top of page

తోం తోం తోం ధిరణన ధిరణన




'Thom Thom Thom Dhiranana Dhiranana ' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 17/12/2023

'తోం తోం తోం ధిరణన ధిరణన' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత




 "టీవీలో ఏవైనా డాన్స్ ప్రోగ్రామ్లు వస్తే చాలు.. 

అలా చొంగ కార్చుకుని చూస్తారు ఏమిటో! నాకు అర్ధం కానిది ఏంటంటే భక్తి సీరియల్స్ చూడమన్నా కూడా చూడరు. ఈ ఢీ డాన్స్ ప్రోగ్రాంలకు ఎందుకు తయారవుతారు? ముందు పేపర్ చూడండ”నీ కసురుకుంది కాంతం, భర్త సుబ్బారావును. 


 'నీ బండ పడ! నా జీవితకాలపు కోరికే సన్నటి రివట లాంటి పిల్లను చేసుకోవాలనీ. పెళ్లిచూపుల్లో నిన్ను చూసి ఈ పిల్ల లావుగా ఉంది చేసుకోనూ!? అంటే మా అమ్మానాన్న పెళ్లయి పిల్లలు పుడితే ఊరికే సన్న పడతారు ఆడపిల్లలనీ! చెప్పి పెళ్ళి చేశారు. నువ్వు పిల్లలు పుట్టగానే సన్నపడలేదు సరికదా రెట్టింపు బరువుతో యాక్టర్ సూర్యకాంతంను కూడా బీట్ చేశావు కదే' అని మనసులో గొనుక్కున్నాడు, సుబ్బారావు. 

 

 "ఏమిటీ మీలో మీరే నసుగుతున్నారు" అన్న కాంతం తో "అబ్బే! ఏమి లేదు? ఈ పూట వంటలు ఏమి చేయలేను? కాంతం కొంచం ఫీవరుగా! ఉంది నువ్వే ఏదోకటి చేద్దూ.. !" అని పళ్ళు ఇకిలించాడు" సుబ్బారావు. 


 "వీలు పడదు ఇవాళ నా అమావాస్య దీపం సీరియల్ పదివేల ఎపిసోడ్ చివరి బాగం. ఇదిగో ఈ దిక్కుమాలిన ఢీ డాన్స్ ప్రోగ్రామయితే నా సీరియల్ వస్తుంది. మీరు ఆ పిచ్చి డాన్సులు చూస్తూ కూర్చొకపోతే ఈ పాటికి వంట అయిపోయేది. చూస్తే డైరెక్ట్ గానే చూడవచ్చుగా! మధ్యలో ఆ పేపర్ ఎందుకు? అడ్డం, పైగా ఆ కళ్ళజోడు ఒకటి. అయినా! మన ఒప్పందం మర్చిపోయారా? రిటైర్ అయితే నేను వంట చేస్తానని మాటిచ్చారు. లేవండి. నాకు బాగా ఆకలిగా ఉంది, నా సీరియల్ అయ్యేలోగా వంట చేయండి. లేదంటే నే చస్తా.. సీరియల్లో లాగా భర్త వంట చేయకపోతే భార్య, భర్తను ఎలా? టార్చర్ పెట్టిందో ఆలా పెట్టనా!" అన్నది కాంతం. 

 

 'అంతపని చేయకులే, చేయక చస్తానా!? 'ఇపుడు నువ్వేదో! పెద్ద టార్చర్ పెట్టనట్లు' అని మనసులో అనుకున్నాడు. "నేను చిన్నప్పుడు డాన్స్ బాగా చేసేవాడిని. అందుకే ఈ టీవీల్లో వచ్చే ప్రతి ప్రోగ్రాం ఇంట్రస్టుగా చూస్తా కాంతం. దానికే ఓ.. అనుమానపడకు. చూసి అనందపడటమేగా!ఈ వయసులో చేసేది" అంటూ కాంతంను సముదాయించాడు. 


