top of page

స్నేహానికి సరికొత్త ఒప్పందం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Snehaniki Sarikotha Oppandam' Telugu Story Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు కలిసాడు. ఆర్థికంగా చితికి పోయి ఉన్నా ఆత్మాభిమానం మాత్రం కోల్పోలేదు.

ఆప్యాయతలు కూడా తగ్గలేదు.

బాల్య స్మృతులను గుర్తు చేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

పరశురామ్ దాదాపు పన్నెండేళ్ల ఎడబాటు తరవాత- పలు ప్రాంతాలలో పలు రాష్టాలలో కేంద్ర సర్కారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి- అలా అలా బదలీల జోడెద్దుల బండిపైన ముందుకు సాగుతూ ఎట్టకేలకిప్పుడు భాగ్యనగరం చేరాడు. ఏది ఎలాగైతేనేమి కట్ట కడపటి మజిలీగా అహ్మదాబాదు నుండి స్వంతూరు చేరాడు. చేరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పై స్థాయిలో పదోన్నతి పొంది హెడ్ ఆఫ్ ది ఆఫీసుగా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. తనతో ఒకనాడు అదే ఆఫీసులో తనతో కలివిడిగా పని చేసిన అప్పటి డిపార్డుమెంటల్ స్టాప్- ఇప్పటి ఆఫీసు స్టాఫ్ కలసి యిచ్చిన సద్భావ సన్మానం పొందాడు. కళకళలాడే పచ్చ తోరణాల మధ్య. ఒకనాడు తమతో బాటు ఒకే బాచ్ లో చేరి తమతో కలసి పని చేసిన ఒక సహోద్యోగి తమతో మళ్లీ చేరడం, అదీను ఉన్నత స్థాయిలో చేరడం ఒక అరుదైన మధురానుభూతే కదా!

ఇక పోతే- మాటకి మాట చెప్పుకుంటే- పరశురామ్ కి ఇంకా మిగులి ఉన్న సర్వీసు పదిహేనేండ్ల పైమాటే! ఆ లోపల, ఇంకెన్ని పదోన్నతుల సోపానాలు అతడి కోసం యెదురు చూస్తున్నాయో! మొత్తానికి అక్కడ పనిచేస్తూన్న చాలామందికి అందని అంబరాలను అతడు పకడ్బందీగా అందుకున్నాడన్నది సువిదితం.

ఇక పరశురామ్ విషయానికి వస్తే- అతడు స్వతస్సిధ్ధంగా సౌమ్యుడు- స్నేహశీలుడు. అధికార పూర్వక వ్యవహారాలలో పైకి కొబ్బరి కాయలా కరకుగా కనిపించినా లోలోన మృదువైన కొబ్బరి గుజ్జు వంటివాడు. అతడెక్కడ పని చేసినా ఎంత మంది జూనియర్ లతో మెసలినా- తన వల్ల తోటి వారికి కష్టమూ నష్టమూ కలగకుండా చూసుకుంటాడు. ఇయర్నీ అకౌంటింగ్ వంటి అర్జంటు ఆఫీసు పనులు ఉక్కుమ్మడి గా ఎదురైన ప్పుడు తన హయాములో పని చేసే జానియర్ ఆఫీసర్లను స్టాఫ్ సిబ్బందినీ తమ మానానా తమను విడిచి పెట్టేయడు. వాళ్ల బాధ్యతల్నితన బాధ్యతగా స్వీకరించి మార్గ నిర్దేశం చేస్తాడు; పాలుపంచుకుని టార్గట్ అందుకునేలా చూస్తాడు. వాళ్లను తన వెనుక నడవకూడదంటాడు. తనతో సమానంగా ప్రక్క ప్రక్కన నడవమంటాడు. సమాన స్థాయిలో బాధ్యతలు పంచుకోమంటాడు. అందరూ చేరి భుజాలు అందివ్వకపోతే,కలవకపోతే కార్యాలయం కార్యాలయం గా ఉండదంటాడు. కదనరంగంలా మారుతుందంటాడు.

