top of page

ఇదండీ.. అసలు విషయం!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link


'Idandi Asalu Vishayam' Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


తొంబై ఏళ్ళ హరిహరమహాదేవయ్య,

ఓ ఐదు తక్కువగా అయన భార్య అన్నపూర్ణ...

తలుపుల్లేని గదిలో పడుకోవడం వాళ్లకు ఇబ్బంది.

అపార్థం చేసుకున్నారు పిల్లలు.

చివరికి ఏమయ్యింది?

సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించారు.

🔯🔯🔯🔯

" అన్నపూర్ణ... ఈ నీయొక్క బిడియం వల్లే మొదటి నుండి నీ నుండి నేను ఏమీ పొందలేక పోయాను. నీ శరీరంలో ప్రతి ఒక్క అణువు అణువును ఆక్రమించెయ్యాలన్న నా తీరని కోరిక... మొదటిరాత్రి నుండి పూర్తిగా తీర్చుకోలేక పోయానంటే నమ్ము. "

" ఇప్పుడవన్నీ ఎందుకట! మీకు తొంభై.. నాకు మరేమో..ఐదు తక్కువ...' గతం గతః '...అని మీరేకదా అనేవారు." అంది అన్నపూర్ణ, భర్త హరిహరమహాదేవయ్య తో.

" సరే నీమాటే నామాట.. కానియ్యి.. కానియ్యి "

" ఉండండి బాబు! తలుపేసి వస్తాను."

" మన గదికి తలుపులు ఎక్కడున్నాయి. ఈ షెడ్డులాంటి భాగంలో మనల్ని పడేసారు. ఆ మూలన బూజులు..ఈమూలన... బొద్దింకలు.. అవిగవిగో.. తాళ్ల కట్టలు......కాగితంముక్కలు… అట్టపెట్టెలు........ఇదో దోమలసామ్రాజ్యం!!!!!

పైన డబడబలాడే రెండు రెక్కల ఫ్యాను. ఈ బొమ్మరాని బుల్లి టీవీని ఇదిగో ..ఈ కర్రతో కొడితేనే గాని.. ఉలకదు పలకదు. మూడు కాళ్ళు ఉన్న ఈ కుర్చీ మీద కూర్చోవాలి అంటే...అంటే.. నాలుగోకాలుగ.. ఈ అరడజను ఇటుకలు దాపు పెట్టుకోవాలి. ఈ దూది పరుపులో దూది రూమంతా ఎగిరి చంద్రమండలంలో విహరిస్తున్నట్లు ఉంది కదూ!!!!!!

వాళ్ళిద్దరికీ రాజాలాంటి పోర్షన్లు కట్టించాను. కనీసం...మన గదికి 'తలుపులు' పెట్టిద్దామన్న ఇంగితం లేదు నా కొడుకులకు.

అర్ధపుష్కరమయింది.. గుమ్మానికి ఆ గుడ్డ అడ్డంగా కట్టి. ఏం చేస్తాం.... ఇదిగో ఈ కుర్చీలు రెండూ కూడా గుమ్మానికి అడ్డంగా పెట్టి రా. ఆ తర్వాత మన పని మనం చేసు కుందాం. వచ్చిన వాళ్ళే సిగ్గుపడి ఇకిలించుకుని.. వెళ్ళి పోతారు." చాలా చిరాకుగా అన్నాడు హరిహరమహాదేవయ్య.

" సరే..."... అంటూ అలాగే చేసింది అన్నపూర్ణమ్మ

" రా.. దీన్ని... ఇలా పట్టుకో....అలా కాదే... ఇలా...అదిగదీ...."

" నాకుతెలియదా.. ఇదివరలో ఎప్పుడు అలవాటు లేదు అనుకుంటున్నారా?.. . మీరు మరీ చూపించి చెప్పాలా చిత్రం కాకపోతే..? "

******* ******* *******

" బాబీ... ఏమిట్రా అది ...ఆ ఆయాసం దేనికి?"

" ప్రపంచయుద్ధం కన్నా గొప్ప న్యూస్.. ఐదురూపాయలు ఇస్తే చెప్తా నాన్నా."

" సరే. ఇదిగోరా నీ మామూలు."

" అమ్మా.. నువ్వు కూడా ఐదురూపాయలు కొట్టించు."

" సరే ..ఇదిగోరా.. త్వరగా చెప్పు ..చెప్పరా."

