top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 6

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి







Youtube Video link

'The Trap Episode 6' New Telugu Web Series




పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఆరవ భాగం

గత ఎపిసోడ్ లో

భువనేష్, ప్రభావతిలు ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు.

దర్శనం పూర్తి అయ్యాక భువనేశ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఆరా తీసింది ప్రభావతి.

పని ఒత్తిడే కారణమని చెబుతాడు అతను.

వాళ్లకు వరూధిని, ఆమె కూతురు పరిచయమవుతారు.

ఇక ది ట్రాప్. . ఆరవ భాగం చదవండి…

“ఉఁ తీసుకోండి. మీకోసం స్పెషల్ గా చేసి తీసుకువచ్చాను. త్వరగా భోజనాలు చేసి నిద్రపోవాలి, మరచిపోకండి”.


ఆ ఒక్కమాటతో అతడిలోని నకారాత్మక మూడ్ పటా పంచలయిపోయింది. పనిగత్తె అలికిడి అక్కడుందేమోనని చూపులతో పర్యవేక్షించి కాఫీ కప్పుల్ని టీపాయ్ పైన ఉంచి భార్యను రెండు చేతుల్లోకి తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ; ఆరోజు చాలా బాగున్నావని కితాబు యిస్తూ-


“నిజంగా అంత బాగున్నానండీ!" అంటూ ఆమె మరింత గాఢంగా తమకంతో అతడి మెడను పెనవేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. అప్పుడు భాగ్యం వస్తూన్న అడుగుల చప్పుడు విని ఇద్దరూ తొలగిపోయారు, కాఫీ కప్పుల్ని చేతుల్లోకి తీసుకుంటూ-


ఇద్దరు కాఫీలు తాగిన తరవాత, భాగ్యం వచ్చి ఖాళీ కప్పుల్ని తీసుకెళ్ళిపోయిన తరవాత ప్రభావతి ఆశ నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది- “ఆ పాపను బాగా చూసారండీ!"


ఈసారి అతడిలో విసుగుదల పుట్టు న బయటికి వచ్చింది. "అబ్బ! మళ్ళీ వాళ్ళ సంగతేనా? ఇకపైన కూడా టాపిక్ మార్చవేంటి? ”

“తప్పకుండా మార్చి వేస్తాను. మీ మూడ్ ని రెట్టింపుగా ఉద్దీపింప చేస్తాను-- ఐ-ప్రామిస్. దీనికి మాత్రమే మీరు బదులిస్తే—“ అతడు నోరుమెదపకుండానే తలాడించాడు అడగమన్నట్టు.


"ఆ అమ్మాయి ముఖంలోకి నిదానంగా చూసారా!"


అతడు ప్రభావతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు-

“ఏ అమ్మాయి? ఆ చిన్న పాప గురించి అడుగుతున్నావా లేక ఆ పాప తల్లి గురించి అడుగుతున్నావా--”

"ఏమయిందండీ మీకు? ఈ డిపిసీ ప్రమోషన్ల గొడవలో పడి మీ బుర్ర బాగా చెదరిపోయినట్లుంది. ముందు దాని సంగతి మరచిపొండీ, కార్పొరేట్ వ్యవస్థని ప్రక్కన పెట్టండి. ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది. రానప్పు డు రాదు. దాని కోసం కలత చెందుతూ గజిబజిగా ఆలోచనల్ని పెంచుకోకండి. బిడ్డ తల్లి భర్తను కోల్పోయిన వితంతు స్త్రీని అమ్మాయంటానా! నేనిప్పుడు ఆవిడ కూతురు మందాకిని గురించే మాట్లాడేది—ఇప్పుడు చెప్పండి. సరిగ్గా చెప్పండి. ఆ పిల్ల యెలా ఉంది?”


“ఏవిటి ప్రభా! ఆ పిల్ల గురించి నేనిప్పుడెలా చెప్పేది? వయసు పెరగాలి. ముఖాన నేవళం రావాలి. ఆ తరవాత యవ్వనం వికసించాలి. ఆ తరవాతనే ఆ పిల్ల ముఖం గురించి గాని షేపు గురించి గాని ఏదైనా చెప్పగలను” భర్త నోట ఆ మాట విన్నంతనే ప్రభావతి నెత్తిని ముని వ్రేళ్ళతో కొట్టుకుంది-


“నా తలరాత-- ఒక తల్లి ఆక్రందన ను అర్థం చేసుకోరు కదా-- ఆ పిల్ల అచ్చు మన సుభాషిణిలా లేదూ--”


అతడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు. "సారీ—నేను సరిగ్గా గమనించలేదు. చక్కగా చురుగ్గా ఉంది. అంతవరకే గమనించాను. ఐనా—ఒకరి పోలికలు మరొకరిలో ఏదో ఒక షేపులో ఉండటం సహజమే కదా! ఇందులో అంతగా అబ్బుర పడటానికేముంది? ”


“లేదు. మీరు కచ్చితంగా మైండ్ ఫుల్ నెస్ తో మాట్లాడటం లేదు. మందాకిని మామూలు పోలికలతో సుభాషిణిలా కనిపించలేదు. అచ్చుగుద్దినట్లుంది”.