ఆరోజు పరశురామ్ పెళ్లి రోజు. ఇంట్లో భార్య సందడి ఎక్కువగా ఉంటుంది. కొడుకూ కూతుళ్లద్దరిదీ మరీను,దేవుడి పెళ్లికి పిన్నలూ అగ్రజులూ అందరూ ఉన్నతులే అన్న రీతిన- - సాధారణంగా ఆరోజు శివ పార్వతుల ఆలయ దర్శనార్థం పరశురామ్ కి సెలవు వేయడం తప్పని సరి. అలా చేయకపోతే- ఇంటిల్లపాదీ ఊరుకోరు. కాని ఆ రోజు మాత్రం అతడా విధంగా సెలవు వేయలేక పోయాడు. కారణం- క్యాబినెట్ సెక్రటేరియట్ ఆదేశానుసారం ప్రత్యేక పౌర పిర్యాదుల పరిష్కార దినంగా పాటించ వలసొచ్చింది. ఆఫీసు పెద్దగా అతడి ఉనికి తప్పని సరిగా ఉండాల్సి వచ్చింది. అదీను- యాజ్ యో స్పెషల్ కేస్- ఆ తతంగమంతా పిర్యాదు దారుల ఎదుట హెడ్డ్ ఆఫ్ ది ఆఫీసు సమక్షాన జరగాలి. ఈసారి పిర్యాదుల పరిష్కార నివేదికను సరా సరి సెంట్రల్ క్యాబినెట్ సక్రటేరియట్ కి సమర్పించాలి. అప్పుడటువంటి హడావిడిలోనే ఉన్నాడు పరశురామ్, కాన్ఫి రెన్స్ హోలు మ ధ్య రివాల్వింగ్ కుర్చీ వేసుకుని. తనకెదురుగా బ్రాంచాఫీసరులు,సెక్షన్ హెడ్డులూ వాళ్ళ వాళ్ల కుర్చీలలో ఆసీనులయి పిర్యాదులిచ్చే వారినుండి అర్జీలు తీసుకుంటూ సమస్య పరిష్కారానికి దారి తెన్నులు చూపిస్తున్నారు. అవసరమని తోచిన చోటల్లా తిన్నగా డీలింగ్ సెక్షన్ కే పంపిస్తున్నారు,అక్కడికక్కడ సెటిల్మెంటులు పూర్తయేలా తగు వ్యాఖ్యానాలు వ్రాస్తూ- -

అప్పుడతని సూటైన చూపు ఎదురు వరసలో కూర్చున్న పిర్యాదు దారుల వేపు మళ్లింది. ఎవరో ఒకతను తననే తేరి పార చూస్తున్నాడు. చూస్తూ ప్రక్కన కూర్చున్న స్త్రీతో తన గురించి ఏదో చెప్తున్నట్టున్నాడు. దానితో పరశురామ్ కళ్లు దీపపు గోళాల్లా విప్పారాయి. . ఎక్కడో మసక మబ్బులాంటి జ్ఞాపకం గాలి తెరలా వచ్చి సోకినట్లనిపించింది. ఆ పిర్యాదు దారుడ్ని ఎక్క డో ఎప్పుడో చూసినట్లే ఉంది. కాని సరిగ్గా గుర్తుకు రావడం లేదు. మనిషి మెదడుకి ఉన్నఅతి సున్నితమైన రేఖాప్రాయమైన పరిమితి ఇదే! సమయానికి సహకరించదు. ఊతమివ్వదు. ఇప్పుడతనకి భార్యామణి ప్రక్కన కుదురుగా కూర్చున్న ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి మల్లే కనిపిస్తున్నాడు. కాని నిజంగా అతనెవరో పోల్చుకోలేక పోతున్నాడు. ఏవేవో ఛాయలూ- రేఖామాత్ర పు చారలూను- - అంతకు మించి అతడి జ్ఞాపక శక్తి ముందుకు సాగడం లేదు. ఇక ఉత్కంఠను ఆపుకోలేక తనకు పర్సనల్ అసిస్టెంటుగా నిల్చున్న యువ స్టాఫ్ ని పిలిచి ఆ ఇద్దరినీ తన వద్దకు పిలుచుకురమ్మన్నాడు.

