top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 8


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'The Trap Episode 8' New Telugu Web Series(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఎనిమిదవ భాగం


గత ఎపిసోడ్ లో

దివాకర్ ఉద్దేశమేమిటో వివరిస్తాడు కామేశ్వర్.

పరమేశ్వర్ అభిప్రాయం అడుగుతాడు వేదమూర్తి.

వరూధిని, మందాకినితో కలిసి భువనేష్ ఇంటికి వస్తుంది.


ఇక ది ట్రాప్.. ఎనిమిదవ భాగం చదవండి…


ఈసారి మందాకిని భువనేష్ చేయి పట్టుకుని లాగింది. “ఔను అంకుల్. మీరూ మాతో రండి. మీరు గాని వస్తే యెంత జాలీగా ఉంటుందని —ప్లీజ్ అంకుల్! ”


అప్పుడతడు బ్రతిమిలాడే ధోరణితో మందాకిని రెండు చేతులూ అందుకుని యేదో చెప్పబోయాడు. ప్రభావతి భర్తకు అడ్డు తగిలింది- “ప్రమోషన్లూ పోస్టింగుల గొడవలో పడి మీరు యిచ్చిన మాటను తప్పుతున్నారు మిస్టర్ భువనేష్”.


నేనా అన్నట్టు ఆశ్చర్యంగా చూసాడు సతీమణి వేపు.

“ఔను. మీరే! మన ప్లాను ప్రకారం మీరు వరూధిని గారి యింటి వద్ద కదూ దిగబెట్టి వెళ్తానన్నారూ? దానికి చిన్నపాటి సవరణతో మమ్మల్ని గుడిలో దిగబట్టి అటు ఆఫీసుకి వెళ్ళిపోదురు గాని- ఈజిటే ఓకే! ”


ఆ మాటతో అతడిక బదులివ్వకుండా వెనక్కి తగ్గి, పనిగత్తె వేపు చూసాడు కాఫీ కప్పులు త్వరగా తీసుకు రమ్మనమని.


“ఇదిగో బాబూ! పది నిమిషాలలో తేనూ—“ అంటూ వంట గది వేపు నడచింది. అతడలా భాగ్యానికి చూపులతో అదేశం జారీ చేస్తూ అసంకల్పితంగా వరూధిని వేపు చూసాడు. ఆమె అతణ్ణే నవ్వుతూ చూస్తూంది. అతడికప్పుడు చప్పున ప్రభావతి వరూధిని గురించి అన్న మాటలు గుర్తుకి వచ్చాయి.


కళగా నిండారోగ్యంతో పొడవుగా ఉన్నమాట వాస్తవమేనేమో కాని, మధుబాలలా ఉందీ— ఏమో! అతడు తేల్చుకోలేక పోయాడు. మధుబాలా యేమో భారతీయ ముస్లిమ్ స్త్రీ— వదూధినీ యేమో తెలుగు హైందవ స్త్రీ-- ఇద్దరూ బాగానే ఉంటారు.


కాని— అంతర్నేత్రంతో పోల్చి చూడటమే కష్టం. వీళ్ళద్దరి మధ్యా తన భార్య ప్రభావతిని నిల్చుండబెడితే—సెంట్ ఆఫ్ ది వుమెన్, షేఫ్ ఆఫ్-ది-విమన్ వేరు వేరు కోణాలలోనే ఉంటుంది. దగ్గరగా కొందరు ఒక విధంగా-దూరపు కోణం నుంచి చూస్తే మరొకరు మరొక విధంగా మొగ్గయి విరబోస్తారేమో-- అతడలా ఆలోచించుకుంటూ కాఫీకప్పు చేతికి తగలగానే తట్టున ముఖం తిప్పుకుని చేతిలోకి అందుకుని కాఫీ చప్పరించ సాగాడు.


