
'Ugadi Andaridi' - New Telugu Story Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 20/05/2024
'ఉగాది అందరిది' తెలుగు కథ
రచన: అల్లు సాయిరాం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"చిన్నోడా! అదిగో!! ఊరిలో రామమందిరం మీద నుంచి రేడియో సౌండ్ వినపడుతుంది. పంతులుగారు ఉగాది పంచాంగం చెప్పడం మొదలుపెట్టినట్లున్నారు. ఊరందరూ అక్కడికి వెళ్లిపోయినట్టున్నారు. నువ్వు కొంచెం ఆ ఫోన్ పక్కనపెట్టి తొందరగా వెళ్ళు!" అని యిల్లు కడిగి, ముగ్గులు పెడుతూ చెప్పింది భవానమ్మ.
కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తూనే "నాన్న, అన్నయ్య ఎక్కడికి వెళ్లారమ్మా?" అని అడిగాడు మహేష్.
"మన పొలంలో మామిడిచెట్టు ఉంది కదా! మామిడికాయలు, ఆకులు తీసుకురావడానికి వెళ్లారు!" అని భవానమ్మ అంటుండగా "రేపు ఉదయం వెళ్లి తెచ్చుకోవచ్చు కదా! ఇప్పుడెందుకు వెళ్లారు?" అని ఫోన్ చూస్తూ అడిగాడు మహేష్.
"రేపు ఉదయం వెళితే మామిడికాయలు కాదు కదా, చెట్టుకి ఆకులు కూడా ఉండవు. జనాలు అలా ఉన్నారు. బయట పరిస్థితులు అలా ఉన్నాయి! నాన్న, అన్నయ్య వచ్చేసరికి చీకటి పడిపోతుందేమో! ఇదిగో, యి పళ్ళెంలో బియ్యం, పెసరపప్పు, బెల్లం, అరటిపళ్ళు, చిల్లర డబ్బులు పెట్టాను. నువ్వు తీసుకువెళ్ళు!" అని మహేష్ చేతిలో ఉన్న ఫోను తీసుకొని, పళ్ళెం పెట్టింది భవానమ్మ.
"అమ్మా! ఫోన్ యివ్వమ్మా!! " అని అడిగి, అమ్మ దగ్గర నుంచి ఫోను తీసుకొని రామమందిరం వైపు బయలుదేరాడు మహేష్.
"పళ్ళెం జాగ్రత్త! అందరూ పంతులుగారికి ఇచ్చినప్పుడు మారిపోకుండా చూడు! కిందటేడాది, యిలాగే కొత్త పళ్ళెం తీసుకుని వెళ్లి, అక్కడ మాటలలో పడిపోయి, పళ్ళెం ఒకదానికొకటి మార్చుకుని వచ్చేశారు తండ్రికొడుకులు!" అని గుర్తుచేసింది భవానమ్మ.
రామమందిరంలో పంచాంగ శ్రవణంలో పంతులుగారు వార్షిక ఫలాలు, కందాయ ఫలాలు, వర్షాలు, పంటలు, అభివృద్ధి అంశాలు గురించి చెప్తుంటే, చుట్టూ పెద్దలు, పిల్లలు కూర్చుని, ఆసక్తిగా వింటున్నారు. మహేష్, తన ఫ్రెండ్ ఉదయ్ తో కలిసి వచ్చి పళ్లెంలో ఉన్న దినుసులు పంతులుగారికి యిచ్చి, ప్రక్కన కూర్చున్నారు. అప్పటికే, అక్కడున్నవాళ్లలో "ఏం అల్లుళ్ళు! ఎప్పుడు వచ్చారు!" అని కొంతమంది, “ఏం మహేష్! ఉదయ్! యిదేనా రావడం!” అని కొంతమంది పలకరిస్తూ అడుగుతుంటే, అందరికీ నవ్వుతూ "ఇప్పుడే వచ్చామని!" యిద్దరూ చెబుతూ పక్కన కూర్చున్నారు.
