top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 7


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'The Trap Episode 7' New Telugu Web Series
పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఏడవ భాగం


గత ఎపిసోడ్ లో

భర్త ముందు మందాకిని ప్రస్తావన తెస్తుంది ప్రభావతి.

మందాకినికి చనిపోయిన తమ కూతురు పోలికలు ఉన్న విషయం అతనితో చెబుతుంది.

మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చిన పరమేశ్వర్ ని ప్రశ్నలతో చుట్టు ముడతారు అతని కుటుంబ సభ్యులు.

ఇక ది ట్రాప్.. ఏడవ భాగం చదవండి…

చెప్పడం పూర్తయిన తరవాత చివరి మలుపుగా కామేశ్వరరావు మరొకటి జోడించాడు. “బాగా గుర్తుంచుకో! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడున్నట్టు మనం కాలమంతా పడుండలేం. పడుండ కూడదు. సరుకులు హోల్ సేల్ మార్కెట్టు నుండి తెచ్చుకోవడానికి మనం చిన్నపాటి జీపునో- టేంపో వంటి బండో తెచ్చుకోవడానికి అవస్థ పడుతున్నాం. ఔనా? ”


పరమేశ్వర్ తలూపాడు.


“ఇప్పుడు దివాకర్ అంకుల్ గారి ఆఫర్ యేమిటో తెలుసా-- మనతో పార్టనర్ గా చేరి మనకు మిగిలిపోయిన స్థలంలో మినీ సూపర్ మార్టెట్ గా విస్తరించడానికి ముందుకు వచ్చాడు”.


పరమేశ్వర్ ముఖం అదోలా పెట్టాడు- ”అది సరేరా అన్నయ్యా! వినడానికి అప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలా ఆసక్తికరంగానే ఉంది. మరి— ఇదంతా నాకెందుకు చెప్తు న్నట్టు—”


ఈసారి కమల సంభాషణలోకి జోరుగా వచ్చింది- “అవేం మాటల్రా అన్నయ్యా— రామాయణమంతా విని రాముడికి సీత యేమవుతుందని అడిగినట్లు! నువ్వు గాని, అంకుల్ గారి పెద్ద కూతురు వినోదినిని చేసుకుంటానంటే మన కిరాణా దుకాణం మాత్రమే విస్తరించదు. నిన్ను ఆయన ఫార్మాకంపెనీ ఇన్నర్ సర్కిల్ లోకి తీసుకుంటాడు. ప్రొఫెషనల్ ట్రైనింగు కూడా యిచ్చి నిన్ను నిచ్చెనెలా మెట్టుపైన మెట్టుగా పైకి తీసుకెళ్ళి పోతారు".


పరమేశ్వర్ బదులివ్వలేదు. అందరి వేపూ అరమోడ్పు కళ్ళతో ఓసారి చూసి లోపలకు నడిచాడు; తనకు ఆకలేస్తుందంటూ, స్నానం చేసి వస్తానంటూ--


అప్పుడు వేదమూర్తి హుంకరిస్తూ కొడుకుని ఆపాడు- “ఆగరా! కళ్ళు నెత్తికెక్కి పోయాయా? ఇంతమందిమి నీ కోసం ఆలోచిస్తూ నీ బదులు కోసం యెదురు చూస్తుంటే అలాగేనా ధిక్కారంగా వెళ్ళిపోవడం! "


”నాకిష్టం లేదు నాన్నా ఈ బేరసారాల సంబంధాలు. అందునా అన్నయ్యకు పెళ్ళికాకుండా—’

"నీ చదువుల గట్టి బుర్ర ఇక్కడ చూపించుకురా పరమా! నిన్ను మొదట ఒప్పుకోమంటున్నాం. ఆ తరవాతనే పెళ్ళి యేర్పాట్లు- కాము పెళ్ళి సంగతంటవా.. ఆ విషయం విడిగా చూసుకుంటాం. వాడి గురించి నువ్వు దిగులు పడకు--"


“సరే— ఇంత సూటిగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా సూటిగానే బదులిస్తాను. నాకీ పెళ్ళి యిష్టం లేదు. ఎందుకూ అని అడక్కిండి. నేనే వివరిస్తాను. మీపైన దివాకర్ అంకుల్ గారికి నిజంగానే చిన్ననాటి స్నేహ భావం ఉండవచ్చు. కాని, వాళ్ళకూ మనకూ మధ్య తారతమ్యాలు చాలానే ఉన్నాయి. అడుగడుక్కీ అవి కొట్టవచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. మనల్ని కించపరుస్తూనే ఉంటాయి".