మరి కాసేపటికి కాఫీలు తాగడం పూర్తయిన తరవాత మాటలు కొనసాగించాలి కాబట్టి భువనేష్ అడిగాడు- “కాఫీ బాగుందా మైడియర్ యంగ్ లేడీ? ”


మందాకిని వెంటనే బదులిచ్చింది- “నేను కాఫీ తాగలేదు అంకుల్! భాగ్యం అత్త నాకు హార్లిక్స్ కలిపి యిచ్చింది”


“ఓ అలాగా..” అంటూ లేచాడు భువనేష్. అతణ్ణి మందాకినితో బాటు ఇద్దరాడాళ్ళూ అనుసరించారు.


అందరూ జగజ్దనని గుడికి చేరుకున్న వెంటనే వరూధిని చేసిన ముందస్తు యేర్పాటు ప్రకారం అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి స్త్రీలిద్దరికీ ప్రసాదంతో బాటు అమ్మవారి పాదాల వద్ద ఉంచిన పూలను కూడా సగ భాగాన యిచ్చారు. అప్పుడు యెవరూ యెదురు చూడని విధంగా తల్లి చేతినుండి తట్టను అందుకుని, “అంకుల్ నుదుట బొట్టు నేను పెడ్తాను” అంటూ భువనేష్ ముఖం వేపు చేతిని చాచి కుంకుమ పెట్టబోయింది.


వరూధిని కూతుర్ని మందలించింది “ఏమి చేస్తున్నావు మందాకినీ! అంతటి పొడవైన అంకుల్ నుదుటిని అందుకోవడం నీకెలా వీలవుతుందీ! చూడు.. వైట్ షర్టుపైన కుంకుమ పొడి యెలా రాలిపోయిందో” అంటూ అసంకల్పితంగా షర్టుపైనున్న కుంకుమని చేతి వ్రేళ్ళతో చెదరగొడ్తూ మరొక చేతితో అతడి నుదుట కుంకుమ బొట్టు పెట్టింది. అతడు నివ్వెరపోతూ ప్రభావతి వేపు చూసాడు.


ఆమె ఇటు చూడకుండా గర్భ గుడిలోని అమ్మవారి విగ్రహం వేపు తదేకంగా చూస్తూ చేతులు జోడించి నిల్చుంది. అతడి ముఖాన కానవచ్చిన యిబ్బంది గమనించి గావాలి వరూధిని మెల్లగా అతడికి మాత్రమే వినిపించేలా అంది “సారీ! మందాకిని వల్ల మీ షర్టు పాడయిపోతుందని—”


అతడేమీ అనకుండా మందాకినిని ఓసారి యెత్తుకుని దింపి- “ఇట్స్ ఆల్ రైట్ మేడమ్--” అంటూ ప్రభావతి వద్దకు వెళ్లి తనిక బయల్దేరబోతున్నాడని చెప్పి గుడి ఆవరణకు ఆవల ఉంచిన కారు వేపు నడిచాడు. కారులో కూర్చున్నప్పుడు ప్రభావతి వరూధిని రూపం గురించి చెప్పిన మాటలు మనసున మెదిలాయి. నిజంగానే వరూధిని అప్పటి బోలీవుడ్ సినీ స్టార్ మధుబాలలాగే ఉందా! ఏమో-ఎందుకో మరి-తనెవరిని యెప్పుడూ చూసినా అతడికి తన ప్రియమైన సతీమణి ప్రభావతితోనే పోల్చి చూడటం ఆనవాయితీగా మారింది.