సాయంత్రం ఆరున్నర గంటలకి పంచాంగ శ్రవణం ముగిసింది. పంతులుగారు దినుసులు సరిచేసుకుంటూ, మందిరంలో రేపటి ఉగాది పూజ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అమ్మ చెప్పిన జాగ్రత్త ప్రకారం, పళ్లెం మారిపోకుండా, ముందు జాగ్రత్తగా చేతిలో పట్టుకొని, రామమందిరం బయట కూర్చున్నాడు మహేష్. ఊరి యువత చుట్టూ చేరి, ఒకరినొకరు ఆటపట్టించుకుంటుంటే, అది చూసి, అందరూ తనివితీరా నవ్వుతున్నారు. "అవును! అందరూ ఉన్నారు. మనోళ్లు సతీష్, రాజు, శివ లు రాలేదురా. ఊర్లో లేరా?" అని అడిగాడు మహేష్.
"వాళ్లు ఊరిలో లేకపోవడమేంట్రా! వాళ్లు వూరికి దత్త పుత్రులురా బాబు! నేను ఫోన్ చేశాను. ఇంటి దగ్గరే ఉన్నారంట! వాళ్ళకి ఉగాది లేదంట! ఇక్కడికి రారంట!" అని చెప్పాడు ఉదయ్.
"ఉగాది పండుగ లేకపోవడం ఏంట్రా! అది అందరిది కదా! ఎవరికైనా యిచ్చారా? లేకపోతే ఎక్కడినుండైనా వస్తుందా?" అని ఆశ్చర్యంగా అన్నాడు మహేష్.
"మాకు కూడా ఉగాది లేదన్నా!" అని పక్కనుంచి కిరణ్ చెప్తే "మరి, నువ్వు ఎందుకు వచ్చావు కిరణ్?" అని సూటిగా అడిగాడు ఉదయ్.
"నాకు యివన్ని చూడడమంటే సరదా అన్న!" అని సరదాగా చెప్పాడు కిరణ్.
"నిజంగానే మీకు ఉగాది లేదా?" అని మరింత ఆశ్చర్యంగా మహేష్ మళ్ళీ అడిగితే "అవును. లేదన్నా!" అని స్పష్టంగా చెప్పాడు కిరణ్.
"సరే కిరణ్! మీకు ఉగాది లేదని ఎవరు చెప్పారు? దానికి ఏమైనా కారణం ఉందా?" అని అడిగాడు మహేష్.
కిరణ్ తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ "నేను చిన్నప్పుడు, మా నాన్నమ్మ చేస్తుండేది. నాన్నమ్మ కాలం చేసిన తర్వాత, మా యింట్లో ఉగాది పండుగ ఎప్పుడూ చేయలేదు! ఇప్పుడు పూర్తిగా మనకి ఉగాది లేదంటున్నారు!" అని తనకి తెలిసినంతవరకు చెప్పాడు.
"ఉగాది అనేది తెలుగువాళ్ళ కొత్త సంవత్సరం కదా! అంటే తెలుగు వాళ్ళందరికీ వర్తిస్తుంది కదా. మరి కొందరికి ఉండి, కొందరికి లేకపోవడమేంటి?" అని అర్ధంకాక అడిగాడు మహేష్.
అక్కడున్న యువతలో ఎవరిదగ్గర చర్చనీయాంశానికి సమాధానం దొరకకపోతే, ముందు నుంచి కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్న పెద్దల దగ్గరికి వెళ్ళారు. "అసలు ఉగాది ఎవరిది? తెలుగువాళ్ళలోనే అందరూ జరుపుకోవడం లేదు ఎందుకు?" అని మూకుమ్మడిగా అడిగారు.
