top of page

దీపాల పండగ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Dipala Pandaga' New Telugu Story Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి



రామశేషం లోలోన కలవరపాటుకి లోనవుతున్నాడు. రేపే దీపావళి. భార్య పిల్లలూ తనకోసం వేయి కళ్ళతో యెదురు చూస్తుంటారు బాలానగర్ పొలిమేరన పొంచి చూస్తూ-- మరి తనెక్కడున్నాడిప్పుడు?హన్మకొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద. సీనియర్ ఆఫీసర్లకు సపోర్టింగ్ స్టాఫ్ సూపర్ వైజరుగా-- విషయం అత్యవసర వ్యవహారమే, కాదనలేడు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ వారి ఆదేశానుసారం పౌర సంబంధ వ్యవహారాల కార్యాలయాన్ని ప్రారంభించాలి. అదీను యెక్కడో ఊరుకి దూరంగా విసిరి పారేసినట్టున్న ఆకుల్లేని చెట్టులా కాకుండా, హన్మ కొండ నడిమధ్య నలువైపుల నుండి వచ్చే లబ్ధిదారులకు కార్యాలయ ప్రాంగణం చేరుకోవడానికి అనుకూలంగా, అనువుగా ఉండే విధంగా--

ఇక అసలు సంగతికి వస్తే, ఇక్కడే అండ పిండ బ్రహ్మాండం అణగి ఉంది. ఆ చుట్టు ప్రక్కలెక్కడా కార్యాలయ వ్యవహారాలకు అనుకూలంగా అందివచ్చే కట్టడమేదీ అందుబాటులో కనిపించడం లేదు. హన్మకొండ ప్రధాన బజారు వీధిన కొత్తగా కట్టిన కట్టడం మాత్రం గ్రద్ద ముక్కులా తొంగి చూడనారంభించింది. కాని, దానిని ఆక్రమించుకోవడానికి రెండు భారీ వ్యాపార సంస్థలు తలపడబోయే వస్తాదుల్లా క్యూకట్టి నిల్చు న్నాయి; భారీ ఆఫర్లను యివ్వ చూపుతూ-- ఆంగ్ల పరిభాషలో అంటారే- “యెన్ ఆఫర్ దట్ కుడ్ నాట్ బీ రిఫ్యూజ్డ్“అని.


సరిగ్గా అప్పుడే పెద్దల ధర్మ సూత్రాన్ని పాటించి తీరాలని రామశేషం ప్రతిపాదించాడు;సామ దాన దండ ప్రయోగానికి దిగాలని. రామశేషం చేసిన సూచన ప్రకారం డిపార్టుమెంటు సీనియర్ ఆఫీసర్లు నగరంలో చెల్లాచెదురుగా ఉన్న కార్మిఖ సంఘాల నాయకుల్ని పిలిచి- వాళ్ళతో బాటు ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రతినిధుల్ని కూడా పిలిచి సమావేశం యేర్పాటు చేసారు.


ఆ లోపల కట్టడం కోసం పోటీపడుతూన్న మేజర్ వ్యాపార సంస్థల యెజెంట్లు కట్టడం రియల్ యెస్టేట్ ప్రతినిధులకు త్రీ- స్టార్ హోటల్ లో భారీ లేవిష్ పార్టీకి యేర్పాటు చేసారు. ఎవరు ముందో యెవరు వెనుకో చెప్పలేని గడ్డు పరిస్థితి. ఆర్థిక పరంగా చూస్తే రామశేషం వాళ్ల డిపార్టుమెంటు ఆ పోటీలో బల దూరే! ఎందుకంటే—ఎలాగంటే, కట్టడాన్ని స్వంతం చేసుకోవడానికి స్క్వేర్ ఫీట్ లెక్కన రేట్సు కోట్ చేయడంలో ప్రభుత్వ పరమైన నియమ నిబధ్ధతల్ని పాటించాలి.


వాటిని దాటి వెళ్ళడానికి ఇక్కడి హెడ్ ఆఫ్ ది ఆఫీసుకి తగినంత విచక్షణాధికారాలు లేవు. ఇక్కణ్ణించి తిన్నగా ఢిల్లీకి రెక్కలు కట్టుకుని కాలికి ఉత్తరం కట్టుకున్న పెంపుడు పావురంలా చేరవలసిందే! అక్కడకి గాని వెళితే గంటలు కాదు, రోజులు పట్టవచ్చు. ఆలోపల హన్మకొండలో ముగించాల్సిన శుభ గడియ కాస్త దాటిపోవచ్చు. కట్టడాన్ని ప్రైవేటు వాణిజ్య సంస్థలు తన్నుకు పోవచ్చు, ముందు గొయ్యి- వెనుక నుయ్యి.


