top of page

ఉగ్రనేత్రం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ugranethram' New Telugu Story

Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి





సీక్రెట్ సర్వీసు సీనియర్ ఇన్స్పెక్టర్ వీర విశ్వేశ్వర్ ని దేశ సరిహద్దు ప్రాంతమైన భుదియాన్ లో వేసారు. తల్లి సత్య సుధమ్మ భార్య గీత విశ్వేశ్వర్ పోస్టింగు గురించి విని కలత చెందారు. రెండు మూడురోజల వరకూ మాటా మంతీ లేకుండా మౌన ముద్ర ధరించారు. ఎంతటి స్పెషల్ మిషన్ ఐతే మాత్రం కుటుంబీకుణ్ణి అంత దూరమా యేక దళ వృక్షాన్ని విసిరేసినట్టు వేస్తారూ!


కూతురు శశికళకు కూడా రాను రాను చొరబాటు దారుల అక్రమ ప్రవేశం వల్ల ఉద్రిక్తంగా మారుతూన్న సరిహద్దు ప్రాంతానికి తండ్రిని వేయడం దిగులు పుట్టించింది. ఎందుకంటే అదేమీ షార్ట్ టార్మ్ మిషన్ కాదు. యాంటీ టెర్రరిస్టు స్వాడ్ కి చెందిన వ్యవహారం. తండ్రికి మరల ఇటు వేపు వచ్చేయడానికి ఎన్నాళ్లు పడ్తుందో! తను మళ్ళీ తనతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన కాలేజీ మేట్సునీ స్కూలుమేట్సునీ యెప్పుడు చూడగలదో!


ప్రజారక్షణకు సంబంధించిన రక్షక భట ఉద్యోగం కదా! ఎప్పుడెక్కడకి వెళ్ళాల్సి వస్తుందో తన తండ్రికే తెలియదు. ఒకానొకప్పుడు ఆమెకు చల్లని మంచు కొండల్ని, విశాలంగా పరుచు కున్న తెల్లటి మంచు మైదానాల్ని చూడాలన్న ఆకాంక్ష మిక్కుటంగా ఉండేది. కాని ఆ కాంక్ష ఇప్పుడు లేదు. ఇప్పుడు చుట్టు ప్రక్కల చోటు చేసుకుంటూన్న అసాంఘిక తీవ్రవాద చర్యలు గమనిస్తూన్న యెవరికి మాత్రం అటువేపు వెళ్ళాలన్న కుతూహలం కలుగుతుంది?


కాని కొడుకు కాళీశ్వర్ కి మాత్రం అటువంటి దిగులు యేకోశానా లేదు. ఇంకా చెప్పాలంటే, అందరి ముందూ చూపించ లేదు గాని, లోలోపల యెగిరి గంతేసినంత ఉత్సాహం కలిగింది. కాని యింటి వాతావరణాన్ని గమనించి తనలోని ఆనందోద్వేగాన్ని బహిర్గతం చేయడానికి జంకాడు. కారణం అతడికి బాగానే తెలుసు; బామ్మ సత్యసుధమ్మ చీవాట్లు పెడ్తుంది. చెవులు మెలి వేస్తుంది. తనకీ ఆవిడకీ అస్సలు పడదు.


ఐనా- అడ్వంచరస్ లైఫ్ ఇచ్చే థ్రిళ్లూ కిక్కూ ముప్పొద్దులా ఓమూల ఒదిగి భజన కీర్తనలతో జపతపాలతో కాలం గడిపే ఈ వయోధికులకేం తెలుసు? ఇన్నాళ్లూ తను బంగీ జంపింగ్- రాక్ క్లైంబింగ్ వంటి అడ్వంచరస్ స్పోర్ట్స్ గురించే తలపోస్తుండేవాడు. ఇప్పుడేమో తన తండ్రి పోలీసు ఉద్యోగం పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్ లో కాలుపెట్టి లైఫ్ థ్రిల్లింగ్ గేమ్స్ చూడబోతున్నాడు- కాదు- ఆడబోతున్నాడు.


