top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link


'The Trap Episode 4' New Telugu Web Series

Written By Pandranki Subramani


రచన : పాండ్రంకి సుబ్రమణి
పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' నాలుగవ భాగం

గత ఎపిసోడ్ లో

ఆఫీస్ పని ఒత్తిడిలో భోజనం కూడా సరిగ్గా చెయ్యడు భువనేష్.

వేదమూర్తి ఇంటికి, అతని చిన్ననాటి స్నేహితుడు దివాకర్ కూతురితో సహా వస్తాడు.

వేదమూర్తి కొడుకు పరమేశ్వర్ గురించి వివరాలు అడుగుతాడు.


ఇక ది ట్రాప్. . నాలుగవ భాగం చదవండి…


హాలు మధ్య కూర్చుని కాఫీ టీలు పూర్తయిన తరవాత మాటల మధ్యలో సంభాషణల హోరులో దివాకర్ అదను దొరికి నప్పడుడల్లా పరమేశ్వర్ గురించిన ప్రస్తావన తేవడం పెద్దరికంతో బాటు అనుభవ సారమూ పుణికి పుచ్చుకున్న వినాయకానికి మొదటి సారి చిత్రమైన భావ స్రవంతి సోకనే సోకింది; పెద్దలు ఊరకే రారు-అన్న సామెత గుర్తుకి వచ్చి--


అంతేకాక-ఇంట్లోనున్న వాళ్ళ గురించి కాకుండా తమతో కలసి వచ్చిన పెద్దకూతరు వినోదిని గురించి ప్రస్తావిస్తూ-- మరొక వేపు పరమేశ్వర్ గుణగ ణాల గురించి తెలుసుకో వడానికి ప్రయత్నిస్తూ-- ఐనా , పెద్దతరపు వేదమూర్తి దంపతులిద్దరికీ విషయం అంతు పట్టకుండా మిగిలి పోతూంది. యింట్లోవాళ్ళే కాక , దివాకర్ సహితం మొదట్నించీ డాబుసరి దొరబాబులా ఉంటాడని వేదమూర్తి అల్లనల్లన అందరి ముందూ గట్టిగానే చెప్పినట్టు భార్య కామాక్షికి గుర్తు. అలాంటప్పుడు తమ ఆలోచనలో తప్పిదం దొర్లిపోవడం లేదూ!


టూకీగా చెప్పాలంటే నక్కెక్కడ నాకలోకమెక్కడ! మాటల రాపిడిలో భార్యా భర్తలిద్దరూ పొరపాటుగా అందని ఆకాశం వేపు చేతులు చాస్తూ ఆలోచిస్తున్నారేమో!


వాళ్ళలా పరిపరి విధాల తలపోస్తున్నప్పుడు దివాకర్ బాణంలా సర్రున ప్రశ్నను విసిరాడు-“నువ్వు మా పెద్దమ్మాయి వినోదినిని చూస్తున్నావు కదూ!”


ఈసారి వేదమూర్తి నవ్వుతూనే రిటార్ట్ చేసాడు- “ఇక నువ్వు చూపించడానికే ముందోయ్! చూస్తున్నాం కదా— చూసి మాట్లాడుతున్నాం కదా-- ఐనా వినోదినితో బాటు యింట్లోని మిగిలిన అమ్మాయిల్ని కూడా తీసుకొచ్చి ఉంటే అందరమూ చూసుండే వాళ్ళం కదా! మీ ఆవిణ్ణి తీసుకొచ్చి ఉంటే మరీ బాగున్ను దివాకర్-- వినోదినిని దీవించినట్లే మా అమ్మానాన్నా వాళ్ళను కూడా దివ్యంగా ఆశీర్వదించి ఉండే వారు కదా! ”

“ఏం—నువ్వూ మా చెల్లీ నా పెద్దకూతుర్ని ఇప్పుడు ఆశీర్వదించరా! ”


“అవేం మాటల్రా దివాకర్! అంత పెద్దగా యెదిగిపోయావు గాని చిన్నతనపు కొంటెతనం నీలో కొంచెం కూడా తగ్గలేదురా! అదలా విడిచి పెట్టు గాని.. ఇంతకీ వినోదినిని ఎంతవరకు చదువుకుంది? ఫారిన్ కి వెళ్ళి వచ్చినట్టుంది. ఇంకా ఎగ్జామ్స్ ఒత్తిడిలోనే ఉందా?”