ఇదంతా తన పై అధికారులకు రామశేషం వివరించిన తరవాతనే పుర ప్రముఖులతో సమావేశం యేర్పాటు చేయడం జరిగింది. నగరం నడిబొడ్డున పౌరసంబంధ కార్యాలయం యేర్పా టు వల్ల హన్మకొండ పౌరులకు వ్యాపార సంస్థలుకు, ముఖ్యంగా అసంఘటిత కార్మిక జనానికి రాబోవు సానుకూల ఫలితాల గురించి వివరించడానికి సంయుక్త సమావేశం యేర్పాటుకి ప్రయత్నాలు ఆరంభమయాయి.


మరిటువంటి క్లిష్ట సమయంలో రామశేషం మరునాడు దీపావళి పండగ ఆరంభమని తను తప్పకుండా భార్యాబిడ్డల్ని చూసి రావల్సుందని యెలా మొరపెట్టుకోగలడు తన సీనియర్ పర్యవేక్షక ఆఫీసర్లకు. అగ్గిమీద గుగ్గిలంగా మారదూ!తన వార్షిక సి ఆర్ అటకెక్కదూ-- సానుకూల అంశాలవల్ల, పుర ప్రముఖుల వత్తాసు వల్ల కార్మిక సంఘాల జోక్యం వలన డిపార్టుమెంటుకి అనుకూలంగా యెస్తేట్ ఓనర్ తో కొనుగోలు ఒప్పందం కుదిరింది. కాఫీలు ఫలహారాల ఆరగింపుల తరవాత డీల్ పైన సంతకాలు జరగడం, చెక్కు అందివ్వడం పూర్తయాయి. పిదప కట్టడాన్ని స్వాధీనం చేసుకోవడం, తాళం కప్ప బిగించడం ఒకటి తరవాత ఒకటిగా జరిగింది.


ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి మెసేజ్ పంపడం కూడా పూర్తయి, అదేరోజున కార్యాలయ సీనియర్ అధికారులు ఆఫీసు కారు ద్వారా విమానాశ్రయం వెళ్ళి పోయారు. మరి రామశేషానికి విమానంలో వెళ్ళేంత స్థాయి లేకపోవటాన, బజారుకెళ్ళి ఆదరాబాదరాగా పిల్లలిద్దరికీ టపాసులు మతాబులు కొనుక్కుని భవానికీ తల్లికీ యెక్సుపోర్ట్ క్వాలిటీ చేనేత చీరలు కూడా కొనుక్కుని దారిలో తినడానికి ఊరికి తీసుకెళ్ళడానికి కారప్పూసలు లడ్డూలు జిలేబీలు జంతికలు సాల్టడ్ వేరుశెనక్కాయలు కూడా తీసుకుని బస్టాండు చేరుకుని భాగ్యనగరానికి వెళ్ళే డి లక్స్ బస్సెక్కి కూర్చున్నాడు.


అప్పుడు గాని రామశేషానికి గుర్తు రాలేదు తను కొన్ని గంటల వరకూ సెల్ ఫోను స్క్రీను విప్పి చూడలేదని. కలవరపాటుతో విప్పి చూసాడు. మొత్తం యేడు మిస్సింగ్ కాల్స్. భవాని యేమనుకుంటుందో! ముఖ్యంగా అమ్మ యేమనుకుంటుందో తన మతిమరుపుకి.

”ఉద్యోగం ముఖ్యమే - కాదనం. కాని కుటుంబం కూడా ముఖ్యమే కదరా!ఇంతకూ నువ్వు పడీ పడీ కష్టపడుతున్నదెందుకంట? భార్యాబిడ్డల కోసమే గా! వాళ్ళను దిక్కులు చూసేటట్టు చేస్తావా?“అని తప్పకుండా నిలదీస్తుంది.


ఆఫీసు వ్యవహారాల గురించి చెప్తే వినిపించుకోదు. మరింత రెచ్చిపోయి మరింత హెచ్చు స్థాయిలో చీవాట్లు పెడ్తుంది అమ్మ. మిస్ కాల్స్ వచ్చిన వాటిలో సగానికి పైగా కూతురు కొడుకు చేసినవే-- - అదే తడవుగా ఫోన్ లింకిచ్చి భార్యకు సారీ చెప్పి రాత్రి యెనిమిది లోపల ఊరు చేరుకుంటానని భరోసా యిచ్చాడు రామశేషం.


