'Ethhugada' written by Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
శ్రీలత కొత్త కాపురానికి వచ్చి సంవత్సరం కావస్తోంది. ఆమెకింకా మెట్టిల్లు కొత్తగానే ఉంది. తన పుట్టింటితో పోల్చుకుంటే చిన్నదిగానే ఉంది. పడక గదిలోని పట్టె మంచం కూడా ఆమె కళ్ళకు చిన్నదిగానే ఉంది. ఇక పెరడు తోటలోకి వెళ్ళాలంటే—‘వాసన లేని పూవు- బుధవర్గంపు లేని పురంబు’- పద్యం గుర్తుకొస్తుంటుందామెకు. నలుచెరగులా మొగ్గవిడిచి మొలిచిన కన కాంబరాలనూ- బొడ్డు మల్లెల్నీ ఆడపడుచు శ్రీరంజని ఏదీ మిగల్చకుండా పెందరాలే అల్లుకుపోయి గుదిగుచ్చుతుంది. మిగతాది వదినెకు అర్పించుకుంటుంది. ఇదే మాట ప్రవీణ్ వద్ద ఓసారి ప్రస్తావిస్తే- అదేమీ విషయమే కానట్టు ప్రక్కన పడేసాడు. ప్రొద్దుటే నువ్వూ వాళ్ళలాగే లేచి తోటలోకి రెండడుగులు వేస్తే నీకూ బోలెడు పూలు ఝమ్మని తుమ్మెదలూ ఎదురు వచ్చి పలకరి స్తాయి! ’ అని.
అతడి మాట వింటున్నప్పుడల్లా ఆమెకు స్వాంతన కలగడం లేదు కదా- పచ్చిగాయం పైన ఉప్పు చల్లినట్లుం టుంది. మూరెడు పూల కోసం—తను ప్రొద్దుటే నిద్ర పాడు చేసుకుని లేవాలా! అలా ఓపిక తెచ్చుకుని లేవడానికి ప్ర యత్నించి నా పోచికోలు కబుర్లు చెప్తూన్న తన పతిదేవుడు లేవనిస్తాడా! మరింత వెచ్చదనం కావాలంటూ తనను మరింత దట్టమైన మత్తులో ముంచేయడూ! ఐనా, తనెందుకు ఆ ముష్టి గుప్పెడు పూలకోసం వెంపర్లాడాలి? అంచేత ఆమె పూలమ్మి వద్దే పూలను కొనుక్కుంటుంది. పూలను కావాలనే ఎక్కువ మోతాదులో కొంటుంది- టిట్ ఫర్ టేట్ లా తనలో తను గర్వంగా ఫీలవుతూ- -
ఇక పెళ్ళికాని ఆడపడుచు మాట అటుంచితే, పెళ్ఫయి ఇద్దరు బిడ్డల్ని అడ్డాలలోకి ఎత్తుకున్న తన తోడికోడలికి కాస్తంత ఇంగితం ఉండవద్దూ;కొత్తగా కాపురానికి వచ్చిన తను ఆ యింటికి నవ వధువని- - ఈ మధ్య ఆడాళ్ళలో స్వార్ధం మరీ పెచ్చరిల్లి పోతుంది. అసలావిడ కాస్తంత వెనక్కి తిరిగి చూసేందుకు ప్రయత్తిస్తేగా—వాస్తవం కళ్ళముందు కనిపించడానికి. ఆమెలాగా తను చప్పుడు మాత్రమే చేసే రాగి మూతలున్నకుండలూ మండలూ పెట్టుకుని వచ్చింది?ఏమీ లేని ఈ బోడి ఇంటిలో కనక వర్షం కదూ కురిపించి మరీ వచ్చింది!
