top of page

విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ


'Vijayanagara Samrajyaniki Ankurarpana' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


కథాపఠనం: కే. లక్ష్మి శైలజ

సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక మహా ముఖ్యమైన రాత్రి పండుగ వస్తుంది.


అదే మహాశివరాత్రి. అది హిందువులందరికీ మహా పవిత్రమైన పర్వదినం. ఆనాడు హిందువులందరూ పిన్నలు, పెద్దలు, వృద్దులూ, స్త్రీలూ, పురుషులూ- పూజలు,

పునస్కారాలూ, జపాలు, తపాలు, యజ్ఞయాగాదులు మొదలగు పుణ్యకార్యము లెన్నింటినో చేస్తూ పరమశివువి పూజిస్తారు. అది హిందువుల కొక్కరికే చెందిన పండుగ కాదు. సకల మానవాళికి మహా పుణ్యదినము. మానవులకే కాక కిన్నరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు, యక్ష, గంధర్వ, విధ్యాధరాది సర్వులానాడు సర్వేశ్వరుడగు ఈశ్వరుని ఆరాధిస్తారు.


నిర్మల మనస్కులైన భక్తులను, బీద నారాయణలకు దానధర్మములను చేసిన ధార్మికులను, పరమేశ్వరుడు ఆనాడు చిదానందము, కోటి సూర్య ప్రభా సమాన తేజోమూర్తియై నిజరూపముతో అనుగ్రహిస్తాడు.


ఈ కలియుగమునందు పదమూడవ శతాబ్దిలో అటువంటి మహాశివరాత్రి పర్వ దినమున ఒక శివరాత్రి సమయాన శ్రీభువనేశ్వరీమాత హేమకూటాద్రి శిఖరము మీదకు వేంచేసినది. మహాధ్యాన సమాధి నిష్టయందున్న శ్రీవిరూపాక్షస్వామి ని చూసింది.


శ్రీ విరూపాక్షుడు ఆమె ఏమైనా ముఖ్యమైన పనిమీద వచ్చిందేమోనని దివ్యదృష్టి చేత తెలిసినవాడైనను, వెంటనే కండ్లు తెరువలేదు. పెదవి విప్పి మాట్లాడలేదు. కొద్ది సేపైన తరువాత శ్రీవిరూపాక్షులు కండ్లు తెరచి చూసేటప్పటికి ఎదుట శ్రీభువనేశ్వరీమాత నిమీలిత నేత్రయై ధ్యాన నిమగ్నయై వెలుగొందు చుండెను. ఆమెను ఆ స్థితిలో చూడడం శ్రీవిరూపాక్షులకు ఎంతగానో ఆనందమైంది. "భువన" అని ప్రేమగా పిలిచి ఆమెను ఆ స్థితిలో నుండి మేల్కొలిపాడు.


శ్రీవిరూపాక్షుల పిలుపు విని శ్రీభువనేశ్వరి కన్నులు తెరచి చూచి భక్తి గౌరవములతో అంజలి ఘటించినది. విరూపాక్షస్వామి చిరునవ్వుతో "భువనా! ఈ నాడిలా కళావిహీనవై వుండుటకు కారణమేమిటీ? ఎల్లప్పుడు చిరునగవు చిందులాడు నీ మోమేలకో వన్నె తరిగి చిన్నబోయెను. ఏదియో నొక విషయము క్లిష్టమునైన సమస్య నీ మనమున నిలిచి, నిన్ను బాధించుచున్నదియో? దానిని గురించి తీవ్రముగా ఆలోచించుచుంటివో? నాకు

తెలియజెప్పుము" అన్నాడు..


శ్రీభువనేశ్వరి ఆ వాత్సల్యపూరిత వాక్కులకు ఆనందించిన, విచారగ్రస్తమైన వదనంతో " స్వామీ! ఏమని చెప్పను నా బాధ. భూలోకమున ప్రజలు నీతి న్యాయములు పాటింపక, దుష్టకార్యములను చేయుచూ పాపగ్రస్థు లై జీవిస్తున్నారు. ఇది నా కెంతో బాధను కలిగిస్తున్నది" అన్నది.


"దేవీ! అట్లయిన భూలోకమున ఇంతటి అకృత్యములు నీవు భరిస్తున్నావన్న మాట. అయితే నీ వారంతా ఎట్లా వున్నారు? నీ అసలు దుఃఖమునకు కారణమేమి" అని ప్రశ్నించినాడు శ్రీవిరూపాక్షుడు.