అతడు స్పందించకుండా ఊరకుండిపోయాడు. ప్రభావతి బిడ్డను కోల్పోయిన తల్లి. మనోతత్వ రీతిన చూస్తే— స్కూలుకెళ్ళే ప్రతి అమ్మాయీ తన కూతురు సుభాషిణి లాగే అగుపిస్తుంది. సైకలాజికల్లీ ఇటువంటిది సంభవించడం సాదారణమే అని చెప్తే ప్రభావతి మానసికంగా తట్టుకోలేక పోవచ్చు. ఇప్పటికే ఆమె ఆరోగ్యం అంత పరిపూర్ణంగా లేదని తనకు తెలుసు. ఏవో గోళీ మాత్రలు డాక్టరమ్మ యిస్తుంది కదానని తీసుకుంటుందే గాని, వాటిలో కొన్ని ఆమె మానసిక పరిస్థితికి సంబంధించిన వైద్యమని ప్రభావతికి తెలియదు.


డాక్టర్ గారు బ్రెక్స్ పిప్రజోల్ మైల్డ్ డోసేజులో మాత్రలు ప్రిస్కైబ్ చేసినప్పుడు అతడికి తెలియ చెప్పింది. వ్యవహారం యిలానే సాగనిస్తే మానసిక సమస్యలు పెద్ద స్థాయిలో పొడసూప వచ్చని.. అంచేత ప్రభావతి ఉపశమనార్థం, మానసిక సమతుల్యత కోసం- అల్ల నల్లన సంతోషం కలిగించే చిట్టి పోట్టి పనులు చేస్తుండాలి. అలా మనసున తలపోస్తూ యెట్టకేలకు అతను నోరు తెరిచాడు-“ఔను. ఇప్పుడు బాగా ఆలోచించి చూస్తే నాకూ అలానే అనిపిస్తుంది ప్రభా! సరే—అలాగే అనుకుందాం. దానికి మనం చేసే దేముంది? దాని వల్ల మనకేమి ప్రయోజనం--”

“ఇలాగన్నారూ బాగుంది. పార్కులో ఆ అమ్మాయిని చూసినప్పట్నించీ మనసు సంతోషంతో యెంతలా యెగసి పడుతుందో తెలుసా! ఆ పాపగాని మనముందు ఉంటే మీకు కూడా చెప్పలేనంత తెరపిగా ఉంటుంది. ఔనా కాదా? ”

“తప్పకుండా--మరి ఇందులో పెద్ద అడ్డంకేదీ ఉండదోయ్! వరూధిని తన విజిటింగ్ కార్టు ఎలాగూ యిచ్చిందిగా--మందాకిని కూడా మనతో క్లోజ్ గానే మెసలుతుందిగా-- ఒంటరిగా ఉన్నఆమెకూ ఫ్రెండ్సు సందడి అవసరమేగా-- ఇక ఆగడం దేనికి? గుడికి వెళ్ళి వస్తున్నప్పుడో లేక పుణ్య క్షేత్ర దర్శనం కోసం సాగుతున్నప్పుడో తల్లీ కూతుళ్ళనూ నీతో— అంటే మనతో బాటు వెంటబెట్టుకుని వెళ్తుండవచ్చుగా!"


ప్రభావతి మౌనంగా తల పంకిస్తూ అన్య మనస్కురాలై కూర్చుండిపోయింది. అప్పుడు అదే అదనుగా భువనేశ్ లేచాడు."ఇక మనం పడక గదిని పావనం చేద్దామా! ముఖమల్ పాన్పు మన కోసం కొన్ని రోజులుగా బెంగ పెట్టుకున్నట్లుంది” అంటూ చేయి అందించాడు. ఆమె యెందుకో చేయందుకోలేదు.


అందుకోకుండానే అందామె సీరియస్ గా ముఖం పెట్టి-“మరొకటి గమనించారా!"


లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు.


"వరూధినిగారిని గమనించారా!"


విసుగ్గా ముఖం చిట్లించా డతను.