తను రాకముందు ఏవీ ఈ విశాలమైన నునుపైన సోఫా సెట్టులు?ఏదీ మినీ థియేటరంత టి టీ వీ సెట్టూ- నట్టింట గాలి తెరలా ఊగే ఊయలేదీ! వీళ్లకు కృతజ్ఞతా భావం అనేది ఇసుమంతైనా ఉన్నదా? ఉండదు. ఎలా ఉంటుంది సంస్కారమే తెలియని మెట్టింట- - తను రాకముందు ఇంట్లో గుడ్డలు ఎతా ఉతికేవారని—బావి చప్టా వద్ద దభేల్ దభేల్ మని బాదుతూ ఉతికేవారు. మరిప్పుడో—తను పుట్టింటి నుంచి తెచ్చిన వాషింగ్ మిషన్ ద్వారా ఎంచెక్కా పనులు చేసుకు పోతున్నా రని- - ఇకపోతే- ఇంటి పెద్దమనిషిగా ఇదంతా గమనించి సరిదిద్దాల్సి బాధ్యత మామగారికి ఉండవద్దూ!
అదేమీ గమనించకుండా మామగారు అమాయకంగా ముఖం పెట్టి అడుగుతాడు—“అమ్మా శ్రీలతా! ఈ రోజంతా నిన్ను ఒక్కసారి కూడా నడవమ్మట గాని పెరడులో గాని చూడనట్లుందమ్మా! ఎంత బిజీగా ఉన్నాఅప్పుడప్పుడు వంటిగది వరకూ వచ్చి కనిపిస్తుండమ్మా! నీ అందె లు నట్టింట వినిపించకపోతే ఇల్లు బోడిగా ఉండదూ?”
ఔను- నిజమే! తను కావాలనే నట్టింట కనిపించడం లేదు. ఆమాట కువస్తే తనెందుకు కనిపించాలి?కట్టడిగా ఈవిల్ గ్యాంగులా తయారయిన ఆ ఇంటి ఆడాళ్లతో తనెందుకు కలివిడిగా మెసలాలి? అసలు తనకు వాళ్లతో ఏమి పనని?దానితో ఆ పెద్దమనిషి ఆగుతాడా- ఆగడు. మరొక కుశల ప్రశ్న వేసి వేధిస్తాడు- “అంతగా పొద్దు పోకపోతే—విసుగ్గా ఉన్నట్లనిపిస్తే—మీ వాడితో అలా సినిమా హాలు వేపు వెళ్లి రాకూడదూ! ”ఆహా! ఎంత గొప్ప సలహా! అసలు ఆయన కొడుక్కి సరదాలంటేనే తెలియవనీ- - పర్సు తీయడానికి, తీసి ఖర్చు పెట్టడానికి దిగాలు పడుతుంటాడని, జడు సుకుంటాడని, ఆయనకు తెలుసా?ఏది కావాలని అడిగినా- ఇంటి ఖర్చుల లెక్కలు చెప్పి తిక్క రేపుతాడు. పౌర్ణమినాడు నిశ్ఛితార్థపు చీర కట్టుకుని రెండు మూరెల పూలదండ కొనివ్వమంటే తూచి తూచి ఒక మూరెడు పూలే కొనిపెట్తాడు! ఒక ప్యాకెట్టు స్వీట్లు కొనివ్వమంటే—అర ప్యాకెట్టు స్వీట్లు కొని తీసుకొస్తాడు. యవ్వన శోభతో మిసమిసలాడే కొత్త పెళ్ళాంతో మెసలే విధానం అదేనా?తనకు తానుగా ఆనందాన్ని ఎలాగూ ఇవ్వలేడు.