స్వదేశంలో గాని విదేశాలలో గాని బింకంగా బిగి యవ్వనంతో యెవరిని చూసినా అతడికి ప్రభావతి రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. అందుకే కదా విజ్ఞులు దశ సంస్కారాలలో వివాహానికే మొదటి పీఠం వేసిందీ--


కలయికలూ ముఖాముఖి యెదుర్కోవడాలూ అనూహ్యంగా చిత్రాతి చిత్రంగా జరిగిపోతుంటాయి. వీటినే ఆంగ్లంలో ఆశ్చర్యకరమైన ఎన్ కౌంటర్స్ అంటారేమో! మరునాడు ఉదయం డోర్ బెల్ నొక్కుతూ ఇంటి గుమ్మం వద్ద నిల్చున్న భువనేష్ ని హాలులో కూర్చుని యెవరో కంపెనీ నిర్వహణాధికారితో కాలుపైన కాలు వేసుకుని మాట్లాడుతూ కూర్చున్న వరూధిని అనంత ఆశ్చర్యాంబుధిలో మునిగిపోయింది.


“మీరా!” అంటూ లేచి వెళ్ళిందామె. ఆమె గెశ్చర్ ని చూసి అక్కడప్పుడు ఆమెతో మాట్లాడుతూ కూర్చున్న నార్త్ యిండియన్ వ్యక్తి కూడా తానుగా లేచి నిల్చున్నాడు, భువనేష్ లోపలకు వస్తూనే క్షమాపణలు చెప్పుకున్నాడు-


“సారీ మేడమ్! మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అప్పటికీ ప్రభతో చెప్పాను అంత తొందర పడనవసరం లేదని. ఐనా- ఊరుకోకుండా నన్ను పంపించింది—”


ఆమె విస్తుపోతూ చూసింది. “నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందండీ! దేనికి తొందరపడవద్దన్నారు— ఎందుకు తొందరపడవద్దన్నారు—”


అతడు గట్టిగా నవ్వేస్తూ చేతిలోని బ్యాగుని అక్కడున్న బల్లపైన పెడుతూ వివరణ యిచ్చాడు- “మరేం లేదు మేడమ్— నిన్న పాపకోసం యింట్లో కొనుంచిన గిఫ్టు వస్తువుల్ని పాప తీసుకోకుండానే వెళ్ళిపోయింది కదూ! దానికి ప్రభ చాలా ఫీలయిపోయి వాటిని పంపించింది. ఇక నేను వెళ్తాను మేడమ్. సారీ ఫర్ ది డిస్టర్బన్స్—”

“ఏవిటిది భువనేష్-- ఇన్ని సార్లు సారీలు చెప్తున్నారు.. ఇప్పుడేమి జరిగిపోయిందని— మా కంపెనీ మార్కెటింగ్ మేనేజరుతో మాట్లాడుతూన్న మధ్యలో వచ్చారు. అంతే కదా— నిన్న నేను మాత్రం చెప్పాచెయ్యకుండా మీ యింటికి వచ్చి మీ భార్యాభర్తలిద్దర్నీ నేను డిస్టర్బ్ చేయలేదూ—” అని తనలో తను ఆత్మసమర్థన చేసుకుంటూ మేనేజర్ని భువనేశ్ కి పరిచయం చేసింది. చేతులు కలిపి పరామర్శించుకున్న తరవాత, ఇక తను బయల్దేరుతున్నాడని చెప్పి బయటకు నడిచాడు భువనేశ్. ఆమె అతణ్ణి అనుసరించి వెళ్తూనే అడిగింది- “కాఫీ తీసుకుని వెళ్ళరూ!”


అతడు నవ్వి “పర్వాలేదు మేడమ్. నేను ఫుల్ బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వస్తున్నాను. గుడ్ బై మేడమ్—” అంటూ కారు వేపు సాగిపోయాడు.

------------------------------------------------------------------------------

కుటుంబ జీవనంలో రోజులు కొండ చరియల్లోనుండి ఊడిపడే పొత్తరాళ్ళలా రాలిపడుతున్నాయి; కొన్ని చప్పుడు చేస్తూ, మరికొన్నిసవ్వడి లేకుండానూ-- వేదమూర్తికి దూర బంధుత్వం గల పెద్దావిడ, తల్లి మంగళాదేవమ్మగారి చిన్ననాటి స్నేహితురాలైన ఒక పెద్దావిడ మంచాన పడి అనారోగ్యం పాలైన ఉదంతం విని తల్లితో బాటు అక్కడికెళ్ళి ఆమెగారి బాగోగులు చూసి ఊరి పొలిమేరన ఉన్న త్రిపురాలయం దర్శించి ఇల్లు చేరేటప్పటికి రెండు రోజులయాయి.