ఆ మాట చెప్పినంతనే పిల్లలిద్దరూ చేసిన కుషీ కేరింతలు అతడికి స్పష్టంగా వినిపించాయి. బస్సు కదల డానికి యింకా ఐదారు నిమిషాలుందనగా అతడు వేరుశెనక్కాయలు గుప్పెడు తీసుకుని నోట్లో వేసుకుని రెండు జిలేబీలు కూడా నమిలి నీళ్లు తాగాడు. అప్పుడతనకి స్పృహ కలిగింది;తను కొత్త కార్యాలయ బిల్డింగ్ వ్యవహారంలో పడి ఆకలి సంగతి కూడా మరచిపోయాడని--


మొదటీ విడతగా బస్సు మాధవ పురం బస్టాపులో ఆగింది. కండక్టర్ పురమాయింపు విని రామశేషం బస్సు దిగి వెళ్ళి టీ తాగి వచ్చాడు. డ్రైవరూ కండక్టరూ తీరిగ్గా దమ్ములాగి చీమనడకతో వస్తున్నారు. ఇలా దారిపొడవునా టీల కోసం కాఫీల కోసమూ యెడ్ల బండిలా ఆగుతుంటే బస్సు ఊరు యెప్పుడు చేరుతుందని?


అంతటా మందకొడితనమే! పట్టనితనమే !బిస్కట్లు రెండు తిని గొంతు తడుపుకుని సీట్లో చేరబడి రిలేక్స్ గా కళ్ళు మూసుకున్నాడు రామశేషం. ఎదలోపలా కనురెప్పల మధ్యా యింటి వాకిలే రంగు రంగుల్లో కనిపిస్తూంది. మాట్లాడుకుంటూన్న కొందరు బస్ ప్రయాణీకుల గొంతులు రణగొణ ధ్వనిలా వినిపిస్తున్నాయి. ”ఇంకా ఊసులేనా!ఎక్కడ బడితే అక్కడ మంతనాలేనా!అవన్నీ యింటికెళ్ళి తీర్చుకోవచ్చుగా!“అని మనసున అనుకుంటున్నప్పుడు బస్సులో లైట్లు చప్పున ఆగిపోయాయి.


మాగన్నుగ కన్నుమూసిన రామశేషం చప్పున కళ్ళు తెరిచాడు. మరొకసారి బస్సు ఆగిపోయినట్లుంది. బస్ ప్యాసింజర్లు తీరిగ్గా కాఫీలు టీలు తీసుకోవడానికి వీలు కల్పించడానికి కాబోలు-- తనకందిన భోగట్టా ప్రకారం బస్ నడిపే వాళ్లకూ దారి మధ్య కనిపించే దుకాణం వాళ్ళకూ మధ్య యేదో లోపాయికారి అవగాహన ఉంటుందంటారు. వీళ్ళెక్కడ బస్ నిలుపుతారో అక్కడున్న టీ- దుకాణం వాళ్ళూ, రెస్టారెంటు వాళ్ళూ ఈ బస్ వాళ్ళను రాచమర్యాదలతో ప్రత్యుత్థానం చేస్తారట.


రెండవ సారి బస్ ఆగిన తరవాత యింకా నలభై నిమిషాలు కూడా అవలేదు. మళ్ళీ రిఫ్రెష్ మెంట్సా!అతడు చివుక్కున లేవబోయాడు. కాని ద్వారపాలకుడిలా అడ్డంగా నిల్చున్న కండక్టర్ ఆపాడు. ”ఇక్కడేమీ దొరకదు సార్!ఇది పారిశ్రామిక వాడ. చుట్టు ప్రక్కలన్నీ పల్లెటూర్లే—వెళ్ళి కూర్చోండి” మరెందుకు ఆపినట్లని అడిగాడు రామశేషం.

“ఇంజన్ బాగా వేడెక్కిపోయింది. గడబిడ సౌండ్ వస్తూంది.


”వేడెక్కిపోతే?”

