top of page

వివేకం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Vivekam' New Telugu Story Written By Pandranki Subramani


రచన : పాండ్రంకి సుబ్రమణి



మెకింజీ గోవాలోని పంజిమ్ వాస్తవ్యుడైనా యిప్పటి భారతీయ పౌరుడుగా మనుగడ సాగిస్తున్నా-- నిజానికి అతడి పుట్టుపూర్వోత్తరాలు అప్పటి పోర్చుగీస్ సంతతితో ముడిపడి ఉన్నాయి. అతడి తండ్రి కారు మెకానిక్- తల్లేమో మరాఠీ సంతతికి చెందిన స్త్రీ— సత్సాంప్రదాయాలు గల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రేమ గుడ్డిదని అంటుంటారుగా- ఆ రీతిన ఆమె పోర్చుగీస్ వాస్తవ్యుడైన మెకింజీ తండ్రి విసిరిన మోహపు వలలోపడి, మోహం ముప్పయి రోజులన్నది మరచి తనను తను పూర్తిగా అర్పించుకుని గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న మెకింజీ తండ్రి అదను చూసి రాబోయే పర్యవసానాలకు భయపడి పోర్టుగీస్ కి పలాయనం చిత్తగించాడు, పెట్టేబేడా సర్దుకుని--


పిదప అక్కడ అక్కడి స్త్రీని అక్కున చేర్చుకున్నాడు. ఉత్తమురాలైన ఆ మరాఠీ స్త్రీ భర్త ప్రక్కన లేకుండానే పురుడు పోసుకుంది. మెకంజీకి తల్లి అయింది. ఇకపోతే-- వారసత్వ మూలాలు ఊరకే పోవుగా! తండ్రినుండి పుట్టుకొచ్చిన జన్యువు లు రూపు దాల్చకుండా ఉంటాయా! యువకుడిగా ఎదిగిన తను కూడా అందాల వెలుగు రేఖల వెంట- రంగు రంగుల యవ్వనాల పొంగుల వెంటబడి యవ్వనవతుల వేట ఆడనారంభించాడు అదీను ఎలాగని —బాధ్యత ల బారిన పడకుండా వివాహ బంధపు సంకెళ్ళ జోలికి పోకుండానే-- అలా దూర దూరంగా ఉంటూనే మధు మాసపు షడ్రుచుల్నిఅనవరతం జుర్రుకోగలగడం అందరికీ సాధ్యమయే పని కాదు కదా! అలాగుండగల గాలంటే పదునైన చలాకీ తనం ఉండాలి— తడి తగలని విధంగా గుండె రాటుతేలి ఉండాలి. ఆ రెండూ మెకింజీ కి మెండుగానే ఉన్నాయి.


కాబట్టి- ఎదురు వచ్చిన అమ్మాయిలు కొందరిని ముఖాముఖిగా—తనకనుకూలంగా లొంగని మరికొందరిని తెరవెనుక అనామకుడిగా ఉంటూనే అదను చూసి ఆబగా అదుము కుని తన కామవాంఛల సంకెళ్ల మధ్య బిగించే వాడు. ఈ తతంగం కోసమే అతడు పనిగ ట్టుకొని తన మాతృభాష మరాఠీ సహా నాలుగైదు యితర భాషల్ని నాలికి పైకి అరువు తెచ్చుకున్నాడు. వాటిలో తెలుగు కూడా చేరింది. యమ కామ రసికుడైన మెకంజీకి మాత్రం తెలియదా యేమటి;అక్కడకు అడపా తడపా విహార యాత్రలకని వచ్చేతెలుగు అమ్మాయిలు వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించీ కనిపించని సన్నని నడుముల కదలికలతో ఊపిరి తీసుకోనివ్వరని- పచ్చతోరణాలలా గోవా బీచ్ అంతటా అందాలు వెదజల్లుతారని. అంచేత అతడలా రాక్షస రాస క్రీడలో లీనమవుతూ ముఖ పుస్తక వెబ్ లలో, ముఖ్యంగా డేటింగ్ యాప్ లలోకి చొరబడి అందాల హరిణలను వేటాడు తున్నప్పుడు తదనుగుణంగా తన పేరుని మోహనరావుగా అకౌంట్ ఓపెన్ చేసి మెసేజ్ ల పైన మెసేజ్ లు పంపించి గ్రాడ్వేషన్ చేస్తూన్న వందనతో మొదట స్నేహపూర్వకంగా పిదప ఉద్వేగపూరితంగా సంపర్కం పెంచుకున్నాడు.