మరి తన అందాల మకరందంతో పంచుకోవాడానికైనా చేతనవాలి కదా! రెంటికి చెడ్డ రేవడు తన బంగారు పతి. రసాను భూతి రవ్వంత కూడా లేని సగటు మానవ జీవి. సరసోక్తులు సరదాలు ఆమడ దూరం. ఆ రోజు శుక్రవారం. మరుసటి రెండు రోజులూ వీకెండ్స్ కావడాన ప్రవీణ్ తేలిగ్గా రిలేక్శుగా పీలవుతూ తేటదనంతో కనిపిస్తాడు. అప్పుడు పెరడులో కలసి నడుస్తూ అదను చూసి శ్రీలత మోహనకరమైన మిస్సాయిల్ విడిచి పెట్టింది నాజూగ్గా- “మూడు గదుల చావిడితో ఇల్లు మరీ చిన్నదిగా లేదూ! ”
ప్రవీణ్ కళ్లు మిటకరించి చూసాడు భార్యవేపు. ”నాకు తెలిసినంత వరకూ చావడి చిన్న దైనా పరవాలేదు. గుండే చిన్నదవకూడదు. నువ్వు కనీసం నాకోసం మనసు విప్పి మెసలు- అప్పుడు అంతా పెద్దదిగానే సాక్షాత్కరిస్తుంది. జస్ట్ ట్రై- -
”ఈసారి కళ్లు మిటకరించిడం ఆమె వంతయింది. ఓహొ! ఎటువంటి మహోన్నతమైన తత్వం! కట్టుకున్న భార్యగోడు వినడు. కాని ఎదుటివారి గుండె చప్పుడు వినిపించుకోవాలంటాడు. అప్పుడు పొందికగా పదాలను సమకూర్చుకుని స్పందించిందామె- “ఇంతకూ తమరు సెలవిస్తున్నదేమిటంట- నాకున్న మనసు చిన్నదంటారా- నాకది లేనే లేదంటారా! ”
“అదేమిటో నీకు నువ్వే తేల్చుకోవాలి లతా! ” అర్థం కానట్టు చూసిందామె. శ్రీలత ముఖభావాన్నిఅర్థం చేసుకున్న ప్రవీణ్ వివరిం చ డానికి పూనుకున్నాడు- “నీకెలాగైతే ఇంటి వాళ్ళపై పిర్యాదులున్నాయో- అలాగే ఇంట్లోవాళ్ళకు నీ పైన కూడా ఉన్నాయి. తర చుగా నేను వింటూన్నదొకటి చెప్తాను. వదిన గాని—అమ్మగాని నవ్వు ముఖంతో ఎదురు వచ్చినా సరే నువ్వు ప్రతిస్పందనగా నవ్వవట- పలకరించవట. నిజమా కాదా?”
“అడిగారూ- - బాగుంది. మరి వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారు?కట్టడిగా కక్ష కట్టినట్టు మూవ్ చేయడం లేదూ! అన్నీ మొదట వాళ్ళు తీసుకుంటారు. పిదప ఏదో మిగిలితే- “నామ్ కే వాస్తేగా- - “ నాకందిస్తారు- పెరడులోని పువ్వులతో సహా- - ”
అది విని అతడ తల అడ్డంగా ఆడించాడు. “ఈవిషయమై నేను విన్నది మరొక విధంగా ఉందోయ్. నీకంటూ నీ భాగంగా పూల చెండుని తడిగుడ్డలో చుట్టి నీ వద్ద ఉంచితే నువ్వు ముట్టుకోకుంఢా పూలమ్మిని పిలిచి కొనుక్కుంటావట- లేదా, పని గట్టుకుని సంతకు వెళ్లి పూలు తెచ్చుకుంటావట”
“కాక మరేమటి చేయను?గుప్పెడు కూడా ఉండవు నాకిచ్చే పూలు. అదీను రికార్డ్ ప్రూఫ్ కోసం యిచ్చినట్టు ఇస్తారు. నాకు పూలంటే చాలా ఇష్టమని మీకు మాత్రం తెలవదూ! ”
ఆ మాటతో అతడు ఊరకుండిపోయాడు. “అదేమిటి అలా అకస్మాత్తుగా ఉండిపోయారు. నా పైన న్యాయం లేదా! ”
“విషయం అది కాదు. ఇంట్లో ఉన్నదానిని సమంగా పంచుకోవడంలోనే ఉందిగా కుటుంబ వ్యవస్థ. అంతేకాదు—నువ్వు ఇరుగు పొరుగుతో గంటల తరబడి ఊసులాడుతావట. వాళ్ల వద్దకు వచ్చేటప్పటికి మూతి బిగిస్తావట. ఇది వాస్తవమేగా! ”
“నిజమే! దీనిని కాదన్నదెవరు?ఐతే దీనికి కూడా కారణం అంటూ లేకపోలేదు”అతడు కళ్ళెత్తి చూసాడు ప్రశ్నార్థకంగా-
“చుట్టు ప్రక్కల వాళ్ళు స్నేహపూర్వకంగా మనసు విప్పి మాట్లాడతారు. ఇక్కడివారికి జోవియల్ గా మాట్లాడటం చేతకాదు. మీరు నాచోట ఉంటే మీరు మాత్రం ఏమి చేస్తారు?” ఆ మాట విన్నంతనే అతడు అనుకోకుండానే నవ్వేసాడు- “అదేమిటి అలా నవ్వుతారు ఎగతాళిగా! “ కోపంగా చూసింది శ్రీలత.