అవకాశం కలగాలే గాని మంచు కొండల్లోకి చొరబడి రాక్ క్లయింబింగ్ చేయడూ! రేసింగ్ కారులో మంచు మైదానాలలో అదరహో అన్నట్టు మంచు తెరల్ని రేపుతూ దూసుకుపోడూ! ఒక కొండ నుండి మరొక కొండకి క్లిఫ్ హ్యాంగర్ ద్యా రా సాహసంగా తేలిపోడూ! అసలు అడ్వంచర్ స్పోర్ట్స్ అంటే రిస్క్ తో చెలగాటమే మరి-- రిస్క్ లేనిదే థ్రిళ్లూ కిక్కూ యెలా వస్తుంది? రియల్ లైఫ్ గేమ్సు ఆడే తరుణం ఇదే కాక, యాభైలోనా అరవైలోనా తెగించి ఆడతాడు!


కాని-- అప్పటికే ఉగ్గనేత్రమొకటి సరిహద్దు కంచె ఆవలినుండి తమను గమనించనారంభిస్తుందని కాళేశ్వర్ కి తెలియదు.


అనుకున్న ప్రకారం వీర విశ్వేశ్వర్ కుటుంబ సమేతంగా బుధియాన్ చేరిన వారం రోజుల్లోపల కాళేశ్వర్ తండ్రిని ఒప్పించి హార్స్ రైడింగ్ క్లబ్బులో చేరాడు. తరవాత రాక్ మౌంటెన్ క్లైంబింగ్ అడ్వంచర్ సొసైటీలో చేరాడు. కొడుకులో కానవచ్చే ఉద్వేగ భరిత ఉత్సాహాన్ని చూసి గీత అంతర్గతాన భీతిల్లింది. అదే మాట భర్తతో చెప్పింది- “ఇదేమీ గోదావరి గడ్డ కాదండీ! ఇది తీవ్రవాద హింసాత్మక భావజాలానికి పుట్టినిల్లుగా మారిపోతూన్న కాశ్మీర లోయండీ! . బైక్ లో ఎడా పెడా మెలికలు తిప్పుతూ బైక్ ని తోలే మనూరి తారురోడ్డు కాదండీ-- గడ్డ కట్టుపైన మంచుపైన మామూలుగా నడిస్తేనే జారిపడతాం.


అటువంటిది మనకు అలవాటే లేని ఇటువంటి వాతావరణ పరిసరాలలో పరిస్థితి యెలా ఉంటుందో ఆలోచించండి. వాడికేదైనా ఉద్యోగంలో కుదిర్చి మైదాన ప్రాంతానికి పంపివేస్తే సర్వత్రా మంచిదనిపిస్తూందండి. వాడిదసలే తురు తురుమనే దుడుకు స్వభావం. వాడికి అంత స్వేఛ్ఛనివ్వకండి-- ”


భార్య చెప్పింది అంతా విన్న వీర విశ్వేశ్వర్ చెప్పసాగాడు. “నిదానంగా విను. నాకు మాత్రం వాడంతటి రిస్కీ అడ్వంచర్ స్పో ర్ట్సులో పాల్గొనడం ఇష్టమా! తండ్రిగా నాకున్న భయం నాకుండదా?ఐతే—మగకుర్రాడిగా వాడి యూత్ ఫుల్ స్పిరిట్ ని యెలా అదుపు చేయ గలను?వాడిలోని స్పిరిట్ ని అదుపు చేయాలంటే—వాడిలోని జీన్స్ మ్యాప్ ని మార్చాలి. అది చేయగ లనా! చేయలేను. ఈలోపల వాడు రెండు మూడు యెగ్జామ్స్ వ్రాసాడుగా, వాటి రిజల్ట్సు వస్తే వాడి మానాన వాడు సాగిపోతా డులే—అంతలో వాడితో క్లేష్ యెందుకూ--”


అప్పుడక్కడకి రంగ ప్రవేశం చేసింది సత్యసుధమ్మ. “అబ్బాయి విశ్వేశ్వరా! నా ముఖంలోకి ముఖం పెట్టి చెప్పూ— నువ్వు నీ కొడుకుని అయిష్టంగానే తక్కిడి బిక్కిడి స్పోర్ట్స్ కి పంపిస్తున్నావా! నీ కొడుకు అలా వీరావేశంతో ఇరగదీయడం నీకు లోలోన సంబరంగా లేదూ! నువ్వు నీ పెళ్ళాం వద్ద నాజూకుగా బుకాయించ వచ్చు. నా వద్ద సాగదు. నా కడుపున పుట్టిన వాడివి. నీగురించి నాకంటే మెరెవ్వరికిరా తెలుసు?వాడి జీన్స్ గురించి యేదో లెక్చర్ ఇచ్చావే- వాడికా జీన్స్ యెలా వచ్చా యి? ఎక్కణ్ణించి వచ్చాయి? అదీ చెప్పు మరి. తురు తురుమనడంలో వాడిది ఒక మెట్టు పైనే--