బంధువులూ తెలిసిన వాళ్ళూ కట్టిచ్చిన తినుబండారాలు గట్టిగా మూటగట్టుకుని ఇల్లు చేరేటప్పటికి వాళ్ళూహించలేని విస్మయాత్మక దృశ్యం ఇద్దరికీ యెదురయింది. దిమ్మ తిరిగినంత పనయింది. అసలది తమ గృహమేనా లేక అంతకు మునుపెన్నడూ చూసెరగని పొరుగు వాళ్ళ గృహమేనా-- కాని, బిత్తర చూపులతో లోపల అడుగు పెట్టిన తరవాత కామాక్షమ్మ అత్తయ్యను పలకరిస్తూ ఎదుర్కోలు పలికిన తరవాతనే వాళ్ళకు గాహ్యమైంది అది తమ స్వంత యిల్లేనని—


కూతురూ, చిన్న కొడుకూ ఆనందంగా వాళ్ళను చుట్టుముట్టిన తరవాత తేట తెల్లమైంది అది కొత్తగా కనిపిస్తూన్న తమ గృహమేనని--


తల్లీ కొడుకులిద్దరూ యింకా చెదరని బిత్తర చూపులతో చూస్తూ నే అడిగారు- “ఏమిటి ఇదంతా కామాక్షీ! మేము బైటకెళ్ళిన రెండు మూడు రోజుల్లో ఇంట్లో రాజకీయ మోర్చా వంటి ఇంతటి పెద్ద మార్పా—వెడల్పాటి పెద్ద సోఫాలు- కొత్త రకం సీలింగ్ ప్యానులు- కాస్ట్లీ ఆల్మెరాలు. హాలుని ఆక్రమించేంత బ్రాండ్ వైట్ గుడ్స్ కంపెనీ వాళ్ళ ఖరీదైన ఎయిర్ కూలరూ— హాలు మధ్య డిజైనర్ కార్పెట్ కూడాను. ఇవన్నీ మనింటికి యెలా వచ్చాయి? అంటే—చివరి వార్త తమ నోట వినకముందే దివాకర్ పెళ్ళి లాంఛనాలు ఆరంభించేసాడన్నమాట! అంత తొందరపాటెందుకో---” అప్పుడు కమల, తండ్రిగారి మోచేతి చొక్కాను పట్టుకుంది. “ఇంతే కాదు నాన్నారూ! లోపల ఇంకాపెక్కు వస్తువులు ఉన్నవి. బామ్మ గదికి ఏ సీ మినీ మిషన్- మనందరికీ ఉపయోగ పడేలా వాషింగ్ మిషన్ కూడానూ-”

“అది సరేనమ్మా! ఇంతకీ ఇవన్నీ తెచ్చి యింటినిండా జొప్పిందెవరూ? దివాకరేనా!”


పవన్, కమల యిద్దరూ కాదన్నట్టు తలలు అడ్డంగా ఆడించారు. అప్పుడు కామాక్షమ్మ మధ్యకు వచ్చింది- “అక్కా తమ్ముడూ యిద్దరూ మీతో మరీ ఆటలాడుకుంటున్నారు. నేను చెప్తానండీ! ఇవన్నీ పరమేశ్వర్ తెచ్చి పెట్టాడు. ఇంకా మరికొన్ని తెచ్చి పెడ్తానంటున్నాడు”.


