top of page

విప్లవ ఉగాది

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Viplava Ugadi' - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 09/04/2024

'విప్లవ ఉగాది' తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



భారతికి ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పట్నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగింది. అమ్మమ్మగారింట్లో ఉగాది రోజున అమ్మమ్మ చేసే ఉగాది పచ్చడి, ఉగాది రోజు తెల్లవారుజామున నుంచి యింటి ముందు ముగ్గులు వేసేవాళ్ళతో, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవాళ్ళతో, అలంకరణాలు చేసేవాళ్ళతో, ఇంట్లో పని చేసేవారితో, ఊరందరికి పంచడానికి సిద్దపరిచిన రెండు, మూడు బస్తాలతో తోటల్లో కాసిన మామిడికాయలు, వేపపువ్వులు, లేత పనసకాయలు, కొత్త బెల్లం కుండలు తాతయ్య దగ్గరుండి పంచుతుంటే తీసుకోవడానికి వచ్చేవాళ్లతో, మామిడితోటలో చెట్లకు పెద్దతాళ్ళతో ఉయ్యాల కట్టి ఊగేవాళ్ళతో సందడిగా ఉండేది. యిలా ఉగాది పండుగ భారతి దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. మామిడితోటలో చెట్లు ప్రతి యేటా ఉగాదికి తప్పకుండా గంపెడుల కొద్ది కాయలు కాస్తుండడం వలన ఆ తోటని ఉగాది మామిడితోట అని పిలిచేవారు. ఆ మామిడితోటని అమ్మమ్మ భారతి తల్లికి పుట్టింటి పెళ్లి కానుకగా యిచ్చింది. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతి పట్టుబట్టి మరి అమ్మ దగ్గర నుంచి తన పుట్టింటి పెళ్ళి కానుకగా తీసుకుంది. భారతి పెళ్ళయిన తరువాత కుడా ఉగాది పండుగ అలానే జరుపుతూ వస్తుంది. 


 భారతి కాస్త భారతమ్మ అయ్యి పాతికేళ్ళవుతుంది. భర్త సూర్యప్రకాశరావు ఉద్యోగ రీత్యా, కొడుకు కుమార్ చదువుల దృష్ట్యా పల్లెటూరి నుంచి పట్టణానికి మారి మూడేళ్లవుతుంది. వయసు మళ్ళుతున్న కుడా భారతమ్మకి ఉగాది అంటే మక్కువ పోలేదు. ఈసారి ఉగాది యిలా చేద్దాం, అలా చేద్దాం అంటూ ఎన్నో ఊహలతో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తుంది. ఈసారి ఉగాది రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు రాయడానికి రకరకాల రంగులు, పదిహేను వరుసల పదిహేను చుక్కలతో ముగ్గులు, డిజైన్లలో ముందస్తు సన్నాహాలు చేస్తుంది. 


 ఎంతగానో ఎదురుచూస్తున్న ఉగాది రానే వచ్చింది. భారతమ్మ తెల్లవారుజాము మూడు గంటలకు హడావిడిగా నిద్రలేచేసి, గబగబా తలంటుకునేసి, కుమార్ ని, సూర్యప్రకాశరావుని నిద్ర లేపేసి, పడుకున్న కోడిని సైతం లేపి కూత అరిపించేసింది. గబగబా యింటి ముందుకు వచ్చేసి "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రంగురంగుల ముగ్గు పెడదామనుకుని చూస్తుంది. తండ్రికొడుకులిద్దరు భారతమ్మ భాధ పడలేక, నిద్రముఖాలతో చెరో ప్రక్కన చెరో లైటు పట్టుకుని నిల్చుని చూస్తున్నారు. ఒక వరుసకి ఒక అడుగు చొప్పున చూసిన కుడా పదిహేను వరుసల ముగ్గుకి పదిహేను అడుగుల స్థలం అవసరం పడుతుంది. ఉన్నదే పది అడుగుల రోడ్డు. అందులో సగం ఎదురింటివాడిది, సగం పక్కింటివాడిది. ఉన్న స్ధలంలో కనీసం "శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు" అని రాయడానికి కుడా ఇరుకుసందుల వీధుల్లో స్థలం సరిపోవట్లేదు. అయినా, భారతమ్మ పట్టువదలకుండా పెద్ద ముగ్గులు వేస్తూ, చెరిపేస్తూ, మళ్ళీ మార్చి మార్చి ఎన్ని సార్లు ముగ్గులు వేసినా లాభం లేకుండాపోయింది. చుక్కల ముగ్గు సంగతి ఏమోగానీ, ముగ్గులు వేయటానికి మాత్రం భారతమ్మకి చుక్కలు కనిపించాయి. ముందస్తు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారతమ్మ ఆశలు నీరుగారిపోయాయి.


