top of page

ఈ కాలం పిల్లలు


'Yee Kalam Pillalu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

'ఈ కాలం పిల్లలు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“దోశ తింటారా లేకపోతే వడా సాంబార్ తెప్పించుకుంటారా?” అంటూ వంటగది లోనుంచి అరిచింది శాంత.


చదువుతున్న పేపర్ పక్కన పడేసి “నీరసం గా వుంది, దోశలు వెయ్యి” అన్నాడు పరమేశ్వర్.


“అడిగితే కానీ చెప్పరు, షుగర్ పడిపోయి దడ దడలాడిపోతో టిఫిన్ అంటే అప్పటికప్పుడు రెడీ అవ్వటానికి హోటల్ కాదుగా, పోనీ పెనం వేడిచేసి యిస్తాను, మీకు కావలిసినట్టు దోశలు వేసుకోండి, నేను దీపం పెట్టుకోవాలి” ఆంది.


“దీపం కి ఏమి తొందరలేదు. ముందు నువ్వు నాకు టిఫిన్ పెట్టు, పతిదేవుడు కంటే ఎవ్వరు గొప్పకాదు అని మీ అనసూయ చెప్పింది” అన్నాడు.


“మీకు సినిమా అనసూయ తప్పా పురాణం అనసూయ కూడా తెలుసా..” అంటూ చూయ్యి మని దోశ వేసింది పెనం మీద.


“ఒరేయ్ పరంగా! కొంపములిగింది రా” అంటూ పరమేశ్వర్ స్నేహితుడు కృష్ణ లోపలికి వచ్చాడు.


“యింకో రెండు దోసెలోయ్, మీ అన్నయ్య వచ్చాడు” అంటూ భార్య తో అని, “చెప్పరా, ఏమైంది?” అన్నాడు.


“కిందటి వారం మా అమ్మాయి పద్మని చూసుకోవడానికి నాలుగు సంబంధాలు వచ్చాయి అన్నాను గుర్తుందా?” అన్నాడు కృష్ణ.


“నువ్వు చెప్పి వారమేగా అయ్యింది. అప్పుడే ఎలా మర్చిపోతాను, మీ అమ్మాయి జీతం రెండు లక్షలు అయితే వాళ్ళవి లక్ష కంటే లేవని, అందుకనే మీ ఆవిడా, అమ్మాయి కలిసి వాళ్ళని నానా ప్రశ్నలు వేసి పంపించేసారని చెప్పావుగా, మళ్ళీ ఈ రోజు ఎవ్వరైనా వస్తున్నారా పెళ్లిచూపులకి?” అన్నాడు పరమేశ్వర్.


“లేదురా బాబూ, ఆ నలుగురి తండ్రులు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయి నచ్చింది, ఒకసారి మీరు వస్తే విషయం మాట్లాడుకొందాము’ అని అన్నారు” అన్నాడు.


“అయితే మంచిదేగా, మీకు నచ్చిన సంబంధం ఒప్పుకుని మాకు పప్పన్నం పెట్టేసేయ్” అన్నాడు పరమేశ్వర్.


“ఆ నాలుగు సంబంధాలు మా ఆవిడకి, మా అమ్మాయి కి నచ్చలేదు, వాళ్లిద్దరూ ఆకాశంలో విహరిస్తున్నారు, ఏ ఐఏఎస్ కుర్రాడో వస్తాడని! మామూలు జీతం సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీరులు వీళ్ళ కళ్ళకి కనిపించడం లేదు” అన్నాడు కృష్ణ.


“అదేమిటిరా మీ ఆవిడ వైపు వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్లే అన్నావుగా, మరి ఈ పిచ్చ కోరికలు ఏమిటి, లక్ష రూపాయలు జీతం అంటే ఏమి తక్కువ కాదుగా” అన్నాడు.


“ఒరేయ్! నా మనసులో మాట చెప్పేస్తున్నాను, మనమిద్దరం ఒకే ఊరు వాళ్ళం. నలభై సంవత్సరాలనుండి స్నేహితులం. నా కూతురుని నీ కొడుకు వేణుకి యిచ్చి చేద్దాం అని కోరిక, కానీ మీ చెల్లమ్మ వుందే.. అది ససేమిరా గుమస్తా కుటుంబం లో యివ్వను అని నాతో పెద్ద యుద్ధం చేసింది, నామాట నడవదని తెలుసుగా నీకు” అన్నాడు కృష్ణ.