“కాదు. ఇది నవ్వుకాదు. భావ వ్యక్తీకరణ. ఇక్కడేదో సైకలాజికల్ ప్రోబ్లెమ్ ఉన్నట్లుంది. అన్నట్లు చెప్పాలనుకుంటూనే మరచిపోతున్నాను లతా! మీ ఇంటి వాళ్లు నీకు గేటెడ్ కమ్యూనిటీ హాలులో టూ బెడ్రూం ఫ్లాట్ ఇవ్వబోతున్నారన్నావు. ఇప్పటి కిప్పుడు అది వద్దు. ఎందుకో మనసు కీడు శంకిస్తూంది” దానికామె ఒక్క క్షణం కూడా తీసుకోకుండా స్పందించి- “అట్లాగైతే నేను ముందే చెప్పినట్టు నేను జాబ్ లో చేరుతాను”
“ఇదేమటి టిట్ ఫర్ టెట్టా- నీతో అంగీకరించడం లేదంటే—ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావా?ఇంతకూ నువ్వెందుకు బైటకు వెళ్లి ఉద్యోగం చేస్తానంటున్నావు?ఇంట్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ తో పార్ట్ టైమ్ జాబులు చేయవచ్చు కదా! మిగతా సమయాలలో అమ్మావదినలతో కలసి కాలం గడప వచ్చుకదా- వదిన ఎలాగూ ఇంటి పనులతో యమయాతన పడ్తుంటుంది కాబట్టి పిల్లలి ద్దిరికీ హోమ్ వర్క్ చెప్తుండవచ్చు కదా! ”
“లేదు. నేను జాబ్ చేసే తీరాలి. స్వేఛ్ఛగా ఫీలవాలి. ముఖ్యంగా మీ పర్సు పైన భారం ఎక్కువగా పడకూడదు”తలూపాడతడు.
ఆరోజు రాత్రి వెన్నెల వృధాగా కరిగి కరిమేఘాల పాలయింది. రానురాను ఇటువంటివి
ఇంకా జరుగుతూనే ఉంటాయేమో!
