top of page

జంతు ప్రేమికుడు జగ్గన్న

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





'Janthu Premikudu Jagganna' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

జంతువులంటే చెప్పలేనంత ప్రేమ జగ్గన్నకి.మనుషులకంటే వాటినే ఎక్కువగా ఇష్టపడతాడు.ఈ జంతు ప్రేమికుడి కథను చక్కగా మలిచారు ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు.


మా ఊరు మాండవలస, విజయనగరం పొలిమేరన ఉంది. తారు రోడ్డుకి యివతలకు చూస్తే మా ఊరు. రోడ్డుకు అవతల చూస్తే బారులు తీర్చినిల్చున్న చెట్లు, వాటిని దాటితే కొండలు. ఆ కొండల మధ్య సరసరా సాగే వాగు. ఊరిపెద్ద కొడుకుని కాబట్టి నా సమవయస్కులైన కుర్రకారు మధ్య నాకొక అదనపు పోటు వుండేది. పాలేళ్ళ కొడుకుల మధ్య, కామాటి పనివాళ్ళ కొడుకుల మధ్య నన్ను అధికుడిగానే చూసేవాళ్ళు. ఇంకొక కారణం—ప్రక్కనున్న అగ్రహారపు అబ్బాయిలతో సమానంగా నేనొక్కణ్ణే రోడ్డవతల ఉన్న బడికి వెళ్ళి వస్తుండే వాణ్ణి. మాండవలసలోని కుర్రాళ్ళకు, కడకు కోమటి గంగన్న కొడుకు రామప్పడికి సహితం అంత వరకు వెళ్ళి, చదువుకునే స్థాయుండేది కాదు. ఆ స్కూలుని అదెప్పుడో నేను పుట్టకముందు ఓ యింగ్లీషు టీచరమ్మ ఎవరో గమిగత్తె తోడ్పాటుతో తెరచి నడిపి, బడికి పట్టుగల నిర్వహణా పధ్ధతుల్ని ప్రవేశపెట్టి, ఓ సుముహూర్తాన జమీందారు చిన్నకొడుకుతో జతకట్టి యూరప్ వెళ్ళిపోయిందంటారు.

స్కూలు గోడలపైన వ్రేలాడుతున్న రెండు మూడు ఆంగ్లేయుల చిత్రపటాలు చూస్తే అది వాస్తవమేననిపిస్తుంది. ఇక నా బడి చదువుల సంగతి ప్రక్కన పెట్టి చూస్తే, నాతో దగ్గరగా మెసలే జగ్గన్నంటే నాకు యిష్టం. కారణం--వాడికి జంతువులతో మచ్చికెక్కువ. వాడెప్పుడూ కుక్క పిల్లలతో, పిల్లికూనలతో, మేకలతో, కుందేళ్ళతో హడావిడి చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు పాముల బుట్టలతో కూడా కనిపించేవాడు. నిజానికి నాకు కూడా జంతువులతో మచ్చికగా ఉండటం యిష్టం. కాని యింట్లోవాళ్ళకు అది గిట్టేది కాదు. జబ్బులంటుకుంటాయని, కొరిక పీక్కేస్తాయని గసిరేవారు. గదిలో పెట్టి బయటకు కదలనీయకుండా గొండెం పెట్టేసేవారు. నేను చేయలేని పనిని జగ్గన్న చేయగలగడం నాకు ముచ్చటగా ఉండేది. మురిపెంగా ఫీలయే వాణ్ణి. వాడితో నాకున్న బంధం యెటువంటిదంటే మా మేనమామ పైడి రాజుగారికీ, మాకూ ఉన్నటువంటిదన్నమాట.