“భారతి! నువ్వు ఎన్నిసార్లు వేసినా, నీ ముగ్గులకి యి ప్లేస్ సరిపోదు. అనవసరంగా మాకు నిద్ర పాడుచేసేశావు!” అని సూర్యప్రకాశరావు అంటే, కుమార్ నవ్వుతూ


“అవునమ్మ! ఒక పని చేద్దాం. ఆ ముగ్గులు వేసిన పేపర్ యిక్కడ అంటించేద్దాం! నీ కోరిక తీరిపోతుంది!” అని అంటూ యిద్దరూ మెల్లగా నవ్వుకుంటున్నారు.


అసలే అనుకున్న ముగ్గులు రాక మండిపోయి ఉన్న భారతమ్మ "ఆఁ! మీకు ఆకలి వేసినప్పుడు, భోజనం అని పేపర్ మీద రాసేసి పెట్టేస్తాను. మీ ఆకలి తీరిపోతుంది! ఏమంటారు!” అని అనేసరికి, తండ్రి కొడుకులిద్దరూ నవ్వు ఆపేసి, యిప్పుడు అమ్మని కెలకకూడదని, నోరు మూసేసి నవ్వుకుంటున్నారు.


ఎంత ప్రయత్నించినా సరిగ్గా కుదరకపోయేసరికి భారతమ్మ “సర్లే! ఎంతైనా పల్లెటూరిలో చేసినట్టుగా పట్టణాలలో చెయ్యలేం కదా! ఇదే పల్లెటూరిలా ఖాళీ స్థలం ఉండి ఉంటే, యి భారతి వేసిన ఉగాది ముగ్గు చూసి ఆశ్చర్యపోయి నోళ్ళు తెరవాలి. మళ్ళీ యి భారతి చేసిన ఉగాది పచ్చడి తినడానికి నోరు మూస్తారు. ఈ పట్టణానికి వచ్చి సంవత్సరాలు కావస్తున్నా, కనీసం పక్కింటివాళ్లు ఎవరో కుడా తెలియట్లేదు. ఎంతైనా, ఆ రోజులు మళ్ళీ వస్తాయా ఏంటి!" అని అదినిష్టూరంగా నిట్టూరుస్తూ ముగ్గు తంతు కానిచ్చేస్తుంది. చూస్తుండగానే సూర్యుడు పిలవని అతిథిలా వచ్చేస్తున్నాడు. "ఇంకా ముగ్గు దగ్గర ఉంటే, మరి ఉగాది పచ్చడో! మామిడికాయలు తెచ్చుకోవాలి కదా! ఆ కాలంలో, మామిడికాయల కోసం వూరిలో మన యింటి గడప తొక్కనివాళ్ళే ఉండేవాళ్ళు కాదు! ఆ రోజులే వేరు!" అంటూ రెండోసారి నిట్టూరుస్తూ, కుమార్ ని పిలిచి మామిడికాయల కోసం మార్కెట్ కి పంపించింది.


