top of page

ఊహా లోకం 2


'Uha Lokam 2' New Telugu Big Story


Written By Lakshmi Madan



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అలా ఇంటికి వెళ్లిన ప్రసాద్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ప్రసాద్ అలా పడుకునేసరికి తల్లిదండ్రులు బాగా కంగారు పడి "ఏమై ఉంటుంది "అని దగ్గరికి వెళ్లి అడిగారు.


"బాబూ ప్రసాద్.. ఎందుకలా ఉన్నావు? ఏమైంది నాన్నా! బ్యాంకులో ఏమైనా సమస్యలు వచ్చాయా" అని అడిగారు.


"ఏమీ లేదమ్మా! కొంచెం తలనొప్పిగా ఉంది. నన్ను కాసేపు పడుకో నివ్వండి " అని చెప్పి కళ్ళు మూసుకొని పడుకున్నారు.


అలా రెండు మూడు సంవత్సరాలు బాధపడ్డాడు. తర్వాత ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి తేవడం వల్ల వాళ్లు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం నచ్చడం వల్ల తొందరగానే తాను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి సుఖంగానే ఉన్నాడు. పిల్లలు పుట్టారు. వాళ్ళ చదువులు అవుతున్నాయి. అవన్నీ వందనే చూసుకుంటుంది. అలాగే ప్రసాద్ తల్లిదండ్రులను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది కానీ..


ఆడవాళ్లకు ప్రసవం తర్వాత జరిగిన ప్రాబ్లంస్ వల్ల కొందరిలో ఒళ్ళు రావడం, ఇంకా ఇతరత్రా సమస్యలు రావడం జరుగుతుంది. ఇది తెలియని మగవాళ్ళు భార్య అందంగా లేదు మునుపటిలా.. అని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అలాగే జరిగింది వందన విషయంలో.


పాత జ్ఞాపకాలనుండి బయటపడ్డ ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పటిలాగే వందనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంది. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు.


మర్నాడు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లిపోయాడు ప్రసాద్. భార్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. బ్యాంకుకు వెళ్లిన ప్రసాద్ కి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది.


ఇప్పుడు ప్రసాద్ మేనేజర్ కాబట్టి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో తాను ప్రేమించిన సౌందర్య కనబడింది. ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు ప్రసాద్. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇది కలా! నిజమా ! అంటూ కళ్ళు నిలుముకుని మరీ చూశాడు. మొహం అంతా సంతోషంతో విప్పారిపోయింది.


పలకరిద్దామని గబగబా బయటకు వెళ్ళాడు. కానీ ఆవిడ త్వరగా బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే గేటు వరకు వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఒకింత నిరాశకు లోనైన ప్రసాద్ ఇలా జరిగిందేమిటా అని అనుకున్నాడు.


కానీ మనసంతా పులకించిపోయినట్లుగా అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్ళకి సౌందర్య ని చూస్తానని అనుకోలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పుడు ఇప్పుడు సౌందర్య ఒకేలాగా ఉంది. ఏమాత్రం మార్పు లేదు. అదే అందం.. అదే మెరుపు.. కాకపోతే అప్పుడు చీరల్లో ఉండేది. ఇప్పుడు డ్రెస్ వేసుకొని ఉంది. చక్కని చుడిదార్లో అందంగా కనిపించింది.


ఆ రోజంతా కొంచెం ఉత్సాహంగా, కొంచెం నిరాశగానే గడిపాడు. ఎలా సౌందర్య ని మళ్ళీ చూడటమని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక కూడా కాస్త సంతోషంగానే ఉన్నాడు. కాకపోతే వందనను చూసి అనుకున్నాడు..


"వందనకి సౌందర్య కి ఎంత తేడా ఉంది. ఇన్నేళ్లయినా కూడా సౌందర్య లో అదే అందం, అదే శరీర ఆకృతి. ఇసుమంతైనా కూడా మార్పు లేకుండా ఉంది. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుంది.. వందన ఉంది ఎందుకు.. ఇలా వికృతంగా బస్తాలా మారిపోయింది" అని అనుకున్నాడు.


నిజం చెప్పాలంటే వందన మరీ అంద విహీనంగా ఏమీ లేదు. మునుపటి కన్నా కాస్త బొద్దుగా మారిపోయింది. అది కూడా ఆడవాళ్లు వారి గురించి వారు ఆలోచన చేయకపోవడం వల్ల వచ్చిన మార్పు . ఎప్పుడు అందరి అవసరాలు చూసే ఆడవాళ్లు వాళ్ళ భోజనం అలవాట్ల గురించి గానీ వ్యాయామం గురించి గానీ ఆలోచించరు. అది అర్థం చేసుకోని మగవాళ్ళు ఇలా ప్రసాద్ లాగే ఉంటారు.


ఒక రెండు నెలల తర్వాత మళ్లీ సౌందర్య బ్యాంకుకు వచ్చింది. ఒక్కసారి ప్రసాద్ కళ్ళు మెరిసిపోయాయి. ఆ అమ్మాయితో మాట్లాడదామని గబా గబా బయటికి వచ్చి


" సౌందర్యా! ఎలా ఉన్నారు? బాగున్నారా.. ఎన్నాళ్లకు కనిపించారు.. మీలో ఏమీ మార్పు లేదండి" అని ఆత్రతతో పలకరించాడు.