ఆయన యెప్పుడు యెక్కడ చూసినా పెదవులతో పలకరించేవాడు కాడు. జిలేబీలు, సున్నుండలు, రసగుళ్ళాలు చేతుల నిండా గుప్పించేవాడు. మేం యావతో చొల్లు కారుస్తూ తింటున్నప్పుడు అతడు మావేపు ఆసక్తిగా చూస్తూ నిల్చునేవాడు. తరవాత-తరవాత అతడి వైఖరి వెనుకున్న చిదంబర రహస్యాని తెలుసుకున్నాను. అతడికి మిఠాయిలు తినడం అంటే— ముఖ్యంగా కాకినాడ కాజాలు తినడం అంటే మిక్కిలి యిష్టం. ఉదయమూ సాయంత్రమూ రెండు పూటలూ లాగించేసేవాడు. కాని ఓసారి మెడికల్ టెస్టు చేయించుకుంటే తెలిసింది; అతడికి మధుమేహం తాకిందని. దానితో బాటు రక్తపోటు కూడా దాడి చేయనారంభించిందని. అప్పట్నించి మాకందరకూ నానా విధాల దినుసులు తినిపిస్తూ, అది చూసి లోలోన ఆనందిస్తూ ఉండటం అలవాటు చేసుకున్నాడు. నాది కూడా దాదాపు అటువంటిదే-- జగ్గన్న జంతువులతో మచ్చికగా ఆడుకోవడం ఆమడ దూరం నుంచి చూస్తూ ఆనందపడిపోతూ ఉండేవాణ్ణి. ఈ కారణాల చేత వాడొక్కడే నన్ను ఒరే అని చనువు తీసుకుని సంబోధిస్తే అడ్డు చెప్పేవాణ్ణి కాను. పనిలో పనిగా మరొక విషయం చెప్పాలి. వాడికి వింతైన ధోరణి ఉండేది. దారిలో గాని సంతలో గాని, చెరువులోని గాని జాతర్లు జరిగేటప్పుడు గాని కొట్లాటలు చోటు చేసుకుంటే తీవ్రంగా గర్హించేవాడు. అడవిలోని జంతువులు కూడా అలా కొట్లాడుకోవు అని ఈసడించుకునేవాడు. ”మనుషులు మృగాలవడం ఇక్కడ ఫ్రీగా చూడవచ్చు“అని అందరికీ వినిపించేలా గట్టిగా నిందించేవాడు.

ఒకరోజు యిరుగు పొరుగు వాళ్ళమందరమూ వనభోజనాలకు వెళ్ళేందుకు యేర్పాటు చేసుకున్నాం. కార్తీక మాసంలో వనభోజనాలకు కూర్చోవడమంటే అదొక మాటలతో చెప్పలేని మజానే కదా! ఐతే—తోటలో గాని, అడవిలో గాని వనభోజనం యెక్కడ చేసుకుంటారు; దైవవృక్షం క్రిందనే కదా! ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉండాలి కదా! అటువంటివన్నీ జగ్గన్నకే తెలుసుండాలి. అంచేత జగ్గన్నను తోడ్కొని రావడానికి బయల్దేరాను. వాడు చూపు కానని తావున మరెక్కడో లేడు, రోడ్డుకి ప్రక్కన చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. వాణ్ణి నాతో వెంటనే రమ్మన్నాను ఉసిరి చెట్టున్న తోటకు తీసుకెళ్ళమని.

”మీరందరూ వెళ్తుండండి. నేను వెనుకే వచ్చి మిమ్మల్ని కలుసు కుంటాను“ అన్నాడు.

“మాతో రాకుండా అక్కడేమి పని?” అని అడిగాను.

“నాకోసమొక ఫ్రండు వస్తాడు. వాడితో మాట్లాడి వస్తాను”

“ఫ్రెండా ! వాడెవడురా నాకు తెలియని ఫ్రెండ్?“

“ అదంతా నీకెందుకురా! చెప్పాగా నీ వెనుకే వస్తానని! ” అన్నాడు.

