'Abba Nee Thiyyani Debba - Part 1/2' - New Telugu Story Written By Vasundhara
Published In manatelugukathalu.com On 12/10/2023
'అబ్బ నీ తియ్యని దెబ్బ - 1/2' పెద్ద కథ ప్రారంభం
రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అనగనగా ఒక నేను. ఆ నేనుకి ఇద్దరు మిత్రులు- రవి, ప్రకాష్. ముగ్గురికీ పెళ్లీడొచ్చింది. వేటకెళ్లే మూడ్‌లో కొచ్చాం.
వేటకెళ్లడమంటే వేటాడ్డానికి కాదు. చేప కనుల పాపల చూపుల బాణాల తాకిడితో వేటాడబడ్డానికి.
వేటంటే అడవికి వెళ్లాలిగా- పార్కులు, అలాంటి విహారస్థలాలే మా అడవులు.
ప్రతి ఆదివారం వేటకి బయల్దేరతాం. వేటగాళ్లు కనబడగానే కళ్లప్పగించి చూస్తాం. వాళ్ల కంటపడాలని ఆత్రపడతాం.
కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. వందకుపైగా పాపల్ని చూశాం. ఒక్కరి చూపుల బాణమైనా మమ్మల్ని తాకలేదు.
నేను చూపులకి హీరోని. కానీ- ఉద్యోగస్థుణ్ణయ్యేదాకా డబ్బుకి మొహం వాచిన సామాన్యుణ్ణి. నా మిత్రులు చూపులకి అతి సామాన్యులు. కానీ- నాకు కొలీగ్సు కావడానికి ముందునుంచే డబ్బుకి వళ్లు వాచిన హీరోలు.
నా పెర్సనాలిటీ అమ్మాయిల్ని ఆకర్షించే ఎర అనీ, అలా పరిచయమైన అమ్మాయిలకి తమ డబ్బు ఓ ఎర అనీ వాళ్ల ఆశ. అమ్మాయిలకి వాళ్ల డబ్బు ఒక ఎర అనీ, అలా పరిచయమయ్యేక నా పెర్సనాలిటీ ఓ ఎర అనీ నా ఆశ!
ఎరని దగ్గరుంచుకుని, అమ్మాయిల్ని వేటగాళ్లని చెయ్యడమేమిటీ అని ఆశ్చర్యంగా ఉందా! అందుకో కథ ఉంది….
- - - - -
నాక్కావలసింది అలాంటిలాంటమ్మాయి కాదు. చెంప చెళ్లుమనిపిస్తే, ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ అని పాడుతూ నా వెంటబడి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నా పెళ్లి ఓ చెంపదెబ్బతో ముడిపడి ఉందన్నాడు యాజి.
యాజి మా ఇంటి పురోహితుడి కొడుకు. కంప్యూటర్ ఇంజనీరింగులో క్లాస్‌మేటు. కాంపస్ ఇంటర్వ్యూలో నేను డేటా అనలిస్టుగా సెలక్టయ్యాను. వాడు రిజెక్టయ్యాడు. కోపమొచ్చి, మరి ఇంటర్వ్యూలకెళ్లనని చాణక్యశపథం చేశాడు.
చెరువుమీద అలగొద్దని మందలించాను. కానీ వాడు, “వేదమంత్రాలకీ, ప్రవచనాలకీ, నామస్తోత్రాలకీ, దేవుళ్లకీ, భక్తికీ, మ్రొక్కులకీ విపరీతంగా డిమాండ్ పెరిగిపోతున్న ఇరవయ్యొకటో శతాబ్దమిది. అన్నింటికీ మించి జ్యోతిషానికి డిమాండ్ పెరిగిన కాలమిది. నాన్నలాగే జ్యోతిష్కుణ్ణౌతాను. ఆయనకంటే పది రెట్లు పేరు, డబ్బు సంపాదిస్తాను” అన్నాడు కసిగా.
“అంటే శాస్త్రజ్ఞానానికి మీ నాన్నకంటే గొప్ప గురువుని ఆశ్రయించి మళ్లీ చదువు మొదలెడతావా?” అనడిగాను.