శ్రీభువనేశ్వరీదేవి క్రోధితయై ఏమి చెప్పకుండా మౌనం వహించింది.


శ్రీవిరూపాక్షస్వామి "అయ్యో దేవీ! ఇలా క్రోధం వహిస్తే ఎలా? నీకు కలిగిన కష్టము విశదపరిచిన అది తీరు మార్గము తెలిపెదను కదా?" అని అనునయించాడు.


అంతట శ్రీ భువనేశ్వరి ఇట్లు పలుకసాగింది.

"స్వామీ! నేను తెలుపు కష్టాలు నా కొక్కదానికే చెందినవి కావు. భూలోకవాసుల కష్టాల పరంపర నన్ను కలత చెందించుచున్నది. కన్నులార నేను చూడలేనంతగా నున్నవి వారి కష్టములు. ప్రభూ! నీకును, నాకునూ పరమపూజ్యమైన గోవులను క్రూరంగా వధిస్తున్నారు. స్త్రీలను చెఱబట్టుచున్నారు. దేవతా విగ్రహాలను కొల్లగొడుతున్నారు. హిందూధర్మము అన్ని విధముల నాశన మొనరింప బడుచున్నది. భూరాజ్యమును కొంత దురాక్రమణ చేసి ఆక్రమించుకొనిన యవనులు ఈ దురాఘాతములకు కారకులు. ఈ కష్టములన్నీ నశింపవలెనంటే తమరు భూలోకమున అవతరించవలెననీ నా వాంఛ".


అంతయు విన్న శ్రీవిరూపాక్షస్వామి "నీవు చెప్పిన విషయములను విన్న తరువాత యవనులు హిందూధర్మమును నాశనమొనర్చు స్థిరనిశ్చయులైనారని స్పష్టమగుచున్నది. హిందూమతమును శాశ్వతముగా భూలోకము నుండి తుడిచివేయుటయే వారి ధృఢసంకల్పము" అన్నాడు.


"హిందు రాజ్యములన్నీ తమలో తమకు ఐక్యభావము లేక యవనుల దురాక్రమణలకు బలియై ఒకదానివెంట ఒకటి నశించిపోయినవి. ఒక్క హిందూరాజ్యమైననూ మిగలలేదు. హింస, అరాచకము, కపటము, అసత్యము, అన్యాయములు నేటి దైనందిన కృత్యములైనవి. కండబలము గలవానిదే రాజ్యముగా నడుచుచున్నది” అన్నది శ్రీభువనేశ్వరి.


"హిందూరాజ్యములు భోగలాలసులయి తమ పరిపాలనమున ప్రజల యొడగల తమ భాద్యతను విస్మరించుటచేతనే యవనులు హిందూరాజ్యములపై దండెత్తుట జరిగినదనుట అసత్యమా?" అన్నాడు శ్రీవిరూపాక్షుడు.


"ప్రభూ! భూలోకమున నేజూడజాలని హింసాకాండను గూర్చి తమకు నివేదింప వచ్చితిని. దైవారాధనములు, భక్తితత్పరులయి ధ్యానాదుల నొనర్చుచున్ననూ

హిందూరాజులటుల యవన దురాక్రమణదారులచే ఓటమి పొందుటకు కారణమేమి ప్రభూ? ఆ విషయమును గూర్చి తెలుపు దేవా! ధార్మికముగా, తాత్వికముగా జీవించు వారట్లు విజితులగుటకు వారు చేసిన పాపము లేమి స్వామీ?" అన్నది శ్రీభువనేశ్వరి.


శ్రీవిరూపాక్షస్వామి చిరునవ్వుతో "దేవీ! భూమండల మందు నిజముగా ఏమి జరుగుతున్నదో నీకు విశదపరచి నీ చేతనే దానిని ఒప్పించెదను. నీకు శాంతియు చేకూరును. భక్తుల మనస్సు అతి నిర్మలము, నిష్కల్మషముగా వుండవలయును. దేవతల నారాధించుట, తదితర ధార్మిక కృతకృత్యములకంటె నిర్మల హృదయము వుండుట అత్యంత ముఖ్యమైనది. హిందూరాజులయినను, మరి యెవరయినను మనస్సు నిర్మలము కాకున్నచో, ప్రయోజనము లేదు. అంతే కాదు రాజొక్కడు మాత్రమే నిర్మల హృదయుడు, నిశ్చల మనస్కుండై భక్తుడైన చాలదు.


