'Varu Alludu Kadu' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'వారు అల్లుడు కాదు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
నారాయణ మూర్తిగారి చేతిలోని సెల్ మ్రోగింది.. ‘‘హలో!..’’
‘‘బావగారూ!.. నమస్కారం!..’’ వియ్యంకులు వీరరాఘవయ్యగారి కంఠం.
‘‘ఆఁ..ఆఁ.. బావగారూ!.. నమస్కారం.. అంతా కులాసేగా!..’’ ఆప్యాయతతో కూడిన నారాయణమూర్తిగారి జవాబు..
‘‘అంతా కుశలమే బావగారు. ఒక ముఖ్య విషయం!..’’
‘‘ఆఁ.. ఏమిటో చెప్పండి బావగారు!..’’
‘‘మీ అల్లుడితో పాటు.. నేనూ మీ చెల్లెలు ఇద్దరు కోడళ్ళు వస్తున్నాము బావగారూ!.. మీ పల్లె సంక్రాంతి సోభతో వెలిగిపోతుంది. భోగిమంటలు, ముగ్గులు, తేగలు, బుఱ్ఱగుంజు అవన్నీ ఆరోజుల్లో ప్రత్యేకత కదా!.. ఆ అనుభవం పల్లెటూరు లోనే అందం ఆనందం. ఏమంటారు ‘బావగారూ!..’ గంభీరంగా నవ్వారు వీరరాఘవయ్యగారు.
నారాయణమూర్తిగారి చవులకు ఆనవ్వు సమ్మెట దెబ్బలా తోచింది. ‘‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం!..’’ అన్న సామెతలా వుంది నారాయణమూర్తి పరిస్థితి.. ‘అల్లుడు ప్లస్ నలుగురు.. ఐదుగురు.. ఇంటిల్లపాది బయలుదేరు తున్నారన్నమాట.. పిండి వంటలు, పప్పు, పాయసం, గారెలు.. ఆమూడు రోజులూ మామూలే!.. సమస్య ఎక్కడంటే.. అల్లుడి తోటే గిల్లుడు అన్నట్లు అల్లుడితో పాటే ఆ మిగతా నలుగురికీ వస్త్రాలు పెట్టక తప్పదు. వివాహం అయిన తర్వాత వచ్చిన తొలి పండుగ.. అందునా పెద్ద పండుగ.. మకర సంక్రాంతి.. ఆశగా వారంతా వస్తూ వుంటే ఎలా ఆపగలను?.. సాధ్యమా!.. ఊహూ.. అసాధ్యం. అప్పో సొప్పో చేసి వియ్యాల వారికి చేయవలసిన మర్యాదలను సవ్యంగా జరిపించాల్సిందే!.. లేకపోతే అమ్మాయి సంసారంలో ప్రశాంతత వుండదు. కనీసం అందరి వస్త్రాలకు పది పన్నిండువేలు అవసరం.. ధాన్యం అమ్మగా వచ్చినది మూడువేలు.. ఒక్క అల్లుడే వస్తే.. అమ్మాయితో మాట్లాడి.. ఆమూడు వేలు వారికి గుడ్డల నిమిత్తం యిచ్చి పండుగను గడిపేయకలిగి వుండేవాణ్ణి!..
రాఘవయ్యగారు వారి అర్థాంగి ఇద్దరు ఆడపిల్లలూ వస్తున్నారా!.. సర్వేశ్వరా!.. నీవే రక్ష!..’’ అనుకొన్నారు నారాయణమూర్తి..
‘‘బావగారు రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తున్నాము!..’’
‘‘అలాగా!..’’
‘‘అవును!..’’
‘‘సరే సరే!.. మంచిది రండి బావగారు!..’’
‘‘అలాగే బావగారు పెట్టెస్తున్నా!..’’ వీర రాఘవయ్యగారి సెల్ కట్ చేశారు.
నారాయణమూర్తి మాట్లాడుతున్నందున వారి ప్రక్కనే నిలబడి వున్న అర్థాంగి అనసూయ..
‘‘ఎవరండీ!..’’ అడిగింది.