" ఇది చెవిలో చెప్పేది.... తాతయ్య రూమ్ బయట గుమ్మం దగ్గర వేస్టుబకెట్టు లో " కండోమ్స్ ".... ఏంటి అలా వెర్రిగా చూస్తారు. ఇంగ్లీషు అర్థం కాదా.. అంటే .." నిరోధ్ ప్యాకెట్స్ !".

" చి చి.. నిజమా?.."

" ఓ యాభై రూపాయలు పందెం వేసు కుందామా?"

" వద్దులేరా బాబు నువ్వెళ్ళు."

" బాబాయ్ కి ఈన్యూస్ చెప్పి ....మరో .... ఐదురూపాయలు కొట్టేయాలి.నాన్నా....అమ్మకు అర్థం కానట్టుంది. నువ్వు చెప్పు. నేను చెప్తే సిగ్గుపడుతుంది. పరుగున వెళ్ళి పోయాడు బాబి.

"ఏమిటండీ ..అసహ్యంగా .... ఈ వయసులో అత్తమామయ్యలకు ఇదేం బుద్ధి. ఇదేం సరదా. పిల్లలు ఉన్న ఇల్లు... నిరోధ్ ప్యాకెట్స్... వాడేసుకుని గుమ్మం దగ్గర వేస్ట్ బకెట్లో అందరికీ కనబడేలా అలా ....పడేస్తే

ఎలా? మరీ బరితెగించితే ఎలా? మనం ఎప్పుడైనా ఇలా పబ్లిక్ గా పాడేసామా? అయినా వాట్ల అవసరం వాళ్లకు ఏమిటి?" భర్త కృష్ణమూర్తి తో అంది రుక్మిణి.

" నాఉద్దేశంలో ఖచ్చితంగా ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగుంటుంది రుక్మిణి. ఇది తమ్ముడు ముకుందం, మరదలు లక్ష్మీ ల పని అయి ఉంటుందేమోనని .. నాకు అనుమానంగా ఉంది."

"అలాగని నువ్వు అనుకుంటావని.. నేను మా ఆవిడ పరుగుపెట్టుకుంటూ నీరూంకి వచ్చేసాం అన్నయ్య.బాబిగాడు చెప్పటం కంటే ముందే మీ మరదలు లక్ష్మి చూసిందట.. ఇది మా పని కాదు."....కంగారుగా వచ్చి అన్నాడు కృష్ణ మూర్తి తమ్ముడు ముకుందం.

" అయితే అమ్మా నాన్నే ఈ పని చేసుంటారు."

" ఒకసారి వాళ్లకు చెప్పి చూస్తే.."

" వద్దు సిగ్గుపడి.. కోప్పడతారు."

"అయితే మార్కెట్ కు వెళ్లి ఆ వేస్టుబకెట్ కు మూత తెస్తే...."

******** ********* *******

" ఎవర్రా.. నారూమ్ బయట వేస్టుబకెట్ కి మూత పెట్టింది.. మాట్లాడరే. క్రిందకు ఒంగి మూతతీసి చెత్త ఈ బకెట్లో వేసి మళ్లీ మూత పెట్టాలంటే మా వయసులకు ఎంత కష్టమో మీకు ఏం అర్థమై ఏడుస్తుందీ.. అంట ? ముస లాళ్ళం మాకు మూతలెందుకురా. వయసులో ఉన్నారు మీరు పెట్టుకోండి మూతలు. " మండి పడ్డట్టు చాలా చిరాగ్గా అన్నాడు హరిహర మహాదేవయ్య.

" అబ్బా పిల్లలని ఎందుకలా.. ఆడిపోసు కుంటారు.కేకలేస్తే భయపడ్రా... మూతపెట్టడం తప్పా.." అంటూ సొణిగింది.. అన్నపూర్ణమ్మ.

" అన్నపూర్ణ... వీళ్లు పాలపీక వెధవలు కాదు. ఆరేళ్లుఅయినా మన రూమ్కి తలుపులు పెట్టించాలి అన్న జ్ఞానమే లేదు. ఎందుకో మరి ఇరవై నాలుగు గంటల్లో బకెట్ కి మూత కొనితెచ్చి పెట్టేశారు. 3 రూపాయలతో అయిపోయే పని కదా మరి."

" పోదురూ..ఈవయసులో మనకెందుకండీ.. తలుపులు, గెడలు,గొళ్ళాలు....మనవలతో, కొడుకులతో, కోడళ్లతో...హాయిగా కలిసుంటే సరిపోదా?

