top of page

తీరిన కోరిక


'Thirina Korika' written by Parimala Kalyan

రచన : పరిమళ కళ్యాణ్


కూతుర్ని అన్న కొడుక్కి ఇచ్చి చేయాలని కోరుకుంది శ్యామల. కానీ జరగలేదు.

మరి ఈ కథకు తీరిన కోరిక అనే పేరు ఎందుకు పెట్టారో పరిమళ కళ్యాణ్ గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.


సుజిత్ నిశ్చితార్థం పనుల్లో హడావిడిగా ఉంది ఆ ఇల్లు. ఇంట్లోని వారంతా నిశ్చితార్థం ఏర్పాట్లు చూస్తూ, కావాల్సిన సామగ్రి, బట్టలు అన్నీ సర్దుతూ ఉన్నారు. బయటనుంచి వినవచ్చిన మాటలకి హాల్లో ఏర్పాట్లు చేస్తున్న వారంతా తమ పనులు ఆపేసి బయటకి వచ్చారు.

ఒకావిడ గుమ్మలోనుంచే అరవటం మొదలుపెట్టింది. "ఏమిటో ఈ మనుషులు, డబ్బు చేతిలో ఆడేసరికి బంధాలు, బంధుత్వాలు మరచిపోతారు" అంటూ బొంగురు పోయిన గొంతుతో పెద్దపెద్దగా కేకలు పెడుతోంది.

ఆ మాటలు అస్పష్టంగా విన్న సుజిత్ తల్లి విశాల గుమ్మం దగ్గరకు వచ్చి, ఎదురుగా ఉన్న ఆవిడని చూసి, ఆప్యాయంగా "వదినా మీరా, ఇలా రండి లోపలకి. ఏమ్మా లత బాగున్నావా!" అంటూ లోపలకు తీసుకుని వచ్చింది.

"చాల్లే ఈ మర్యాదలు. నిశ్చితార్థం సంగతి మాకు చెప్పారా ఎవరైనా? అసలు మేమున్నామని మర్చిపోయారా?" అంది నిష్టురంగా శ్యామల.

"అయ్యో అదేం లేదు వదినా. అనుకోకుండా ఏర్పాటు చేసాము. అందుకే ఈ హడావిడి. ఇంకా ఎవరికీ చెప్పనేలేదు నిశ్చితార్థం సంగతి!" అంటూ ఎంతో నెమ్మదిగా, వినయంగా మాట్లాడింది విశాల.

"ఓహ్ అయిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి చెప్పలేదా. మేం అయిన వాళ్ళం కాదుగా హ్మ్మ్ *అవునులెండి. ఇప్పుడు మేమెందుకు మీకు గుర్తుంటాము ?*" అంది శ్యామల మరింత వెటకారంగా.

ఆ మాటలకి నొచ్చుకున్న విశాల "అదేంటి వదినా అలా అంటావు. మీ కన్నా మాకెవరు ఎక్కువ?" ఇంకా ఏదో చెప్పబోయేంతలో అడ్డుపడి,

"హా ఈ మాటలకేం తక్కువ లే. అన్నయ్య ఎలాగూ లేడు, వదిలించేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ బంధం మా మెడకు చుట్టుకుంటుందని అనుకోరా ఏమిటి?"

"పైగా అసలే మీరిప్పుడు కోటీశ్వరులు. అబ్బాయికి వేరే వాళ్ళతో పెళ్ళి చేస్తున్నారు. మరి అన్నయ్య నాకిచ్చిన మాట సంగతి ఏమిటి వదినా ? నా కూతురు భవిష్యత్ సంగతి ఏమిటి? దాని జీవితం ఏం కాను? " అంటూ రోదిస్తూ ఉంది శ్యామల.

"అయ్యో వదినా! నట్టింట్లో అలా ఏడవకండి. అబ్బాయి వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరు బాధ పడద్దు. లతకి వేరే సంబంధం చూసి పెళ్ళి చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? శుభకార్యం జరుగుతోంది. మీరు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని రెడి అయ్యి రండి." అంటూ ఆవిడ పక్కనే ఉన్న అమ్మాయిని చూసి, "ఏమ్మా లతా, అంతా బాగానే ఉంది కదా! ఇది మీ బావ నిశ్చితార్థం. వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు అని బాధపడకు. నీకు మంచి సంబంధం నేను తెస్తాను" అంటూ అనునయించబోయింది విశాల.

"అయ్యో అత్తా, అలాంటిదేమి లేదు. నాకు బావతో పెళ్ళి జరగాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మా అమ్మే, ఎప్పుడూ బావతోనే నీ పెళ్ళి, బావే నీ మొగుడు అంటూ నా చెవిలో నూరిపోసేది. ఇప్పుడు కూడా అమ్మ బలవంతం మీద ఇలా వచ్చాను. అమ్మ మాటలకి ఏమీ అనుకోకండి అత్తయ్య!" నచ్చచెప్పింది లత.

