top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'The Trap Episode 5' New Telugu Web Series





పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఐదవ భాగం

గత ఎపిసోడ్ లో

దివాకర్ వెళ్ళాక విశ్వం కూడా వేదమూర్తి ఇంటికి వస్తాడు. అతను కూడా పరమేశ్వర్ గురించి ఆరా తీయడంతో ఆశ్చర్యపోతాడు వేదమూర్తి. వెళ్లే ముందు వేదమూర్తితో రహస్యంగా ఏదో చెబుతాడు విశ్వం.

ఇక ది ట్రాప్. . ఐదవ భాగం చదవండి…


అనుకున్న ప్రకారం పనావిణ్ణి ఆ రోజుంతా యింట్లోనే ఉండమని చెప్పి భువనేష్, ప్రభావతి యిద్దరూ కారుని యింట్లోనే విడిచి, ఆటోలో తిన్నగా ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు. సహస్రనామ అర్చన, లక్ష కుంకుమార్చన ముగించి గుడి వెలుపల ఉన్న బిచ్చగాండ్రకు వరసగా చిల్లర డబ్బులు అందించారు. రాబోయే పుణ్యదినాన భిక్షువులకు, సాధువులకు ఆలయ చావడిలో భోజన సదుపాయం సమకూర్చడానికి గుడి ఇ ఓ గారికి విరాళం యిచ్చి రిసీప్టు తీసుకుని, రిజష్టరులో నమోదు చేయించుకుని, రోడ్డుపైకి వచ్చారు.


నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ గుడి ప్రసాదం స్వీకరించి దగ్గర్లో ఉన్న కాఫీ పాయింటు వద్ద కాఫీ తాగి, ఇద్దరూ మరొక ఆటోరిక్షా యెక్కి సనత్ నగర్ పార్కు చేరుకున్నారు.


ప్రభావతికి ఐస్ క్రీమ్ కోన్ అందిచ్చి తను కూడా ఒకటి తీసుకుని చెట్టు చెప్టాపైన కూర్చున్నాడు భువనేష్.


ప్రభావతి మాత్రం ఐస్ క్రీము తినకుండా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది- “ఉఁ ఇప్పుడు చెప్పండి- ఏం జరిగిందో! ఇంత వరకూ నేనెందుకు నోరుమెదప కుండా ఊరుకున్నానంటే -- గుడికెళ్ళిన మంచి మూడ్ మనిద్దరికీ చెదరకూడదనే—”


అతడు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు- “ఎందుకలా అడుగుతున్నా వు? నాకేమీ జరగందే ఏదో జరిగిందని నేనెలా చెప్పను!”


“కాదు. మీకేదో జరిగింది. ఇష్టపడి మిమ్మల్ని కట్టుకున్నదానిని. నాకు మీకేదో జరిగుంటుందని తెలవదా--”


“అసలు నాకేదో జరిగుంటుందని నువ్వెందుకనుకుంటున్నావు ప్రభా?”


“చెప్పేదా—సూటిగా అడిగేదా! ”


ఉఁ అన్నాడతను మొదట చేతిలోని ఐస్ క్రీము తినడం ముగించమని సంజ్ఞ చేస్తూ--


ఆమె మరేమీ అనకుండా ఐస్ క్రీము తినడం పూర్తి చేసి చేతి గుడ్డతో పెదవులు తుడుచుకుని అడిగింది-“ఆర్ యు రెడీ! ”


“ఇందులో రెడీ అవటానికేముందోయ్! యుధ్ధానికా బయల్దేరబోతున్నాం? నిదానంగా అడుగు టెన్షన్ కి తావివ్వకుండా--“


“ఓకే ఓకే! అలాగే అడుగుతాను. నేనంటే మీకు యిష్టం. ఔనా!”


“ఇష్టమంటే మామూలు యిష్టం కాదు. చాలా యిష్టం. నీలోని ప్రేమంటే ఇష్టం. నీలోని మృదుత్వమంటే యిష్టం. అదే విధంగా నీది మంచి ఫిగర్. కోర్కెల్ని రెచ్చగొట్టే ఒంపులు తిరిగే ఫిగర్ నీది. అంతే కాదు. నాకెప్పుడైనా తప్పీ జారీ ఎవరైనా స్త్రీ కలలో కనిపించిందంటే అది నువ్వే అయుంటావు. ఇక నెక్సుట్ పాయింటుకి రా! ”

“కావచ్చు. మీరు చెప్పింది వాస్తవం కూడా కావచ్చు. కాని—నాకు వేరే విధంగా అనిపించింది”


అంటే—అన్నట్టు పదునైన చూపుతో చూసాడతను.