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ఒక రోజు ఉదయమే ఇంటి వాకిట నిల్చున్న కూతుర్నీ అల్లుడినీ చూసి లక్ష్మమ్మ తడబడింది.. ఊపిరి అందుకోవడానికి క్షణాలు పట్టాయి- “అదేంవిటి అల్లుడూ చెప్పాచెయ్యకుండా వచ్చేసారు! కబురంపితే మీ మామగారు కారు పంపిద్దురు కదా! ”
ప్రవీణ్ చెక్కుచెదరని నవ్వు ముఖంతో అత్తగారిని సమీపించి నమస్కరించి బదులిచ్చాడు- “మరేమి లేదత్తయ్యా! నేను ఈ దార మ్మటే టూరుకి వెళ్తు న్నాను కదా—అటునుంచి మళ్ళీ వచ్చేటప్పుడు శ్రీలతను తీసుకెళ్దామని- “అప్పుడక్కడకు చేరిన దీనదయాళ్ అన్నాడు-
“బాగున్నారా అల్లుడూ?నాకెందుకో ఆదరా బాదరాగా వచ్చినట్టున్నారు. టూరు ముగించుకుని మళ్ళీ ఇటు రావడానికి ఎన్నా ళ్ళు పడ్తుంది అల్లుడూ! “మరచి పోకుండా మామగారికి కూడా నమస్కరించి అదే నవ్వు ముఖంతో అన్నాడు ప్రవీణ్- “నిజానికి నేనిటు నుంచి క్యాంపుకి వెళ్తున్నమాట వాస్తవమైనా- మా రాకకు అసలు విషయం మరొకటి ఉంది మాంవగారూ! ”
అల్లుడిని కూర్చోమని సైగ చేస్తూ తను కూడా ఆసీనుడవుతూ అదేమిటన్నట్టు కళ్లెత్తి చూసాడు దీనదయాళ్-
“శస్త్ర చికి త్స చేయాలి”
నవ్వు ముఖంతో ఎవరికని అడిగాడాయన.
”మా ఇంట్లోవాళ్ళకు- - కాకపోతే మరేమిటత్తయ్యా- ఇంటికి చిన్నకోడలు పిల్ల వచ్చి మొన్ననే సంవత్సరం పూర్తి కావచ్చింది. పుట్టింట మాలిమితో పెరిగిన మీ అమ్మాయి మెట్టింటి పరిసరాలకు అలవాటు పడొద్దూ- అంతవరకూ కాస్తంత ఓపిక పట్ట వద్దూ! ప్రతి పనికీ కొసరులా రమ్మని పిలుస్తారు అమ్మా వదినానూ- - వంట పనులూ- ఇల్లు శుభ్రం చేయడమూ- ఇవేకాకుండా కుండా మండా కడిగి బోర్లించమనడమూ—మొత్తానికి పని పైన పని చెప్తారు. మొన్న మొన్న వచ్చిన శ్రీలత ఎలా చేస్తుంది చెప్పండి? వదిన మాట విడిచి పెట్టేయండి—అమ్ముందే- ఆమెగారి అట్టహాసం మరీ ఎక్కువై పోయింది. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇంతటి బాదరాబందీకి లోను చేస్తే లత ఎలా సర్దుకు పోగలదు చెప్పండి. అందుకని ఇంట్లో వాళ్ళకి కొంచెం ఎడబాటిస్తేనే గాని చిన్నకోడలి పిల్ల అవసరం బోధపడదు. అందులో శ్రీలత ఉద్యోగం చేయాలని ఆశపడ్తుంది. చేరబోయే ఉద్యోగం ఇక్కడకు దగ్గరలోనే ఉన్న విహార్ ఐటి పార్కులో ఉంది. ఈ లోపల పరిస్థితి సర్దుకునేంత వరకూ నేను అప్పుడప్పుడు వస్తూ పోతుంటానులే—నేను వచ్చి తీసుకెళ్ళినంత వరకూ శ్రీలతను ఇంటికి పంపించకండి. అప్పుడు గాని
అమ్మకూ వదినకూ జ్ఞానోదయం కలగదు. పెద్దరికం తగ్గదు”అంటూ లేచి సూట్ కేసందుకున్నాడు.