ఇక నేనేమీ అనలేదు. అలాగే అంటూ ముందుకి సాగినట్టు సాగి ఓ మావిడి చెట్టు వెనుక దాక్కున్నాను. వాడి ఫ్రెండు తతంగమేమిటో తలుసుకోవాలన్న ఉత్సుకత నాలో ఊగిసలాడింది. మరి కాసేప టికి జగ్గన్న ఫ్రెండు రానే వచ్చాడు;గెంతుతూ కుప్పిగెంతులు వేస్తూ--ఇంతకీ యెవరా ఫ్రెండు?ఒక పొడవాటి కోతి చెంగు చెంగున వచ్చి జగ్గన్న ప్రక్కన కూర్చుని తలను రెండు చేతుల్లోకి తీసుకుని జుత్తులోకి తేరిపార చూస్తూ యేవేవో వెతికుతూ కెలికింది. ఏవేవో చేసింది. ముఖ కండరాలను మర్దన చేసింది. రెండు చెవుల్నీ పలుకోణాలలో సాగదీస్తూ మెలి పెట్టి లాగింది. ఆ తరవాత ఆప్యాయంగా జగ్గన్న ముఖాన్ని తడిమింది. వాడు ఒక్కసారి కూడా కోతిని దూరగా నెట్టడానికి ప్రయత్నించలేదు. చెక్కు చెదర కుండా అలానే కూర్చున్నాడు. ఇక చివరన మనిషి నేస్తానికి తనతో చేయడానికేమీ లేదని తలచి గావాలి కోతి గుబురు చెట్ల వేపు కదలబోయింది . అప్పుడు జగ్గన్న తన కోతి ఫ్రెండుని ఆపి, చేతికి అరటి పండు అందించి సాగనంపాడు. నేనిక చేసేది లేక మావిడి చెట్టు నుండి బయటకు వచ్చి వాణ్ణి సమీపించి అన్నాను- “చూసాను నీ ఫ్రెండుని కనులార. ఇక బయల్దేరుదామా! అందరూ యెదురు చూస్తుంటారు“.

వాడు అయిష్టంగా లేస్తూనే ఒకమాట అన్నాడు "నువ్వు నమ్ముతావో లేదో గాని నన్ను పలకరిస్తూ నా ముందు నాట్యం చేసే మరొక ఫ్రెండు కూడా ఉన్నాడు. ఇప్పుడు కాదు. మరొక్కప్పుడైనా చూపిస్తాలే! ”

“ఎవడా రెండవ ఫ్రెండూ—“

“చిన్నగా నాజూకుగా మిలమిల మెరిసే తాచు పాము“.

నాకు కంపరం కలిగింది. కోపంతో కంపిస్తూ అరచినంత పని చేసాను-

“ఏవిరా నీకు పిచ్చిగాని పట్టిందా! సమయానికి తోడు దొరక్కపోతే దేనితోనైనా యెవరితోనైనా స్నేహం చేసేయడమే—రేపు గాని మాటలు కలబోసుకోవడానికి నీ ఈడు కుర్రాళ్ళు దొరక్కపోతే సమాధుల్లోకి వెళ్ళి భూతాలతో చెలిమి చేసినా చేస్తావురోయ్! ఇక చివరి మాట విను. మనుషులకున్నట్టే జంతువులకూ మూడ్స్ ఉంటాయి. వాటికి మూడ్ సరిగ్గా లేనప్పుడు వాటితో చెలగాట మాడావంటే బెడిసి కొడ్తుంది. చితికిపోయిన టమోటాలా నుగ్గు నుగ్గయిపోతావు. గుర్తు పెట్టుకో-- ”

“ఫ్రెండ్స్ లేకపోతే నేనుండ జాలనురా---“ అన్నాడు జగ్గన్న.

*** *** ***

మా ఊళ్ళో రెండు చెరువులున్నాయి. వర్షాలు కురిసి యెండలు కాచి చలికాలం వచ్చేటప్పుడు రెండు చెరువుల్లోనూ చేపలు తుళ్ళుతూ లేచి పడుతుంటాయి. అదన్నమాట సమయం చెరువుల్ని వేలం పాటకు పిలవడానికి-- ఊరు ఊరంతా ఆడామగా అన్న తేడా లేకుండా కోలాహలంగా ఉంటుంది. వేలంపాట అందుకోవడానికి మాంవిడి వలసలోనుండే కాక, చుట్టు ప్రకల ఊళ్ళనుండి కూడా చేపల వ్యాపారం చేసే మోతుబరి ఆసామీలు గుమికూడుతారు. అప్పుడు చూడాలి తస్సదియ్యా---అప్పటి ఆ వేలం పాటలో ప్రాతకాలపు రాజకీయ ముఠా కక్షలన్నీ బయట పడతాయి. ఊళ్ళో సర్పంచూ ఉపసర్పంచూ ఉంటారు గాని, అదేమి ఆనవాయితో గాని పట్నం నుండి మత్స్య శాఖ అధికారులు వచ్చి వేలం పాట తతంగం ముగించి వెళతారు.