"గమనించాడానికేముందోయ్! ఆమే కదా ఇంటి వరకూ వచ్చి మనల్నిదిగబెట్టిందీ--”


"అదికాదండీ—ఆమె ముఖాన్నీ రూపాన్నీ చూసారా? ”

“చూడటానికి నాకేమీ అగుపించలేదు బొద్దుగా ఉండటం తప్ప—”


“ఉష్! వేగిరపాటుగా అడ్వర్సుగా మాట్లాడకండి. పొడవుగా కళగా నిండారోగ్యంతో అప్పటి బాలీవుడ్ నటి మధుబాలాలా లేదూ?”


అతడు జాగ్రత్త పడుతూ అన్నాడు- "ఉండవచ్చు. నేనది గమనించలేదు, ఐనా—మొగుడి వద్ద పరస్త్రీని మెచ్చుకోవడం యేమిటోయ్--”.


ఆమె విసుక్కుంటూ అంది-“ఉష్! విసుక్కోకుండా పాయింటుకి రండి. మందాకిని యెదిగిన తరవాత వాళ్ళమ్మలా పొడువుగా అందంగా ఉండదూ? ”


“ఇందులో సందేహం యెందుకూ! తల్లిలాగే కూతురు కూడా వస్తుంది—ఇది లోక విదితమేగా! బొజ్జ పెరగ కుండా ముఖాన కళ తగ్గకుండా రెగ్యులర్ గా స్త్రీలకు అనువైన నౌకాసనం, త్రికోణాసనం వరూధిని పకడ్బందీ గా చేస్తుందేమో--”

“దానికామె యేమీ అన లేదు. భర్తను హత్తుకుంటూ లేచి నిల్చుంది. అప్పుడతను అదే అదనుగా అందుకున్నాడు. ప్రభావతిని అమాంతం రెండు చేతుల్తోనూ ఇముడ్చుకుని మేడమెట్ల వేపు నడిచాడు. అటు వేపు యెందుకో నడుస్తూ వస్తూన్న భాగ్యం కదలకుండా ఆగిపోయింది.

------------------------------------------------------------------------

పరమేశ్వర్ సన్నగా విజిల్ వేసుకుంటూ గడప దాటి లోపలకు ప్రవేశించేటప్పటికి దాదాపు ఇంటిల్లిపాది అందరూ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ చేసినంత పని చేసారు.

"మూడు రోజులుగా యెక్కడెక్కడ ఊళ్ళు తిరిగి వస్తున్నావురా! పనిలేని సర్కస్ గారడీ వాడికి ఊరంతా పనే--చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి చెప్పి వెళ్ళావు? చదువుకుంటున్నానని కొమ్ములొచ్చేసాయా!"


నోటమాట రాక నిలువెళ్ళా నీరుగారిపోయి నిల్చుండిపోయాడు పరమేశ్వర్.

"అవేం చూపుల్రా పరమేశా! నోరు తెరచి చెప్పు—“ కామాక్షమ్మ కొడుకుని నిలదీసింది.

ఎట్టకేలకు పరమేశ్వర్ పెదవి విప్పాడు-“చెప్పే వెళ్ళాగా!"


అప్పుడు వేదమూర్తి గొంతుకున గర్జన వినిపించింది-“అదే అడుగుతున్నాం. ఎవరికి చెప్పి వెళ్ళావని—”


గొణిగినట్లు బదులిచ్చాడు పరమేశ్వర్-“బామ్మకు-”


ఈసారి మంగళ దేవమ్మ మాటతో షూట్ చేసింది- {“అవేం మాటల్రా కోతి వెధవా! వెళ్ళొస్తానంటే యెప్పటిలాగా ఇక్కడెక్కడికో వెళ్ళిన వాడివి వెళ్ళినట్టు వచ్చేస్తావనుకున్నాను. ఏకంగా మూడు రోజులు కనిపించకుండా పోతావనుకున్నానా! ఒక పెద్దమనిషి ఇల్లు వెతుక్కుంటూ వస్తే ఏనో తానోగా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతావా? నీ ధోరణి వల్ల మీ బాబు యెంత అవమానకరంగా ఫీలయాడో తెలుసా?”.


అప్పుడతను శాంతి సమాధానంగా చెప్పసాగాడు- “ఇప్పుడు ఒకటి తరవాత ఒకటిగా చెప్తాను. కొంచెం టైమిస్తారా, నాపైన కృప చూపించి!" అంటూ వంటగది వేపు వెళ్ళి మంచి నీళ్ళు తాగి వచ్చి చెప్పసాగాడు- “మొదటిది- నేను యేక ధాటిన మూడు రోజులు వెళ్లిపోవడం తప్పే- ఫ్రెండింట్లో అలా ఉండిపోయి మీకెవరికీ ఫోను చేసి చెప్పకుండా ఉండిపోవటం కూడా తప్పే— ఇలా జరగడానికి కారణం నేను కాదు.