అట్టహాసమైన ప్రచారం సంరంభంగా డాంబికంగా ఉంటే రాజకీయం చేయవచ్చు- వ్యాపారం పెంచుకోవచ్చు- కేవలం ప్రచారంతోనే సినిమా విడుదల చేసిన మొదటి వారంలోనే బాక్సాఫీస్ ని బ్రద్దలు కొట్టవచ్చు-- క్రమ క్రమంగా వలపు జిలుగుల వల విసిరి ఒడుపుగా వందనను లోబర్చుకున్నాడు, మెకెంజీ-- మాటల మాంత్రికుడికి కోర్కెల కాముకుడికి సాధ్యం కానిదేముంటుంది గనుక-- ఆ మాటకు వస్తే మెకంజీ కూడా వాళ్ల నాన్నలాగే జన్మత: కపట నాటక సూత్రధారి కాదూ! వ్యవహారం అలా సాగుతున్నప్పుడు ఒకసారి మెకింజీ అలియాస్ మోహనరావు హైద్రాబాదు చేరుకున్నాడు. దప్పిక తీరని మోహం ఎన్నాళ్ళాగుతుందని-- తిన్నగా మైత్రీవనం వద్దకు పిలిచి, వందనను కాసేపు మాటల మత్తులో ముంచి అక్కణ్ణించి సరాసరి నిర్మల్ కి తీసుకువెళ్ళి, అక్కడున్న పసందైన లాడ్జిలో దిగి భోజనాలు ముగించి అక్కణ్ణించి సుందర కుంటాల జలపాతం చేరారు. జలపాతంలో బాగా తడిసి- మైకంలో పూర్తిగా మునిగి చుట్టు ప్రక్కల ఉద్యాన వనాలలో సెల్ఫీలు తీసుకుని ఇక పెండ్లి చేసుకోవడం ఖాయమని భారీగా ప్రమాణాలు చేసుకుని నిర్మల్ చేరుకున్న తరవాత విషయం అనుకోకుండా బెడిసి కొట్టింది.


స్వతస్సిధ్ధంగా మెకంజీ తల్లిలాగే భారతీయ సత్సాంప్రదాయాల సరిహద్దులు దాటెరుగని వందన ఎదురు చూడని అతడి కసబుసల చేష్టలకు ఊపిరి తీసుకోనంతగా ఉక్కిరి బిక్కిరయంది. బెదిరిన హరిణిలా తేరుకుని. ఉషారయింది. ముఖ్యంగా ఒళ్ళు తెలియనంతగా మందేసుకుని వచ్చి తన వేపు ఆకలిగొన్న పులిలా దూసుకు వస్తూన్న మెంకజీని చూసి బెదరిన పావురంలా వజవజా వణకిపోయింది. ఎందుకంటే —అంతవరకూ అణగి మణిగి ప్రవర్తించిన మెకంజీ మందు ప్రభావంతో వెర్రి వెర్రిగా విజృంభించడమే కాదు—పెళ్ళి కాకముందే మొదటి రాత్రి అనుభవం అప్పటికప్పుడే కావాలని పట్టు పట్టాడు. దానితో వందనకి అతని సహజ వికృత స్వభావ స్వరూపాలు బైటపడినట్లయింది. అండ పిండ బ్రహ్మాండం బ్రద్దలయినట్లనిపించింది.


తనను జీవన సహచరిగా చేసుకోబోయే మగాడిలో అంతటి ఆక్రోశ పూరిత కామాతురత పాము పడగలా బుసలు కొట్టడం తగదు కదా! అంతే-- సమయం చూసి రోడ్డుపైకి పరుగెత్తుకు వచ్చింది వందన. అప్పుడక్కడ ఎక్కడికో వెళ్ళడానికి మలుపు తిరుగుతూన్న లాంగ్ జర్నీ బస్సులోకి లాంగ్ జంప్ చేసింది. మరక తగలని వలువలతో ఇల్లు చేరింది.