“ఎక్కడో రంగమణి వలలోనో-మధురవాణి చూపులోనో బోర్లా పడ్డారని—”


అతడా మాట విన్నంతనే ఉలికి పాటుకి లోనవుతూ ప్రభావతి నెత్తిపైన సన్నటి మొట్టికాయ పెట్టాడు. “అసలు నీకెందుకలా అనిపించిందో, అన్న పాయింటుకి రావడం లేదు నువ్వు--”


ఆమె సన్నగా నవ్వింది- “చెప్తాను. అది చెప్పడానికేగా ఇంత దూరం మిమ్మల్ని పిలుచుకు వచ్చిందీ—నా పొందుకోసం మీరెప్పుడూ ఆరాట పడుతుంటారు. ఎంతగా అంటే—అప్పుడప్పుడు ఆ విషయంలో రాత్రి డ్యూటీతో బాటు పగలు కూడా డ్యూటీ అప్పచెప్పేవారు.


అటువంటిది నేను దగ్గరకు వస్తే మీరు దూరదూరంగా తొలగిపోయా రు. స్త్రీగా ఇది నాకెంత అవమానకరంగా ఉందో తెలుసా! అందులో పిల్లల సందడికి నోచుకోని దానిని. మొగుణ్ణి మాత్రమే నమ్మిన దానిని. ఆలోచించి చూడండి--”


“ఓ! అదా సంగతి--సరే, నీగురించి నువ్వు చెప్పుకున్నావు. ఇక నా గురించి నేను చెప్పుకునేదా- కాదు- మొరపెట్టుకునేదా?”

ఉఁ అందామె.


“కంపెనీ కార్పొరేట్ ఆఫీసులో టైట్ సిట్వేషన్. డి పీ సీ-అంటే డిపార్టు మెంటల్ ప్రమోషన్ కమిటీని సమేవేశ పరిచారు. దానిని పర్యవేక్షించడానికి న్యూజీల్యాండ్ నుండి సీనియర్ ఇ ఈ ఓ వస్తున్నాడు. ప్రమోషన్ పై ఇవ్వాల్సిన పోస్టులు రెండు. కాని-లిస్టవుట్ చేసిన క్యాండిడేట్లు యేడుగురు. అందరికంటే అవకాశం నాకే యెక్కువలా ఉన్నట్లుంది.


యూ యెస్ నుండి అప్పుడప్పుడే వచ్చాను కాబట్టి వచ్చిన అవకాశాన్ని జారవిడువ నీయకుండా నాకనుకూలంగా పెర్ఫార్మెన్స్ రిపోర్టుల తయారు చేయడంలో పూర్తిగా నిమగ్నుడనయి ఉన్నాను.


దెబ్బకు రెండన్నట్టు ఈసారి హయ్యర్ గ్రేడ్ తో హయ్యర్ పే—దీనితో బాటు అర్రిక్షన్ ని అరికట్టడానికి-అంటే మా కంపెనీ నుండి క్వాలిఫైడ్ స్టాఫ్-క్వాలిఫైడ్ ఆఫీసర్లు వేరొక సంస్థలకు పచ్చ బయళ్ళు వెతుక్కుంటూ వలసలు పోకుండా ఉండటానికి హెచ్చారెమ్ వింగ్ కొత్త పాలసీని రూపొందించింది.


దీని ప్రకారం, ప్రమోషన్ కి యెంపికయిన ఆఫీసర్లకు హయ్యర్ పే-ప్యాకెట్టుతో బాటు ఇన్సెంటివ్ గా కొత్తకారు అందివ్వబోతున్నారు.


నాకిప్పుడు కొత్తకారు అవసరం ఉందా లేదా అన్నది కాదు పాయింటాఫ్ అటెన్షెన్—ప్రమోషన్ తో బాటు నాకది యివ్వకపోతే నా డిగ్నిటీ దెబ్బతింటుంది. కంపెనీలో నా స్టేటస్ చిన్నబోతుంది. ముఖ్యంగా నేను పడ్డ శ్రమ అంతా వృధా అయినట్లవుతుంది. ఇదీ నా టెన్షెన్ కి కారణం.