ఈ మాటలు విందోయేమో, వంట గది నుంచి దోశలు ఎంతకీ రాకపోతే, “దోశలు ఏమయ్యాయి?” అన్నాడు పరమేశ్వర్.


“అట్లకాడ బాగా కాలుస్తున్నాను, టైమ్ పడుతుంది” అని జవాబు వచ్చింది వంటగది నుంచి.


ఇంతలో కృష్ణ కి ఫోన్ రావడం తో బయటకు వెళ్లి మాట్లాడి లోపలికి వచ్చి, “చంపేస్తున్నారు రా పెళ్లివాళ్ళు, ఎప్పుడు వస్తారు.. అని, విచిత్రం! అదివరకు ఆడపిల్ల తండ్రి కాళ్ళు అరిగేలా తిరిగే వాడు కూతురు పెళ్లికోసం, యిప్పుడు కొడుకు పెళ్లికోసం మగపిల్లాడి తండ్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ అయ్యేడట్లు ఫోన్లు చేస్తున్నారు, సరే మీ ఆవిడ నేను వెళ్లేదాకా దోశలు వేస్తోనే వుంటుంది గాని, నేను వస్తాను” అని వెళ్ళిపోయాడు.


తన స్నేహితుడు ఏమైనా అప్సెట్ అయ్యాడేమో తన భార్య ప్రవర్తన కి అనుకుని కృష్ణ కి ఫోన్ చేసి “పరమేశ్వర్, ఏరా ఆలా వెళ్ళిపోయావు, నీకు ఇష్టం అని మీ చెల్లెలు ఉల్లి దోశ వేసి తీసుకుని వచ్చింది నీకోసం. సోమవారం మేము ఉల్లిపాయ తినము, ఆలా అని కమ్మటి దోశలని ఎలా పారెస్తాము, విధం చెడి నేనే తినేసాను. యింతకీ ఏం చేస్తున్నావ్, వీలుంటే మా యింటికి రా, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవచ్చు” అన్నాడు పరమేశ్వర్.


“నేను యిప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ లో వున్నాను” అన్నాడు కృష్ణ.


“అబ్బే! మా ఇంటికి వచ్చే అప్పుడు కూడా ఫార్మాలిటీస్ ఏమిటి రా, స్వీట్స్ మేము తినము, నువ్వు వచ్చేసేయ్” అన్నాడు పరమేశ్వర్.


“నీ బొంద, స్వీట్స్ నీ కోసం కాదు, సాయంత్రం వచ్చే పెళ్లి చూపుల వాళ్ళకి. పిల్లాడు అడివిలో ఆఫీసర్ ట, మంచి జీతం. జీతం కంటే మిగిలినవి బాగుంటాయి ట. అల్లుడు చేత పెద్ద గంధం చెక్క తెప్పించుకోవచ్చని మా ఆవిడ మురిసిపోతోంది. మా అమ్మాయి మీద ఆధారపడి వుంది, చూడాలి” అన్నాడు కృష్ణ.


“నన్ను కూడా ఆ టైమ్ కి రమ్మంటావా, పిల్లాడు బాగుంటే మీ అమ్మాయి కి నచ్చచెప్పగలను” అన్నాడు పరమేశ్వర్.


“వద్దులేరా, నిన్ను అది ఏమన్నా అంటే బాగుండదు. ఒరేయ్! ఈ ఆడపిల్లల జీతం సగానికి సగం తగ్గించి యిస్తే కాని వీళ్ళకి పెళ్లిళ్లు అవ్వవు” అన్నాడు కృష్ణ.


“ఈ సంబంధం కి ఏమైందే, అడవిలో పని చేస్తున్నాడు కాబట్టి డి విటమిన్ పడక కొద్దిగా రంగు తక్కువ వున్నాడు కానీ, మంచి ఉద్యోగం, అడవి లో వీరప్పన్ కూడా తెలుసు ట అతనికి! నీకేమో జంతువు లా వున్నాడనిపించాడు అంటే ఎలా. నేను ఈ సంబంధం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీకు పెళ్లి అయితే అన్నీ టేకు గుమ్మాలు, టేకు తలుపులు పెట్టి యిల్లు కట్టించుకోవాలి అని అనుకున్నాను” అంది నిష్ఠ్ఠురంగా కృష్ణ భార్య, కూతురు తో.