ప్రజలు అటువంటివారే కావలయును. ప్రజలను, ప్రభువులను సక్రమమైన మార్గమున నడిపించగలిగిన మహర్షి యొకడుండవలెను. అలాగే రాజ్యమును పాలించు

ప్రభువు అన్నివిధముల సమర్థులయి ఉండవలెను. అప్పుడు మాత్రమే ధర్మ నిర్వహణము, ప్రజల ధన, మాన, ప్రాణముల రక్షణ కలుగును. శాంతి భద్రతలతో

దేశము సురక్షితముగా నుండును. రాజ్యమున కోటలెంత అభేద్యములయిన సైనిక పాటవమెంతయున్న, రాజ్యమెంత ధనధాన్యాదులతో వైభవాలతో తులతూగుచున్న ఆ రాజ్యము పైన తెలిపిన విషయములలో ఏ యొక్కటి లోపించినను, ఆ

రాజ్యమంతరింపక తప్పదు.


అట్టి రాజ్యము విధ్వస్తమగుట యెంతసేపు? కాబట్టి ప్రజలు కాలానుగుణంగా పరిణామములకు, పరిస్థితుల కలవాటు పడవలెను. అశాశ్వతములైన వానిని శాశ్వతము చేయుట అసాధ్యము. అటులే శాశ్వతముగా నిలుపవలసిన వానిని నాశనము చేయుట అశక్యమే. కనుక కానున్నది కాక మానదు. కానది కాబోదు. ఈశ్వరేచ్ఛకు వ్యతిరేకంగా మనం ప్రవర్తింకూడదు. భగవదిచ్ఛలను, ఈశ్వర సంకల్పములను మనము శిరమున ధరింపవలయును" అన్నాడు.


శ్రీభువనేశ్వరి, స్వామి మాటలకు "స్వామీ! తమరు చెప్పినదంతయూ అవగతమైనది. తమ ఆశయమేమో తెలియజెప్పుము" అన్నది.


అందుకు విరూపాక్షుడు "భువన! ధర్మపరిరక్షణము కావింపబడ వలయుననుటయే నా ఆశయము. అన్యాయము, హింస, అరాచకము మున్నగునవి యేర్పడి విజృంభించి లోకమును ఏలునప్పుడు భూమి నవతరించుట భగవానుని సంకల్పము. భగవంతుడవతరించు సమయముననే భూలోకమునందును, ధనమాన ప్రాణములను రక్షించగల శక్తియుతుడు సమర్థుడగు రాజు కూడ నుద్భవించును.


ఆ యిరువురు మహామానవులు కలిసి ప్రజలకు రక్షణ కల్పించి ఆత్మవిశ్వాసము పెంపొందించి, జాతికి శాంతిభద్రతలు సమకూరుస్తారు. అట్టివారి పరిపాలనమున

ప్రజలు దుఃఖములు తొలగి ఆనందములో తేలియాడుతారు అనగా---

"స్వామీ! మిక్కిలి ఆశ్చర్యముగనున్నది. కాబట్టి హిందూ ధర్మపరిరక్షణనకు, హిందూజాతి రక్షణకు మహర్షి సప్తముడొకడు, మహాధీరుడగు ప్రభువొకడు.. ఇద్దరుండవలెనా?" యన్నది ఆశ్చర్యముగా శ్రీభువనేశ్వరి.


"అవును, దేవీ! అటువంటి మహా వ్యక్తిత్వములు భూలోకమున నుండవలెనని నా అభిప్రాయము, నా ఉద్దేశ్యము. "


"అయితే ఇప్పుడటువంటి యుగపురుషుడొకరు (మానవరూపమున అవతరించిన

భగవంతుడు) రాష్ట్రపురుషుడొకరు (మహాధీరుడు- రాజపురుషుడు) భూమిపైన నుండవలసిన అవసరము వచ్చినదందురా? ప్రభూ?"


"భువన! నా పలుకులు నెమ్మదిగా వినుము. అట్టివారు చాలాకాలము క్రిందటనే భూమియందు పుట్టియున్నారు."


"అవునా స్వామీ! ఎవరు వారు? ఎచ్చటనున్నారు?" ఆత్రుతగా ప్రశ్నించిందిభువనేశ్వరి.