అప్పుడు లక్ష్మమ్మ అడ్డుకుంది- “అదేమిటి అల్లుడూ- అల్పాహారం కూడా తీసుకోకుండా వెళ్లిపోతున్నారు! మాపైన గాని కోపమా! ”
దానికతడు అదే విధంగా నవ్వు చిలకిస్తూ అన్నాడు- “అబ్బే! అటువంటిదేమీ లేదత్తయ్యా! మీరేమేమో ఊహించుకుంటున్నట్టున్నారు. స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడ మా స్టాఫ్ నాకోసం ఎదురు చూస్తుంటారు”అంటూ గడప వేపు కదిలాడు, భార్య వేపు చేతులూపి- బై- అంటూ. అప్పుడు దీనదయాళ్ ప్రవీణ్ ని ఆగమని చెప్పి—భార్యను కూడా తనతో రమ్మనిమని చెప్పి పోర్టికోలో నుంచి కారుని బైటకు తీసాడు;ప్రవీణ్ ఎంత వద్దని చెప్తున్నా వినకుండా- - భోళా మనిషైన లక్ష్మమ్మకు తోచిందో లేదో గాని—అనువజ్ఞుడై న దీనదయాళ్ కి మనసు శంకించనారంభించింది—వ్యవహారం తాము అనుకున్నంత సరళమైనది కాదని. పుట్టలో ఏదో పాము కదిలిందని.
కారుని పార్కింగు స్పాట్ లో ఉంచి స్టేషన్ వేపు నడుస్తూ అన్నాడు దీనదయాళ్- “మీరు చెప్పిందంతా నిజం కాదనిపిస్తూంది అల్లుడూ- - “ క్యాంపు సూటు కేసుతో నడుస్తూనే అడిగాడు ప్రవీణే- అనుమానమెందుకని. “ఎందుకంటే- నాకు మా వియ్యంకుడి గురించీ వియ్యంకురాలి గురించీ తెలుసు. అంతేకాదు—మీ వదిన గురించి కూడా తెలుసు. మా అమ్మాయిని వాళ్ళ లా ఆరళ్ళకు లోను చేసేవారు కాదని నాకు ఘంటాపధంగా తెలుసు. అసలు మీకు మా అమ్మాయిని ఇచ్చింది మా వియ్యంకుణ్ణీ వియ్యంకురాలినీ చూసే కదా! మరిప్పుడీ తతంగమంతా ఏమిటి? ఇప్పుడైనా నిజం చెప్పండి శ్రీలత పైన పొరపాటేమిటి? త్వరగా చెప్పండి. మీ ట్రైను కదలటానికి ఇంకా పదిహేను నిమిషాలే ఉంది”
ప్రవీణ్ ఆగాడు. అత్తయ్యా మాంవగారివేపు తదేకంగా చూసి అన్నాడు- “నేనిప్పుడొక నిజం చెప్తాను వింటారా! ”
తలలూపారిద్దరూ- -
“నిజంగా పొరపాటు మీ అమ్మాయిపైన లేదు. మా ఇంటి వాళ్లపైనే ఉంది. ఎలాగంటే- - శ్రీలత జడ్జిగారి కూతు రు కావచ్చు. ఆస్తి పాస్తులున్న కుటుంబ స్త్రీయే కావచ్చు. కాని కోడలు పిల్లను కోడలు పిల్లగానే చూడాలి. అంత:పుర కాంతలా మరీ మాలిమనిచ్చి నెత్తికెక్కించుకో కూడదు. వాళ్ల మెతకతనం వల్ల- బేలతనం వల్ల శ్రీలత పోకడ రాను రాను దారుణంగా మారి పోతూంది. ఇంట్లో వాళ్లనెవ్వరినీ లక్ష్యపెట్టడం లేదు. అసలు వాళ్ళను కళ్ళెత్తి పలకరించడమే లేదు. ఈ లోపల మీరు కొనివ్వబోతూన్న టూ రూమ్ ఫ్లాట్ ఇంటిని తలచుకుని వేరు కుంపటి పెట్టుకోవాడానికి కలలు కననారంభించింది. ఈ విషయంలో చాలా స్పీడుగా పావులు కదపసాగింది. ఇంకొన్నాళ్లు శ్రీలత మా ఇంట్లో ఉంటే పూర్తిగా