వాడు ఓరి అమాయకుడా అన్నట్లు నవ్వి, “జ్యోతిషానికి కావలసింది శాస్త్రజ్ఞానం కాదు, లోకజ్ఞానం. నిన్న జరిగింది మొన్నే చెప్పానని రేపటికి అందర్నీ ఒప్పించ గలగాలి. పట్టుపంచ కట్టి, నుదుట బొట్టు పెట్టి, ఓ చేత్తో మెడలో జంధ్యాన్నీ, రెండో చేత్తో టాబ్లెట్‌నీ పట్టాలి. అప్పుడు మనం జనం వెనుక కాదు, జనమే మన వెనుక పడతారు” అన్నాడు.
అరచేతిలో ఇమిడే కంప్యూటరే టాబ్లెట్టు. అది వైకుంఠంతోపాటు గ్రహాలన్నింటినీ చూపుతూ పంచాంగానికి మరో మెట్టు.
ఏడాది తిరక్కుండా- తనని డేటా అనలిస్టు పోస్టుకి పనికిరాడన్న మా కంపెనీలోనే ఆస్థాన ఆస్ట్రాలజిస్టుగా నియమితుడై నాకు కొలీగయ్యాడు యాజి. కంపెనీలో బాస్ దగ్గర వాడికున్న చేరిక నాకు లేదు.
అంతేనా- తన బంధువుల్లో మోస్ట్ మోడ్రన్ అమ్మాయిని జ్యోతిషంతో పడగొట్టి పెళ్లాడాడు. ఇప్పుడామె చూపులకి పాత సినిమాల్లో పతివ్రతల లెవెలుకి మారిపోయి- సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వగైరా గ్రూపుల్లో సంప్రదాయాల సంప్రదింపుకి అథారిటీగా సాటిమహిళల్లో వెలిగిపోతోంది. ఈమధ్యే థ్రెడ్ గ్రూపూ మొదలెట్టింది.
ఉద్యోగంలో చేరి మూడేళ్లయినా నాకింకా పెళ్లి కాలేదు. బాల్యమిత్రుణ్ణన్న అభిమానంతో, అడక్కుండానే జోస్యం చెప్పాడు నాకు వాడు- నా పెళ్లి ఓ చెంపదెబ్బతో ముడిపడిందని!
అని ఊరుకున్నాడా, “నా మాట తేలిగ్గా తీసుకోకు. కర్ణుడికి కవచకుండలాల్లా నాకు పుట్టుకతోనే జోస్యం సహజంగా అబ్బింది. గుర్తు చేసుకో- సెవెన్తులో ఉండగా, ఒక్కడివీ కాలవకెడుతుంటే- ఆరోజు నీకు నీటిగండముందని నేనూ తోడుగా వచ్చా. పాకుడుకి కాలు జారి ములిగిపోతున్న నిన్ను రక్షించా. ఇంటికెళ్లేక మీ అమ్మగారు, ‘నీ జ్యోతిషమే మావాడి ప్రాణాలు కాపాడింది. ఇంగ్లీషు చదువులు చదివినా, ఈ విద్య మాత్రం వదలకు బాబూ!’ అని మాట తీసుకుంది. ‘పురోహితులకీ, దేవుళ్లకీ వయసుతో నిమిత్తం లేకుండా దణ్ణం పెట్టొచ్చు కాబట్టి చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను’ అని రెండు చేతులూ జోడించింది. నీకు గుర్తులేకపోతే ఆవిణ్ణే అడుగుదాం. ఆమెకు మాటిచ్చాననే నేను జ్యోతిషాన్ని పట్టుకున్నాను” అని తన ప్రతిభకు కొత్తగా నన్నే సాక్షిని చేశాడు.
నాకైతే వాడు చెప్పింది ఏమాత్రం గుర్తులేదు. పైగా పది పన్నెండేళ్ల వయసులో కాలవలో ములిగిపోతే- మర్చిపోవడం అసాధ్యం. ఐనా వాడికి కోర్టులో సాక్షిని ప్రిపేర్ చేసే లాయరుకుండే సమ్మోహనశక్తి ఉంది. ఏమో, జరిగిందేమోనని నాకే అనిపించింది. సందేహనివృత్తికి అమ్మ నడగొచ్చు కానీ వృథా! వాడు నాకంటే సులభంగా అమ్మని ఒప్పించగలడు.
మనసు వాడి మాటలు నమ్మింది. ‘ఏ పుట్టలో ఏ పాముందో, యాజి చెప్పిన చెంపదెబ్బ చిట్కా ఉపయోగించడానికి తగిన అమ్మాయిని వేటాడి పట్టుకో’ అని పోరడం మొదలెట్టింది.