 "అదీ నిజమే మీ బట్టతల, బొజ్జ, ఆ లుంగీ చూసి ఎవరైనా? మీ ముఖం చూస్తారా! ఇలా టీవీల్లో చూసి చొంగ గార్చుకోవటమే పాపం మీ పని. డాన్స్ ప్రోగ్రామయింది లేచి వంట చేయండి. పడకుర్చీలో పడుకుని హుకుం జారీ చేసింది" కాంతం. 



 నేను వంట చేయకుండా, ఏదొక ప్లాన్ ఆలోచించాలనుకున్నాడు, సుబ్బారావు. ఆరోజు సాయంత్రం రిటైర్ అయిన వాళ్లందరూ! గాంధీ పార్కులో కూర్చుని మాట్లాడుకుంటుంటే వంట పని నుండి ఎలా తప్పించుకోవాలనే, ప్లానును అందరూ! ఆలోచించారు. ఒకే పన్ను ఉన్న ఏక దంతం ఐడియా నేను కాలిరిగిందని అబద్ధం చెప్పి ఒక ఆరునెలలు వంట పని తప్పించుకున్నా అన్నాడు. సుబ్బారావు ఆశగా ఇదేదో బావుందే నేను కూడా దీన్ని పాటిస్తే పోలా! అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లానును అమలుపరిచాడు కూడా. 


 ఏకదంతం సుబ్బారావు ఇంటికి ఫోన్ చేసి కాంతంతో "మీ ఆయనకు ఏక్సిడెంటయింది. హాస్పిటల్లో ఉన్నాడన్నాడు. " "అయ్యో! ఆయనకేమి అవలేదుకదా!"అంటే "ఏమవ్వల్లేదు కానీ! కాలికి కట్టు కట్టించుకుని ఇంటికి తెస్తున్నా అంటూ కాంతం ప్రశ్నలకు అడ్డు కట్ట వేస్తూ, ఫోన్ కట్ చేసి ఇంటికి తీసుకెళ్ళాడు సుబ్బారావుని ఏకదంతం. 


 ఇంటికి తీసుకెళ్ళి, మంచంపై పడుకోబెట్టి ఆరునెలల పాటు సుబ్బారావు మంచం మీద నుండి కడలకూడదన్నాడు డాక్టరు"అని చెప్పి అక్కడనుండి ఇంకేమి ప్రశ్నలతో చంపుకు తింటుందోనని! నాకు పనుందని వెళ్ళాడు ఏకదంతం. కాలు కట్టు వైపు అనుమానంగా చూస్తూ "అంత పెద్ద కట్టు కట్టారు ఎందుకు, ! అని కట్టుమీద చెయ్యి వేసింది కాంతం. "అబ్బా!పట్టుకోకు నొప్పనీ!" అరిచాడు సుబ్బారావు. 


 "విరిగిందా, బెణికిందా, అసలు ఎక్కడ, ఎప్పుడు ఎట్లా పడ్డారు. అడిగింది. అసలు పడగానే నాకు కాల్ చేస్తే అవిశాయపాలెం తీసుకెళ్ళి కట్టు కట్టిస్తే ఒక వారంలో తిరిగేవారు. ఆరునెలలు మంచంలో ఉంటే పిచ్చెక్కదు మీకు. మందుల చీటీ ఏదని! ఇంగ్లీష్ డాక్టర్లు, డబ్బులు గుంజటం తప్ప సరిగా కట్టుకట్టరు మందుల చీటీ ఏది అంది కాంతం

"మందుల చీటి ఏకదంతం దగ్గర వుందన్నాడు" సుబ్బారావు. "మనకివ్వకుండా! ఆయన జేబులో పెట్టుకుని పోవటం ఏంటి, అసలు ఏ డాక్టర్ ఈ కట్టు కట్టారని" గుక్కతిప్పుకోకుండా అనుమానంగా! అడిగిన కాంతంతో "ఒసే ప్రశ్నలకు మద్యలో గాపివ్వూ" అంటూ సుబ్బారావు సణిగాడు. 


