top of page

సుడిగుండం


'Sudigundam' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

బల్కం పేట పోలీసు స్టేషన్ కి ఎస్సైగా చేరిన మూడవరోజే దయాకర్ కి కచ్చితమైన క్లిష్టతరమైన హత్యకేసొకటి స్వాగతం పలికింది. అతడు రైటర్ ని పిలిచి కేసు ఫైలు అందుకుని కేసు వివరాలను పట్టీకరణం చేయనారంభించక ముందే పై అధికారుల నుండి ఫోన్లు రాసాగాయి; నగర మోతుబరి వ్యాపారి హత్య కేసు కాబట్టి ఒక్క అంశమూ విడిచి పెట్టకుండా సంఘటనను అన్ని కోణాల నుంచి పరిశోధించి, క్లూస్ టీము సహకారంతో ముందుకు సాగమని- తన శక్తి సామర్థ్యాలను చూపించడానికి దానినొక అవకాశంగా మలచుకోమని-- వ్యవహారం అంతటితో ఆగిందా-- లేదు. కేసు ప్రోగ్రెస్ ని పై అధికారులకు డే-టు-డే ప్రాతిపదికిన తెలియ జేయమని హుకుం. ఆ సమయాన తన ప్రత్యక్ష పై అధికారి సి. ఐ. గారు ఊళ్ళో లేకపోవడం అతడికి ఎదురు చూడని ప్రతిబంధకం. ఈ ఆదేశాల పరంపరతో యువకుడూ ఉత్తేజపరుడూ ఐన దయాకర్ ఉన్నపాటుగా ఊపునందుకోవడానికి ఉక్కిరి బిక్కిర యాడు.

ఇక ఏ మాత్రం జాప్యానికి తావివ్వకుండా అక్కడి ప్రాంతీయవాసి ఐన హెడ్డు ఏకాంబరంతో- సీనియర్ కానిస్టేబుల్ కనకయ్యతో రంగంలోకి దుమికాడు. అక్కడికక్కడ డాగ్ స్క్వేడ్ తో ప్రత్యక్షమయాడు. క్లూస్ టీము సహకారంతో పలువిధాల పరీక్షలు జరిపి సాధ్యమైనంత మేర ప్రాథమిక రిపోర్టుని సమగ్ర రూపంలో తయారు చేసాడు. ఈ కేసు విషయంలో పై అధికారుల వేగిరపాటు వెనుక ఉన్న కారణం దయాకర్ గ్రహించక పోలేదు. లిక్కర్ బేరన్ ఐన భూపాల్ హత్యకేసు అన్ని టీ వీ చానల్సు లోనూ ఫ్లా ష్ న్యూస్ గా పెట్రేగి పోయింది.

రాష్ట్రంలో నానాటికీ ఎక్కువవుతూన్న క్రైమ్ కేసుల్ని హైలైట్ చేస్తూ చర్చోపచర్చలు సాగిస్తున్నా రు; ప్రతి పక్షీయుల సహకారంతో-- అదే అదనుగా అక్కడక్కడ ఎక్స్రా పార్టీవాళ్లు పాలక పార్టీకి వ్యతిరేకంగా దుమ్ము రేపుతున్నారు. ఇక టీ వీ కెమేరామెన్ల గురించి చెప్పనే అవసరం లేదు. రోజుకొక దృశ్యంతో తమను తాము ఫోకస్ లోకి రావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

నేర పరిశోధన ప్రక్రియలో ప్రాథమిక చర్యలన్నీ పూర్తియిన తరవాత నలువైపులా ముద్రించబడ్డ వేలి ముద్రలను తదితర అంశాలనూ పకడ్పందీగా కెమేరాలో బంధించి రికార్డు చేసిన పిదప దయాకర్ హత్య కేసు విషయంలో ఎదుర్కున్న మొదటి వ్యక్తి హతుడి జీవన సహచరి ఝాన్సీ-- రాత్రినుంచి కన్నీరు కారుస్తూ అన్నపానీయలు ముట్టకుండా కూర్చున్న ఆ వితంతురాలు పోలీసు ఎస్సైని చూసిన వెంటనే శివంగిలా లేచింది. ఆమె అలా ఆవేశంగా లేచినప్పుడు జుత్తు పట్టున ఊడి నల్లటి మబ్బులా పరచుకుంది.