జీవితమే ఒక ఆట- అంటారు చాలామంది. కానీ నిజానికది ఓ వేట. పెద్దలది పిల్లలకోసం స్కూళ్లలో సీట్ల వేట. నాయకులది పదవికోసం ఎన్నికల్లో ఓట్ల వేట. ఉన్నవాళ్లది సంపదకోసం సమాజంలో నోట్ల వేట. పేదలది ఉనికికోసం భూమిపై చోట్ల వేట. సినీప్రముఖులది రికార్డులకోసం బాక్సాఫీస్ హిట్ల వేట! నాదీ ప్రేయసికోసం హిట్ల వేట!
‘ట్ల’ తో ప్రాస కోసం తాపత్రయపడుతూ- ఇంక దొరక్క ఆగిపోయాననుకునేరు.
అటు బాక్సాఫీసునీ, ఇటు ప్రేయసినీ కూడా దక్కించుకుందుకు హిట్లే కావాలని స్ఫురించగానే రెండింటికీ ఏమైనా లంకె ఉన్నదా అన్న అనుమానం కలిగింది. ఎందుకంటే- ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ అన్న పాట సినిమాలోదే కదా! మరి సినిమాలాగే ఆట కూడా వినోదానికే. వేటలో హింస ఉందనుకుంటాం కానీ, వేటకి మృగయావినోదమని మరో పేరుంది. కొందరు జీవితాన్ని ఆట అనడానికి కారణమదే!
వేట అనే పదాన్ని చిన్నప్పుడు మాటలింకా సరిగ్గా రానప్పుడు అమ్మ నోట విన్నాను. నన్ను ఉల్లాసపర్చడానికి అమ్మ చెప్పిన తొలి తెలుగు కథ- రాజుగారు, ఏడు చేపలు. అందులో రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకెళ్లి ఏడు చేపలు తెస్తారు.
మొత్తం కథంతా పెద్ద పెద్ద కళ్లు చేసుకుని వినేవాణ్ణిట. అమ్మ చెప్పింది.
మొదట్లో విన్నప్పుడు ఆ కథ నాకు అర్థమవలేదు. కానీ వినడానికి బాగుండేది. ఏడెనిమిదేళ్ల వయసు దాకా అమ్మని మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకున్న కథల్లో అదొకటి.
ప్రేక్షకులు రాజమౌళి సినిమాల్ని ఎన్నిసార్లైనా చూడరూ- కథల విషయంలో మా అమ్మ నాకు రాజమౌళి.
క్రమంగా కథలు కొంచెం కొంచెంగా జీర్ణమౌతుంటే - నేను అమ్మనడిగిన మొదటి ప్రశ్న- వేట అంటే ఏమిటని!
“అవసరమైనవాటిలో ఇంట్లో మనకి దొరకనివి కొన్నుంటాయి. వాటిని బయటికెళ్లి తెచ్చుకోవడమే వేట!” అంది అమ్మ.
పక్కనే ఉన్న నాన్న తనూ ఏదో చెప్పాలని అనుకున్నాడేమో, “నేను సంతకెళ్లి కూరలు తేనూ, అలాగన్న మాట!” అన్నాడు.
వేట అంటే సంతకెళ్లడం కాబోలనుకున్నాను.
ఆ సాయంత్రం ఎందుకో మరి నాన్న సంతకెడుతూ అమ్మని కూడా రమ్మన్నాడు. “వేటకి ఆడవాళ్లూ వెడతారా” అని ఆశ్చర్యమేసి, అమ్మనడగాలనుకున్నాను. కానీ ఎప్పుడైనా, “ఆడాళ్లూనా?” అనడిగితే, “ఏం, ఆడాళ్లు మగాళ్లకంటే ఎందులో తక్కువ?” అని అమ్మ కోప్పడుతుంది.
ఎలాగూ అమ్మ వెడుతోంది కాబట్టి పిల్లలూ వెళ్లొచ్చేమోనన్న ఆశ పుట్టి, “నేనూ వస్తానమ్మా!” అన్నాను.
“నిన్ను తీసుకెడితే, అక్కడ నిన్ను చూసుకోవడంతోనే సరిపోతుంది. తొందరగా హోంవర్కు పూర్తి చేసుకో. మేమొచ్చేక ఆటలకు పంపిస్తాగా” అని బుజ్జగించి, నన్ను ఇంట్లో బామ్మ దగ్గర వదిలి ఇద్దరూ వెళ్లారు.