" ఇరువది నాలుగు గంటలు.. వాళ్ళెవరైనా మన ఈ రూమ్ లోకి రావచ్చు. మనం వెళ్దా మంటే వాళ్ల ఉండే రూమ్ తలుపులు ఎప్పుడూ గడియపెట్టే ఉంటాయి. నీకు బుద్ధిఉందా.. వాళ్లకు ఒక న్యాయము... మనకి ఇంకొక న్యాయమా...? నేను ఒప్పుకోను."

" పుష్...వాళ్ళందరికి వినబడితే ఏమను కుంటారు?."

"వాళ్లకి ఏమన్నా ...చెముడా ...బ్రహ్మజెముడా......నాగజెముడా? ఏమనుకుంటే మనకే . ఇదిగో.. ఇదే.....చెప్తున్నా.. వినబడుతుందా ఎవరైనా ఈ వేస్ట్ బకెట్టు కి మూత పెడితే మీ మీ తాటలు ఒలిచి పడేస్తానర్రా. అన్నపూర్ణ... నువ్వు మంచం మీదకి నడు. నా మనసు పాడై పోయింది! ... ఆ చిన్నిపెట్టె తెచ్చి అందులో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో చూడు..." అంటూ వేస్ట్ బకెట్టు "మూతను" దూరంగా గిరాటేస్తు తన రూం లోపలకి నడిచాడు హరిహర మహాదేవయ్య.

"ఉదయమే చూశాను ఇరవై ఉన్నాయి. అయినా ఇప్పుడు వద్దండి .. నాకు చాలా చిరాగ్గాఉంది. ఎప్పుడు పడితే అప్పుడే అంటే ఎలా? "

" నామనసు పాడై పోయిందని చెప్తున్నాగా. వినవే........ఇలాంటప్పుడే మనసుకు....ఆనందం కలగాలోయ్! అంటే ఇప్పుడు ఆ పని తప్పదు. కాదనక త్వరగా నడు. నా మూడ్ పాడుచేయకు."

" తప్పదు అంటారా?

" హూ హూ... నన్ను అర్థం చేసుకోవా అన్నపూర్ణ?"

" వయసు పెరిగే కొద్దీ మీకు మరీ ఎక్కువై పోతుంది చాదస్తం. ఉడుంపట్టు. .. పట్టిన పట్టు వదలరు కదా... ఎవరూ ఇంతిలా ఉండరు బాబూ . ఈ వయసులో మీపద్ధతి కొంచెం మార్చుకోవాలి. అదిగో ఇద్దరుకోడళ్ళు సిగ్గు పడి తలుపులు మూసేసుకున్నారు. మనవలు

అందరూ వాళ్లవాళ్ల కిటికీల్లోంచి మనల్నిద్దర్ని వింత జంతువులను చూసినట్లు చూస్తున్నారు. ఈరోజు ఉదయంనుండి వాళ్ళెవరూ మన దాపులకు కూడరాలేదు.వాళ్లందరికీ ....మనవ్యవహారం.... తెలిసి పోయిందంటారా!"

" తెలియకుండా ఉంటుందా తెలిస్తేమాత్రం మనకు ఏమిటి? మన పని మనదే".... అంటూ భార్యను మంచం మీదికి లాగాడు.

******* ******** ********

హరిహర మహాదేవయ్య కలర్ టీవీ ముందు కూర్చుని పాత జానపద సినిమాలో శృంగార సన్నివేశం చూస్తూ చాలా తన్మయత్వం లో ఉన్నాడు. అతని పక్కగానే అతని భార్య అన్నపూర్ణమ్మ మరో కుర్చీలో కూర్చుంది.

ఆ హాలులో మూడు....జంటలకు.... పిల్లలందరికీ ఒకటే టీవీ. మంచి సినిమా వస్తే అలా వచ్చి థియేటర్లో కూర్చున్నట్టు కూర్చుం టారు....ఆ ఫ్యామిలీ అంతా.

ముందువరుసలో హరిహరమహదేవయ్య, అన్నపూర్ణ . వాళ్ళిద్దరు వెనుక కుర్చీల్లో పెద్ద కొడుకు, కోడలు ,పిల్లలు. వాళ్లందరిి వెనుక చిన్నకొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు.

" ఏనాటి కాంతారావు ..ఏనాటి కృష్ణ కుమారి. ఇప్పటికీ ఎంతో అందంగా నవనవ లాడుతున్నారు..... మిమ్మలినే ఆ తదేకదృష్టి ఏమిటి? కాస్త ఈలోకంలోకి రండి. అంతకన్నా ఏమి జరగదు సినిమాలో."... భర్త భుజాలపై చెయ్యివేసి కుదిపింది అన్నపూర్ణమ్మ.