వేదమూర్తి అడ్డువచ్చి అడిగాడు- “ఏదీ—ఒక్కటి చెప్పు చూద్దాం”


“ఒక్కటేమిటి—పెక్కు చెప్పగలను. మీరిప్పుడు నడుపుతూన్న స్కూటర్ ని సర్సీసింగుకిచ్చి నాకు అప్పచెప్పమన్నాను, నాకు చాలా చోట్ల వెళ్ళవలసి ఉంటుందని. మీరది చేసి యింతవరకూ యివ్వలేక పోయారు. కాని— ఇంటికి లేటుగా వస్తేనేమో తిట్తారు. ఏదో క్రిందా మీదా పడి అన్నయ్యనూ తమ్ముడినీ హైస్కూలు వరకూ చదివించారు. అటు పైన చదువు మాన్పించేసారు.. మన పచారీ షాపులో చేదోడుగా మనుషులు కావాలని, వాళ్ళందరికీ జీతభత్యాలివ్వలేమని-- నేను ఒక్కణ్ణీ పట్టు వదలని విక్రమార్కుడిలా కాలేజీ వరకూ వెళ్ళగలిగాను బామ్మ వత్తాసుతో-- రవాణా ఖర్చులు యెక్కువవుతున్నాయని గుడ్స్ టెంపోవంటి బండిని కొనాలని తెగ అవస్థ పడుతున్నారు. కొనగలుగుతున్నారా-- లేదు కదా!


బామ్మకూ అమ్మకూ కమలకూ పెట్టుడు చీరలు కొనివ్వడానికి బుక్స్ ఆఫ్ ఆకౌంట్సు పదే పదే తిరగేస్తారు, ఏదైనా మిగులు ఉంటుందానని-- పరిస్థితి యిలా సాగుతున్నప్పుడు మనం గాని వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే అక్కడి స్త్రీల ముందు మనింటి ఆడాళ్ళ గతేమవుతుందో ఆలోచించండి నాన్నా— ఇక చివరి మాట- లాస్ట్ బట్ నాటి దిలీస్ట్ అంటారే అలాగ న్నమాట— నా ఆత్మగౌరవాన్ని, మనింటి గౌరవాన్ని దివాకర్ అంకుల్ వాళ్ళకు తాకట్టు పెట్టడం నాకు సుతరామూ యిష్టం లేదు నాన్నగారూ!


నేనింత వరకూ కష్టపడి చదివాను. భువనేశ్ పెద్దన్నయ్య సహాయంతో సలహాతో కాస్తో కూస్తో డిజిటలైజేషన్ అడ్వాన్స్ ట్రైనింగు కూడా తీసుకుంటున్నాను. నన్ను మనూరి చెరువులో ఇప్పటికిప్పుడు దూకమని అడక్కుండా, కనీసం నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం యివ్వండి. శ్రమ వల్ల వచ్చిన క్రెడిట్ అంతా మీ స్నేహితుడి యింటి వాకిట అర్పించమని అడక్కండి. నావల్ల క్రెడిట్ యేమైనా ఉంటే బామ్మకూ తాతయ్యకూ యివ్వండి. మీరూ అమ్మా అన్నయ్యా కలసి తీసుకోండి. కాని-ఒకే ఒక ఆఫర్ కోసం క్రెడిట్ అంతటినీ పొరుగింటికి అమాంతం అప్పచెప్పకండి.


ఇక నన్నాపకండి. స్నానం చేసి దేవుడికి పూజచేయాలి” అంటూ కదలబోయాడు పరమేశ్వర్. ఈసారి మంగళా దేవమ్మ మనవణ్ణి ఆపింది. “కాసేపాగరా! ” అని కోడలు వేపు తిరిగి వినోదిని ఫోటో తీసుకురమ్మంది.