భార్య భర్తలిద్దరూ వచ్చారు. అతడు చూపించిన కుర్చీలలో యెదురుగా కూర్చున్నారు. ఆమె నమస్కరించింది. ఎందుకో అతడు మాత్రం తననే చూస్తూ చిర్నవ్వులు చిందిస్తున్నాడు. పరశురామ్ స్పందించలేదు. పిర్యాదు నోటుని అందుకుని చూసా డు. కేసు చాలా పెండింగులో ఉన్న సెటల్మెంటు కేసు. అలా జాప్యంకావడానికి అకౌంట్సు బ్రాంచి వాళ్లను బాధ్యుతుల్ని చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మొన్న మొన్న కంప్యూటర్ సిస్టమ్ ని ఆధునీకరించిన పధ్ధతి ప్రకారం సంక్షేమ స్కీములోని చందా దారుడు ఎక్కడ ఎన్ని చోట్ల పని చేసి ఎక్కడెక్కడ తన వంతు మొత్తాన్ని ఆఫీసు ఖాతాలో కట్టినా కట్టకడపటి దశలో లెక్కల్లో తేలిపోతుంది.

అంతా సెటిల్మెంటులోకి ఒదిగి పోతుంది. కాని యిది ప్రాతకాలపు సంక్షేమ పథక సభ్యత్వపు వ్యవహారం. అప్పట్లో ఒక కంపెనీలో కట్టిన మొత్తం మరొక కంపెనీలోకి చేరి కట్టిన మొత్తాన్ని ఒక్కుమ్మడిగా లెక్కలోకి తీసుకోవాలంటే- యాజమాన్యమూ చందాదారుడూ కలసి సరైన సమయానికి అకౌంటు మొత్తాన్ని బదలీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి. కేసుని బట్టి అలా జరగనట్లుంది. ఇక మరింత జాప్యం చేస్తే పుండు పైన కారం చల్లినట్లే అవుతుంది. మొత్తం మూడు అకౌంటు సెక్షన్లలో తెరిచిన మూడు అకౌంట్ల రికార్డులతో బాటు తెచ్చిన మూడు లెడ్జర్ కార్డులనూ తన ముందు పెట్టుకుని తనకున్న విచక్షాధికారాన్ని ఉపయోగించి మూడు మొత్తాలనూ ఒక్కటిగా చేర్చి సెటల్మెంటు జరిపి మూడు రోజుల్లోపల చెక్కుని లబ్దిదారుకి అందించాలని నోట్ ఆర్డర్లు జారీ చేసి-

పిమ్మట సావదానంగా పిర్యాదు దారు వేపు తిరిగి అడిగాడు- “మీరు నన్నెప్పుడైనా ఎక్కడైనా చూసున్నారా?ఇప్పుడు రికార్డులో ఉన్న మీపేరుని బట్టి తోస్తూంది- మీరు నాకు తెలుసేమోనని- కాని గుర్తు పెట్టలేక పోతున్నాను”.

అప్పుడు అతను మరింతా విప్పారిన ముఖంతో నవ్వుతూ బదులిచ్చాడు- “ఔను నేనదే శంకరాన్ని సార్. బ్రతుకు బాటలో నలిగి—సంసారపు చక్రంలో సతమతమై చితికి పోయానేమో—నా రూపమే మారిపోయిన ట్లుంది. చిన్నప్పుడు నేను- సూర్యం- గోపి- వామనరావు- నువ్వూ- సారీ- మీరూ- సహరా నగర్ లో ఉండేవాళ్లం. అందరిలో కెల్లా నేనే మీతో క్లోజ్ గా ఉండే వాణ్ణి. ఎందుకంటే నేనే మీ చేత ఎక్కువగా చీవాట్లు తినేవాణ్ణి- చదువూ సంధ్యా మాని పైలా పచ్చీసుగా తిరుగు తున్నానని. మా అందరిలోనూ మీరే బ్రైట్ గా ఉండేవారు అన్నిట్లోనూ—నన్ను మాటి మాటిగా యూస్ లెస్ ఫెలో అనేవారు. ఓసారి గుర్తుకి తెచ్చుకోండి సార్”