"పంపారణ్యము గుండా ప్రవహించుచున్న తుంగభద్రా నదీ తీరము నందా యుగ పురుషుడు తపమాచరించుచున్నాడు. రేయింబవళ్ళతడు, ధ్యానసమాధియందు యుండును. ఆ మహానీయుని పవిత్రనామము మాధవుడు. అతడు పరమభక్తితో నిన్నర్చించు మాధవుడే. డిల్లీ నగరమున చక్రవర్తి మహమ్మద్‍బీన్‌తుగ్లక్‌ చేతిలో బంధీగా కారాగారమున నున్న వాడే రాజపురుషుడు" అంటూ వారి గురించిన వివరాలు తెలియజేశాడు శ్రీవిరూపాక్షస్వామి.


భువనేశ్వరి మిక్కిలి ఆనందంతో ఇలా అన్నది. "నా మది యిప్పుడు శాంతి బొంది నెమ్మదయినది. నా కోరిక నెరవేరినది. కర్ణాటక దేశమునందావరించిన చీకట్లు ఇక

విచ్ఛిన్నమగును. ఆ రాష్ట్రపురుషుండెప్పుడు బంధవిముక్తుడగునో తెలుపుము."


"అతడచిర కాలముననే విముక్తుడగును. వీలయినంత త్వరలో నతడు విముక్తుడగుటయే, భగవత్సంకల్పము. ఎంత ప్రయత్నించినను డిల్లీ సుల్తాన్‌ అతనినెంతో కాలము చెరయందుంచలేడు. ఈ విషయమున నీకు గల ఉత్సాహ కారణమేదియో తెలిపెదవా దేవీ భువన!"


హిందూరాజులలో అనైక్యత, యవన ప్రభువుల దుస్సాహసమైన దండయాత్రల మూలమున, ఒకదానివెంట ఒకటిగా హిందూరాజ్యము లన్నియు అంతరించు విషయము తమకు తెలిసిన విషయమే గద ప్రభూ! కనుక హిందూధర్మము సక్రమ పథమున పునరుద్దరింపబడుట యెంతయో ఆవశ్యకమైనది. హిందూధర్మపరి

రక్షణము, ప్రజలను బాధించుచున్న అన్యాయము, విదేశి దురాక్రమణము, హింసాకాండ, స్త్రీల అపహరణాది దుర్భరమయిన దుష్కృత్యములు తుదముట్టింపబడ

వలయును.


తమరు నుడివిన తుంగభద్రాతీరమున ఢిల్లీ పంపాతపమాచరించుచున్న ఆ మాధవుడు ఇప్పుడు గొప్ప ఋషియైనాడు. "


" డిల్లీనగరము నుండి రాష్ట్రపురుషుని యుగపురుషుడుగా మాధవుని చేర్చి, హిందూ ధర్మరక్షణకై యొక మహా సామ్రాజ్యమును స్థాపింపజేయవలెనని సంకల్పించు చుంటివి గద భువన! అయిన..... " అనుచు అర్ధోక్తిలో ఆగిన శ్రీవిరూపాక్షుని, కడు నచ్చెరు పాటుతో చూచుచు......

"అర్దోక్తిలో ఆగితిరేల ప్రభూ! ఈ సందర్భమున అపాయము నేదైనా నూహించుచుంటిరా? సంపూర్ణముగా తెలియజేయుము స్వామీ!" అన్నది భువనేశ్వరి.


"అట్టి సంఘటనలేమైన నున్నను నీకు భయమేల? భూదేవి యైన నీవిట్టి అల్ప విషయములపై భీతి చెందరాదు. హిందూజాతి ఉద్ధరించుటకు, వారికి రక్షణ కల్పించుటకు మహా తపమాచరించుచున్న మాధవుడు తొలుతగా తన ప్రయత్నమున సఫల మనోరధుడేకాని, కడకతడు విఫలుడు కాక తప్పదు" అన్నాడు శ్రీవిరూపాక్షుడు.


భువనేశ్వరి ఆందోళనతో "అయిన మాధవుని తపశ్చర్య వ్యర్థము, నిష్ప్రయోజనము కావలసినదేనా ప్రభూ? అతడు శాశ్వతమైన ఫలితము సాధింపలేడా దేవా?" అన్నది.


"దేవీ భయపడకు? అంత భీతి చెందవలసిన పని లేదు. భూమిపై పుట్టిన ప్రతి ప్రాణియు గిట్టక తప్పదన్న విషయము పరమసత్యము కదా! ఈ పరమ సత్యమగు ప్రాణిధర్మము నుంచి, యే ప్రాణియు తప్పించుకొనజాలదు. ప్రకృతిలో కలుగనున్న గాలివానను లేక అట్టి పీడన నెవ్వరయిన ఆపగలరా? లేదు.