‘‘ఆఁ.. ఎవరా!.. మన వియ్యంకుడు గారు!..’’
‘‘విషయం ఏమిటీ?..’’
‘‘అల్లుడితోపాటే.. యావత్ కుటుంబం రేపు సాయంత్రానికల్లా మన ఇంటికి రానున్నారట!..’’
‘‘వారి కుటుంబం మొత్తం వస్తువుందా!..’’ విచారంగా అడిగింది అనసూయ.
‘‘అవును..’’
‘‘ఏంటమ్మా!..’’ వంటిట్లో వున్న కుమార్తె అరుణ వారిని సమీపించింది.
అనసూయ విషయాన్ని అరుణకు చెప్పింది..
‘‘ఏమిటి అందరూ వస్తున్నారా!..’’ ఆశ్చర్యపోయింది అరుణ.
‘‘అవునమ్మా.. మీ మామగారు చెప్పారు!..’’ అర్థాంగి వైపు చూచి
‘‘అనూ నేను అలా బజారుదాకా వెళ్ళివస్తాను..’’ కుర్చీపైన వున్న పైపంచను బుజాన వేసికొని వీధివైపుకు నడిచాడు నారాయణమూర్తిగారు.
‘‘అమ్మా!..’’
‘‘ఏంటి అరుణ?..’’
‘‘మా మామగారు పరమ మూర్ఖుడు. కొడుకుతో పాటూ అందరూ రావడం ఏమిటి?..’’ విచారంగా చెప్పింది అరుణ.
‘‘పోనీలే అమ్మా!.. నీ పెళ్ళి అయ్యాక ఇది తొలి పండుగ కదా!.. రావలనుకొన్నారు రానీ!..’’ అనునయంగా చెప్పింది అనసూయ.
‘‘ఖర్చుకదమ్మా!..’’ దీనంగా అంది అరుణ.
‘‘అవును. నిజమే!.. తప్పదు కదమ్మా!..’’ విరక్తితో కూడిన చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళింది అనసూయ. విచారంగా తల్లిని అనుసరించింది అరుణ.
* * *
‘‘సారూ!.. నమస్కారం.. రండి.. రండి!..’’ సేట్ చంపాలాల్ చిరునవ్వుతో ఆహ్వానం.. నారాయణ మూర్తిగారికి.
‘‘చంపాలాల్, అంతా కులాసేగా!..’’ అడిగాడు నారాయణ మూర్తి.
‘‘ఆఁ..ఆఁ.. అంతా మీ ఆశీర్వచనం సార్!..’’ కూర్చొండి..”
నారాయణమూర్తి చంపాలాల్ ముందు కూర్చున్నాడు.
‘‘ఏంటిసారూ విషయం?..’’
‘‘సేట్!..’’
‘‘సారూ!..’’
‘‘పది వేలు కావాలి..’’
‘‘దానికేంసార్ తీసుకెళ్ళండి..’’
‘‘నోటు వ్రాస్తారా!..’’
‘‘నోటు కుదరదు సార్!..’’
‘‘మరి డబ్బు..’’
‘‘బంగారం తీసుకురండి సారూ!.. డబ్బును తీసుకెళ్ళండి సారూ!..’’
‘‘బంగారమా!..” దీనంగా అడిగారు నారాయణమూర్తి..
‘‘అవునుసార్!..’’
నారాయణమూర్తి వెంటనే లేచాడు. ‘‘సేట్.. వెళ్ళొస్తాను!..’’
‘‘ఆఁ.. మంచిది సారూ!.. నమస్కార్!..’’ చేతులు జోడించాడు. అక్కడినుండి అరకిలో మీటర్ దూరంలో వుంది (మన్మథరావు) గుడ్డలషాపు.
వస్తువు ఇవ్వందే మారువాడి చంపాలాల్ డబ్బులు ఇవ్వడు.. పదివేల వస్తువుకు ఐదువేలు.. సగం విలువ.. డబ్బును ఇస్తాడు. ‘మన్మథరావు మంచివాడే. విషయం చెప్పి అందరికీ కావలసిన వస్త్రాలను ఇస్తాడేమో అడగాలి!.. కాదంటాడో ఇస్తాడో అడిగితే కదా తెలుస్తుంది?.. ప్రయత్నే ఫలి!.. ప్రయత్నిద్దాం..’