 తండ్రి కొడుకులకి ఉగాది రోజున భారతమ్మ నిట్టూర్పులు కొత్తేం కాదు. సూర్యప్రకాశరావు కుడా తలంటుకుని వచ్చి, టివిలో రాశిఫలాలు చెప్తుంటే ముందు కూర్చున్నాడు. అనుకుని, జరగని ప్రతి విషయానికి “ఇదే ఆ కాలంలో అయితే..!” అని భారతమ్మ నిట్టూర్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో శుభాకాంక్షల సందేశాలు వస్తూనే ఉండడంతో మొబైల్ ఫోన్లు మ్రోగుతునే ఉన్నాయి. ఉగాది చుక్కలముగ్గు ఆశ ఎలాగో తీరలేదు. కనీసం ఉగాది పచ్చడి అయినా అనుకున్నట్లుగా చేద్దామని తహతహలాడిపోతోంది. మామిడికాయల కోసం వెళ్లిన కుమార్ ఎంతకీ రావట్లేదు. కుమార్ రాక కోసం వంటింట్లోకి, వాకిట్లోకి ఏ వందసార్లు తిరిగిందో, భారతమ్మ కాలి పట్టీల శబ్ధాలు వింటున్న సూర్యప్రకాశరావుకే తెలియాలి. ఇటువంటి సందర్భంలో భారతమ్మని గాని కదిపితే, చిన్నసైజు కందిరీగలా ఉంటుంది. అనుభవపూర్వకంగా భారతమ్మ గురించి తెలుసు కాబట్టి, సూర్యప్రకాశరావు ఒక్కసారి కూడా భారతమ్మని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. 


 సమయం తొమ్మిది కావస్తోంది. "ఏమండోయ్! కుమార్ ఎప్పుడో వెళ్లాడు. ఇంకా రాలేదేంటండీ? మామిడికాయలు తెమ్మంటే, తోట మొత్తం దులిపేసి తీసుకొచ్చేస్తున్నాడా ఏంటి! ఒకసారి కుమార్ కి ఫోన్ చెయ్యండి!" అని యింటి మెట్ల మీద నిలబడి రోడ్డు వైపు చూస్తూ అంది భారతమ్మ. "ఫోన్ ఎందుకులే! నువ్వు అన్నట్టు తోటలో ఉన్న కాయలు మొత్తం తేవాలంటే బరువు ఎక్కువగా ఉండడం వలన తీసుకురావడానికి టైం పడుతుందేమో! నన్ను వెళ్లి చూసి రమ్మంటావా?" అని బయటికి వెళ్లడానికి యిదే అదునుగా సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ అడిగాడు సూర్యప్రకాశరావు. గ్యాస్ పొయ్యి మీద వంటచేసిన కూడా నిప్పులు వస్తాయా అన్నంత ఎర్రగా, భారతమ్మ ఒక చూపు చూసి "అప్పుడనగా వెళ్లిన కొడుకు యింకా రాలేదు. ఇప్పుడు తండ్రి వెళ్తే ఎప్పుడు వస్తాడో! ఏమక్కర్లేదు! కుమార్ వచ్చేస్తాడులే!!" అని అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సూర్యప్రకాశరావు కూర్చుని యధావిధిగా టివిలో రాశిఫలాలు చూస్తున్నాడు. 


 ఆ సమయంలో "ఆహ బావ! బంగారం లాంటి మా చెల్లెమ్మ నీ పక్కన ఉండగా, ఇంకా నువ్వు రాశిఫలాలు ఎందుకు చూడాలి బావా!! అసలు మా చెల్లెమ్మకి అన్నపూర్ణ అని పేరు పెట్టాల్సింది. మా చెల్లెమ్మ నేతితో చేసిన పెసరట్టు వాసన వీధి చివర వరకు వస్తుంది!" అని వచ్చాడు ప్రసాద్. "అవును బావ! అట్టు మాడిపోతే, వాసన ఎక్కువ వస్తుందిలే! ఉదయం నుంచి వినలేకపోతున్నాను. అదేఁ తినలేకపోతున్నాను!" అని నిజం చెప్పడానికి ప్రయత్నించి, కొంపదీసి భారతమ్మ వినలేదు కదా అని వంటింటి వైపు చూస్తూ అన్నాడు సూర్యప్రకాశరావు.