ఆ ఒక్క మాటతో తల్లీ కొడులిద్దరూ ఒక్కసారిగా అన్నారు- “మన పరమేశ్వరా! మొన్నమొన్ననేగా వాడేదో మాట వరసకన్నట్టు చెప్పాడు అదేదో కోర్సు పూర్తి చేయబోతు న్నట్టు- దానికి తగ్గట్టు ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టూ-- అంతలోనే ఇంత భారీ సామగ్రా? ఎడా పెడా వాయిదాల పధ్ధతి పైన అప్పులు చేసి కొనేసాడా!”


వేదమూర్తి అలా క్వరీ లేవదీసాడో లేదో అక్కడ ఇంటి గుమ్మం వద్ద పరమేశ్వర్ గొంతు వినిపించింది. “మనింటి ఆనవాయితీకి విరుధ్ధంగా నేనెలా అప్పులు చేసి సామాను కొంటాను నాన్నగారూ ! నేను గాని అలా సాహసించి చేస్తే మీరందరూ ఊరుకుంటారా! తోలు ఒలిచి ఎండలో ఆరబెట్టరూ! మీరెలాగూ నాకు స్పెషల్ కంప్యూటర్ కోర్సు కోసం డబ్బులు అడిగితే-- లేవని చేతులు విరిచేసారాయె.


అందుకని పెద్దన్నయ్య సహకారంతో పెద్దన్నయ్యకు తెలిసిన ఒక కాలేజీ ప్రొఫసర్ గైడన్స్ తో అది సవ్యంగా పూర్తి చేయగలిగాను. దాని ఫలితంగా ఒక బెల్జియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీలో రెండు నెలలు క్రితమే ట్రైనీగా చేరాను. వారం క్రితం నా పే-ఫిక్స్ చేసి నాకు పే-ప్యాకెట్టు ఇచ్చేసారు-”


“నెలకి యెంతేమి”టని అడిగాడు వేదమూర్తి. “లక్షా ఇరవై వేలు”- బదులిచ్చాడు పరమేశ్వర్.


“ఏమన్నావూ? ఎంతన్నావూ! సరిగ్గా వినిపించనట్లుంది. మరొకసారి చెప్పూ--”

“క్లియర్ గానే చెప్పాను నాన్నగారూ! నెలకు పి. ఎఫ్. తదితర కట్టింగ్స్ గట్రా పోగా నాకు నెల నెలా వచ్చేది లక్షా ఇరవై వేలు—”.


ఎట్టకేలకు మంగళాదేవమ్మ నోరు తెరిచారు- “ఇన్నాళ్లూ నువ్వేదో కంప్యూటర్ పైన సరదా కోసం స్పెషల్ కోర్సులంటూ మా వెంట తిరుగుతున్నావనుకున్నాను గాని, అంత పెద్ద సాంకేతిక విద్య నేర్చుకుంటున్నావని అనుకోలేదురా అబ్బీ! అంతా యింటి ఖర్చుకే పెట్టేస్తే మరి నీకు స్వంత ఖర్చుకేమి చేస్తావురా?”

“అదేమీ కాదు బామ్మా! నాకు లేకుండా అంతా యెలా ఇంటికి ఖర్చుచేస్తాను-” అంటూ మంగళాదేవమ్మ చేతికి పే- ఫిక్సేషన్ ఆర్డర్ అందిస్తూ వంగి కాళ్ళకు నమస్కరించి ఆ తరవాత వేదమూర్తికి కూడా నమస్క రించాడు. కామాక్షమ్మ అత్తగారి చేతినుండి ఫిక్షేషన్ ఆర్డర్ అందుకుని తిన్నగా పూజగదిలోకి వెళ్ళి దేవుడి పటం ముందు ఉంచి వచ్చింది. అప్పుడు పరమేశ్వర్ తనకు బైట పనుందని చెప్పి వెళ్ళిపోయాడు.