 కాంతం డౌట్ ప్రశ్నలకు విరామం ఇస్తూ! "కాంతం ముందు కాఫీ పట్రావే"అని దీనంగా అడిగితే లోపలికి వెళ్ళింది. ఏకదంతానికి ఫోన్ చేసి ముందు ఆ మందుల చీటి ఫోన్లో వాట్సప్ చెయ్యి అన్నాడు సుబ్బారావు. ఏకదంతం గబగబా మందుల షాప్ కెళ్ళి వాళ్ల చేత బ్రూఫెన్ ఇంకేదో నాల్గు మందులు రాయించి సుబ్బారావుకు మెసేజ్ చేసాడు. కాంతం కాఫీ ఇస్తూ "మందులేవంటే!" "ఏకదంతం దగ్గరున్నాయి ఈ పూటకు మందులేసుకున్నాలే! అన్నాడు సుబ్బారావు. ఎక్కడో ! ఏదో తంతుందే ఏదో డౌట్ గా వుందనుకుంటూ, సుబ్బారావు కాలును అనుమానంగా చూస్తూ, కాంతం వంట చేయటానికి వెళ్తుంటే సుబ్బారావు 

"తలుపేసెళ్లు పడుకుంటానంటే" తలుపు దగ్గర కేసి వెళ్ళింది. 


 చకచకా లేచి బాత్రూమ్ కెళ్ళి వచ్చి పనులేవి లేవనీ! తాపీగా యుటూబ్లో తన అశ్విని నక్షత్ర జాతక ఫలం చూస్తూ పడుకున్నాడు సుబ్బారావు. మీకు ఇప్పుడు రాజయోగం నడుస్తుంది. ఒక వ్యక్తి సాయంతో మీరు పైకి ఎదుగుతారు. ఆ వ్యక్తి ఇంకెవరూ! ఏకదంతమే! మీరు కొరుకున్నవి మీ మంచం దగ్గరికే వస్తాయి. అవును కాంతం అన్నీ ఇక్కడికి తెచ్చి స్తే తినటమే అని లోలోపల మురిసిపోతున్నాడు సుబ్బారావు. 


 మరుసటిరోజు మందులు తెచ్చిచ్చి ఒక స్టిక్ సుబ్బారావు పక్కన పెట్టి వెంటనే వెళ్ళాడు కాంతం కంటపడకుండా! ఏకదంతం. స్టిక్ సాయంతో లేచి బాత్రూమ్కు వెళ్తున్నాడు సుబ్బారావు. 


 కాంతం వచ్చి "సాయం చేయమంటారా!" అంటే వద్దులే "ఈ స్టిక్ ఉందిలే నువ్వెళ్లి వంటపని చేసుకో" అన్నాడు దయగా సుబ్బారావు. మళ్ళీ ఎక్కడో ఎదో డౌట్! వస్తుంది కాంతంకు. తనకు కావాల్సిన వంటలు అడిగి మరీ చేయించు కుంటున్నాడు సుబ్బారావు, కాంతంతో. రూంలోకి అన్నీ వడ్డించిన కంచం వస్తుంటే అంబానీ లెవెల్లో సుఖపడుతున్నాడు సుబ్బారావు. 


 కాంతం ఫ్రెండ్ లక్ష్మి గౌరీ నోము నోచుకుంటూ! పిలిస్తే వెళ్ళింది కాంతం. అక్కడికి ఏకదంతం భార్య రమ వచ్చింది. కాంతం గారు, "ఏంటి మీ వారికి కాలు విరిగిందా! అయ్యో చూసుకోండి, మా వారు ఇలాగే దొంగ కట్టుతో ఆరునెలలు చేయించుకున్నారు. చచ్చాను ఇంటి పనులు బయటి పనులు, చేయలేక. నిన్న గుర్నాధానికి కుడి చెయ్యి విరిగిందని మా వారు చెప్పారు. అందరికీ ఇలా అవ్వటం చూస్తే ఏదో! అనుమానం వస్తుంది నాకు" అంది రమ. అప్పటికి క్లారిటీ వచ్చింది కాంతంకు సుబ్బారావు ఎత్తుగడ గురించి. 