"ఊరుకో బావ! నువ్వు ఎప్పుడు అలాగే అంటావ్! మా చెల్లెమ్మ ఎక్కడ? ఉగాది రోజున మా చెల్లెమ్మ చేతి పచ్చడి తినడానికే పరిగెత్తుకుంటూవచ్చాను!" అని అంటూ "చెల్లెమ్మ! భారతి!!" అని పిలుస్తున్నాడు ప్రసాద్. "బావ చెప్పింది విను! ఇప్పుడు మీ చెల్లెమ్మని పిలవద్దు బావ!!" అని సూర్యప్రకాశరావు చెప్తుండగానే, కుమార్ వచ్చేశాడెమోనని వేగంగా వచ్చింది భారతమ్మ చేతిలో ఎర్రని అట్లకర్రతో. "చెల్లెమ్మ! మాంచి ఆకలి మీద ఉన్నాను. ముందుగా నీ చేతి పచ్చడి తిన్నాకే, మిగతావి పెట్టు!" అంటూ చేతులు కడుక్కుని కూర్చున్నాడు.


"ఏంటి పెట్టేది! పచ్చడి చేస్తే కదా!!" అని అన్నాడు సూర్యప్రకాశరావు నోరు ఆపుకోలేక. "ఏంటి యింకా చెయ్యలేదా!!" అని ప్రసాద్ సాగదీసేసరికి, ఉదయం నుంచి ఎక్కడ చూపించకుండా ఆపుతున్న భారతమ్మ క్రోధం బయటికొచ్చేసింది.


"అవును! చెయ్యలేదు. కుమార్ ఉదయమనగా వెళ్ళాడు. తొమ్మిది దాటిపోతున్నా ఇంకా రాలేదు. ఏమైందో?" అని అంటుండగానే వచ్చాడు కుమార్. "అదిగో! మేనల్లుడు వచ్చేశాడు. నూరేళ్ళు!" అంటూ చెప్పబోయిన ప్రసాద్ లేచి చూస్తున్నాడు. కుమార్ రాగానే కడిగి పారేద్దామని ఆత్రంగా దగ్గరకు వచ్చిన భారతమ్మ "ఏమైంది? ఏమి యింతసేపు??" అని నోట్లోకి వచ్చిన మాటల్ని మింగేసి ఆశ్చర్యంగా చూస్తుంది. కుమార్ అవతారం చూస్తుంటే, ఏదో పెద్దహీరో సినిమాకి మొదటిరోజు టికెట్ల కోసం లైన్లో పడి నలిగిపోయినట్లుగా ఉన్నాడు. 


 "ఏమైంది నాన్నా?" అని అడిగాడు సూర్యప్రకాశరావు. కుమార్ నీళ్ళు తాగుతూ


"మామిడికాయలు కొనడానికి క్యూ లైన్ కిలోమీటరు ఉంది అక్కడ!" అని గుటకలు మింగుతూ చెప్పాడు.


కుమార్ తెచ్చిన సంచిలో ఉన్న నలిగిపోయిన మామిడి ఆకులు, కాయలు భారతమ్మ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ "బంగినపల్లి మామిడికాయలేనా! ఏంత? ఇదేంటి కుమార్! రెండు మామిడికాయలే ఉన్నాయి!" అని అడిగితే "యాభై రూపాయలు!" అని నీళ్ళు తాగి కాస్త స్థిమితపడి చెప్పాడు కుమార్.


"రెండు కాయలు యాభై రూపాయలా! చాలా ఎక్కువ!!" అని పెద్దగా నోరు తెరిచి అడిగింది భారతమ్మ. "అవును! అందుకే, ఒక్క మామిడికాయ 50 రూపాయలు అమ్మ!" అని చెప్పాడు కుమార్.