"నువ్వేంటే చెప్పేది. నా గురించి నీకేం తెలీదు. నువ్వు చిన్నపిల్లవి. ఊరుకో. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా!" అంటూ విసురుగా లోపలకి వెళ్ళిపోయింది శ్యామల.

"అదేం లేదులేమ్మా లతా! మీ అమ్మ సంగతి నాకు తెలియదా? సరే ఇంకేమీ ఆలోచించకుండా నువ్వు కూడా రెడి అవ్వు ఫంక్షన్ కి. ఆ గదిలోకి వెళ్ళండి" అంటూ పక్కనే ఉన్న గది చూపించింది విశాల.

వాళ్ళు గదిలోకి వెళ్ళగానే విశాల సోఫాలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టింది. "తను చేస్తున్నది మంచి పనేనా, తనేం అన్యాయం చెయ్యటం లేదు కదా? వదిన కి మాట ఇచ్చిన సంగతి నిజమే, కానీ మాట ఇచ్చిన భర్త లేడని ఆ మాటని విస్మరిస్తే అతని ఆత్మ క్షోభ పడుతుందేమో? కానీ ఒక పక్కన కన్న కొడుకు జీవితం. తనకి నచ్చిన అమ్మాయితో పెళ్ళి జరిపిస్తానని కొడుక్కి మాట ఇచ్చింది తను. మరి అలాంటప్పుడు ఎవరి మాట నిలబెట్టాలి. భర్త ఇచ్చిన మాటా, కొడుక్కి ఇచ్చిన మాటా?" ఇలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళింది.

ముప్పై ఏళ్ళ క్రితం, తనకి నచ్చిన సాగర్ తో తన పెళ్ళి చేశారు తల్లిదండ్రులు. కానీ సాగర్ చెల్లి శ్యామలకి, తల్లికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎన్నో రకాలుగా విశాలను బాధ పెట్టేవారు. శ్యామల ఆడపడుచుని తన అన్నకిచ్చి చేస్తే బయట సంబంధం కాకుండా అంతా కలిసి ఉండవచ్చని, అలాగే అత్తవారింట్లో తన గౌరవం పెరుగుతుందని శ్యామల ఆలోచన. కూతురు అత్తారింట్లో బాగుండాలని ఆలోచించే ఆమె తల్లి కూడా కూతురి మాట ఖాయం చెయ్యాలి అనుకుంది. ఇంతలో విశాలని తీసుకుని వచ్చి, తనతోనే పెళ్ళి అన్నాడు సాగర్. తల్లీ కూతుళ్ళిద్దరూ ఆ మాటకి ఎంతో రాద్ధాంతం చేశారు. ఎలాగో పెళ్ళి చేసుకున్నాడు సాగర్.

పెళ్ళైన తర్వాత కూడా ఆడపడుచు, అత్తగారు విశాలని ఏదో రకంగా బాధ పెట్టేవారు. అయినా వాళ్లకు ఏనాడూ ఎదురు చెప్పలేదు విశాల. ఎవరెన్ని అన్నా తన తోడుగా నిలిచాడు సాగర్. ఆ ప్రేమతో కాలం గడిపేసింది విశాల. కొడుకు, కూతురు పుట్టారు. అత్తమామలు ఇద్దరూ పోయారు. సిటీకి మకాం మార్చారు.

ఉద్యోగం వదిలేసి, వ్యాపార రంగంలో దిగి కష్టనష్టాలను దాటి మంచి వృద్ధిలోకి వచ్చాడు సాగర్. కొడుకు సుజిత్ విదేశాల్లో ఎంబీఏ చదవటానికి వెళ్ళాడు, కూతురు ఫాషన్ డిజైనింగ్ లో చేరింది.

అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చే చెల్లి శ్యామల అన్న ఉన్నతిని చూసి గర్వపడినా, తనకి నచ్చని వదిన ని చూస్తూ పట్టలేక పోయేది. అన్న సాగర్ తో తన కష్టాలు, గోడు అంతా వివరించి, తనకొక దారి చూపించాలని అడిగేది.

"శ్యామలా, నువ్వేం బాధపడకు. నీ కూతురి బాధ్యత నాది. అయితే తనని ఈ ఇంటికే కోడల్ని చేసేద్దాం. అప్పుడు నీకు సంతోషమేగా?" అన్నాడు సాగర్.

ఆ మాటలకి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది శ్యామల. కూతురు ఈ ఇంటికి కోడలైతే ఈ ఆస్తంతా తనదే అనుకునేది. కానీ హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ వల్ల సాగర్ చనిపోయాడు. సుజిత్ ఎంబీఏ పూర్తి చేసి, తండ్రి బిజినెస్ చూసుకుంటున్నాడు.