మొదట అడిగితేనేమో యేమన్నాడూ— ఫిజికల్ ఫిట్ నెస్ కోసమన్నాడు. రేపు ఉద్యోగానికి పనికి వస్తుందన్నాడు. చలికి చేతులు వంకర్లు పోకుండా ఉండటానికన్నాడు. అన్నీ అబధ్దాలే! నీకు లేనిది వాడి వద్ద ఉన్నది అదొక్కటే—”


అప్పుడు విశ్వేశ్వర్ నవ్వుతూ అన్నాడు-“నీ మనవడు సాధారణంగా అబధ్దం చెప్పడమ్మా! ”


“ఔను నీ కొడుకుని నువ్వే మెచ్చుకోవాలి. బిల్డింగ్ స్టోరేజ్ సెల్ లో యేమేమి చేస్తున్నాడో తెలుసా! ఏవేవో యంత్ర పరికరాలు తెచ్చి పార్ట్స్ యేరుకొచ్చి కొత్తగా యేదో చేయడానికి పూనుకున్నట్టున్నాడు.


’నువ్వు భాగ్యనగరం వేపో విజయనగరం వేపో వెళ్లిపో వలసిన వాడివి- ఇదంతా నీకెందుకురా! ’ అని అడిగితే వాళ్ల అడ్వంచర్ గేమ్సు క్లబ్బులో యేదైనా కొత్తది ఇన్నొవేట్ చేసి చూపిస్తేనే గుర్తింపు ఉంటుందట. అది చాలదని వాడికి రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ క్లబ్బులోనూ చేర్పించావు.


కాని విషయం అది కాదు. ఇదీ! వాడు మాఁవగారి ఊరులా యెడా పెడా తెగ తిరిగేస్తున్నాడే— యెవడైనా తీవ్రవాది గురిచూసి బేరసారాలు చేయడానికి అనువుగా ఉంటుందని పట్టుకుపోతే అప్పుడు తెలుస్తుంది అందరికీ ముందున్నది మొసళ్ల పండగని. మరొకటి కూడా చెప్పాలి, వింటావురా?”



యూనిఫాం కి గుండీలు సరిచూసుకుంటూ తలూపాడు విశ్వేశ్వర్.


“వయసుకి వచ్చిన ఆడపిల్ల ఉంది ఇంట్లో— సంపాదించిందంతా వాడికే ఖర్చు చేసేస్టుంటే ఇక మిగిలేదేముంది?”


అప్పుడక్కడకు శశికళ వచ్చి చేరింది. “నా నెపం పైన అన్నయ్యను యెటా క్ చేయకే బామ్మా! ఈ రోజుల్లో కుర్రాళ్లకు రెండే రెండు ఆప్షన్ లు బామ్మా! ఒకటి హీరోగా ఉండాలి. లేదా

గబ్బర్ సింగ్ లా మారాలి. మధ్యన మిగిలిపోయే అవకాశమే లేదు”.


ఆ మాట విన్నంతనే సత్యసుధమ్మకు చిర్రెత్తుకు వచ్చింది- “నీలోని జీన్స్ యెక్కడివని ?వాడివీ నీవీ ఒక్కటేగా! నీ కోసం నేను వాపోతుంటే మధ్యన నన్ను యెదుర్కుంటావా?” అంటూ లోపలకు వెళ్లిపోయింది సత్య సుధమ్మ.