 ఇంటి గేటును చప్పుడు చేయకుండా, మెల్లగా తీసి హాలు డోర్ తాళం తీయకుండా కిటికీలో నుండి లోపలకు చూసింది. లోపల సోఫాలో కూర్చుని టిపాయిపై కాలుపెట్టి, టివిలో ప్రోగ్రాం తోం.. తోం.. ధిరణన దిరణన చంద్రముఖి డాన్స్ చూస్తున్నాడు. ఇదా సంగతంటూ! హల్ తలుపుతీసి లోపలికి వెళ్లేసరికి భయంగా ఏమి చెప్పాలో తోచక చూస్తున్నాడు కాంతం వైపు. మంచంలో పడున్న మీరు హాల్లోకి ఎలా వచ్చారు, స్టిక్ లేకుండా!" అంటూ కాంతం సుబ్బారావునీ గుడ్లువురుముతూ! అడిగింది. అపుడు కాంతం అచ్చు చంద్రముఖి లానే కనిపించింది సుబ్బారావుకు. 


 "అదీ అదీ" అని సుబ్బారావు గొణుగుతుంటే.. "మీ ఫ్రెండ్ గుర్నాధానికి చెయ్యి విరిగిందిటా! మీకు తెలుసో! లేదో. ఏంటో! మీ ఫ్రెండ్సు అందరకు, ఇలా అవుతున్నాయంటూ! స్టిక్ తీసుకొచ్చి సుబ్బారావుకు ఇచ్చింది. దీని సాయంతో, చిన్నగా వంట గదిలో కెళ్ళి వంట చేయండంటూ! తను రిమోట్ చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చుంది టీవి చూడటానికి. 


 తన ప్లాను బెడిసికొట్టినందుకు బాధ పడుతూ! స్టిక్ విసిరేసి వంట గదిలోకి మామూలుగా నడిచాడు ఏడుపు మొహంతో మన హీరో కాస్తా జీరో అయిన సుబ్బారావు. 


 "అంత పెద్ద కట్టుతో పడతారు గానీ కత్తెరతో ముందు ఆ భారాన్ని దింపుకోండి"అన్న కాంతంతో "ఆ.. దింపుకుంటాము లే భారమంటూ! గిన్నెలను విసిరికొడుతూ! వంటకు ఉపక్రమించాడు. 


 ఇంతలో ఏకదంతం కాల్ చేసాడు సుబ్బారావుకి. కాంతం ఫోనెత్తి మాట్లాడకుండా వింటున్నది. "ఏరా! సుబ్బిగా దొంగ కట్టు ప్లాన్ పారిందా, ఈపూట మీ భార్యతో ఏమి వంటలు! చేయించావన్నాడు" ఏకదంతం నవ్వుతూ!

 

 "అయ్యో! ఏకదంతం, అన్నయ్యగారు! మీ దొంగ కట్టుగారు వంట చేస్తున్నారు. పాపము మీ ఇంకో ఫ్రెండ్ గుర్నాధం గారికి చెయ్యి విరిగిందిట, మీ ఆవిడ చెప్పింది. గుర్నాధం భార్యకు ఫోన్ చేసి ఇపుడే మాట్లాడాను, ఆయన కూడా వంట చేస్తున్నారు. మీరేమి వంటలు చేసారనే" లోపే 'ప్లాను బెడిసింది, బ్యాడ్లక్ సుబ్బిగాడు చచ్చాడుపో! అనుకుంటూ! ఫోన్ కట్ చేశాడు. 


 "ఎవరూ! ఫోనూ" అడిగిన సుబ్బారావుతో "బోడి సలహాలు ఇచ్చే మీ ఫ్రెండ్ ఏకదంతం. ఈసారి ఇలాంటి ఐడియాలిస్తే వున్న ఆ ఒక పన్ను కూడా వుండదని చెప్పండి" అన్న కాంతంతో "అలాగేనని" తలూపాడు మన హీరో సుబ్బారావు. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.



51 views1 comment
bottom of page