”నన్నీ స్థితికి తీసుకువచ్చి నాకు శాశ్వతంగా నుదుట బొట్టు లేకుండా చేసిన హంతకుల్ని మీరు పట్టుకుని నా ముందుంచాలి ఇన్స్పెక్టర్! నా చేతులతోనే వాళ్ళ పొట్టను చీల్చి మీకప్పగిస్తాను ఇన్స్పెక్టర్!”

అతడేమీ అనలేదు. అవన్నీ ఆమె దు:ఖావేశంతో అన్నవే! ఆ మాటకు వస్తే ఎవరు మాత్రం తమకు తాము చట్టాన్ని ఉల్లంఘిస్తూ మహిసాసుర వర్ధినిగా మారగలరు-- కాని ఆమె దు:ఖ పూరిత స్వరాలు అతడి అంతరంగాన్ని తాకాయి. ఝాన్సీగారు బొట్టులేని తన ముఖం గురించి వేదనతో చెప్తున్నప్పుడు అతడికి అనుకోకుండా బొట్టు లేని తన తల్లి ముఖం కళ్ళ ముందు మెదిలింది. లోలోన గుండె కదలింది. సెంటిమెంటల్ గా మారకుండా జాగ్రత్త పడుతూ ప్రక్కనున్న సీటులో కూర్చోమని చెప్తూ అన్నాడతను

“చూడండి మేడమ్! మీరు దు:ఖసాగరంలో ఉన్నారని నాకు తెలుసు. ఇంత త్వరలో ఆ దు:ఖం తీరదని కూడా నాకు తెలుసు. కాని నాకంటూ ఉద్యోగ బాధ్యతలున్నాయి. కర్తవ్యాలున్నాయి. అందుకే మీవారి హత్యకేసులో మాకు సహకరించిమని కోరుతున్నాను. కేసు పరిష్కారంలో ఎంత ఆల స్యమైతే అంత అనుకూలిస్తుంది నేరస్థుడికి. ఎటువంటి వేగిరపాటుకీ లోనవకుండా నిదానంగా ఆలోచించి బదులివ్వండి. మీరివ్వబోయే భోగట్టాను బట్టే తాడుపురిని తిప్పుతూ మేం ముందుకు సాగుతాం. భూపాల్ గారి హత్య విష యంలో మీకెవరిపైనైనా అనుమానం ఉందా?”

అలా అడుగుతూనే హెడ్డుకి చూపుతో సైగ చేసాడు— విషయాలను రికార్డు చేయమని--

”ఇంకెవరు చంపుంటారు? మా వారి ఎదుగుదల చూసి ఓర్వలేని వారే!”

“బహువచన ప్రయోగం చేస్తున్నారు— మీ వారికి శత్రువులు ఒకరికంటే యెక్కువగానే ఉన్నట్టా!”

“ఎందుకుండరూ— ఆయన మొదటి భార్య రంగమణి ఒక్కెతె చాలదూ! పరస్పరాంగీకారంతో విడాకులు పొంది కోర్టు ద్వారా నష్ట పరిహారాన్ని పకడ్బందీగా పొందిన తరవాత కూడా ఇంకా ఇంకా కావాలని వెంపర్లాడుతుంటుంది. నన్నొకసారి ఎటాక్ చేయాలని ప్లాన్ చేసిన రాక్షసి కదూ! ఆ తరవాత-“ అంటూ చటుక్కున ఆగిపోయిందామె చెక్కిళ్ళపై జాలువారుతూన్న కన్నీటిని చీర చెంగుతో తుడుచుకుంటూ-- ఎస్సై దయాకర్ ఆగాడు. వెంటనే ఒత్తిడి పెట్టలేదు. మానసికంగా బలహీనమవుతూ దు:ఖంలో ఉన్న ఒక స్త్రీ వద్ద రాబట్టవలసిన మార్గం వేరొకటుందని అతడికి తెలుసు; సౌమ్యత-- ఆమె అనుభవిస్తూన్న దు:ఖంతో పాలు పంచుకోవడం-- అంచేత అతడాగి నిదానంగానే అన్నాడు-

“పర్వాలేదు. శాంతంగానే ఆలోచించి చెప్పండి. కాని తెలిసిన విషయా లన్నిటినీ దాచకుండా చెప్పండి. లేకపోతే, అసలైన హంతుకుడో హంతకురాలో గుప్పెట్లోనుంచి తప్పిపోవచ్చు. ఆ తీరున నిర్దోషులకు అన్యాయం జరగవచ్చు”.