వాళ్లిలా వెళ్లారో లేదో- పక్కింటి బబ్లూ వచ్చి ఆటలకు పిలిచాడు.
“అమ్మ, నాన్న వేటకెళ్లారు. వాళ్లొచ్చేలోగా హోంవర్కు పూర్తి చేస్తేనే, ఆటలకి పంపుతానన్నారు” అన్నాను గొప్పగా. వేటంటే వాడికి తెలియదుగా, వాణ్ణి ఆశ్చర్యపర్చాలని అలా అన్నాను.
ఊహించినట్లే వాడు తెగ ఆశ్చర్యపడ్డాడు. నేను చాలా గొప్ప మొహం పెట్టి, వేటంటే ఏమిటో వాడికి చెప్పాను.
వాడు వెంటనే, “నిజమేన్రోయ్! మీ నాన్న కూరలు తెస్తాడు కానీ, మా నాన్న అచ్చం కథలోలాగే సంతకెళ్లి చేపలు తెస్తాడు. రాజుగారి కొడుకులు ఏడుగురూ ఏడు చేపలు తెస్తే, మా నాన్నొక్కడే ఏడు చేపలు తెస్తాడు” అన్నాడు గర్వంగా.
బాల్యంలో వేట పట్ల నా అవగాహన అలా మొదలైంది. తర్వాత చదువుకి విద్యాలయాల్లో సీట్ల వేట, చదువయ్యేక ఉద్యోగాల వేట ముగిసి ఓ స్థాయికి చేరడంలో- “ప్రతి మనిషికీ కూడా వేట ఒక వినోదం” అనే జీవితసత్యం తెలిసింది.
“ఇది గ్రహించావుగా, ఇక నీకు పెళ్లి చేసుకునే సమయం వచ్చింది” అంది అమ్మ.
అలాగని పిల్లని తను చూడదట. ఈ పిల్ల నచ్చిందని చూపిస్తే, తనూ నాన్నా అక్షింతలేసి దీవించేస్తారుట! మరి నేనేమో- వాళ్లో పిల్లని ఓకే చేస్తే, నోరెత్తకుండా ఆమె మెడలో తాళి కట్టేద్దామని ఎదురు చూస్తున్నాను.
అలాగని అమ్మలో ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహించేంత ఆధునికతా లేదు. నాలో పెద్దలపట్ల మరీ అంత విధేయతా లేదు. ఇద్దరిదీ అసహాయత! ఎందుకంటే- ఒకప్పుడు అమ్మాయిలు తలిదండ్రుల చాటునుంటూ, పుట్టిందే పెళ్లికోసం అన్నట్లు ఉండేవారు. పుట్టీపుట్టగానే అబ్బాయిని పెళ్లికొడుకు అనేవారు. వాడు పెద్దయ్యేక ఎందరో అమ్మాయిల్ని ఉఊఁ అని చివరికో అమ్మాయిని ఊఁ అనేవాడు. ఆ అమ్మాయికి జన్మ తరించినట్లు అనిపించేది.
రోజులు మారాయి. ఇప్పుడు ముప్పై ఏళ్లొచ్చిన అమ్మాయి కూడా పెళ్లనగానే, ‘అప్పుడేనా?’ అంటోంది. పాతికేళ్లకే పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయిలు కూడా ఎందరినో ఉఊఁ అన్నాకే ఒకర్ని ఊఁ అంటున్నారు.
తన ప్రయత్నాలకి కొన్ని ఉఊఁ లయ్యాకే అమ్మ నన్ను పిల్లను చూసుకోమంది. ఐతే చూసుకోవడం కష్టమేంకాదు. మా ఆఫీసులోనే పెళ్లి కాని అమ్మాయిలున్నారు. కొందరు నా స్థాయికి మరీ ఫాస్టు. కొందరికి అప్పటికే బాయ్‌ఫ్రెండ్సున్నారు. గంతకు తగ్గ బొంతలా నాకు మిగిలింది శుకిత ఒక్కతే.