హరిహరమహాదేవయ్య ఈ లోకం లోకి వచ్చి రూమంతా పరికించాడు. అప్పటికే పెద్ద కొడుకు, కోడలు ముసిముసిగా నవ్వుకుంటూ, వాళ్ళ పిల్లల్ని లాక్కుంటూ ఆ పెద్దవాళ్ళు వంక ... మిడిగుడ్లతో చూస్తూ ... వెళ్లిపోతు న్నారు. ఆతర్వాత.. అదే పద్ధతిలో రెండో కొడుకు, కోడలు కూడా వెళ్లిపోయారు... వాళ్ల పిల్లలతో సహా.....గుసగుసలు ఆడుకుంటూ!

ఇక ఆ హాల్లో మిగిలింది ..ఆ శృంగార ఎపిసోడ్చూస్తున్న ఆ వృద్ధ జంట మాత్రమే.

" అన్నపూర్ణ.. ఇరవైరోజుల నుండి చూస్తున్నాను.వీళ్ళందరి లో ఏదో మార్పు వచ్చేసింది కదూ. కొడుకులు, కోడళ్ళు.. చివరికి చిన్నకుర్రవెధవలు కూడా మనరూమ్ లోకి రావడానికి ఇష్టపడడం లేదు.గమనించావా!

కొంచెం అయినా పసిగట్టావా అందరూ మని ద్దరికీ చాలాదూరంగా ఉండటం ఎందుచేత అంటావు? వాళ్ళలో వాళ్ళు మనల్ని చూసి ఏవేవో తెగ ఇకఇకలు, పకపకలు, తికమక చూపులు, గబగబనడకలు. వాళ్లు లోలోపలే నవ్వుకుంటు న్నట్టు నాకనిపిస్తుంది.. వాళ్ల ప్రవర్తనలో ఏదో తిరకాసుందోయ్!"

" నేను అదే చెబుదామనుకున్నాను మీకు. రేపు త్రినాథవ్రతం కదా. అదికాస్త ప్రశాంతంగా పూర్తయ్యాక వివరంగా అప్పుడు అడుగుదాం. అంతవరకూ..మీరుమాట్లాడకుండా ఊరుకోండి."

" సరేగానీ... ఆ చిన్నిపెట్టెలో ఇంకా మన ప్యాకెట్స్ ఎన్ని ఉండుంటాయి అంటావు?"

" మొన్ననే మరో ముప్పై తెచ్చారుకదా. ఇంకా చాలా ఉన్నాయి. నాకూ అలవాటు చేసేశారు బాబు! నేను కూడా ఈ వయసులో రోజూ ఆ చిన్ని పెట్టె మూత తెరిిస్తేనే గాని ఉండలేకపోతున్నాను... వస్తారా...మొదలు పెడదాం."

" మీ కంగారు మండ. వస్తున్నానుండవే."

హరిహరమహాదేవయ్య,అన్నపూర్ణమ్మ ..ఇద్దరూ

ఆనందంగా తమ రూమ్ లోకి వెళ్లిపోయారు.

********* ********* ******

ఆ మర్నాడు

ఇల్లంతా శుభ్రంగాఉంది.ఆరోజే త్రినాధవ్రతం...

వ్రతం ఆచరించే గృహంలోని ఆడవాళ్ళు ఉదయాన్నే తలారా స్నానంచేసి సాయంత్రం వరకు ఉపవాసంఉండి ...రాత్రికి త్రినాధవ్రతం ఎంతో భక్తిశ్రద్ధలతో పూర్తి చేస్తారు. ఇరుగు పొరుగు స్త్రీలందరితో.. అదే ..ఈరోజు జరగబోతుంది...ఇల్లంతా మామిడితోరణాలతో దైవభక్తితో కళకళ లాడిపోతోంది!

ఏమిటర్రా ..మధ్యాహ్నం అవుతుంది. ఎవరూనాకుఏమివిషయాలుచెప్పరే. తెల్లారేసరికల్లా ..... ముగ్గురం కలసి చేతికి తోరాలు ...

భక్తితో కట్టుకునే వాళ్ళంకదా ....ప్రతిసంవత్సరం మరిచి పోయారా?"..అన్నపూర్ణమ్మ తన గుమ్మం దగ్గర నిలబడి కోడళ్లకు వినబడేలా అరిచింది.

ఆ అరుపుతో ఇద్దరు కోడళ్ళు బయటకు వచ్చారుగబగబా.