“అదేమీ లేదోయ్! చదుకుందన్న మాటే గాని, వినోదినికి సిగ్గూ మొహమాటమూ యెక్కువ. తానుగా ఇక్కడికొచ్చి పరమేశ్వర్ ని చూస్తే మరీ సిగ్గుపడిపోతుందని మాతో తీసుకువచ్చాం”.


తానుగా వస్తే పరమే శ్వర్ ని చూసి వినోదిని సిగ్గుతో ముడుచుకు పోతుందా! ఇంతవరకూ పరమేశ్వర్ వినోదినిని సరాసరి చూసే ఉండడు. ఏవో పుస్తకాలు చేత బట్టుకుని తామందరూ చూస్తూండ గానే గాలిపటంలా యెగిరిపోయాడు. ఇంతవరకూ యెప్పుడూ యెక్కడా ఒకరి ముఖం మరొకరు చూడనప్పుడు మొహమాటాలకు తావెక్కడిది— ఎలా పెదవి విప్పాలో యెలా ముందుకు సాగాలో తెలియక వేదమూర్తి దంపతులు కళ్ళు మిటకరిస్తూ ఉండిపోయారు.


వాళ్ళ సందిగ్ధావస్థకు ఫుల్ స్టాప్ పెడుతూ దివాకర్ నోరు కదిపాడు- “పరమేశ్వర్ కి బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని విన్నాను. ఈజిట్ నాట్?”

ఈసారి అగ్రజుడు కామేశ్వరరావు కలుగచేసుకున్నాడు-

“వాడింకా కోర్సే పూర్తి చేయలేదేమో ఆంకుల్! అలాంటప్పుడు వాడికి బ్రిలియంట్ క్వాలిఫికేషన్స్ యెలా ఉంటాయి అంకుల్!”


“దీనికి పెద్ద అవాంతరం యేముందోయ్? ఇప్పటి డిజిటిల్ ప్రపంచంలో ఫార్మా కంపెనీలో పని చేస్తూ మేనేజేరియల్ మెలకువలు నేర్చుకుంటూనే కోర్సు పూర్తి చేయలేరా యేమిటి? అదంతా యిప్పటి యువకులకు చిటికెలో పని. దానికయ్యే ఖర్చంతా ఫ్యూచర్ అస్సెట్ గా కంపెనీ భరించలేదా యేమిటి?”


దీనితో అందరూ నోరు మెదపకుండా నేల చూపులు చూస్తూ ఉండిపోయారు. బిజినెస్ మ్యాగ్నెట్ దివాకర్ వచ్చిన మిషన్ అందరికీ స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. తన చిన్ననాటి స్నేహితుడి యింటితో సంబంధం పెట్టుకోవాలన్న పథక రచనతోనే వచ్చాడు కాబోలు. కాని-- అక్కడి వాళ్ళందరినీ తొలుస్తూన్న ప్రశ్న ఒకటే--- ఉన్న ఊళ్ళోనూ విదేశాలలోనూ పరపతి పెంచుకున్న బిజినెస్ మ్యాగ్నెట్ కి తమ యింటి సంబంధం యెందుకు కావలసి వచ్చింది? పెద్ద కొడుకు కామేశ్వరరావు కళ్ళముందు నిటారుగా నిల్చున్నప్పుడు చిన్నోడికి పిల్లనివ్వటానికి ఉబలాట పడటమేమిటి? ఇదంతా తికమకగా తలాతోకా లేని వ్యవహారంలా తోచడం లేదూ! ”