ఆమాటతో ఝాన్సీ తేరుకుని సర్దుకుంది. నిజమేనన్నట్టు తలూపుతూ అంది- “మావారికి మాడ వీధి చివరన గార్ల్ ఫ్రెండుంది. ఒకానొకప్పుడు ఆవిడ తెలుగు తమిళ కన్నడ

సినిమాలలో నటించేదట- చిల్లర వేషాలలో-- పేరు మనోన్మణి. దానికి కూడా కన్నెర్రగానే ఉంది”

ఎందుకన్నట్టు కళ్ళెత్తి చూసాడు దయాకర్; తక్కువ ప్రశ్నలతో ఎక్కువ భోగట్టా రాబట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో-- “ఇంకెందుకు— పంగణం ఊళ్ళో ఉన్న నాలుగెకరాలు దాని పేర వ్రాసివ్వలేదని. అంతేకాదు— మావారు ఈ మధ్య అటువేపు వెళ్ళడం తగ్గించారు కూడాను-- ఆ కసితో ఆ మధిరాక్షి దేనికైనా తెగిస్తుంది—”

అప్పుడతను తలూపుతూ అడిగాడు-“ఈవిడ కూడా మిమ్మల్ని ఎటాక్ చేయాలని ప్రయిత్నించిందా?”

“అది కూడా ఆబాపతే- ఏదో ఒక రూపంలో నన్ను ఎటాక్ చేసుంటుంది- కాని నాకు తెలియకుండానే తప్పించుకుని ఉంటాను”

దానితో దయాకర్ ఊరకుండిపోయాడు. నిదానంగా అటు చూసి ఏపుగా పచ్చటి పూల మొక్కలా మెరుస్తూన్న ఝాన్సీ కూతురు కృష్ణవేణి వేపు ప్రశ్న సంధించాడు- “మీ నాన్నగారిని బండరాయితో మోది దుండగులు పరుగెత్తుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు?”

ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని బదులిచ్చింది- “నో సార్! నేనప్పుడు ఇక్కడ లేను సార్. వార్త విన్నవెంటనే హాస్టల్ నుండి టాక్సీలో దూసుకు వచ్చాను” కంటనీరు నింపుకుంటూ అందామె.

“సారీ కృష్ణవేణీ! నేను కావాలని అడగటం లేదు. నా ఉద్యోగానికి అనివార్యం ఈ ప్రశ్నల ప్రవాహం. నా పై అధికారుల ఆదేశం పాటించాలి కదా! ఇంకా చెప్పాలంటే- ఇది లోడెడ్ క్వశ్నన్ కాదు. సప్లిమెంటరీ ఇంటరాగేషనే— మీ నాన్నగారంటే అంతగా అనుకూలత లేని వ్యక్తుల గురించి మీరేమైనా చెప్పగలరా?”

కృష్ణవేణి తల అడ్డంగా ఆడించింది అంతకు మించి చెప్పడానికేమీ లేదన్నట్టు. అతడు తలపంకిస్తూ మరొక ప్రశ్న వేసాడు- ”లతా గృహమంతటి ఇల్లుండగా మీరెందుకు హాస్టల్ లో ఉంటున్నారు?”

“ఔను. నిజమే సార్. కాలేజీ మరీ దూరం కాదు. నాకు కూడా ఇంట్లోనే ఉండాలనుంది. కాని లోకజ్ఞానం అలవడ్తుందని- క్రమశిక్షణ ఏర్పడుతుందని అమ్మే కాలేజీ హాస్టల్ లో చేర్పించింది“

కూతురు అన్నదాంట్లో వాస్తవం ఉందన్నట్టు ఝాన్సీ సన్నగా తలాడిం చింది. అప్పుడు దయాకర్ మళ్లీ అందుకున్నాడు- “చివరి ప్రశ్న- మీరు ఇంటికి ప్రతినెలా వచ్చి అమ్మానాన్నలను చూసిపోతుం టారా?”

ఈసారి ఝాన్సీ కోపంతో చూసింది. “అసలే దు:ఖంలో ఉంటే మమ్మల్నెందుకు సార్ పనికిరాని ప్రశ్నలతో వేధిస్తారు?”

అప్పుడు కృష్ణ వేణి చాలెంజింగ్ టోన్ తో అంది- “అడగనివ్వమ్మా! ఎస్సైగారి వ్యవహారం చూస్తుంటే అసలైన హంతుకుడు ఈపాటికి నగరం పొలి మేర దాటేసే ఉంటాడు”.