"అత్తయ్యగారు..మేమిద్దరం ఉదయం ఆరు గంటలకే తలస్నానంచేసి తోరాలు కట్టేసు కున్నాము. ఈ వయసు లో అందునా..ఈ పరిస్థితిలో... మీకు ..పూజచెయ్యటం..కుదర దేమోనని.. మిమ్మల్ని బలవంతం చేయలేదు" నసుగుతూ అంది పెద్దకోడలు రుక్మిణి.

" అత్తయ్యగారు మీకు తెలియంది ఏముంది . ఇది చాలా నిష్ఠతో చేయ వలసిన వ్రతంకదా. భార్య భర్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరినొకరు తాకకూడదు. " ఆ "... దృష్టి తో ఉండడం అసలే పనికిరాదు. మీరు అలా భక్తిగా ఉండలేరేమో నని....." రెండోకోడలు లక్ష్మి అంది ముప్పయిఆరు వంకరలు తిరుగుతూ.

" ఏంటర్రా ..నాకు....చెప్తున్నారు . ..మీరు? "

ఆశ్చర్యంగా అంది అన్నపూర్ణమ్మ.

" నిజమే అత్తయ్యగారు.. మీరుమామయ్య, గారు ఈ మధ్యన కొంచెం 'అది ' గా 'ఇది ' గా ఉంటున్నారు కదా. ఇలాంటి భక్తి ప్రధానమైన పూజలకు అలా ఉంటేకుదరదుగా . అందు కని..అందరూచూస్తబాగుండదని ....ఇరుగుపొరుగు వాళ్ళని కూడా పూజకు పిలవలేదు. "

" అమ్మో అమ్మో ..ఏమిటి అంటున్నారర్రా మీరు. నాకసలు అర్థం కావడంలేదు" ఆశ్చ ర్యంగా అంది అన్నపూర్ణమ్మ.

" ఇందులో అర్థం కావలసింది ఏముంది అత్తయ్య. వ్రతం పట్టాక మీరు మామయ్య గారు ...చాటుమాటు వ్యవహారాలుసాగిస్తే ...ఆ త్రినాధులువారికి కోపం వస్తుంది. అందుకనే మీకు చెప్పకుండా మేమిద్దరం చేసేసు కుంటు న్నాం." పెద్దకోడలురుక్మిణి ఖచ్చితంగా చెప్పే సింది.

" అయ్యో అయ్యో.. ఈ ఇంట్లో పూజలు ఎప్పుడైనా నేను లేకుండాజరిగాయా? ఎంత మార్పు.. సరే... మీరేపూజచేసుకోండి.మీ పూజ అయ్యేవరకూ మేము ఇద్దరం ఈఇంట్లో ఉండడమే... మీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. ఊర్లో అన్ని గుళ్ళుగోపురాలు తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తాం లే. పుణ్య మంతా మీరే మూట కట్టుకోండి. త్రినాథస్వామివారు ఈ ఇంట్లోనే ఉన్నారా... ప్రపంచమంతా ఉంటారు.. సర్వాంతర్యామి."....... అంటూ అన్నపూర్ణ లోపలకు వెళ్ళి ....భర్తతో చాలాసేపు మాట్లాడి చరచర బయటకు వెళ్ళిపోయింది అతనిని తీసుకొని.

******** ********* ********

నెల తర్వాత..

హరహరిమహాదేవయ్య, అన్నపూర్ణమ్మల... పెళ్లిరోజు!.

పరిస్థితి యథాతథంగానే ఉంది. నిరోధ్ ప్యాకెట్స్ రోజు క్రమంతప్పకుండా..వేస్ట్ బకెట్లో దర్శనమిస్తూనే ఉన్నాయి.తమ తల్లిదండ్రు లయిన ఆ వృద్ధదంపతులుపెళ్లిరోజు ఆనం దంగా ....గడవాలని..వాళ్ళిద్దరి...ప్రణయకేళి సల్లాపాలకు తాము ఏమాత్రం అడ్డు రాకూ డదు....అన్న ఉద్దే శంతో ఆ అన్నదమ్ములు ఇద్దరుఆలోచించుకుని తమ తమ కుటుం బాలతో ఆరోజు ఎక్కడైనా.. గడిపిరావాలని పూర్తిగా నిశ్చయించుకున్నారు. అందుకు తమ తల్లిదండ్రులకు నమ్మదగే '' కథ ".... చెప్పి రేపు మధ్యాహ్నం వస్తాం అంటూ .... అద్దె మారుతికారులో వెళ్లిపోయారు. వాళ్లంతా కోటిపల్లి చేరారు. ఆ గోదారిగంగ లో పవిత్ర స్నానం చేసిరాత్రికి అక్కడి సత్రంలలో ఉండి పోయి మర్నాడు ఇంటికి వచ్చేయాలన్నది వాళ్ళ ...." ప్లాన్"!