“ఇదేం ప్రశ్న్యయ్యా బాబూ!కోర్టులో వేసినట్టు—వేడిక్కిపోతే ఇంజన్ పాడయిపోతుంది. ఇంజన్ పాడయిపోతే యేమవుతుందో చెప్పాలా? మంటలు లేస్తాయి. మంటలు గాని లేస్తే బస్సు తగలబడి బూడిదవుతుంది. చాలా!ఇంకా యేమైనా అడగాలా!“


రామశేషం యిక నోరు మెదపడం ఆపి కళ్ళు మిటకరిస్తూ ఉండిపోయాడు. సమస్య పెనం పైనుండి కుంపట్లో పడ్డట్లుంది, ఇక తను భాగ్యనగరం టైముకి చేరుకున్నట్టే!సర్వీసింగ్ బస్ యెప్పుడొస్తుంది?రిపేరింగ్ పని యెప్పుడు పూర్తవుతుంది? మరి కాసే పటికి బస్ డ్రైవర్ దమ్ము లాగడానికి దిగినట్టున్నాడు. అదే అదనుగా ముగ్గురు నలుగురు ప్యాసింజర్లు కూడా దిగారు, రామశేషం కూడా వాళ్ళ వెనుకే దిగాడు.


హెడ్ లైట్సు తప్ప చుట్టు ప్రక్కలంతా చీకటి నలుపు గొంగళిలో చిందులు వేస్తున్నట్లుంది. బస్సు లైట్సు చూసి గావాలి చిన్న చిన్న కుర్రాళ్ళు గౌను తొడుక్కున్న అమ్మాయిలూ బస్ చుట్టూ గుమికూడారు. వీళ్ళకు యిదంతా ఓ వింతేమో!ఐనా రాత్రి పూట వీళ్ళకిక్కడేమి పని?ప్రొద్దుటే బడికి వెళ్ళ వద్దూ!బడి లేకపోతే హోమ్ వర్క్ గట్రా చూసుకోవద్దూ!


తనకు సమీపంగా వచ్చి నిల్చున్న డ్రైవరుని అడిగాడు రామశేషం- “ఇదేం ఊరు? రాత్రి పూట ఈ పిల్లలకేమి పని?”


“చుట్టు ప్రక్కల రెండు మూడు పల్లెటూళ్లు ఉన్నా నిజానికిది పారిశ్రామిక వాడండి. అదిగో అలా తలెత్తి చూడండి!”

రామశేషం తలెత్తి చూసాడు. అతడికి నల్లటి ఆకాశం తప్ప అక్కడక్కడ పూలగుత్తుల్లా వ్రేలాడుతూన్న నక్షత్రాలు తప్ప మరేమీ కనిపించ లేదు. అదే మాట డ్రైవరుకి చెప్పాడు.


“అబ్బ!నేను చెప్పేది ఆకాశంలోకి చూడమని కాదండీ! కుడివేపు చూడమంటున్నాను. అది ఫ్యాక్టరీ- సెరామికి ఫ్యాక్టరీ— దానికి యిటు వేపున్నదేమో ఫ్యాక్టరీ సిబ్బందీ కార్మికులూ కుటుంబాలతో ఉండే నివాస స్థలాలు. ఇప్పుడక్కడ యెక్కువ మంది లేరు. కొందరు వేరే ఊళ్ళకి వలసపోయారు. మరి కొందరేమే చుట్టు ప్రక్కల ఊళ్ళలో చిన్నాచితకా పనులు చేసుకోవడానికి వెడలి పోయారు. ఇంకా చెప్పాలంటే-- “అని ఆగిపోయాడు బస్ డ్రైవర్.


“ఇంకా చెప్పాలంటే అని ఆగిపోయావేం?చెప్పి ముగించు-- “


“కొందరు రహదారులమ్మట చందాలు ప్రోగు చేసుకుని బ్రతుకీడుస్తున్నారు. ఇంకొందరు జబ్బున పడి చనిపోయారు కూడా-- “ రామశేషం డ్రైవర్ ని ఆపాడు- “అదంతా వింటూనే ఉన్నాగాని—ఇంతకీ ఫ్యాక్టరీకేమయింది?”


“ఇంకా పాయింట్ పట్టుకోలేదా!మూసేసారు”

“ఎందుకు?ఎప్పుడు?”


“భలే బాగానే అడుగుతున్నారయ్యా!నేనేమి లేబర్ కమీషనర్నా అన్ని వివరాలూ జేబులో పెట్టుకుని యివ్వడానకి—“


“తెలిసిన కాడకి చెప్పవచ్చుగా!”


