top of page

యశోదమ్మ గారి బొమ్మల కొలువు


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'Yasodamma Gari Bommala Koluvu' New Telugu Storyదసరా నవరాత్రులు వచ్చాయంటే మా పెనుగొండ వీధులన్నీ భక్తులతో కళ కళ లాడిపోతాయి.


నగరేశ్వర స్వామి గుడిలో ఉన్న మహిషాసుర మర్ధినీ అమ్మవారికి, కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చాలా ఘనంగా పూజలు చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని అమ్మవారికి కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.


కామాక్షి గుడి దగ్గర రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా

ఉంటాయి తొమ్మిది రోజులూ. హరికథలూ, బుర్రకథలూ, డ్రామాలు, రికార్డింగ్ డాన్సులు... అబ్బో చాలా ఉంటాయి కామాక్షి గుడిదగ్గర. రాత్రి ఎనిమిది దాటాకా పిల్లలు,

కుర్రకారూ ఇక్కడే ఉంటారు మరి.


లింగాలవీధి మొగలో ఉంది సుబ్బన్న పంతులుగారి ఇల్లు. ఐదు వందల గజాల స్థలంలో కట్టిన పెద్ద డాబా. ఇంటి చుట్టూ జామ, పనస, సపోటా, మామిడి చెట్లు ఏపుగా పెరిగి

ఉంటాయి. వాటితో పాటే పూల మొక్కలూనూ. ఒక మూలగా ఉన్న పాకలో ఒక ఆవు, గేదె ఉంటాయి. పంతులు గారు

చుండూరి సూర్యనారాయణ గారి ఎలిమెంటరీ స్కూల్ లో హెడ్ మాస్టర్. ఊళ్ళో జామీన్దారులు అందరూ ఆయన

స్నేహితులే. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ఆయన స్నేహితులతో సందడిగా ఉంటుంది.


వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల స్వాతంత్ర సమరయోధులు దగ్గుబాటి సీతారామయ్య గారి పెద్ద పెంకుటిల్లు ఉంది.


పంతులుగారి భార్య యశోదమ్మ. వాళ్లకి ఏడుగురు సంతానం. అత్తగారు మంగమ్మ, కోడలికి ఏడు పురుళ్ళు తానే పోసింది. కారణం యశోదమ్మ పెళ్లి అయిన రెండేళ్లకే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి సీతారామ సోమయాజులు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆడ దిక్కు లేని సంసారం అవడం

వలన మంగమ్మ తానే యశోదమ్మ కి తల్లిగా మారి, అన్ని పురుళ్ళు పోసింది.


యశోదమ్మ గారు ఏటా నవరాత్రులకి బొమ్మలకొలువు పెడతారు. ఆ బొమ్మల కొలువు లోని బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. తనకు తెలుసున్న వాళ్ళు అందరినీ

ఆవిడ పేరంటానికి పిలుస్తారు. ఈ బొమ్మలకొలువు విశేషం ఏమిటంటే ప్రతిరోజూ కొన్ని కొత్త బొమ్మల్ని తయారుచేసి

బొమ్మలకొలువు లో పెడతారు యశోదమ్మ గారు. అవి చూడటానికి పెద్దలతో పాటు పిల్లలు కూడా వస్తారు వాళ్ళ ఇంటికి.


పొద్దున్నే యశోదమ్మ వాళ్ళ అత్త మంగమ్మ కొత్త బొమ్మల్ని దొడ్లో తయారు చేస్తారు. వాటికి రంగులు వేయడం యశోదమ్మ గారి పిల్లల డ్యూటీ. ఒక రోజు దశావతారాలు, మరో రోజు

నవదుర్గలు, ఇంకోరోజు అష్టదిక్పాలకులు ఇలా రక రకాల బొమ్మలు చేసి కొలువులో పెడతారు. వాటితో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు కూడా బొమ్మల కొలువులో కనువిందు చేస్తాయి.


గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీభాయ్, అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తుల బొమ్మలు కూడా ఉంటాయి. పంతులుగారి సూచనల మేరకు సంఘ సంఘ సంస్కర్తలు రాజా రామ మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ బొమ్మలూ అందులో మనకు కనిపిస్తాయి.


బొమ్మల కొలువు చూడటానికి వచ్చిన పిల్లలకు, వాళ్ళ తల్లులు ఈ బొమ్మల ప్రాశస్త్యం గురించి చెబ్తారు. చెట్లపల్లి గోపాలం మాస్టారి భార్య రాఘవమ్మ, శివయ్య పంతులు గారి భార్య రాం భాయమ్మ, జోశ్యుల శంకరం గారి భార్య సుగుణమ్మ, జోశ్యుల వెంకన్న గారి భార్య సత్యవతమ్మ, చుండూరి సత్తెమ్మ, పూజార్ల సీత, కోనాల అన్నపూర్ణ, తమనంపూడి శకుంతల, దగ్గుబాటి సత్యవతి, నేమాని సావిత్రి, తుమ్మలపల్లి మహాలక్ష్మి, నూలి వరలక్ష్మి, జమీన్దారు గారి భార్య సువర్చల క్రమం తప్పకుండా వచ్చేవారు.