ఆ మాట విన్నంతనే పరశురామ్ కళ్లు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నాడు. చుట్టూ సిబ్బందీ తోటి ఆఫీసర్లూ చూసున్నారన్న ధ్యాస మరిచాడు. చిన్మనాటి మిత్రుణ్ణి హత్తుకున్నాడు- “ఎంతగా మారిపోయావురా శంకరం! ”

“చెప్పాగా- చితికి పోయానని” ఉద్వేగం ఆపుకోలేక శంకరం కన్నీరు కార్చసాగాడు. ఆశ్చర్యంగా అతిడితో బాటు అతడి భార్య కూడా లేచి నిల్చుని కంట తడిపెట్టుకుంది. “అప్పులు పాలైన నాలుగు బిడ్డల తండ్రిని. నేనెలా మీలాగుంటాను చెప్పండి“

“సరే- నా చేంబర్లోకి వెళదాం- పద” అంటూ కదలబోయాడు పరశురాం. కాని శంకరం కదల్లేదు. ”వద్దుసార్- మీరిప్పుడు నాకు చేసి న సహాయమే పదివేలు. కొన్ని నెలలుగా తిరుగుతున్నాను సెటిల్మెంటు కోసం. ఇంతకు మించి మీనుండి నేనేమీ యెదురు చూడలేను”పరశురాం ఊరుకోలేదు-

“అదేమిట్రా కొత్తగా సారూ మీరూ అని సంబో ధిస్తున్నావు! ముందు నాతో పద యూస్ లెస్ ఫెలో! ”అంటు కదిలాడు. ఆ మాట విన్నంతనే శంకరం నవ్వేసాడు. ” ఇన్నేళ్ల తరవాత ఈదెప్పి పొడుపు వింటుంటే ఎంత బాగుందనుకునేరు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుంది”అంటూ అనుసరించాడు భార్యను తనతో రమ్మని కళ్లతో సైగ చేస్తూ- -

అందరూ పరశురాం చేంబర్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ పరశురాం భార్య వందన ఇంటినుండి తెచ్చిన పొడవాటి టిఫిన్ కేరియర్ తో సిద్ధంగా ఎదురు చూస్తూంది భర్తకు విందు భోజనం వడ్డించడానికి. అక్కడే ఉన్న విజిటర్స్ హాలులోకి పిలిచి శంకరాన్ని అతడి భార్య సువర్చలనీ భార్యకు పరిచయం చేసాడు. చేస్తూ ముగ్గురికీ వడ్డించమని పురమాయించాడు. మొదట సువర్చల మొహమాట పడుతూ కంగారు పడుతూ అంది- “నాకు వద్దండి మేడమ్. నేను ఇంటికి వెళ్లి తింటాను వాళ్లిద్దరికీ వడ్డించండి”అని దూరంగా తొలగడానికి లేచింది. కాని వందన ఊరుకోలేదు. ముగ్గురికీ వడ్డించడానికి టిఫిన్ క్యారియర్ తెరవబోతూ అటు చూసింది. శంకరం కళ్ళల్లో కన్నీటి పొరలు! ఆ కన్నీటి పొరలతోనే పరశురామ్ ని తేరి చూస్తూ కూర్చున్నా డు- అది చూసి వందన భర్తను అడక్కుండా ఉండలేక పోయింది-

“అమేమిటండీ మీ మిత్రుడు అలా ఎమో షనల్ ఐపోతు న్నాడూ- - అసలేమి జరిగింది?మీరేమైనా అన్నారా?“ పరశురాం నోరు మెదపకుండానే తల అడ్డంగా ఆడించాడు.

అప్పుడు శంకరం తేరుకుంటూ స్పందించాడు- “సారీ మేడమ్! మధ్య మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాను. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకప్పటి జ్ఞాపకాలు,పచ్చటి జ్ఞాపకాలు ఎగిరే రామచిలకల్లా కళ్ళముందు మెదులుతున్నాయి మేడమ్. మేం మొత్తం ఐదుగురం. అదేమి విచిత్రమో మరి- ఎప్పుడూ పరశురామే మాకందివ్వడానికి ముందుకు వచ్చేవాడే కాని—మా నుండి ఏదీ ఎదురు చూసేవాడు కాడు.