తనతో మాట కలిపాను. తను మా దూరపు బంధువని తెలిసి మరింత ఉత్సాహపడ్డాను. మా చనువు కాస్త పెరిగి, ఆఫీసు కాంటీన్లో కలిసి కాఫీ తాగడందాకా వచ్చింది. ఐతే రెండో రోజే తను కాఫీ తాగుతూ, ఓ అబ్బాయిని ప్రస్తావించి, “నాలుగేళ్లు కాలేజిలో చదివాడు. ఒక్క గర్ల్‌ఫ్రెండు లేదుట. వాణ్ణే అమ్మాయి ఇష్టపడుతుంది?” అంది ఈసడింపుగా.
ఆమె యథాలాపంగానే అనుండొచ్చు. నేను మాత్రం భుజాలు తడుముకుని వెంటనే ఆమెను దూరం పెట్టాను. అందుకు శుకిత చలించలేదు. వేరే వాళ్లతో కాఫీ తాగుతోంది.
ఎందుకో నాకు శుకిత నచ్చింది. పైగా బంధువులమ్మాయి. నా హిస్టరీ చింపేస్తే చిరిగిపోయేది కాదు కాబట్టి మరో విధంగా తనని ఇంప్రెస్ చెయ్యడమెలా అని ఆలోచిస్తున్నాను. ఈలోగా యాజి చెంపదెబ్బ గురించి చెప్పాడు.
ఒక్కసారి శుకితని సాచి లెంపకాయ కొడితే……?
జగదేకవీరుడు- అతిలోకసుందరి సినిమాలో చిరంజీవికి కోపమొచ్చి శ్రీదేవికి చెంప చెళ్ళుమనిపిస్తాడు. శ్రీదేవి కోప్పడలేదు. ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ అని స్టెప్సేస్తూ పాడి ముచ్చట పడుతుంది.
‘సినిమాలో సాధ్యమైనట్లే ఇది నా విషయంలోనూ సాధ్యపడుతుందా?’ అన్న అనుమానం మనసులో రేగడమేమిటి- నా మరదలు రేఖ గుర్తుకొచ్చింది.
రేఖ నేను పుట్టిన నాలుగేళ్లకి పుట్టింది. నాకు పెళ్లాం పుట్టిందన్నారు ఇంటా బయటా అంతా!
అస్తమానూ కాకపోయినా అడపాతడపా మా ఇంటికి వాళ్లొచ్చేవాళ్లు. వాళ్లింటికి మేము వెళ్లేవాళ్లం.
నేను, రేఖ స్నేహంగా ఉండేవాళ్లం. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టముండేది- తను ఏడో తరగతి ప్యాసయ్యేదాకా.
ఆ సెలవులకి వాళ్లు మా ఇంటికొచ్చారు. రేఖ, నేను పెరట్లో త్రోబాల్ ఆడుతున్నాం. నేను బంతి విసరబోతే తను ముందుకొచ్చి నన్నాపడంలో, నా చేతిలో బంతి జారిపడింది. అనుకోకుండా నా చెయ్యి వేగంగా తన బుగ్గల్ని తాకింది.
“బావ కావాలనే నా చెంప చెళ్లుమనిపించాడు” అని ఇంట్లో ఫిర్యాదు చేసింది రేఖ.
“అనుకోకుండా తగిలింది” అని సంజాయిషీ ఇచ్చి, సారీ కూడా చెప్పాను.
“మావాడికి వంటిమీద వాలిన దోమని చంపడానికే చేతులు రావు” అని అమ్మ నాకు వత్తాసు పలికింది.
“అంటే నేను తనకి దోమకంటే హీనమన్నమాట!” అని రేఖ వేరే పాయింటు లాగింది.
అత్త నా నిజాయితీని కొంత నమ్మింది కానీ, అంతకంటే ఎక్కువగా తన కూతురి తెలివికి ముచ్చటపడింది.
ఆ తర్వాత మేం కలుసుకున్నది, మళ్లీ తను టెన్తు పరీక్షలు రాసేకనే!
అప్పటికి నేను ఇంజనీరింగు సెకండియరు పూర్తి చేశాను. నూనూగు మీసాలు చిక్కబడుతున్నాయి.
రేఖ పదహారేళ్ల వయసు సంతరించుకున్న అందాలు ఆకర్షణీయంగా చక్కబడుతున్నాయి.
ఈసారి మేము పెరట్లో త్రోబాల్ కాదు, ఇంట్లో కేరమ్సు ఆడాం.
రేఖ ఆట అంతంత మాత్రం. తనని ఓడించడానికి మూడు బోర్డులు చాలు.