మాటా పలుకూ లేకుండా నిల్చుండి పోయిన వేదమూర్తి ఇక అక్కడ తనకేమీ పని లేదని చెప్తూ లోపలకు నడిచాడు; కూతురు తెచ్చిచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ--


“అదేమిటి నాన్నారూ! చాలా డల్ గా కనిపిస్తు న్నట్టున్నారు. స్నానానికి వేడి నీళ్ళు పెట్టేదా?”.


అతడు వద్దంటూ మంచంపైన కూర్చుని కాఫీ తాగసాగాడు. కాని— అతడి మనసు యెక్కడో ఊహాలోకంలో సంచరిస్తూంది. బడి రోజుల్లో తెలుగు పంతులుగారు అవసరం కలిగినప్పుడల్లా సంస్కృతంలో ఒక మాట చెప్తుండేవారు. విద్యావాన్ ధనవాన్ భవేత్: తనప్పుడు అదేదో పిల్లకాయలకు చదువులో ఆసక్తి కలగడానికి పంతులుగారు అలా చెప్తుండే వారని తలపోస్తుండేవాడు.


అప్పటి ఆ సంస్కృత వాక్యాన్ని ఇప్పటి సాంకేతిక ఉద్యోగార్హతలను బట్టి చూస్తుంటే అందులో కొండంత వాస్తవం ఉన్నట్లు తోచడం లేదూ! సరస్వతీ దేవికి— లక్ష్మీదేవికి మధ్య చిటపట చినుకుల్లాంటి వాద ప్రతి వాదనల గురించి కూడా వింటుండే వాడు. ఇప్పుడు వాటి గురించి యేమి చెప్పగలడు— చదువుల తల్లి సరస్వతీ దేవికి ఉన్న స్థానం నిరంతరమనీ, ఉన్నతమని తెలియడం లేదూ? ” ఇలా పరిపరి విధాల ఆలోచించుకుంటూ కోడి కునుకు పాటుకి లోనయాడు వేదమూర్తి.


పరమేశ్వర్ తిన్నగా షాపింగ్ మాల్ కి వెళ్ళాడు. తనకు అన్నయ్య మాట మన్నించి ప్రీగా టెక్నికల్ కోచింగ్ యిచ్చిన ప్రొఫసర్ గారి కోసం వెండి స్ట్రాప్ గల వాచీ కొని చేతులు జోడిస్తూ నమస్కరించి భవ్యంగా అందచేసి వచ్చాడు. అంతటితో ఊరు కోలేదు. గిఫ్టు ప్రియుడైన టెక్నికల్ కోర్సు ప్రొఫెసర్ కి అందమైన వాచీ అందచేసి వచ్చినట్టు చెప్పి, భువనేష్ వద్ద శెభాస్ అందుకున్నాడు.


అప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్న భువనేష్ అడిగాడు “ఇంకెవరికి యివ్వబోతున్నావు? ”

ఔను- యివ్వబోతున్నానని బదులిచ్చాడు పరమేశ్వర్. “కమలకా! ”

“కమల సంగతి తరవాత—మొదట నీకేదైనా యివ్వాలనుకుంటున్నా. ఏం కావాలో అడగరా అన్నయ్యా! ”


“నూర్మూసుకుంటావురా పేడలోని పిడుగా! నాకిచ్చేంత యెదిగి పోయావూ! మొదట ముక్కుతూ మూల్కుతూ వెళ్తూన్న స్కూటర్ ని అటకెక్కంచి బాబాయికి కొత్త స్కూటర్- ప్రి ఫరేబ్లీ ఈ- వెహికల్ కొనివ్వు.. నాకు కొంచెం పనుంది. గదికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో— ప్రక్కన మీ వదినె నిల్చుంది. కాసేపు ఊసులాడుతుండు” అంటూ ఫోన్ క్రెడిల్ ని ప్రభావతికి అందించాడు భువనేష్.


పరమేశ్వర్ వెంటనే సంభాషణ అందుకున్నాడు- “ఉదయకాల వందనములు వదినా!’