మరి కాసేపు మాటా మంతీ మాట్లాడుకున్న తరవాత దివాకర్ వీడ్కోలు తీసుకుంటూ అన్నాడు- “ఓసారి మీరందరూ తీరిక చూసుకుని యింటికి రావచ్చుగా! వినోదిని అమ్మను కూడా చూసినట్లుంటుందిగా”


“ఎందుకు రామూ! నేనూ మీ చెల్లీ పదీ పదిహేను రోజుల్లో ఈ పండగ సీజన్ రద్దీ తగ్గిన తరవాత మీ యింటికి రావటానికి ప్రయత్నిస్తాం. సరేనా?”


“ఎలాగూ రాబోతున్నారుగా--పరమేశ్వర్ ని కూడా తీసుకురండి. వినోదినితో పరిచయం పెరుగుతుంది”


“పరమేశ్వర్ ఒక్కడి మాటేమిటి—పెద్దోడు కామేశ్- చిన్నోడు పవన్ కూడా వస్తారు. సరేనా! ” అని తండ్రీ కూతుర్నీ సాగనంపడానికి గుమ్మం దాటి వసారా వరకు వచ్చాడు వేదమూర్తి.


అప్పుడు దివాకర్ కారు డోరు వరకూ వచ్చి ఆగాడు- “మాయింటికి గాని వస్తే నీకు యెదురు చూడని ప్లజంట్ సర్ ప్రైజ్ ఉంటుంది”.


అదేమిటన్నట్టు కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసాడు వేదమూర్తి.


“నువ్వు చాలా అభిమానించే అప్పటి స్కూలు హెడ్ మిస్ట్రెస్ శారద గారు మాయింట్లోనే ఉంటుంది. నిన్నప్పుడప్పుడు తలచుకుంటూంది. అదెలా సాధ్యం అని అడక్కు , నాకు ఆమె పెద్దత్తయ్యవుతుంది. ఆమె రిటైర్ అయినప్పుడు నువ్వు మరచిపోకుండా పంపించిన గ్రీటింగ్ కార్డు యింకా ఉంచుకుంది. నౌ- ఈజిట్ క్లియర్! ”మిత్రుడితో చేతులు కలిపి దూరాన నిల్చుని చూస్తూన్న వినాయకం దంపతులికి నమస్కారం పెట్టి కారులో కూర్చున్నాడు దివాకర్. ముందు యెస్కార్ట్ కారు కదలింది. పిమ్మట వాళ్ళ పర్సనల్ కారు కదలింది.


దెబ్బపైన దెబ్బ తగలడమే కాదు; అప్పుడప్పుడు మనిషికి ఊపిరి సలపనివ్వనంతగా ఆశ్చర్యంపైన ఆశ్చర్యం కూడా కలగవచ్చు. దివాకర్ పెద్ద కూతురుతో వచ్చి పలకరించి వెళ్ళిపోయిన తరవాత మరొక ఆత్మీయ అతిథి యింటి ముందు నిల్చోవడం చూసి వేదమూ ర్తికి నిజంగానే ఊపిరి సలపనంత పనయింది. ఆశ్యర్యమే తానై నిల్చుండి పోయాడు కనురెప్పలు మూయడం కూడా మరచి.


ఇప్పుడింటి వాకిట నిల్చున్నది కూడా తన చిన్ననాటి స్కూలు మేటే—విశ్వం. సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగి , అతను కూడా కారులోనే వచ్చి దిగాడు. ఐతే--ఈసారి తన రెండవ మిత్రుడు భార్యతో కలసి వచ్చాడు. నోట మాట రావడానికి కొన్ని క్షణాలు పట్టాయి.