ఒక రాత్రి మేం లాస్ట్ షోకి వెళ్లి వస్తున్నాం. మేం అనుకున్నదేమంటే—బైటకు వచ్చి నాన్ విజి బంకులో భోజనం కానిద్దామని. కాని వీలు పడలేదు. అదేదో రాజకీయ దొమ్మీ జరగటాన అన్ని దుకాణాలూ మూసేసారు. మా సహరా నగర్ చేరుకోవాలంటే బస్సులు గాని ఆటోరిక్షలు కూడా లేవు. ఎలాగో ఒకలా కాళ్ళీడ్చుకుంటూ నగర్ చేరాం గాని—మరీ ఆలస్యం ఐపోవడం వల్ల- ఇంటికి వెళ్లి భోజనాలు అడిగే ధైర్యం మాకు లేకుండా పోయింది. అప్పుడు పరశురామ్ గారే పూనుకుని ఇంటినుండి పెద్ద గిన్నెలో అన్నమూ పులుసూ కలిపి తెచ్చాడు- ఆకలితో నకనకలాడుతూన్న మమ్మల్ని ఆదుకున్నాడు. నా జీవితంలో—కాదు- మా జీవితాలలో మాకు వాటిల్లిన పెద్ద నష్టమేమంటే—మేం పరశురాం వంటి మిత్రుడికి దూరం కావడమే—తను చదువుకుంటునే మమ్మల్ని బాగా చదవమని ప్రోత్సహించేవాడు. కాని మాకు తలతిక్క. ఏదీ తలకెక్కలేదు. దాని ఫలితం- మేం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడున్నట్టు తిక్క తింగరిలీ తయారయి ఇక్కడ ఇలా పడున్నాం. పరశురాంగారేమో అంబరం అంత ఎత్తుకి ఎదిగాడు. మంచి మనసున్న ఆణిముత్యం. అందుకే మేం ఆరిపోయాం పరశురాం గారే న్యాయంగా తేజోమయం గా వెలిగారు”.

అప్పుడు పరశురాం గట్టిగా గసిరాడు- “ఊరుకోరా శంకర్! ఎదుటి వారి గొప్పలు ఉద్ఘాటిస్తూనే నువ్వు చతికిల బడేవాడివి. నువ్వింకా మారనేలేదు. ఇక నేనొక టి చెప్పాలి. ఈరోజు మనమందరమూ అనుకోని విధంగా కలుసుకున్న రోజు కదా- అందుకే ఆ సంఘటన నాకు గుర్తుకి వస్తూంది వందనా! ”అంటూ భార్య వేపు తిరిగాడు. ఆమె గిన్నెల్ని అక్కడే ఉంచి ఇటు తిరిగింది.

“ఈ నలుగురూ- అంటే- వీడు- సూర్యం- గోపి- వామనరావు చదువు సంధ్యల్ని అటకెక్కించి వచ్చీ పోయే అమ్మాయిల్ని సైట్ కొడ్తుండేవారు. అలా జాలీగా కాలం గడిపే సమయంలో మీ వాళ్లు మా వీధికి కొత్తగా వచ్చినప్పుడు నువ్వు నాకు పరిచయం అయావు. నీపైన నేను మనసు పడ్డాను. అప్పుడేమైందో తెలుసా?“.

ఏమైందన్నట్టు ఆసక్తికరంగా చూసిందామె.

“వీడూ గోపీ నిన్ను సైట్ కొట్ట నారంభించారు! ”ఆమాట విన్నంతనే ఇద్దరాడాళ్లూ“హా! ”అంటూ నోరు తెరిచారు;’అంతటి ఘనులా మీరు! ’అన్నట్టు శంకరం వేపు చూస్తూ- -

కాని వెంటనే వాళ్ళ ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేసాడు పరశురాం- “ఇది కాదు మేటర్. అసలు మేటర్ ఉంది. నేనది గమనించి వాళ్ల వద్దకు వెళ్లి నాకూ నీకూ మధ్య ఉన్న స్నేహం గురించి తెలియచేసి- ‘ఇకపైన నీ వేపు కన్నెత్తి చూడటమో—పండ్లికిలంచడమో చేయకూడదని బాహాటంగా ప్రకటించాను” .