అందరూ ఒక్కపెట్టున నవ్వేసారు. బామ్మలతో కొట్లాట ఒక విధమైన పసందైన సత్కాలక్షేపమే—

-- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- --

అకటా! అత్తా కోడళ్లు భయపడినట్లే జరిగిపోయింది. గుండెలు పిండేలా జరిగిపోయింది. విమెన్ కాలేజీనుండి సెక్యూరిటీ జీప్ లో మరో ఇద్దరు కాలేజీ మేట్సుతో కలసి ఇంటికి వస్తున్నప్పుడు యెక్కడినుండో పొగలు చిమ్మే హ్యాండ్ గ్రనేడ్ జీపు ముందు పడింది. పేలిన హ్యాండ్ గ్రనేడ్ కళ్లు మసకబారేలా పొగలు విరజిమ్మింది.


దాని రాపిడితో సెక్యూరిటీ జీప్ రోడ్డు ప్రక్కనున్న గుంతలో పడి ప్రక్కలకు ఒరిగి పోయింది. బండిలో శశికళను వెన్నంటి వచ్చే సెక్యురిటీ గార్డూ, డ్రైవరూ మండే కళ్లను విప్పి తేరుకునే లోపల తుష్కరులు శశికళను, ఆమెతో బాటు కూర్చున్న యిద్దరమ్మాయిల్నీ దట్టమైన అడవుల్లోకి లాక్కు పోయారు.


వార్తవిని ఇంటిల్లపాదీ మాటా పలుకూ లేకుండా నివ్వెర పోయారు. వీర విశ్వేశ్వర్ నుండి కబురు అందుకున్న స్పెషల్ సెక్యూరిటీ స్వేఢ్ నిమిషాలలో రంగంలోకి దిగారు. ముమ్మరమైన గాలింపు చర్యలు ఆరంభించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నిటినీ కార్డన్ చేసి జంగల్ వార్ ఫేర్ లో తర్బీదు పొందిన బ్లాక్ కేట్స్ ని శ్రీనగరు నుండి మిలిటరీ హేలిక్యాప్టర్ ద్వారా రప్పించారు.


చిన్నా పెద్దా అన్నది చూడకుండా అనుమానస్పదంగా కనిపించేవారందరినీ కస్టడీలోకి తీసుకుంటున్నారు. స్పెషల్ ఇంటరాగేషన్ సెల్ కి తీసుకెళ్తున్నారు. మొత్తానికి ఆ ప్రాంతమంతా కూంబిం గ్ ఆపరేషన్ష్ తో మినీ వార్ జోన్ లా తయారయింది.


ఉత్తుంగ తరంగంలా లేచిన కాళేశ్వర్ సమయం వృధా చేయకుండా రియల్ లైఫ్ సాహసంతో చెల్లినీ చెల్లి నేస్తాల ఉనికిని తెలుసుకోడానికి అడవి మార్గాల రోడ్ మ్యాప్ ను తయారు చేయనారంభించాడు.


ఇది చాలదన్నట్టు వీర విశ్వేశ్వర్ కి మరొక కోణం నుండి మరొక షాక్ తగిలింది. కొడుకు కాళేశ్వర్ గత రెండు రోజులుగా కనిపించ డంలేదు. లాకల్ ఫ్రెండ్సుతో యెక్కడో విహార యాత్రకో లేక స్కై డ్రైవింగ్ నేర్చుకోవాడానికో చెక్కేసుంటాడనుకున్న విశ్వే శ్వర్ తండ్రి హృదయం లోలోన తల్లడిల్లిపోయింది. చెట్టు మ్రాను కదిలిపోతే దానిని అంటుకుని ఉన్న కొమ్మలూ రెమ్మలూ వజవజ వణికి పోవూ! కన్నీటి ఆకుల్ని రాల్చవూ!


ఆ రీతిన సెక్యూరిటీ ఆపరేషన్స్ లో కాళేశ్వర్ కోసం వెతుకులాట కూడా ఒక అదనపు భాగమై పోయింది. ఈసారి పై అధికారుల నుండి వీర విశ్వేశ్వర్ కి రిమార్కులు పడ్డాయి;డ్యూటీ చేస్తున్నది సెన్సిటివ్ యేరియానని తెలిసికూడా కొడుకుని అదుపు లేకుండా అలా దేశ ద్రిమ్మరిలా విడి పెట్టిసినందుకు—


అప్పటికప్పుడు గట్టిగా తీర్మానించాడు తల్లినీ భార్యనూ తెలుగు గడ్డకు పంపించేయాలని— ఎప్పుడు యేమి జరగబో తున్నదో తెలియని సంకట పరిస్థితిలో తనెలా వాళ్లను మాత్రం కాపాడగలడు? ఇప్పటికే కూతురూ కొడుకూ కనిపించకుండా పోయారాయె-- అందులో శశికళ క్లాస్ మేట్సుని కూడా ఉగ్రవాదులు యెత్తుకుపోయారు.