“అదేంవిట్రా వేదా! అలా బెల్లం కొట్టిన రాయిలానిల్చుండి పోయావు. రెండు మూడు సార్లు నీకు ఫోను చేసాగా-- వచ్చి చూసి వెళ్తానని— ఇంట్లో చెప్పలేదా? ఈలోపల నువ్వు ఓసారి మాయింటికి వచ్చి వెళ్తావనుకున్నాను. కిరాణా కొట్టుతో బిజీగా ఉన్నావాయె-”


“అదంతా తరవాత మాట్లాడుకుందాం గాని మొదట ఇంట్లోకిరా! ” అంటూ దారి తొలగుతూ విశ్వం సతీమణి నమస్కారాన్ని ప్రతి నమస్కారంతో స్వీకరిస్తూ--


ఇంటి ముంగిటి అలికిడి విని గావాలి, వేదమూర్తి భార్య కామాక్షి- కూతురు కమల వేగంగా అడుగులు వేస్తూ అక్కడకు వచ్చారు. వాళ్లిద్దరికీ విశ్వాన్ని అతడి భార్య సువర్చలా దేవిని పరిచయం చేసాడు వేదమూర్తి.

అప్పుడు కమల, పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి పూనుకుంది. “మీరేనా అంకుల్ ఇంటికి రెండు మూడు సార్లు ఫోను చేసిందీ! సారీ అంకుల్-- కిరాణా షాపుకి సామాను దింపుతున్నప్పుడు నాన్నకు వత్తాసుగా ప్రక్క వీధికి వెళ్ళిపోవడాన ఎలాగో తెలియదు చెప్పడం మరచిపోయాను. కొట్టులో దిగిన దినుసుల్ని లెక్కపెడుతూ బుక్స్ ఆఫ్ అకౌంట్సు చూస్తూండి పోయాను. నాన్నగారిని చూడటానికి చాలా రోజు ల తరవాత వచ్చినట్టున్నారు. ఏమనుకోకుండా కొంచెం సేపాగండి , హారతి పళ్ళెం తీసుకు వస్తాను” అని లోపలకు కదలబోయింది .


సువర్చలా దేవి కమలను ఆపింది , “ఇప్పుడవన్నీ యెందుకమ్మా! మేమేమిటి మీ నాన్నగారికి కొత్త వాళ్ళమా యేమిటి? మీ అమ్మానాన్నలిద్దరూ మావారికి సుపరిచితులేగా--” అంటూ కమలను అంటిపెట్టుకుని హాలు వేపు తోడ్కొని నడచింది.


అక్కడ కొత్త గొంతు విని గావాలి మంగళాదేవి, వినాయకం ఇద్దరూ అక్కడకు వచ్చా రు. వాళ్ళిద్దర్నీ చూసి విశ్వం వెంటనే గుర్తుపట్టి కాళ్ళకు నమస్కరించాడు. భర్తను చూసి వాళ్ళెవరయి ఉంటారో ఊహించిన సువర్చలా దేవి కూడా అది రీతిన వంగి నమస్కరించింది.


అప్పుడు కామాక్షి అడిగింది- “ఇంకా సర్వీసులోనే ఉన్నారు కదూ అన్నయ్యగారూ ! ” అని.


విశ్వం తలూపుతూ బదులి చ్చాడు - “ఔనమ్మా— నేనూ ఉన్నాను- సువర్చల కూడా సర్వీసులో ఉంది. స్కూలు హెడ్ మిస్ట్రెస్ గా ఉంది. మరీ యెక్కువ రోజుల్లేవు. నాకు రెండేళ్ళు. వసంతకు నాలుగేళ్ళు మిగిలున్నాయి--రిటైర్మెంటుకి”


“ అలాగా! చాలా మంచిది. నాకు కూడా ఇక్కడి మిడిల్ స్కూలులో తెలుగు టీచర్ గా ఆఫర్ వచ్చింది. కాని , వెళ్ళలేక పోయాను. మెట్టింట్లో పరిస్థితులెలా ఉంటాయో మీకు తెలియనిదా వదినా! అందులో నేను తప్ప- మా అత్తగారు తప్ప—అందరకందరూ బిజీ బిజీయే--రండి—ముందు టీలు తీసుకుని సేదతీర్చుకోండి. ఎలాగూ వేళ కావస్తూంది. భోజనం చేసి వెళుదురు గాని--”