“చెప్తాను. ముందు చేతిలో చేయి వేసి చెప్పండి- మీరు పేపర్ మనుషులేనా!”డ్రైవర్ చేతిలో చేయి వేసి చెప్పాడు రామశేషం తను యేపత్రికకు చెందినవాడు కాడని.


రామశేషం యిచ్చిన మాట విని డ్రైవర్ చెప్పనారంభించాడు- “చూస్తే తెలుస్తూంది మీరు చదువుకున్నవారని, మీకు ప్రత్యేకంగా యేమీ చెప్పనవసరం లేదని. ఐనా చెప్పాలనిపిస్తూంది, కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో పలుదేశాల మధ్య- అంతెందుకు పలు కుటుంబాల మధ్య చోటు చేసుకుంటూన్న ఘర్షణలకు అసలు కారణాలు రెండు—ఒకటి, అవగాహన లేకపోవడం. రెండవది- ఒకరిపై ఒకరికి విశ్వాసం తగ్గిపోవడం. ఇక విషయానికి వస్తాను. ఈ సెరామిక్ కర్మాగారంలో రెండు యూనియన్లు ఉన్నాయి. ఎక్కడైతే రెండు యూనియన్లున్నాయో అక్కడ సవతి పోరు తప్పని సరి. ఇకపోతే మొదటి నుంచీ యాజమాన్యానికీ యూనియన్లకీ మధ్య కారణం ఉన్నా లేక పోయినా అంతర్యుధ్ధం సాగుతూనే ఉంటుంది.

మేనేజ్మెంటు యేమి చెప్పినా వీళ్ళు నమ్మరు. మేనేజ్మెంటు వాళ్ళు యేమి చెప్పినా కార్మిక సంఘ నాయకులు నమ్మరు. వీళ్ళు డిమాండ్సు పెడ్తారు. అవన్నీ గొంతెమ్మ కోర్కెలని యాజమాన్యం కొట్టి పడేస్తుంది. కంపెనీ లాభ నష్టాల గురించి యాజమాన్యం తరపున యేమి చెప్పినా కార్మిక సంఘ నాయకులు కొట్టి పడేస్తారు, అవన్నీ కట్టుకథలని-- కాని యిక్కడ గమనించ వలసిన విషయం యేమంటే- విచిత్రమైన అంశమేమంటే మేనేజ్మెంటు యెల్లప్పుడా కాకపోయినా కొన్ని సమయాలలో ఉన్నదున్నట్లు వాస్తవాలు చెప్పవచ్చు. వాళ్ళు చెప్పే వాస్తవాలను విశ్లేషించి పరిగణలోకి తీసుకోవాలంటే కాస్తంత ఓర్పు కావాలి. ఎడాపెడా ఉద్రేకం పాలు కాకుండా నిదానం పెంచుకుని ముందుకు సాగేంత నేర్పు కూడా కావాలి. ఎప్పటిలాగే యాజమాన్యం తరపు వాళ్ళు అవాస్త వాలు చెప్తున్నారనుకుని కార్మిక సంఘాలు రెండూ పప్పులో కాలు వేసాయి.


నిజంగానే కంపెనీకి నష్టాలు వచ్చాయి. తీసుకున్న బ్యాంకు అప్పులు పెరిగాయి. కారణం, ఉత్పత్తులకు లోకల్ డీమాండ్ తగ్గింది, తరుచుగా సప్లయ్ కోసం ఆర్డర్లు పెట్టే ఒక విదేశీ కంపెనీ సెరామిక్ ఉత్పత్తులు కొనడం మానేసింది. ఈ వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించకుండా రెండు కార్మిక సంఘాలూ పోటాపోటీగా డిమాండ్ల స్థాయి తగ్గించకుండా సమ్మెకు దిగారు. ఎంతైనా యాజమాన్యాలకు నక్కజిత్తులమారితనం యెక్కువే కదా! దీనిని నెపంగా తీసుకుని లేబర్ ట్రిబ్యునల్ ద్వారా వ్యవహారాన్ని జరిపించి యిక తాము ఫ్యాక్టరీ నడిపించలేమని చేతులెత్తేస్తూ లాకౌట్ ప్రకటించి సీనునుండి తప్పుకున్నారు.