ఇంట్లో సత్య సుధమ్మ పెట్టే విషాదకర రాగాలాపలను భరించలేక పోతున్నాడు. ఇక కొడుకునీ కూతుర్నీ దూరం చేసుకున్న గీత కన్న కడుపు గురించి చెప్పాలా! గీతను చూస్తుంటే అతడికి గుండె తరుక్కపోతూంది. ఇక లాభం లేదు;తల్లీ భార్యా ఇలా భుదియాన్ సరహద్దు దాటిన వెంటనే తను అలా సెర్చింగ్ ఆపరేషన్ లోకి స్వయంగా దూకాలని నిశ్చయించుకున్నాడు.


అప్పుడతనికి అసంకల్పితంగా పోలీసు అకాడమీలో జరిగిన రిఫ్రెసింగ్ కోర్చులో సీనియర్ లు పలికిన పలుకులు గుర్తుకి వచ్చాయి. “మీకు వ్యవస్థీకృత నేరాలు చేసి క్రిమినల్స్ ని- అందులో తీవ్రవాద నేపథ్యం గల నేరస్థుల్ని పట్టుకోవడానికి మీకున్న స్పేస్ పరిమితం. ముందుకు సాగాలంటే పలు కట్టుబాట్లు. కాని వాళ్ళకు అలా కాదు. స్పేసంతా వాళ్లదే! టైమింగూ వాళ్లదే! అంచేత వాళ్లు మనల్నీ వాళ్ళు యెంచుకున్న టార్గట్లనూ యెప్పుడైనా యెక్కణ్ణించైనా కొట్టగలరు. మనకున్న ఒకే ఒక వెసులుబాటు—నిరంతర అప్రమత్తత—”


మరునాడు తల్లినీ భార్యనూ ఊరికి బయల్దేరదీయడానికి విశ్వేశ్వర్ సమాయాత్తమవుతున్నాడు. గీతకు ఊరు వెళ్ళడం యే మాత్రమూ ఇష్టం లేదని అతడికి తెలుసు. కాని మిలిటరీ పరిభాషలో చెప్పాలంటే అదొక కీలకమైన అత్యవసర చర్య. సాధ్యమైనంత మేర భార్యకు విషయాన్ని విశదీకరించి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. దు:ఖ భాజితులైన ఆడాళ్ళిద్దరికీ శ్రమ ఇవ్వ కూడదన్న తలంపుతో అతడే సామానంతా సర్ది అలసటగా అలా ఆసీనుడయాడో లేదో ఇంటి చుట్టూ కాపలా కాస్తూన్న సెక్యూరిటీ గార్ట్స్ గట్టిగా తలుపు తట్టనారంభించారు. అతడు అలసటగా లేస్తూ తలుపు తీసాడు.


ఇద్దరు గార్ట్సూ సె ల్యూట్ చేసి “మిస్టర్ కాళేశ్వర్ వచ్చేసారు సార్! ” అని రిపోర్ట్ చేసారు. విశ్వేశ్వర్ కదలక ముందే అత్తాకోడళ్లూ ఓక్కసారిగా బైటకు దూసుకు వచ్చారు- “కాళేశ్వర్ వచ్చేసాడా! ఏడి?ఏడి?” అంటూ అతణ్ణి దాటుకుంటూ ఆవరణలోకి వేగంగా వచ్చారు.