అందుకే—డిపీసీ సభ్యుల్ని న్యూజీల్యాండు నుండి వచ్చిన ఈ సీనియర్ సి ఈ ఓ-ని ఇంప్రెస్ చేయడంలో ముమ్మరంగా రిపోర్టులు తయారు చేయడంలో మునిగిపోయున్నాను. మరి నా గౌరవం నీ గౌరవం కాదా! ”


“అయ్యోరామ! ఇది నాకు ముందే చెప్పాల్సింది కదా--“


భువనేష్ చిన్నగ నవ్వుతూ అడిగాడు-“చెప్తే-నువ్వేం చేయగలవు?”


“ఎందుకు చేయనూ--త్రిపురాలయం వెళ్ళి శివ పార్వతులకు అర్చన చేసిరానూ ! అవసరమనుకుంటే శని దేవుడికి కూడా పూజలు చేసిరానూ—అవన్నీ చేసి వస్తే ఇక మీకు తిరుగుంటుందా?”


అతడికెలా స్పందించా లో తెలియక ప్రభావతి ముఖంలో కి చూస్తూండిపోయాడు. “అదేమిటి అలా చూస్తున్నారు? అంత దూరం ఒక్కెతనూ ఎలా వెళ్ళగలననా—”


“నోనో! అలాక్కాదు. నీకున్న దైవభక్తి గురించి నాకు తెలియనిదా—యూ యెస్ నుంచి వచ్చిన ఆ బిజీ షెడ్యూల్ లో నాకది తోచలేదు. అంతేగాని మరేమీ లేదు. ఫారిన్ ట్రిప్పుకి వెళ్ళి వచ్చాను కాబట్టి ఫారిన్ లేడీస్ మాయలో పడ్డానని మాత్రం కాదు. ఇటువంటి పిచుకుల్లాంటి ఊహలు ఇంతటితో ఆపోయి-- ” అని చప్టా నుండి లేవబోయాడు. కాని—లేవలేక తడబడుతూ ఆగి పోయాడు.


ఎవరో పాప-ఆరేండ్ల పాప కేరింతలు కొడ్తూ పరుగుపెడ్తూ వచ్చి అతణ్ణి ఒక్కసారిగా ఢీ-కొట్టింది. దానితో అతడు అడ్డంగా పడ్డాడు. అతడి పైన ఆ పాప కూడా అదే రీతిన అడ్డంగా పడింది. అప్పుడా పాప తల్లి గావాలి- “సారీ సారీ! ఎక్స్టీమ్లీ సారీ! ఆటలో పడితే మా పాపకు కన్నూ మిన్నూ తెలియకుండా పోతుంది” అని నొచ్చు కుంటూ పాపను పైకెత్తుకుని భువనేష్ కి చేయి అందించింది, లేచి కుదురుగా కూర్చోవడానకి--


ఆ సంఘటనతో ఖంగుతిన్న ప్రభావతి కూడా కంగారు పడుతూ భర్తకు చేయి అందించి కూర్చోబెట్టింది. ఈసారి పాపతల్లి యిటు తిరిగి-“సారీ మేడమ్! ఎంత జాగ్రత్తగా వాచ్ చేస్తున్నా పిల్లల చేష్టలు చూపుకానకుండా జరిగిపోతుంటాయి. వి ఆర్ హెల్ప్ లెస్—మీకేమీ దెబ్బలు తగల్లేదు కదా సార్?”


అతడు నవ్వటానికి ప్రయత్నిస్తూ లేచి సర్దుకుంటూ అన్నాడు- “నో—నోట్ అటేల్—చిన్నపిల్ల మన పైన పడితే ఏమవుతుంది—ఏమీ కాదు. ఇన్ ఫేక్ట్—ఐ లవిట్-ఇక మీరు నిక్షేపంగా వెళ్ళిరండి మేడమ్” అంటూ గుడ్డలు దులుపుకున్నాడు భువనేష్.