గోదారి ఒడ్డుకు చాలా దూరంగా మారుతి కారులో వచ్చిన ఆ జంటలు వాళ్ల పిల్లలు క్రిందకు దిగగానే వాళ్ళ అందరి ఫ్యామిలీ డాక్టర్ పరాంకుశం బైనాక్యులర్ తో ఎదురు పడ్డారు. ఆ కోటిపల్లి గోదారిలోనే తనూ స్నానం చేయాలని అంతకు ముందే ఆయన మరో కారులో వచ్చారు.

" హలో.. మీరంతా వచ్చేసారా.. చాలా బాగుంది..ఈ టైములో మీరు ఇక్కడకు వస్తే భలేగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనుకున్నట్టే జరిగింది. ఇదిగో ఈ బైనాక్యులర్లో చూడండి..దూరంగా ఆ గోదారమ్మఒడిలో ఎవరో ఇద్దరు. ...' ఆడమగ '.... ఎంతో సరదాగా

ఆనందంగా ఆడుకుంటున్నారు ....చూడండి "

" సార్ ..వాళ్ళ గురించి మాకు ఎందుకు...?"

" అంటే... ఇక్కడ స్నానానిక ఒకటే మంచి రేవు. ఇంకెవరూ లేరు కదా అనికాబోలు ఆ భార్యా భర్తలు ఇద్దరూ తాండవ నృత్యం చేస్తున్నట్టు ఆనందజలకాలు ఆడుతున్నారు. ఇప్పుడే మీరు కూడా స్నానానికి వెళితే వాళ్ళి ద్దరు ఆనందం ఆవిరైపోతుంది...అందుకని మీరు"

" కాసేపాగి వెళ్తాం. ఏదీ ఆ బైనాక్యులర్... ఆ ఆ..ముఖాలు అంతగా కనిపించడం లేదుగాని చాలా అల్లరి చేస్తున్నారు. నీళ్ళు ఒకరిపై ఒకరు చిమ్ముకుంటున్నారు.ఒంటిపై బట్టలు చెదిరి పోతున్న చిన్నపిల్లల్లా మైమరచి ఎలా అడు తున్నారో.. చూడు అన్నయ్య." బైనాక్యులర్ అందించాడు ముకుందం అన్న కృష్ణమూర్తికి.

" పెద్దవయసువాళ్లులా ఉన్నారు.. కిత కితలు,ముద్దులు, చూడ్డానికి సినిమాలో సీన్ లా ఉంది. భలే..తెగ రెచ్చిపోతున్నారు."

" ఓకే ...రండి.. కాసేపు అందరం ఆ ఇసుక మెట్ట మీద కూర్చుందాం." అన్నారు డాక్టర్ పరాంకుశం.

" మీకందరికీ మీ ఫ్యామిలీ డాక్టరుగా చిన్న పాఠం చెప్పాలని ఉంది. ఏమనుకోరుగా" అడిగారు పరాంకుశం.

" చెప్పదగినవారు.. మా హితులు చెప్పండి డాక్టర్ గారు."

"శృంగారం అందరి సొత్తు. అది ఏవయసు వారైనా' దంపతులుగా'. .. అనుభ వించే అధికారం ఉంది. ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది. వయసు మళ్ళినవారు అంటే.. వృద్ధులు కూడా అనుభవించి తీరాలి. అది ఒక ఎక్సర్సైజ్... శారీరకంగా మానసికంగా మంచి ఫలితాలను ఇచ్చే " కేళి "

ఇద్దరి తనువులు అలాఅలా రాపాడించు కోవాలని ....ఒకే మంచం మీద పడుకోవాలని.. వృద్ధులు అందరూ ఆశపడతారు. కానీ.. వాళ్ల కోరికలు తీరవు. అందరూ చూస్తారనో.. నవ్వుతారనో.. ముసలాయన మంచం మీద ముసలావిడ చాప మీద. లేదంటే.. దొడ్లో ఒకరు... వీధి అరుగమీద మరొకరు!! వాళ్ల చుట్టూరా మనవలు.!!!...ఆలోచించండి...ఇదే సందర్భం చాలా ఇళ్లలో ఉంది అనే నేను అంటాను. మీరు కాదంటారా?