ఆ పెద్దమనుషుల్లో కొంతమంది "ఎవరింట్లోనైనా ఏదైనా మైలుపడి ఉంటే చెయ్యరు!" అని, మరి కొంతమంది "కుటుంబంలో సాంస్కృతిక సంప్రదాయాలు ఓపిగ్గా ఆచరించేవారు కాలంచేసిన తర్వాత, కొంచెం కొంచెంగా సంప్రదాయాలను వదిలేస్తుండడం వలన చెయ్యట్లేదు!" అని, ఇంకొంతమంది "ఉగాది అంటేనే రైతుల పండుగ!" అని రకరకాలుగా అభిప్రాయాలు చెప్తున్నారు.
విశ్రాంత ఉపాధ్యాయుడైన నాయుడు మాష్టారు మాట్లాడుతూ "అభివృద్ధి పేరుతో పల్లెటూర్లో ఉన్న వ్యవసాయాలు, పశుపెంపకాలు వదిలేసి పట్టణాలకు అందరూ వలస వెళ్ళిపోతే, ఎవరికి ఆచారాలు తెలుస్తాయి? ఒకవేళ తెలిసినా, అక్కడ యివన్ని ఎలా చెయ్యగలరు? అంతెందుకు, కొన్ని సంవత్సరాల ముందు వరకు ఉగాది పండుగ బాగానే ఉండేది కదా! ఉగాది వస్తుందంటేనే, అదొక సరదా! ఉగాదికి పది, పదిహేనురోజుల ముందు నుంచి ఏరువాక కొత్త నాగలి కోసం కర్రలు సరిచూసుకోవడం, నాగలి చేయించడానికి వడ్రంగుల యింటి ముందు రైతులంతా చేసే కోలాహలం చూడడానికి ఎంతో ఆనందంగా ఉండేది.
నాగలికి, ఏరుకి కట్టడానికి కొత్త తాళ్ళు సిద్ధం చేసుకోవడం, ఎద్దులకి మెడలో కొత్త గంటలు చేయించుకోవడం, పండించిన చెరుకు ఆడించి కొత్త బెల్లం తయారుచేసుకోవడం, పచ్చని మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టి, ఉగాది ముందురోజు సాయంత్రం పంచాంగ శ్రవణం, ఉగాది రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, తలంటుకొని, కొత్తబట్టలు ధరించి, ఏరువాక కట్టి పొలంలోకి వెళ్లేటప్పుడు, దారిలో వస్తున్న, పోతున్న ఎద్దుల మెడల్ల ఉన్న కొత్త గంటలు ఘల్లుఘల్లుమని శబ్దాలతో ఊరంతా తెల్లవారేది!
పొలంలో సూర్యునికి, భూదేవికి, పంచభూతాది దేవతలకి తమ పంటలు కాపాడమని ప్రార్థించి, తిరిగి యింటికి వచ్చేటప్పుడు మామిడికాయలు, మావిచిగురాకులు, వేపపువ్వులు, పనసకాయలు, కొబ్బరికాయలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంటిదగ్గర ఉన్న ఆడవారు గోపూజ చేసి, ఇంటికి ఏరువాకతో వచ్చిన ఎద్దులకి కాళ్లు కడిగి బొట్లుపెట్టి, కొత్త నాగలికి మ్రొక్కడం, తర్వాత అన్ని కలిపి ఉగాది పచ్చడి చేసుకుని అందరూ పంచుకుంటూ తినేవాళ్ళు. తరువాత తోటల్లో ఉయ్యాల కట్టి, చిన్నాపెద్దా తేడా లేకుండా సరదాగా ఊగేవాళ్ళు!
ఇలా ఉగాది అంటే చాలా హడావిడిగా ఉండేది! మరి యిప్పుడు పరిస్థితి చూస్తున్నాం కదా! ఒకరు పండుగ లేదంటారు! మరొకరు పండుగే కాదంటారు!" అని విశ్లేషించి చెప్తుంటే, తెలిసినవాళ్ళు గతాన్ని గుర్తుచేసుకుంటూ, తెలియనివాళ్ళు ఉగాది అంటే అంత వైభవంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయి వింటున్నారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతుండడంతో, సమయం తెలియకుండా జరుగుతున్న చర్చ కాస్త ప్రజాభిప్రాయ సేకరణలా మారింది.