“హఁ- చెప్తాను సార్. నోట్ చేసుకోండి. నేను సాధారణంగా ఇటు వేపురాను. వీడియో కాల్ సిస్టమ్ ద్వారా అమ్మతో మాట్లాడుతుంటాను. హైగ్రేడ్ మార్కులు సంపాదించాలన్న ధ్యేయంతో స్టడీలో లీనమై ఉంటాను. లైబ్రరీలో యెక్కువ సేపు గడుపుతుంటాను. ఎనీథింగ్ మోర్?”

అతడు తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు- “దట్సాల్-- అండ్ థేంక్స్ ఫర్ యువర్ కో ఆపోరేషన్ మిస్ కృష్ణవేణీ. శవపరీక్ష రిజల్ట్ వచ్చిన తరవాత మీరు మీ అమ్మగారితో ఓసారి స్టేషన్ కి రండి ఫైలు అప్ డేట్ చేయడానికి. ఈ పరిస్థితిలో మీకు శ్రమ ఇచ్చి నట్టున్నాను. ప్లీజ్- డోంట్ ఫీల్” అంటూ గది బైటకు వచ్చి మాడ వీధిలో ఉంటూన్న హతుడి మాజీ సతీమణి రంగమణి యింటి వేపు జీపు పోనిచ్చాడు. ఆమెను పోలీసు టీముతో ఇంటరాగేట్ చేసి వాగ్మూలం తీసుకున్న తరవాత దయాకర్ ఫ్లయింగ్ స్క్వేడ్ లా భూపాల్ రావు గార్ల్ ఫ్రెండు వద్దకు కూడా వెళ్లి అదే రీతిన ఇంటరాగేట్ చేసి అవసరం కలిగితే తను స్టేషన్ కి పిలుస్తానని, అప్పుడు రావలసి ఉంటుందని చెప్పి, అందిన ఆదేశాల ప్రకారం తన పై అధికారులకు తను అందుకున్న వివరాల వైనాన్ని అందచేసాడు. అప్పుడు తెలుసుకున్నాడు తనకు మార్గ దర్శకం చేయవలసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గుంటూరుకి బదలీ అయిపోయాడని. ఇకపైన కొత్త సి ఐ వచ్చేంతవరకూ కేసుని తనొక్కడే క్రిందా మీదా పడి డీల్ చేయాలేమో!

ఏ విషయంలోనైనా అత్యాశ చెడ్డది. అందునా యవ్వన కాంతులు చిమ్మే ఆడదాని అందం చూసి అత్యాశ చూపించడం మరీ చెడ్డది. దీనినొక నీతి పాఠ్యాంశంగా స్కూలు పుస్తకాల్లోకి ఎక్కిస్తే భావితరం ఎంతోమంది యెలార్ట్ అవుతారు. సగంలో సగం మందయినా బాగుపడతారు. అందుకేగా వేమన మహాశయుడు అప్పుడే నుడివాడు- బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులని-- ఇక పాయింటుకి వస్తే చాలా మంది మగపురుషులు ఉన్న ఒక్కదానితో డీల్ చేయలేక తల్లడిల్లి పోతుంటే ఆ దివంగత మహానుభా వుడు భూపాల్ అంత మంది ఇంతులతో ఎలా గెంతులు వేస్తూ నెట్టుకు పోగలిగాడో! నిజం చెప్పాలంటే—అదొక అనూహ్యమైన మర్మకళే— వాళ్ళలో యెవరో ఒకరు అసూయతోనో మరే కారణంతోనో అతడి అంతు తేల్చి ఉంటారు. ఎంత ధనప్రవాహం ఉంటే మాత్రం, ఉల్లి మల్లి అవుతుందా! కట్టుకున్న భార్యలా వెలయాలు చూసుకుంటుందా !

ఆఖరు సారిగా పొరుగూరి స్టేషన్ హౌస్ ఆఫీసరుకి ముందస్తు కబురందిచ్చి దయాకర్ పోలీసు టీముతో కృష్ణవేణి చదు వుతూన్న కాలేజీకే వెళ్లి- ఆమెతో చివరి దశగా మాట్లాడి అటు పిమ్మట కాలేజీ హాస్టల్ కి కూడా వెళ్లి మరి కొంత భోగట్టా సేకరించి ముఖ్యమైన అంశాలను నమోదు చేసుకుని స్టేషన్ చేరుకున్నాడు.