“ఎందుకూ--మీ మనవడు వద్దంటున్నాడుగా! ”


కామాక్షమ్మ నచ్చచెప్తున్నట్టు చెప్పింది “విషయం అది కాదే కోడలా! అంత పెద్ద కలవారి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని పై చదువులు చదివిన అమ్మాయిని వెతికి వేసారి మనింటి అబ్యాయికి యివ్వడం యేమిటి? పైకి కనిపించని యేదైనా లోపం ఉందేమా! సద్గుణ వంతురాలు కాదేమో!”


"అప్పుడు పరమేశ్వర్ చప్పు న కలుగచేసుకున్నాడు- “లేదు బామ్మా! వినోదినిలో లోపం యేమీ ఉండదనే అనుకుంటాను. అమ్మాయి కూడా మంచిదే—"


పరమేశ్వర్ నోట ఆ మాట విని ఇంటిల్ల పాదీ ఆశ్చర్యంగా చూసారు. మంగళ దేవమ్మ విస్తుపోతూ అడిగింది- “నీకెలా తెలుసురా అబ్బీ? నువ్వింకా ఆ పిల్ల ఫోటో కూడా చూడందే! ఆరోజు తలెత్తి కూడా చూడకుండా విసురుగా వెళ్ళిపోయా వుగా--

అప్పుడు పరమేశ్వర్ వివరణ యివ్వడానికి ముందుకొచ్చాడు. “నాకు తెలుసు బామ్మా! కాలేజీలో ఆమెదీ మాదీ ఒకే బ్లాకూ ఒకే వింగూ కాదు గాని— కాలేజీ ఆవరణలో చూసున్నాను. ఎప్పుడూ పరపరమని చురుగ్గా కనిపిస్తుంటుంది. సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది”.


అప్పుడు కమల వెంటనే అడిగింది “ఏ కార్యక్ర మాలురా అన్నయ్యా! ”

అతడు చెల్లికి బదులిచ్చాడు. “పెద్ద ఘనకార్యాలేవీ కావులే! లేడీ ఫ్రెండ్సుతో కలసి బ్లడ్ డొనేషన్ క్యాంపు నీ—పేద పిల్లల కోసం ఆరోగ్య సూత్రాలనీ ఆలనా పాలనా దిశాదిర్దేశాలని— ఏవేవో చేస్తుంటుంది. బామ్మ అనుమానిస్తున్నట్టు లోపాలు వంటివి నాకెప్పుడూ కనిపించలేదు"


“ఒరేయ్ వెర్రినాగమ్మా! వినోదినిలో అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్తే నువ్వా పిల్లను పెళ్ళి చేసుకోకుండా ఊరుకుంటావా"


“నాకాపిల్లను పెళ్ళి చేసుకోవడం యిష్టం లేదన్న కారణంగా ఆమెలో లేనిపోని లోటు పాట్లు ఉన్నాయని చెప్పమంటావా!” అని సన్నటి నవ్వుతో లోపలకు దారితీసాడు పరమేశ్వర్.

-------------------------------------------------------

భువనేశ్ ఫార్మల్ గా ఫుల్ తెల్ల షర్టు వేసి మోచేతులు సరి చేసుకుంటూ నెక్ టైని కుదురుగా బిగించుకుంటూ హాలులోకి వచ్చేటప్పటికి హాలులో టీ-కప్పులతో సిధ్ధంగా ఉంది ప్రభావతి. అతడు కనుబొమ లెగరేస్తూ అడిగాడు-“అదేమిటి అదేదో బిజినెస్ మీట్ కి వెళ్తున్నట్టు అలా నిండు చీర కట్టుకుని నిండుగా ఆభరణాలు పెట్టుకుని కళకళలాడుతూ కనిపిస్తున్నావు! వాటీజ్ ది మేటర్ మై బ్యూటిఫుల్ యాంజిల్? ! ”


“మేటర్ ఉంది సార్, మైడియర్ మగసిరి మగ పురుషా! ఇదిగో—ముందు కప్పు టీ తీసుకోండి. పునురుత్తేజంతో ఉండవద్దూ! "


“అది సరేనోయ్! తీసుకుంటాను— నువ్వు ఇంతటి మిలమిల మెరిసే అలంకరణ లేకున్నా బాగుంటావని నాకు తెలుసు. మరి— మగాణ్ణి ఉర్రూతలూగించే ఈ నిండు అలంకరణేమిటంట-- రాత్రి మూడ్ మళ్ళీ వచ్చేసిందేమిటి—"


“ఏం? వస్తే తప్పా! భార్యాభర్తల మధ్య ఇది ఒప్పే కదా! మెప్పే కదా ! ఇప్పుడు మేటర్ కి వస్తున్నాను. మనమిప్పుడు వరూధిని గారింటికి వెళ్తున్నాం. ఎందుకని ఆశ్చర్యపోకండి. మందాకినికి పుట్టినరోజు”.