గడియారంలో చిన్నముల్లు ఎనిమిది దాటాక, పంతులుగారి పూజ కార్యక్రమాలు ముగించుకుని, తలుపు గడియ వేసుకుంటూ బయటికి వస్తున్నారు. ఇక్కడ చర్చ జరుపుతున్న వారి దృష్టి పంతులుగారి వైపు మళ్ళి, అందరూ అక్కడికి వెళ్లారు. "పంతులుగారు" అంటూ మహేష్ ఏదో చెప్పబోతుండగా, "మీ చర్చ ఆది నుంచి అంతా వింటున్నానయ్యా మహేశా! నేటి యువతకే కాదు, పెద్దలకి సైతం అవసరమైన చర్చకి సారథ్యం చేస్తున్నావు. శుభం! నాకు తెలిసినంతవరకు నేను ఓ మాట కలుపుతున్నాను. ఉగాది అంటే ఉగస్య ఆది. ఉగ అంటే నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఆది అనగా ఆరంభం. ఇంకొకవిధంగా చెప్పాలంటే, యుగానికి ఆది యుగాది అయింది!
పురాణపరంగా చెప్పాలంటే, విష్ణువు దశావతారాలలో ఒకటైన మత్స్యవతారంలో, సోమకుడిని వధించి, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించడం జరిగిందని, యి చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించడం జరిగిందని, అందువలన యి శుభ దినమున ఉగాది పండుగ జరుపుకుంటున్నామని ప్రతీతి! శిశిరం తరువాత వచ్చిన వసంతంలో, చెట్లు చిగురించి, ఎటుచూసినా ప్రకృతి పచ్చగా శోభాయమానంగా వుంటుంది. ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, ఉగాదిరోజున చేసే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాదిపచ్చడి, సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచిచెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని తెలుపుతుంది.
అలాగే, తెలుగు సంవత్సరం రోజున పంచాంగశ్రవణం జరపడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలోని మంచిచెడులను, కురిసే వర్షాలను, ఆదాయ ఫలాలను, పంచాంగంలో చెప్పడం వలన, ప్రజలు, ముఖ్యంగా రైతులు వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ఏ ఏ పంటలు పండించాలని నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది!" అని చెప్తుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు.
"మరి, పంతులుగారు కొందరు" అని ఉదయ్ చెప్పబోతుండగా "వస్తున్నా! అక్కడికే వస్తున్నానయ్యా ఉదయ్! అసలు యి ఉగాది ఎవరిది? అందరూ ఎందుకు జరుపుకోవటం లేదు? అదే కదా నువ్వు అడగాలనుకున్నది!" అని పంతులుగారు అడిగితే, అవునన్నట్లు తల ఊపాడు ఉదయ్.
పంతులుగారు నవ్వుతూ "మంచిది! ఉగాది ఒక ప్రాంతానికో, ఒక కులానికో సంబంధించినది కాదు. ఈ ఉగాదిని మన తెలుగువాళ్ళతో పాటుగా కన్నడవాళ్ళు, మరాఠీలు, తమిళులు కూడా జరుపుకుంటారు. ప్రాంతాన్ని బట్టి పేర్లు, పద్ధతులు మారుండొచ్చుగాక! ఆఁ కిరణ్, మీకే కదా, ఉగాది లేదన్నావు! నీకు చెయ్యడానికి ఆసక్తి ఉంది కదా. మరి యిప్పుడు ఎందుకు చేసుకోవట్లేదు?" అని అడిగాడు.
కిరణ్ ఏం చెప్పాలో తెలియక అయోమయంలో "మాకు ఉగాది ఉందో లేదో నాకు తెలియదు గాని, నాకు బాగా తెలిసి వచ్చాక, మా తాతయ్యవాళ్లు చేయలేదు. మా నాన్నవాళ్లు చేయలేదు. మరి నేను ఎలా చెయ్యగలను?" అని చెప్పాడు కిరణ్.