అప్పుడు ప్రభావతి యెలార్టుగా తేరుకుని ఆతృతగా అంది-”మీరెవరో తెలుసుకోవచ్చా మేడమ్! ”


అప్పుడా పాప తల్లి ప్రభావతి చేతిని అందుకుంటూ- “వైనాట్?అసలు నన్ను నేను పరిచయం చేసుకోకుండా మీగురించి యేమీ తెలుసుకోకుండా వెళ్లిపోవడం క్షమించరాని నేరం. నాపేరు వరూధిని. అమ్మాయి పేరు మందాకిని, మొన్నమొన్ననే ఆరేళ్ళు దాటాయి. రెండవ తరగతి—నేనేమో షైనింగ్ మార్కెటింగ్ కంపెనీలో పని చేస్తున్నాను. ”


ప్రభావతి ఆసక్తితో అడిగింది- అందులోతనేం పని చేస్తుందని.


“అది మా మామగారి స్వంత కంపెనీ-అందులోడిప్యుటీ ఎమ్డీని. ”


ఆ మాట విని ప్రభావతి మనసార నిండుగా ఫీలవుతూ అంది-“ఫైన్. రియల్లీ గ్రేట్--మరి మీ వారెక్కడ పని చేస్తున్నారు?ప్రైవేటా లేక గవర్నమెంటల్ సైడా--”


వరూధిని బదులివ్వలేదు. ఓసారి భువనేష్ వేపు దీర్ఘంగా చూసి ముఖం తిప్పుకుంది. ప్రభావతి విడిచి పెట్ట లేదు. “లేరా?”


ఆమె తలూపింది.

“ఇద్దరూ కలిసుండటం లేదన్నమాట—“


వరూధిని తల అడ్డంగా ఆడిస్తూనే బదులిచ్చింది-“అది కాదు. చనిపోయారు—క్రోనిక్ లివర్ ప్రోబ్లమ్ వచ్చి--” అని మందాకిని వేపు తిరిగి- “మందూ! ఒకసారి ఆంకుల్ వద్దకు వెళ్ళి సారీ చెప్పిరా--” అని కూతుర్ని ఆదేశించింది.


ఆ పాప అలాగే అంటూ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. భువనేష్ యిబ్బంది పడుతూ అన్నాడు-“ఎందుకండీ ఇన్నిసారీలు! మల్లెపువ్వు వంటి పాప పైన పడితే నా యెముకలేవీ విరిగిపోలేదుగా!”


అప్పుడు ప్రభావతి కలుగచేసుకుంది-“ఓకే ఓకే—నౌ-కేస్ ఈజ్ సెటిల్డ్—రండి. అందరమూ కలసి ఫ్రెండ్లీగా ఒక సెల్ఫీ తీసుకుందాం. సరేనా--”.


వరూధిని కాదనకుండా కూతుర్ని దగ్గరకు తీసుకుని ప్రభావతి ప్రక్కకు వచ్చి నిల్చుంది. భువనేష్ వెంటనే సరైన యాంగిల్ చూసుకుని ముబైల్ ని క్లిక్ అనిపించాడు.


కాని మందాకిని కదల్లేదు. ఊరుకోలేదు. ”అంకుల్! మనిద్దరం కలసి ఫోటో తీసుకుందాం, అమ్మ బాగా తీస్తుంది” అంది.


భువనేష్ కూడా కాదనలేదు. ఓకే-అంటూ మందాకినిని దగ్గరకు తీసుకున్నాడు. వరూధిని షార్పు యాంగిల్ లో చూస్తూ క్లిక్ అనిపించింది.


అప్పుడు పనిలో పనిగా ప్రభావతి తన చేతి పర్సునుండి విజిటింగ్ కార్డు తీసి అందించింది. వరూధిని దానిని అందుకుంటూ తన పర్సునుండి తన స్వంత విజిటింగ్ కార్డు తీసి అందించింది.


ప్రభావతి-“థేంక్స్! ” అంటూ అందుకుని మందాకినిని ముద్దుపెట్టుకుని భర్త చేతిని అందుకుని పార్క్ ఎగ్జిట్ గేటు వేపు కదలింది.


ప్రభావతి భర్తతో చేతులు కలిపి గేటు చేరే లోపల వరూధిని గొంతు వినిపించింది- “ప్రభావతి గారూ! కొంచెం ఆగుతారా?”