ముసలాయన కు కాళ్లు లాగితే ముస లావిడ వచ్చి నొక్కుతోంది. అదిసహజం. మరి ముసలావిడకు లాగితే..ఆ ముసలాయనే ఆమె కాళ్ళు కూడా నొక్కి తన జీవిత కాల ప్రేమని నిరూపించుకొంటాడు. కానీ ఆసందర్భం వెనుక ఉన్న వాళ్ళు... కల్పించడంలేదు!

నేను అనేది ఏంటంటే.. వాళ్లకు అంద మైన ఒక ప్రత్యేక గది ఉండాలని!

అది శృంగారానికి కాదు. ఇలాంటి ఎన్నో మధుర అనుభవాలను వాళ్లు అనుభవించ డానికి!

ఆ 'గది'... అదొక అపురూపం మందిరం! నిజానికి అది.. వాళ్ళ కోసం కాదు. వాళ్ళ....

స్మృతి చిహ్నంగా ' మనం' జీవించి ఉన్న న్నాళ్ళు...." మనకోసం!" చెప్పటం ఆపాడు పరాంకుశం.

" ఇదంతా వినదగినది డాక్టరుగారు.... కానీ ...మా అమ్మానాన్న గురించి మీకో రహస్యం చెప్పాలి."

" మీరు చెప్పే రహస్యం నాకు తెలుసు. అది నేను వినే ముందు మీకు షాక్ న్యూస్!... ఆ చల్లని గోదారి ఒడిలో.......తనువు మరచి.......... ఆడుకునేది..... ' మీ అమ్మా నాన్నలే!' "

" వాట్.. అమ్మ నాన్న???"

"ఏవండీ మా అత్తయ్యగారు మామయ్య గారునా?"

"ఆశ్చర్యపడకండి. మీరువస్తారని వాళ్లకు తెలియదు.మీకన్నాముందే వాళ్లు వచ్చిన విషయం మీకుతెలియదు. నేను వస్తానని ఎవరికీ తెలి యదు.!! ఏది ఎలా జరిగినా అంతా మన మంచికే అని తీసుకుందాము."

" డాక్టర్ గారు మమ్మల్ని విషయం చెప్పనివ్వడం లేదు మీరు."

" మిస్టర్.. మీరు చెప్పే విషయం నాకు తెలుసు. ఆ నిరోధ్ ప్యాకెట్స్ విషయమే కదా! మీరు పడ్డ ఆ చిలిపి అనుమానం గురించి కాసేపు నన్ను నవ్వు కోనివ్వండి.... ఆ తర్వాత జరిగింది చెప్తాను."

******** ********* *********

ఆ మర్నాడు ఉదయం 9 గంటలకు ఆటో మీద కోటిపల్లినుండి ఇంటికి వచ్చారు.

.హరిహరమహ దేవయ్య.. అన్నపూర్ణమ్మ లు.

" మన వాళ్ళంతా ఈ మధ్యాహ్నానికి వస్తానన్నారు.మన ప్రయాణం చాలా చిత్రంగా జరిగింది కదూ. వాళ్లకు తెలియకుండా కోటిపల్లి వెళ్లడం సరదాగా జలకాలాటలు. నిన్న రాత్రంతా అక్కడి సత్రం గదిలో... గడపటం... వాళ్ళకంటే ముందే తిరిగి ఇంటికి వచ్చే యడం....అబ్బా.. భలే ఉంది కదూ!"...

అంటూ......వీధిగేటు తాళంకప్ప తీసుకొని లోపలకు ప్రవేశించి తమ రూం దగ్గరకు వెళ్లి... ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరూ.

రెడీమేడ్ ఫైబర్ తలుపులు... కాలింగ్ బెల్ తో సహా అమర్చబడి ఉన్నాయి. తలుపు తోసు కొని లోపలికి వెళ్లి మరింత విస్మయంపొందారు.

రూమ్ అంతా ఇంద్రభవనం లా మెరిసి పోతుంది!పందిరిమంచం దానిమీద స్పాంజి పరుపు!... చుట్టూరా అందమైన దోమతెర!.. గోడలకు మహాఅందమైన ప్రకృతి బొమ్మలు!.. మరోపక్క లామినేటెడ్ ఫొటోస్!.. వాటికి కలర్ఫుల్ కంప్యూటర్ బల్బులు!.. రూమ్ మధ్య చిన్న సైజు రౌండ్ సన్ మేక్ టీపాయ్!... ఆ పక్క ఫారిన్ ఫిష్ బాక్స్!...ఈ పక్క మినీ కలర్ టివి!....ఇంకోపక్క తెల్లని వాష్ బేసిన్! ఆపైన మ్యూజిక్ సిస్టం!... పైపైన రూములో వేలాడు తున్న.. .....సింగిల్ బర్డ్స్ సెట్!... రూమ్ అంతా ఆహ్లాదం కలిగించేలా రూమ్ స్ప్రే మధు రిమలు!.... అబ్బా... ఆ వాతావరణం రెండు వందల సంవత్సరాలు బ్రతకాలన్నంత మహా ఆశ కనిపిస్తుంది!!!!