అతనారోజు స్టేషన్ లో కూర్చోలేదు. తీరిగ్గా పోలీసు ఆఫీసర్ల అతిథి గృహంలో ఎటువంటి అలజడికీ లోను కాకుండా పకడ్బందీగా కూర్చుని రిపోర్టు తయారు చేయడానికి పూనుకున్నప్పుడు అశనిపాతంలా డి ఐ జీ నుండి ఫోను వచ్చింది; తనను వెంటనే వచ్చి కలుసుకోమని. ఇన్ వెస్టిగేషన్ కి యేర్పడ్డ జాప్యానికి సంజాయిషీ అడుగుతాడేమోనని తర్జన భర్జన పడుతూ యెక్కెడివక్కడ విడిచి పోలీసు హెడ్ క్వార్టర్సు చేరుకున్నాడు ఎస్సై దయాకర్. కాని మేటర్ అది కాదు. నగరానికి చెందిన తీవ్ర వాదుల ముఠా ఒకటి ముందెప్పుడో ఇక్కడ ఎడాపెడా బాంబింగులో పాల్గొని ఆ తరవాత చల్లగా జారుకుని పూణేలో తల దాచుకుంటుందని- వాళ్లను వెతికి పట్టుకునేందుకు ఏర్పడ్డ టాస్స్ ఫోర్సులో అతణ్ణి మెంబరుగా చేర్చానని చెప్పేటప్పటికి దయాకర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆర్డర్ గా విషయాన్ని అందిపుచ్చుకుని తిన్నగా తనకోసం వేచి ఉన్న కొత్త ఆఫీసరుకి స్టేషన్ బాధ్యతలు అప్పచెప్పి ఇంట్లో ఎదురు చూస్తూన్నభార్యకి ఓ మాట చెప్పి స్పెషల్ టాస్కుఫోర్సు టీములో చేరిపోయాడు.

పిమ్మట డ్యూటీలో చేరి హత్యకేసు ఫైలు అందుకున్న కొత్త ఎస్సై వరాలరావు కూడా కేసుని ఒక కొలిక్కి తేవడానికి తెగ అవస్థలు పడనారంభించాడు. ఎంతగా అవస్థలు పడ్డాడంటే- ఎఫ్ ఐయ్యారుకి సంబంధించిన ఫైల్ నవ్యీకరించడం తప్ప అనుమానితుల్ని మరొక మారు కౌంటర్ చెక్ కోసం ఇంటరాగేషన్ చేసిన తరవాత కూడా చార్జ్ షీటు ఫైలు చేయలేక పోయాడు. ఆ లోపల ఏమైందో ఏమి జరిగిందో గాని— వరాలరావు ట్రాన్స్ఫర్ తీసుకుని తన స్వంతూరు వెళ్లి పోయాడు.

హెడ్డుకీ సీనియర్ కానిస్టేబుల్ కీ చెప్పిన వైనం ప్రకారం తన భార్య మంచాన పడిందని, తన పెద్ద కూతురుకి పెళ్లి సంబంధాలు తనే చూడాలని— తన ఆగమనం అనివార్యమని-

ఆ పైన రూల్స్ ప్రకారం మరొక కొత్త ఎస్సై వచ్చి చేరాడు. మరైతే భూపాల్ రావు హత్య కేసు మాత్రం యెక్కడ వేసిన గొంగళి అక్కడే పడున్నట్టు నత్తనడకన సాగుతూంది. ఇకపైన కూడా అలానే సాగుతుందేమో! ఎందుకంటే- కేసుని పరిశోధన చేసి ముగించాలన్న ఆలోచన లేకపోతే పై నుంచి గాని క్రిందనుంచి గాని ఎంతటి ఒత్తిడి వస్తే మాత్రం ఏం లాభం! కేసుని మూసెయ్య లేక, అదే సమయాన ముందుకు సాగించలేక మల్లగుల్లాలు పడుతున్నారందరూ— ఇకపోతే, కేసు ఫైలులోకి ఎవరై నా కాస్తంత మనసుంచి చూడగలిగితే ఊహను జోడిస్తే యిట్టే తెలిసి పోతుంది వ్యవహారం ఏమిటో, దాని ఆనుపానులేమిటో--