తనకి నచ్చిన అమ్మాయి, అంతేకాకుండా బిజినెస్ పార్టనర్ కూతురు స్నేహ తో పెళ్ళి జరగబోతోంది ఇప్పుడు.

*****

"అమ్మా పెళ్ళి వారు వస్తున్నారు" అంటూ పిలిచిన పిలుపుకి గతంలో నుంచి బయటకు వచ్చింది విశాల.

ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండుగా చేశారు. వచ్చిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చారు. అవి తీసుకుని అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. లత, సుజిత్ నిశ్చితార్థం వేడుకలో చలాకీగా ఉంటూ అన్ని పనులూ చూసుకుంది.

తనని చూసి, "బంగారు బొమ్మలా ఉన్నావు. నువ్వు ఎవరింటికి వెళ్తావో, ఆ ఇల్లు కళకళలాడిపోతుంది." అంటూ బుగ్గన చుక్కపెట్టి, మెటిక విరిచింది విశాల.

శ్యామల మాత్రం కంటతడి పెట్టుకుంది.

"వదినా, నన్ను క్షమించు. నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. అయినా నువ్వు పెళ్ళి వారి ముందు నాకే పెద్దరికం ఇచ్చావు. మా ఆడపడుచుని అన్నయ్య పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. నిన్ను చేసుకున్నాక చాలా కోపం వచ్చింది. తెలిసిందే కదా, మా ఇంట్లో అంతంత మాత్రం గానే నడిచేది జీవితం. ఎప్పుడూ సుఖాలకు నోచుకోలేదు. కనీసం నా కూతురైనా ఈ ఇంటికి కోడలైతే సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను. అది తప్పేనని తేలిపోయింది. నా కోరిక తీరకపోయేసరికి అలా బాధలో ఏవేవో అనేసాను. నన్ను క్షమించు వదినా!" అంటూ విశాల చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంది.

"అయ్యో వదినా అవేం మాటలు. ముందు నువ్వు ఏడవకు. కంట్రోల్ అవ్వండి. ఇప్పుడేం జరిగిందని? అయినా లతకి కూడా సుజిత్ తో పెళ్ళి ఆలోచన లేదని చెప్పింది కదా. ముందు తన చదువు పూర్తి కానివ్వండి. అసలే లేక లేక పుట్టిన పిల్ల కదా, తన మీద ప్రేమతో అలా మాట్లాడారు. అది నేను అర్థం చేసుకోగలను. తన చదువులు పూర్తయ్యాక తనకి నచ్చిన వాడినో లేదంటే తనకి తగ్గ సంబంధం మనమే చూసి చేద్దాం. ఏమంటారు?" అంది విశాల.

అంత వినయంగా మాట్లాడుతున్న విశాలని ఎంత అపార్ధం చేసుకున్నాను అని బాధపడింది శ్యామల. ఈలోగా కూతురు సుజిత్ తో కలిసి సరదాగా మాట్లాడుతూ రావటం చూసి, "పెళ్ళి చేసుకోను అన్నాడు కానీ, తోడుగా ఉంటామన్నారు. మంచి సంబంధం కూడా చేస్తానన్నారు. ఇంకేం బాధా లేదు" అనుకుంటూ విశ్రాంతిగా నిట్టూర్పు విడిచింది శ్యామల.

సుజిత్ వస్తూనే, "అత్తయ్యా, అమ్మా మీకోక గుడ్ న్యూస్" అన్నాడు.

"ఏంట్రా అది?" అడిగారు ఇద్దరూ ఒకేసారి.

"నా ఫ్రెండ్ వివేక్ ఉన్నాడు, నాతో పాటే ఎంబీఏ చేసాడు. ఈ మధ్యనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు గడించాడు. ఎంగేజ్మెంట్ కి రావటం కుదరలేదు అంటే ఫొటోస్ పంపించాను. ఆ ఫొటోలో మన లతని చూసి ఇష్టపడ్డాడు. మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటానని కూడా చెప్పాడు. వివేక్ చాలా మంచివాడు, అందగాడు కూడాను" అన్నాడు సుజిత్.

"ఓహ్ అలాగే చాలా సంతోషం. కానీ లత చదువు పూర్తవ్వాలి కదా! ఒకవేళ అప్పటివరకూ వాళ్ళు ఆగుతామంటే అప్పుడు ఇదే సంబంధం ఖాయం చేసుకుందాం లేదంటే ఇంతకన్నా మంచి సంబంధం చూసే బాధ్యత నాది!" అంది విశాల.

కూతురికి మంచి సంబంధం చేయాలన్న తన కోరిక ఇలా తీరుతున్నందుకు లోలోపలే సంతోషించింది శ్యామల.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


176 views0 comments
bottom of page