్. “పోలీసుకా! చచ్చింది పో! ఇది నువ్వనుకున్నంత సీదాసాదా కేసైతే నేనెప్పుడో సూరత్ పోలీసులకి రిపోర్ట్ చేసుందును కదా! నా పబ్లిక్ ఇమేజ్ మాట అటుంచు-అనూరాధ పరిస్థితి యేమవుతుందో ఆలోచించావా? అసలే ఆమెది పెళుసైన మనస్తత్వం. జలుబుకి మందివ్వమని వస్తే ఉన్న ముక్కు తీసిపారేయమన్నట్టుంది నీ సలహా--”


ప్రహ్లాద్ అదోలా చూస్తూ అన్నాడు- “పూర్తిగా వినకుండానే నువ్వు తొందరపడుతున్నావురా వ్యాస్! మొదట దీనికి బదులియ్యి. నువ్వు ఒప్పుకున్నా లేకున్నా, ఈ విషయం యేదో ఒక సందర్భాన బయటికి పొక్కే తీరుతుంది. కాలమంతా యిస్తూ ఉండలేవు. ఔనా?"

“వ్యాస్ బదులివ్వకుండా ఊరకుండిపోయాడు.

“నౌ ఇటీజ్ మై టర్న్—విను. అనూరాధ గురించి నాకు తెలుసు. ఆమె నా క్లాస్ మేట్. సున్నితత్వమే కాదు. ఆలోచించగల నిదానం-తెలివి తేటలు కూడా మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా నువ్వంటే ఆమెకు మిక్కిలి ప్రేమ..సత్సాంప్రదాయాలు, కట్టుబాట్లు గల ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన-స్త్రీ. ఇద్దరు బిడ్డల తల్లి. నిన్ను యెట్టి పరిస్థితిలోనూ కోల్పోవడానికి సిధ్ధ పడదు. దానికి నేను గ్యారంటీ.


ఇక రెండవ అంశం. నువ్వు తప్పకుండా ఆ ఇద్దరినీ కటకటాల వెనక్కి పంపించే తీరాలి. పోగొట్టుకున్న డబ్బు కోసం మాత్రమే కాదు, ఇకపైన ఆ దుర్మార్గపు కేటు గాళ్లిద్దరూ ఇంకొందరిని బుట్టలో వేసి నాశనం చేయకుండా ఉండటానికి. ఇది నీవు చేయాల్సిన ధార్మిక బాధ్యత మాత్రమే కాదు —సాంఘిక ధర్మం కూడాను. ఇప్పటికిప్పుడు చెప్తేనే భాగ్యనగరం స్పెషల్ బ్రాంచీ పోలీసులు సూరత్ వరకూ వెళ్లి, వాళ్ళిద్దరి కోసమూ జల్లెడ పట్టగలరు. నువ్వుగాని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నావని వాళ్లు పసిగట్టిన మరుక్షణం రెక్కలు విదిల్చిన విహంగాల్లా గగన వీధుల్లోకి దూసుకుపోతారు.


ఈ పోరాటంలో నువ్వొక్కడివే కాదు. నీతో బాటు నేనుంటాను. నీ లాయర్ కూడా ఉంటాడు. ముఖ్యంగా నీకు తోడుగా అనూరాధ కూడా ఉంటుంది. నువ్వు చేసినది తప్పు కాదని నీకు తప్పుడు భరోసా యివ్వడం లేదు. కాని యెట్టి పరిస్థితులోనూ అనూరాధ నిన్ను ఊబిలో పడనివ్వదు. తన కోసం మాత్రమే కాదు, తన యిద్దరు బిడ్డల కోసం కూడాను. ఇది గుర్తుంచుకో--ఆర్ యు రెడీ నౌ?”


వ్యాస్ తలూపుతూ లేచి మిత్రుడి చేతిలో చేయుంచాడు. “నేను సిధ్దం. దేనికైనా నేను సిధ్దం” అని లేచాడు .


అప్పుడు హరిత లోపలకు వచ్చి-“అన్నయ్యా!”అని పిలిచింది. అతడాగి వెనక్కి తిరిగి చూసాడు.


“ఆశ్వయుజంలో అశ్వనీ నక్షత్ర యుక్త పౌర్ణమి. అమ్మవారి గుడిలో అర్చకులు మంగళసూత్ర పూజ జరిపించారు.మరచిపోకుండా ఈ ప్రసాదం మేడమ్ గారికి యివ్వండి-ప్లీజ్!” అని అరిటాకులో ఉంచిన ప్రసాదాన్ని అందించింది.


అతడు కొన్ని క్షణాలపాటు ప్రసాదాన్ని తేదేకంగా చూసి కళ్ళకద్దుకుని, తడిసిన కనురెప్పల్ని తుడుచుకుంటూ, గుమ్మం వేపు నడిచాడు. దూరాన గుడి గంటలు ఖంగు ఖంగుమని మ్రోగుతున్నాయి.

***

రచయిత పరిచయం

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో, మరొక నవల-ఆంధ్రభూమి మాసపత్రికలోప్రచురించబడ్డాయి.


620 views0 comments

Comments


bottom of page