మహాతపశ్శక్తి వలన కొలదికాలము ఆపవచ్చును. కాని, పూర్తి శాశ్వతముగా దాని నాతడాపలేడు. కాబట్టి, నీవు నిర్మింపనున్న ఆ మహాసామ్రజ్యము ఎల్లకాలము ఎప్పటికిని నిలుచునది కాబోదు. ఆకసమున మెఱుపువలె అంతటి మహాసామ్రజ్యము నొకనాటికి పతనము చెంది తీరును. " అంటూ భువనేశ్వరి వైపు పరీక్షగా చూడసాగాడు విరుపా

క్షులు.


భువనేశ్వరి కొద్దిసేపు మౌనం వహించి, తరువాత "అయితే స్వామీ! ఈ సామ్రాజ్య మెంతకాలము నిలుచునో తెలియజేయుము" అన్నది.


“నీ అనుగ్రహము, సాయము వలన మాధవుడు మహాసామ్రాజ్య నిర్మాణమునకు శంకుస్థాపన కావించును. మాధవుడా సామ్రజ్యమును కొంతకాలము తన తపఃఫలముతో పునీతము చేయును. మాధవుడు హరిహరుని సింహాసనమున ప్రతిష్ఠించును. అయినను నీ సామ్రజ్యము ఎల్లకాలము నిలువదు." మరోసారి తను చెప్పిన మాటలు నొక్కి చెబుతూ తెలిపాడు శ్రీవిరూపాక్షుడు.


“హిందూధర్మరక్షణకు, హిందూజాత్యుద్ధరణమునకు మహా సామ్రజ్యము స్థాపించబడుటకు నేను స్థిర సంకల్పములో నున్నాను ప్రభూ! ఆ సామ్రాజ్యమెంత కాలము నిలుచునో తెలుపుము దేవా!" అను దీనంగా అడిగింది భువనేశ్వరి.


ఆమె పట్ల దయకలిగిన వాడై "దేవీ! నీవు స్థాపించబోయే సామ్రాజ్యము మూడు శతాబ్దములు మాత్రము నిలుచును. ఆ మూడు శతాబ్దముల కాలమును హిందూ ధర్మము, జాతిని ఆ సామ్రాజ్యము రక్షింపగలదు. ప్రజలు తమలో తాము ఏర్పరచుకొని బాధ నొందుతున్న హింస, ఆజ్ఞానాంధకారముల నుండి నీవు వారిని సరియైన మార్గమున నడిపించి, మంచిని వారికి బోధింపుము" అని పలికాడు.


"ప్రజలను ధర్మము నుద్ధరించుటకు సామ్రాజ్య నిర్మాణమునకు నన్నును గ్రహించి అవకాశము కల్పించినందులకు నేను మిక్కిలి కృతజ్ఞురాలిని ప్రభూ!" అంటూ చేతులు జోడించింది భువనేశ్వరి.


"ఈ స్వల్ప విషయ మాత్రముననే తృప్తి చెందకుము. నీవు సంకల్పించిన మహాసామ్రాజ్యము మూడు శతాబ్ధముల కాలమే నిలుచునన్న విషయము మరువకుము.

మాధవుడు, నీవును సామ్రాజ్యకాలము ఇంకను దీర్ఘము చేయదలంచి నచో దానికొక మార్గము కలదు." అంటూ సెలవిచ్చాడు విరూపాక్షుడు.


భువనేశ్వరి ఆనందంతో "తన్మార్గము నాకానతినిండు స్వామీ!" అన్నది.

"భువనా! అంత కలవరపాటేలా నీకు! నీ హృదయము సుమసమము. ఆనందముగా నున్నప్పుడు నీ హృదయ కమలము వికసించును. కలతజెందినపుడది ముకుళించుకొనును. ఆలకింపుము. నీవు నిర్మింపనున్న ఈ మహాధార్మిక సామ్రాజ్యమునకు మానవుడు శంఖుస్థాపన చేయును. కాని ఏతద్రాజ్యపాలకుడగు రాజు,

ధర్మము కొరకు, ప్రజల కొఱకు దేశము కొరకు ఎట్టి త్యాగము సేయుటకయిన సిద్దపడగల సుగుణశీలియై యుండవలెను.