వాళ్ళు వేసిన ఉచ్చులో చిక్కుకుని కార్మికులు రోడ్డున పడ్డారు. అదిగో యిదిగో అంటుంటారు గాని, ప్రజా ప్రతినిధులు గర్జిస్తుంటారు గాని గత నాలుగేళ్ళుగా మూసిన ఫ్యాక్టరీ అలాగే పడిఉంది. అక్కడ గుమికూడి నిల్చున్న పిల్లలందరూ అక్కడి కార్మికుల పిల్లలే-- “


“ఇంత లోతుగా ఫ్యాక్టరీ వ్యవహారాల గురించి మీకెలా తెలుసు?“


“మునుపు సిరామిక్ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడినే!లేబర్ ప్రోబ్లమ్ములు తరచుగా రేకెత్తడం చూసి అశుభం యెంచి ఆర్ టీసీలో చేరిపోయాను“


రామశేషం అంతావిని చాలా సేపు మౌనంగా ఉండిపోయాడు. హెడ్ లైట్లలో పిల్లకాయల ముఖాలు చూస్తుంటే అతడికి యింట్లో యెదురు చూస్తూన్న కూతురూ కొడుకూ గుర్తుకి వచ్చారు. ఊరంతా విస్తరించబోయే రేపటి దీపావళి కాంతులు కళ్ళ ముందు మెదిలాయి. గుండె బరువుగా మారింది. రేపు ఊరంతా దీపాల పండగే—ఇక్కడి పిల్లలకు తప్ప-- అక్క ణ్ణించి కదులుతూ బస్కులోకి యెక్కి ట్రావిలింగ్ బ్యాగు తీసి క్రిందకు దిగాడు. దిగి చుట్టూరా చూపులు సారించి పిలిచాడు-


“హేయ్! పిల్లలూ ఇలా రండి!”


నిల్చుని ఆగిపోయిన బస్సుని వింతగా చూస్తూన్న పిల్లలందరూ జంకుతూ మరింత దూరం జరిగారు. అప్పుడు బస్సు డ్రైవరు వాళ్ళకు బోధపడే యాసతో దగ్గరకు రమ్మనమని పిలిచాడు. దానితో ధైర్యం తెచ్చు కున్న పిల్లకాయలందరూ దగ్గరకు చేరారు. రామశేషం అక్కడ అలాగే ఉండమని సంజ్ఞ చేస్తూ ట్రావిలింగ్ బ్యాగునుండి కారప్పూసల ప్యాకెట్లూ జంతికల ప్యాకెట్లూ- స్వీటు ప్యాకెట్లూ- యింటికోసం కొనుక్కున్న మతాబుల సంచులూ డ్రైవరికి అందించాడు. అతడు ఫెళ్ళున వెలిగిన ముఖంతో వాటిని వరసగా నిల్చున్న పిల్లలందరికీ పంచి పెట్టసాగాడు. అప్పుడు పిల్లల గోల విని కండక్టరూ క్లీనరూ పరుగున వచ్చి తమకొక ప్యాకెట్టు యివ్వమని అడిగారు.


“మనకెవ్వరికీ లేదోయ్!అన్నీ పిల్లలకే—పిల్లల కోసమే-- ” రామశేషం ఆత్మీయంగా కనురెప్పల్ని అరమోడ్చాడు. అంతటి ఆత్మానందాన్ని అతడెప్పుడూ అనుభవించలేదేమో! ఇక ముందు కూడా అనుభవించలేడేమో—పిల్లలూ దైవమూ ఒక్కటేనంటూరు ఇందుకే కదా!


అతడలా వెలిగే ముఖాలతో దినుసులు అందుకుంటూన్న పిల్లల వేపు తేరి చూస్తున్నప్పుడు అప్పుడెప్పుడో విన్న జానపద గీతం చప్పున మనసు మందిరాన ధ్వనించింది-


నవ్వితే నీ కళ్లు ముత్యాలు రాలు

ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు

నవ్వితే నీ కళ్లు ముత్యాలు రాలు

ఆ నవ్వే నిను వీడక ఉంటే అదే పదివేలు

కలతలూ కష్టాలూ నీ దరికి రాకా

కలకాలమూ నీబ్రతుకు కలల దారిన నడవాలి.


ఈ పిల్లల అర్థాకలి యెప్పుడు తీరుతుందో! రామశేషం ఆలోచనలు చట్టున తెగిపోయాయి మారు మ్రోగిన బస్సు హారన్ విని. బరువెక్కిన గుండెను మోసుకుంటూ బస్సెక్కాడు.

* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.



32 views0 comments

Comments


bottom of page