చేపల వేలం పాట ఆరంభం కాబోతుంది. అరుపులు ఆరంభమయాయి. అరుపులతో బాటు ఘీంకారాలు వాటితో తోపులాట లు కూడా ఊపందుకున్నాయి. మరికాసేపలా సాగనిస్తే మిరప వాసన తగిలి దుడ్డు కర్రలతో కొట్లాటకు దిగినా దిగుతారు, అసహనానికీ అలజడికీ లోనవుతూ చుట్టు ప్రక్కల చూపు సారించాను. జగ్గన్న యెక్కడా కనిపించలేదు. వాడికి యిటువంటి ఘర్షణాత్మక హింసాత్మకమైన ఘీంకారాలు, దుడ్డు కర్రలు గాలిలోకి విసరడాలూ ససేమిరా నచ్చదు. వీటిని సహించలేక కాబోలు, జగ్గన్న తోటలోకో కొండలవతల ఉన్న అడవుల్లోకో వెళ్ళిపోయుంటాడు. లేదా వాగులోకి దూకి ఉంటాడు. ఆశ్చర్యం— అప్పుడక్కడ అనుకోకుండా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ప్రత్యక్షమయాడు జగ్గన్న. వచ్చిన వాడు తిన్నగా కేకలు వేసుకుంటూన్న మోదుబరి పెద్దల వద్దకు వెళ్ళి యేదో చెప్తున్నాడు. నేను మరీ దూరాన ఉండటాన నాకేమీ వినిపించలేదు. వేగంగా ఊపందుకుని వాళ్ళ మధ్యకు దూరాను.

పెద్ద తలలందరూ ఉక్కుమ్మడిగా అడుగుతున్నారు- “ఏమంటున్నావురా జగ్గూ? నువ్వు మాతో తమాషా చేయడానికి చెప్పడం లేదు కదా! “

జగ్గన్న బుంగమూతి పెట్టాడు. “నేనెందుకు తమాషా చేస్తాను? ఈపాటికి పులి మనూరి పొలిమేరలోకి వచ్చేసుంటుందని చెప్పగలను!”

” పులా! నాకు గుండె గుభేలుమంది. “అంత రూఢిగా యెలా చెప్పగలవు? వెధవ్వేషాలు వేసావంటే డొక్క చీల్చేస్తాం. తెలుసు కదూ! “

ఈసారి జగ్గన్న మోతుబరి ఆసామీలతో మాటలు కలపలేదు. నిశ్శబ్దంగా చేతిలోని చిన్నపాటి జంతువును వాళ్ళ చేతుల్లో పెట్టాడు. వాళ్ళు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు- “ఇదేంవిట్రా కుర్ర సన్యాసీ! శుభమా అని వస్తే పిల్లి కూనను చేతిలో పెడ్తావట్రా—”

అప్పుడు వాడు చావు కబురు చల్లగా చెప్పినట్టు ఊదాడు- “ఇది పిల్లి కూన కాదు పులి కూన. ఇదెలాగో దారి తప్పిపోయి ఊరవతల తచ్చాడుతుంటే నేనెత్తుకొచ్చాను. ఈ పులి కూన కోసం ఆ తల్లి పులి ఈపాటికి యిటువేను వస్తుంటుంది. ఇదిగో— దాని గాండ్రింపు యెక్కణ్ణించో వినిపిస్తుంది. మీకింకా--“ అని ముగించేలోపల అందరూ ఉక్కుమ్మడిగా- “అమ్మబాబోయ్! ” అంటూ యెక్కడివక్కడ విడిచి పెట్టి చెల్లాచెదురుగా పరుగెత్తసాగారు. ఇక నావి షయం చెప్పాలా! నేనూ దౌడు తీసాను. పట్నం నుంచి వచ్చిన అధికార గణం తట్టా బుట్టా పట్టుకుని జీపులోకి హైజంప్ చేసారు. మరి కాసేపట్లో వేలం పాట పాడే స్థలమంతా పీఠ భూమిలా నిర్జనంగా మారిపోయింది. నేను చాలా దూరం అడ్డదిడ్డంగా పరుగెత్తి తిరిగి చూసాను. పులి కూన మాత్రం బెంచీపైన కూర్చుని తల్లి పులి కోసం కాబోలు గజి బిజి శబ్దాలు చేస్తూంది. దాని వెర్రి మొర్రి శబ్దాలకు అర్థం కావాలంటే దాని తల్లి పులే వచ్చి చెప్పాలి మరి---

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


53 views0 comments

Comments


bottom of page