ఆ మాటతో వందన ఉత్కంఠత ఆపుకోలేక పోయింది- “ఆ తరవాతేమైంది?ఎదురు తిరిగి మీతో వాదనలకు దిగారా! ”

“లేదు. ఇక్కడే మా ఫ్రెండ్ షిప్పులోని గొప్పదనాన్ని నువ్వు గుర్తించాలి. వెంటనే ఇద్దరూ లేచి- ‘సారీ బాస్! ‘అంటూ చేతులెత్తేసి ఏది ఎక్కడున్నా- యెటువంటిదైనా- ది బెస్ట్ అన్నది నీకే చెందాలి—ఏదీ ఎప్పుడూ అడగని వాడివి- - మేం నీ కోరికను కాదన గలమా- అలాగంటే మాకు పుట్టగతులుంటాయా?’ అంటూ భవ్యంగా దివ్యంగా మన దారినుండి తప్పుకున్నారు”

”నాకు తెలియకుండా నావెనుకు ఇంతటి రాధ్ధాంతం- జరిగిందన్నమాట! “అంటూ గట్టిగా నవ్వేసింది వందన.

మృదువైన కాలప్రవాహపు పసుపు పచ్చటి బాల్య స్మృతులవి- ఎవరినైనా అట్టే ఆకట్టుకుంటాయవి పూలతోట తావున సోకే పరిమళ భరిత పిల్లగాలుల్లా- - వందన ముగ్గురికీ భోజనాలు వడ్డించి ఇక ఇంటికి బయల్దేరుతానని సిధ్దమైంది.

అప్పుడు పరశురాం ఆపాడు. “కొంచెం ఆగు! మా చిన్ననాటి ఒప్పందం ఒకటుంది. అదీ తెలుసుకుని మరీ కదులు. అదిమా ఐదుగురికీ సంబంధించినది- విచిత్రమైన ఒప్పందం . దానిని ప్రపోజ్ చేసిన వాళ్లు మరెవ్వెరో కాదు- - శంకరం—గోపీనే—ఆ ఒప్పందంలోని సారాంశం ఏమంటే—మేము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా- ఉద్యోగాలలో చేరిన తరవాత మా నెలసరి రాబడిలో ఐదు శాంతం మొత్తాన్ని విడిగా అట్టే పెట్టాలి. అలా పెట్టిన నగదుమొత్తాన్ని నిజంగా కష్టాలలో ఉన్నవారికి ఇచ్చి సహకరించాలి. నేనిచ్చిన మాట ప్రకారం నేను నెలనెలా కూడబెట్టిన సొమ్ముని బ్యాంక్ డిపోజిట్ లో భద్రంగా ఉంచాను. ఇప్పుడు మొదటి వీడు దొరికాడు కాబట్టి అడుగుతున్నాను” అంటూ శంకరం వేపు తిరిగి అన్నాడు- “నీకెంత కావాలి?”

“ నాకేమీ వద్దు. నన్ను చూసి పెడముఖం పెట్టకుండా నన్ను గుర్తు పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఆదరించారు చూడండి- నాకదే పదివేలండి”

“ఆ బోడి మాటలు నాకెందుకు గాని—నీకెంత కావాలో చెప్పు. అది సరే గాని ఇదేమిటి నన్ను మాటి మాటికీ బహువచనంతో సంబోధిస్తూ ఇబ్బంది పెడ్తున్నావు?నన్ను దూరంగా ఉంచాలనే తీర్మానించేసావా! ”

“లేదండి నాకా ఉద్దేశ్యమే లేదండి. అసలు విషయం ఒకటుంది. అప్పట్లో నాకున్న పరిమితులు తెలియకుండా ప్రవర్తించాను. ఇప్పుడేమో నలుగురు బిడ్డల తండ్రినయాను. ఇప్పుడు నాకున్న పరిమితులేమిటో తెలుసొస్తున్నాయి. చిన్నప్పుడు మేమందరమూ పలుసార్లు పలు అబధ్ధాలు చెప్పి మీ నుండి చేబదులు తీసుకుని మళ్లీ ఇచ్చేవాళ్ళం కాం. తమరూ అడిగేవారు కాదు. అదంతా తలచుకుంటే గుండెను ఎవరో మెలివేస్తున్నట్లుంటుంది. అది చాలదన్నట్టు ఇంకానా మీకు ఋణ పడమంటారూ! ”