ప్రజలు కూడ దేశము నెడ సక్రమమైన మార్గమవలంభించు చక్కని పౌరులయి యండవలయును. హింసకు, చౌర్యమునకు, దుష్ప్రవర్తనమునకు, పోరాటములకు, మోసములకు తావీయరాదు. ప్రజాక్షేమము నకనవరతము పాటుబడుచు, అవసరమగుచో నందు కొరకు తన జీవితమునే అర్పణ చేయగల త్యాగశీలియునై యుండవలయును.


ఇట్టి త్యాగశీలి, ప్రజాసేవకుడైన వాడెప్పుడును అదృష్టము పై నాధారపడరాదు. ప్రయత్నము లేనిదే యే వ్యక్తియు ఫలిత మనుభవింపలేడు. రాజ్యము విజయవంతముగా నిర్వహింపబడవలయునని ఈ యంశములన్నియు నత్యావశ్యకము లయినవి. ఈ పై దెలిపిన వానిలో నే విషయము లోపించినను ఆ సామ్రాజ్యమెంత బలీయమైనదైనను రేపోమాపో పతనము చెందక తప్పదు. ఏదియేనొక లోపము కలుగకపోదు.


కనుకనే, నీవు నిర్మింపనున్న సామ్రజ్యమెక్కువ కాలము నిలువదని పలికితిని. సర్వము నీ యిచ్ఛకే వదిలితిని. వాస్తవ విషయములు నీ కెరింగించితిని. నీ మనస్సును గాయపరుపజాలము. కాని నా విధి నేను నిర్వహించితిని. ఈ విషయమై నీవిక ముందుకు సాగవచ్చును. నా కెట్టి అభ్యంతరము లేదు. సర్వ విధముల నీకు విజయము కలుగుగాక యని కోరుచున్నాను. పరిపూర్ణముగా సమగ్రముగా ఆలోచించిన తరువాతనే యే పనియైన జయము" అంటూ విరూపాక్షులు ముగించారు.


అంతా విన్న భువనేశ్వరి "కింకర్తవ్యతా మూఢురాలనై, కష్టదశలో నున్న నాకు కర్తవ్యోపదేశము గావించి నాకు వెలుగుబాట ప్రసాదించి నందులకు మీకు నేనంతయో కృతజ్ఞురాలను ప్రభూ! తమ కడకు మార్గము నన్వేషింప వచ్చి కృతార్ధురాలనైతిని. భూలోకమున జరుగుచున్న దారుణ హింసాకాండ దుర్భరము, దుస్సహము

నగుటచే నీ పాదసన్నధి కేతెంచితిని. తెలిసియో, తెలియకయో నే గావించిన తప్పులేమైన నుండిన క్షంతవ్యురాలను ప్రభూ!


పరిస్థితుల నేను కొన్ని పరుషములు మీకు మనఃక్లేషము కలిగించునట్లేమైన పలికియుందును. అహింస, సత్యము, శాంతి, ధర్మము, న్యాయము మున్నగు వానిపై నాధారపడియుండు సామ్రాజ్యమును స్థాపింప నా శక్తినంతయి ధారపోసి కృషి చేయుదును ప్రభూ! నీ అమేయ గుణగణములు వర్ణించుటకు పలుకులు చాలవు. మానవాళికెల్ల రక్షకుడవు నీవు. విశ్వనాథుడవు. మా కెల్లరకు హితుడవు. వేదాంతవేత్తవు. మార్గదర్శకుడవు. ఇంతకు మించి నిన్ను నే వర్ణింపజాలను.


భవదుక్త ప్రకారమే సామ్రాజ్య స్థాపనమొనర్చి, దోషరహితముగా నుంచ ప్రయత్తింతును" అన్నది భక్తితో వినమ్రంగా భువనేశ్వరి.


"మదుక్త ప్రకారం సామ్రాజ్యము నెలకొల్ప నున్నందులకు, నీ స్థిర నిర్ణయమునకు, దృఢసంకల్పమునకు నే నెంతయో సంతసించుచుంటిని. మాధవుని సాయము దీసికొని నీవు స్థాపింపనున్న సామ్రాజ్యము ప్రజలకు కొంతకాలము వరకైనను అలజడి, ఆందోళనలు పోగొట్టి శాంతిభద్రతలు చేకూర్చగలదని నాకానందముగ నున్నది.