----------------------------------------------------------

ఒకరోజు శుక్రవారం ఉదయం రాజమండ్రి పెండ్లి సంబంధం విషయమై అభిప్రాయం అడిగిన తండ్రికి ఇక ఏ మాత్రమూ జాప్యం లేకుండా- తటపటాయింపులకు తావులేని విధంగా స్థిరచిత్తంతో తాను సిధ్దమేనని తలూపింది వందన. ఇక పైన తనజోలికి రావద్దని- వస్తే మర్యాద దక్కదని- చిట్ చాట్లు ఆపమని ముఖపత్ర భాగోతాలు చాలించమని మోహనరావు అలియాస్ మెకంజీకి మేసేజ్ పంపించింది- ఘాటుగా సూటిగా-- ఊహించ లేని విధంగా ఊహించని మలుపులతో అప్పట్నించి ఆమెకు ఇక్కట్లు ఆరంభమయాయి. జీవితంలో కొన్నిటిని ఒకసారి ఆశ్రయించిన తరవాత వాటిని మరుచూపుతో విదిలించుకోవడం అంత సులభతరం కాదు. ఇక ఆడదాని విషయంలో యిది మరింత - క్లిష్టతరం--


పెళ్ళికాబోతున్న తన జోలికి రావద్దని హెచ్చరిక విడిచిన మరునాడే ఆమెకు గోవానుండి ఫోను వచ్చింది. అదెక్కడ నుంచి వచ్చిందో ఎవరి వద్దనుండి వచ్చిందో గొంతుని బట్టి వందన వెన్వెంటనే పోల్చుకోగలిగింది.


”ఫోను పెట్టేయకుండా నిదానంగా విను. వినకుండా ఏదైనా చేసావే అనుకో, నీ బ్రతుకు బూడిద పాలవుతుంది. వింటున్నావా! ”ముఖాన పట్టిన ముచ్చెమటల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ- తనకు తెలియకుండానే లోలోన వణకుతూ- ఉఁ- అందామె.


“నాలో కోర్కల కొలిమి రావణాష్ఠంలా నిరంతరం మండుతూనే ఉన్నా, నేను స్త్రీల పట్ల నాజూగ్గా ఉంటాను. వాళ్ళ అందాలను మేని సువాసనల్నిఅంతర్గతంగా ఆరాధిస్తూనే రాచి రంపాన పెట్టకుండా అనుభవిస్తాను. కాబట్టి నీకు రెండు ఆఫర్లు యిస్తున్నాను. రెండు ఆప్షన్లు ముందుంచుతున్నాను. వీటిలో దేనిని నీకనుకూలంగా ఉందనుకున్నావో దానిని పాటించు.


మొదటి ఆఫర్ నాకు మిక్కిలి ఇష్టమైన ఆఫర్- నేను పిలిచినప్పుడల్లా నా వద్దకు రావాలి సీతాకోక చిలకలా సింగారించుకుని—ఎక్కడికని అడక్కూడదు. ఎక్కడికైనా ఎప్పుడైనా రావాలి నా మూడ్ ని బట్టి--. అంటే నేనుంటూన్న గోవాకి సహితం రావాలి నేను పిలిచినప్పుడల్లా--


ఇక రెండవ ఆఫర్- ఒన్ టైమ్ సెటిల్మెంటుగా నాకు యాబై లక్షలు ఇవ్వాలి నీ దారినుండి నిరంతరంగా తొలగిపోవాలంటే—ఇప్పుడు చెప్పు—ఏది నీకు అనుకూలం?”


వందన మిన్నకుండి పోయింది, మరొకమారు చెమటల్ని తుడుచుకుంటూ ఎటో చూస్తూ-- “అదేమిటి అలా ఉండిపోయావు స్థాణువులా! ప్లాను వేసి నన్ను సి ఐ డి పోలీసులకో షీ- టీము వాళ్ళకో అప్పగించాలని చూస్తున్నావా?”