అప్పుడు శంకరం భార్య కలుగచేసుకుంది- “ఔను సార్. ఇప్పుడు గాని నా ముందు మా ఆయన ఏక వచన పద ప్రయోగం చేసారంటే ఇంటికెళ్లి తప్పకుండా చీవాట్లు పెడతాను. తారతమ్యాలనేవి మనం తెచ్చిపెట్టుకునేవి కావు కదండీ! అవి వాటికవే ఉత్పన్నమవుతాయి- మన ఉనికితో ప్రమేయం లేకుండానే- వాటిని మనం గౌరవించాలి“

“సరే—అలాగే తీసుకుందాం. దీనికి బదులివ్వండి. మీవారిప్పుడు పూర్తి సెటల్మెంటు చేసుకున్నారు కాబట్టి- ఇప్పట్లో మరొక కొత్త ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు. కాబట్టి ఇప్పుడు దొరకబోయే సొమ్ముతో ఏమి చేయదలచారు?”

“మా ఇంటి వసారాలో స్థలం ఉంది. అక్కడ చిన్నపాటి పచారీ షాపు పెట్టదలచాం”

“ఆలోచన బాగుంది. కాని ఈవిషయంలో నేనొక యోచన ఇస్తాను. వింటారా! ”భార్యాభర్తలిద్దరూ తలలూపారు. “ఇప్పుడు మీకు రాబోయే మొత్తాన్ని బ్యాంకు డిపోజిటి లో పెట్టుకోండి. దాని పైన వచ్చే నెలసరి వడ్డీతో పిల్లకాయల చదువులు సాగేటట్టు చూడండి. ఇంటి వెచ్చేలకు ఉంచుకోండి. వందన తరపున నేను పెట్టుబడి పెడ్తాను. దానితో వ్యాపారం చేయండి. వందనకు వ్యాపార మెళకువలు తెలుసు. బిజినస్ డిగ్రీ ఉంది. ఆమె మీకన్నిటిలోనూ తోడ్పడుతుంది. మీరిద్దరూ చేయవలసింది వందనకు సహరించడమే—సామాను తెచ్చి పడేయటమే- లాభం వస్తే నావంతు నాకివ్వండి. నష్టం గాని వస్తే మీరు దానికోసం తలపో యకండి” అంటూ చెక్కు బుక్కు తీసాడు పరశురాం.

శంకరం వెంటనే లేచి అతడి చేతిపైన చేతినుంచి ఆపాడు. ”వద్దురా పరశురాం! నాకిప్పటికే చాలా చేసావు. సువర్చల చెప్పినట్టు నాకు రాబోయ్ సెటిల్మెంటు సొమ్ముతో వ్యాపారం చేసుకుంటాను. అవసరం కలిగినప్పుడు తప్పకుండా మీ వందనగారి మార్గదర్శకం తీసుకుంటాను. ప్లీజ్! నన్ను యిబ్బంది పెట్టకురా! ”

“ఓకే! ఓకే! మరి మన మిత్రులకోసం అట్టే పెట్టిన సొమ్మునేమి చేయాలి?“

“నాలా చితికి పోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. లేదా చిత్తుగా చితికిపోయి తేరుకోలేని స్థితిలో కొట్టిమిట్టాడుతూన్న ఇంకొందరు ఉంటారు. వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి ఆదుకో! రమ్మంటే నేను కూడా నీతో బాటు వస్తాను” అన్నం కెలుకుతూ తలూపుతూ ఉండిపోయాడు పరశురాం.

వందన భర్తనే తదేకంగా కనురెప్ప మూయకుండా చూస్తూంది. చిన్ననాటి స్నేహితుల మధ్య యిటువంటి ఒప్పందం తనెప్పుడూ వినలేదేమో! ఇకపైన కూడా విన లేదేమో!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


50 views0 comments
bottom of page