అదిగో! ఆ కొండ క్రింద అటు చూడుము. మాధవుని పాదసన్నిధిని యెవ్వరో ఇరువురు సోదరులు ప్రణమిల్లుచున్నారు. వారిలో నొకరు కుమ్మటి దుర్గాధిపతి

(కంపిలి) యగు కుమార రామనాధుని మరణము, కంపిలి రాజ్యము యొక్క పతనములను గూర్చి నివేదించుచున్నారు. హిందూ రాజులలో నున్న అనైక్యతయే ఆ రాజ్య పతన హేతువు, ఈ బలహీనతను చక్కని అవకాశముగా వినియోగించుకొనుచు యవన దురాక్రమణదారులు హిందూరాజుల యందు హింస, అరా

చకము, నిస్పృహ, కలహములు కలిగించుచున్నారు. ఫలితముగా ఒక్కొక్క రాజ్యము అంతరించుచున్నది. అది ఈ విషయము నివేదించుచున్న వానిని మిక్కిలి బాధించు

చున్నది. " అని మౌనం దాల్చారు విరూపాక్షులు.

భువనేశ్వరి "అవును ప్రభూ! ప్రజల కొరకు తన సర్వ సౌఖ్యానందములు త్యాగముచేసి, మహాకఠోర తీవ్ర తపమాచరించు చున్నారు, మాధవుడు. అట్టివాడు నా బిడ్డ

యగుట నా భాగ్యవిశేషము”.

"నీ ప్రేమాదరములకు నోచుకొనిన మాధవుడు నిజముగా అదృష్టవంతుడు. సామాన్యులైన అన్యులెవ్వరును చేబట్టి సాహసింపజాలని దుష్కరకార్యాచరణ భారమును తన భుజస్కందములపై వహించినాడు. దుఃఖాందకారమును తొలగించి తన దేశీయులకతడు విజ్ఞానజ్యోతిని, అహింస, న్యాయము, మత ధర్మముల నందింప నిశ్చయించినాడు. ఈ విషయము మనలకందరకును హర్షదాయకమేకదా!


ఇట్టి దుష్కర కార్యాచరణమునకు కడంగుట దేవతలకును సాధ్యము కాదనుట అతిశయోక్తి కాదు. మాధవునకు సర్వవిధముల విజయము కలుగుగాక యని

నేను కోరుచున్నాను. అతనికి ఘనత, ఆనందములు కలుగ వలయునని నే కాంక్షించుదును. అతడు తన కార్య నిర్వహణమును నిరాటంకముగా అక్లేశముగా పూర్తి

చేయుగాక. దుష్టశక్తులను జయించుటవలనను, మహామేధావి యగుట వలనను మాధవుండప్పటి నుండి విజయ విద్యారణ్యులుగా ప్రసిద్ది బడయు గాక. ఆ బిరుద

మాతనికి శాశ్వతముగా నిలుచును" అని పలికాడు విరూపాక్షులు.


భువనేశ్వరి ఆ మాటలకు సంతసించి " విద్యారణ్యులు యను నామము చక్కగానున్నది. మనమాతని నట్టులే పిలుచుదము. ఈ బిరుదము నీవు ప్రసాదించుట వలన నతడు మిక్కిలి ధన్యుడు. అతడీ గౌరవమును తన పూర్వకృత సుకృతముచే బడసినాడు. వాస్తవముగా నేడు పుణ్యదినము. నేడు మనకెల్లరకు పరమ పవిత్రమయిన మహాశివరాత్రి. ఇట్టి పుణ్యదినమున నీవాతని ననుగ్రహించినావు.


అజ్ఞానాంధకారము; అనైక్యత హింసలను పారద్రోలి విజ్ఞానజ్యోతిని, అహింస, న్యాయము, మతధర్మములను వెలుగును లోకమున కందించినావు" అంది.


అంతట విరూపాక్షులు "ఇక నీవేగి నీ ప్రయత్నమున నుండుము. విద్యారణ్యునకు తోడ్పడుము. ఆశ్రయించిన ఆ యిరువు రన్నదమ్ములకు ఆశ్రయమిచ్చి రక్షింపుమని

విద్యారణ్యునితో బలుకుము. ఆ సోదరులలో పెద్దవాడు హుక్క హరిహర రాయలనియు, అతడే స్థాపింపనున్న మహాసామ్రాజ్యమునకు తొలి చక్రవర్తి కావలె ననియు

బలుకుము. నీవు నిర్మింపనున్న యా మహాసామ్రాజ్యము సత్యము, న్యాయము, అహింస, ధర్మము మున్నగు సూత్రములపై ఆధారపడి యుండవలయునని జ్ఞప్తి

యందుంచుకొనవలెను.