ఆమె పొలబారినట్టు దగ్గుతూ అంది- “ లేదు. ఆలోచిస్తున్నాను. ఇది నా జీవిత సమస్య—దేనికీ అంత త్వరగా ఔననలేను. త్వరలో నాకు పెళ్ళవబోతూంది. అప్పుడు కూడా ఉన్నపళంగా నన్ను నీ వద్దకు రమ్మంటే అప్పుడు నా గతేమికాను?”ఆమె కంఠస్వరం ఇంకా వణుకుతూనే ఉంది.


“ఔను! నేను రమ్మంటాను. నేను సహితం వస్తుంటాను నీ అందాలు ఆరగించడానికి- దీనికి ప్రత్యమ్నాయంగా మరొక ఆఫర్ కూడా చేసాగా! ”


“ఔను, చేసావు. గుర్తుంది. దాని గురించి కూడా ఆలోచించాలి. నువ్వడుగుతూన్న సొమ్ము కొంచమా నంచమా-- నాకు టైము కావాలి” ఎన్నిరోజులు కావాలని అడిగాడతను. నెలరోజుల గడువు కావాలని- ఈ లోపల తన వద్ద ఉన్న వజ్రాల హారాన్ని పార్సల్ చేసి పంపిస్తున్నానని- దానిని డబ్బు చేసుకోమని చెప్పి ఫోను కటే చేసిందామె.


ఆ తరవాత ఆమె అక్కడికక్కడ అలాగే విస్తేజంగా కూర్చుండిపోయింది. ఇకపైన అత్యాశల మొసలి నోరు తెరుస్తూనే ఉంటుంది! దేనికైనా ఒకసారి తను బ్లాక్ మెయిలర్ తో సర్దుబాటు చేసుకోవడానికి సిధ్దపడితే అది జీవితాంతం శరణాగతే! చిరుతకు చిక్కటి మనిషి రక్తం రుచి చూపించినట్టే! ఇక తనకు ఆడ బ్రతుకన్నది మిగలదు. జీవితాంతం బానిస బ్రతుకే--- ఇటువంటి బ్రతుకు బ్రతకడం కంటే మరణమే మేలు-- ఇలా గట్టిగా అనుకుంటూ బలంగా తలవిదిల్చుతూ లేచింది. ఏది ఏమయితేనేమి—తాడో పేడో తేల్చుకోవాలనే తీర్మానించింది వందన.


మెకంజీ వద్ద ఒకటీ రెండూ కాదు—చాలానే తను అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలు ఉన్నాయి. సెల్ఫీలు ఉన్నాయి. ఈ విషయంలో తను నిజంగానే పొరపాటు చేసింది. తనకంటే ఎక్కువగా తన వయసు పొరపాటు చేసింది;మరులు మరలును వయసుతోడనే అన్నట్టు-- అలాగని పొరపాటుపైన పొరపాటు చేస్తూనే ఉండలేదు కదా! కాలసిన వారందరి గుండెలపైనా కుంపటిలా మండుతూ ఉండలేదు కదా! అదైనా యిదైనా యేదో ఒక రోజు పైకి పొక్కక మానదు కదా!


అది సౌభాగ్య పెండ్లి మండపం. వసంతరావుతో ఏడడుగులు నడిచి అతడికి భార్యగా జీవన సహచరిగా కొత్త జీవన ప్రాంగణంలోకి అడుకుపెట్టింది లాంఛనంగా వందన. ఇద్దరూ రిసెప్షన్ హాలులో జంటగా నిల్చుని వచ్చీ పోయే గెస్టుల వద్దనుండి కానుకలూ శుభా కాంక్షలు స్వీకరిస్తూ పలకరింపుల పన్నీటి జల్లు చిమ్ముతూ కళకళలాడుతున్నారు.