ఆ ఆలోచనతో నారాయణ మూర్తి మన్మధరావు వస్త్రశాలలలో ప్రవేశించాడు.
మన్మథరావు వారిని చూచి నమస్కరించాడు చిరునవ్వుతో..
‘‘మన్మధరావు గారూ?..’’
‘‘చెప్పండి సార్!..’’
‘‘కొన్ని వస్త్రాలు కావాలి. వియ్యంకుల వారి కుటుంబం పండగకు వస్తున్నారు..’’
‘‘దానికేం.. కొత్త వెరైటీలు చాలా వచ్చివున్నాయి. చూచుకొని కావలసిన వాటిని తీసికొండి సార్!..’’
‘‘ఒక్కమాట!..’’ మెల్లగా చెప్పాడు నారాయణమూర్తి
‘‘ఏమిటో!..’’ మన్మధరావుకు నారాయణమూర్తి చెప్పేబొయే మాట అర్థం అయింది.
‘‘సార్!.. సారీ.. ఒక్కమాట వినండి. అరువు బేరాలు లేవు. మార్కెట్ లో చేతిలో.. క్యాష్ లేనిదే వస్తువు లేదు..’’ వ్యంగ్యంగా నవ్వారు మన్మధరావు.
‘‘అంతేనా!..’’
‘‘తప్పుగా అనుకోకండి సారూ!.. అంతే!..’’
నారాయణమూర్తి నిట్టూర్చి.. విచారంగా ఇంటివైపుకు బయలుదేరాడు. మనస్సున సమస్య పరిష్కారం గురించిన ఆలోచన..
* * *
రాత్రి పదకొండు గంటల ప్రాంతం..
నారాయణమూర్తికి నిద్ర పట్టలేదు.
అతని వాలకాన్ని చూచిన అనసూయ..
‘‘ఏమండీ!..’’
‘‘ఆఁ..’’
‘‘నిద్రరావడం లేదా?..’’
‘‘అవును అనూ!..’’
అనసూయ చిరునవ్వు నవ్వి.. మెడలో వున్న ఐదు సవర్ల బంగారు గొలుసు తీసి నారాయణమూర్తి చేతులో పెట్టంది.. నారాయణమూర్తి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అనసూయ ముఖంలోకి చూచాడు దీనంగా..
‘‘అనూ! ఏంటిది?..’’
‘‘జీవితం!..’’ చిరునవ్వుతో చెప్పింది అనసూయ. ‘‘ఈ సామాను సేట్ కు ఇచ్చి డబ్బు తీసికొని వియ్యాల వారి బృందానికి కావాలసిన వస్త్రాలు రేపు వుదయం తీసికొనిరండి..’’
‘‘అనూ!.. నీవు..’’
అనసూయ తనచేతిలో నారాయణమూర్తి నోరు మూసింది.. ‘‘మన అవసరం తీరాలి. మన గౌరవం నిలవాలి. అంతే పడుకొండి..’’ ఇరువురూ రేపటిని గురించిన ఆలోచనతో శయనించారు.
మరనాడు ఉదయం కాఫీ టిఫిన్ అయ్యాక నారాయణమూర్తి బజారుకు వెళ్ళాడు. సేట్ చంపాలాల్ ను కలిశాడు. అతనికి కావలసింది ఇచ్చాడు. తనకు కావలసింది తీసుకొన్నాడు.
మన్మధరావు గుడ్డలషాపుకు వెళ్ళాడు.. వియ్యాల వారి బృందం.. చిన్నా పెద్దా మెచ్చేలా వస్త్రాలు తీసికొన్నాడు.
అన్నింటినీ నీటుగా పార్శిల్ చేయించి మన్మధరావు.. నారాయణమూర్తికి అందిస్తూ..