వాళ్ళ అందరికీ శనగలూ, అరటిపళ్ళూ, ఒక స్వీట్ ఇచ్చేవారు యశోదమ్మ. పిల్లలకు యశోదమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ దొడ్లోని నాలుగు జామచెట్లు ఎక్కి కావాల్సిన జామ కాయలు కోసుకుని తినవచ్చు. పంతులు గారు కానీ యశోదమ్మ గారు కానీ పిల్లల్ని ఏమీ అనరు.

దసరాలలో మామిడిచెట్టుకి బీళ్ల సింహాచలం చేత ఉయ్యాల కట్టించేవారు. పిల్లలు జామకాయలు తినడం, ఉయ్యాల ఊగడం, ఆ విశాలమైన దొడ్డిలో దాగుడుమూతలు ఆడుకోవడం వాళ్లకు భలే త్రిల్లింగ్ గా ఉండేది. ఆటల అయ్యాక యశోదమ్మ గారి బొమ్మల కొలువు దగ్గర

ప్రత్యక్షం అయ్యేవారు. దేవుడిమీద పాటలు, భజనలు అయ్యాకా దేవుళ్ళు అందరికీ హారతి ఇచ్చి, ముత్తైదువులకు

వాయనాలు ఇచ్చి, పిల్లలకు పప్పు బెల్లాలు దానితో పాటు మైసూరుపాకో, మిఠాయి ఉండో ఇచ్చేవారు యశోదమ్మ గారు.


కొంతమంది ఆడవాళ్ళు కన్యకాపరమేశ్వరి గుడిలో పూజలు అయ్యాక యశోదమ్మ గారి ఇంటికి వచ్చి, ఈరోజు కొత్తగా బొమ్మల కొలువులో ఏ దేవుళ్ళని పెట్టారా? అని ఆసక్తిగా చూసేవారు.


రాత్రి తొమ్మిది గంటలు అయినా ఆడాళ్ళు బొమ్మల కొలువు చూడటానికి వస్తూనే ఉండేవారు. చాలా మంది బొమ్మల కొలువులోని దేవుళ్ళ దగ్గర డబ్బులు పెట్టి మొక్కుకునే

వారు.


ఒక రోజు జమీన్డారు గారి స్కూల్ లో లెక్కల మాస్టారుగా పనిచేసే నేమాని సుబ్బారావు గారు వచ్చి ‘పంతులు గారూ, మనిషి జీవితం అంతా లెక్కలతోనే ముడిపడివుంది. అటువంటి లెక్కలకు ఆద్యులైన రామన్, శకుంతలాదేవి బొమ్మల్ని కూడా కొలువులో పెట్టండి. పిల్లలకు అవగాహన ఉంటుంది’ అని సలహా ఇచ్చారు.


మర్నాడు పొద్దున్నే సుబ్బన్న పంతులు గారు స్వయంగా

సి. వి. రామన్, శకుంతలాదేవి బొమ్మల్ని చేసి పిల్లల చేత వాటికి చక్కని రంగులు వేయించి బొమ్మల కొలువులో ఉంచారు. ఆ రోజు చాలా మంది ఈ రెండు బొమ్మలు గురించి అడగడం, యశోదమ్మ గారు వారు ఇద్దరూ లెక్కలలో ఎంతటి ప్రతిభావంతులో వాళ్లకు చెప్పడం జరిగింది.


యశోదమ్మ గారి బొమ్మలకొలువు ఆధ్యాత్మికంగానే కాక అనేక కొత్త విషయాలు తెలుసుకునే వేదికగా కూడా పెనుగొండ వారికి బాగా ఉపయోగపడింది.


అప్పుడప్పుడు సాయంకాలాల్లో స్వాతంత్ర సమర యోధులు డేగల సూర్యనారాయణ, ఆయన భార్య డేగల వెంకటరత్నమ్మ బొమ్మల కొల్వు దగ్గరకు వచ్చి దేశభక్తుల గురించి, తాము జైలులో పడిన కష్టాలు గురించి చెప్పేవారు. వెంకటరత్నమ్మ కూడా భర్తతో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. డేగల సూర్యనారాయణ, సుబ్బన్న పంతులు గారు బాల్య స్నేహితులు, మంచి మిత్రులు కూడా.

దసరా పండుగ వెళ్ళగానే లెక్కల మేష్టారు జయంతి వెంకట శాస్త్రులు గారిని సంప్రదించి, హై స్కూల్ లో తెలివైన పిల్లలకు బొమ్మలకొలువులో ఉంచిన దేశనాయకుల, సంఘ సంస్కర్తల, శాస్త్ర వేత్తల బొమ్మల్ని ఇచ్చేవారు సుబ్బన్న పంతులు గారు. బొమ్మల కొలువులో దేవుళ్ళ దగ్గర ఉంచిన డబ్బులు అన్నీ గున్నయ్య మాస్టారి ఎలిమెంటరీ స్కూల్ లోని పేద పిల్లలకు ఇచ్చేవారు యశోదమ్మ గారు.

పేరుకి బొమ్మల కొలువైనా ఊళ్ళో అందర్నీ కలిపేది. స్నేహ వాతావరణాన్ని ఏర్పరచేది. పిల్లల్లో ఆనందాల్ని కలిగించేది. కొత్త విషయాలు తెలుసుకునే ఒక ఉమ్మడి వేదికగా నిలిచి

అందరి ఆదరణ ని, అభిమానాన్ని పొందింది

యశోదమ్మ గారి బొమ్మల కొలువు”.


***శుభం***


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


47 views0 comments

Comments


bottom of page