ఒక్కసారిగా ఆ రూమ్ లోకి మిగిలిన కుటుంబ సభ్యులంతా కిలకిల నవ్వుకుంటూ వచ్చేసారు బయట నుండి.

"నాన్న..అమ్మ.. నిన్న మేము వెళ్లేటప్పుడు దారిలో చాలాసేపు లేట్ చేసి కోటిపల్లి చేర టంతో అంతకుముందే మీరు అక్కడకు చేరి పోయారు. మా అదృష్టం ఏమిటంటే అమ్మా నాన్నల సరదాలు కళ్ళారా చూసిన మహదా నందం పొందాము. మన ఫ్యామిలీడాక్టరు పరాంకుశం గారు ద్వారా జ్ఞానోదయం పొందిన వెంటనే తిరిగొచ్చి మాదగ్గరున్న డూప్లికేట్ తాళాలతో లోపలికొచ్చి ఒక్క పూట లో మీ రూమ్ ఇంద్రభవనం లా మార్చేశాము... నిన్న రాత్రి కే.!!మళ్లీ బయటకు వెళ్ళిపోయి మీరు వచ్చిన తర్వాత మేమంతా ఏమీ తెలియనట్టు లోపలకు వచ్చాం ఇప్పుడే.

గుండె ..ఊపిరితిత్తుల బలానికి సంబంధించి...... " నిరోధ్ బుడగలు l ". .. ఊదుకొనడం ద్వారా మీరు ఇద్దరూ 'ఎక్సర్సైజు' చేసుకొనడం మేము ఊహించుకో లేకపోయాము. మన ఫ్యామిలీ డాక్టర్ గారి ద్వారా పూర్తి విషయం తెలిసాక పొట్ట నూటొక్క చెక్కలయ్యేలా మేము నవ్వుకున్నాం. ఆయన దగ్గర వేస్ట్ గా పడుండిన చాలా బుడగలు మీకు ఇచ్చేవారటగా. డాక్టర్ గారే ఈ తమాషావిషయం మాకుచెప్పారు. మీ దగ్గరున్న బుడగలు పూర్తిగాఅయ్యాక...ఇవిగో మేము మామూలు బెలూన్స్ తెచ్చాం. ఇవి బజారులో దొరుకు తున్నాయి. ఇవి ఉపయో గించు కోండి. ఉమ్మినురగతో ఈ వేస్టుబకెట్లో పడేయండి. మూత కూడా ఉండదు. మీ ఇంట్లో మీకు అభ్యంతరం ఏమిటి నాన్న...మిమ్మల్ని ఇద్దర్నీ ... .అపార్థం.....చేసుకున్నందుకు...అమ్మా... మమ్మల్నందర్నీ క్షమించండి".. అన్నాడు....ప్రేమగా పెద్దబ్బాయి కృష్ణమూర్తి.

" అమ్మానాన్న.. మీరు ఇద్దరు ఆనందంగా ఉండండి.మీబిడ్డలం.. మేముగాని , మీకోడళ్ళు గాని..మీ మనవలు గాని తప్పుగా ప్రవర్తిస్తే సారీ...." చెప్పాడు చిన్నబ్బాయిముకుందం....

.కోడళ్ళు ఇద్దరూకూడా క్షమాపణ చెప్పాక

పిల్లలతో సహా అందరూ తమ తమ పోర్షన్లలోకి వెళ్లిపోయారు.

హరిహరమహదేవయ్య..అన్నపూర్ణమ్మలు ముక్కున వేలు వేసుకొని..ఆశ్చర్యానందంలో మునిగి పోయినట్టు....తమకుతాము చాలా సేపటికి గానీ అర్థం చేసుకోలేక పోయారు.!!!???

******* ******** ********

(ప్రత్యక్ష దైవాలు అయిన మన తల్లిదండ్రులను మనందరం అర్థం చేసుకుందాం.......రచయిత)


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు



277 views0 comments

Comments


bottom of page