'Yachishnuvu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'యాచిష్ణువు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అతడొక తిరిపతిండి. అతని పేరేమిటో అతని ఊరేమిటో ఎవరికీ తెలియదు. ప్రతి రోజు ఆ వాడకట్టులో ఉదయము సాయంత్రము బిక్షమెత్తుకోవడమే అతని దిన చర్య. వయసు అరువది దాటింది కనుక మోటు పనులు చేయలేడు- సున్నిత పనులు చెప్పడానికెవరు ముందుకు రారు. ఏ అమ్మో దయతలచి రాత్రిది మిగిలితె పొద్దున్నో పొద్దటిది మిగిలితె రాత్రో అన్నమో, రొట్టెనో కూరనో పప్పో పెడితె పొట్ట నింపుకొని మిగిలింది అతడు సాదుకున్న కుక్కకు పెట్టడము చేస్తుంటాడు.
అతని నివాసము ఊరిబయట మర్రిచెట్టుక్రింద చిన్న గుడిసె - ఆ గుడిసెలో అతడు తినడానికి ఒక సత్తు కంచము సత్తు గ్లాసు- ఒక నీళ్ళకుండ పడుకోవడానికి, కట్టుకోవడానికి పాతగుడ్డలు అవే అతని ఆస్తి. అతని స్నానాదికాలు, కాలకృత్యము మున్నగునవి ఎవరు ఊహించరు - అలాంటి విషయాలు వ్రాయడానికి రవిగాంచని చోటు కవిగాంచును అనబడే ఆ కవులకు తోచదు.
అతనికి రోగమొచ్చినా కానే నాథుడు లేడు. అతన్ని పుట్టించిన ఆ పరమాత్మే దిక్కని మూలుగుకుంటు ముడుచుకుంటూ పడుకుంటాడు. కుక్క విశ్వాసముగల జీవి కావున నిద్రాహారాలు మాని అతనికి తోడుగా ఉంటుంది.
ఆ దరిద్రనారాయణునకు తనదంటూ ఏమీ లేకున్నా ఔదార్య గుణము మాత్రమున్నది. సమాజములో సాటి మనిషైనా అతన్ని సంబోధించేది మాత్రము ఒరే బిచ్చపోడ లేదా ఒరే బిచ్చగాడా అని మాత్రమే అంటారు
సృష్టిలో అతని అశక్తతకు లభించే మర్యాద. అతనికి మాత్రము ఊరంతా అమ్మలే, అయ్యలే. ఆత్మాభిమానము అనడానికి అతనికి ఆత్మ అనేది ఉన్నదో లేదో అతనికే తెలియదు. ఉదర పోషణ ఒక్కటే అతడు ఎరిగిన సత్యము. క్షుత్బాధ మాత్రము మనిషిని ఎంత కృంగదీస్తదో వివరించాలంటె,
క్షితిని దౌర్భాగ్య జీవుల క్షుత్తు నెరుగ
క్షణ క్షణము క్షుత్బాధ తీక్షణముగాగ
కుక్షినింపెడి లక్షణంబు ఉపేక్షింప లేక
రక్షణెరుగని తిండి కైనను నిరీక్షించు నరుడు
పక్షి పశువులాపేక్ష పక్కనుంచి
మక్షికంబుల మాట మనసు నొదలి
కుక్షి నింపెడి లక్షణంబె కుదురునంచు
తీక్షణంబగు ఆకలి తీర్చుకొన బూను నరుడు
పరుగు పరుగున ముందడుగు వేసి
నరుడు నాగరికత దా నెరుగ బోక
మొరుగు శునకంబు సైతము మొత్తుకోగ
జరుగు చెజాచి ముందిస్తరాకు లెతుక
విందు జరిగెడి ఇంటి ముందు నిలిచి
సందడెరుగగ నా యింటి సందు నడిచి
మంది దినివైచిన ఇస్తరాకుల నంద జూచి
తొందరొందును ఆకలి మందమణుచ
శ్వాస నాడించ లేనట్టి శ్వాన మొకటి
సందు నీడన బరుండె ముందు చూపుతోడ
కావు కావున అరచెడి కాకులింక
కుక్కకన్నను ముందుండె కూటి మెతుకులేర
మక్షికంబులును జేరె నా క్షణంబె
కుక్షి రక్షణె వాటి లక్ష్యమనగ
పక్షి మక్షికంబులు మరి మొరుగు
లక్షణంబగు కుక్క కన్నను కక్కుర్తి నరుని కృంగదీసె.