"నీకు బొత్తిగా బేరం ఆడడమే రాదురా కుమార్. ఈ కాయలు కుడా ఏం బాగాలేవు. మొత్తం నల్లమచ్చలు ఉన్నాయి. కొంచెం తగ్గించి అడగలేకపోయావా? ఎప్పుడూ మెత్తగా ఉంటే పనులు అవ్వవు!" అని తన కొడుకు మృదుస్వభావాన్ని ఉద్దేశించి అంది భారతమ్మ.


"అది జరిగిందమ్మా! బేరం ఆడడం నాకు రాకపోయినా, నీకోసం ధైర్యం చేసి అడిగాను. కొంటే కొను. లేకపోతే, పక్కకి వెళ్ళు. నా బేరం పోతుంది అని ముఖానికి పెట్టుకున్న మాస్క్ మూసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళపోమన్నాడు కోపంగా!" అని విడమర్చి చెప్పాడు కుమార్.


సూర్యప్రకాశరావు కుర్చీలో నుంచి లేచి కుమార్ దగ్గరికి వస్తూ "కుమార్! నీ తప్పు లేదులే. ఇప్పుడే యి క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు టివిలో చూశాను నీది మేషరాశి కదా, ఆదాయం 8 వ్యయం 14. నాది కుంభరాశి ఆదాయం 14 వ్యయం 14. నీ బదులు నేను వెళ్లి ఉంటే బాగుండేదేమో!" అని శాస్త్రపరంగా విశ్లేషించి చెప్పాడు.


"నాన్న! నా అవతారం చూసిన తర్వాత కుడా, మీకు అంత నమ్మకం ఉందా! బజారులో మామిడికాయలకి యిప్పుడు ఉన్న గిరాకీకి, నేను వెళ్ళాను కాబట్టి, కనీసం నలిగిన చొక్కాతో అయినా తిరిగి వచ్చాను. మీరు వెళ్లి ఉంటే, అమ్మకి మామిడికాయలు కోసి ముక్కలు చేసే శ్రమ తగ్గి ఉండేది!" అని వాస్తవాన్ని వివరించి చెప్పాడు కుమార్.


"అల్లుడు చెప్పింది నిజమే బావ! బయట పరిస్థితి అలానే ఉంది. సంతోషం ఏంటంటే, కనీసం వేపపువ్వు అయినా ప్రస్తుతానికి మాములుగా దొరుకుతుంది. తరువాత ఏడాదికి అది కూడా బజారులో పెట్టి అమ్మేస్తారేమో!” అని నవ్వుతూ అన్నాడు ప్రసాద్.


"తర్వాత ఏడాది వరకు ఎందుకు మామయ్య! యిప్పుడే అమ్ముతున్నారు. క్యూలో రెండుగంటలు నిలబడితే, యి రెండు కాయలైనా దొరికాయి. ఇవి కూడా బ్లాక్ లో కొనడానికి చాలామంది కాచుకుని ఉన్నారు అక్కడ. మీకు వద్దంటే చెప్పండి!" అని కుమార్ చెప్తుంటే ఆశ్చర్యపోయి ముగ్గురు ముక్కున వేలేసుకున్నారు.


"ఇప్పుడు యి లెక్కలు ఎందుకు? ఆ కాయలు ముక్కలు చేసి పచ్చడి చెయ్యమ్మా!" అని వంటింటి వైపు చూస్తూ చెప్పాడు కుమార్.


"ఇంకేం పచ్చడి! ఇంత టైం అయినప్పుడే, సగం ఆశ పోయింది. ఈ చిన్న మామిడికాయలు యాభై రూపాయలు అంటుంటే, యాభై రూపాయలనే ముక్కలు చేస్తున్నట్టుగానే ఉంది!" అంటూ నిరాశగా చెప్తూ సంచి వంటింట్లోకి తీసుకెళ్ళడానికి తీసి, అందులోని మావిడాకులను చూపిస్తూ "ఏంటి కుమార్! యి మావిడాకులు? ఒక చిగురు కూడా లేదు. అన్ని నలిగిపోయి, ముక్కలైపోయాయి. చెట్టెక్కి తెంపలేకపోయావా?" అని భారతమ్మ అడిగింది.


"ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా! ఆ ఆకులు కూడా కొన్నాను!" అని కుమార్ చెప్తుంటే "ఏం రోజులు వచ్చాయిరా దేవుడా!" అని దిగాలుగా కుర్చీలో కూర్చుండిపోయింది భారతమ్మ. 


 "ఏమైందమ్మా! టైం అవుతుంది. నీచేతితో ఉగాది పచ్చడి చెయ్యమ్మా!" అంటూ కుర్చీలో కూర్చున్న భారతమ్మ దగ్గరకి వచ్చి కింద కూర్చుని అడిగాడు కుమార్.


"ఇంకేం ఉగాది! ఆ ఆశ పోయింది!" అని ఏదో కోల్పోయినట్లు అంది భారతమ్మ.


"ఇప్పుడు ఏమైందని? పండుగపూట యి విచారం?" అని భారతమ్మని అలా చూడలేక అడిగాడు సూర్యప్రకాశరావు.


"ఇంకేం కావాలి? చిన్నప్పుడు ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలో ఆడుకున్న నా కొడుకు, ఈరోజున ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా, మామిడి ఆకులు కొనుక్కుని వచ్చానమ్మా అని చెప్తున్నాడు. అసలు యి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? అదే మన ఊర్లో ఉండి ఉంటే, చక్కగా ఉగాది ముందు రోజు సాయంత్రం ఊరంతా రామమందిరం దగ్గర చేరి పంచాంగాలు వినేవాళ్ళం. పురోహితుడు సంవత్సరంలో పడే వర్షాలు, ఎవరెవరికి ఎన్ని సున్నాలు ఉన్నాయో, ఇంకా చాలా విషయాలు చెప్పేవారు.


ఉగాది రోజు తెల్లవారుజామున లేచి, కొత్త బట్టలు వేసుకుని, కొత్త నాగలి కట్టి, ఎద్దులకి మెడలో కట్టిన గంటలు ఘల్లుఘల్లులాడించుకుంటూ వెళ్లి, పొలంలో నేలతల్లికి మొక్కి, దుక్కి దున్నేసి, మన మామిడితోట మీదుగా వచ్చేదారిలో మామిడికాయలు, చిగురాకులు, వేపపువ్వులు, పనసకాయలు, అరటిపువ్వు, అరిటాకులు తీసుకొచ్చేవాళ్ళు. మీకోసం మేం యింటిదగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలతో ఎదురుచూసేవాళ్ళం. మన దగ్గర ఉన్నది, పదిమందికి పంచుకుని, అందరం ఉగాది పచ్చడి చేసుకుని తినేవాళ్ళం. తోటల్లో పెద్ద పెద్ద చెట్లకి తాళ్లతో ఉయ్యాలలు కట్టి, చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా సంతోషంగా ఉయ్యాలలు ఊగుతూ, పండుగ చేసుకునేవాళ్లం. ఇది ఉగాది అంటే, మరి యిప్పుడు ఏలా ఉంది?" అని ఉద్వేగంగా భారతమ్మ చెప్తుంటే ముగ్గురికి ఒకసారి పాత రోజులు కన్నుల్లో మెదిలాయి.


“నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా, మన వూరి నుండి యిక్కడికి మారిపోదామన్నారు. వూరిలో మన యింటికి మామిడికాయలు అడగడానికి వచ్చిన వాళ్లతోనే సగం ఉగాది గడిచిపోయేది! వద్దు మొర్రో అని ఎంత నెత్తినోరు కొట్టుకుని చెప్పినా, వినకుండా ఒక్క చెట్టు కుడా మిగల్చకుండా మామిడితోట కొట్టేశారు. పోనీ, ఈ ఉగాదికైనా మన ఊరు వెళ్లి, అక్కడ చేసుకుందామని చెప్తుంటే, యి తండ్రి కొడుకులకి ఉలుకులేదు. పలుకులేదు. ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి కావాలా?" అని లోపల ఉన్నదంతా చెప్పేసింది భారతమ్మ. అందరూ అప్పటి పరిస్థితులు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.