మూడో బోర్డులోకి వచ్చేక, “మా కాలేజిలో ఏ అబ్బాయీ నామీద ఒక్క బోర్డు కూడా నెగ్గలేదు” అంది రేఖ ఉక్రోషంగా.
“అంత చెత్తగా ఆడతారా వాళ్లు!” అన్నాను ఆశ్చర్యంగా.
“అందమైన ఆడపిల్లల్ని గెలిపించడమే గొప్పతనం- అనుకుంటారు వాళ్లు. వాళ్ల ఆట చెత్తో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం చెత్త మగాడివి” అని బోర్డుమీద బిళ్లలన్నీ కలిపేసి అక్కణ్ణించి లేచి వెళ్లిపోయింది రేఖ. అమ్మాయిలది ఆట ఐతే, అబ్బాయిలది వేట అని అప్పుడే తట్టి ఉంటే- రేఖకీ నాకూ మధ్య దూరం మరింత పెరిగేది కాదు.
అధునికత. తగినంత స్వేచ్ఛ. అనుకూల వాతావరణం. సెల్ ఫోన్లు. వరసైన మా ఇద్దరికీ- ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లో ప్రతిధ్వనించడానికి- బోలెడు అవకాశాలు. కానీ మేం మాట్లాడుకున్నదే తక్కువ.
యాజి జోస్యం విన్నాక నాలో మళ్లీ ఆశ పుట్టి, చిన్న చిట్కా ప్రయోగించాను.
రేఖకి హింటిద్దామని నా మొబైలుకి రింగ్‌టోన్ ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ పాట పెట్టాను. తర్వాత రేఖకి మిస్డ్ కాల్ ఇచ్చాను.
రేఖ మంచిదే! నా కాల్ ఇగ్నోర్ చెయ్యలేదు. వెంటనే ఫోన్ చెయ్యడమే కాదు- నేను వెంటనే ఫోను తియ్యకపోయినా కట్ చెయ్యకుండా, రింగ్ టోన్ పాటలో రెండు చరణాలు విని అప్పుడు కట్ చేసింది. నేను కాసేపాగి మళ్లీ ఫోన్ చేస్తే- ‘వీడు ఆరడుగుల బుల్లెట్టూ’ అని రింగ్ టోన్.
నా ఎత్తు ఐదడుగుల పదంగుళాలే. అంటే ఆమె అంచనాకి రెండంగుళాలు తక్కువ. పాత మాయాబజార్ చిత్రంలో అభిమన్యుడి బాణాల్ని చిత్తు చేసిన ఘటోత్కచుడి మాయాజాలంలా- ఈ హింటు నా హింటుని చిత్తు చేసింది.
ఆ పాటలో మిగతా అంశాలు వింటే నా కాంప్లెక్సు మరింత పెరిగిపోతుందని జాలి పడిందేమో- రేఖ వెంటనే కాల్ ఆక్సెప్ట్ చేసి, “ఓ ఎక్సయిటింగ్ న్యూస్ నీతో షేర్ చెయ్యాలనుకుంటే, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. చెప్పు బావా!” అంది.
రేఖ చెప్పిన ఎక్సైటింగ్ న్యూసేమిటంటే….
ఆమె సీనియర్ షీలా పాత బాయ్‌ఫ్రెండుకి బ్రేకప్ చెప్పి, కొత్త బాయ్‌ఫ్రెండుతో తిరుగుతోందిట. పాతవాడు ఉక్రోషపడి ఒక రోజు ఆమెకి చెంప చెళ్లుమనిపించి, ‘ఇప్పుడు నువ్వు- అబ్బ నీ తియ్యని దెబ్బ’ అని పాడాలి’ అన్నాట్ట.
“చిరంజీవిలా మెగాస్టార్ కాకపోయినా, కనీసం నానోస్టార్ లెవెల్ సెలబ్రిటీవి అనిపించుకో. అప్పుడు పాడతాను. అందాకా ఇది తీసుకో” అని చెప్పు తీసుకుని కొట్టిందిట ఆ అమ్మాయి.
మెగా అంటే ఒకటికి పదిలక్షల రెట్లు పెద్ద. నానో అంటే ఒకటిలో వందకోట్లో వంతు చిన్న. చిరంజీవి మెగా ఐతే నాలాంటివాళ్లు ఆయనలో పదిలక్షల వందకోట్లవ వంతు కూడా కాదని రేఖ హింటు.