ప్రభావతి ఆశ్చర్యంగా చూస్తూ ఆగింది. దగ్గరకు వచ్చి వరూధిని అడిగింది-“మీరెలా వెళ్తున్నారు? కారులోనే కదూ—”


“కాదు. ఆటోలో వెళ్తున్నాం. కారు యింటివద్దే విడిచిపెట్టేసాం, గుడిలో యెక్కువ సేపు ఉండవలసొస్తుందని—”


“పర్వాలేదు. నా కారులో రండి. నేను మిమ్మల్ని ఇంటివద్ద దిగబెట్టి అలా వెళ్లి పోతాను. ”


ప్రభావతి భువనేష్ ఇద్దరూ యిబ్బంది కరంగా ముఖం పెట్టి యేదో అనేందుకు నోరు తెరిచేలోపల మందాకిని పరుగున వచ్చి భువనేష్ చేయి అందిపుచ్చుకుంది-“రండి అంకుల్! మమ్మీ బండి వేగంగా డ్రైవ్ చేస్తుంది. సేఫ్ గా డ్రైవ్ చేస్తుంది. ఆంటీనీ మిమ్మల్నీ మీ యింటి వద్ద దిగబెట్టి సర్రున ఇల్లు చేరుకుంటుంది”


ఇక పాప మాటకు యెదురు చెప్పలేక భార్యాభర్తలిద్దరూ వరూధినీతో బాటు నడచి వచ్చి కారులో కూర్చున్నారు. మందాకిని చెప్పినట్టే వరూధిని కారుని సర్రున ఫ్రిక్షన్ పైకి వేగంగా డ్రైవ్ చేస్తూ ఇద్దర్నీ ఇల్లు చేర్చింది. డోరు తెరచి కారు దిగుతూ ప్రభావతి అడిగింది-“రండి మేడమ్! కప్పు టీ తీసుకుని వెళుదురుగాని—”


“ఇటీజ్ ఓకే ప్రభావతి గారూ! సార్ కూడా కొంచెం అన్ ఈజీగా ఫీలవుతున్నట్టున్నారు. మరొకసారి వీలు చూసుకుని వస్తా--థేంక్స్” అంటూ కారుని ముందుకు పోనిచ్చింది.


ఇద్దరూ యింటి గుమ్మం వద్దకు వచ్చేట ప్పటికి ప్రభావతి నిష్ఠురంగా అంది-“చూసారా మీరు కారులో ఒక్కసారి కూడా నోరు విప్పి మాట్లాడకపోయే సరికి వరూధిని మేడమ్ అదోలా ఫీలయినట్లుంది.”


“దానికి బాధ్యణ్ణి నేను కాను”.


మరెవరన్నట్టు అదోలా చూస్తూ తలుపు తెరిచి నిల్చున్న పనిగత్తె భాగ్యాన్ని నెట్టుకుంటూ వెళ్ళింది ప్రభావతి.


“నువ్వూ ఆ డిప్యుటీ యెమ్డీ మేడమ్ గారూను, అంతటి స్వల్ప వ్యవధిలో ఇంతలాగా కలసిపాయారు పాలలో నీళ్ళు చేరినట్టు! దీనిని స్నేహం అనరు. ఎందుకంటే స్నేహం ఒక్కరోజులో నో ఒక గంటలోనో ఉద్భవించే మృదు మనోభావం కాదు. ఉబుసుపోక చేసుకునే బుచ్చమ్మ కబుర్లంటారు. ఆవిడ గొప్ప కోసం కారులో రమ్మంటే నువ్వు వద్దనవచ్చుగా! ఏం—ఒక రోజు చేంజ్ కోసం ఆటోలో వెళితో ఏమవుతుందట— ఒళ్ళు మైల పడిపోతుందా లేక కాళ్ళు ఉబ్బిపోతాయా! ”


“అబ్బబ్బ—ఏమిటండీ ఆ నసనసలు--ఆ చిన్నపిల్ల వచ్చి మీ చేయి పట్టుకు లాగడం వల్లనే కదా మనం ఆవిడ కారులో వెళ్ళాల్సి వచ్చింది. ఇది మీకు మాత్రం తెలియదా ---”


అతడేమీ అనకుండా నడచుకుంటూ వెళ్ళి దుస్తులు మార్చుకుని వచ్చి హాలులో కూర్చున్నాడు. ఆమె కూడా అప్పటికి నోరు మెదపడం క్షేమం కాదనుకుంటూ త్వరగా చీర మార్చుకుని భాగ్యాన్ని వంటగది వెలుపల ఉండమని సంజ్ఞ చేస్తూ తనే వెళ్ళి రెండు కప్పుల కాఫీ కలిపి తీసుకు వచ్చింది.

-------------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

-------------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


26 views0 comments
bottom of page