“ఏ లోకంలో ఉన్నావురా మరదీ! ఇండియాలోనే కదా ఉన్నావు— ఇప్పుడు ఉదయకాలమా— మధ్యాహ్నం కదూ? సరే— అదంతా తరవాత తేల్చుకుందాం గాని— ముందు ఇది తేల్చు- మా చిన మాఁవగారి చిన్ననాటి దోస్త్ దివాకర్ గారి యింటి సంబంధం వచ్చిందటగా! అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయటేగా— అమ్మాయి ఫొటో కూడా నాకు మొబైల్ కి పంపించారు. అమ్మాయి మంచి రూపవతే— మరెందుకు కాదన్నా వోయ్! పొగరుబోతు అమ్మాయంటావా--’

”అబ్బే! నేనలా అనలేదు వదినా! అమ్మాయి మంచిదే— నాకు తెలుసు కూడా— కాని ప్రాక్టికల్లీ సైకలాజికల్లీ ప్రిస్టేజి పద్మనాభం వంటి కుటుంబానికి చెందిన మా వాళ్ళు ఆమెతో సర్దుకుపోలేరనే, వరదకు అడ్డుకట్ట వేసినట్టు వద్దని తప్పుకున్నాను. బాల్య స్నేహితుడి కూతురు సంబంధమని నాన్నగారు లోలోన సంబర పడిపోతున్నా— రేపు లెక్కలు కుదరక పెక్కు సమస్యలు యెదుర్కోవలసి వస్తుందన్నది ఆయన మరచిపోతున్నట్టున్నారు.


ఇంట్లో వాళ్ళందరూ దాదాపుగా దివాకర్ అంకుల్ గారి ముందు సరెండర్ ఐపోయారనుకో! ముందున్నది మొసళ్ళ పండగన్నది మా యింటి వాళ్లు మరచిపోతున్నారు. మరొక మాట— అందరూ నీలా అణగి మణగి పెద్దవాళ్ళతో సర్దుకుపోరు కదా వదినా--’


“చలి కాలం. మరీ పెద్ద ఐస్ గడ్డ నెత్తిపైన పెట్టకు. జలుబు చేసి మంచాన పడ్తాను. ఇప్పుడు నేను చెప్తూన్న మాట వినిపించుకో — ఉన్నపళంగా సంబంధం వద్దని ముఖాన కొట్టేయకు. ఇంట్లో పెద్దవాళ్ళు నొచ్చుకోవచ్చు. ఆగి— నిదానంగా ఆలోచించి— ఆ తరవాత నిర్ణయం తీసుకో— ఈ లోపున మీ అన్నయ్య కామేశ్వరరావుకి కూడా సంబంధం వెతకాలి కదా! దివాకర్ గారి బంధు త్వం వల్ల వాడికి కూడా ఏదైనా మంచి సంబంధం కుదరవచ్చు కదా! ఇక నేను తలంటు పోసుకుని రావాలి. అత్తగారిని నేనడిగానని చెప్పు— అన్నట్టు ఒకటడు గుతాను. నిజం చెప్తావా!”


అతడు నవ్వి- “ఎందుకు చెప్పనూ— అడుగు వదినా!’ అని బదులిచ్చాడు.


“నువ్వెక్కడైనా లవ్ లో పడ్డవేంటి?’

“నేను పడలేదు. ఇంతవరకూ చదువుల పోరుతోనే సరిపోయింది కదా— ఇక దానికెక్కడ టైముంటుందొదినా! బహుశా మీ చిన్న మరది పడ్డాడేమో-- ఆ సంగతి విడిగా చెప్తాలే-”

అలాగా- అంటూ ఫోను పెట్టేసింది ప్రభావతి నవ్వుతూ-- మరుదులతో గిల్లి కయ్యం పెట్టుకోవడం ఆమెకు ఎనలేని సరదా--

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.31 views0 comments

Commentaires


bottom of page