"ఓహో! అలాగా! ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మూడు నెలల ముందు డిసెంబర్ 31న, కొత్త పార్టీలు చేసుకుని, కేకులు కోసుకుని, అర్ధరాత్రి వరకు ఎదురుచూసి శుభాకాంక్షలు చెప్పేసి, దేశం యావత్తూ ఒక అనధికార జాతీయ పండుగలా జరుపుకున్నాం కదా! మరి, అది ఎవరిది? అది మాత్రం మీ తాతయ్యవాళ్ళు, మీ నాన్నవాళ్ళు నీ చిన్నతనంలో ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు, నువ్వెలా చేసుకుంటున్నావు?" అని పంతులుగారు అడిగితే, కిరణ్ ఏదో తప్పు చేసినట్లుగా తలదించుకుంటుంటే "కిరణ్! నిన్ను నొప్పించాలని కాదయ్యా! మీ పెద్దవాళ్ళు చెయ్యలేదంటే, ఒకవేళ, అప్పటి పరిస్థితుల కారణాలు అయిండొచ్చు. వేరే కారణాలు ఉండొచ్చు! వాళ్లు చెయ్యకపోయినా, నీకు ఉగాది అంటే ఏంటో తెలిసింది. సంతోషం!
కనీసం, ఉగాది అంటే నీకు తెలిసి, ఉందో లేదోనని ఆలోచిస్తున్నావు. యిప్పుడు నువ్వైనా చెయ్యకపోతే, మీ తర్వాత తరాలకి ఉగాది అంటేనే తెలియకుండా పోతుంది. ఇప్పుడు మొదలుపెడితే, నీ ద్వారా తిరిగి తర్వాత తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు అందుతాయి!" అని పంతులుగారు కిరణ్ కి అన్నాడు.
ప్రక్కనున్న కుర్రోళ్ళు కిరణ్ ని ఆటపట్టిస్తుంటే “ఊరుకోండిరా! పంతులుగారు మీరు చెప్పారు కదా! రేపటి నుంచి మాకు ఉగాది ఉంది. ఉంటుంది. మేం పండుగ జరుపుకుంటాం. మీరు మా యింటికి ఉగాది పచ్చడి రుచి చూడడానికి రండి!” అని ఉత్సాహంగా అన్నాడు.
"చాలా సంతోషం బాబు! నీకనే కాదు, అందరం యిదే చేస్తున్నాం. మనవి కాకపోయినా, మనం కొత్తకొత్త పండుగలు, ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. తప్పులేదు! కాలాన్ని బట్టి ధర్మాలు మారుతుంటాయి. కానీ, మన ఉనికిని చాటే పండుగలు, ఏదోక కారణంగా జరపకపోవడం వలన క్రమక్రమంగా విలువైన ఆచార సాంప్రదాయాలను కోల్పోతున్నాం. మన ముందుతరాల నుంచి వచ్చిన సంస్కృతి, సాంప్రదాయాలు తరువాత తరాలకు అందించాలి. ముందుతరాల నుంచి వచ్చిన మూఢనమ్మకాలు, అపోహలు ఏమైనా ఉంటే, అవి మనతోనే ఆపేయాలి!" అని పంతులుగారు ముగింపుగా చెప్తూ, చేతిగడియారం చూస్తుంటే "తొమ్మిది దాటిందండీ!" అని నవ్వుతూ అన్నాడు మహేష్.
"మరేం సరిపోదా! మరో మూడు గంటలు, యిలా మాట్లాడుతూ ఉంటే, ఉగాది వచ్చేస్తుంది. అందరూ ఇంటికి వెళ్ళి, తెల్లవారి లేచి, చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని, ఉగాదిని బాగా జరుపుకోండి. అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు!" అని పంతులుగారు చెప్తే, అందరూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ యిళ్లకు చేరారు.
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.
కథ చాలా చక్కగా రాశారు, ముఖ్యంగా 31/12 ను పోల్చటం.... నా మనసులోని భావన! good.