ఘోరంగా మారిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు తీర్చిదిద్దడం మాట అటుంచి మాకు కాపురమే మిగలకుండా పోవచ్చు. మళ్లీ చెప్తున్నాను—నేను వచ్చి తీసుకెళ్ళనంతవరకూ శ్రీలతను మాఇంటికి పంపించకండి. కొన్నాళ్లు ఆమె ఇష్ట ప్రకారం సాగనివ్వండి. ఇప్పటికి అదే మంచిది” అంటూ అతడు స్టేషన్ లోపలకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
క్యాంపుకి వెళ్ళిన ప్రవీణ్ రెండు మూడు ప్రాంతాలలో ఇన్స్పెక్షన్ లు చేసి ఇటు రాకుండానే అటు ఊరికి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో శ్రీలత చేతికందిన అప్పాయింట్మెంటు ఆర్డర్ చేతిలో ఉంచుకుందే గాని- ఉద్యోగంలో చేరలేదు. ఎందుకు చేర లేదో ఆమెకే తెలియదు. చేరాలనిపించలేదు. అంతే—
పదిరోజులు పుట్టింట్లో గడిపిన తరవాత ఒక శుక్రవారం పూట ఆమె పెట్టే బేడా సర్దుకుని తల్లి దండ్రులిద్దరికీ షాక్ ఇచ్చేలా అంది- “నేనిక వెళ్ళొస్తాను నాన్నగారూ! అమ్మా నీకు కూడాను—వెళ్ళొస్తాను”ఇద్దరూ తెల్లబోతూ అడిగారు ముక్త కంఠంతో-
“ఎక్కడికి?”
“ఇంకెక్కడికి?అత్తగారింటికి—“
“ఇంకొక వారం రోజుల పాటు ఆగు- అల్లుడే వచ్చి తీసుకెళ్తానన్నాడు. మొన్న ఫోనులో చెప్పాడు కూడాను—“
“మా అత్తగారింటికి వెళ్ళడానికి మీ అల్లుడెవరు నాకు పర్మిషన్ ఇవ్వడానికి?మూడు ముడులూ వేసినప్పుడే నాకు పర్మిషన్లు గంప గుత్తగా దొరికినట్లే! అన్నట్టు—నాకు కారు పంపించడానికి
ప్రయాసపడకండి. ఆటోరిక్షాలోనే స్టేషన్ వెళ్తాను”అంటూ గడప వద్దకు వెళ్తూ వెళ్తూ ఆగి తిరిగి చూసిందామె- “నేను చెప్పవలసింది చెప్తాను విడిగా- మీరేమైనా చెప్పాలా మీ అల్లుడుగారికి?” ఇద్దరూ తలలు ఆడించారు అడ్డంగా- చెప్పడానికి యేమీ లేదన్నట్టు.
కాని వెంటనే యేదో గుర్తుకి వచ్చినట్టు ఏక కంఠంతో అన్నారు- “నీకిప్పుడు అక్కడకు వెళ్ళడానికి సరైన సమయం కాదేమో! ”
ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది శ్రీలత.
“మరేమి లేదు. మీ అత్తగారు మంచాన పడ్డారట—అనవసర బాదరాబందీ నీకు—“
“మరేమీ పర్వాలేదు. అవన్నీ మీ అల్లుడుగారితో కలసి నేను చూసుకుంటాలే! మీరిద్దరూ హైరానా పడకండి“ ఆమె యిక తిరిగి చూడకుండా రోడ్డుపైకి వెళ్ళిపోయింది.
దూరాన ప్రమాద ఘంటికలు మ్రోగనారంభించినప్పుడే మేల్కొని తనకు తాను సర్దుకుపోవడమే విజ్ఞత.
ఆ విజ్ఞత కూతురుకి మెండుగా ఉన్నందుకు భార్యా భర్తలిద్దరూ లోలోన ఆశ్చర్యానందాలకు లోనయారు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
Comments