అతడు నిజంగానే ఆశ్చర్యపోతూ అడిగాడు- “నీకెలా తెలుసోయ్? "


“దాదాపు ప్రతి రోజూ యేదో ఒక సందర్భాన ఫోనులో మాట్లాడుకుంటుంటాం. కష్టసుఖాలు పంచు కుంటుంటాం. అప్పుడు చెప్పింది విషయం-- సుభాషిణికి- సారీ- మందాకినికి సర్ ప్రైజర్ ఇవ్వబోతున్నాను. గిఫ్టులు కొనుంచాను. చూస్తారా? "


“ఉహూఁ! వాటిని చూసే తీరిక నాకిప్పుడు లేదు గాని-- దారిలో దిగబెట్టి వెళ్ళిపోతాను” అంటూ టీ-తాగనారంభించాడు.


ఆమె నెక్ టైని మరింతి బిగుతుగా పట్టుకుని లాగుతూ అంది- “లేదు. అదేమీ కుదరదు. మీరు కూడా నాతో బాటు రావలసిందే! ఆ తరవాతనే మీరు ఆఫీసుకి వెళుదురుగాని—"


“చెప్తే అర్ధం చేసుకోవాలి ప్రభా! కారణం చెప్పాగా.. నాకిప్పుడు కార్పొరేట్ ఆఫీసులో బిజీ షెడ్యూల్ ఉందని”.. అని ఇంకేదో చెప్ప బోయేంతలో డోర్ బెల్ మ్రోగడం- భాగ్యం వేగంగా వెళ్ళి తలుపు తీయడం ఒకేసారి జరిగిపోయాయి. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యమే తామై నోటమాట లేక నిల్చుండిపోయారు.

అక్కడ వరూధిని కూతురు చేయి పట్టుకుని నవ్వుతూ నిల్చుంది! “అదేమిటి అంత లావు ఆశ్చర్యపోతున్నారు! మందాకిని అంటే మీకు ప్రేమ కదా- అందుకని దానితో బాటు మనమందరమూ గుడి దర్శనం చేసి వస్తే సుభిక్షంగా ఉంటుందని—" అంటూ లోపలకు నిదానంగా నడుస్తూ వచ్చింది వరూధుని.


అప్పుడు ప్రభావతి నోరు తెరిచింది. “అబ్బే—అది కాదు వరూధిని గారూ! మొన్న మందాకిని పుట్టిన రోజని చెప్పారు కదా— అందుకని మీకందరకూ ప్లజంటే సర్ ప్రైజ్ యివ్వటానికి మేమే మీ యింటికి బయల్దేరాం. రండి! రండి! టీ పుచ్చుకుని పది నిమిషాలలో వెళ్తాం. "


ఆ మాటతో భువనేశ్ మందాకిని వద్దకు వెళ్ళి నెత్తి పైన చేయివేసి- “జన్మదిన శుభాకాంక్షలు తల్లీ! నీకోసం మీ ఆంటీ యేవో గిఫ్టులు తీసి ఉంచింది. వాటిని తీసుకుని చిన్నపాటి థేంక్స్ చెప్పి గుడికి వెళ్ళి అక్కణ్ణించి అలా యింటికి వెళ్ళి ఫ్రెండ్సుతో క్లాసుమేట్సుతో కలసి ఆటలూ పాటలూ చేసుకుందువు గాని. ఇక నేను వెళ్తాను ప్రభా-" అని యింటి గడప వేపు కదలబోయాడు.


ప్రభావతి ఊరుకో లేదు. “అదేమిటండీ-- అంతటి బిజీ బిజినెస్ షెడ్యూల్ విడిచి మేడమ్ మనింటికి వస్తే అలాగా అర్థాంతరంగా వెళ్ళిపోతారూ! ”


-------------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

-------------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


36 views0 comments
bottom of page