దాంతో ఆమె ఎక్సయిటింగ్ అన్నది నాకైతే డిప్రెసింగ్‌గా తేలింది. బహుశా అదే రేఖ షేరింగ్ ఉద్దేశ్యం.
నేను భైరవుణ్ణీ, భార్గవుణ్ణీ, భాస్కరుణ్ణీ కాను. ఆరడుగుల బుల్లెట్ని కాను. కనీసం నానోస్టార్ని కూడా కాను.
అమ్మాయిల్ని చెంపదెబ్బతో వశపర్చుకునే స్థాయి నాకెక్కడిది?
మరి యాజి అలా చెప్పాడెందుకు? అతడి జోస్యం తప్పా- అని ఆలోచించగా ఓ విషయం స్ఫురించింది నాకు.
ప్రేమ కూడా ఒక వేట! హింస లేని ఆట. దక్కనిది దక్కించుకునేందుకు వేసే బాట.
నాకు రేఖ తెలుసు. శుకిత తెలుసు. తెలిసినవారితో వేట ఏమిటి?
మా ఆఫీసులో నాలాంటివాళ్లే రవి, ప్రకాష్! వాళ్లతో కలిసి తెలియని వేటగాళ్లకోసం వేటకి పూనుకున్నాం.
అదీ సంగతి!
- - - - -
అలా ఓ ఆదివారం సాయంత్రం ముగ్గురం వెడుతుంటే సుచేతా పార్కు రాగానే మా కారుకి సడెన్ బ్రేకు పడింది.
కారు నడుపుతున్న రవి, “నేనేం చెయ్యలేదు. కారు దానంతటదే ఆగింది” అన్నాడు.
అటు చూస్తే- పార్కు గేటు వద్ద- ఓ అమ్మాయి. మా కలల పంటలా ఉంది.
ఆమె కారు కేసి చూడగానే, ఆచూపుల్నించి ప్రసారమైన రిమోట్ కిరణాలే రవిచేత మా కారుని అపించాయని అర్థమైంది.
కళ్లప్పగించి ఆమెను చూస్తుంటే, ఆమె వెనక్కి తిరిగి గేటు పక్క వికెట్ గేటులోంచి పార్కులోకెడుతోంది.
గేటు తిరుగుతుంటే, మా మనసులు కూడా గింగిరాలు తిరిగాయి. అంతలో ఆ అమ్మాయి కనుమరుగైంది.
అంతే! కార్ని ఎక్కడ, ఎలా పార్క్ చేశామో తెలియకుండా పార్కులో అడుగెట్టాం. హడావుడిగా లోపలి కెళ్లేసరికి- ఆ అమ్మాయి పార్కు మధ్యకి చేరింది.
అక్కడ నాలుగు చెట్ల మధ్య కాళీ స్థలముంది. నాలుగు చెట్లూ కొమ్మలతో కమ్మెయ్యడంవల్ల లోపలేం జరుగుతోందీ బయటివారికి కనిపించదు. దానికి లవర్స్ డెన్ అని పేరు. ముందుగా బుక్ చేసుకున్నవారికే అందులో ప్రవేశార్హత.
ఆమె అన్నీ బాగా తెలిసినదానిలా లవర్స్ డెన్‌లోకి వెళ్లింది. అంటే ఆమె ముందుగానే ప్రవేశార్హత పొంది ఉండాలి.
మేమామెను అనుసరించి చెట్లదాకా వెళ్లి ఆగిపోయాం. లవర్స్ డెన్‌లో లోపలున్నవారి ప్రైవసీని భంగపర్చకూడదని మర్యాదస్థుల ఒప్పందముంది. ఐతే చెట్లచాటునుంచి లోపలికి తొంగి చూడ్డం లోపలివాళ్లకు తెలియనంత కాలం- అమర్యాద కాదని సరిపెట్టుకుని ముగ్గురం చెట్ల మాటున పొజిషన్సు తీసుకున్నాం.
అప్పటికే లోపల ఓ యువకుడున్నాడు. అతడామెని అసహనంగా చూసి, “ఎప్పుడు రావాలి? ఎప్పుడొచ్చావ్? ఇంత నిరీక్షణ నాకెంత పెద్ద శిక్షో ఊహించలేవా?” అన్నాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం: మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
Comments