అక్కడ చింకి పో యిన దుస్తులతో- ముఖం నిండా ప్రోగయిన రక్తపు చారికలతో నిల్చున్నాడు కాళేశ్వర్! కాని ఒంటరిగా లేడు. అతడి వెనుక శశి కళ ఉంది. ఆమెతో ఇద్దరమ్మాయిలూ నీరసంగా నిర్వీర్యంగా చూస్తూ నిల్చున్నారు. దగ్గరకు వచ్చిన విశ్వేశ్వర్ అడిగాడు- “నువ్విన్ని రోజులూ అడవిలో వీళ్లను వెతకడానికి వెళ్లావన్నమాట! నువ్వు చేసింది స్పోర్ట్స్ అడ్వంచర్ కాదు. లైఫ్ ధ్రిటనింగ్ సాహసం. ఇంతకూ నువ్వు అడవిలోకి వెళ్ళే ముందు నాకు చెప్పాలని తోచలేదా! ”


“సారీ డాడ్! నేను అడవులమ్మట వెళ్లలేదు. అడవి చుట్టూ ఉన్న పర్వతాలు దాటుకుంటూ వెళ్ళాను గ్రిప్పింగ్ బూట్సు వేసుకుని. అలా కొండలమ్మట వెళ్తున్నప్పుడు నా జేబునుండి సెల్ ఫోను అగాధంలో పడిపోయింది. మిలిటంట్స్ అందరూ హెవిలీ ఆర్మ్డ్ అని నాకు తెలుసు. అందుకని నేను పొదల మాటున పొంచి ఉన్నాను. వాళ్లెప్పుడైతే గుంపుగా ప్రేయర్ చేయనారంభించారో అదే అదనుగా నేను ముగ్గురినీ అండర్ గ్రౌండ్ సెల్ నుండి విడిపించి తుష్కురులు కనిపెట్టలేని అడ్డదారమ్మట పరిగెత్తిస్తూ నేను పరుగెత్తుతూ చేరాను. అక్కణ్ణించి ఇక్కడకు రావటానికి ఒకరోజు పట్టింది” అని చెప్పడం ముగించి మరొక మారు- “సారీ డాడ్! ” అని మరొకసారి అనేంతలో కాళేశ్వర్ చెంప ఛెళ్ళుమంది.


“ఇడియట్! జీవితం అంటే అడ్వంచర్ స్పోర్ట్సు కాదు. గుర్తుంచుకో! కిడ్నాప్ చేసిన తీవ్రవాదులతో యెలా డీల్ చేయాలో వాళ్ళని యెలా దారికి తీసుకురావాలో మాకు పలు మార్గాలున్నయి. ఇది కూడా గుర్తుంచుకో-- ముందు మీరు నలుగురూ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్సుకి రండి. ఆ తరవాతనే మిగతాదంతానూ-- నువ్విక ఇక్కడుండవు. రేపే నువ్వు ఊరికి వెళ్లిపోతున్నావు మీ అమ్మా బామ్మలతో. శశికళ మాత్రం ఫైనల్ పరీక్షలు పూర్తయేంత వరకూ నాతో ఉంటుంది. నువ్వు వెళ్ళేది ఎక్కడికని అడక్కు-- . అదంతా మేం చూసుకుంటాం” అని యూనిఫాం వేసుకోవడానికి వెళ్ళాడు వీర విశ్వేశ్వర్. అతడలా వెళ్ళిన వెంటనే అంతవరకూ ఉగ్గబట్టుకుని నిల్చున్న అత్తాకోడళ్లిద్దరూ కాళేశ్వర్ నీ శశికళనూ ఆలింగనం చేసుకుని యేడ్వనారంభించారు. ఆలోపల శశికళ ఇద్దరు క్లాసు మేట్సు అమ్మానాన్నలూ పరుగున వచ్చి కూతుళ్ళను కౌగలించుకుని దురపిల్లసాగారు.



వాళ్ళను సెక్యూరిటీ హెడ్ క్వార్టర్సుకి తీసుకువెళ్ళడానికి భద్రతా దళాల జీపు వచ్చి నిల్చుంది. కన్నూ మిన్నూ తెలియ ని రీతిన మిలిటెంట్లు స్తైర్య విహారం చేస్తూన్న ఉద్రిక్త వాతావరణంలో భారతీయ జవానులు భద్రత పరమైన బాధ్యతలు నెరవేర్చడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా!


అలపెరుగని ఉగ్రనేత్రం వాళ్ళను దూరతీరాల నుండి నిశ్శబ్దంగా వెంటాడుతూనే ఉంటుందన్న వాస్తవం సెక్యూరిటీ గార్డ్స్ కి తెలుసు.

* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


50 views0 comments

コメント


bottom of page