“అమ్మా! ఆ యింట్లో మనం వుంటే అతను జైల్లో వుంటాడు తెలుసా, టేకు దొంగల గురించి వినలేదా” ఆంది కృష్ణ కూతురు తల్లితో.


“మేము బతికుండగా నీ పెళ్లి చెయ్యలేము. ఈ విధంగా వంకలు పెడితే, నీకు ఎవ్వరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో” అంది కోపంగా కృష్ణ భార్య.


“నోర్ముయ్, ‘దానికి పెద్ద సంబంధం చూసి చేస్తాము, నేను గుమస్తా సంబంధం చేసుకుని ఒక ముద్దు ముచ్చట లేకుండా వుంది చాలు, నీకు ఆ గతి రానివ్వను’ అని నూరిపోసి దాని మైండ్ పాడు చేసావు, యిప్పుడు ఏడిస్తే ఏమిటి లాభం” అన్నాడు భార్య ని కృష్ణ.


“నా గురించి మీరిద్దరూ కొట్టుకోకండి, టైమ్ వచ్చినప్పుడు మీకు మంచి అల్లుడే వస్తాడు” అని తన రూంలో వెళ్ళిపోయింది కూతురు.


స్నేహితుడు నుంచి ఎటువంటి కబురు రాకపోవడం తో ఈ సంబంధం కూడా చెట్టెకింది అనుకున్నాడు పరమేశ్వర్.


“అలా గుడికి వెళ్లి వస్తాను, పనిమనిషి వస్తే అంట్లు బయట పడేసాను, తోమేసి వెళ్లిపొమ్మనండి” అని చెప్పి వెళ్ళింది పరమేశ్వర్ భార్య శాంత.


ఒక గంట నానా ఛానెల్స్ లో వార్తలు చూసి, నీరసంగా వుండటంతో లేచి వంటగదిలో కి వెళ్లి రెండు అప్పడాలు కాలుచ్చుకుని నెయ్యి రాసి నములుకుంటో కూర్చొని వున్నాడు.


ఇంతలో శాంత గుడినుంచి రావడం, వచ్చి “యిదిగో! ఎప్పుడూ ఏదో ఒకటి తినడం తప్పా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోరు. గుడిలో పూజారి గారిని మన అబ్బాయి పెళ్ళికి మంచి ముహూర్తం ఎప్పుడు వుంది అని అడిగాడుట, పక్కన ఎవ్వరో ఆడపిల్ల కూడా వుంది ట, మన అబ్బాయి మన కొంప ముంచుతున్నాడని అనుమానం గా వుంది” అంది పరమేశ్వర్ భార్య.


ఆ మాట విని అప్పడం బదులు నాలుక కరుచుకున్నాడు పరమేశ్వర్.


“చూడు.. కంగారు పడకు, పూజారి గారు ఎవ్వరిని చూసి మన అబ్బాయి అనుకున్నాడో, మన వేణు అంత ధైర్యం చేయ్యలేడు” అన్నాడు భార్య తో.


“ఏమోనండి కొన్నాళ్ళు మంచి రోజులన్నవి లేకుండా పోతే బాగుండును” అంది కొబ్బరి ముక్క విరిచి భర్త చేతికి యిస్తో శాంత.


“నాలుక కొరుక్కున్నాను, కొబ్బరి ముక్క కొరకలేను గాని, రాత్రి కి కొబ్బరి పచ్చడి చెయ్యి, అది సరే ఒక్క కొబ్బరి చిప్పే తెచ్చావు, ఈ మధ్య మనమే కొబ్బరికాయ కొట్టుకోవడం కదా గుడిలో?” అన్నాడు పరమేశ్వర్.


ఒక రోజు ఉదయం కొడుకు వేణు తండ్రికి ఫోన్ చేసి, “నాన్నా! మీరు అమ్మా బయలుదేరి మన వేంకటేశ్వరస్వామి గుడికి రండి త్వరగా” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.