ఇంకా మరింత సూటిగా చెప్పాలంటే ముందున్న ఇద్దరు ఎస్సైలకూ ఇప్పుడిప్పుడు చార్జీ తీసుకున్న కొత్త ఎస్సైకి బాగానే తెలుసు; భూపాలరావుని ఎవరు హత్య చేసారో— ఎందుకు చేసారో-- - ఎటువంటి పరిస్థితిలో చేసారో-- కాని వాళ్ళకు మనసే రావడం లేదు క్లూస్ అన్నిటినీ క్రోడీకరించి విశదీకరించి- హత్య చేసిన ముద్దాయని రికార్టులోకి తెచ్చి బోనులోకి ఎక్కించ డానికి. ఇక సాగదీయకుండా చెప్పా లంటే— భూపాల్రావుని హత్య చేసింది మరెవ్వరో కాదు; అతడి రెండవ భార్య ఝాన్సీయే-- - ఏదైనా సరే— ఏ వ్యసనమైనా సరే- శృతి మించి రాగాన పడితే మొత్తానికి మోసం వస్తుందన్నది లోక విదితమేగా!

నరకానికి మూడు ముఖ్యద్వారాలున్నా యంటారు తత్వవేత్తలు. వాటిలో ముఖ్యమైనది- అలవికి మించిన కామేఛ్ఛ. భూపాల్ రావుకి మొదటినుంచీ ఆడవాళ్ల కోసం- అందునా యవ్వన స్త్రీల పొందు కోసం వెంపర్లాడటం వ్యసనంగా మారింది. అలా స్త్రీల యవ్వన ప్రాప్తి కోసం అతడు పడే ఆరాటం అతణ్ణొక సెక్సీ సైకోగా మార్చివేసింది. సెక్స్ మ్యానియక్ గా-- పశువుల్ని వెంటాడుతూ అనవరతం అంటిపెట్టుకుని రక్తాన్ని పిండుకునే అంబార పిడుచులా-- కామోద్రేకమైన అతడి పిచ్చి ఎంత వరకు ముదిరిందంటే - ఝాన్సీ కడుపున, ఆమె మొదటి భర్తకు పుట్టిన కృష్ణ వేణిని- అతడికి కూతురు వరసైన కృష్ణవేణి పైన కూడా కన్నేసాడు భాపాలరావు.

ఆ రోజు రాత్రి తల్లితో తను పెళ్లి చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడానికి వచ్చిన కృష్ణ వేణి గదిలోకి చొరబడి కామసర్పంలా కాటేయడానికి ప్రయత్నించాడు. పెనుగులాడాడు. అది చూసిన ఝాన్నీ మృగాడుగా మారిన భర్తను స్వచేతులా బండరాయితో కొట్టి పరలోకానికి పంపింది. కూతురి శీలం కాపాడింది. ఇదెలా తప్పవుతుందో— ఏ రీతిన నేరమవుతుందో తమకంటూ కన్న కూతుళ్లున్న ఆ ముగ్గురు పోలీసు ఆఫీసర్లకూ తెలియటం లేదు. ముఖ్యంగా అదొక తప్పిదంగా వాళ్ల అంతరంగానికి తాకడం లేదు. ఆత్మఘోషను అణచుకుని ఝాన్సీ దేవిని ఎలా జైలుకు పంపాలో అర్ఱం కావడం లేదు. మనస్కరించడం లేదు. అటువంటి సందర్భంలో ఆ సంక్షోభిత సిచుయేషన్ లో ఏ కన్న తల్లయినా అలానే కదా చేసి తీరుతుంది! ఇంకా చెప్పాల్సి వస్తే, ప్రతి భారతీయ స్త్రీకీ తన ప్రాణం కన్నా పెళ్ళికాని కూతురి మానమే కదా మిన్న! చట్టం శాసిస్తుంది. కాని సునామీ తరంగంలా లేచి పడే ఆత్మసాక్షిని శాసించ గలగుతుతుందా!

ఏమో మరి-- తదుపరి బదలీపై చేరబోయే కొత్త పోలీసు ఆఫీసరో లేక టఫ్ రూల్ మైండుగల మరింకెవరో రంగ ప్రవేశం చేసి ఈ కేసు గుట్టుని రట్టు చేయాలేమో! అంత వరకూ కేసు ఫైల్సు మారుతూనే ఉంటాయేమో!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


88 views0 comments

Comments


bottom of page