‘‘సార్!.. డబ్బు చేతిలో పెట్టుకొని ఆరువు వ్యపారాలు చేయకూడదు సార్. ఇప్పడు మీకు ఫిపీటీన్ పరసెంట్ మిగిలింది. డబ్బు వుండేది అవసరాలు తీర్చుకొనేటందుకేగా సార్!..’’ నవ్వుతూ తనకు తెలిసన వేదాంతాన్ని నారాయణమూర్తిగారి చెప్పారు. విరక్తిగా నవ్వుతూ నారాయణమూర్తి ఇంటి వైపుకు బయలుదేరాడు. ఆ వస్త్రాలను కొనేటందుకు తన చేతికి డబ్బు ఎలా వచ్చిందన్న విషయాన్ని తలుచుకొంటూ.. తన అర్థాంగి మనస్తత్వాన్ని మదిలో మెచ్చుకొంటూ.. కార్యేషుదాశీ.. కరణేసు మంత్రి.. స్లోకాన్ని వల్లెవేసు కొంటూ..
* * *
అరుణ.. చేతిలో సెల్ మ్రోగింది.
‘‘హల్లో!..’’
..
‘‘హల్లో!..’’
..
‘‘హల్లో!..’’
‘‘హల్లో!..’’ అరుణ భర్త ఆనందబాబు..
‘‘ఆఁ.. మీరా చెప్పండి!..’’
‘‘ఆ నేనే!.. ఏం చెప్పాలి?..’’
‘‘ఎప్పుడు వస్తున్నారని?..’’
‘‘ఈ సాయంత్రం ఏడుగంటలకు!..’’
‘‘ఎవరెవరు వస్తున్నారు?..’’
‘‘అందరం!..’’
‘‘అంటే!..’’
‘‘మానాన్న.. అమ్మ.. నా ఇద్దరు చెల్లెళ్ళు రంజనీ రాగిణీ!..’’
‘‘అలాగా!..’’
‘‘అవును..’’
‘‘చాలా సంతోషం!..’’
‘‘నీకేం కావాలి?..’’
‘‘ఆ..’’
‘‘నీకేం కావాలని అడుగుతున్నా!..’’
‘‘మీకు తెలియదా!..’’ చిరునవ్వు తో చెప్పింది అరుణ.
అదేసమయానికి.. నారాయణమూర్తి చేతుల్లో సంచులతో ఇంట్లో ప్రవేశించారు..
అరుణ వారిని చూచింది.
‘‘నాన్నా!.. ఏమిటివి?..’’
‘‘ఎవరూ మీ నాన్నగారా!..’’ అంటూ అనసూయ అరుణను సమీపించింది.
‘‘ఫోన్ లో ఎవరమ్మా!..’’
‘‘మీ అల్లుడుగారు నాన్న!..’’
‘‘ఓహో!..’’
‘‘ఫోన్ మామయ్యగారికి ఇవ్వు!..’’ అన్నాడు ఆనందబాబు..
‘‘ఆఁ.. ఏండీ!..’’
‘‘ఫోన్ మీ నాన్నగారికి ఇవ్వు!..’’
‘‘ఆ.. ఆ.. నాన్నా, వారు మీతో మాట్లాడుతారట!..’’
నారాయణ మూర్తి ఫోన్ అందుకొన్నాడు.
‘‘హలో! అల్లుడుగారూ!..’’
‘‘ఆ.. నేనే మామయ్యగారు. అంతా కుశలమేకదా!..’’
‘‘ఆఁ.. ఆఁ.. అంతా ఆ సర్వేశ్వర కటాక్షంబాబు.. సాయంత్రానికి వస్తారు కదూ!..’’
‘‘అవును మామయ్యా!..’’ చెప్పాడు ఆనందబాబు..
‘‘చాలా సంతోషం.. జాగ్రత్తగా రండి బాబు!..’’ సెల్ ను అరుణ చేతికి అందించి..
‘‘అనసూయా!..’’ పిలిచి తన బెడ్ రూమ్ లో దూరాడు నారాయణమూర్తి.