మళ్ళీ ఫోన్ చప్పుడు కి కంగారు గా ఫోన్ తీసి “ఏమైంది రా వేణు” అన్నాడు,


“వేణుని కాదు కృష్ణ ని, మా అమ్మాయి వేంకటేశ్వరస్వామి గుడి నుంచిట ఫోన్ చేసి మమ్మల్ని రమ్మని ఆంది. మాకు గుడి ఎక్కడో కూడా తెలియదు, మా చెల్లెలు ఎప్పుడు గుడికి వెళ్తుంది కదా.. కొద్దిగా లొకేషన్ పంపుతావా, ఎందుకు రమ్మందో కాళ్ళు చేతులు ఆడటంలేదు” అన్నాడు.


“లొకేషన్ పెట్టడం ఎందుకు లే, మా పరిస్థితి అదే, సిద్ధం గా వుండు, పికప్ చేసుకుంటా” అన్నాడు పరమేశ్వర్.


“యింట్లో కొబ్బరికాయ కూడా లేదు, ఎలా అండి గుడికి ఉట్టి చేతులతో వెళ్లడం?” అంటున్న భార్య చేతిని పట్టుకుని లాక్కుని వెళ్లి కారులో కూర్చోపెట్టి, “కొంప ములుగుతో వుంటే కొబ్బరికాయ కోసం కంగారు పడతావేమిటి?” అన్నాడు పరమేశ్వర్.


మొత్తానికి నలుగురు కలిసి గుడికి చేరుకున్నారు. పట్టుబట్టలు కట్టుకుని కొడుకు, కృష్ణ కూతురు ఎదురుగా వచ్చి తల్లిదండ్రుల ముందు నిలబడ్డారు.


కృష్ణ కూతురు “అమ్మా, నీకు నాన్న గుమస్తా ఉద్యోగం చేయటం వలన నన్ను కోటీశ్వరుడి కుటుంబం లో యివ్వాలి అని అనుకునే దానివి. కానీ ఆనందం మనం చేసే ఉద్యోగం లో వుండదు అమ్మా, మనిషి ప్రవర్తన బట్టి వుంటుంది. నేను - వేణు, నాన్నా- పరమేశ్వర్ మామయ్యగారు లా కలిసి తిరిగాము. వేణు ని నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోవు, ఎందుకంటే గుమస్తా కుటుంబం అని లోకువ. కానీ నాన్న కూడా గుమస్తానే అని నువ్వు మర్చిపోయావు అమ్మా.


అందుకనే నువ్వు చూసిన సంబంధం ప్రతీది ఏదో వంకతో చెడగొట్టటం తో, చివరికి నాకు పెళ్లి అయితే చాలు అనుకున్నావు. నేను వేణు యిష్టపడి పెళ్లిచేసుకుందామని అనుకుంటున్నాము. అమ్మా! ఈ విషయం మీకు తెలియనట్టే,పరమేశ్వర్ మామయ్యగారి కి తెలియదు.


యిప్పుడు నువ్వు నేను సుఖం గా వుండటం ముఖ్యం అనుకుంటే ఈ పెళ్ళికి ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుంటాము, లేదు యింకా కోటీశ్వరుడు కి యివ్వాలి అని అనుకుంటే, యిహ నా పెళ్లి విషయం మర్చిపో, నేను మీతో యిప్పుడే వచ్చేస్తాను” అంది తల్లితో.


“ఏదో అనుకున్నాను కానీ, చేసే ఉద్యోగం ఏదైనా పిల్లలని వృద్ధిలోకి తీసుకుని వచ్చిన మీ నాన్నా, పరమేశ్వర్ మామయ్యగారే కోటీశ్వరులు, శుభం! గుడిలో పెళ్లి మంచిదే, అయితే రిసెప్షన్ మన తాహతుకి తగ్గట్టు ఇద్దాం వదిన గారు” అంది శాంతతో.


“ఒరేయ్ పరం గా! కొంపములిగింది, నేను కంగారు లో లుంగీతో వచ్చేసాను, పెళ్ళికి యిలా కూర్చుంటే బాగుంటుందా?” అన్నాడు కృష్ణ.


“మీ అల్లుడు ప్యాంటు వేసుకోండి, అతను ఎలాగో పట్టు పంచేగా కట్టుకుంది” అని నవ్వేసింది కృష్ణ భార్య.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.55 views1 comment

1 comentariu


@saipraveenajeedigunta8361 • 4 hours ago

Good one

Apreciază
bottom of page