చక్రవర్తి యెవ్వరైనను ఈ సామ్రాజ్య పాలనము నీ యంశము

ను విడువరాదు. విస్మరింపరాదు. ఈ సూత్రములు విస్మరింపబడెన యిక ఈ సామ్రాజ్య పతనము అచిరకాలము లోనే సంభవించును. ఆనెగొందిని జయించి, హింసా పూర్వకముగా క్రూరముగా పాలించుచున్న డిల్లీ చక్రవర్తికి ఈ మొదటి చక్రవర్తి చేతిలో ఓటమి తప్పదు. అట్టి గొప్ప విజయము విద్యారణ్యుల మహాతపశ్శక్తి ఫలమే కాబట్టి నీ మనోరథమచిర కాలముననే ఫలవంతము కానున్నదని తెలుపుటకే నెంతయో సంతసించుచున్నాను" అన్నాడు ప్రసన్నంగా.


"నే నింతగా పొగడ్త నందదగినదానను కాదు ప్రభూ! నేను చేసినదత్యంత స్వల్పము. లక్ష్యసిద్దిలో నొక సాధనమును మాత్రమే. మన ఆశయ ఫలితముగా నావిర్భవింపనున్న యీ సామ్రాజ్యము ప్రజలకు శాంతి, ఆనందము లొనగూర్చు గాకయని కాంక్షింతును" అంటూ నమస్కరించింది భువనేశ్వరి.


ఆమె మాటలకు సంతసించిన విరూపాక్షులు "నీవు పలికినట్లు లక్ష్యసిద్దికి నీవొక యుపకరణము అయినను, ప్రముఖపాత్ర నే నిర్వహింతువు. ఇది నీ విజయమే కాని

ఇతరుల విజయము కాదు. నీ అనుగ్రహము చేతనే కదా యీ సామ్రాజ్యస్థాపనము జరుగుచున్నది. ఈ శుభముహూర్తము చాల దగ్గరలో నున్నది. గాన వెంటనే నీవు మరలిపోయి ఆ యత్నమున నిమగ్నవు కమ్ము" అన్నాడు.

"అట్టి శుభసమయమున తనపై కరుణాపూర్వములగు ఆశీర్వచనములిచ్చి యను గ్రహించినందులకు భువనేశ్వరి మాత సర్వేశ్వరుడైన భగవానుని స్తుతించెను. సర్వ

దేవతలను భువనేశ్వరితో జేరి ఈశ్వరుని గొనియాడిరి.

ఈనాడు మనము చూచుచున్న శ్రీవిరూపాక్షదేవాలయము యున్నచోట ఆనాటి ప్రాతః సమయమున నొక్క క్షణకాలము కోటి సూర్య తోజోపుంజము మెరిసినది.


తూర్పన సూర్యోదయమగుచున్నప్పుడు ప్రజలు నిత్యము భగవంతునకు ప్రీతి కలిగించు పూజాధికములగు ధర్మకార్యాచరణము గావింతురు. అది అందరకు పవిత్ర

మైన ప్రతిపత్తి. ఆనాడు హేమకూటమందు " న భూతో న భవిష్యత్తు" గా నొకనాడచట వేటకుక్కలను కుందేలొకటి తరిమి తరిమి కొట్టినచోటున..... ఆశ్రయము కోరి

వచ్చిన హుక్క- బుక్క సోదరులతో కూడి శ్రీభువనేశ్వరి మాత, మాధవ విద్యారణ్యులు సామ్రాజ్య నిర్మాణమునకు శంఖుస్థాపన గావించినారు.


విజయనగర సామ్రాజ్యమునకు తొలి చక్రవర్తిగా హుక్కరాయలు ప్రతిష్టితుడయ్యెను. శ్రీవిరూపాక్షస్వామి

సన్నిధి యందు, శ్రీవిరూపాక్షుని పేరు మీద ఈ రాజ్యాభిషేక మహోత్సవము నిర్వహింప బడెను. హుక్కుడు రాష్ట్ర పురుషుడని వ్యవహరింపబడెను. అది ఆ ప్రాంతపు

ప్రజలు పట్టరాని పరమానందోత్సాహముల పారవశ్యముతో పరవళ్ళు త్రొక్కిన పుణ్యదినము. ప్రజలెల్లరు ఆనందోత్సాహములతో పాటలుపాడి, ఆటలు ఆడిన పర్వ

దినమది. దేశమున శాంతి భద్రతల పరిరక్షణ కొరకు “విజయనగర సామ్రాజ్యము" స్థాపింపబడిన శుభదినమది.

-----------------------శుభంభూయాత్‌-----------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



101 views0 comments
bottom of page