సువర్చల కాదనలేదు. కాసేపటికి మాటా మంతీ కానిచ్చిన తరవాత టీ కప్పులు అందుకున్న తరవాత విశ్వం యధాలాపంగా అందుకున్నాడు-“నీకు తెలిసే ఉంటుందేమో—నాకు ఒక అబ్బాయి- ఒక అమ్మాయి. వాడేమో గ్రాడ్వేషన్ పూర్తి చేసి టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేయబోతున్నాడు. అమ్మాయేమో గవర్నమెంటు జాబుకో లేక బ్యాంకు ఉద్యోగానికో ప్రిపేర్ కాబోతూంది. కాల ప్రవాహంలో పడి మన చిన్ననాటి స్నేహం నీరుగారిపోకూడదని--- “ఆ మాట విన్నంతనే వేదమూర్తి కామాక్షి వేపు చూపు సారించాడు భావగర్భితంగా-- దానికి బదులుగా ఆమేమో ప్రక్కన నిల్చున్న అత్తా మామల వేపు భావానికి అతీతమైన చూపుతో చూసి తల వంచుకుంది.


ఇంతవరకూ వచ్చిన తరవాత ఇక ముంత దాచడమెందుకూ—అనుకుంటూ సరాసరి విషయానికి రావడానికి పూనుకున్నాడు వేదమూర్తి- “నీకు తెలుసుగా నాకు దాపరికాలు నచ్చవని— నాకు ముగ్గురబ్బాయిలు. వాళ్ళలో రెండవ వాడు పరమేశ్వర్ ఒక్కడే మా కిరాణా కొట్టు వ్యవహారాలకు దూరంగా పైచదువుల పట్ల ఆరాటంతో చదువుకుంటున్నాడు. కమలేమో ప్రైవేటు కట్టి గ్రాడ్వేషన్ పూర్తి చేయడాని ప్రయత్నిస్తూంది. మిగతా యిద్దరి చదువులూ నాకున్నంతటి చదువులే—ఇందులో చిత్రాతి చిత్రం యేమంటే మొన్ననే దివాకర్ వచ్చి--” అని అతడలా వాక్యం పూర్తి చేసే లోపల విశ్వం ఆశ్చర్యంగా అడిగాడు- “ఏమిటీ—దివాకర్ ఇక్కడకు వచ్చాడా! నమ్మలేకుండా పోతున్నాననుకో--నిజంగానా?”


“ఏం? వాడు మాత్రం మన చిన్ననాటి బడి స్నేహితుడు కాడా! మనం ఒకర్నొకరు చూసుకోకూడదా?”


“అబ్బే! మేటర్ అదికాదు. ఆ రోజుల్లో గాని ఆ తరవాతగాని- ఏం? ఇప్పుడు గాని వాడి లైఫ్ స్టయిల్ వేరుగానే ఉంటుంది కదా! స్టేటస్ మెట్ల నుండి అంత త్వరగా దిగిరాడు కదా-- అందుకడుగుతున్నాను. సరే— విషయానికి రా— ఇంతకీ యేమన్నాడేమిటి?”.


“అనడం యేమిటి— ఇదే విషయమై మాట్లాడాడు. ఇక్కడకు రాక ముందు హోమ్ వర్క్ చేసుకునే వచ్చిన ట్టున్నాడు. పరమేశ్వర్ గురించి యెక్కువగా అడిగాడు. వాడికి ముందు పెద్దోడొకడున్నాడన్నది మరచి పరమేశ్వర్ భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద ఆఫర్లే చేసాడు. ”


విశ్వం తలపంకిస్తూ అన్నాడు-“ఔను! దివాకర్ పెద్ద ఆఫర్లే చేయగలడు. వాడికెప్పుడూ పైన టాప్ పైన నిల్చుని శాసించడమేగా అలవాటు. మరి—నువ్వూ మా చెల్లీ యేమన్నారేమిటి?”