కామాక్షమ్మగారి భర్త- మంగళాదేవిగారి సుపుత్రుడు వేదమూర్తి గారే కారణం”


వేద మూర్తి తెల్లబోయి చూస్తూ అడిగాడు-“నేనా కారణం! చేసిన తప్పుని కప్పి పుచ్చుకునేందుకు ఎదుటి వారిపై నింద వేయకురా పరమేశా! అలా చేయడానికి ప్రయత్నించా వే అనుకో.. తిట్లూ లెంపకాయలూ ఒకేసారి తింటావు. గుర్తుంచుకో—”


“బి-కూల్ నాన్నగారూ! ఇది ప్రజాస్వామ్య సమాజం. అందరికీ చెప్పుకునే అవకాశం యివ్పండి. ఇక ముందుకు సాగేదా? ”


అసహనంగా చూస్తూనే తలూపాడు వేదమూర్తి.


"ఎప్పుడైనా నా ఖర్చుకోసం నేనడిగిన డబ్బులు పూర్తిగా యిచ్చారా! మీ మాతృశ్రీ మంగళాదేవిగారు సిఫార్సు చేస్తేనే లెక్కకు మించని రీతిన చిల్లర విదిలిస్తారు. అదీను వాయిదాల చొప్పున-- మూడు పుస్తకాల కోసం క్యాష్ అడిగితేనేమో— ఒకే ఒక పుస్తకానికి డబ్బులిస్తారు. మిగతా సబ్జక్ట్ మేటర్ కోసం నేను పెక్కు గ్రంథాలయాల చుట్టూ విషయ సేకరణ చేసుకోవాలి. ఈసారి కూడా అలాగే జరిగింది. ప్రొఫెషనల్ కోర్సులో కీలకమైన దశకు చేరుకున్నాను. ఇప్పుడు గాని అన్నయ్య సహకారంతో గట్టు దాటకపోతే బ్రతుకు పుట్టి మునిగిపోతుంది. అందుకే, ఆవేగంతో వెళ్ళి ప్రెండ్స్ యింట్లో ఉండి నోట్సు పూర్తి చేసుకున్నాను. అవన్నీ పూర్తయేసరికి మూడు--”

“అంటే—నేను కావాలనే డబ్బులుంచుకునే నీకు డబ్బులివ్వటం లేదంటావు--ఔనా? ”


“అబ్బే! నేనలా అనడం లేదు నాన్నగారూ! మనది ఉమ్మడి కుటుంబం-పెద్ద కుటుంబం. ఆపాటిది నాకు తెలవదా యేమిటి? పీత కష్టాలు పీతవి కదా! నేనెదుర్కుంటూన్న పరిస్థితిని వివరిస్తున్నాను-కాదు-మనవి చేసుకుంటున్నాను. అంతే—ఇక రెండవ పాయింటుకి వస్తాను. అసలు ఆరోజు మనింటికి వచ్చిన పెద్ద మనిషెవరు? ఎందుకు వచ్చారు? ఇవన్నీ నాకు తెలవదు. తెలుసుకోవలసిన అవసరమూ నాకు కలగలేదు. ఇకపైన ఆ అవసరమూ నాకు కలగబోదనే అనుకుంటున్నాను”


“కాదు. ఇకపైన ఆ అవసరం నీకు తప్పకుండా కలుగుతుందిరా పరమేశా!"కామేశ్వరరావు రావు గొంతు వినిపించి అటు తిరిగాడు పరమేశ్వర్-


“నువ్వింత వరకూ ఎందుకు నోరు తెరవలేదా అని అబ్బురపడుతూ ఉన్నానురా అన్నయ్యా! ఇక యిప్పుడు నీవంతు. చెప్పరా అన్నయ్యా—”


"సరే—చెప్తాను. మొదట ఇది చెప్పు-నీకు మిస్టర్ దివారక్ తెలుసా!"


“తెలవడం యేమిటి—చూసున్నాను కూడా--కాని—చాలా కాలం నాటి మాట. ఇప్పుడు గుర్తు పట్టగలనో లేనో తెలియదు”


"కరెక్ట్! ఇక చెప్తాను. నిదానంగా విను. ఇది మన కుటుంబానికి— ముఖ్యంగా నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం”.

అలాగా అన్నట్టు తలూపాడు పరమేశ్వర్. అప్పుడు కామేశ్వరరావు చెప్పసాగాడు. పరమేశ్వర్ సావదానంగా వింటున్నాడు.

-------------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

-------------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం




మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


48 views0 comments

Comments


bottom of page