అనసూయ.. అరుణలు ఆ రూమ్ లో ప్రవేశించారు.
నారాయణ మూర్తి వస్త్రాలను అన్నింటినీ వారిరువురికీ చూపించాడు.
ఆ గుడ్డలు ఆ ఇరువుకి బాగా నచ్చాయి.
‘‘మొత్తం ఎంత అయింది నాన్నా!..’’ అడిగింది అరుణ.
నారాయణమూర్తి నవ్వాడు..
‘‘చెప్పండి నాన్నా!..’’ అడిగింది అరుణ
‘‘ఎంతయితే నీకెందుకే!..’’ విరక్తిగా అంది అనసూయ.
‘‘ఎందుకు అనూ విసుగు. అమ్మా! పదకొండువేల ఎనిమిది వందలు..’’
‘‘అమ్మడూ!.. అన్నీ బాగున్నాయా!..’’
‘‘సూపర్ నాన్నా!.. చాలా బాగున్నాయి..’’ నవ్వుతూ చెప్పింది అరుణ.
అల్లుడు ఆనంద్ బాబు.. వారి జనకులు వీరరాఘవయ్యగారు వారి శ్రీమతి వైశాలి.. కుమార్తెలు రంజనీ రాగిణీ.. సాయంత్రం ఏడున్నరకల్లా టాక్సీలో ఇంటి ముందు దిగారు.
నారాయణమూర్తిగారి గ్రామం జిల్లా రాజధానికి ఎనిమిది కిలోమీటర్లు. హైవేనుండి పడమట వైపుగానాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది. మొత్తం మూడువ వందల ఇళ్ళు. చుట్టూ పైరు పోలాలు.. తోటలు. ఎటు చూచినా పచ్చని మనోహరమైన వాతావరణం. హైస్కూలు టీచరుగా ఆరునెలల క్రింద నారాయణమూర్తి రిటైర్ అయ్యి రెండు నెలల క్రింద కుమార్తె అరుణ వివాహాన్ని జరిపించారు.
వియ్యంకుడు వీరరాఘవయ్యగారు సబ్ రిజిష్టార్ గా పనిచేసి రిటైర్ అయ్యి మూడు మాసాలయింది. పెద్ద కొడుకు వివాహం జరిగాక రిటైర్ అయినాడు. ఆనందబాబు బ్యాంక్ లో అసిస్టెంట్ మ్యానేజర్. చిన్న కొడుకు శంకర్ రైల్వే స్టేషన్ మాష్టార్. రంజని రాగిణీలు కవలలు. బి.టెక్ చదువుతున్నారు. రెండువ సంవత్సరం..
వారి రాకకై వాకిట వున్న అరుణ నారాయణమూర్తి అనసూయ వారినందరినీ సాదరంగా స్వాగతించారు.
పాదప్రక్షాటన జరిగాక.. అందరికీ అరుణ కాఫీ అందించింది, ఆనందంగా త్రాగారు..
వదిన మరదళ్ళు ఒక గదిలో.. భార్యా అరుణ భర్త ఆనంద్.. ఒక గదిలో వరండాలో నారాయణమూర్తి వీర రాఘవయ్య పిల్లలు రంజనీ రాగినీలు సరదాగా కబుర్లు చెప్పుకోసాగారు. అరుణ ఆనంద్ లు వారిని కలిశారు.
సాయంత్రం ఎనిమిదిన్నర అది పుష్య మాసం. శుక్ల పక్షం వెన్నెల రోజులు. పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల..
అందరూ వాకిట వెన్నెట్లో కూర్చొని ఆనందంగా సరస సంభాషణలలో భోంచేశారు.
‘‘బావగారు!.. గ్రామీణ ప్రకృతి.. యీ వాతావరణం నగరాల్లో ఎక్కడ లభిస్తుంది?.. అంతా ఇరుకు.. కాలుష్యం!.. మీరు చాలా అదృష్టవంతులు బావగారు!..’’ పరవశంతో చెప్పాడు వీరరాఘవయ్య.
అందరూ ఆనందంగా భోంచేసారు. తరువాత శయనం..