“ఏమీ అనలేదు. కూతురుతో బాటు వాడు మాత్రమే వచ్చి మమ్మల్ని యింటికి రమ్మనమని ఆహ్వానించాడు. ఇంకా వెళ్ళలేదనుకో-- అసలు ఇంతవరకూ ఈ విషయం పరమేశ్వర్ వద్ద ప్రస్తావించనే లేదు. ఏమి యేమైనా ఇప్పటికిప్పుడు యేనిర్ణయమూ తీసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకంటే పెద్దవారు యింట్లో ఉన్నారన్నది మరచిపోలేం కదా. . . వాళ్ళ అభిప్రాయం ప్రకారమే జరుగుతుంది. ”


వేదమూర్తి నోట ఆ మాట విన్నంతనే విశ్వం భార్యవేపు సాభిప్రాయంగా చూసాడు. ఆమె కూడా పెదవుల మధ్య హాసాన్ని దాచుకుంటూ అదే రీతిన సాభిప్రాయంగా తలూపింది. ఆ తరవాత వాళ్ళ మధ్య ఉన్నట్లుండి సంభాషణ ఆగిపోయింది. అందరూ భోజనాలు పూర్తి చేసిన తరవాత అరగంట తరవాత టీలు తీసుకున్న పిదప విశ్వం దంపతులిద్దరూ అందరి వద్దా వీడ్కోలు తీసుకుని వసారాకి యెదురుగా ప్రార్క్ చేసుంచిన కారు వేపు నడుస్తూ వేదమూర్తి చెవి వద్ద యేదో అన్నట్టున్నాడు.


వేదమూర్తి తలూపుతూ వాళ్ళతో రోడ్డు ఓరకు వెళ్ళాడు. అప్పుడు విశ్వం స్నేహపూర్వకంగా చూస్తూనే కచ్చితమైన కంఠ స్వరంతో ఇలా అన్నాడు. “నాకు కాబో యే అల్లుడు మంచి చదువరీ జీతడాగైన ప్రొఫెషనల్ ఐతే నాకు మంచిదే! మాకు అంతకంటే ముఖ్యమైనది మా అమ్మాయి మీ యింటి కోడలుగా రావటం-- అర్థమైంది కదూ! మరొక ముఖ్యమైనది— నాకు నీ గురుంచి తెలుసు. నీకు నాగురించి తెలుసూ. అడ్డు గోడల వంటి కులాల పట్టింపులకు మనిద్దరమూ దూరమే-- ఇంతటితో మన ప్రసంగం ముగిసినట్లే--” అంటూ భార్య డోరు తెరచి డ్రైవింగ్ సీటు ప్రక్కన కూర్చున్న తరవాత , ఏదో మరచిపోయి నట్టుగా ఆమె వెంటనే కారుదిగి—“ సారీ! తెచ్చి యివ్వడం మరచిపోయాను. మా ఊరి అమ్మవారికి భక్తులు మొక్కుబడిగా సమర్పించిన చీరల్ని గుడి దేవస్థానం వారు వేలానికి పెట్టారు. మీకివ్వడానికి రెండు చీరలు తీసుకు వచ్చాను “అంటూ వాటిని మంగళా దేవమ్మగారికి వినయ పూర్వకంగా వంగి అందించింది.


వాటిని అందుకున్న మంగళాదేవమ్మ నిండుగా నవ్వింది. చీరల్ని ఆప్యాయంగా తడిమి చూసుకుంది. దివాకర్ కూడా కారులో వచ్చి భార్య ప్రక్కని కూర్చున్నాడు.


వేదమూర్తి భార్య కామాక్షికి, తల్లి మంగళాదేవికి అంతా అగమ్య గోచరంగా ఉంది; మిత్రులిద్దరూ అంతకు ముందు రోడ్డు ఓరకు వెళ్ళి అంత సీరియస్ గా యేమి మాట్లాడుకున్నారో!

-------------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

-------------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


41 views0 comments

Comments


bottom of page