 సూర్యప్రకాశరావు మౌనం నుంచి తేరుకుని "భారతి! నీకు గుర్తుందో లేదో, నేను నీకో మాట యిచ్చాను. మనం ఎన్ని చెట్లు కొట్టించాల్సి వచ్చిందో, అంత కన్నా ఎక్కువ మొక్కలు తీసుకుని నాటుదామన్నాను. ఆ మాట ప్రకారం, ఈరోజు సాయంత్రమే వెళ్లి, మామిడి మొక్కలు కొంటాం. ఎక్కడ కొట్టేశామో, అక్కడే నాటుతాం. నువ్వు ఏమంటావు బావా!" అని గబగబా చొక్కా తొడుక్కుని మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్లడానికి బయలుదేరుతూ అన్నాడు.


ప్రసాద్ ఉత్సాహంగా "శుభస్య శీఘ్రం! నువ్వు మాట యిచ్చావంటే, అది సగం పని అయిపోయినట్టే! పదా యిప్పుడే వెళ్దాం! ఇప్పుడు నాటితే, వెంటనే కాకపోయినా, వచ్చే రెండు, మూడు సంవత్సరాలకైనా కాయలైనా తినొచ్చు. ఉగాది రోజున వేసే యి మొక్కలు ఉగాది తోటగా మారి మళ్లీ పూర్వవైభవం రావాలి! చెల్లెమ్మ చెప్పినట్టుగా తరువాత తరాలకు మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయి. ఏ ప్రాంతంలోనైనా ఉండే సంస్కృతులు, సంప్రదాయాలు వారు మాట్లాడే మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మనమందరం మన తల్లి లాంటి తెలుగు భాషని పక్కన పెట్టేస్తే, యింకా పండుగలు ఎలా జరుపుకోవాలో ఎలా తెలుస్తుంది. ఈతరం పిల్లల దౌర్భాగ్యం ఏంటో మరి, వాళ్లకి పండుగ అంటే తెలియదు. జాతర అంటే అర్ధం కాదు. సంస్కృతులు, సంప్రదాయాలు గురించి యింకా చెప్పనక్కర్లేదు.


పిల్లల్ని అలా తయారుచేస్తున్నారు యితరం తల్లిదండ్రులు. అవన్నీ పిల్లలకి చెప్పాలంటే, తెలిసినవాళ్లు టైం లేదంటారు. తెలియనివాళ్లు అవసరం లేదంటారు. మొత్తానికి ఒక జాతిని నాశనం చేసేస్తున్నారు! మనది కాని ఆంగ్ల సంవత్సరాది జరుపుకోవడానికి డిసెంబర్ 31 అర్ధరాత్రి పన్నెండు వరకు పడుకోకుండా ఉండి, కేకులు కోసుకుని, పడుకున్నవాళ్లకి ఫోన్ చేసి నిద్ర లేపేసి, శుభాకాంక్షలు నేను ముందు చెప్పానంటే, నేను ముందు చెప్పానని పోటీ పడతారు. మరి తెలుగు సంవత్సరాది ఉగాది రోజు తెల్లవారుజామున లేచి పండుగ జరుపుకోవడానికి, ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో! మన మూలాలు మనమే మరిచిపోతే ఎలాగా! నిజం బావ! యి వైఖరి యిలా కొనసాగితే, భవిష్యత్తు తరం ఏమైపోతుందో అని ఊహించుకుంటేనే, భయమేస్తోంది. అందుకే, మెల్లమెల్లగా పూర్వవైభవం మళ్లీ తీసుకురావడానికి, ఏదో ఉడతాభక్తిగా నా వంతుగా నేను మా తెలుగుతల్లి కళా సాంస్కృతిక సంస్థ తరఫున సంస్కృతులు, సంప్రదాయాలు తెలియాల్సిన సందర్బాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.