వేకువన..
అందరూ.. నాలుగు గంటలకు లేచి భోగి మంటను వేశారు. తలలు నూనెతో అంటుకొని హాయిగా వేనీళ్ళస్నానాలు చేశారు.
నారాయణమూర్తి దేవతార్చనా.. పూజాక్రియలను జరిపారు. అందరూ కొత్త వస్త్రాలు ధరించారు.
పూజామందిరంలోని దైవానికి భక్తితో నమస్కరించారు. మనోవాంఛలను తెలుపుకొన్నారు..
ఎనిమిది గంటల ప్రాంతంలో టిఫిన్. పెసల దోశలు.. అల్లంచట్నీ సాంబారు పులుసు.. తృప్తిగా భోంచేశారు..
అరుణ ఆనందబాబు రంజనీ రాగిణీ.. నలుగురూ కలసి ఊరంతా సరదాగా తిరిగి వచ్చారు.
పెద్దలు ఇరువురూ పైరు పొలాలను చూచి వచ్చారు.
నారాయణమూర్తికి రెండు గేదేలు.. ఏడు ఆవులు వున్నాయి.
పాలేరు పండుగాడు.. తెగల పాతరను త్రవ్వి తేగలను తీశాడు.
టంపట వేసి కొన్ని.. కాల్చికొన్ని వారికి ఇచ్చాడు.
బుఱ్ఱగుండును తాటిముట్టెలను పగులగొట్టి తీసి పళ్లెంలో వుంచాడు.
వీరరాఘవయ్య పుట్టిందీ.. ఇరవై సంవత్సరాలు పెరిగింది పల్లెటూరు. అందుకే వారికి బుఱ్రగుంజు.. తేగలు అంటే ఎంతో ఇష్టం. ఆనందంగా ఆరగించాడు. పిల్లలందరు కూడా తిన్నారు. పాలేరు పండును అభినందించారు.
భోగి.. పెద్దపండుగ.. కనుమ.. పండుగలను ఆనందంగా గడిపారు. 4వ రోజు వారంతా.. వారి వూరికి ప్రయాణం.. తోటే కోడలు అరుణ కూడా వారితో బయలుదేరింది భర్త కోరిక మీద..
నారాయణమూర్తి.. అనసూయలు ఆడవారికి తాంబూలాలు పద్ధతి ప్రకారం యిచ్చారు.
వాకిట్లో టాక్సీ వచ్చి ఆగింది..
వీరరాఘవయ్య.. వైశాలి.. రంజనీ.. రాగిణీ.. అరుణ, నారయణమూర్తి అనసూయలకు చెప్పి టాక్సీ ఎక్కారు.
అల్లుడు ఆనంద్.. నారాయణమూర్తిని సమీపించి.. వారి చేతికి ఒక కవర్ మిగతావారు చూడకుండా ఇచ్చారు..
‘‘ఏంది బాబు ఇది?..’’ అడిగాడు నారాయణమూర్తి.. ఆనందబాబు.
‘‘మేము వెళ్ళాక చూచుకొండి!..’’ టాక్సీకి సమీపించి కూర్చున్నాడు.
డ్రైవర్ బాబూ ట్యాక్సీను స్టార్ట్ చేశాడు. భై, బై చెప్పి వారు వెళ్ళిపోయారు.
నారాయణమూర్తి అనసూయ కళ్ళలో కన్నీరు. ‘‘వారంతా వున్నందు నాలుగు రోజులు నాలుగు క్షణాలుగా గడిచిపోయాయి..’’ అన్నాడు నారాయణమూర్తి. కవరు చూచాడు. డబ్బు.. లెక్క పెట్టాడు.. ఇరవై వేలు.. ఆ దపంతులు ఇరువురూ ఆశ్చర్యపోయారు..
‘‘అనూ!.. మన అల్లుడు మనకు వారు అల్లుడు కాదు!.. కొడుకే!..’’ ఆనంద పారవశ్యంతో అన్నాడు నారాయణమూర్తి.
ఇరువురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు.
సమాప్తం.
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comments