అయోమయంగా చూసిన ఆ అమ్మాయి


"మీరు ఎవరండీ.. నేను గుర్తు పట్టలేదు" అని అన్నది.


"నేను ప్రసాద్ ను సౌందర్య గారు.. మీరు రోజు ఈ బ్యాంక్ కి వచ్చేవాళ్ళు... మర్చిపోయారా.. పెళ్లి కుదిరింది అమెరికా వెళ్తున్నాను అని చెప్పారు కదా" అన్నాడు.


ఆ అమ్మాయి వెంటనే గట్టిగా నవ్వేసింది. అలా నవ్వుతూనే ఉంది.


"ఎందుకలా నవ్వుతున్నారు సౌందర్య గారు.. నన్ను చూసి .. నేను ఏమన్నానని" అని అడిగాడు ప్రసాద్.


"చెప్తాను అంకుల్, ఆగండి "అని నవ్వాపుకుంది.


"అంకులా" అని ఆశ్చర్య పడ్డాడు ప్రసాద్.


" మమ్మీ! మమ్మీ " అని పిలిచింది.


అలా వెనక్కి చూసిన ప్రసాద్ కు ఒక లావు పాటి మహిళ నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆవిడకి సౌందర్య పోలికలు ఉన్నాయి.


అప్పుడు చెప్పిందామ్మాయి.


" అంకుల్ ! మా అమ్మ పేరు సౌందర్య ..నా పేరు సింధు " అని చెప్పింది.


"ఏమిటి.. మీరు సౌందర్య గారి అమ్మాయా.. సౌందర్య కాదా?" అని షాక్ అయ్యాడు.


ముందుకు వచ్చిన సౌందర్య ..


" ప్రసాద్ గారూ ! ఎలా ఉన్నారు..మీరు ఇంకా ఇక్కడే పని చేస్తున్నారా! " అని అడిగింది.


షాక్ తో నోట మాట రాలేదు ప్రసాద్ కు.


షాక్ నుండి తేరుకొని ప్రసాద్


"అవును సౌందర్య గారు.. నేను ఇక్కడే చేస్తున్నాను. మీరేమిటిలా ఇక్కడికి వచ్చారు..” అని మామూలుగా అడిగాడు.


"ఈ బ్యాంకులో మా కాబోయే అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి అతన్ని కలవడానికి వచ్చాము. ఇదిగో.. ఇదే నా కూతురు. దాని పేరు సింధు. మేము మొన్ననే అమెరికా నుండి వచ్చాము. ఇక ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నాము" అని చెప్పింది సౌందర్య.


కానీ ఇన్నాళ్లు ఎంత అపోహ పడ్డాడు.. సౌందర్య అలాగే ఉంటుంది, వందన పూర్తిగా అందవికారంగా తయారైంది అని అనుకున్నాడు. కానీ నిజానికి సౌందర్య, వందనకన్నా మూడింతలు లావుగా ఉంది. ఒక్కసారి తన ప్రవర్తనకు తనే సిగ్గుపడ్డాడు. తన సంస్కారం ఏమైంది.. ఇలా ప్రవర్తించాడు ఏంటి.. అని ఎన్నో విధాల అనుకున్నాడు . ప్రకృతి సిద్ధంగా ఎన్నో మార్పులు స్త్రీ శరీరంలో వస్తాయి. మగవాళ్ళు కూడా మారిపోతారు. కానీ స్త్రీలు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించడం వల్ల వాళ్లను వారు ఒకంత నిర్లక్ష్యం చేసుకుంటారు. అది కూడా ఇంటి వారి గురించే వారు చేసే త్యాగం. ఇది అర్థం చేసుకోలేని నేను ఇంత అసహ్యంగా ప్రవర్తించాను.. అని మనసులో అనుకొని వెంటనే హాఫ్ డే లీవ్ కి అప్లై చేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు.


" వందనా! ఏం చేస్తున్నావ్ ఇలా రా" అన్నాడు ప్రసాద్.


వంటింట్లో నుంచి బయటికి వచ్చిన వందన


" ఏంటండీ" అని అన్నది.


"పిల్లలు కాలేజీ నుండి రావడానికి ఎలాగూ లేట్ అవుతుంది కదా.. మనము సినిమాకి వెళ్దాము" అని అన్నాడు.


ఎప్పుడు చిరాకు పడే ప్రసాదు ఇలా సంతోషంగా మృదువుగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది వందన.


"వెళ్లి రెడీ అవ్వు వందన! నాకు ఇష్టమైన ఎల్లోసారి కట్టుకో " అన్నాడు ప్రసాద్.


"అలాగే " అంటూ సంతోషంతో లోపలికి వెళ్ళిపోయింది వందన.


పరివర్తన కలిగిన ప్రసాద్ మరలా ఎప్పుడు వందనను కించపరిచే మాటలు కానీ బాధపెట్టే సందర్భం కానీ రాలేదు. ఎంతో సంతోషంగా జీవించారు.


❤️❤️శుభం ❤️❤️


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు


27 views0 comments
bottom of page