ఇలాంటి పరిస్థితి రానీకుండ ఒకే ఒక వాడకట్టును ఆశ్రయించి ఆ తిరిపరి కాలం గడుపుతుంటాడు. కొన్ని ఏండ్లు తిరిపమెత్తిన సొమ్ము ఒక బట్టగుడ్డలో ఉంచుకుంటాడు.
ఒకనాడు అతనికి క్రమముగా బిచ్చమేసే సీతమ్మ అనునామె ఇంట ఒక విషాద సంఘటన జరుగుతుంది. ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఆమె తప్ప భర్త పిల్లలు ఆ మంటలలో ఆహుతి అయిపోతారు. సీతమ్మకు తనవారంటూ ఎవరూ లేరు చుట్టుపక్కల వారే ఆ సమయములో పోయినవారి దహన సంస్కారాలు నిర్వహించుతారు.
కార్య క్రమాలన్ని అయిపోయిన తరువాత సీతమ్మ ఒక్కతే ఆ ఇంట్లో అదీ సగము పేలిపోయి ఉంటది- పునరుద్ధరణకు ఆర్థిక స్తోమత లేదు. నిత్యకృత్యానికి లోపమే. ఎవరు చేరదీసినా కొంతకాలమే - ఎటూ తోచక దుఃఖము ఆపుకోలేకుండ పోతుంది.
ఇదంతా చూస్తున్న ఆ తిరిపరి తాను ఆమె దుఃఖము పంచుకుంటూ - అమ్మా పోయినోళ్ళు రారు ఊర్కో తల్లీ అని ఓదారుస్తూ తాను చాలా కాలమునుండి బిచ్చమెత్తి ప్రోగు జేసిన సొమ్ము కట్టిన బట్టమూట ఆమె కిస్తూ నేను ఈ లోకములో మనిషిగా పుట్టినందులకు ఎన్నో ఏండ్లనుండి మీ ఉప్పు తింటున్నందుకు తృణమో ఫణమో నా బాధ్యతగా ఇస్తున్న తల్లీ ఏమీ అనుకోకుండ దయచేసి తీసుకో అమ్మా అని ఏడుస్తాడు తిరిపరి.
అతని ఔదార్యానికి విస్తుపోతుంది సీతమ్మ. ఆమె నోట మాటరాదు. బీదవాణ్ణి దరిద్రనారాయణుడు అంటారు ఇందుకే కాబోలు ఆ దేవుడే ఇతని రూపములో వచ్చినాడో ఏమో-నేను ఈ సొమ్ము తిరస్కరిస్తె ఇంత ఆప్యాయతతో తెచ్చిన ఈ మనిషి ఎంత బాధ పడుతడో ఏమో అనుకుంటు ఆ సొమ్ము తీసుకుంటుంది సీతమ్మ.
ఒక తిరిపరే ఇంత ఔదార్యము చూపుతె నేనూ ఒక మనిషినేకద ఇప్పుడు సమాజములో నా గొప్పేమున్నది సర్వం కోల్పోయాక నాలో కూడా పరివర్తన రావాలె అనుకుంటుంది సీతమ్మ. బాగా ఆలోచించి అతన్ని అడుగుతుంది నీవెక్కడుంటావని-
“అమ్మా! నేను ఊరి చివర మర్రిచెట్టుక్రింద గుడిసె వేసుకొని ఉంటున్నాను నాకేమి దిగులు లేదు తల్లీ” అంటాడు తిరిపరి.
సీతమ్మ బాగా ఆలోచించి నా మానవత్వము కూడా చూపాలి కదా అనుకొని “నువ్వు నేటినుండి మా ఇంటి ఆవరణలో ఉండు - బిచ్చము కూడా ఎత్తబోకు. నేను ఏది తింటానో నీకు అదే పెడుతాను. నీ దంటకు నీ కుక్క ఉన్నా పరువా లేదు” అంటుంది సీతమ్మ.
‘ఇంట్లో ఆడ మనిషి ఒక్కతే ఉంటుంది కద, నేను కాపలాగ నా కుక్క తోడుగా ఉంటాను’ అనుకొని ‘సరే తల్లీ’ అంటాడు తిరిపరి అంటే బిచ్చగాడు అంటే యాచిష్ణువు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Коментарі