కొద్ది సేపటికి ఆహ్వానితుల అలికిడి తగ్గింది. అప్పుడక్కడకు అదే అదనుగా పిల్లి గడ్డంతో ముఖ కవచంతో ఒక వ్యక్తి చరచరా దూసుకు వచ్చాడు. వచ్చిన వెంటనే అతడు వధూవరులకు కంగ్రాట్స్ చెప్పలేదు. పాలిపోయిన ముఖంతో తెల్లబోయి చూస్తూన్న వందనను ప్రక్కకు నెట్టి వసంతరావుని చేయి పట్టుకుని హాలు వసారాలోకి లాక్కు వెళ్లాడు-


“నేను నీకు ఒకటి కాదు- రెండు కాదు- మూడు మెసేజ్ లు పంపించాను. మీకేమైంది—ఒళ్లు గిడసబారిందా! మీసం లేదు, సరేసరి- మగతనమూ లేదా! వందన మీరనుకున్నట్టు కన్నె చెర చెరగని కన్య కాదు. పలు రోజులు నాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కామ పిశాచి”.


అదంతా విని వసంత రావు “అలాగా! ”—అని షాక్ తింటూ క్రుంగిపోతూ చూస్తూండిపోతాడను కున్నాడు మెకంజీ. కాని అలా జరగలేదు. నిదానంగా చిర్నవ్వు చిందిస్తూ నిల్చున్నాడతను.


“ఇంకా నమ్మకం కుదరడం లేదా?ఇవి చూడు- అప్పడైనా నీకు జ్ఞానోదయం కలుగు తుందేమో-- ”అంటూ జేబునుండి పొడవాటి కవరు తీసాడు.


అవన్నీ తామిద్దరూ కలసి విహార యాత్రకు వెళ్లినప్పుడు తీసిన సెల్ఫీల ఫోటో కాపీలే-- ఈసారి మెకంజీ నిజంగానే షాక్ తిన్నాడు. వసంతరావు భార్య ఫొటోలున్న ఆ కవరుని విప్పలేదు సరి కదా- అలక్ష్యంగా తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాడు.


”నువ్వు నాకు మెసేజ్ లు పంపించకముందే వందన అంతా చెప్పింది. మనసు విప్పి చెప్పింది- మీ మధ్య ఫేస్ బుక్ ద్వార ఏర్పడ్డ స్నేహం గురించి. ఆ తరవాత మీ మధ్య ఏర్పడ్డ సాన్నిహిత్యం గురించి-- అప్పుడు నా ముందు నిల్చున్నవి రెండే రెండు ప్రశ్నలు. మొదటిది- నిన్ను నమ్మాలా వద్దా అన్నది. రెండవది- వందన చెప్పింది నమ్మాలా వద్దా అన్నది. అప్పుడు నేను మెదడుతో ఆలోచించలేదు. హృదయంతో ఆలోచించాను. నేను అప్పుడు హృదయం చెప్పినట్టు నడచుకోవాలని తీర్మానించాను. వందనను కన్యగానే స్వీకరించాను. అసలు విషయానికి వస్తే, ప్రాక్టికల్ గా అవలోకిస్తే ఈరోజుల్లో యిటువంటి అఫైర్స్ యెక్కడ జరగడం లేదని—వీటికి యెవరు మాత్రం అతీతులని-- నౌ- ఫర్ ట్రయింగ్ టు బ్లాక్ మెయిల్ మై వైఫ్- నువ్విప్పుడు అందాల సోయగాలను కాదు, విషమ పర్యావసానాలను రుచి చుడాలి- ఎలాగంటే ఎందుకంటే నువ్వు దెబ్బతిన్న మృగానివని, నువ్విక్కడకు వస్తావని నాకు తెలుసు- వందనకూ తెలుసు” అంటూ తప్పట్లు కొడ్తూ సైగ చేసాడు.


చిటెకెలో మేల్కొన్న మెకంజీ చటుక్కున వెనుదిరిగాడు పరుగు లంకించుకోవడానికి. కాని అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి చుట్టుముట్టారు కబంధ హస్తాలతో యినుప సంకెళ్ళతో బిగిస్తూ-- ఏకధాటిగా ముప్పైరాత్రులు తప్పించుకు తిరిగిన నిశాచరుడు ఏదో ఒక రోజు చిక్కకుండా పోడుగా--

* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


61 views0 comments
bottom of page