మళ్లీ, పిలిచి సంస్కృతులు, సంప్రదాయాలు గురించి ఉపన్యాసాలు యిస్తామంటే, ఎవరు రారు. అందుకు ముగ్గులు, కవితలు, కథలు, పాటలు, నాట్య ప్రదర్శన పోటీలు పెట్టాలి. అలా యిసారి పెట్టిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈరోజు సాయంత్రం బహుమతులు ప్రదానం చెయ్యాలి. చెల్లెమ్మ చేతి ఉగాది పచ్చడి తినేసి వెళ్దామని వచ్చాను. తినడానికి ఉగాది పచ్చడి లేకపోయినా, ఉగాది రోజున మన మంచి అనుభవాలను, చేదు జ్ఞాపకాలను పంచుకున్న యి సందర్భం, ఉగాది పచ్చడి తిన్నంత కమ్మగా అనిపిస్తుంది. మా తెలుగు తల్లి కళా సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో యిరోజు సాయంత్రం జరగబోయే బహుమతుల ప్రదాన కార్యక్రమానికి మీ ముగ్గురు వచ్చి, మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. ఏదో మనకి తెలిసినది తర్వాత తరాలకు మన వంతుగా అందించడానికి ప్రయత్నం చేద్దాం!" అని చెప్పాడు.


తరువాత తరాలకు వారసత్వంగా కుమార్ ఉప్పొంగిన ఉత్సాహంతో “వస్తాం మామయ్య! యిది మా తరాలకు ఎంత అవసరమో, మీరు యిప్పుడు చెప్తుంటే తెలుస్తోంది. మా కుర్ర బ్యాచ్ మొత్తాన్ని తీసుకొస్తాను. మీ వారసుడిగా నేను తరువాత తరాలకు అందించే ప్రయత్నం చేస్తాను! అమ్మ! నువ్వు పచ్చడి తొందరగా చెయ్యమ్మ! మామయ్య, నేను తొందరగా తినేసి బయల్దేరుతాం! ప్రతి సంవత్సరం నీ ఉగాది పచ్చడి తినడానికి వచ్చే అభిమానులు వచ్చే టైం అవుతోంది. తొందరగా చెసేయ్యమ్మ!” అని కార్యసాధకునిలా చెప్పాడు. ముగ్గురి మాటలు వింటూ భవిష్యత్తు మారబోతుందనే ఆనందబాష్పాలు నిండిన కళ్లతో భారతమ్మ ఆనందంగా వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే, అన్ని రకాల రుచులు సిధ్ధంగా ఉంచింది. కుమార్ తీసుకొచ్చిన రెండు మామిడికాయలు తీసి, ముక్కలుగా కోసి, చిటికెలో ఉగాది పచ్చడి చేసి నాలుగు కప్పుల్లో తీసుకొచ్చింది. నలుగురు నవ్వుతూ తిన్నారు.


 "నీ ఉగాది పచ్చడికి అభిమానులు చూడమ్మా! వాట్సాప్ లో తెగ మెసేజ్లు పెట్టేస్తున్నారు. నువ్వు పచ్చడి పంపిస్తావని!!” అని మొబైల్ చూస్తూ నవ్వుతూ అన్నాడు కుమార్. “ఏంటి పంపించేది పచ్చడి! రెండు మామిడికాయలు తొక్కలతో కలిపి గీసి గీసి గీస్తే యి మాత్రం అయ్యింది. నీళ్ళు కలిపి ఉగాది పచ్చడి బదులు ఉగాది పానకంలా యిచ్చేయడమే!” అని భారతమ్మ నిట్టూరుస్తూ అంది. “ఎందుకులేమ్మా! నువ్వు చేసిన ఉగాది పచ్చడి ఫోటోలు తీసి వాట్సాప్ లో పంపించేశాను. తినేస్తారులే!" అని నవ్వుతూ అన్నాడు కుమార్. అందరూ నవ్వారు. 

***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


159 views1 comment

1 comentario


4Update

4 days ago

Sai Ram annaaa 🎉

Me gusta
bottom of page